Wednesday, 29 December 2010

మెలకువ

పరుపు మెత్తదనం హాయినివ్వడం లేదు
పచ్చికను కోల్పోయిన చింత నాది
           *   
నువ్వు చదివిన కవితా పాదమే అంతిమమనుకోకు
చిత్తులో దాని వెర్షన్స్‌ ఎన్నో ఉన్నాయి


    *
లోకం పల్లమై లాగుతూన్నది
సముద్రంలో కలవడం ఇష్టం లేకే వంకలు పోతున్నాను
    *
ఎవరి లెక్కలు వారికున్నాయి
లెక్కలు లేనివాడే కదా మహా ఋషి
    *
కొండ చివరాఖర్న కూచొని గొంతెత్తాను
గ్రహ శకలాలన్నీ ఊసులు పోతున్నవి
    *
మధువుతో మత్తిల్లి మనసులో గూడుకట్టుకున్న
            గోసలన్నీ పాడుతున్నాను
ఈ రాత్రి ప్రకృతి మౌనంగా దుఃఖిస్తున్నది
    *
జనాజాకు భుజం అందించడానికి పరుగులు పెడుతున్నారు
వీళ్లంతా నన్ను పాతిపెట్టే దాకే..!

Thursday, 23 December 2010

నల్లగొర్రె


తలొంచుకుని ముందు నడుస్తున్న
సహచరుణ్ని అనుసరిస్తున్నాయి గొర్రెలన్నీ
తలొంచుకుని నడవడం గొర్రెల అలవాటు కదా

ఓ మందలో ఒక నల్లగొర్రె
తలెత్తుకోవడం నేర్చుకుంది
తుప్పుపట్టిన రీతిరివాజుల్ని ధిక్కరించింది

గొర్రెలన్నీ బెంబేలెత్తిపోయి
తలదించుకొని బతకడం మనజాతి లక్షణమంటూ
నల్లగొర్రె తలదించుకునేదాకా గోల పెట్టాయి

తలదించుకొని గొర్రెలన్నీ సాగిపోతున్నాయి
ఉన్నట్టుండి ముందు గొర్రె ‘బిస్మిల్లా’ అంటూ
ఓ గెట్టు దూకింది
గొర్రెలన్నీ అలాగే అంటూ దూకేశాయి

ఏదో అనుమానమొచ్చిన నల్లగొర్రె
తలెత్తి ముందుకు చూసింది
సహచరులు కనిపించలేదు
కాస్త ముందుకెళ్లి తొంగి చూసింది
గొర్రెలన్నీ ఓ పురాతన బావిలో పడి
గిలగిలా కొట్టుకుంటున్నాయి

నిస్సహాయంగా చూసిన నల్లగొర్రె
పక్కకు తప్పుకొని
కొత్తదారి వేస్తూపోయింది
భవిష్యత్‌ తరాల కోసం

