Monday 3 May, 2010

పెద్దగుట్ట దర్గా-తెలంగాణ ముషాయిరా

పెద్దగుట్ట.. షాదుల్లా బాబా దర్గా! ఎంత ఇంట్రస్టింగ్‌ స్టోరీ! మనకు రామదాసు గురించి తెలుసు. అలాంటిదే కానీ అందుకు భిన్నమైన ఈ చారిత్రక కథ ఎందుకు తెలీదు? తెలియకపోవడం వెనక- అర్థం చేసుకోవాల్సింది ఎంతో ఉంది. తానీషాల కాలంలో రామదాసు భద్రాచలంలో ప్రజల నుంచి వసూలు చేసిన కప్పం రాజుకు అప్పజెప్పకుండా రామాలయం కట్టించాడు. అందుకు జైలుశిక్ష అనుభవించాడు. మరి పెద్దగుట్ట ఏరియాలో నిజాంల కాలంలో షాదుల్లా అనే మహానుభావుడు వసూలైన కప్పం కూడా రాజుకు అప్పజెప్పకుండా కష్టాల్లో ఉన్న పేదలకే పంచిపెట్టాడు. వసూలు చేయడం దాటవేశాడు. దాంతో రాజుకు కోపం వచ్చింది. ఒక్కరిని ఇలా వదిలిపెడితే అందరూ రకరకాల కారణాలు చెప్పి ఇలా ఏదో ఒకటి చేసే అవకాశం ఉందని షాదుల్లాను పట్టుకురమ్మని సైనికులను పంపించాడు. షాదుల్లాకు సైనికులకు మధ్య యుద్ధమే జరిగింది. బహుశా షాదుల్లాను వాళ్లు చంపి ఉంటారు! కాని ప్రచారంలో ఉన్న కథ మాత్రం- సైనికులతో షాదుల్లా ఒక కర్రతో యుద్ధం చేశాడని, చివరికి ఆ కర్రను భూమిమీద కొట్టడంతో భూమి రెండుగా చీలిందని, అందులోకి దూకి మాయమయ్యాడని చెబుతుంది. జానపద కథల్లో హీరోగాని హీరోయిన్‌గాని చనిపోవడం ఉండదు. అలాంటి పరిస్థితే వస్తే వాళ్లు మాయమయ్యారని చెబుతారే తప్ప చనిపోయారనో, చంపబడ్డారనో చెప్పడానికి జానపదులు ఇష్టపడరు. (ఉదాహరణకు సమ్మక్క, సారక్క) బహుశా షాదుల్లా విషయంలోనూ అదే జరిగింది. షాదుల్లా మీద ఇలాగే కొన్ని కథలు ప్రచారంలోకి వచ్చాయి. కాకపోతే పెద్దగుట్ట మీద షాదుల్లా మజార్‌ (సమాధి) ఉంది. దాని పక్కన కొంచెం ఎడంగా ఆయనకు పాలు పోసే సాలవ్వ సమాధి కూడా ఉంది. కాని విషాదం ఏమంటే- అంత పెద్దగుట్ట ఎక్కి షాదుల్లాను దర్శనం చేసుకున్నాక- అక్కడ వసతులేమీ లేకపోవడం బాధేస్తుంది. అది పెద్దగా జనం రాని పుణ్యక్షేత్రమా అంటే అదీ కాదు.. ఆ చుట్టుపక్కలా, పక్కనే ఉన్న కర్ణాటక ప్రాంతం నుంచీ పెళ్లయిన ప్రతీ జంట షాదుల్లా ఆశీస్సుల కోసం దర్గాను దర్శనం చేసుకుంటుంది. పెళ్లి కాని అమ్మాయిలు పెళ్లి కావాలని మొక్కుకుంటానికి వస్తుంటారు. రాత్రిళ్లు వచ్చి అక్కడ నిద్ర చేస్తారు. చుట్టుపక్కల చాలా దూరాల నుంచి తమ కోర్కెలు తీరుతాయో లేదో తెలుసుకోవడానికి ఎంతోమంది వచ్చి అక్కడ నిద్ర చేస్తారు. రాత్రి కలలో కనిపించి షాదుల్లా బాబా తాము అనుకున్న పని అవుతుందో కాదో, లేదా ఇంకా ఏదో ఒక విషయం చెబుతాడు. ఆ పని కాదనుకుంటే అసలు షాదుల్లా బాబా కలలోకే రాడు అని వారందరి నమ్మకం.
శుక్రవారం న్యాజ్‌ (కందూరు) చేయడానికి ఎన్నో బృందాలు అక్కడికి వస్తుంటాయి. ప్రతి సంవత్సరం అక్కడ పెద్ద ఎత్తున ఉర్సు (జాతర) సాగుతుంది. వెరసి మొత్తంగా ప్రతి ఏడాది వఖ్ఫ్‌ బోర్డు పాడే పాటలో ప్రస్తుతం కోటి నలభైరెండు లక్షలకు ఎవరో ఒకరు దర్గా రాబడిని పాడుకుంటారు. అంటే కోటి నలభైరెండు లక్షలు వక్ఫ్‌బోర్డుకు చెల్లించి ఆ పైన వచ్చే ఆదాయాన్ని పాడినవారు ఉంచుకుంటున్నారంటే ఎంత ఆదాయమొస్తుందో ఊహించుకోవచ్చు. అంత డబ్బు ఆదాయంగా వచ్చినప్పటికీ షాదుల్లా బాబా దర్గా పరిసరాల్లో వసతులేమీ లేవు. మంచి నీళ్లు కూడా కొనుక్కొని తాగాల్సిందే. గుట్ట మీద ఒక్కటంటె ఒక్క సిమెంట్‌ కప్పు లేదు.. దర్గాకు కూడా పైన కప్పు లేదు. రేకులు ఉన్నాయి.. ఇదేమీ చిత్రం!
ఇదంతా మాకు ఎలా తెలిసిందంటే.. ఏప్రిల్‌ 18వ తారీఖున నిజామాబాద్‌ జిల్లా పెద్దగుట్ట (బడా పహాడ్‌) లో ఉర్దూ-తెలుగు ముస్లిం కవులతో 'తెలంగాణ ముషాయిరా'కు వెళ్లాం. గుట్ట పరిసరంలో ఓ పెద్ద టెంటు వేసి ముషాయిరా జరిపారు నిర్వాహకులు సిహెచ్‌ మధు, నరహరి, మామిళ్ల సాయిరెడ్డి తదితరులు. హైదరాబాద్‌ నుంచి నాళేశ్వరం శంకరం, స్కైబాబ కలిసి కొంతమంది ఉర్దూ-తెలుగు కవుల్ని తీసుకెళ్లారు. బహుశా తెలంగాణ చరిత్రలో తెలంగాణ ముషాయిరా జరగడం ఇదే మొదలు కావచ్చు. ఉర్దూ కవులు వేరే లోకంగా ఉండడం, వారితో తెలుగువారికి ఏమీ సంబంధాలు లేకపోవడం తెలిసిందే. వారిని కలుపుకొని తెలుగు ముస్లిం కవులతో ముషాయిరా జరగడం, అదీ ఒక దర్గా దగ్గర జరగడం విశేషం.

