Monday 1 April, 2013

తెలుగు కథపై సరికొత్త దస్తూరి 'అధూరె'




''తెలంగాణ తెలుగు రచయితల మనో ప్రపంచంలోంచి ముస్లింలు గల్లంతు కావడమే వారి దుస్థితిని తెలియజేస్తుంది. తమ సూఫీ విలువలతో స్థానిక జీవన విధానాన్ని, రీతిని ఎంతగానో పరిపుష్టం చేసిన ముస్లిం జన సమూహం తిరిగి తమ ఉనికి గురించి తామే చెప్పుకోవల్సి రావడం విచారకరం.''

సీమాంధ్ర పాలక వర్గాల ప్రతినిధిగా 1983లో టిడిపి అధికారం చేపట్టి వలసీకరణకు, వనరుల దోపిడీకి తలుపులు బార్లా తెరిచిన తర్వాత తెలంగాణలో జరిగిన పరిణామాలు విశిష్టమైనవి. అందులో రెండు మరీ ముఖ్యమైనవి. 1.జగిత్యాల జైత్రయాత్ర తీసుకొచ్చిన స్థానికత, దాని దరిమిలా చెలరేగిన తెలంగాణ భాషా చరిత్రల చర్చ. 2.కారంచేడు సంఘటన దరిమిలా ముందుకొచ్చిన దళిత, స్త్రీవాద ఉద్యమాలు ముందుకు తెచ్చిన వివక్ష. వీటి దరిమిలా రూపుదిద్దుకున్న ముస్లిం సాహిత్య ఉద్యమం విలక్షణమయ్యింది. ఈ ఉద్యమాలు ముందుకు తెచ్చిన ప్రశ్నలు, అందిచ్చిన ప్రేరణ తెలంగాణ సమాజపు గతం, వర్తమానం, భవిష్యత్తుపై పునరాలోచనకు దారులు వేశాయి. ఒక రకంగా వర్తమాన తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి తాత్విక భూమికను సమకూర్చిపెట్టాయి. ఈ క్రమంలో ముస్లిం సాహిత్య ఉద్యమం నిర్వహించిన పాత్ర విలువైనది. ఏడు వందల ఏళ్లుగా ఉర్దూ, ఫారసీ భాషా సంస్కృతుల ప్రమే యం వల్ల కావచ్చు స్థానిక సూఫీ సాంస్కృతిక సంప్రదాయాల వల్ల కావచ్చు తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ముస్లింల సాహిత్య ఉద్యమం రేపిన చర్చ ఒక నైతిక శక్తిని ప్రసాదించింది.

కోస్తా కమ్మ, బ్రాహ్మణ స్త్రీల స్త్రీవాదానికి భిన్నంగా, దళితవాదంలో అంతర్లీనమైన అధికార రాజకీయాల ప్రచారాన్ని కాదని, తెలుగు భాషా సంస్కృతుల ఆధిపత్యం కింద అణగారిపోయే తమ జీవితాలను, దాని వైరుధ్యాలను చిత్రిస్తూ రచనా రంగపు బలివితర్థిమీదికి ఒక అల లా, మరో పిడిగు పాటులా వచ్చిపడింది. ప్రసిద్ధ రచయితలు సామల సదాశివ, సుజాతారెడ్డి, సినారె, దాశరథి రంగాచార్య, వరవరరావు, దిలావర్ వంటి రచయితలను కూడా ప్రభావితం చేసింది. శతాబ్దాల తరబడి తెలంగాణలో పరిఢవిల్లిన గంగా జమున తహజీబ్ (ఉమ్మడి సంస్కృతి)పై పునరాలోచించీ చైతన్యపూర్వకంగా రచనకు ఉపక్రమించేలా వారిని ప్రేరేపించింది.