Tuesday, 21 December 2010

‘హిందూత్వ’ దాష్టీకాన్ని ప్రశ్నించిన ముస్లింవాద కవిత్వం

తెలుగు సాహిత్యంలో అస్తిత్వ ఉద్యమాలు ఊపందుకున్న కాలం ఇది. స్త్రీవాదం, దళితవాదం వరుసలో ముస్లింవాద సాహిత్యం తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని నిలబెట్టుకున్నది. అందుకు ఆ వాదం నుంచి వచ్చిన బలమైన సంకలనాలే సాక్ష్యం. 1991లో ఖాదర్‌ మొహియుద్దీన్‌ ‘పుట్టుమచ్చ’ దీర్ఘ కవిత, 1997లో విరసం ప్రచురణగా ‘జీహాద్‌’ ముస్లిం మైనారిటీ వుల కవితా సంకలనం, 1998లో స్కైబాబ సంపాదకత్వంలో నీలగిరి సాహితి ప్రచురణగా ‘జల్‌జలా’ ముస్లింవాద కవితా సంకలనం, 2002లో అన్వర్‌, స్కైబాబ సంపాదకత్వంలో ‘అజాఁ’ గుజరాత్‌ – ముస్లిం కవిత్వం, 2004లో స్కైబాబ సంపాదకత్వంలో నసల్‌ కితాబ్‌ ఘర్‌ ప్రచురణగా ‘వతన్‌’ ముస్లిం కథల సంకలనం, 2005లో వేముల ఎల్లయ్య, స్కైబాబ సంపాదకత్వంలో హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ ప్రచురణగా ‘ముల్కి’ ముస్లిం సాహిత్య ప్రత్యేక సంచిక, 2006లో షాజహానా, స్కైబాబ సంపాదకత్వంలో నసల్‌ కితాబ్‌ఘర్‌ ప్రచురణగా ‘అలావా’ ముస్లిం సంస్కృతి కవితా సంకలనం వెలువడ్డాయి. ఈ సంకలనాలన్నింటిలో కలుపుకుని ముస్లింవాద కవులు, రచయితలు దాదాపు తొంభైమంది దాకా ఉన్నారు. వ్యక్తిగత ముస్లిం సాహిత్య పుస్తకాలుగా 1998లో ఖాజా ‘ఫత్వా’ కవిత్వం, 2002లో హనీఫ్‌ ‘ముఖౌటా’ గుజరాత్‌పై కవిత్వం, 2005లో షాజహానా ‘నఖాభ్‌’ ముస్లిం స్త్రీ కవిత్వం, స్కైబాబ ‘జగునే కీ రాత్‌’ కవిత్వం, అలీ ‘పాన్‌ మరక’ కవిత్వం – ‘హరేక్‌మాల్‌’ కథలు వెలువడ్డాయి. ‘ముస్లింవాద తాత్వికత’ పేరుతో ముస్లింవాద కవిత్వంపై ఖాజా పుస్తకం, ‘మైనారిటీ కవిత్వం – పరిశీలన’ పేరుతో డా. ఎస్‌. షమీ ఉల్లా పి.ఎచ్‌.డి. పరిశోధనా గ్రంథం వెలువడ్డాయి. అఫ్సర్‌ ‘వలస’ కవితా సంపుటిలోనూ, యాకూబ్‌ ‘సరిహద్దు రేఖ’ కవితా సంపుటిలోనూ, ఇక్బాల్‌ చంద్‌ ‘ఆరోవర్ణం’ కవితాసంపుటిలోనూ, హనీఫ్‌ ‘ఇక ఊరు నిద్రపోదు’ కవితా సంపుటిలోనూ, దిలావర్‌ ‘కర్బలా’, రేష్మా ఓ రేష్మా’ కవితా సంపుటుల్లోనూ ముస్లింవాద కవితలున్నాయి. ముస్లింల పేదరికం, అభద్రతాభావం, వివక్ష, అణచివేత, హిందూత్వ దాష్టీకం, బాబ్రీ విధ్వంసం, గుజరాత్‌ ముస్లిం జాతిమేధం, ముస్లిం సంస్కృతి, ముస్లిం స్త్రీలు, దూదేకులు – ఇతర సమూహాల ముస్లింలు, ముస్లిం ఛాందసత్వం తదితర అంశాలపై విస్తృతంగా కవిత్వం, కథలు ఈ రచయితల నుంచి వచ్చాయి. అందులో మెజారిటీ మత భావజాలం వల్ల ముస్లింలు ఎదుర్కొంటున్న వివక్ష, అణచివేతల గురించి వచ్చిన కవిత్వాన్ని ఇక్కడ పరిచయం చేసుకుందాం.
‘హిందీ హిందూ హిందుస్తాన్‌
ముస్లిం జావో పాకిస్తాన్‌
ముసల్మాన్‌ కే దో హీ స్తాన్‌
పాకిస్తాన్‌ యా ఖబ్రస్తాన్‌’ – ఖాదర్‌ మొహియ్యుద్దీన్‌
ఇలాంటి ఒక నినాదం రూపొందించి ముస్లింలను శత్రువులుగా, రకరకాలుగా ప్రచారం చేసి, వారిని పాకిస్తాన్‌కు పారద్రోలడమో లేదా చంపివేయడమో చేయాలని ముస్లిమేతరులనందరినీ రెచ్చగొట్టిన హిందూత్వవాదుల చర్యను ఖాదర్‌ మొహియుద్దీన్‌ తన దీర్ఘ కవిత ‘పుట్టుమచ్చ’లో ప్రశ్నించారు.
పై భావజాలంలో నుంచి వచ్చిన మరొక నినాదం –
‘భారతదేశంలో ఉండాలంటే వందేమాతరం పాడాల్సిందే!’
స్వతంత్ర ఇండియాలో మత స్వాతంత్య్రపు హక్కు ఉంది. వాళ్లకు కొన్ని ఇష్టాయిష్టాలు ఉండొచ్చు. వందేమాతరం చారిత్రక ప్రాముఖ్యత కలిగిన గీతమే అయినా ‘పాడాల్సిందే’ అనే నియంతృత్వం సరైంది కాదు కదా. ఈ గీతం వెనుక కూడా మళ్లీ అదే భావజలాం…. ‘ఆనంద్‌మఠ్‌’ నవలలో ముస్లింలను పారద్రోలాలని, లేదంటే చంపివేయాలని ఓ పాత్ర ద్వారా చెప్పిస్తాడు బంకించంద్ర. మరి అటువంటి నవలలోని వందేమాతరం గీతాన్ని పాడాల్సిందేనని ఇప్పుడు బలవంతం చేయడం సరైంది కాదు. అట్లే ఆ గీతంలో ఇండియాను దుర్గామాతతో పోల్చడం, తలవంచి నమస్కరించడం ఉంటుంది. ముస్లింలు తాము అల్లా ముందు తప్ప ఇంకెవరి ముందూ తల వంచం అంటున్నారు. అలాంటప్పుడు బలవంతంపెట్టడం తగదు.
ఇక మరో నినాదం – ‘భారతదేశం అంటే ధర్మసత్రం కాదురా’ అనేది. ఇలాంటి దారుణమైన నినాదాలు తయారుచేసి ముస్లింలపై విషం చిమ్ముతూ వస్తున్నది హిందూత్వవాదం. ఇలాంటి నినాదాలు చూసినప్పుడు, విన్నప్పుడు సామాన్య ముస్లింల మనోభావాలు ఎంతగా దెబ్బతిని ఉంటాయో, ఎంతగా వాళ్లు మానసిక హింసకు గురై ఉంటారో ఒక్కసారి ఆలోచించాలి…
వాళ్లూ వాళ్లూ కలిసి పంచుకున్న ఊళ్ల మధ్య
నా రక్తం ఏరులై పారింది
అంటాడు ఖాదర్‌ మొహియుద్దీన్‌. నిజం కాదా. దేశ విభజనతో ఇక్కడి సామాన్య ముస్లింలకు ఏం సంబంధం. పెద్దలమనుకున్న వాళ్ల మధ్య తేడాలొచ్చి తీసుకున్న నిర్ణయం ఎంతటి రక్తపాతాన్ని సృష్టించిందో తెలిసిందే. దేశ విభజన నాటి రక్తపాతం ప్రపంచంలోనే మహా విషాదం. పక్కవారు అనుమానంగా చూస్తున్నా, తరిమివేయాలని చూస్తున్నా, ఉన్న ఊరు – కన్నతల్లిని వదిలి వెళ్లలేక, తమ మూలాల్ని, వేర్లను తెంచుకుని వెళ్లలేక పుట్టిన గడ్డనే హత్తుకుని ఉండిపోయిన ఈ దేశపు ముస్లింలకు ఎంతటి దుర్గతి పట్టించారు ఇక్కడి పాలకులు, హిందూత్వావాదులు. అనుదినం అవమానపరుస్తూ మాతృదేశంలోనే ముస్లింల మనసుల్ని ఛిద్రం చేశారు. చివరికి రోడ్డుసైడు చిల్లర వ్యాపారాలకు మాత్రమే ముస్లింలు పరిమితం అయ్యేలా చేశారు.
పట్టెడన్నం కోసం
పేవ్‌మెంట్‌ల మీద పూలమ్ముకుంటాను
పళ్లమ్ముకుంటాను, పల్లీలమ్ముకుంటాను
గొడుగులు బాగుచేస్తుంటాను గడియారాలు బాగు చేస్తుంటాను
వీథరుగుల మీద దర్జీ పని చేస్తుంటాను
దూదేకుతుంటాను దినం గడుపుకుంటాను
ఏ గొడవల్లేకుండా
బతుకును వెళ్లమార్చాలనుకుంటాను
ఉన్నట్టుండి ఎందుకో మరి
నగరాల నడి వీథిల్లో నా నెత్తురు
తీర్థ స్నానఘట్టమవుతుంది
ఎన్నికలకు ముందు
ఎన్నెన్నో సంఘటనలకు ముందు
దేశ చరిత్ర దిశానిర్దేశానికి
నా నెత్తురు గూడుపట్టవుతుంది
పార్లమెంటు భవనంలో వాలేందుకు
నా నెత్తురు పాదలేపనమవుతుంది.
నా రక్త పదవీసోపానానికి
అభయ ‘హస్త’మవుతుంది
నా రక్తం ‘భరతమాత’ నుదుటి
తిలకమవుతుంది. పూజా ‘కమల’ మవుతుంది.
అంటూ సాగే పుట్టుమచ్చ కవితలో మతోన్మాదులు, రాజకీయ పార్టీలు ముస్లింలను ఎలా వాడుకుంటున్నదీ కవిత్వీకరిస్తారు ఖాదర్‌ మొహియుద్దీన్‌.
క్రికెట్‌మేచ్‌ నా దేశభక్తికి
తూనికా, కొలమానమవుతుంది
నేను నా మాతృదేశాన్ని
ఎంతగా ప్రేమిస్తున్నానన్నది కాదు
ఏయే పరాయి దేశాల్ని
ఎంతెంతగా ద్వేషిస్తున్నానన్నదే
నా దేశభక్తికి ఎంతో కొంత ఆధారమవుతుంది
అంటూ చివరికి క్రికెటం ఆట కూడా ముస్లింలకు అనుమానించడానికి ఒక సాకు కావడాన్ని ఖాదర్‌ ప్రశ్నించారు.
నేను పుట్టకముందే
దేశద్రోహుల జాబితాలో
నమోదై ఉంది నాపేరు
అన్న పుట్టుమచ్చలోని వాక్యాలతో తెలుగు సాహిత్యం ఉలిక్కిపడింది.
కన్నబిడ్డని సవతి కొడుకుగా
చిత్రించింది చరిత్ర
అన్నదమ్ముల్నించి చీల్చి
నన్ను ఒంటరివాణ్ని చేసింది చరిత్ర
అంటూ సాగే పుట్టుమచ్చ దీర్ఘ కవితలో తెలుగు సాహిత్యంలో ముస్లింల అభివ్యక్తి మొదలైంది. అంతకు ముందు ఇస్మాయిల్‌, వజీర్‌ రహమాన్‌, స్మైల్‌, కౌముది, దిలావర్‌, దేవిప్రియ, గౌస్‌, అఫ్సర్‌, యాకూబ్‌ లాంటి కవులున్నప్పటికీ పుట్టుమచ్చకు ముందువాళ్లు తాము ముస్లిం కవులుగా రాసింది లేదు.
బాబ్రీ వివాదాన్ని రెచ్చగొడుతూ హిందూత్వ భావజాలాన్ని పెంచిపోషిస్తూ ముస్లింలపైకి ముస్లిమేతర సమాజాన్ని మొత్తంగా ఉసిగొల్పాలని ఆరెస్సెస్‌ ఫాసిస్టు శక్తులు పనిగా పెట్టుకున్నాయి. రాజకీయంగా బలపడడానికి రామమందిర నిర్మాణాన్ని ఎత్తుకున్న ఈ శక్తులు అద్వానీ రథయాత్రతో మరింత పెచ్చరిల్లాయి. ఈ సందర్భంలోనే ఒక ముస్లిం కవి హృదయంలోనే ‘పుట్టుమచ్చ’ కవిత రూపుదిద్దుకుంది. 1991లోనే ఈ కవిత అచ్చయింది.
1992లో బాబ్రీ మసీదు కూల్చబడింది. దాంతో దేశం మొత్తంలోని లౌకికవాదులైన ముస్లింలంతా కూడా హతాశులయ్యారు. తాము ముస్లింమన్న స్పృహలోకి రావలసివచ్చింది. దాంతో అన్నాళ్లు ముస్లింలుగా మాట్లాడని ముస్లిం మేధావులు, కవులు, రచయితలు, ఆలోచనాపరులంతా ముస్లింగా మాట్లాడాల్సిన అవసరాన్ని గుర్తించారు.
తెలుగులోనూ, అఫ్సర్‌, యాకూబ్‌, ఇక్బాల్‌చంద్‌, హనీఫ్‌ లాంటివారంతా ముస్లింలుగా తమ ఫీలింగ్సు కవిత్వీకరించారు. అదే సందర్భంలో ‘కంజిర’ బులెటిన్‌ బాబ్రీ కూల్చివేతను పురస్కరించుకుని ఒక సంచిక వేసింది. అందులో పై కవులున్నారు.
ఈ క్రమంలో తెలుగు సాహిత్యంలో దళిత సాహిత్యం ఊపందుకున్నది. వారి సాన్నిహిత్యంలో, దళితవాదం అందించిన స్ఫూర్తితో ఖాజా షరతు, ఫత్వా అనే కవితలు రాశాడు. నల్గొం దళిత బహుజన కవులు, ముఖ్యంగా సుంకిరెడ్డి నారాయణరెడ్డి ప్రోత్సాహంతో స్కైబాబ హిజాబ్‌, రెహాల్‌, సాంచా లాంటి కవితలు రాశారు.
1995 జనవరిలో వచ్చిన ‘చిక్కనవుతున్నపాట’ సంకలనంలో అచ్చయిన ఖాజా, అబ్బాస్‌, అఫ్సర్‌, యాకూబ్‌, ఇక్బాల్‌చంద్‌ల ముస్లిం కవితలున్నాయి.
దేశభక్తి గురించి తెలుగు సాహిత్యంలో ఎంతో కవిత్వం వచ్చింది. ముస్లిం కవి తనను అవమానిస్తున్న, అనుమానిస్తున్న మెజారిటీ మత భావజాలమున్న సమాజాన్ని ధైర్యంగా ప్రశ్నించడం 1998లో వచ్చిన ముస్లింవాద కవితా సంకలనం ‘జల్‌జలా’ లో చూస్తాం.
‘ఈ దేశపటాన్ని చుట్టచుట్టి నీ తలకింద పెట్టుకోవడానికి
అది నీ అయ్య జాగీరు కాదు
అంగట్లో దొరికే కుంకుమ బట్టు కాదు దేశభక్తి’
అంటూ నిలదీస్తాడు సయ్యద్‌ గఫార్‌.
ఇలా ఎంతోమంది ముస్లిం కవులు మెజారిటీ మత భావజాలాన్ని, మతోన్మాదాన్ని ప్రశ్నించారు. ఈ లోగా 2002 సంవత్సరంలో భారత దేశ చరిత్రలో మొదటిసారిగా జెనోసైడ్‌ ఒకటి చోటు చేసుకుంది. గోద్రాలో ఓ రైలు డబ్బాను తగులబెట్టారనే నెపంతో వేలమంది ముస్లింల ఊచకోత సాగింది. దానికి బిజెపి, ఆరెస్సెస్‌, శివసేన్‌, భజరంగుదళ్‌ తదితర సంఘపరివార్‌ శక్తులు నాయకత్వం వహించాయని ఎన్నో పత్రికలు, ఎలక్ట్రానిక్‌ మీడియా, మేధావులు, ప్రజా స్వామికవాదులు, లౌకికవాదులు తమ వార్తాకథనాలద్వారా, రిపోర్టుల ద్వారా, పుస్తకాల ద్వారా రికార్డు చేశారు. ఈ నేపథ్యంలో దేశమంతా ఎన్నోరకాల నిరసన వ్యక్తమయ్యింది. తెలుగు సాహిత్యంలోనూ వందలకొలది కవితలు, కథలు, వ్యాసాలు అచ్చయ్యాయి. ‘గుజరాత్‌ గాయం’ పేరుతో 200 మందికి పైగా కవుల సంకలనం ఒకటి ప్రచురింపబడింది. అన్వర్‌, స్కైబాబ సంపాదకత్వంలో ‘అజాఁ’ పేరుతో ముస్లిం వుల సంకలనం ఒకటి గుజరాత్‌ నరమేధంపై వెలువడింది.
ఆ సంకలనానికి ముందుమాట రాస్తూ ప్రముఖ కవి స్మైల్‌ ఇలా అన్నారు – ‘ఈ సంకలనం… గుండె ఉంటే చదవాలి. దిటవు చేసుకు చదవాలి. లేకుండా చదివిన వారికి ఓ గుండె ఏర్పడి స్పందిస్తుంది. వీరి విషాద కవిత్వ నేపథ్యంలో ఒక ఆలోచన ప్రత్యామ్నాయాల, ఐడెంటిటిల దిశగా అంకురిస్తుంది. ఆ అంకురం కోసమే… ఈ సంకలనం’.
అన్వర్‌ ఈ సంపాదకీయంలో ‘దేశపతాకంలోని కాషాయం తెలుపును ఆక్రమించేస్తోంది’ అన్నారు.
36 మంది కవుల కవితలున్న ఈ సంకలనం ఒక జాతి మేధాన్ని ప్రశ్నించిన సంకలనంగా సమీక్షకుల చేత రికార్డు చేయబడింది.
కవిత్వంలోకి వెళితే -
గర్భంతో ఉన్న స్త్రీ కడుపుని చీల్చి పిండాన్ని బైటికి తీసి త్రిశూలంతో ఆడించి మంటల్లో వైసిన సంఘటన యావత్‌ భారతదేశాన్ని కదిలించివేయడం తెలిసిందే. ఆ విషయాన్ని ముస్లిం కవులు హృదయవిదారకంగా కవిత్వీకరించడం చూస్తాం -
మధ్యయుగాల అంధాయుధం అంచున
శాంతి ఆశ్రయం సాక్షిగా కలి ఘనీభవించిన
ఆ … రక్త కణాన్ని నేనే… నే… అమ్మా! – సయ్యద్‌ గఫార్‌
ఇప్పుడు మాతృగర్భంలోంచే
పెకలించబడ్తున్న మా ఉనికి – వలీహుసేన్‌
భారతదేశం సెక్యులర్‌ దేశం అని ప్రపంచమంతా కొనియాడుతుంటే గుజరాత్‌ నరమేధం మాత్రం ఇక్కడ హిందుత్వ ఫాసిజం రాజ్యమేలుతున్నట్లు స్పష్టం చేసింది. దాంతో మనస్తాపం చెందిన ఒక ముస్లిం కవి ఇలా అంటున్నాడు -
మితృలారా !
‘కఫన్‌’ కప్పబడిన సెక్యులరిజం జనాజాకు
మీ భుజం ఖాలీ వుంటే పట్టండి – మహమూద్‌
అయినప్పటికీ ముస్లిం కవులు గుండె నిబ్బరం కోల్పోకుండా ధైర్యంగా మాట్లాడడం కూడా చూస్తాం -
నాదొక సామూహిక ఆత్మకథ…
నన్ను బంధించకండి, మనిషి నవుతాను
నన్ను కాస్త తలెత్తనివ్వండి
రేపటికి సమాధానాన్నవుతాను – డా. ఎస్‌. షమీ ఉల్లా
కాలం కలకాలం సంఘపరివారం చేతిలో కలవాలం కాదు – ఖాదర్‌ మొహియుద్దీన్‌
రామబాణంతో వాళ్లు
విష్ణుచక్రంతో
కృష్ణచక్రంతో వాళ్లు
శివుని త్రిశూలంతో వాళ్లు
హనుమంతుని గదతో వాళ్లు…
ఆయ్‌ అల్లాహా!
ఈ చేతులు ఉట్టి దువాకేనా?! – స్కైబాబ
ఒక అందమైన తోట
ఆ తోటలో రకరకాల పూలు
రంగురంగుల పూలు గులాబీలు మందారాలు చమేలీలు
మొగలిపూలు బంతిపూలు గుల్‌మొహర్‌లు
అన్ని రకాల పూలతో చాలా అందంగా కనబడుతుందా తోట
అయితే
ఆ పులన్నింటినీ నలిపేసి, తొక్కేసి, నరికేసి
ఒక్క కమలమే విస్తరించాలంటే
ఆ తోట అందమంతా ఏమైపోతుంది?!
అన్నాడు జల్‌జలా కవి ఆఫ్రీన్‌. ఇప్పుడు దేశంలో అదే జరుగుతుంది. భిన్న కులాల భిన్న భాషల, భిన్న సంస్కృతుల, భిన్న మతాల వారిని సంహరించి ఒక్క ‘హిందూత్వ’ మతోన్మాదులే ఈ దేశంలో మిగలాలని కలలు కంటున్నారు. అందుకు నిదర్శనం గుజరాత్‌ ముస్లిం జాతి హత్యాకాండ.
‘గుజరాత్‌’ అంటే ఒక ముస్లిం స్త్రీ గర్భంలో త్రిశూలం గుచ్చి కడుపులో ఉన్న శిశువుని బైటికి లాగి త్రిశూలం మొనపై ఆడించి మంటల్లోకి విసిరిన పైశాచికత్వం!
గుజరాత్‌ అంటే ఐదారేళ్ల పసివాడికి పెట్రోల్‌ తాగించి ఆ లేత పెదాలపై అగ్గిపుల్ల అంటిస్తే ఆ చిన్నారి దేహం ఫట్‌మని పేలిపోయిన అమానవీయ దృశ్యం !
తల్లుల ముందే పిల్లల్ని పిల్లల ముందే తల్లుల్ని సామూహికంగా చెరిచి ముక్కలుగా నరికి తగలబెట్టిన వైనం !
పాడుబడిన బావిలోకి మనుషుల్ని విసిరేసి పై నుంచి రాళ్లెత్తేయడం…
ప్రాణ భయంతో పారిపోతున్న 70 మందిని టెంపోలోనే సజీవ దహనం చేయడం…
తన తల్లిని తగలబెడుతున్న దృశ్యం కళ్లల్లోకి ప్రసరించిన ప్రతిసారీ ఏడేళ్ల ఇమ్రాన్‌ పెడుతున్న కేక…
పూడ్చుకోవడానికి కూడా మిగలని వందలూ వేల బూడిద కుప్పలు !
‘భార్యల కనురెప్ప మీదే భర్తల దహనం… భర్తల పిచ్చి చూపుల ముందే బరిసెలు దిగబడిన యోనుల రక్తం కేకలు… యోనుల రక్తస్రావంలో మునిగిపోతున్న నా దేశం…’
నా పేరులోంచి చావు వాసన
పుట్టబోయే బిడ్డకు నేను పెట్టబోయే పేరులోంచి చావు వాసన – ఖాదర్‌ మొహియుద్దీన్‌
ఆ చమేలీ పువ్వు / నా చమన్‌లో పూసినందుకే / రెమ్మా రెమ్మా విరచబడింది – గౌస్‌ మొహియుద్దీన్‌
నేనేం చేశాను… / నా శరీరంలో కోర్కెల్ని తీర్చే / ఒక మర్మాంగం కూడా ఉందని తెలియనిదాన్ని – యాకూబ్‌
దేశ విభజన నాటి దురాగతాలను తలపించే ఈ నరమేధంలో బలైపోయిన సామాన్యుల చిట్లా ఎంతని విప్పేది – ఎన్నెస్‌ ఖలందర్‌
ఇట్లా ఎంత చెప్పినా తరగని కవిత్వం రాశారు ముస్లిం కవులు. గుజరాత్‌ వాళ్ల నమ్మకాన్ని భగ్నం చేసింది. వాళ్ల కవిత్వంలో ఎక్కడలేని ప్రశ్నలు…
జమా మసీదుల నిండా / ఏం ఆశించి పావురాల గుంపులు వాల్లాయో / క్షణం క్షణం చావుని గుండెల కత్తుకుంటున్నాం / ఆప్తుల గుర్తుగా / ఎన్ని తాజ్‌మహళ్లు ఒంటి నిండా చెక్కుకోను?
నువ్వు లక్ష ఆరోపణలు చేయి / నా నెత్తిన టోపీని తీసి ఎందుకు దాచుకోవాలి? – హనీఫ్‌
భూకంపానికి సొంతగూటి రాళ్లే / చంపినప్పుడు భూమిని శపించాం
తుఫాను ఉన్నదంతా దోచుకెళ్తుంటే / సముద్రాన్ని శపించాం
మరి ఈ కొత్త వేటలో / ఎవర్ని శపిస్తే ఎవరూరుకుంటారు? – ఇక్బాల్‌ చంద్‌
పావురానికి రాబందుకు జరిగేది ఘర్షణ కాదు / ఘర్షణకై రెండు రాబందులు కావాలి / ఏదీ… నీ దేహ పటంపై ఒక్క జఖమైనా చూపించు? – గౌస్‌ మొహియుద్దీన్‌
రామబాణంతో వాళ్లు… శివుని త్రిశూలంతో వాళ్లు… – స్కైబాబ
ఐదు నుంచి పదివేల మంది దాకా గుంపుగా కత్తులు, త్రిశూలాలు, పిస్తోల్లు, యాసిడ్‌ పట్టుకొని ఒక్కొక్క ఊరిలో ఉన్న ముస్లిం బస్తీల మీద పడి చంపుతుంటే పారిపోయిన ముస్లింలు చెట్లనకా, పుట్టలనకా, గుట్టలనకా, పగలనకా, రాత్రనకా కిలోమీటర్ల కొద్దీ పరుగులు పెట్టారు.
పసి దాహాలకు గుక్కెడు నీళ్లు నిరాకరించబడిన సంఘంలో ఒకరి మూత్రాన్ని మరొకరికి తాపించుకున్న నిస్సహాయత… పసి ఆకలికి నాలుగు మెతుకులు దొరక్కుండా చేసిన రాజ్యంలో పుట్టమన్నులో నీళ్లు కలిపి తినిపించుకున్న నిస్సహాయత…
అంతేకాక ఆకులు అలములు తిని బతికీ చెడీ తిరిగి ఊర్లలోకి వద్దామంటే ఆరెస్సెస్‌ గుండాలు రకరకాల షరతులు విధిస్తే బిత్తరపోయిన ముస్లింలు ఊరిబైటే ఉండిపోయారు. ఆ షరతుల్లో ఒకటి ‘అజాఁ’ వినిపించకూడదని! ఆంధ్రప్రదేశ్‌ తెలుగు ముస్లిం కవుల గుజరాత్‌ కవిత్వాన్ని అందుకే ‘అజాఁ’ పేరుతో సంకలనం చేశాం. దీనిని అన్వర్‌, నేను సంపాదకులుగా ఎంతో శ్రమకోర్చి తీసుకొచ్చాం.
దళితవాడలు ఊర్లలో కలుస్తున్న ఆనందం
ఒళ్లంతా పారకమందే / ఇప్పుడక్కడ ఊరి బైట ముస్లిం వాడలు వెలిశాయి.
ముప్ఫై వేల మంది ముస్లింలు హత్యలు చేయబడితే ఆ సంఖ్య కేవలం పదకొండు వందలుగా చూపెట్టడం… ఇంతలోనే ఆ సంఖ్యను అందరం ఒప్పేసుకోవడం ఆశ్చర్యంగా ఉంది. ఇప్పటికైనా ఎప్పటికైనా గుజరాత్‌లో అసలు ఎంతమందిని చంపేశారో ఎన్ని లక్షల ఇండ్లను నేలమట్టం చేశారో ఎందరు స్త్రీలను రేప్‌ చేశారో, ఎందురు అమ్మాయిల్ని ఎత్తుకుపోయారో… ఎంతమంది పసిపిల్లల్ని అనాధల్ని చేశారో తేల్చాల్సి ఉంటుంది.
ఇప్పుడీ దేశాన్ని ఏ జీవజలంతో కడిగినా పోని రక్తపు వాసన
కాళ్ల కింది నేలే కాదు / కరిగిన ఆకాశం కూడా మురికైపోయింది
అంటాడు ఖాదర్‌ షరీఫ్‌.
దేశ విభజనలో లక్షల మందిని బలిచ్చుకున్నా… అదో పెను విషాదమైనా… మనసులకి సర్ది చెప్పుకున్నాం. కాని ఇప్పుడు ఈ గుజరాత్‌ రక్తపు తడి ఎన్నటికీ మా మనస్సుల్లోంచి ఆరిపోదు… ఈ గుజరాత్‌లో లేచిన నల్లటి పొగ ఎన్నటికీ మా కళ్లలోంచి మాయమవదు… చూస్తూ ఉండిపోయిన, అప్పుడే మరిచిపోయిన ఎందరి మీదో అసహ్యంగా ఉంది.
ఇక్కడే / నా ఘర్‌ ఒకటి ఉండాలి
కిలకిలా నవ్వుతూ స్వాగతం పలికే / దహ్‌లీజ్‌ ఒకటి ఉండాలి
ఆ కాలి గజ్జెల సవ్వళ్లు… / ఆ నవ్వులింకా వినిపిస్తున్నాయి
ఎవరన్నా పట్టుకొని
నా కందిస్తారేమో / వెతుక్కుంటాన్నాను
ఎవరైనా వచ్చి ఈ దృశ్యాలను
శిలువ మోసిన క్రీస్తులా
భుజాల కెత్తుకుంటారేమోనని వెతుక్కుంటున్నాను
పక్కనుంచి మనిషి నడిచి వెళితే
అతనిపై పడి ఏడవాలని ఉంది - మహమూద్‌
అంటూ సాగే మహమూద్‌ కవిత కన్నీళ్లు పెట్టిస్తుంది.
ఒంటరి కఫన్‌ అనే కవితలో షాజహానా -
నా అల్లా / నా పురుషుడు / నా మతమూ పెట్టే హింసే అనుకుంటే
నీ దేముడు / నీ పురుషుడు / నీ మతమూ…
గుడ్డల్ని చీరి పీలికలు చేసినట్టు
మా దేహాల్ని చీల్చేస్తుంటే…
ఎక్కడికని పరిగెత్తను ?
ఏ రాతి గుహల్లో దాక్కోను?
అంటూ రాతి యుగంనాటి అనాగరికతకు ఆనవాళ్లుగా హిందుత్వవాదులను పోలుస్తుంది.
‘కాలీ దునియాఁ’ అనే మరో కవితలో స్త్రీగా తాను గుజరాత్‌ మారణహోమాన్ని, ముఖ్యంగా స్త్రీలపై జరిగిన అత్యాచారాల్ని ప్రశ్నిస్తూ షాజహానా ఇలా అంటుంది -
బుర్ఖాలను చీల్చేసి… / శరీరాల్తో సహా తగలబెడ్తున్నప్పుడు
ఈ దునియాఁ మొత్తం / నల్లగా… ఎండిన రక్తం ముద్దలా
ఇప్పుడు బుర్ఖా వేసినా వేయకున్నా
ప్రపంచమంటే – / కాషాయశిల…!
కత్తి మొన… / పొడుచుకొచ్చిన పురుషాంగం…!
ప్రపంచం ‘మాయిపొర’లో ఇరుక్కుని
ఉమ్మనీరు తాగి / ఇవ్వాళ కాషాయం కక్కుతోంది…!
మా కాళ్ల సందుల్లోంచొచ్చి
మమ్మల్ని బరిబత్తల పరిగెత్తించారే…
నీ ఇంట్లో ఆడది కూడా
రహస్యంగా మా కోసం కన్నీళ్లు కార్చి ఉంటుంది!
మగ నా కొడుకులు ఊపిరి / బయటికి రాకుండా నొక్కేస్తే
పీడా పోతుందని ఒక్కసారైనా / మీ అమ్మ అనుకునే ఉండాలి
సృష్టికి ఒక్కరే తల్లీ తండ్రీ అని నమ్ముతున్న దాన్ని
నీకు నాకు మధ్యా రక్త సంబంధం లేదంటావా?
గుండెల్ని పెకిలించి / పొట్టలు చీల్చి
యోనుల్లో ఆయుధాలు పొడిచి
ఇవ్వాళ నువ్వు చావుల విందు చేసుకొనుండొచ్చు
కానీ ‘నన్ను’ హత్య చేయలేవు
అనంతంగా సాగే జీవనదిని
నేను బతకడమే కాదు / నిన్ను పుట్టించి బతికించేది నేనే…!
అయినా / స్త్రీ తప్ప మగాణ్ని క్షమించేదెవరు?
ఎప్పటికీ ప్రపంచం
నా రొమ్ము తాగుతున్న పసిబిడ్డే…!
షాజహానా ఈ కవిత మనసున్న, మానవత్వమున్న ఎవరినైనా కదిలిస్తుంది. కర్తవ్యాన్ని గుర్తు చేస్తుంది.
దేనికైనా ఓ ముఖమంటూ ఉండాలి కదా
త్రిశూలానికి ముఖమే లేదు
చీలిన నాలుక తప్ప - డా. దిలావర్‌
అంటూ ఎన్నో కవితలలో ఈ కవులు హిందూత్వవాదుల దాష్టీకం గురించి, దానికి బలైన ముస్లింలను గురించి రాశారు.
హమ్‌ మర్కే భి జగాతే హై
సోయీ హుయీ దునియాకో
అంటాడు అలీ…
నిజమే! ముప్ఫై వేలమంది ముస్లింలను హత్య చేయబడితే గాని భారతదేశం ఉలిక్కిపడలేదు. ఆ ఏమవుతుందిలే, ఏం చేస్తారులే అని హాయిగా కునుకుదీస్తున్న మన లౌకికవాదులూ, ప్రగతిశీలురూ, ప్రజాస్వామ్యవాదులూ, మార్క్సిస్టులూ, మావోయిస్టులూ అంతా దిగ్గున లేచి కూర్చున్నారు. ముప్ఫై వేలమంది ముస్లింల బలిదానం జరిగితేగాని ఈ దేశంలో ఆరెస్సెస్‌ ఏం చేయబోతోందో అర్థం కాలేదు. అట్టా తాము చచ్చిపోయి కూడా అందరినీ మేల్కొల్పుతున్నాం అంటున్నాడు అలీ. అందరూ మేల్కొన్నట్లు అనపిచింది. కాని ఆరెస్సెస్‌ను నిలువరించే, కనీసం అదే చేసే దుష్ట చర్యల్ని నిలువరించే కార్యక్రమాన్ని కూడా ఎవరూ చేపట్టలేదు. ఊరికే ఉపన్యాసాల్లో హిందూ మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడుతాం అంటే సరిపోతుందా? కొన్ని సభలు చేస్తే, పుస్తకాలేస్తే మన బాధ్యత నెరవేరినట్టేనా? ఇక్కడ ఒక అనకూడని మాట కూడా అనాలనిపిస్తోంది – జర్మనీ తత్వవేత్త ఫాస్టర్‌ నీమెల్లర్‌ అన్నట్లు … వాళ్లు క్యాథలిక్కుల కోసం వచ్చారు / నేను క్యాథలిక్కును కాదు గనుక మాట్లాడలేదు… అన్న చందంగా ఆరెస్సెస్‌ వాళ్లు వచ్చింది, వస్తున్నది ముస్లింల కోసం కాబట్టి ఎవరూ అంతగా పట్టించుకోవడం లేదా?
కొన్ని పదుల సంవత్సరాలుగా ఆరెస్సెస్‌ గట్టి పథకంతో దేశంలోని జనాన్నంతా హిందువైజ్‌ చేస్తూ వస్తున్నది. ముందుగా బీసీల్ని చాలా వరకు హిందువైజ్‌ చేసేశాక (?) ప్రస్తుతం దళితులు, ఆదివాసుల మీద దృష్టి నిలిపింది. అందులో భాగంగానే ఆదివాసీ ప్రాంతాలలో యోగేశ్వర పరివార్‌, గాయత్రి పరివార్‌, సద్విచార్‌ పరివార్‌, స్వామీ నారాయణ సాంప్రదాయి,… లాంటి పేర్లతో పని చేస్తూ ఉంది. ఇలాంటి సంస్థలే గుజరాత్‌లో ఆదివాసీల్ని ముస్లింలపైకి ఉసిగొల్పాయి. రాజస్థాన్‌లోనూ, ఒరిస్సాలోనూ పని చేస్తున్నాయి. ఒరిస్సాలో ప్రతి గిరిజనుడి ఇంట్లో ఒక త్రిశూలం ఉంది. రాజస్థాన్‌లో, ఢిల్లీలో, ఉత్తర ప్రదేశ్‌లోనూ లక్షల త్రిశూలాలు పంచారు. అవన్నీ ఎవర్ని గురి చూసేందుకు? తెలిసి కూడా మనం మౌనంగానే ఉందామా? ఈ విషయాలన్నీ ‘ముల్కి’ ముస్లిం సాహిత్య ప్రత్యేక సంచికలో రికార్డు చేయబడ్డాయి.
పాఠశాలలు లేని అటవీ గ్రామాల్లో సైతం ఏకోపాధ్యాయ పాఠశాలల పేరుతో ఆరెస్సెస్‌ పాఠశాలలు నడుపోతందని తెలుస్తున్నది. సరస్వతీ శిశుమందిర్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పాలా? ఇంకా శారదా విద్యామందిర్‌, గాయత్రీ వగైరా ఎన్నో పేర్లతో నడుస్తున్నవీ కూడా హిందుత్వనే బోధిస్తూన్నాయి. ఇప్పటికే అన్ని ప్రభుత్వ సంస్థల్లో, పోలీసుల్లో, ఆర్మీలో ఆరెస్సెస్‌ బలం ఉన్నవాళ్లు నిండిపోతున్నారు. (గుజరాత్‌లోనైతే పోలీసుల శాఖంతా దాదాపుగా ఆరెస్సెస్‌తో నిండిపోయిందని తెలిసిందే)
ఎంతో కొంత చైతన్యంవతులైన వాళ్లు బతుకుదెరువు కోసం ఊళ్లొదలి పట్టణాలకు వలస వెళ్తుంటే ఆరెస్సెస్‌ అదే పనిగా జీతమిచ్చి ఒక ఫూల్‌టైమర్‌ను ఊర్లలోకి పంపుతున్నది. వాళ్లు మెల్లగా ఊర్లలో చేరి పొద్దున్నే వ్యాయామం పేరు చెప్పి ఊరిబైటి ఏదేని గుడి దగ్గరికి తీసుకెళ్లి కాసేపు ఎక్సర్‌సైజులు చేయించి తర్వాత హిందుత్వ బోధన చేస్తున్నారు. ‘హిందువునని గర్వించు – హిందువుగా జీవించు’ అనే వాక్యం కొన్ని రోజులకే ఊరి గోడలపై రాయించబడుతుంది. దాంతోపాటు ఆరెస్సెస్‌ పత్రికలు జాగృతి లాంటివి, ఇంకా ఇతర హిందుత్వ భావజాలం ఉన్న పుస్తకాలు చదివిస్తున్నారు. దాంతో ఆ యువకులంతా ముస్లింలు ఈ దేశస్తులు కారని, దేశద్రోహులని, ఐ.ఎస్‌.ఐ. ఏజెంట్లనీ నమ్మడం మొదలవుతుంది.
ఇంకా ఊర్లలో కూడ వినాయకులను నిలబెట్టడం, ‘హిందూ దేవాలయాలకు మాత్రమే ప్రాధాన్యతనివ్వడం జరుగుతున్నది. వినాయకుల విషయంలో సక్సెస్‌ అయిన హిందుత్వవాదులు ప్రస్తుతం దసరాకు దుర్గను కూడ నిలపడం పట్టణాల్లో షురూ చేశారు.
ఇంకా ఎన్నో మార్గాల ద్వారా హిందుత్వను పెంచుతూ చివరికి దళితులను, ఆదివాసులను సైతం హిందువైజ్‌ చేయడంలో సక్సెస్‌ అవుతున్న ఆరెస్సెస్‌ శక్తులు ప్రతి ఎన్నికల్ని, ప్రతి అంశాన్ని ప్రయోగంగా చూస్తూ ముందుకు పోతున్నాయి. ఇవాళ దేశంలోనూ, మహారాష్ట్రలోనూ బిజెపి ఓడిపోయిందని సంతోషించి సంబరపడితే లాభంలేదు. వాళ్లు వీటిని కూడా రేపటి తమ విజయానికి సోపానంగా మల్చుకుంటూనే ఉంటారు. వాళ్ల గ్రౌండ్‌వర్క్‌ నడుస్తూనే ఉంది కాబట్టి ఎప్పటికైనా వాళ్లు గెలిచే అవకాశం ఉంది.
ఆరెస్సెస్‌ను నిలువరించే మార్గం ఒక్కటే కనిపిస్తున్నది. ఎవరినైతే హిందువైజ్‌ చేస్తూ మెజారిటీలమని బుకాయిస్తూ వస్తున్నారో వాళ్లను హిందువైజ్‌ కాకుండా ఆపడం, ఆదివాసులు, దళితులు, బీసీల వారిని హిందువులం కామన్న ఎరుకలోకి తీసుకురావడం.
రాముడు, కృష్ణుడు, వినాయకుడు తదితర మగ దేవుళ్లంతా తమ దేవుళ్లు కాదనీ, తమది మాతృస్వామ్య వ్యవస్థ అనీ, తమది అమ్మ దేవతల సంస్కృతి అనీ గుర్తు చేయడం. ఎల్లమ్మ, మైసమ్మ, పోలేరమ్మ తదితర అమ్మ దేవతల్ని కొలవడం ఆత్మన్యూనతలో పడిపోయి, అంతా మగదేవుళ్లను కొలిచే మాయలో పడిపోయిన విషయాల్ని విప్పడం. తమ సంస్కృతుల్ని, తమ పండుగల్ని, తమ ఆచారాల్ని, వ్యవహారాల్ని, గొప్పగా తడుముకునేలా చేయడం… బతుకమ్మలు, బోనాలు మొదలైన పండుగల్ని హైలెట్‌ చేయడం… రాక్షసులని చెబుతున్న వాళ్లంతా తమ దళిత నాయకులనీ, తిరుగుబాటుదారులనీ విడమర్చి చెప్పడం…
ఇవన్నీ కాక, ఈ కులవ్యవస్థలో ఉండడం ఇష్టంలేని వాళ్లను స్వేచ్ఛగా బౌద్ధం, క్రైస్తవం, ఇస్లాం తీసుకునే స్వేచ్ఛ ఉందనే జ్ఞానాన్నివ్వడం… ముఖ్యంగా అన్ని రకాల సామాజిక చైతన్యాన్ని అందించడం…

