Sunday, 26 May, 2013

మిస్ వహీదా (ఈ వారం కథ - AndhraJyothy Sunday)


తెల్లారగట్టనే కరీంనగర్ నాన్‌స్టాప్ బస్ ఎక్కాను. రాత్రి నిద్ర సరిపోలేదు. కళ్లు మండుతున్నాయి.. మూసుకున్నాను- మనసు నిండా వహీదా ఆలోచనలే! ఒక్కసారన్నా చూడని ఆమె రూపం.. ఆమె మాటల్ని బట్టి మనసులో రూపుదిద్దుకున్న ఆమె ఊహారూపం కళ్ళల్లో మెదిలింది. ఆమె పరిచయం రీలులా బస్సుతోపాటు నడుస్తోంది...

ఆఫీసుకి చేరి అన్నీ సర్దుకునే సమయానికి- ఠంచనుగా 11 గంటలకు వహీదా నుంచి మిస్ కాల్ వచ్చేది. నాకు తీరిక దొరగ్గానే ఫోన్ చేసేవాణ్ణి. చేయకపోతే గంటసేపు చూసి మళ్లీ మిస్ కాల్ ఇచ్చేది. అలా గంట గంటకూ మిస్ కాల్ వచ్చేది. తనకు ఆ శ్రమ తప్పిస్తూ ఎక్కువసార్లు మొదటి మిస్ కాల్‌కే ఫోన్ చేసి మాట్లాడేవాణ్ణి. అలా వహీదాతో మాట్లాడ్డం నా జీవితంలో భాగమై ఆరు నెలలు దాటింది. ఈ ఆరునెలల్లోనే వహీదా నాలో మరో సగమైపోయిన భావన కలిగేది. కాని పెళ్ళై ఇద్దరు పిల్లలున్నవాణ్ణి. తనేమో పెళ్లి కాని పిల్ల. మనసులో ఎక్కడో భయంగా ఉన్నా తనతో మాట్లాడకుండా ఉండలేకపోయేవాణ్ణి. తను కూడా నేను ఇంట్లో ఉండి మాట్లాడని రోజు మాట్లాడేదాకా వెంటపడేది. 'కొద్దిసేపు మాట్లాడు నిసార్! ఒక్కసారి నీ గొంతు వింటే చాలు, ఈ రోజు హాయిగా గడిపేస్తాను' అని- మెసేజ్‌ల మీద మెసేజ్‌లు పెట్టేది. ఆ మెసేజ్‌లు మా ఆవిడ కంట్లో ఎక్కడ పడతాయోనని కంగారు పడేవాణ్ణి. మెసేజ్ టోన్ సైలెంట్‌లో పెట్టి అప్పుడప్పుడు చూసి డిలీట్ చేసేవాణ్ణి. ఏదో అదను చూసుకొని బయటికొచ్చి ఫోన్ చేసి కాసేపు మాట్లాడేసి ఇంట్లోకొచ్చేవాణ్ణి. ఆ కొద్దిసేపటికే ఎంత సంతోషపడేదో వహీదా! అలా నా మేల్ ఇగో సంతృప్తి పడేది. ఒక పెళ్లి కాని పిల్ల పెళ్ళై ఇద్దరు పిల్లలున్న నన్ను అంతగా ఇష్టపడ్డం తలచుకుంటే సంభ్రమంగా తోచేది. కాని ధైర్యం చాలేది కాదు.