ఏ రచనకైనా ఒక సామాజిక సందర్భం అనివార్యం. అది రాజకీయ, సాంస్కృతిక ఆచరణలో భాగంగా ఉండాలి. ఈ రోజు ప్రధానంగా తెలంగాణ, తెలుగు రచయితల ఆమోదం పొందిన ఈ ఉద్య మ నేపథ్యం, పుట్టుక చాలా కష్టతరమయ్యింది. రామ జన్మభూమి-బాబ్రీ మసీదు వివాదం సందర్భంలో ముస్లింలంటే దేశద్రోహులనీ, సంఘవ్యతిరేక శక్తులన్న ప్రచారం ఒకవైపు, లేదంటే రాజకీయాలలో పావులుగానో, ఓటర్లుగా చూసే స్థితి ఒకవైపు. ఈ పరిస్థితులలో తెలంగాణ కేంద్రంగా ముస్లిం సాహిత్య ఉద్యమం తలెత్తింది. తొలుత దళిత, తెలంగాణవాదుల నైతిక మద్దతుతో మొగ్గ తొడిగిన ఈ ఉద్య మం ప్రధాన స్రవంతితోపాటు, అన్ని వాదాల రచయితల మద్దతు పొందడం ఒక చారిత్రాత్మకమైన పరిస్థితి. తొలినాళ్ల ముస్లింవాదంపై వచ్చిన విమర్శలలో ప్రధానమైనవి కవితలో, కథలో వారు ఉపయోగించిన శైలి, తెలుగు ఉర్దూ కలగలిసిన భాష. తెలుగు రచయితలే కాదు, ముస్లిం రచయితలు కూడ ఆ తరహా వైఖరిని వ్యతిరేకించారు. ఈ పేరుతో మొత్తం ఈ సాహిత్య ఉద్యమానికే గండి కొడుదామని చూశారు. ఈ పరిస్థితులలో ఓపికతో ఈ ఉద్యమాన్ని నిలబెట్టి, దాని లో ప్రధాన పాత్ర వహించిన రచయిత స్కైబాబ. ఆయన కవితా రచనతోపాటు, కథా రచన చేసినప్పటికీ పుస్తకాలు వేసుకోవడంలో ఆల స్యం వల్ల కొంత నష్టం జరిగిందనే చెప్పాలి. 13 ఏళ్ల కిత్రం స్కైబాబ రాసిన రెండు కథలు 'ఖిబ్లా', 'ఛోటీ బహెన్' తెలుగు కథా ప్రపంచంలో సంచలనమే. ఇప్పుడు లబ్దప్రతిష్ఠులైన ముస్లిం కథా రచయితలు ఈ తరహా భాషతో అభివ్యక్తితో స్కైబాబ తర్వాతే రాశారు.

నిజానికి తెలంగాణలో తెలుగు ఉర్దూ సాహిత్యంలో ఇదొక బలమైన సంప్రదాయం. కులీఖుతుబ్షాతో మొదలైన దక్కనీ కవితలో ఉర్దూ తెలుగు మాటలు కలగల్సి ఉంటాయి. తెలంగాణ ప్రసిద్ధ రచయితలు సురవరం, కేశవస్వామి, దాశరథి, సినారె తెలుగు ఉర్దూ మాటలు కలగలిసిన మిశ్రమ భాషలో అనేక రచనలు చేశారు. ఈ భాషలో దాశరథి అనేక గజళ్ళు రాశారు. తెలంగాణలో బలమైన రచనా సంప్రదాయంగా ఉన్న ఈ ధోరణిని స్కైబాబ, అతని అనుయాయులు పునరుద్ధరించారనే చెప్పాలి.
తెలంగాణే కాదు, ముస్లిం సాహిత్య ఉద్యమం కూడ బలహీనపడుతున్న కాలమిది. ఈ సందర్భంలో తాను రాసిన కథల సంకలనం 'అధూరె' వెలువరించడం ఆహ్వానించ తగ్గది. ఆ ఉద్యమాలను తిరిగి బలోపేతం చేసే 'అధూరె' కథలకు ప్రత్యేకత చాలా ఉంది. ఇది ప్రయోగం వల్ల, కల్పిత కథన రీతుల విన్యాసం వల్ల, నఖిలీ భాషా పాటవంతో సరికొత్తగా రాద్దామనుకోవడం వల్ల వచ్చింది కాదు. తమదైన జీవితాన్ని, నిత్యం చుట్టుముట్టే వైరుధ్యాలను, ఉన్నదున్నట్టుగా చలనంలో పట్టుకుని దాని ఘర్షణను, సంక్షోభాన్ని కథనం చేసిన రచనలివి. ఇప్పటితరం కథా రచయితలు చాలామంది