Friday, 3 December 2010

తెలంగాణ చరిత్రలోనైనా ముస్లింలకు న్యాయం జరగాలి

చిన్నప్పుడు పంద్రాగస్ట్‌కు సంబరంగా ఊరు తిరిగేది. బడి ముందల జెండా ఎగరేసినంక సార్లు, ఊరిపెద్దలు స్వాతంత్య్రం గురించి, పోరాటయోధుల గురించి చెప్తుంటే ఒళ్లంతా ఊగిపోయ్యేది. పెద్దయినంక తెలిసింది, దేశ విభజన పేరుమీద లక్షల మంది బలయ్యన్రని, సరిహద్దుల్లో రక్తం యేరులై పారిందని. ఇట్లనే నవంబర్‌ 1న ఆంధ్రప్రదేశ్‌ అవతరణ అని, హైదరాబాద్‌ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో కలిసిన రోజని చెబితే పాల మనసుతోని నిజమే అని నమ్మినం. తీరా చూస్తే - నిజాం పాలనను మించి ఆంధ్ర పాలనను తెచ్చిన్రని తెలిసొచ్చె. ఈడ గుడ నిజాం నిరంకుశ పాలన అని, రజాకార్ల దౌర్జన్యాలు అనే విన్నం గనీ పోలీస్‌ యాక్షన్‌ పేరు మీద లక్షలమంది ముస్లింలను కాల్చి చంపేసిన్రని తెలియకపాయె. ఆ విషయం ఇప్పటోల్లకు అస్సలు తెల్వకుండ ఎందుకు దాచిపెట్టిన్రని ఇవాళ మేం అడుగుతున్నం. అంతమందిని పొట్టనుబెట్టుకోవడం వెనుక హిందూత్వ భావజాలమె పని చేసిందనుకోవాల్నా? అంటే అప్పట్నించే ఆ భావజాలం అంత బలంగా ఉందా? ‘హైదరాబాద్‌ : ఆఫ్టర్‌ ద ఫాల్‌’ అనే సంకలనంలో (సంకలన కర్త ఒమర్‌ ఖాలిదీ) పోలీస్‌ యాక్షన్‌లో రెండు లక్షల మంది ముస్లింలు చంపబడినట్లు ఒక రిపోర్ట్‌ (పండిట్‌ సుందర్‌లాల్‌, ఖాజీ మొహమ్మద్‌ అబ్దుల్‌ గఫార్‌)ఉంది. కాని ఆ సంఖ్య ఆరు లక్షల వరకు ఉండొచ్చని కొందరు చెబుతున్నారు. అందమైన ముస్లిం ఆడపిల్లల్ని, ఆడోల్లని తెలుగోల్లు మాయం చేసిన్రని, పోలీసులు వారాల తరబడి రేప్‌ చేసిన్రని, లూటీలు, దహనాలకు లెక్కే లేదని తెలిసినప్పుడు మన ప్రజాస్వామ్యం మీద అనుమానమేస్తుంది. పోలీస్‌ యాక్షన్‌ గురించి మాట్లాడడం ఇప్పుడెందుకు అనే తెలంగాణ వాదులున్నారు. వాళ్లను ఎట్ల అర్థం జేసుకోవాలె? లక్షలమందిని చంపడం, ఇండ్లను దోచుకోవడం వల్ల కొన్ని తరాలపాటు ముస్లింలు కోలుకోకుండా చేశారు. ఇవాల్టి తెలంగాణ ముస్లింల వెనుకబాటుకి అది కూడా ఒక కారణం. ఎంతమందిని చంపిన్రనే దగ్గర్నించి ముస్లింల మానసిక హింస దాక అప్పటి ఆ విషయాలన్నీ వెలికి తీయాల్సిన అవసరం ఉంది.

అయాల ఉర్దూ రాజభాష. ముస్లింలు-తెలుగోల్లు ఉర్దే చదివేదికదా. ఇండియాల కలపంగనె ఒక్కసారిగ ఉర్దూ తీసిపారేసి కోస్తాంధ్ర తెలుగు అందరి మీద రుద్దిన్రు. ప్రజాస్వామ్యం తెచ్చిన్రు గదా, మరి కనీసం ముస్లింల కోసమన్నా ఉర్దూను ఎందుకు కాపాడాలె? అదే హైదరాబాద్‌ రాష్ట్రం వేరుగానే ఉంటే కనీసం తెలంగాణన్న వేరుగ ఉంటే ఉర్దూ ఇయాల రెండో భాషగా ఉండేది కదా (ఏమో?) ఇయాల ఆంధ్రా పాలకులు ఉర్దూను తొక్కి పారేసి ముస్లింలు గుడ కోస్తాంధ్రంలనే జవాబు చెప్పేటట్టు తమ ఆధిపత్యాన్ని రుద్దుతున్రు. ఉర్దూను ఛీత్కరించడంతో తెలంగాణలో తెలుగు చదివినోళ్లు లేక ఉద్యోగాలన్నింటిలో ఆంధ్రావాళ్లను నింపడం మొదలైంది. అప్పట్నించి మొదలైన ఆంధ్రావలస ఇప్పటికీ ఆగలేదు. ఇక్కడ ముస్లింలకు కూడా పెద్దఎత్తున అన్యాయం జరిగింది. కేవలం ఉర్దూ తెలిసిన అప్పటి ఉద్యోగస్తులకు తెలుగు లేక ఇంగ్లీషు నేర్చుకోవాలని అప్పటి ప్రభుత్వం కొన్ని రోజుల గడువు ఇచ్చింది. మరి నేర్చుకోలేని వాళ్లు ఉద్యోగాల నుంచి తీసే వేయబడ్డారా? లేక ఏం జరిగింది అనే విషయం తెలియదు. అప్పటి దాకా ఉర్దూ మీడియంలో చదువుకున్న యువతరం ఏమయ్యారు? అప్పట్నించి తెలుగు మీడియం ప్రవేశ పెడితె మరో 15 నుండి 20 ఏళ్లకు కదా విద్యావంతులయ్యేది, ఈ మధ్య కాలమంతా ముస్లింలు అన్యాయం పాలయినట్లే కదా? ప్రజాస్వామ్యం పేరుమీద ఇంత దోపిడీ, ఇంత అన్యాయానికి పాల్పడడమేమిటి?
మొత్తం ఇండియాల ఉర్దూ మాట్లాడేవాళ్లు కోట్లమందే ఉంటారు. ఇన్ని భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డయి, మరి ఒక్క ఉర్దూ రాష్ట్రమైనా ఎందుకు లేదని ప్రశ్నించుకోవడం దేశద్రోహం ఏం కాదు కదా. దేశ విభజనాభారాన్ని ఇక్కడి ముస్లింల మీద మోపి ఆ విషయం తప్పించడం సరైందా? ఉర్దూ మాట్లాడేవారు ఒక్కతాన లేకుండా దేశవ్యాప్తంగా పరుచుకొని ఉన్నారు కదా అనే సాకు సరైందా? ఎంఐఎం ఉర్దూ రాష్ట్రం కావాలని 1956లో డిమాండ్‌ చేసి ఉంటే ఎంత బాగుండు.
ఇవాళ హైదరాబాద్‌ లోని, తెలంగాణలోని ఉర్దూ మాట్లాడేవారు, సాహిత్యకారులు ఒక వేరే ప్రపంచంగా బతుకుతున్నారు. వాళ్లను మిగతా ప్రపంచంతో కలిపే ప్రయత్నం ఏది జరుగుత లేదు. వాళ్లతోనూ వేరే ప్రపంచం కలవడం లేదు. వాళ్ల సమస్యలు, వాళ్ల బాధలు వేరేగా ఉన్నాయి. ఆ అంతరాన్ని పెరగనివ్వకుండా చూడాల్సి ఉంది.
తెలంగాణ హిస్టరి రికార్డు చేసేప్పుడు విధిగా ఉర్దూ మాట్లాడేవాళ్ల ప్రాతినిధ్యం ఉండేలా చూడాలి. వాళ్ల ఫీలింగ్సుని పరిగణనలోకి తీసుకోవాలి. ఉర్దూను తెలంగాణ ద్వితీయ భాషగా గుర్తించాలి.
తెలంగాణ గురించి కమ్యూనిస్టులు, ఆంధ్రా వలస పాలకులు రాసిన చరిత్రే ఆధారం కావడం (?)తో అసలు విషయాలు ఎన్నో మరుగున పడ్డాయి. వెలుగులోకి రావలసిన విషయాలు చాలా ఉన్నాయి. అందులో కొన్ని ముఖ్యమైన విషయాల్ని ‘ముల్కి’ ముస్లిం ప్రత్యేక సంచికలో సంగిశెట్టి శ్రీనివాస్‌ రాసిండు. ‘నిజాం చరిత్రకు చెదలు’ పేరుతో రాసిన ఈ వ్యాసంలో ముస్లింలు మనసులో అనుకున్నప్పటికీ బయటికి చెప్పలేని కొన్ని విషయాలతో పాటు ఎన్నో కొత్త కోణాల్ని రికార్డు చేసిండు. దానిపట్ల ఎంతో వ్యతిరేకత వ్యక్తం కావడం ఆశ్చర్యం కలిగించింది. రాజరికాన్ని సపోర్టు చేయడంగా కొందరు మాట్లాడిన్రు. నిజాంలది రాజరికమే. (ఆ పేరుమీద రెడ్డి, వెలమ తదితర భూస్వాములు రాజ్యం చేసిన విషయం మరుగున పెడుతున్నారు.) ఇవాల ప్రజాస్వామ్యం పేరుమీద కోస్తాంధ్రులు నియంతృత్వం చెలాయిస్తుంటే, రాజరికం కన్నా ఎక్కువ దౌర్జన్యాలు చెలాయిస్తుంటే ఆ విషయం చెప్పొద్దంటే ఎట్ల? పైగా తమ కులాలకు చెందిన వాళ్లు రాజులుగా ఉన్నా ఆయా కులాల వాళ్లు మీరు రాజులు కదా అనే నిందను మోయడం లేదు. ఇండియాను క్రిస్టియన్లు పరిపాలిస్తే ఇవాళ క్రిస్టియన్లను మీరు పాలకులు కదా అని అడగడం లేదు. కాని ముస్లింల విషయానికొస్తే మాత్రం మీరు 400 ఏండ్లు పాలకులుగా ఉన్నరు కదా అని కొన్ని బీసీ సంఘాలు ముస్లిం రిజర్వేషన్‌ను వ్యతిరేకించాయి. అట్లె ఎంతోమంది అలా వాదిస్తున్నారు. ఆఖరికి తెలంగాణ వాదుల్లో కొందరు గూడ అయ్యే మాటలు మాట్లడడం విన్నప్పుడు చీదరింపు కలిగింది. ఏ కులంగాని, మతంగాని, జాతిగాని ఇట్లా మీరు పాలకులు కదా అనే భారాన్ని మోయడం లేదు. ఒక్క ముస్లింలు తప్ప.
పాలకులు అన్న ఈ భారాన్ని మోస్తున్న ముస్లింలకు సెప్టెంబర్‌ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని బిజెపి నిర్వహిస్తున్న తీరు వల్ల కూడ మరింత నష్టం కలుగుతున్నది. ఇట్లాంటి సందర్భంలో సెప్టెంబర్‌ 17ను ఉత్సవంగా టిఆర్‌ఎస్‌ నిర్వహించకుండా ఉండడం సరైందనిపించింది. కాని కొన్ని తెలంగాణ సంఘాలు ఈ విషయాన్ని విస్మరించడం విస్మయం కలిగించింది. కోస్తాంధ్ర వలసవాద పాలన నుంచి తెలంగాణకు విమోచన కలగనంతవరకు సెప్టెంబర్‌ 17ను ఉత్సవంగా జరపడంలో అర్థం లేదు.
ఇవాళ రాజకీయంగా జరుగుతున్న ఉద్యమంపై ముస్లింలకు అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. రాజకీయ ఉద్యమం సాహిత్యరంగంలోని ఒక వర్గాన్ని ప్రభావితం చేస్తుండడం ఇవాల్టి విషాదం. టిఆర్‌ఎస్‌ మొదలయింతర్వాత బిజెపి నుంచి చీలిపోయి టిఎస్‌ఎస్‌గా ఏర్పడ్డ నరేంద్ర పార్టీ టిఆర్‌ఎస్‌లో కలవడం ముస్లింల పట్ల వివక్ష మొదలు కావడానికి కారణమైంది. (ముస్లింలకు కూడా టిఆర్‌ఎస్‌పై అనుమానం మొదలైంది.) అంతదాకా ముస్లింల జనాభా తెలంగాణలో గణనీయంగా ఉందని భావించి 15 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తామని ప్రకటించిన టిఆర్‌ఎస్‌ ఆ వాయిస్‌ను తగ్గించింది. అట్లే సీట్ల కేటాయింపులోనూ అన్యాయం చేసింది. ఇప్పటికీ ఆరెస్సెస్‌ వాడినే అనే నరేంద్ర రెండవ నాయకుడుగా ఉండడంతో ముస్లింలలో ఒక సందిగ్ధం నెలకొంది. తెలంగాణ వస్తే బిజెపి ప్రాబల్యం పెరుగుతుందని జరిగిన ఒక ప్రచారం కూడా ఇందుకు కారణం. పైగా అసెంబ్లీలో ముస్లింల ప్రతినిధిగా మాట్లాడే ఎం.ఐ.ఎం కూడా తెలంగాణ పట్ల మొదట వ్యతిరేకంగా మాట్లాడడం కూడా మరో కారణం. కాని ఎం.ఐ.ఎం ముస్లింల ప్రతినిధి కాదని ఇక్కడ అందరం గుర్తుంచుకోవాలి. ఒక్క పాతబస్తీలో తప్ప మిగతా తెలంగాణ జిల్లాల్లో ముస్లింలు ఎం.ఐ.ఎం.తో లేరు.
నరేంద్ర తదితర ఆరెస్సెస్‌ వాదుల (రాజకీయ పార్టీలతో సంబంధం లేని ఆరెస్సెస్‌ వాదులు కూడా) వల్ల ఇవాల ముస్లింల పట్ల ఒక వివక్ష, మౌనం చూస్తున్నాం. చివరికి ఇదే భావజాలం సాహిత్యానికి కూడా పాకి మిగతా ఐడెంటిటీ ఉద్యమాలతో పాటు ఒక ఉద్యమంగా నడుస్తున్న తెలంగాణ వాదం ముస్లిం వాదం పట్ల వివక్ష చూపుతూ వస్తున్నది. వేదికల మీద ముస్లింలు లేకుండానే నడిపిస్తున్నది. ఒక్క తెలంగాణ సాంస్కృతిక వేదిక కాస్త ఇందుకు మినహాయింపుగా కనబడుతున్నది.
సాహిత్య ఉద్యమంతోపాటు తెలంగాణ రాజకీయాలు కూడ ముస్లింల పట్ల స్పష్టమైన ప్రకటనలు (చేయాలి) చేసేలా తెలంగాణ ముస్లింల ప్రాముఖ్యతను రికార్డు చేయవలసిన అవసరం ఉంది.
తెలంగాణ హిస్టరీ రికార్డు చేసే క్రమంలో ముస్లింల కోణం నుంచి లెక్కలోకి తీసుకోవల్సిన అంశాలు క్లుప్తంగా :