'నాకు నీలాంటి మనసున్న భర్త కావాలి..' అనే మాట వహీదా నోటి నుంచి చాలాసార్లు వచ్చేది! 'నువ్వు ఒప్పుకోవచ్చు కదా.. నీకు రెండో భార్యగా ఉంటాను. మన మతం ఒప్పుకుంటుంది కదా!' అన్నదొకసారి. అట్ల కుదరదని నేనంటే- 'ఎందుకు కుదరదు? భయమా! మీ ఆవిడతోనా? సమాజంతోనా? ఆవిడతో భయమైతే చెప్పు.. నేనే వచ్చి మాట్లాడుకుంటాను- 'ఆపా (అక్కా)! నేను మీ ఆయనను ప్రేమిస్తున్నాను.. ఆయన లేకుండా ఉండలేను.. ఇందులో ఆయన తప్పేమీ లేదు.. నాకే ఆయనంటే ఇష్టమైపోయింది. మీరు పెద్ద మనసు చేసుకొని ఒప్పుకోవాలి. అందుకు మీరు ఏ షరతులు పెట్టినా నాకు ఓకే. మీరు చెప్పినట్లు నడుచుకుంటాను' ఇలా బతిమాలుకుంటాను.. రానా చెప్పు!' అన్నది వహీదా!
గుండె గుభిల్లుమన్నది నాకు.
'తల్లీ! ఆ పని చేయకు! నువ్వట్లా చిచ్చు పెడితే నా జీవితం చెల్లాచెదురే!' అన్నాను. మరోసారి 'నీకు చెప్పే ధైర్యం లేకపోతే నేనే చెప్తాను ఆపాతో, ఫోన్ ఆమెకివ్వు. లేదంటే తన నెంబర్ ఇవ్వు' అన్నది.

'మీ ఇంట్లో పనిమనిషిగా అవకాశమున్నా చాలు.. అట్లా ఏర్పాటు చేయరాదూ' అని బాధగా వేడుకునేది ఒక్కోసారి.. ఏవీ కుదరవని కోప్పడేవాణ్ణి. ఇట్లా సతాయిస్తే ఫోన్ చేయడం మానేస్తానని భయపెట్టేవాణ్ణి. 'సారీ.. సారీ.. మళ్ళీ అననులే' అని అప్పటికి మాట మార్చేది.

అలాంటి వహీదా నుంచి మిస్ కాల్స్ రావడం ఆగిపోయింది. ఎందుకో అర్థం కాలేదు. ఆ రోజు మా ఆఫీసులో ఓ మీటింగ్ ఉంటే ఆ బిజీలో ఉన్నాను నేను. అవాళ రెండుసార్లు ఫోన్ చేసింది వహీదా. మిస్ కాల్స్ మాత్రమే ఇచ్చే వహీదా ఫోన్ చేస్తుందేమబ్బా అనిపించినా.. మీటింగ్ హడావుడిలో కట్ చేశాను. తర్వాత సైలెంట్‌లో పెట్టేశాను. మీటింగ్ హడావుడి అయిపోయేసరికి సాయంత్రమైంది. ఇంటికి పోయేముందు పాకెట్ లోంచి ఫోన్ తీసి చూసుకున్నాను. వహీదా నుంచి 27 మిస్‌డ్ కాల్స్ ఉన్నాయి.

పరేశానయ్యాను. చూస్తే రెండు మెసేజ్‌లు కూడా ఉన్నాయి. కుర్చీలో కూర్చుండిపోయి మొదటి మెసేజ్ చూసాను. 'నీతో మాట్లాడాలి. అర్జంట్. మళ్లీ మాట్లాడే అవకాశం ఉండదేమో!' అని వుంది. ఎందుకా? అని ఆశ్చర్యమేసింది. రెండో మెసేజ్ చూసాను- 'ఏమీ కనిపించని ఈ దుఃఖంలో ఏమని మెసేజ్ పెట్టను నీకు. నీతో ఒక్కసారి మాట్లాడాలని, నీ గొంతు ఒక్కసారి వినాలని మనసు ఆరాటపడుతోంది. నిన్ను చాలా విసిగించాను కదా.. ఓపికగా నన్ను వినేవాడివి. అందుకు చాలా కృతజ్ఞతలు. ఇకపై నిన్ను విసిగించను. గుడ్ బై నిసార్' అని ఉంది. ఎందుకో అర్థం కాలేదు.. చాలా దుఃఖంగా అనిపించింది. వెంటనే ఫోన్ చేశాను. స్విచ్‌డ్ ఆఫ్ ఉంది. ఏం చేయాలో తోచలేదు. మళ్లీ మళ్లీ ఫోన్ చేసాను. లాభం లేదు. ఏం జరిగి ఉంటుంది.. అనుకుంటే ఎన్నో ఆలోచనలు.. పిచ్చి పిచ్చిగా.. నీరసంగా లేచి ఇంటికి బయల్దేరాను.