ఏదో ఒక వాదాన్ని నిరూపించడానికో, ప్రయోగం పేరుతో, ఎవరినో మెప్పించడానికో, మంచో చెడో ఉద్దేశాల నిరూపణకు రాసేవాళ్లే. ఈ తరహా రచనా తీరుపై మహాకవి చలం ఏనాడో అభ్యంతరం చెప్పి ఉన్నారు. ఈ తరహా రచయితలలో అత్యధికులు సీమాంధ్రకు చెందినవాళ్లే. ఇటువంటి వాతావరణంలో తాను రాసినవి, రాస్తున్నవి కథలేనని వాటికి సాహిత్య ప్రతిపత్తి ఉందని నమ్మి పుస్తకం వేయడం సాహసమే. ఇలా ఎందుకంటున్నానంటే- కథా సిరీస్ (నవీన్-పాపినేని) రాజకీయాలవల్ల చాలామంది తెలంగాణ కథారచయితలు భీరిపోయి రాయడమే మానుకున్నవాళ్లు ఉన్నారు. 'అధూరె'లోని కథలు ఆ పుస్త కం వచ్చేనాటికి ఒక్కటి కూడా 'కథ' సిరీస్‌లో రాలేదు. ఆ సిరీస్‌లో ఈ కథలు వేయకపోవడంలోనే ఉంది రచయితగా స్కైబాబ విజ యం. జీవితం తప్ప 'కట్టుకతల పనితనం' ఇందులో లేదని సిరీస్ నిర్వాహకులు అనుకుని ఉండవచ్చు. ఈ మేరకు సీమాంధ్ర సాహిత్య వ్యూహాలను కాదని, వారి ప్రమాణాలను త్రోసిరాజని వచ్చిన సంకలనమిది. పిడికెడుమంది తప్ప తెలంగాణ, ముస్లిం, దళితవాదుల కథలేవీ ఈ సిరీస్‌లో రాలేదు. 'అధూరె'సంకలనం చూసిన తర్వాత వాద మేదైనా తెలంగాణవారి కథలు అందులో రాకపోవడమే మంచిదయిందనిపిస్తుంది. ముస్లిం, దళిత, తెలంగాణవాదుల కథలని తిరస్కరించి వాసిరెడ్డి-పాపినేనిలు తమ ప్రమాణాలు వేరనీ, తాము వేరని మరింత రూఢీచేశారు. అందుకే ఆధిపత్యం, అవకాశవాదంతో లుకలు కలాడే కథా సిరీస్‌పై తిరుగుబాటుగా వచ్చింది 'అధూరె' సంకలనం.