  • పోలీస్‌ యాక్షన్‌లో ఎన్ని లక్షలమంది ముస్లింలను హత్యచేశారో, ఎంతమంది ముస్లిం స్త్రీలను, అమ్మాయిల్ని రేప్‌ చేశారో, మాయం చేశారో, ఎన్ని ఇండ్లను దోచుకున్నారో, ధ్వంసం చేశారో విస్తృత అధ్యయనం జరగాలి. అందుకు ప్రతిగా ముస్లింలను ఆదుకోవాలి.



  • తెలంగాణకు సంబంధించి హిస్టరి దగ్గర్నుంచి అన్ని రంగాల్లో ఉర్దూ మాట్లాడేవాళ్ల ప్రాతినిధ్యం ఉండాలి. ముస్లింల ప్రాతినిధ్యం ఉండాలి.



  • ఉర్దూను తెలంగాణ ద్వితీయ భాషగా గుర్తించాలి.



  • తెలంగాణ గురించి కమ్యూనిస్టులు, ఆంధ్రా వలసపాలకులు రాసిన చరిత్ర ఆధారంగా ముస్లింలను చూడొద్దు. తెలంగాణలో ముస్లింలు ఒక భాగం అని నమ్మేవాళ్లు కొత్తగా రాసే చరిత్ర ఆధారంగా చూడాలి.



  • శ్యాంసుందర్‌ అనే దళిత నాయకుడు హైదరాబాద్‌ ప్రత్యేక దేశంగా ఉండాలని యుఎన్‌ఓ తో మాట్లాడిండని, ఇంకో మూడు రోజులు గనుక పోలీస్‌ యాక్షన్‌ జరగకపోయి ఉంటే హైదరాబాద్‌ను ప్రత్యేక దేశంగా యుఎన్‌ఓ ప్రకటించేదని చెప్తున్నరు. అట్లా జరిగి ఉంటే ఇండియా అనే ఒక దేశం మరో దేశమైన హైదరాబాద్‌ మీద దాడి చేసినట్లు అయ్యేది. ఇదిలా ఉంటే హైదరాబాద్‌ సంస్థానాన్ని ఇండియన్‌ యూనియన్‌లో కలపడం వల్ల దళితులకు అన్యాయం జరుగుతుందని ఫీలయిన శ్యాంసుందర్‌ చెప్పిన కారణాలేమిటి? అవి నిజ మయ్యాయా?



  • నిజాం రాజుల పాలనను ముస్లింల పాలన అనడాన్ని వ్యతిరేకించాలి. ముస్లింలు 400 ఏండ్ల పాలకులు అనే ప్రచారాన్ని ఖండించాలి.



  • నిజాం రాజ్యంలో ‘నిరంకుశత్వం’ నడిపిన రెడ్లు, వెలమలు తదితర భూస్వాముల గురించిన విషయాలు కూడ చర్చకు రావాలి. ఎవరి నిరంకుశత్వం ఎంత అనేది తెలియాలి.



  • ఉర్దూలో, పార్సీలో ఉండే సోర్సెస్‌ (ఆధారాలు) వెలికి తీయడం ద్వారా అనేక అబద్ధపు ప్రచారాలు, అసలు నిజాలు వెలుగులోకి వస్తాయి, కనుక ఆ ప్రయత్నం జరగాలి.



  • ఖాసీం రజ్వీ ఆటోబయోగ్రఫీ పాకిస్తాన్‌లో ముద్రణ పొందింది. దాన్ని రిఫర్‌ చేయడం జరిగితే అతను రజాకార్‌ ఉద్యమం చేయడానికి అసలు కారణాలు తెలిసే అవకాశం ఉంది. ఆ ప్రయత్నం జరగాలి.



  • నిజాం కాలంపై విదేశాలలో సైతం రిసెర్చ్‌లు జరుగుతుంటే ఇక్కడ ఇంతటి వివక్ష, దుష్ప్రచారం జరుగుతుండడాన్ని చర్చకు పెట్టాలి.



  • కోస్తాంధ్రలో దళిత క్రైస్తవులు ఎక్కువగా ఉన్నట్లుగా ఇక్కడ ముస్లింలు ఎక్కువగా ఉన్నారు. మరి దళితుల నుంచే ఎక్కువగా ముస్లింలుగా మారిన్రా అనే విషయంలో అధ్యయనం జరగాలి. దీన్ని లెక్కలోకి తీసుకోవాలి.



  • ఆంధ్రుల వలస వల్ల చిల్లర వ్యాపారాల దగ్గర్నుంచి ఉద్యోగాల దాకా ముస్లింలు అన్యాయానికి గురయిన, గురవుతున్న విషయం రికార్డు కావాలి.



  • హైదరాబాద్‌ లాంటి చోట్ల పోలీసు శాఖలో ముస్లింల శాతం మరీ తక్కువగా ఉన్నది. దీనివల్ల ఎంతో వివక్ష కొనసాగుతున్నది. ఇది ఏ భావజాలం వల్ల జరుగుతున్నది? దీని వెనుక రాజకీయాలేమిటి? పోలీసుల భర్తీలో ముస్లింల పట్ల వివక్ష గురించి చర్చ జరగాలి.



  • ముస్లింలకు, తెలుగోల్లకు మధ్య ఏయే కారణాల వల్ల అంతరం పెరుగుతున్నదో చూడాలి.



  •                                                                                  - స్కైబాబ

                                      మే 19th, 2007 by డిస్కవర్ తెలంగాణ

    Friday, 26 November 2010

    ట్‌రైటర్స్‌

    నువ్వూ నేనూ కలిసే
    భూమి కోసం పోరాడుతున్న
    వీరుల కోసం విప్లవగానం చేశాం -
    నువ్వూ నేనూ కలిసే
    కశ్మీర్‌, పాలస్తీనా, ఇరాక్‌
    పోరాటాలను సమర్థించాం ..
    చర్చలు.. సభలు.. ఉపన్యాసాలూ...
    ఉద్యమ ఆవేశాల్తో ఊగిపొయ్యేవాళ్లం -
    ఒకానొక సమయం ఇలా వచ్చింది
    ముక్క దగ్గరా మగువ దగ్గరా
    మనిషి మనస్తత్వం తెలుస్తుందంటారు..
    నువ్వు ఆక్రమించిన నా నేల
    ఉద్యమించేసరికి నీ నైజమూ బైటపడిపోయింది!
        1
    ఏకైక రక్తసంబంధాన్ని ఏడేడు సముద్రాలు దాటనిచ్చినవాడా!
    అమ్మగల్లాడిన మా మట్టిమీది ప్రేమను అపహాస్యం చేస్తున్నావా?
    మెత్తని నీ మాటకు మురిసిపోయేవాణ్ణి
    అది చాకూ అని తేలి విస్తుపోతున్నాను
    నీ ఆలింగనంలో గుండెలు విచ్చుకునేవి
    ఇప్పుడు బ్రహ్మజెముళ్లు గుచ్చుకుంటున్నాయి
        2
    ఈ నేలే నిన్ను కవిని చేసిందంటావ్‌
    ఇవాళ ఈ నేలే తన విముక్తికోసం పెనుగులాడుతుంటే
    ట్రైటర్స్‌లో ఒకడివయ్యావ్‌
    కుడి ఎడమల తలలూపేవాళ్ళే
    ఎవడి ముందు వాడి పద్యం పాడతావ్‌
    తడబడుతున్న నీ పదమే
    నీ కలాన్ని నిలదీస్తుంది
        3
    ఏ నేల నిన్ను తన జవసత్వాల నిచ్చి
    పెంచి పెద్ద చేసిందో
    ఆ నేలనే తన్నేసి
    పరాయి దేశం ఎగిరిపోగలిగిన గద్దా..
    నీకు మా మాతృప్రేమ తండ్లాట
    ఎలా సమజైతది?
        4
    ఒక అస్తిత్వం గురించి మాట్లాడుతూనే
    మరొక అస్తిత్వాన్ని కాదనడం ఏమనిపించుకుంటుంది?!
    మైనారిటీ అస్తిత్వ దీర్ఘ కావ్యమైనవాడా..
    స్త్రీవాదపు రెమ్మలై రెపరెపలాడినవారలారా..
    సోదర అస్తిత్వాని కొచ్చేసరికి
    ఇంగితం ఆవిరైపోయిందా.. కపాలం డొల్లగా మారిందా..
                     *
    కవి అన్నవారికి కన్నెలా మలుగుతుంది..
    ఆమ్‌ ఆద్మీ రోడ్ల మీదికొచ్చి నినదిస్తుంటే
    రక్తం ఉరకలెత్తకుండా ఎలా ఉంటుంది..
    ఇన్నాళ్లూ విప్లవాల వేషాలేసీ
    ఉద్యమాల శిగాలూగీ
    ఇవాళ ముడుచుకుపోయారేం..
    మిమ్మల్ని ఇన్నాళ్లూ గౌరవించినందుకు
    మాకే తలవంపులుగా ఉంది-
    సిగ్గూ శరం ఉన్నోళ్ళయితే
    ఇన్నాళ్లూ రాసిన ఆ కలంతోనే పొడుచుకోండి
    అట్లన్నా కవిత్వం పునీతమవుతుంది!           

                                                                           01 09 2010

    Monday, 22 November 2010

    'కథతో ఒకరోజు' విషయంలో ఏమి జరిగింది ...

    ఆంధ్రా 'కథతో ఒకరోజు' ఆంధ్రాలో పెట్టుకోండి! -కరపత్రం విడుదలయ్యాక మరునాడు సభ అనంగా, వాసిరెడ్డి నవీన్‌ 'సింగిడి' తెలంగాణ రచయితల సంఘం బాధ్యులైన డా.సుంకిరెడ్డి నారాయణరెడ్డి, సంగిశెట్టి శ్రీనివాస్‌, స్కైబాబ లకు, తెలంగాణ రచయితల జెఎసి కన్వీనర్‌ పరవస్తు లోకేశ్వర్‌కు వేరువేరుగా ఫోన్లు చేసి తాను తెలంగాణకు మద్దతుగా ప్రెస్‌నోట్‌ రిలీజ్‌ చేయడం జరిగిందని, రేపు మీటింగ్‌ సజావుగా జరగడానికి సహకరించమని, అందుకు ఇంకా ఏమి చేయాలని అడిగారు. మరి ఇప్పటివరకు తెలంగాణ రచయితలకు జరిగిన నష్టం ఎలా పూడుతుందని అడిగాము. 14మంది వక్తల్లో కేవలం ఇద్దరినే తెలంగాణవారిని పెట్టడం గురించీ అడిగాము. మీటింగ్‌ తర్వాత అన్నీ మాట్లాడుకుందామని నవీన్‌ అన్నారు. సరే, సింగిడి సభ్యులము మాట్లాడుకొని చెబుతామన్నాము. తర్వాత సంగిశెట్టి శ్రీనివాస్‌ నాలుగు విషయాలు నవీన్‌కు చెప్పడం జరిగింది. 1.సభలో తెలంగాణ రాష్ట్రానికి మద్దతుగా తీర్మానం చేయాలి. 2. కరపత్రంలో 'సింగిడి' లేవనెత్తిన అంశాలకు వివరణ ఇవ్వాలి. 3. కరపత్రాలు సభా ప్రాంగణంలో పంచుకుంటాము. 4. మీటింగ్‌ తర్వాత కలిసి 20 ఏళ్లుగా తెలంగాణ రచయితలకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడుకోవాలి. -వీటన్నింటికీ వాసిరెడ్డి నవీన్‌ ఒప్పుకున్నారు.
    ఆయన పత్రికలకు విడుదల చేసిన ప్రెస్‌నోట్‌లో- 'సింగిడి' వారు కోరినట్లుగా తెలంగాణ ఉద్యమానికి ఎటువంటి అరమరికలు లేకుండా మద్దతు తెలియజేస్తున్నామని, కథల ఎంపికకు సంబంధించి, సంకలనాల లోటుపాట్ల గురించి సాహిత్య చర్చల ద్వారా నిర్ణయించుకోవచ్చునని -నవీన్‌ అన్నారు.
    మీటింగ్‌ రోజు ఆరేడుగురు సింగిడి సభ్యులు వెళ్లి కరపత్రాలు పంచి వచ్చేశారు. సింగిడి సభ్యులు అక్కడికి వెళ్లిన కొద్దిసేపటికి దాదాపు 20 మంది పోలీసులు అక్కడికి చేరుకుని సభకు రక్షణగా నిలుచున్నారు. ముగ్గురు నలుగురు తప్ప తెలంగాణ రచయితలంతా సభను బాయ్‌కాట్‌ చేశారు. రాలేదు. ఆశించినంతమంది సభకు రాలేదని, 150కి పైగా సాహిత్యకారులు వస్తారనుకుని నిర్వాహకులు భోజనాలు చెప్పారని, కేవలం 50 మందే వచ్చిఉంటారని, చివరి సెషన్‌ మరీ వెలవెలా పోయిందని తెలిసింది.
    తెలంగాణకు మేము వ్యతిరేకం కాదు అన్న విషయమే వాసిరెడ్డి నవీన్‌ మళ్లీ మళ్లీ అందరికీ చెప్పారు కానీ అదొక్క విషయమే సింగిడి లేవనెత్తలేదు, 20 ఏళ్లుగా తెలంగాణలో ఎదగాల్సిన కథకు, కథకులకు ఎనలేని నష్టం కథాసాహితి చేసిందని మేము కరపత్రంలో చెప్పాం. అట్లే ఇంకా కొన్ని ముఖ్యమైన అంశాలు కరపత్రంలో ఉన్న విషయం గమనించవచ్చు.
                                                                          - 'సింగిడి' తెలంగాణ రచయితల సంఘం

    బద్వా



    ''అయ్యో - నా బిడ్డలు
    ఒకని జోలికి బోతోల్లు గాదు
    ఒగని ఉసురు బోసుకుంటోల్లు గాదు
    ఒగల ఉప్పు దింటోల్లు గాదు
    ఉన్నదున్నట్లు మాట్లాడ్తె
    నీతి దప్పుతున్నవంటె
    నా బిడ్డల్ని పొట్టన బెట్టుకుంటున్నవ్‌ గదర
    గరీబోల్ల కోసం బందూఖ్ బట్టినోన్ని సంపుతుంటివి
    నీ లెక్కనె మనుషులందర్కి హక్కులుంటయంటె నరుకుతుంటివి
    తుర్కోల్ల వష్షి పోరగాల్లని పరాయి ఏజంట్లని పట్కపోతుంటివి
    ఏ దేశంర నీది
    మా కాడ పెద్దిర్కం జేస్కుంట
    మమ్మల్నే ఆగమాగం జేస్తున్నవ్‌ గదర
    అన్నం బెడ్తున్నోన్కి పురుగుల మందు తాపియ్యబడ్తివి
    పత్తిచెట్లను ఉరికొయ్యలు జేస్తివి
    కంపెనీల బతుకుదెరువుల్ని మూతబడేస్తుంటివి
    నువ్వు సత్తెనాశనం గాను
    నువ్వు పురుగులు బడిపోను
    నీ ఏశాలు అరవపోల్లకాడ సాగయని
    మా తాన ఆడుతున్నవార ?
    సోపతిల తెల్లోని బుద్దులు ఒంటబట్టి
    అచ్చం ఆని లెక్కనె మా మీద రాజ్యం జేస్కుంట
    నా బిడ్డల కడుపు గొట్టి
    నీవోళ్ల బొజ్జలు నింపుతున్నవారీ
    మేం ఆ అంగ్రేజోన్ని సూళ్లే
    నిన్ను జూస్తున్నం

    మా కోహినూర్  ఎవని కిరీటంలనో మెరిసినట్టు
    మా పచ్చదనం దగదగల్ని తరలిస్తిరి గదర
    మా గొలుసుకట్టు చెరువులెయ్యి
    కుంటల్ల చెరువుల్ల బావుల్ల తానాలాడిన
    మా సంతసాన్ని మాయం జేస్తిరి గదర
    కండ్ల మీద ఆనకట్ట లేసి చూపానకుంట జేసి
    కండ్ల కింద పంటలు పండించుకుంటున్నరారీ
    ఈ ఒంటిని 'జలాశయం' చేసుకుంటిరి
    దాన్యాగారం చేసుకుంటిరి
    'డబ్బు' సంచి జేసుకుంటిరారీ
    ఈ తావు ఉజ్జెమాల పుట్ట
    పాముల్లెక్క జేరితిరి గదర
    తురక రాజులుగుడ ఈడ రాజ్జెం జేసిన్రు గని
    మా రాజులు...
    మా నోటికాడిది గుంజి ఇంకోనికైతె పెట్టలె
    ఈడ రాజ్జెం జేసిన్రు
    ఈ మట్టిల్నె గలిసిన్రు
    ఆళ్లె నయమనిపిస్తున్రు
    నా బిడ్డలను నీళ్లకు బువ్వకైతె సంపలె
    సాచ్చెం రుజువుల్లేకుంట
    నా బిడ్డల పాణాలైతె తోడలె
    ఆళ్లను ఎలగొట్టి
    మీరు శనిలెక్క పట్టుకున్రు గదరా...''