తర్వాత వహీదా నుంచి ఫోనే రాలేదు. ఫోన్ చేస్తే అందుబాటులో లేదనే జవాబు వస్తోంది. మరో ఆధారం లేదు, తెలుసుకునేందుకు. అట్లా ఒక వారం గడిచిపోయింది- ఇక ఉండలేకపోయాను. మాటల్లో చెప్పిన వివరాల ప్రకారం వాళ్ల ఊరికి వెళ్లి కలిసి వద్దామని ఆదివారం పొద్దున్నే కరీంనగర్ బయలుదేరాను..

బస్ ఏదో హోటల్ దగ్గర ఆపారు. టిఫిన్ కోసం అందరూ దిగుతున్నారు. నేను కూడా దిగి టిఫిన్ చేసి టీ తాగి మళ్లీ బస్సెక్కి కూర్చున్నాను. అవతలి పక్క సీట్లో కూర్చున్న అమ్మాయి తన మిత్రురాలితో చలాకీగా నవ్వుతూ ఏదో మాట్లాడుతోంది..

ఒకసారి వహీదా, 'అప్పుడప్పుడు నిన్ను నా భర్తగా ఊహించుకుంటుంటాను..! నీ బండి వెనక కూర్చొని హైదరాబాద్ అంతా తిరుగుతున్నట్లు.. ఒక ఆదివారం ఇందిరాపార్కుకు వెళ్లినట్లు.. సినిమాకు వెళ్లినట్లు.. నెక్లెస్ రోడ్‌లో నీతో కలిసి హుషారుగా షికారు చేస్తున్నట్లు.. ఎన్ని ఊహలో చెప్పలేను.. ఇంతకూ నువ్వెట్లుంటావో తెలియదు. చూడాలని ఉంది.. ఒకసారి వచ్చి వెళ్లరాదూ మా ఊరికి.. అలా మా గల్లీ చివరికి వస్తే, బుర్ఖాలో వచ్చి నిన్ను చూసి, నఖాబ్ తీసి నా మొఖం నీకు చూపించి వచ్చేస్తాను.. నువ్వు చక్కగా మళ్లీ హైదరాబాద్ వెళ్లిపోవచ్చు' అంటూ గలగలా నవ్వింది.

నేను కూడా నవ్వి-
'నా వెంట పడేకంటే నీ చుట్టుపక్కల మంచివాణ్ణెవణ్ణన్నా చూసి ప్రేమించరాదూ.. చూడ్డానికి బాగుంటానన్నావు.. బాగా మాట్లాడతావు.. లోకజ్ఞానం కూడా ఎంతో ఉంది.. ఆ పని చెయ్యి వహీదా!'
అన్నాను ఒకసారి.
బాగా నవ్వింది. 'మస్తు చెప్పావులే నిసార్. మాకంత అవకాశం ఇస్తారా మనవాళ్ళు. నీతో అంటే ఏదో ఫోన్‌లో కాబట్టి కుదిరింది. పర్సనల్‌గా కలవనిస్తారా మా వాళ్ళు. మొఖం నుంచి కాళ్ల దాకా అన్నింటికీ ముసుగేసినంక ఎవరైనా ఎట్లా ప్రేమిస్తారు చెప్పు! కష్టం నిసార్. నాలాంటివాళ్ళ బతుకు ఇక ఇంతే' అంది.
బాధేసింది. అవును కదా.. ఆడవాళ్ళకు ఎందుకిన్ని కష్టాలు.. అందులో ముస్లిం ఆడవాళ్లకు మరీ..
'డిగ్రీ చదివానన్నావ్.. ఇంకా పై చదువుకి గొడవ చేయొద్దా?' అన్నాను.