భారతీయ సాహిత్యంలో మహా కథకులుగా పేరుగాంచిన రచయితలు- బాబూరావు బాగుల్, వైకమ్ మహమ్మద్ బషీర్, అల్లం రాజయ్యలను, వారి సంప్రదాయాలను తెలిసో తెలియకో స్కైబాబ అనుసరించాడు. ప్రస్తుత పరిస్థితులలో ఇంపీరియలిస్ట్ అమెరికన్ సాంస్కృతిక దాడికి స్థానికత నుంచి వచ్చిన జవాబు 'అధూరె'. జాతీయోద్యమ కాలంలో భారతీయ రచయితలు బ్రిటిషు వలస వాదానికి, సామ్రాజ్యవాద దుర్నీతికి ఇదే తరహా జవాబు ఇచ్చారు. 'అధూరె' పేరుతో తెలంగాణ ఇచ్చిన జవాబు కూడా అటువంటిదే. 'అధూరె' కథలలో చోటుచేసుకున్న ఆడవాళ్ల జీవితం తెలుగు కథాప్రపంచంలోనే కొత్తది. దైన్యం, నిస్సహాయత తప్ప వారికి ఏ అండా ఉండదు. చలం రచనలలో అవసరమైతే తిరగబడే మహిళలు, కొకు కథలలో మధ్యతరగతి చైతన్యంతో తమ జీవితాన్ని మార్చుకునే పాత్రలు తారసపడతాయి. వాళ్లంతా బ్రాహ్మణ భూస్వామ్య కుటుంబాలకు, అగ్రకులాలకు చెందినవాళ్లు కావచ్చు. వారికి ఆ వెసులుబాటును చరిత్ర, వాళ్లు పుట్టి పెరిగిన పరిస్థితులే కల్పించాయి. కానీ 'అధూరె' మహిళలకు ఏ అండా ఉండదు. పైగా మగపెత్తనం, సాంప్రదాయపు సంకె ల. చదువు, ఆస్తి అసలే ఉండవు. రాజ్యం వల్ల ఒనగూరే ప్రయోజనాల ప్రస్తావన ఈ కథలలో ఎక్కడా ఉండదు. కేవలం తమ పరిస్థితులలో బతకడంలోని సంఘర్షణ మాత్రమే ఉంటుంది. ఈ కథల్లోని ప్రతి తల్లి దైన్యంతో నిస్సహాయంగా జీవించడం కనిపిస్తుంది..

అమెరికా, మీడియానే కాదు, ఆంధ్రా సినీ పరిశ్రమ యావత్తు ముస్లింలను దుష్టులుగా చిత్రించే ప్రయత్నం చేస్తున్న కాలమిది. వాటికి జవాబుగా వాళ్ల జీవన విధానం, రీతి రివాజుల గురించి తెలియచెప్పడం ద్వారా కథకునిగా స్కైబాబ సరైన వైఖరిని తీసుకు న్నట్లు అనిపిస్తున్నది. వాటికి సమర్ధింపేమి ఉండదు. ఐతే వాటి ఆచరణలో ముస్లిం సమాజం ఎదుర్కొనే ఘర్షణ, సంఘర్షణల ను, సంతోషాన్ని, కష్టసుఖాలను కలబోసుకోవడం ఉంటుంది.రాజ్యం, ఇతర ముస్లిమేతర సమాజాల నుంచి ఎటువంటి తోడ్పాటు ఆశించక, సమిష్టిగా తమ కష్టాలను కడతేర్చుకోవడం కూడా కనిపిస్తుంది..

రచయిత ఎటువంటి వాదాల, మూసల ప్రభావంలో పడకుండా కథలను జీవితానికి నిబద్ధం చేస్తూ కథ నడపడం విశేషం. తెలంగాణ పైనే కాదు, ముస్లింవాదంపై చెలరేగుతున్న ప్రచారాలను, అపవాదులను కాదని జీవితాన్ని నిష్కర్షగా బేరీజు వేసుకుంటే తప్ప రచయితకు ఇటువంటి రచన సాధ్యం కాదు. తెలంగాణ రచయిత సీమాంధ్ర ప్రమాణాలను సంప్రదాయాలను ఆధిపత్యాన్ని కాదని తన స్వీయ అభివ్యక్తితో రచన చేయడానికి ఉపక్రమించినప్పుడల్లా ఆ ప్రాంతపు రచయితల నుంచి తీవ్రమైన ప్రతిఘటన వచ్చింది. వారి మార్గంలో నడిచినపుడు వాళ్లు నడిపే ఉద్యమాలలో భాగంగా ఉన్నప్పుడు మాత్రమే తెలంగాణ ముస్లిం, దళిత రచయితలకు ప్రతిష్ట, మన్నన లభించింది. ఈ సాహిత్య రాజకీయాలను ఆధిపత్య వ్యూహాలను కాదని తన స్వీయ అభివ్యక్తిని సాధించుకున్న రచయిత స్కై బాబ. ఇది ఒక రకంగా తెలంగాణ సాహిత్య ఉద్యమం, అం దులో ప్రధాన భాగమైన ముస్లింవాదం సాధించిన విజయం. ఇటువంటి సాహిత్యం విస్తృతంగా వెలువడితే తప్ప తెలంగాణ మనిషి లేదా ముస్లిం, దళితవాదులు ఆధిపత్యవాదులు- సీమాంధ్ర పాలక వర్గాలను, మధ్యతరగతిని ఎదుర్కోవడం సాధ్యం కాదు.