    Tuesday, 7 September 2010

    మజ్బూర్ (ఓ పేద ప్రేమికుడి కథ)

    అయాల రంజాన్!జల్ది జల్ది ఈద్గా దిక్కు నడుస్తుండు జాని. అమ్మీకి పాలు, పండుగ సామాను తెచ్చిచ్చి తయారై బయల్దేరేసరికి జర లేటయింది. అందుకనె ఆ జల్ది.

     అందమైన సల్మా మొఖం.. మనసుకు శాంతినిచ్చే సల్మా మొఖం.. కళ్లల్లో మెరిసేసరికి జాని మనసు ఉరకలెత్తింది. పండుగ నమాజ్ ఐపోంగనె ముందుగాల సల్మవాళ్లింటికే పోవాలనుకుండు, మరింత జల్ది నడవబట్టిండు.


    ఊరికి పడమరన ఉంది ఈద్గా (రంజాన్, బక్రీద్‌లకు నమాజ్ చేసే ప్రాంగణం). ఊరి పొలిమేర దాటి సగం మైలు నడవాలె. ఊరంటె పల్లెటూరు కాదు చిన్న పట్నం. తాలూకా లెవలు.
    సైకిల్ మోటర్లు, సైకిళ్లు దబ్బదబ్బ పోతుంటె బాటెంట ఒకటె దుమ్ము లేస్తున్నది. జానితొపాటు ఎనకాముందు శానామంది నడుస్తున్రు. అంతా కొత్త బట్టల్తోని, తీరుతీర్ల టోపీల్తోని, అత్తరు గుమగుమల్తోని ఒక పూలవనం కదిలిపోతున్నట్లుంది. శానామంది తమ బుడ్డబుడ్డ పిల్లల్ని గుడ ఎంట తీసుకొస్తున్రు.

    ఇమాం సాబ్ మైకు సరిచేస్తున్నట్లు గరగర ఇన్పించింది. ఇంకింత జల్ది నడవబట్టిండు జాని. చేతిల ప్లాస్టిక్ కవరుంది. అందుల పాత చద్దరొకటుంది. అమ్మీ పెట్టెల్నించి తీసిచ్చిన మఖ్మల్ టోపీ కూడా ఉంది. రాత్రి ఇస్త్రీ చేయించి పెట్టుకున్న బట్టలు తొడుక్కుండు. కాళ్లకు సగం అరిగిన హవాయి చప్పల్ (స్లిప్పర్స్). ఈద్గా దగ్గర పడ్డది. బాటకు రెండు దిక్కులా ఫకీర్లు కూసొని ఖైరాత్ చెయ్యమని దీనంగ అడుగుతున్నరు. ఒకరిద్దరు మర్ఫా, కంజిర కొట్టుకుంట ఖవాలీలు పాడుతున్రు.

    కొత్తగ కట్టిన కాంపౌండు బైట అటుదిక్కు ఇటుదిక్కు చిన్నా పెద్దా శానామందే చెప్పులు తమకాడ ఇడవమంటె తమకాడ ఇడవమని పిలుస్తున్రు. తన చప్పల్ యాడ ఇడవాల్నో తేల్చుకోలేక జరసేపు నిలబడ్డడు జాని. తన ఎదురుంగ ఉన్న తాత జర భోళాగ కనిపించిండు. చప్పల్ ఇడిసి ఒకదాన్ల ఒకటి జొనిపి తాతకిచ్చిండు. తాత ఆటిని తన దగ్గరగ ఉన్న కుప్పల పెట్టుకుండు. మరింత మంది అక్కడికొచ్చేసరికి జాని జరిగి ఈద్గా గేటు దిక్కు కదిలిండు.

    'అవుజ్ బిల్లాహి మినష్షయితాన్ నిర్రహీమ్. బిస్మిల్లా హిర్రహ్మాన్ నిర్రహీమ్' (షైతాన్ బారినుండి దేవుని శరణు వేడుతున్నాను.
    కరుణామయుడైన దేవుని పేరుతో ప్రారంభిస్తున్నాను) అని మొదలుపెట్టిండు ఇమాంసాబ్.
    గేటు దగ్గర అంతా తోసుకుంట లోపల్కి పోబట్టిన్రు. జానిగూడ తోసుకుని లోపలబడ్డడు. గేటు ఇంకింత పెద్దగ కట్టాల్సుండెనని ఒకరిద్దరు గునుగుతున్రు. అల్లంత దూరంగ ఈద్గా మజీదు. దాని ముంగల పెద్ద యాపచెట్టు. జల్దిజల్దిన అటుదిక్కు నడిషిండు జాని. అప్పట్కె చెట్టు నీడన సోటు లేకుంట కూసున్రు జనం. ఇటు అటు చూసి ఇగ తప్పదన్నట్లు ఒక పక్కగ కవరుల్నుంచి చద్దర్ తీసి పరిషి ఒక చివర కూసుండు. టోపి పెట్టుకుండు. చద్దర్ పెద్దగనె ఉండేసరికి ఇంకో ముగ్గురు వచ్చి కూసున్నరు.

    ఎండ చిరచిరలాడుతున్నది. తన పక్కన కూసున్న పెద్దమనిషి చేతికున్న గడియారం దిక్కు సూషిండు జాని. 11 దాటింది. కొంచెం ముందుగాలొస్తే చెట్టుకింద సోటు దొరికేది. ఎనక్కు మళ్లి సుట్టు సూషిండు. వచ్చేటోల్లు ఇంక వస్తెనే ఉన్నరు. చద్దర్లు పరుస్తనె ఉన్రు. చద్దర్లు లేనోళ్లు జరంత సేపాగి ఎవరిదన్న చద్దర్ల సోటు సంపాదిస్తున్రు. లేనోళ్లు కిందనె కూసుంటున్రు. షానామందికి ఎండకు చెమట్లు పడుతున్నై. షానామంది కొత్తబట్టలు ఏసుకున్నా అక్కడక్కడ కొత్తబట్టలు కుట్టించుకోలేకపొయ్‌న వాళ్ల చూపులు అంత హుషారుగ లెవ్వు. మాటిమాటికి అవి వాలిపోతున్నయ్. కొందరి మొఖాలల్ల పరేషాన్లు.. కొందరి మొఖాలు వయసుకు మించిన పెద్దరికంతోని, వయసుకు మించిన ముడుతలతోని.. కొన్ని కళ్లు పీక్కుపోయి.. కొన్ని గుంతలు పడి.. కొన్ని నిర్జీవంగా.. ప్చ్.. అల్లా.. అన్నీ నువ్వు పెట్టే పరీక్షలే అంటరు.. ఎందుకు ఇందర్ని ఇన్ని బాధలు పెడుతున్నవ్...


    ఇమాంసాబ్ బయాన్ (ప్రసంగం) చేస్తనే ఉండు. టైం గడుస్తనే ఉంది. జనం రావడం పల్చబడ్డది..
    ఇగ ఇమాంసాబ్ మాట్లాడ్డం ముగించి పండుగ నమాజ్ తరీఖ (పద్ధతి) చెప్పబట్టిండు. రెండు నిమిషాల్లో నమాజ్ కోసం అంతా లేషిన్రు. జమాత్ నిలబడ్డది. భుజం భుజం కలిపి వరుసలు కట్టిన్రు. మద్యమద్యల చోటు మిగిలిన కొద్ది ఎనకవాళ్లు ముందు వరుసకొచ్చి ఖాళీ అయిన చోటల్లా నిలబడ్డరు. 'అల్లాహు అక్బర్'(అల్లా గొప్పవాడు) అని చేతులెత్తుతూ నమాజ్ షురూ చేసిండు ఇమాంసాబ్..
    నమాజ్ అయినంక దువాకు ముందు తఖ్రీర్ (ఉపదేశం) ఇస్తున్నడు ఇమాంసాబ్. వినడం వదిలేసి సోంచాయించుకుంట కూసుండు జాని. తనకు ఈసారి కొత్తబట్టలు లేవు. అప్పుడప్పుడు దాచిపెట్టిన పైసలు పెట్టి అమ్మీకి ఒక చీర కొనుక్కొచ్చిండు. 'నాకెందుకు తెచ్చినవురా.. నువ్వే రెడిమేట్ల ఒక పాయింటో షర్టో తీసుకోవద్దా' అని బాధపడింది అమ్మీ. 'నాకీసారికి వద్దులే అమ్మీ! కొత్తబట్టలు కుట్టించి ఆర్నెల్లు కూడా కాలే కదా' అన్నడు. చీర వాపస్ చేసి తననేదన్నా కొనుక్కోమని పోరింది అమ్మీ. తనే విన్లే.
    ఇమాంసాబ్ దువా (వేడుకోలు) షురూ చేసిండు. అంతా చేతులు సాపిన్రు. జాని కూడా దువాకై చేతులు సాపిండు. ఆయిల్ మరకల చేతులు! ఎంత తోమినా పోని దలిందరాగి లాగే ఈ ఆయిల్ మరకలు.. గోర్లు తీసుకున్నప్పటికీ ఆ మూల ఈ మూల మిగిలే ఉన్న ఆయిల్ నలుపు.. వదలని దుఖ్ఖం లెక్కనే!

    దువాలో- మనుషులంతా మంచిగుండాలని, వానలు కురవాలని, కరువు కాటకాలు రావొద్దని, సకల మంచితనాల్ని కోరుతున్నడు ఇమాంసాబ్. అన్నింటికీ అందరితోపాటు 'ఆమీన్' (అలాగే జరుగుగాక) అంటున్నడు జాని. కని మనసులో మాత్రం అమ్మీ బీద చూపులు.. చిన్న ఆపా భయం చూపులు.. పెద్ద ఆపా పరేషాన్లు.. మెదుల్తున్నయి. కళ్లల్ల నీళ్లు తిరిగినయ్. తను వీళ్లను ఖుషీగ బతికేటట్లు చెయ్యగలడా? అల్లా మమ్మల్ని ఆదుకోడా? యా ఖుదా.. మాక్కూడా కాసిన్ని ఖుషియాఁ (సంతోషాలు) ఇవ్వరాదయ్యా... సల్మా గుర్తొచ్చింది. వచ్చే రంజాన్ కల్లా సల్మాతో తన షాది అయితే ఎంత బాగుండు? అల్లా! ఆ ఒక్కటన్నా అయ్యేటట్లు సూడు, మరేం వద్దు గని...

    దువా కాంగనే అంతా లేషి 'ఈద్ ముబారక్' (పండగ శుభాకాంక్షలు) చెప్పుకుంట అలాయ్‌బలాయ్ తీసుకుంటున్రు. జాని కూడా తనకు పరిచయం ఉన్నోళ్లకోసం చూసిండు. కాని ఎవరు కనబడ్లె. ఇంతల తన చద్దర్ మీదనే నమాజ్ చదివిన పండు ముసలి దాదా ఒకాయన 'ఈద్ ముబారక్ బేటా!' అని చేతులు సాచిండు. జాని మనసు ఖుష్షయింది. ఎవరు లేనోళ్లకు దేవుడే దిక్కు అన్నట్లు కనిపించిండు దాదా! 'ఆప్‌కో భి సలామత్ దాదా!' అని గుండెల నిండుగ అలాయ్‌బలాయ్ తీసుకుండు.

    చద్దర్ ఎత్తి కవర్లో పెట్టుకుండు. ఒకరిద్దరు దూరపు చుట్టాలు కలిసిన్రు. తమ గల్లీవాసులు ఇద్దరు.. అందరితోని అలాయ్‌బలాయ్ తీసుకొని గేట్ దిక్కు కదిలిండు. తన మామలు, కక్కయ్యలు కలవలేదేందా అని చూస్తున్నడు అందరి దిక్కు. అంతా ఆత్రంగ కదుల్తున్రు. షానాసేపు పట్టింది గేట్ల నుంచి బైట పడతానికి. జల్ది జల్ది తన చప్పల్ ఇడిషిన దిక్కు పొయిండు. ఎగబడ్డట్టుగ ఎవరి చెప్పులు ఆళ్లు తీసుకుంట తాత చేతిల రూపాయో రెండు రూపాలో పెడుతున్నరు. జాని తన చెప్పుల కోసం చూసిండు. ఒక పక్కగ పడి ఉన్నయ్. తీసుకొని కాళ్లకు తొడుక్కుండు. పైసలు ఇయ్యకుంటనె యాడ ఎల్లిపోతరొనని అందరికెల్లి ఆత్రమాత్రంగ చూస్కుంట చేతులు సాస్తుండు తాత.

    కష్టంగ అటు రెండడుగులు ఏసి తాత చేతిల రెండు రూపాలు పెట్టిండు. పెట్టి ఇవతలికి రాబోయిండు. అంతల్నె ఎవరొ తన చెప్పు తొక్కిండు. లేషిన తన కుడి కాలుకి స్లిప్పర్‌కి మద్యల బలమైన కాలు ఎవరిదొ పడింది. అంతె, చెప్పు సగానికి చినిగి తెగిపొయింది! గుండెల డక్కుమన్నది జానికి. తూలి సంబాలించుకొని చెప్పు దిక్కు చూసుకుండు. ఎనక డాలీలు ఉండేకాన్నుంచి తెగిపొయింది. ఇంతకుముందే కొంచెం చీలి ఉండె. అక్కడ్నుంచే తెగింది. కాలు ఎత్తి చూసిండు. సగం చెప్పు ఊగులాడుతున్నది. కాలెత్తి చేతిలకు తీసుకొని చూసిండు. చివర కొంచెం అంటుకొని ఉంది తప్ప దాన్ని ఇగ ఏం చెయ్యలేం.
    తాత జాని దిక్కు చెప్పు దిక్కు మల్ల మల్ల చూసి 'అయ్యో.. చెప్పు తెగిందా కొడ్కా!' అన్నడు బాధగ.

    మనసంత బాధగ ఐపొయింది జానికి. ఏడుపొచ్చి నట్లనిపించింది. నిబాయించుకొని చెప్పులు ఇడిషి పక్కన పడేసిండు.
    అంతసేపు ఎండకు కూసుంటె గుడ పట్టని చెమట ఒళ్లంత తడిపెయ్యబట్టింది.
    'స్లిప్పర్లే గదయ్యా! నీ శని వదిలిందనుకో.. కొత్త జత కొనుక్కోయ్యా.. నీకు మంచి జరుగుతది' అంటుండు తాత.
    ప్చ్! స్లిప్పర్లే ఐనా మల్ల కొంటానికి తన కాడ పైసలెయ్? అయ్యో! నమాజ్ ఐపోంగనె సల్మాను చూద్దామనుకుంటినె.. ఇప్పుడెట్లా? ఉత్త కాళ్లతోని ఆళ్లింటికెట్ల పోవుడు..?
    షానాసేపు అట్లనె నిలబడ్డడు జాని. అంతా ఎల్లిపోతున్నరు. తాత గూడ ఎల్లిపొయిండు. మనసు ఖాళీ అయిపొయింది. మెల్లగ కదిలిండు ఉత్త కాళ్లతోని.
    'అయ్యా! అయ్యా! బాబా! బాబా' అంటున్నరు ఫకీర్లంతా. మర్ఫా చప్పుడు.. ఘల్లు ఘల్లున కంజిర.. అంతా ఫకీర్లకు ఖైరాత్ చేసుకుంట పోతున్రు. తన దగ్గర ఆ చిల్లర గూడ లేదు.

    కొద్దిదూరం వచ్చిండు. ఎడమ పక్క సమాధులున్నై. షానామంది తమ పెద్దల సమాధుల కాడ పూలు చల్లి దువా చదువుతున్రు. జాని తన అబ్బాజాన్ సమాధి దిక్కు కదిలిండు. ఖబ్రస్తాన్ బైట పూలమ్ముతున్రు. పూలు కొంటానిక్కూడ పైసల్లేవ్. కంపముళ్లను, రాళ్లను సూషి అడుగేసుకుంట, ఒట్టిగనె ఎల్లి అబ్బా సమాధి ముందు నిలబడ్డడు. పక్కన దాదా, దాదీ సమాధులు. పక్క సమాధి తాలూక మనిషి ఆకుల్ల చుట్టిన పూలు విప్పి ఆ సమాధిపై చల్లి పక్క సమాధులపై కూడ చల్లుకుంట జాని దిక్కు పూల డొప్ప సాపిండు. జాని కొన్ని పూలు తీసుకొని అబ్బా సమాధితో పాటు పక్క సమాధుల మీద కూడా ఆ పూలరేకులు చల్లి వచ్చి అబ్బా సమాధి ముందు నిలబడి దువా చేసిండు.