'పెద్ద గొడవే చేశాను. కాని ఎవరు వింటారు?'
'మరి పెళ్ళి చేసేస్తారటనా?'
'... అవును.. ఎవడో ఒకడికి, కట్నం తక్కువ తీసుకునే మూర్ఖుడిని చూసి కట్టబెడతారు. వాడు ఎలాంటోడో ఎవరూ పట్టించుకోరు.'
'కొంచెం లేట్ అయినా మూర్ఖుడు కాకుండా కాస్త మంచోణ్ణి చూడమని చెప్పు. మీ వాళ్లకు అర్థం చేయించు' అన్నాను.

'అవన్నీ కుదరవు నిసార్.. ఇక నా బతుకు ఇంతే. అందుకే నీలాంటివాడైనా ధైర్యం చేస్తే వచ్చేస్తా నిసార్!' అని చిన్నగా నవ్వింది.
'హూఁ!' అని నిట్టూర్చిన.
మళ్లీ అన్న- 'అట్లనే ఎందుకు నిశ్చయంగా అనుకోవడం? మంచోడు దొరుకుతాడేమో!' 'ఛాన్సే లేదు నిసార్! మా అక్కని ఒక దాడివాలా (గడ్డంవాలా)కి ఇచ్చి చేశారు. తనకు కూడా నాలాంటి ఫీలింగ్సే ఉండేవి. దానికి ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు. వాడో మూర్ఖుడు. అలాగని దాడివాలాలందరూ మూర్ఖులని అనడం లేదు కానీ, వీడు మాత్రం మూర్ఖుడే. రాచి రంపాన పెడుతుంటాడు. ఆపరేషన్ చేయించుకుంటానని మా అక్కా- నాకు మగ పిల్లాడు కావాలని వాడు.. ఎప్పుడూ గొడవే! ఆ పిల్లలకు సరైన చదువు కూడా లేదు.. తనను ఇల్లు కదలనివ్వడు- బైటికి తొంగి కూడా చూడనివ్వడు- ఎవ్వరితోనూ ఫ్రీగా మాట్లాడనివ్వడు.. లోపల్లోపలే కుమిలిపోతుంటుంది.. ఏం చేస్తాం.. తప్పదు నిసార్!'...

'నీకు ఎలాంటివాడు కావాలని ఉంటుంది వహీదా?' అనడిగాను.
'... ఊఁ... నేను అలిగితే వెంటపడి బతిమాలేవాడు.. నేను ఏడిస్తే తల్లడిల్లిపోయేవాడు.. నాకేం చేయాలనిపిస్తే అది చేయనిచ్చేవాడు.. నాకిష్టమైన బట్టలు వేసుకోనిచ్చేవాడు.. ముఖ్యంగా నాకిష్టమైన జాబ్ చేయనిచ్చేవాడు.. నా పిల్లల్ని వాళ్ల ఇష్టాలకు తగ్గట్లు పెంచనిచ్చేవాడు.. చాలా? ఇంకా చెప్పనా?' అంటూ నవ్వింది వహీదా.
బస్ ఏదో స్టేషన్‌లో ఆగింది. వాటర్ బాటిల్ కొనుక్కొని కొన్ని తాగి వచ్చి మళ్లీ సీట్లో కూర్చున్నాను.. మళ్లీ వహీదా ఆవరించింది..