'శ్వేతరాత్రులు' (సంకలనం) నుంచి తెలంగాణ కథా రచయిత చేసిన పయనానికి ఉన్నత స్థాయి ప్రతిఫలనం 'అధూరె'. ఆంగ్లంలోకి తర్జుమా అయిన ఉర్దూ కథలు, సురవరం, కేశవస్వామి, ఆళ్వారు, దాశరథి వంటి రచయితలు రాసిన కథలు చదివిన నాకు అధూరె కథలు చదివినప్పుడు చాలా తేడాలు స్ఫురించాయి. స్కైబాబ ముస్లిం సమాజానికి ఇన్‌సైడర్. ముస్లింలలోని అట్టడుగు వర్గాల జీవితాన్ని తీసుకుని కథలు రాసిన వ్యక్తి. ఆ సమాజాన్ని అర్థం చేసుకుని వారి విలువలు, జీవన రీతిని చిత్రించడంలో ఒక ఇన్‌సైడర్ అయితే ఒక రకంగాను, అవుట్ సైడర్‌గా మరో రకంగానూ ఉండడం విశేషం. ఇటీవల 'నల్లగొండ జిల్లా కథలు' చదివినప్పుడు ఒక పరిణామం కనిపించింది. 1900-1956-60 వరకు వచ్చిన కథలలో కొన్ని మినహాయి స్తే ఎక్కడో ఒక దగ్గర ముస్లిం పాత్ర కనిపిస్తుంది. తెలంగాణ సామాజిక సంబంధాలలో వాళ్లకంటూ ఒక పాత్ర ఉంటుంది.

వాళ్లు అందు లో అవిభాజ్యమైన భాగం. ఎక్క డా వాళ్లను దుష్టులుగా చిత్రించే వైఖరి కూడా ఉండదు. 1960 నుంచి అంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడి న తర్వాతే ఇటీవల వరకు వచ్చిన కథలలో ముస్లింల పాత్రలు లేవు. హైదరాబాద్ రాష్ట్రం చీలిపోవడం, అధికార భాషగా ఉర్దూ రద్దు కావడం, పైగా పోలీస్ యాక్షన్ జరగడం తెలిసిందే. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కావడానికి ఈ పరిణామానికి ఏమైనా సంబం ధం ఉన్నదేమో ఆలోచించాలి. తర్వాత కూడా తెలంగాణ జీవన విధానంలో ముస్లింలు అంతర్భాగమైన విషయమై కథలు రాసిన వారిలో నెల్లూరి కేశవస్వామి, దాశరథి రంగాచార్య మాత్రమే ఉన్నా రు. తెలంగాణ తెలుగు రచయితల మనో ప్రపంచంలోంచి వాళ్లు గల్లంతు కావడమే వారి దుస్థితిని తెలియజేస్తుంది. తమ సూఫీ విలువలతో స్థానిక జీవన విధానాన్ని, రీతిని ఎంతగానో పరిపుష్టం చేసిన ముస్లిం జన సమూహం తిరిగి తమ ఉనికి గురించి తామే చెప్పుకోవల్సి రావడం విచారించదగ్గ విషయం. ఈ నేపథ్యంలో ముస్లిం రచయితలు, కవులు, స్కైబాబ కృషి ఎన్నదగింది.