    అబ్బా యాద్‌లన్ని మూగినయ్. అబ్బా బతికుంటె తమకిన్ని పరేశాన్లు రాకపొయ్యేటివి అనుకుంట ఖబ్రస్తాన్ బయటికి నడిషిండు.. సల్మా ఇంటికి పోబుద్ది కాలె. బాధగ ఆ గల్లీ దాటేసిండు. చుట్టాల ఎవరింటికైనా ఉత్త కాళ్లతోని ఎట్ల పోవుడు. మెల్లగ ఇంటిదిక్కు నడవబట్టిండు. పొద్దుటి హుషారంత పొయింది. మనసంత సల్మనే నిండి ఉంది. ఆళ్లింటికి పోలేకపోతున్నందుకు ఎవరిమీదనో యమ కోపం వస్తున్నది. తమ పెంకుటిల్లు వచ్చేసింది. గుమ్మానికి కట్టిన పర్దా జరుపుకుంట ఇంట్లకు అడుగుపెట్టిండు.
    బగార అన్నం వండడంలో ఉంది జాని అమ్మీ గోరిమా. 'సలామలైకుమ్ అమ్మీ' అని కాళ్లు మొక్కిండు. వందేళ్లు బతకాలని, వచ్చే రంజాన్‌కల్లా షాది కావాలని దువా ఇచ్చింది గోరీమా. 'ఎవరింటికి పోయి కలవకుంటనే వచ్చినవారా? ఇంత జల్ది వచ్చినవ్' అన్నది మల్ల.
    నీరసంగ మంచం మీద కూలబడ్డడు జాని. 'క్యావ్ బేటా! అట్లున్నవేందిరా?' అన్నది గోరిమా. 'క్యాబినై' అన్చెప్పి ఎనక్కి ఒరిగిండు.
    'ఒక్కొక్కల్లు చుట్టాలు వస్తుంటరు, జల్ది వొంట ఐపోగొట్టాలె' అనుకుంట మళ్ల వంట పనిల పడిపోయింది గోరీమా.

    మంచం మీద ఎల్లకిల్ల ఒరిగివున్న జాని కళ్లనిండ సల్మ అందమైన మొఖమె. సల్మను చూడాల్నని మనసు కొట్టుకుంటున్నది. ఎంత అందంగ నవ్వుతది సల్మ. ఆ ఒక్క నవ్వు చాలు తన బాధలన్ని మర్శిపోతానికి. తన కోసం ఎదురు చూస్తుంటది. ఎట్లనన్న ఎల్లాలె. ఇయాల పండుగ పేరుమీద కలవడానికి పోవచ్చు గాని వేరే రోజులల్ల కారణం లేకుంట పోతాన్కి ఇబ్బంది గుంటది. ఎట్ల? అమ్మీ కాడ ఏమన్న పైసలున్నయేమో అడిగితె...

    'అమ్మీ! ఈద్గాల నా చెప్పు తెగిపొయింది అమ్మీ' అన్నడు మెల్లగ.
    'అయ్యొ! అట్లెట్ల తెగిందిరా!?'
    'ఎవరొ చెప్పు తొక్కేసరికి తెగిపొయిందమ్మీ..'
    'దలిందరరాగి పాడుగాను.. పోనీలేర, కొత్తయ్ కొనుక్కుందువులె.. నా కాడ 15 రూపాలున్నైర. ఎన్నాళ్ల నుంచో దాచి పెడుతున్న. కని 15 రూపాలకు చప్పల్ వస్తయా? రావు గదా...'
    తలుపు బైట సప్పుడు అవడంతోని లేషి పర్దా జరిపి చూసిండు. చాంద్‌మాము వచ్చిండు. 'సలామలైకుమ్ మాము' అన్నడు. 'వాలెకుమ్ సలామ్! ఈద్గాకు రాలేదా? కనబడలె' అనుకుంట అలాయిబలాయి తీసుకున్రు ఇద్దరు. 'వచ్చిన మాము. నేను గుడ మీరు కనిపిస్తరేమొనని చూసిన మాము' అన్నడు జాని.
    'సలామలైకుమ్ ఆపా' అని మాము గోరీమా కాళ్లు మొక్కిండు. ఆమె దువా ఇచ్చింది. కొద్దిసేపు కూసొని షీర్‌ఖుర్మా (సేమ్యా) తాగి ఎళ్లేటప్పుడు గోరీమా చేతిల యాభై రూపాలు పెట్టి పొయిండు చాంద్.

    ఆయన పోంగనె ఆ యాభై రూపాలు జానికిచ్చి చెప్పులు కొనుక్కో పొమ్మన్నది గోరిమా. జాని మనసు ఖుష్షయ్యింది. బైటికి పోబోతుంటె చిన్నమామ ఒక దిక్కునుంచి, కక్కయ్య మరొక దిక్కు నుంచి వచ్చిన్రు. వాళ్లను అలాయిబలాయి తీస్కొని పెద్దమామ ఇంటికి బయల్దేరిండు. మధ్యల 30 రూపాలు పెట్టి మామూలు స్లిప్పర్లు కొన్నడు. సల్మాను చూడాలన్న ఆత్రం ఆగనిస్తలె.
    సల్మ పెద్దమామ బిడ్డ. పెద్దమామ ఇల్లు ఊరికి అటు చివరన ఉంది. దూరం ఉండడంతోని రాకపోకలు తక్కువ. తనే సల్మకోసం పొయ్యొస్తుంటడు. తనంటె తమ ఇండ్లల్ల అందర్కి మంచి గురి. జాని షానా మంచోడు అంటుంటరు. చిన్నప్పుడె అబ్బాజాన్ చచ్చిపోవడంతోని తమ కష్టాలు మొదలైనయ్. అమ్మీ ఎన్ని కష్టాలో పడి ఇద్దరు అక్కల షాదీ చేసింది.

    తను ఎనిమిదో తరగతి దాంకనె చదివిండు. తర్వాత ఇగ ఇల్లు గడవక అక్కల పెళ్లిళ్లకు అమ్మీ చేసిన అప్పులు అట్లనె పెరుగుతుండెసరికి ఏం చెయ్యాల్నో తొయ్యక అమ్మీ తనను టాక్టర్ మెకానిక్ షెడ్‌ల పనికి పెట్టింది. ఇటు పని నేర్చుకోవొచ్చు.. నెలకొచ్చే జీతంతోని ఇల్లు నడుస్తది. పొద్దున్నె 8 గంటలకె పోవాలె. రాత్రి ఎంతయితదో తెలియదు. ఇంట్ల అమ్మొక్కతె. తన షాదీ చేస్తె తనకు కోడలు తోడుంటదని అమ్మీ పోరుతున్నది. తనకేమో సల్మానె చేసుకోవాల్నని ఉంది. ఆ విషయం అమ్మీకి చెప్పిండు.

    'నువ్వు ఏం కోరనోనివి! కోరక కోరక కోరిన కోర్కె తీర్చలేనారా? నాగ్గూడ ఆ పిల్ల మీదనె ఉందిరా.. నీగ్గాకపోతె ఎవరికిస్తడు? టైమొచ్చినప్పుడు అడుగుత' అన్నది.
    అదయినంక ఒకసారి సల్మా వాళ్లింటికి వెళ్లినప్పుడు 'నేనంటె నీకిష్టమేనా సల్మా?' అని షానా కష్టపడి అడిగిండు.
    సిగ్గుతోని కళ్లు దించుకుని ఇష్టమె అన్నట్లు తల ఊపుకుంట పక్క అర్రలకు ఎల్లిపొయింది సల్మా. అప్పట్నుంచి మరింత ఆత్రం ఎక్కువైంది తనకు. ఎట్లనన్న ఈ ఏడాదే సల్మను చేసుకోవాల్నని పడ్డది..
    సల్మ ఇంటి తలుపు ముందు ఆగి గొళ్లెం సప్పుడు చేసిండు. సల్మా వచ్చి తలుపు తీస్తె బాగుండు అనుకున్నడు. సల్మ తమ్ముడు హనీఫ్ తలుపు తీసిండు.
    'సలామలైకుమ్ భాయ్‌జాన్!' అన్నడు హనీఫ్.
    'వాలేకుమ్ సలామ్!' అనుకుంట తనను దగ్గరికి తీసుకుని అలయ్‌బలయ్ ఇచ్చి భుజం మీద చెయ్యేసి లోపలికి నడుచుకుంట ఎల్లిండు.
    సాయమాన్ల మామి (మేనత్త) కనిపించింది. సలామ్ చేసిండు. ఆమె వాలెకుమ్ సలామ్ చెప్పుకుంట 'ఆవొ జాని! అమ్మీ ఎట్ల ఉంది?' అనడిగింది.
    'బాగుంది మామి. మీకు దువా చెప్పమన్నది' అన్నడు జాని. 'మాము (మామ) ఈద్గా నుంచి రాలేదా?' అని అడిగిండు మల్ల. 'వచ్చి, మల్ల రహమత్‌నగర్‌కు పొయిండు. అక్కడ నాకు వరుసకు అన్న అయితడు, ఆ అన్న వాళ్లింట్ల కలిసి వస్తనన్నడు' అన్నది మామి. వాళ్ల వరుసకు అన్న అయ్యే వాళ్లింట్ల కలిసి వస్తానికి పొయిండా.. తమ ఇంటికి రాకుంటనే..!? అనిపించింది జానికి.
    'కూసొ జాని, షీర్‌ఖుర్మా తెస్త' అనుకుంట వంట అర్రలకు పొయింది మామి.

    కుర్చీల కూసున్నడు జాని. కళ్లు సల్మా కోసం ఎతుకుతున్నై. తాను వచ్చినట్లు సమజ్‌కాంగనె ఉరుకొచ్చే సల్మా.. తనను చూడంగనె కళ్లు, మొఖం ఎలిగిపొయ్యే సల్మా- ఎక్కడుందా అని ఒకటె ఆత్రంగ చూడబట్టిండు. తను కూసున్న సాయమానుకు ఎడమ దిక్కునున్న అర్రల ఉండేది సల్మా. మరి ఆ అర్రకు పర్దా ఏలాడుతున్నది. అది తొలగించుకుని ఎందుకు సల్మా వస్తలేదో సమజ్‌కాలె జానికి. ఎవరన్న సహేలీలను కలవడానికి పోయిందా.. అయ్‌న తను వస్తానని ఎదురుచూస్తుంటది కదా, అట్లా పోదు కదా.. అనుకుంట సోంచాయిస్తున్నడు జాని. హనీఫ్‌ని దగ్గరికి పిలిషిండు. 'సల్మా ఏది?' అని చిన్నగ అడిగిండు. లోపలుంది అని అర్ర దిక్కు సూపిచ్చిండు హనీఫ్. బైటికి రమ్మను పో అని చెబుదామని చూసిండు జాని. అంతల్నె మామి ఒక ఖటోరా ల సేమ్యా తీసుకొని సాయమాన్‌లకు వచ్చి జానికి ఇచ్చింది. సేమ్యా చేతిలకు తీసుకుండు జాని.

    కాని ఏ రంజాన్‌కైనా, బక్రీద్‌కైనా తానొస్తే తనకు సేమ్యా సల్మా అందించేది. నిండైన మెరుపులు మెరుపుల కొత్త బట్టలతో పెద్ద వోనీతో తెల్లని గుండ్రని నవ్వు మొఖంతో సేమ్యా అందించడానికి సల్మా తన దగ్గరగా వచ్చేసరికి ఆ దగ్గరితనానికే ఆ సువాసనకే మనసు తేలిపోయేది. తన చేతితో అందించిన సేమ్యా తాగుతుంటే అమృతం తాగుతున్నట్లే తోచేది. కొద్ది దూరంలోనే నిలబడి తన్మయంతో తనను చూస్తూ తన అమ్మీ గురించో, తన ఆపా ల గురించో అడుగుతూ ఉంటే ఎక్కడలేని ఆనందంతో జవాబులిస్తూ ఆ అందమైన కళ్లల్లోకి కళ్లు కలుపుతూ ఉండేవాడు.

    పై మాటలకు తెలియని మౌన భాష ఏదో తమ మధ్య నడుస్తూ ఉండేది. అ లాంటి సల్మా కనిపించకుండానే సేమ్యా తీసుకొని తాగాల్సి రావడం ఎట్లనో తో చింది జానికి. మామి అదో ఇదో అడుగుతుంటే కష్టంగా జవాబు లిచ్చుకుంట షానా సేపటికి ఒక చంచా సేమ్యా నోట్లోకి తీసుకుండు. తాగబుద్ధి అయితలె. ఏం చేయాల్నో తోస్తలె. అట్లనే సేమ్యా చేతిల పట్టుకుని మాటిమాటికి సల్మా ఉన్న అర్ర దిక్కు సూడబట్టిండు. ఎందుకు సల్మా బైటికి వస్తలేదో సమజైతలేదు జానికి. ఇంతల ఇంకెవరన్న 'ఈద్ మిల్నే' (పండగ సందర్భంగ కలవడానికి) వచ్చేస్తే ఆయింత రాదు, ఎట్ల? అని పరేషాన్ అవుతున్నడు.

    ఈ పిలగాడు షీర్‌ఖుర్మా తాగకుండ అట్లనె కూసున్నడేంది, ఎంతసేపు కూసుంటడు, అవతల తనకు ఇంకా వంటపని కాలేదాయె అనుకుంట నిలబడ్డ మామి, జాని మాటిమాటికి సల్మా ఉన్న అర్ర దిక్కు సూస్తుండడం గమనించింది. సంగతి సమజైంది మామికి. కొంచెం ఇబ్బందిగ అటు ఇటు కదిలింది. ఇగ ఉండలేక అసలు సంగతి చెప్పింది-

    మొదలు, 'షిర్‌ఖుర్మా తాగవేంది పిలగా?' అన్నది. జాని తడబడ్డడు. సేమ్యా తాగడం మొదలుపెట్టిండు. మల్ల అన్నది మామి- 'నాకు వరుసకు అన్నయితడన్న కదా.. ఆళ్ల కొడుకు సౌదీల ఉంటడయ్యా! ఈ సంవత్సరం రెండు నెలలు సెలవు పెట్టి వచ్చిండు. వాళ్ల అమ్మానాన్న షాదీ చెయ్యాల్నని అనుకున్నరు. మన సల్మాను ఇవ్వమని అడిగిన్రు. పిల్ల ముద్దుగుంది, కట్నం పెద్దగ ఏమొద్దన్నరు. షాది గ్రాండుగ చెయ్యాలన్నరు. పిలగాడు మంచోడు.

    సౌదీల ఉన్నడు, చదివి కూడ ఉన్నడు అని మీ మాము ఎంటనె ఒప్పుకున్నడు.. ఒక నెల లోపల్నె షాదీ చెయ్యాలయ్యా! ఏమనుకోవద్దు, మీకు చెప్పలేదని.. జల్దిల నిశ్చయమైపొయింది.. మీ మాము మీ అమ్మికి వచ్చి చెప్త నన్నడు.. ఇయాల చెప్తడు కావొచ్చు. మన పిల్ల ఏ పరేషాన్లు లేకుంట బతకాలనె అనుకుంటం గదా.. అదిగాక ఇయాల్రేపు కట్నం ఎక్కువ అడగకుంట ఎవరు చేసుకుంటరు చెప్పు.. మీ మాముకేమొ అంత తాహతు లేదాయె..' చెప్పుకుపోతున్నది మామి, బిడ్డ షాదీ కుదిరిన ఖుషీల...జానికి గుండె ఆగినంత పనైంది. మామి చెప్పేది ఇగ ఏమీ ఎక్కుత లేదు.

    అంటె సల్మాకు మరొకరితొ షాదీ ఖరారైపొయిందన్నమాట! అనుకునేసరికి కళ్లల్ల గిర్రున నీళ్లు తిరిగినయ్.. సుడులు సుడులుగా ఇంకా ఊర్తనే ఉన్నయ్. సేమ్యా చేదుగా అనిపించింది..టేబుల్ మీద ఆ సేమ్యా ఖటోరా పెట్టేసి ఝట్‌న లేషి దబదబ బైటికి నడిషిండు.. మామి పరేషానై 'ఏంది పిలగా, చెప్పకుంటనె అట్ల ఎల్లిపోతున్నవ్?' అంటున్నది. తలుపు దాటి బైట అడుగుపెట్టిండు జాని. బోరున ఏడుపు తన్నుకు వచ్చేసింది.. ఏడ్సుకుంటనే దబదబ ఎటు దిక్కు నడుస్తున్నడొ గుడ సూసుకోకుండ నడవబట్టిండు...

    Tuesday, 31 August 2010

    పహ్‌లా గులాబ్ హీ పహ్‌లా కాంటా!

    సైకిలేసుకొని టౌనంతా చక్కర్లు కొట్టేది
    నూనూగు మీసపు నా తొలి యవ్వనం

    కాలేజీ బెల్లవ్వగానే రోడ్డంతా గులాబీలు
    చూపుల దారం చాలేది కాదు...

    బెదురు బెదురుగా పారిపోయే ఒక కల- కాంచనమాల
    అలలు అలలుగా ఉబికే సెలయేటి పాట- లెనీనా
    పెంగ్విన్‌ పక్షిలా కదిలిపోయే ఒక జరీనా బేగం

    ఎన్ని జంటల కనుపాపల్లో కాపేసే వాళ్లమో...!


        ***
    నువ్వు తారసపడ్డ తొలిరోజు
    నీ  కళ్లుండే చోట
    రెండు సుందర ప్రపంచాలు దొరికాయి నాకు

    ... ముఖం కేంద్రంగా నీ దేహం
    ఒక సౌర కుటుంబంలా తోచేది ...

    గల్లీ చివర నువ్వు - వెనుదిరిగి చూసిన రోజు
    మనసు మానస సరోవరమై
    మంచుఖండాల అంచులు దాటింది
    సంశయించీ.. సందేహించీ.. అధైర్యించీ.. చివరాఖరికీ
    నిన్ను పలకరించిన రోజు
    నీ నవ్వు నయాగరాలో తానమాడాను

    కనురెప్పకింద నా కలల పాపల్లే అల్లరి పెడుతుంటే
    పక్కమీద ఎంతగా దొర్లేవాడినో...
    తెల్లారి చూస్తే పైజమాపై రాత్రిలేని ఓ తెల్లపువ్వు !

        ***
    కాలేజ్  రోడ్లోకి మళ్లగానే నీ కళ్లల్లో
    నేనో మెరుపు మొగ్గనై...
    కళ్ల పడగానే లయ విరిగే నా గుండెల్లో
    పెరిగిన శ్వాసవై...

    ఎన్ని కాంతి సంవత్సరాల్ని ఈదాకో
    పూదోట సుబూత్ గా
    నేనందుకున్న తొలి గులాబీ సాయంత్రం
    మన మధ్య ఓ నాలుగు పాలపుంతలు దొర్లిపోయాయో లేదో
    నా పేరు విడమర్చగానే
    సూర్య నక్షత్రం చప్పున ఆరిపోయి
    నా నిషానూ మెరుపునీ స్వప్నదరహాసాల్నీ
    బ్లాక్‌హోల్ లా లాక్కుని వెళ్లిపోయిన
    నీ చివరి చూపుకి ఛిద్రమై
    S..K...Y..O..U..S..U..F...B..A..B..A..