 వహీదా మొదటిసారి మాట్లాడ్డం అనుకోకుండా జరిగింది. అవాళ ఓ మిత్రుడి నెంబర్ మరో మిత్రుడి దగ్గర తీసుకొని ఫోన్ చేశాను. కమ్మని స్త్రీ గొంతు. నేను తడబడి 'ఫయాజ్ కావాలండి' అన్నాను. 'మీరెవరు?' అన్నదామె. చెప్పాను. 'ఏం చేస్తారు?' అడిగింది. చెప్పాను. 'ఎక్కడ నుంచి?' అన్నది. చెప్పాను. ఇట్లా అడుగుతూనే ఉంది. నేను ఓపికగా చెప్తున్నాను. చివరికి 'ఇది ఫయాజ్ నెంబర్ కాదు' అన్నది. నేను ఆశ్చర్యంగా 'మరి ఎవరిది?' అన్నాను. 'నాదే!' అన్నది. నేను నవ్వాను. తనూ నవ్వింది. 'అదే, మీదే కాని, మీరెవరు?' అన్నాను. 'మళ్లీ ఫోన్ చేసినప్పుడు చెప్తాను' అన్నది. 'నేను చేయకపోతే!' అన్నాను. 'నేనే మిస్ కాల్ ఇస్తాను' అన్నది. 'ఎందుకలా?'

'ఎందుకంటే మీరు అంత చెడ్డవారేమీ కాదు అని తెలిసిపోయింది కాబట్టి' అన్నది.
'ఇంతలోనే' అన్నాను.
'మెతుకు చూస్తే చాలు, అన్నమంతా చూడాలా?' అన్నది.
'ఓహ్.. ఓకే' -ఇలా పరిచయమైంది వహీదా.
నాలుగైదు రోజుల్లోనే మనసుని పెనవేసుకుపోయింది.
అప్పుడప్పుడు మనసు ఎంతగా కొట్టుకునేదంటే- వహీదాను కూడా పెళ్లి చేసుకుంటే బాగుండుననిపించేది! మగ మనసు కదా.. ఎక్కడ్లేని ఆశ దానికి.. తాజా రుచులంటే!

బస్ కరీంనగర్ చేరుకుంది. దిగి వహీదా చెప్పిన మండల కేంద్రం బస్ కోసం ఆరా తీసి అదెక్కాను- మెల్లగా మనసులో భయం మొదలైంది- ఎవరెవరుంటారు వహీదా ఇంట్లో? తను ఎవరినని పరిచయం చేసుకోవాలి? పెండ్లి కాని అమ్మాయికి ఫ్రెండ్ ఏంటని ఆ ఇంట్లోని మగవాళ్లు నిలదీస్తే? వహీదా ఏం చెబుతుంది? ఫోన్‌లో చెప్పినట్లుగా నేనతన్ని ప్రేమిస్తున్నాను అని చెబుతుందా? అంత ధైర్యం చేయగలదా? ఊఁహూఁ.. చేయలేదు..
కాని నా మనసు ఎంతో ఎక్సైట్ అవుతోందని అర్థమవుతున్నది.. ఆరు నెల్లకు పైగా నామనసుకు దగ్గరైన, నా మనసులో మనసైన వహీదాను చూడబోతున్నానన్న ఎక్సైట్‌మెంట్ అది!

ఫోన్ బంద్ చేసి నేనేం చేస్తానో చూడాలని ఇలా పరీక్షించడం లేదు కదా! అనిపించింది. 'ఇష్టంతోనే కదా, ఇంత దూరం వచ్చావ్.. పెళ్లి చేసుకోవచ్చు కదా నిసార్!' అని వెంటపడితే?! అన్నీ తెలిసి నేను కష్టాల్లో పడబోవడం లేదు కదా! అనిపించింది ఒక క్షణం. కాని ఇంత దూరం వచ్చాక మళ్లీ వెనక్కు వెళ్లనిస్తుందా మనసు! మండల కేంద్రంలో దిగాను. వహీదా వాళ్ల ఊరు పేరు చెప్పి ఎలా వెళ్లాలో తెలుసుకున్నాను. ఆ మండల కేంద్రం నుంచి షేరింగ్ ఆటోలు నడుస్తుంటాయట వహీదా వాళ్ల ఊరికి. ఆ ఊరి ఆటో ఎక్కాను. ఇరుకిరుకుగా 10 మందిని ఎక్కించుకున్నాడు ఆటోవాలా. అందులో ఒక బుర్ఖా అమ్మాయి కూడా ఉంది.