అధూరె చదువుతుంటే భారతీయ సాహిత్యంలో ప్రసిద్ధి గాంచిన ఇప్టా రచయితలు గుర్తుకువచ్చారు. ఉర్దూ సాహిత్యంలోనే ఆపాగా పేరుగాంచిన ఇస్మత్, హైదరాబాద్‌కు చెందిన వాజిదా తబస్సుం, జిలానీ బానోలు, కె.ఎ.అబ్బాస్, కిషన్ చందర్, రాజేందర్‌సింగ్ బేడీలు, మంటో ముస్లింల జీవితాలను చిత్రించినవారిలో ప్రముఖు లు. వారి రచనలన్నీ, ప్రధానంగా కథలు ఉన్నత, మధ్యతరగతి వర్గాల జీవితాలను చిత్రించినవే. సమస్యలు కూడా వారివే. అయితే వీరిలో ముస్లిం ఫ్యూడలిజం కింద అణగారిపోయినవారి గురించి కథలు రాసిన వారిలో కొందరున్నారు. అది కొంతవరకే. అట్టడుగు వర్గాలు, గ్రామీణ ముస్లింల గురించి రాసింది తక్కు వే. బషీర్ ఇందుకు కాస్త మినహాయింపు. ప్రేంచంద్ ముస్లిం రైతులు, స్త్రీల గురించి చాలా రాశారు. చిన్న పట్టణాలలో అవీ ఇవీ పనులు చేస్తూ అర్బన్ ప్రొలిటేరియట్ గురించి కథలు రాసిన వారి లోస్కైబాబ ప్రత్యేకంగా నిలు స్తారు. తెలుగు సాహిత్యంలో ఇటువంటి కథలు రాసినవారిలో పెద్దిభొట్ల, అల్లం రాజయ్య, తుమ్మేటి ఉన్నారు. చిన్న చిన్న పట్టణాలలో వ్యవస్థ నుంచి ఎటువంటి మద్దతు లేకుండా అసహాయంగా మారిన స్త్రీల గురించి రాసినవారిలో స్కైబాబ ప్రథములనే చెప్పాలి..

1901-10 మధ్యకాలానా ఆనాడు పెల్లుబికిన స్వదేశీ ఉద్యమం ప్రభావంతో చాలా నవలలే వచ్చాయి. ముస్లిం రాజవంశాలను దుష్టంగా, నీచంగా చిత్రించే రచనలు అనేకం వచ్చాయి. ఆనాడు బ్రిటీషు వలసపాలకులు, వారి చరిత్రకారులు ప్రచారంలో పెట్టిన భావజాలం దన్నుగా వచ్చినవవి. వాటిని సమీక్షిస్తూ మహాకవి గురజాడ భవిష్యత్తు భారతదేశ పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశారు. మతమహమ్మారి చిచ్చు గురించి హెచ్చరించారు. ఆనాడే ఆయన కనపరిచిన ఆందోళన పరిణామాలు పార్టీషన్ ముందు నుంచి నేటి వరకు చవిచూస్తూనే ఉన్నాం. కానీ ఆయన ఆందోళనకు పరిష్కారం మాత్రం దొరకలేదు. 'అధూరే' చదివితే గురజాడ ఆందోళనకు ఉపశమనం కలిగించే ఆశ జనించింది.

- సామిడి జగన్‌రెడ్డి
94904 91551
http://www.andhrajyothy.com/vividhaNewsShow.asp?qry=2013/apr/1/vividha/1vividha3&more=2013/apr/1/vividha/vividhamain&date=4/1/2013#.UVlfyhfTwb8