    Friday, 13 August 2010

    జల్ జలా

    కవిత్వమౌతూ... కాయితాల కింద జలాంతర్గామి నవుతూ... నాడి కొట్టుకుంటున్న శవాల మధ్య దీపక్రిమి నవుతూ... అలజడి... బేచైనీ... జల్ జలా... పకాల్న నవ్వుతున్న అశ్లీలుడి శీల చిత్రాలు... మంటల్లో సరస్వతి ఆర్తనాదం... డ్రాయింగ్‌ షీట్లు... ప్రామిసరీ నోట్లు... ఇల్లమ్మి కట్టమని అరుస్తూ అప్పులోడు... 'ఘున్ గురూకీ తరా బజ్ తాహీ రహా హూ– మై–'... గదిలోకి ముడుచుకు పోతూ - కవిత్వంలోకి విచ్చుకుంటూ... వత్తిడి... తలలో నరమేదో మెలితిప్పినట్టు... ఏదోలా తగలబడమంటుంది లోకం... కమలం - మంటై చుట్టుకుంది ఖైరొద్దీన్ని... నిలువునా ఎగిసిన ఆర్తరావం... చోద్యం చూసే ఒక్కడికీ సెగ అంటదే–... కుచ్ ఫాయిదా నహీ–... చివరి ఆశతో ప్రాణాన్ని మోసుకు పరుగెత్తుతున్న పఠాని సూట్ వాలా... వెనక కాషాయంలో పొర్లిన ముళ్ల పందుల మంద...
    పక్కింట్లో మూత్రానికి లేచిన శవం... కలుక్కుమన్న గుండె గుల్ మొహర్ కింద గడియారం ముల్లు... గుండెలపై గుభిల్లున కూలుతున్న మజీదు గుమ్మటాలు... ఖమీజ్ లు బుర్ఖాలు బలాత్కారంగా పేలికలౌతుంటే సొంతగూడనే నమ్మకపు నయనంమీది తెరలు చిరుగుతూ భీతిల్లిన ఆప-బహెన్‌-అమ్మీ... నమాజ్ చివర... జువాల గుంపులు...


    ధడేల్మంది పక్కింటి తలుపు... పిలుస్తుందేమో... సందులో దుడ్డుకర్ర నడిచెళ్తున్న చప్పుడు... వేడి-తపన-బేచైన్‌... స్వస్తిక్‌ కత్తులకి తెగి రక్తం కాలవలో గొడ్డులా గింజుకుంటున్న ఇమ్రాన్‌... విజయవర్ధన్ - చలపతి మొఖాల్లో ఆకులు రాలిన అడవులు... తూటాకు 'జంగు సైరన్‌' స్వరం మారిందా...
    WE WANT TELANGANA!.... 'Vidarbha!' ....
    WE WANT KASHMIR!... కళేబరాలు కదుల్తున్నాయ్... కల గంటున్నాయ్ ...
    అబ్బాజాన్‌ అరుస్తున్నడు - 'చేతకానితనం' మీద... ఎప్పటికో నిద్ర పట్టే అమ్మీ మొఖంలో మాంసాన్ని చెక్కుకున్నది మేమేగా... పవిత్రంగా అల్లిన కలలకట్ట ముడి తెగి గాల్లోకి కొట్టుకుపోతున్న రెమ్మలు... ఖురాన్‌ ఉనికికే రుజువు లేదంటున్న ఈజిప్టు తత్వవేత్త హనాఫీ... ఐఎస్‌ఐ గూండాని కానని ఓ యూసుఫ్  కరెంట్  షాక్‌ అరుపు...
    అలజడి... జల్ జలా... భ–వర్ ... దీపక్రిమి కఠోరంగా జ్వలిస్తూ... కుదిపేస్తున్న వొక వుజ్జెమ ఆవేశం... ఉద్యుక్తమౌతూ... ముందు నడుస్తున్నది సద్దాం హుసేనా... వెంట ఓ ఐ సి  సేనలు... అమెరికా పరిగెడుతోంది - భూగోళం అవతలి వైపుకి...
    islamic contries are one!
    ISLAMIC CONTRIES ARE ONE!!
    అవునూ... నా కలవరింతలేనా ఇవీ...
    ఇరాన్‌ ముల్లాలపై - బుర్ఖా విసిరేసి బాతూలిబ్రహీం యుద్ధ ట్యాంక్‌ నడుపుతూ... తరాల కసి... ఫిర్భీ ముర్దే జాగ్‌తే నహీ–... ఆఫ్ఘన్‌ చెహ్‌రేపే తాలిబాన్‌ నఖాబ్... టర్కీమే మాసూమ్‌ కలియోంకే బీచ్ పర్దా...
    అలజడి... కలవని ఆలోచనా తంత్రి గమకాలు గమకాలుగా - ఏ సున్నిత చర్మపు పొరో ఒరుసుకొని... ... ...
    ముద్దు ముద్దై - చెమట ముద్దై ఒకరి ఒడిలో ఒకరు సేదతీరే నిశ్చింత నిశి...

    అనిశ్చితి... Depression... నిన్న పలకరించిన తెల్లటి కవ్వింపొలికిన లిప్‌స్టిక్‌ నవ్వు-లో... ప్రేయసితో గడిపిన ఎన్నెన్ని ఉద్రేకిత అనుభవ జాడలో... ఆప్త మిత్రులకూ-నాకూ ఖండాంతరాలు... 'అబ్బాస్‌తోనే సర్వర్ ని హత్య చేయించడం కుట్రేనంటావా...' పెదాలు బొగ్గు సుద్దలౌతూ... ఓఫ్‌... గుండె చెమ్మమీద ఎంతకూ చెదరని అమ్మాయి ఐస్‌క్రీం చూపు... చప్పున - నీళ్లెత్తుకొస్తూ తడిచీర కింది ఎదురింటి యవ్వన శిల్పం...
    నిలువెల్లా సంచలనం... జల్ జలా... ఇంకా దాపరికాలేమిటి... తప్పదు... తల్పులు బిగుసుకు ఎండిన ఏరులా వెక్కిరిస్తున్న గల్లీ... ఊ–హూ–... ... ఇక బాత్రూమే... ... ...
    కేకలు... డప్పుల చప్పుడు... ఈ భూమిని పేలికలుగా చింపి విసిరికొట్టాలి...
    'భారత దేశాన్ని దళితుల దేశంగా ప్రకటించాలి'...
    'దేవుళ్లలో ఒక్కడన్న దళితుడే లేకపాయె...' పంతులుగారూ...
    ఉమ్‌మ్‌మ్హ్‌మ్హ్‌... ఉమ్‌మ్‌ మ్‌మ్హ్‌మ్హ్‌... ... శిగాల హోరు...
    తడితడిగా లిప్‌స్టిక్‌ నవ్వు - ఐస్‌క్రీం చూపు - యవ్వన శిల్పం...
    చీకటి చాటున తలపుకొచ్చిన వెన్నెల ముద్దల్ని నలుపుతూ...
    నరాల్లోంచి నిష్క్రమించిన - అలజడి...
    బయట కుక్కల ఏడుపు... ఫూల్ సా బచ్ పనా... చుబ్ తీ జవానీ... ఔర్  కిత్ నే దిన్‌ యే జబర్దస్తీ... కేరళ మస్జిద్‌మే జనానాకీ జమాత్... ముర్దే జాగ్‌నే లగే...
    యాపమండలు ఝుళిపిస్తూ నడుస్తున్న మైసమ్మ -ముత్యాలమ్మ -పోలేరమ్మ...
    మగస్వాముల పునాదుల పెకిలింపు...
    అంటరాని జాతంతా లేస్తోంది - నల్ల సముద్రమై...
    వెంట సూదర్ల ఊరేగింపు...
    రంజాన్‌ చంద్రుళ్ల కవాతు...

    బేచైనీ... కాయితాల మీద వ్యోమనౌక నౌతూ...
    పీనుగై నిద్రపోతున్న ప్రపంచాన్ని చుడుతూ... ...

                              12.09.97 ఆంధ్రజ్యోతి వారపత్రిక, 'జల్ జలా'ముస్లింవాద కవితా సంకలనం (1998) నుంచి

    Friday, 9 July 2010

    జగ్‌నే కీ రాత్

    ఎదురుచూపుల కాలానికి
    కొట్టుకుపోతున్న సుర్మా కళ్ళ
    యవ్వనమంతా...

    జగ్‌నే కీ రాత్!

    పసి చేతులే పనిముట్లై
    బాల్యం రుచి ఎరుగని 

    బచ్ పన్‌ అంతా...
    జగ్‌నే కీ రాత్!

    గరీబీని వారసత్వంగా ఇచ్చిన
    నెరిసిన టోపీల దుపట్టాల
    వ్రుద్దాప్యమంతా...

    జగ్‌నే కీ రాత్!
       
    భూగోళం పక్కమీద అటు కాసేపు సోంచాయిస్తూ..
    అశాంతిగా ఇటుమళ్ళి కాసేపు బేచైనౌతూ..
    మనసు పగిలే వొత్తిడి
    దిగ్గున లేపి కూర్చోబెడితే
    ఇరాకీల మాంస ఖండాలతో
    కాగితాలన్నీ తడిసి ముద్దయ్యాయి
    తెల్లోడి పెట్రో దాహానికి 

    సంవత్సరాల పొడుగూతా
    ఇరాకీల జిందగీల్లో
    జగ్‌నే కీ రాత్!


    మగతలో నడుస్తున్నాను
    గుజరాత్
    కాలిన కూలిన గోడల మధ్య
    విద్యుద్దీపం ఆర్పేయబడింది
    అక్కడొక చిమ్నీ ఇక్కడొక చిరాగ్‌
    కాలుతున్నది ముసల్మానుల రక్తం
    నెలవంక నెత్తురు కాగుతున్నది
    మనుషుల్ని సజీవంగా తగులబెట్టిన
    బూడిద కుప్పల మధ్య -
    గాల్లో కలిసిపోయిన
    తల్లులూ చెల్లెళ్లూ పసిపిల్లల
    ఆర్తారావాల మధ్య -
     


    కాలిన కూలిన గోడలూ మనుషుల మధ్య
    ఎవరికైనా ఎలా నిద్ర పడుతుంది
    జీవితాల్లో ఇక శాశ్వతంగా
    జగ్‌నే కీ
    రాత్!
    నడుస్తూ నడుస్తూ
    న్యాయ దేవత గంతలు విప్పుతున్నాను
    ఊర్లల్లో గింజలు చల్లుకుంటానికి
    గింత జమీన్‌ లేదు
    చేతులాడడానికి వృత్తుల్లేవు
    రోడ్లకు రెండు పక్కలా
    మొత్తుకుంటున్నారు టోపీవాలాలంతా

    చాయ్.. రిక్షా.. మేవా.. హరేక్‌మాల్..
    కడుపు కొట్టుకుంటూ అరుస్తున్నారు
    ఒక్కసారి జుమే
    రాత్ బజార్ కి వస్తారా
    ముసల్మానుల జిందగీలన్నీ
    అమ్మకానికి పెట్టబడ్డాయి
    ఒక్కసారి పాత బస్తీ -లు
    'తురక' గల్లీలు తిరిగి చూస్తారా
    కనిపించేదంతా జగ్‌నే కీ
    రాత్!

    ఆకుపచ్చ రక్తంతో కన్నీళ్లతో
    ప్రపంచ పటమంతా తడిసి ముద్దయ్యింది
    తలుచుకుంటే ఒంట్లో రక్తం
    పెట్రోల్ బావిలా మండుతున్నది

    ఈ సుదీర్ఘ రాత్రికిక నిద్ర లేదు
    ఈ జిందగీ ఇప్పుడొక జగ్‌నే కీ
    రాత్!

    Thursday, 24 June 2010

    ఇంతెజార్

    అందరూ బాహ్య సౌకుమార్యాన్ని కోరుతున్నారు
    నేను అంతర్ కోమలాన్ని వెతుకుతున్నాను
         *
    అందరూ మల్లెల గురించి మాట్లాడుతున్నారు
    నేను నీ గురించి ఆలోచిస్తున్నాను   
         *
    నా ఊహలపై తారాడే సీతాకోకవు
    నిన్ను అందుకునే సున్నితత్వ సాధనలో ఉన్నాను

        


    ఒక్కోసారి వెతుక్కుంటూ ఉంటాను
    నన్ను పంచుకుంటానికి ఊహ ఉండదు దేహముండదు
         *
    నా మనసు పడ్డ ఇష్టాలను
    లోక విరుద్ధమంటూ దూరం చేసి సంబరపడుతుంటారు
         *
    లోకం చుట్టిన ఒక్కో పొరా విడిచి నగ్నమయ్యాను
    చేపలూ సీతాకోకలూ నాతో స్నేహించాయి
         *
    నీ నిరీక్షణలో కళ్ళ కింద ముడుతలు పడుతున్నాయి
    నాకు నచ్చిన నువ్వు ఇంకా ఎదురుపడనే లేదు
         *
    అక్కడే నిలబడి ఎదురుచూస్తున్నాను
    లోకమంతా తిరిగి నేనే నయమని వస్తావని...

    Friday, 21 May 2010

    లతీఫ్ షా వలి దర్గా - ఏక్ కాలీ చుమ్టీ


    ఛోటా బడా ఖిలోనాల్లో ఖిలోనానై
    రంగుల్ రంగుల బుగ్గల్లో బుగ్గనై...
    నా చిన్ని చేతిల్నుంచి
             అమ్మీ బుర్ఖా అంచు జారిపోయి...

    ఝండీ నుంచి తెగిన ఓ బుగ్గ లేచింది గాల్లోకి ...
                *                      *
    భర్దొ ఝోలి  భర్దొ
    ఝోలి భర్దొ ఝోలి మేరీ
        యా మొహమ్మదూ
        లౌట్కర్ మై నా జావూంగా ఖాలీ...
    ఖవాలీ రికార్డుల ఓలలాటల్లోంచి
    మర్ఫా మోత
    తాషా ఉత్తుంగ తరంగ హోరు
    అగో  గంధ మొస్తున్నది  
    సందల్ సందడి ...
    జనం వరద -అలల్లెక్క పొంగుతూ
               వెనక్కి నెట్టుకుంట లాఠీల కరకట్టలు
    నన్నెత్తుకున్న మా మొఖ్తార్  మామ ఈదుకు పోతూ
    సందల్  ముట్టుకొని కళ్ళకద్దుకున్న
               నా ముఖం చమ్కిన యాద్‌ ...
    రాతిరి ఖవ్వాలి జాగారం
    పహాడ్‌కా దామన్‌ - పెంగ్విన్‌ చుడియో కె బీచ్ ...
                         *
    పహ్‌లా కమాన్‌కాడి మెట్టుని మొక్కి
    కన్పించని అల్లా లెక్క కన్పించే ఫకీరు
    కశ్కోల్ ఘల్ మనిపించి
    మోర్చల్ కట్ట దుఆ - కంతలకు ఊది తోడ్కొని
    అట్లా పైకి చూస్తే
    నల్లనల్లని గుట్టకు సున్నంకొట్టిన బాటేసినట్లు -
    కొండ పతంగానికి
    అతికించిన తోకలా మెట్లు!
     

    ఫకీర్లను పలకరిస్తూ బరువు తగ్గే లాల్చీ జేబు
    ఉరికురికి మెట్లెక్కుతూ అలుపొచ్చి ఆగి వెనక్కి తిరిగితే
    పైకెక్కే కొద్దీ చిన్నవవుతూ గుట్టచుట్టూ బొమ్మరిళ్ళు
                             ఖిలోనే నన్హే మున్హే సే...
    ముతక గుడ్డలోల్లూ గడ్డాలూ
    బుర్ఖాలూ
    గుట్ట మెట్లెంట నల్లచీమల బారు...!
    వో దేఖో....
    ఝండా ఎత్తుకు పై కురుకుతున్న బచ్ పనా
    ఎర్రని కుచ్చు - హరా త్రికోణం
    మజ్జెల మెరుస్తో చాంద్‌ సితారా...
    అమ్మీ పిలుస్తున్నది - యాడ పడతనోనని
    చాంద్‌ మా అమ్మీ!
    నేనే సితారా ...

    తెల్లని షేర్వానీ - ఆకుపచ్చ తలపాగా
    దర్పంగా నిలబడి చూస్తుంటది దర్గా !
    గుడి అంటని
    ఇక్కడి మట్టిబిడ్డల కాడికే
    నడిచొచ్చిన దేవుళ్ళు సూఫీలు!
    చుట్టూ మూడుసార్లు తిరిగి
    లోపల ఫాతెహా లిప్పిచ్చుకొని
    మోకాళ్ళపై కూర్చొని మజార్ పై తల ఆన్చితే
    ఓహ్‌ ..
    పూల చాదర్ల ప్రాణవాయువు
    లేస్తే కమ్మటి వాసనతో ఊద్‌
    సుడుల్లోంచి బైటనె నిలబడ్డ అమ్మీ రూపం
                
    పరేశాన్లన్ని దూరమైతే
    ఝండా ఎక్కించి న్యాజ్ చేస్తనని
            మన్నత్ చేసిందంట భోలీ అమ్మీ !
    ఆఖరిసారి ఎక్కించిన ఆకుపచ్చ ఝండా
    చీకిపోయింది  మా అమ్మీ కలలాగే...
                            *                  
    ఖరాబై ఎంతకూ పాడని సీటీ - అబ్బాజాన్‌
    బల్లెపీటమీద నడుపుతుంటె విరిగే జీపుగిల్ల - ఛోటాభాయి
    గోడకు తగలకుండనె రబ్బర్ దారం తెగిన లాయిలప్ప - బహెన్‌
    జిందెగీ పిచ్చిబంతాటల పగిలిన చెండు - నేను
              *                         *
    గాల్లోకి లేచిన కలలబుగ్గ ఫట్ మని పగిలింది

    ఝట్ న మళ్ళా
    బుర్ఖా పట్టుకొని తిరుగుతుంటే
    ఆశ్చర్యంగా చూసిన ఆ రెండు చందమామల్లోకి
    అనుమానంగా చూస్తూ నా చిట్టి నీలాలు
    కౌన్‌ హై బాబా తుమ్‌ ?
    నఖాబ్ తొలిగిన ప్రశ్నకు
    నా బుడ్డ అభిమానం దెబ్బతిని
    గిరుక్కున వెనుతిరిగి చూస్తే
    అన్నన్ని
    బుర్ఖాల్లో మా అమ్మీ బుర్ఖా ఏదీ...?!