ఆ అమ్మాయి ఎదురుగానే కూర్చున్నాన్నేను. పెళ్లి కాలేదని ఆమె కాళ్లు చెప్పాయి. ఈ అమ్మాయే వహీదా కాదు కదా. మీ పేరేంటి అని అడిగితే బాగుండు. కనీసం మీకు వహీదా తెలుసా? అని అడగాలని మనసు ఆరాటపడింది. కాని తమాయించుకున్నాను. టపటపా కొట్టుకుంటున్న ఆమె అందమైన కళ్లు నన్ను డిస్టర్బ్ చేస్తున్నంతలో- ఊరొచ్చింది. అందరూ దిగారు. తనూ దిగి వెనక్కి తిరిగి చూడకుండానే వెళ్లిపోయింది. రెండడుగులేసి ఒక చెట్టుకింద కూర్చున్న ముసలాయన్ని అడిగాను- 'వహీదా వాళ్ల ఇల్లెక్కడ తాతా?' అని. 'వహీదా ఇల్లా? అగో.. గట్ల సక్కగ పోతే గా శివర నుంటది' అన్నడు తాత.
సీదా పోయాను.

ఆ ఇంటి ముందు పిల్లలు ఆడుకుంటున్నారు. ఇద్దరు ఆడపిల్లలు- 3, 5 ఏళ్లుంటాయి. దగ్గరికెళ్లాను. అంతలో ఇంట్లోంచి ఇంకొంత పెద్ద పిల్ల బైటికొచ్చింది. 7 ఏళ్లుంటాయి. ఆ అమ్మాయి నుద్దేశించి-
'ఇంట్లో ఎవరున్నారు బేటా?' అనడిగాను.
'మా అబ్బా డ్యూటీ కెళ్లిండు.. మా దాదీమా బజారుకెళ్లింది' అన్నది పెద్దమ్మాయి.
'ఇది వహీదా వాళ్ల ఇల్లేనా?' అనడిగాను అనుమానంగా.
ఆ అమ్మాయి ఆశ్చర్యంగా నాకేసి చూసి- 'అవును' అన్నది.
'వహీదా లేదా?' అన్నాను.
'చచ్చిపోయిందిగా!' అన్నది ఐదేళ్లుండే అమ్మాయి ఆడుకోడం ఆపి.
షాక్ కొట్టినట్లయింది-
'ఎలా?' అన్నాను ఆశ్చర్యంగా..

'అదిగో.. ఆ ఫ్యాన్‌కి' అని చూపెట్టి, మెడ చుట్టూ చేయి తిప్పి సైగ చేసి 'చచ్చిపోయింది' అన్నదా అమ్మాయి. నేను ఇంట్లో ఫ్యాన్ వైపు చూశాను. ఆ ఫ్యాన్ వెనక గోడకు దాడివాలా పక్కన ఒక స్త్రీ ఉన్న ఫోటో ఉంది. ఆమె నన్నే చూ స్తున్నట్లు అనిపించింది! ఈ మధ్యే కట్టించినట్లు కొత్తగా ఉంది ఫ్రేమ్..

డౌటొచ్చింది. 'ఆ ఫోటోలో ఉన్నామె ఎవరు?' అడిగాను.
'ఆమెనే మా అమ్మ- వహీదా!' అన్నది పెద్దమ్మాయి..
ఒళ్లు కంపించిపోయింది నాకు..
'అమ్మీ, అబ్బా కొట్లాడుకున్న రు..' అంటున్నది ఐదేళ్ల అమ్మాయి.
ఇంతలో చిన్నమ్మాయి పరుగెత్తుకొచ్చి నా కాళ్లను చుట్టుకుపోయింది..
వంగి ఆ అమ్మాయిని ఎత్తుకున్నాను. అచ్చం ఫోటోలోని వహీదా లాగా ముద్దుగా ఉందా అమ్మాయి! కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి నాకు..!
ఆత్మీయంగా ఆ అమ్మాయిని ముద్దు పెట్టుకున్నాను..