    Monday, 3 May 2010

    పెద్దగుట్ట దర్గా-తెలంగాణ ముషాయిరా

    పెద్దగుట్ట.. షాదుల్లా బాబా దర్గా! ఎంత ఇంట్రస్టింగ్‌ స్టోరీ! మనకు రామదాసు గురించి తెలుసు. అలాంటిదే కానీ అందుకు భిన్నమైన ఈ చారిత్రక కథ ఎందుకు తెలీదు? తెలియకపోవడం వెనక- అర్థం చేసుకోవాల్సింది ఎంతో ఉంది. తానీషాల కాలంలో రామదాసు భద్రాచలంలో ప్రజల నుంచి వసూలు చేసిన కప్పం రాజుకు అప్పజెప్పకుండా రామాలయం కట్టించాడు. అందుకు జైలుశిక్ష అనుభవించాడు. మరి పెద్దగుట్ట ఏరియాలో నిజాంల కాలంలో షాదుల్లా అనే మహానుభావుడు వసూలైన కప్పం కూడా రాజుకు అప్పజెప్పకుండా కష్టాల్లో ఉన్న పేదలకే పంచిపెట్టాడు. వసూలు చేయడం దాటవేశాడు. దాంతో రాజుకు కోపం వచ్చింది. ఒక్కరిని ఇలా వదిలిపెడితే అందరూ రకరకాల కారణాలు చెప్పి ఇలా ఏదో ఒకటి చేసే అవకాశం ఉందని షాదుల్లాను పట్టుకురమ్మని సైనికులను పంపించాడు. షాదుల్లాకు సైనికులకు మధ్య యుద్ధమే జరిగింది. బహుశా షాదుల్లాను వాళ్లు చంపి ఉంటారు! కాని ప్రచారంలో ఉన్న కథ మాత్రం- సైనికులతో షాదుల్లా ఒక కర్రతో యుద్ధం చేశాడని, చివరికి ఆ కర్రను భూమిమీద కొట్టడంతో భూమి రెండుగా చీలిందని, అందులోకి దూకి మాయమయ్యాడని చెబుతుంది. జానపద కథల్లో హీరోగాని హీరోయిన్‌గాని చనిపోవడం ఉండదు. అలాంటి పరిస్థితే వస్తే వాళ్లు మాయమయ్యారని చెబుతారే తప్ప చనిపోయారనో, చంపబడ్డారనో చెప్పడానికి జానపదులు ఇష్టపడరు. (ఉదాహరణకు సమ్మక్క, సారక్క) బహుశా షాదుల్లా విషయంలోనూ అదే జరిగింది. షాదుల్లా మీద ఇలాగే కొన్ని కథలు ప్రచారంలోకి వచ్చాయి. కాకపోతే పెద్దగుట్ట మీద షాదుల్లా మజార్‌ (సమాధి) ఉంది. దాని పక్కన కొంచెం ఎడంగా ఆయనకు పాలు పోసే సాలవ్వ సమాధి కూడా ఉంది. కాని విషాదం ఏమంటే- అంత పెద్దగుట్ట ఎక్కి షాదుల్లాను దర్శనం చేసుకున్నాక- అక్కడ వసతులేమీ లేకపోవడం బాధేస్తుంది. అది పెద్దగా జనం రాని పుణ్యక్షేత్రమా అంటే అదీ కాదు.. ఆ చుట్టుపక్కలా, పక్కనే ఉన్న కర్ణాటక ప్రాంతం నుంచీ పెళ్లయిన ప్రతీ జంట షాదుల్లా ఆశీస్సుల కోసం దర్గాను దర్శనం చేసుకుంటుంది. పెళ్లి కాని అమ్మాయిలు పెళ్లి కావాలని మొక్కుకుంటానికి వస్తుంటారు. రాత్రిళ్లు వచ్చి అక్కడ నిద్ర చేస్తారు. చుట్టుపక్కల చాలా దూరాల నుంచి తమ కోర్కెలు తీరుతాయో లేదో తెలుసుకోవడానికి ఎంతోమంది వచ్చి అక్కడ నిద్ర చేస్తారు. రాత్రి కలలో కనిపించి షాదుల్లా బాబా తాము అనుకున్న పని అవుతుందో కాదో, లేదా ఇంకా ఏదో ఒక విషయం చెబుతాడు. ఆ పని కాదనుకుంటే అసలు షాదుల్లా బాబా కలలోకే రాడు అని వారందరి నమ్మకం.
    శుక్రవారం న్యాజ్‌ (కందూరు) చేయడానికి ఎన్నో బృందాలు అక్కడికి వస్తుంటాయి. ప్రతి సంవత్సరం అక్కడ పెద్ద ఎత్తున ఉర్సు (జాతర) సాగుతుంది. వెరసి మొత్తంగా ప్రతి ఏడాది వఖ్ఫ్‌ బోర్డు పాడే పాటలో ప్రస్తుతం కోటి నలభైరెండు లక్షలకు ఎవరో ఒకరు దర్గా రాబడిని పాడుకుంటారు. అంటే కోటి నలభైరెండు లక్షలు వక్ఫ్‌బోర్డుకు చెల్లించి ఆ పైన వచ్చే ఆదాయాన్ని పాడినవారు ఉంచుకుంటున్నారంటే ఎంత ఆదాయమొస్తుందో ఊహించుకోవచ్చు. అంత డబ్బు ఆదాయంగా వచ్చినప్పటికీ షాదుల్లా బాబా దర్గా పరిసరాల్లో వసతులేమీ లేవు. మంచి నీళ్లు కూడా కొనుక్కొని తాగాల్సిందే. గుట్ట మీద ఒక్కటంటె ఒక్క సిమెంట్‌ కప్పు లేదు.. దర్గాకు కూడా పైన కప్పు లేదు. రేకులు ఉన్నాయి.. ఇదేమీ చిత్రం!
    ఇదంతా మాకు ఎలా తెలిసిందంటే.. ఏప్రిల్‌ 18వ తారీఖున నిజామాబాద్‌ జిల్లా పెద్దగుట్ట (బడా పహాడ్‌) లో ఉర్దూ-తెలుగు ముస్లిం కవులతో 'తెలంగాణ ముషాయిరా'కు వెళ్లాం. గుట్ట పరిసరంలో ఓ పెద్ద టెంటు వేసి ముషాయిరా జరిపారు నిర్వాహకులు సిహెచ్‌ మధు, నరహరి, మామిళ్ల సాయిరెడ్డి తదితరులు. హైదరాబాద్‌ నుంచి నాళేశ్వరం శంకరం, స్కైబాబ కలిసి కొంతమంది ఉర్దూ-తెలుగు కవుల్ని తీసుకెళ్లారు. బహుశా తెలంగాణ చరిత్రలో తెలంగాణ ముషాయిరా జరగడం ఇదే మొదలు కావచ్చు. ఉర్దూ కవులు వేరే లోకంగా ఉండడం, వారితో తెలుగువారికి ఏమీ సంబంధాలు లేకపోవడం తెలిసిందే. వారిని కలుపుకొని తెలుగు ముస్లిం కవులతో ముషాయిరా జరగడం, అదీ ఒక దర్గా దగ్గర జరగడం విశేషం.

    ఎందుకంటే- ఈ మధ్యకాలంలో దర్గా సంస్కృతిపై నీలినీడలు అలుముకుంటున్నాయి. హిందూత్వవాదం చాపకింద నీరులా పెరుగుతుండడంతో దర్గాల దగ్గరికి వచ్చే కొందరు హిందువులు తగ్గిపోతున్నారు. అట్లే ముస్లింలకు సంబంధించి కొన్ని మతసంస్థలు (జమాత్‌లు) దర్గాల దగ్గరికి పోవడం సరైంది కాదంటూ ప్రచారం చేస్తుండడంతో కొందరు ముస్లింలు కూడా వెళ్లడం లేదు. దీనివల్ల దర్గాలకు వెళ్లే హిందూ-ముస్లింల కలగలుపు సంస్కృతి తగ్గిపొయ్యే ప్రమాదం ఏర్పడింది. దర్గాలు ఈ దేశంలో హిందూ-ముస్లింల మత సామరస్యానికి ఒక ప్రతీకగా ఉన్నాయి. ఈ సంస్కృతిని కాపాడుకోవాల్సిన అవసరముంది. ముందు ముందు దర్గాల దగ్గర సభలు, సమావేశాలు జరుపుకోవాలని ముస్లిం రచయితల వేదిక నుంచి మేము గతంలోనే అనుకొని ఉన్నాం. నా సంపాదకత్వంలో తీసుకువచ్చిన 'అలావా' ముస్లిం సంస్కృతి కవితా సంకలనంలోనూ దర్గా సంస్కృతికి సంబంధించి చాలా కవితలున్నాయి. అందుకే పెద్దగుట్ట దర్గా దగ్గర ఈ ముషాయిరా జరగడం విశేషమే.
    ఇదొక చారిత్రక ముషాయిరా అని వక్తలు మళ్లీ మళ్లీ పేర్కొన్నారు. వెళ్లినవారిలో మగ్దూం మొహియుద్దీన్‌ కొడుకు నుస్రత్‌ మొహియుద్దీన్‌ ఉండడం విశేషం. ఉర్దూ కవి అయిన నుస్రత్‌ ఈ ముషాయిరాలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన్ను చూస్తుంటే మగ్దూంను చూస్తున్నట్లే ఉందని ఫీలయ్యారు నిర్వాహకులు, సభికులు. అలాగే హైదరాబాదీ ఫేమస్‌ పెయింటర్‌ సయ్యద్‌ బిన్‌ మొహమ్మద్‌ కుమార్తె జమీలా నిషాత్‌ పాల్గొనడం మరొక విశేషం. ఆమె జాతీయంగా, అంతర్జాతీయంగా ఉర్దూలో ప్రముఖ కవయిత్రి. వీరిద్దరితోపాటు స్కైబాబ, నిసార్‌, అలీ, మాజీద్‌, అహ్మద్‌ పాషా, సిరిసిల్ల గఫూర్‌ శిక్షక్‌ తదితర ఉర్దూ-తెలుగు ముస్లిం కవులు పాల్గొన్నారు. అట్లే నాళేశ్వరం శంకరం, సిహెచ్‌ మధుతోపాటు దేవకీదేవి, కందుకూరి శ్రీరాములు, సిహెచ్‌ ప్రకాశ్‌, సూరారం శంకర్‌, జనజ్వాల తదితర తెలుగు కవులు పాల్గొన్నారు. ఇంకా చాలామంది తీవ్రమైన ఎండ కారణంగా రాలేదు. బగార అన్నం, యాట కూరతో మధ్యాహ్నం దావత్‌ అదిరింది. ముషాయిరా ముగిసాక అందరం పెద్దగుట్ట ఎక్కడానికి వెళ్లాం. కొందరు కింద ఆగిపోగా ఎక్కువమందిమి ఆడుతూ పాడుతూ గుట్ట ఎక్కాం. పైన చెప్పుకున్న విషయాలన్నీ తెలిశాయి. చీకటి పడుతుంటే గుట్ట దిగుతుంటే నిద్ర చేయడానికి ఎంతోమంది గుట్ట ఎక్కుతూ కనిపించారు. ఒక పది, పదిహేను మంది సెల్వార్‌ ఖమీజ్‌లు ధరించిన ముస్లిం అమ్మాయిల గుంపు ఒకటి టార్చ్‌లైట్లు పట్టుకొని పైకి ఎక్కుతుండడం కనుల విందు చేసింది...
    విషాదం ఏమంటే- గుట్ట పైకి మెట్ల దారిలో అటువైపు ఇటువైపు చిన్నచిన్న గుడిసెలు.. అందులో ఉన్న మనుషులు.. ఎక్కువ గుడిసెల్లో ఒక్కొక్కరే ఉండడం ఆశ్చర్యం వేసింది. పరిస్థితిని అర్థం చేసుకుంటే ఎక్కడలేని బాధేసింది. చాలా గుడిసెల్లో ఏ ఆధారమూ లేని ముసలివాళ్లు, తమ బిడ్డలు పోషించలేక వదిలేస్తే అక్కడ పడి ఉన్నవాళ్లు, ఏదో ఒక రోగంతో బతుకీడుస్తున్నవాళ్లు గుడిసెల బయట కూర్చుని అడుక్కుంటున్నారు. కొందరు అలా పడుకోబెట్టి ఉన్నారు. దిక్కులేని వారికి దేవుడే దిక్కు అంటే ఇదే కావచ్చు.. వారి దీనమైన ముఖాలు.. వారి ఒంటరితనం.. లోకుల బాధ్యతారాహిత్యం.. ఆ కొద్ది సమయంలో ఏం చేయాలో తెలియని.. గుండెల్ని పిండేసే బాధ మనసుల్లోకి ప్రవేశించి అలాగే మస్తిష్కాలపై గూడు కట్టుకొని నిలిచిపోయింది!
                                                                                                                                - స్కైబాబ

    Tuesday, 23 March 2010

    షాయరీ

    కవిత్వం
    పొందిచ్చిన వాక్యాల విచ్ఛిత్తి
    పేర్చిన పదాల మధ్య అలజడి
    ఎగిసే అక్షరాల ఆందోళన
    కవిత్వం-ఉద్యమం పర్యాయపదాలు

    కవిత్వం- జొన్నరొట్టెల రుచి
    నోట్లో ఊరే పచ్చి చేపల పులుసు
    బీద బతుకుల ఆసరా
                   అంబలి-సంగటి-గట్క
    జీవి గుంజే హైదరాబాదీ బిర్యానీ

    కవిత్వం- బోనం ఎత్తుకున్నది       
    బోనం మట్కీల మధ్య శిగమూగుతున్నది
    రంగుల్‌రంగుల పూలన్నిట్నీ ఒక్కటిచేసి
                       బతుకమ్మ ఆడుతున్నది       
    అస్సోయ్‌దూలా పాడుతూ
                      నిప్పుల గుండం తొక్కుతున్నది
    రోడ్డుమీదే సహపంక్తి భోజనమయ్యింది
    కవిత్వం- గోడమీది నిలువెత్తు కచ్చా స్లోగన్‌
    దండుబాట మీద సబ్బండ జాతుల కోలాటం
    వాగ్గేయకారుడి నాలుక చివరి వాయువేగం
    కణకణ మండే డప్పు సూర్యుడి మీద
                   చిందేసే చిర్రా చిటికెన పుల్ల
    ఉద్యమకారుడి కంటి ఎరుపు- లేచిన పిడికిలి

    జవాన్ల కరకట్టల్ని ఛేదించే జనప్రళయం
    ఉద్యమ ఉత్ప్రేరకమైన చదువుల బడి
    ఎగుస్తున్న విద్యార్థులే జెండాలు
    కాలబడుతున్న ఒంటిలోంచి
    సానబట్టిన కత్తిలా దూసుకొస్తున్న నినాదం
    మనసున్న కన్నులోంచి దూకుతున్న అశ్రుకణం
    అవును
    కవిత్వం ఇవాళ తెలంగాణ
                                       - స్కైబాబ

    Thursday, 25 February 2010

    తెలంగాణ చాంద్తార

     తెలంగాణ ఉద్యమం చాలా ఉధృతంగా నడుస్తున్నది.  తెలంగాణ వాళ్ళమంతా అందులో మునిగి ఉన్నాము. మిగతా ఏ విషయాలూ ఆలోచించే స్థితిలో లేము. ఇలాంటి సందర్భం ఇలా మా ముందుకు రావడం, ఇంత పెద్ద ఉద్యమం మేము చూడగలగడం మా అదృష్టమే. ఈ సమయం లో బ్లాగ్స్ అప్డేట్ చేసేందుకు కూడా మనసు పోవడం లేదు. చాలా రోజులయింది.. ఓ ౧౦  తెలంగాణ చాంద్తార లు పంచుకుందామని..
         ***
    పోటీ పడేది బుడుబుంగ పిట్టా నేనూ
    ఇప్పుడు నీళ్ళతో పాటు అన్నీ మాయం
        ***
    ఎండిన ఏటి పక్క రైతు
    ఎదురుచూపులో చూపు పోయింది
         ***
    గూడు కట్టిద్దామనుకున్నానామెకు
    పొడి ఇసుక ఎక్కిరించింది
         ***
    ఒడ్డున నడుస్తున్నం
    ఏటి లెక్కనే ఎన్ని అనుమానాలో భవిష్యత్తు మీద
         ***
    ఒక రేక కల్లు పట్టిచ్చిన
    సూరీడు తెల్ల మొఖమేసిండు
         ***
    చేపల పులుసు తలపుకొస్తే
    ఎండిన చెరువుల నీళ్ళు నోట్లె ఊరబట్టె
         ***
    జాన్పాడ్ దర్గా చుట్టు జానయ్యలు సైదమ్మ లే
    బోసి నుదుళ్ళ జాతర
         ***
    పట్న మొచ్చి శానా ఏళ్ళయ్యింది
    నెల పొడుపును ఊళ్లె ఒదిలి
         ***
    చాన్నాళ్ళకు కలిసిన దోస్తు కు అలైబలై ఇవ్వబోతి
    త్రిశూలం గుచ్చుకుంది
         ***
    చిన్నప్పుడు గీసుకున్న బొమ్మలన్నీ అలాగే
    ఒక్క నేను తప్ప
                                          - స్కై బాబ

    Wednesday, 6 January 2010

    రోడ్డు ఉద్యమం అడ్డా

    నేను మళ్ళీ రోడ్డు మీది కొచ్చాను
    భగాయించి నువ్వు ఇంట్లో నక్కినవ్
    రోడ్డు ఇవాళ నినాదమైంది 
    రోడ్డు ఇవాళ ర్యాలీ ఐంది
    రోడ్డు ఇవాళ రాస్తారోకో ఐంది
    రోడ్డు ఇవాళ బంద్ కి ప్రతిబింబమైంది
    రోడ్డు అసెంబ్లీ ముట్టడి కి దారి చూపింది
    రోడ్డు ఇవాళ నన్ను పొదువుకొని 
    నీపై రాళ్ళు విసిరికొట్టింది 
    నీ బహుఅందమైన కలల్ని
    భళ్ళున బద్దలు కొట్టింది 
    నేను ఒక్క పిలుపునిస్తే 
    నువ్వు ఎక్కడికక్కడ జామ్
    నేను నినదిస్తే 
    నీ గుండెలు పిక్కటిల్లాయ్
    నేను మళ్ళీ రోడ్డు మీది కొచ్చాను

    గ్రహించావా 
    నీ మదిలో కట్టుకున్న గోడే
    నువ్వు నా ప్రాంతానికి రాకుండా 
    రోడ్డు మీద అడ్డుగోడై లేచింది

    నా నాడీమండలం రోడ్డు
    ప్రవహిస్తున్న ఉడుకు నెత్తురు నేను
    రోడ్డు నా పూర్వీకులు తొలిచిన తొవ్వ
    రోడ్డుమీదికి నడవకుంటే రక్తచలన ముండదు నాకు
    గుమిగూడందే గుంపులో కలవందే దినం గడవదు నాకు
    రోడ్డు నా అడ్డా 

    రోడ్డు మీద పుట్టినోళ్ళ నుంచే
    ఉద్యమకారుడు ఉద్భవిస్తాడు 

    రోడ్డు మీద తిరిగిన వాళ్ళల్లోనే 
    ఉద్యమకారుడు ఉరకలేస్తాడు  
    రోడ్డు మీద బైటాయించిన వాడి నుంచే
    ఉద్యమ రక్తం చింది పడుతుంది 
    రాతిముక్కను ఆయుధం చేయడం తెలుసా నీకు
    ఉద్యమకారుడికి తెలుసు
    రోడ్డును ఉద్యమానికి వేదిక చేయడం తెలుసా నీకు
    ఉద్యమకారుడికి తెలుసు 
    రోడ్డు మీదికొచ్చిన ఉద్యమకారుడు ఒక్కడే
    ఒక్కొక్కడే వందలు వేలు లక్షలవుతాడు 
    నీకు చేతనవుతుందా ?
    రోడ్డు మీద నడిచినవాడివే కదా 
    రోడ్డుని అవమానిస్తావా ?
    రోడ్డు నా అమ్మరా !
    రోజూ పలకరిస్తుంది నన్ను
    నా ఎతలన్నీ తెలుసు దానికి 
    నా నిరసనకి ఇంత చోటునిచ్చింది 
    నా ఆందోళన లన్నింటికీ ప్రతిబింబమైంది 
    ఉద్యమానికి అద్దమైంది

    ఉద్యమించడం చేతకానివాడా!
    మాకు ఉద్బోధలు చేస్తావా?
    రారా ! నీకూ నాలుగు నినాదాలు నేర్పిస్తా 
    నా రక్తం లో సోడా కలుపుకొని తాగి జోగుతున్నవాడా!
    మత్తు దిగి తెరుచుకున్న నీ కన్ను మీద
    తెలంగాణ పటం ప్రతిబింబమవుతుంది 
    అందులో నా హైదరాబాద్ 
    కోహినూరై మెరుస్తుంది
                                      - స్కై బాబ