ఎందుకంటే- ఈ మధ్యకాలంలో దర్గా సంస్కృతిపై నీలినీడలు అలుముకుంటున్నాయి. హిందూత్వవాదం చాపకింద నీరులా పెరుగుతుండడంతో దర్గాల దగ్గరికి వచ్చే కొందరు హిందువులు తగ్గిపోతున్నారు. అట్లే ముస్లింలకు సంబంధించి కొన్ని మతసంస్థలు (జమాత్‌లు) దర్గాల దగ్గరికి పోవడం సరైంది కాదంటూ ప్రచారం చేస్తుండడంతో కొందరు ముస్లింలు కూడా వెళ్లడం లేదు. దీనివల్ల దర్గాలకు వెళ్లే హిందూ-ముస్లింల కలగలుపు సంస్కృతి తగ్గిపొయ్యే ప్రమాదం ఏర్పడింది. దర్గాలు ఈ దేశంలో హిందూ-ముస్లింల మత సామరస్యానికి ఒక ప్రతీకగా ఉన్నాయి. ఈ సంస్కృతిని కాపాడుకోవాల్సిన అవసరముంది. ముందు ముందు దర్గాల దగ్గర సభలు, సమావేశాలు జరుపుకోవాలని ముస్లిం రచయితల వేదిక నుంచి మేము గతంలోనే అనుకొని ఉన్నాం. నా సంపాదకత్వంలో తీసుకువచ్చిన 'అలావా' ముస్లిం సంస్కృతి కవితా సంకలనంలోనూ దర్గా సంస్కృతికి సంబంధించి చాలా కవితలున్నాయి. అందుకే పెద్దగుట్ట దర్గా దగ్గర ఈ ముషాయిరా జరగడం విశేషమే.
ఇదొక చారిత్రక ముషాయిరా అని వక్తలు మళ్లీ మళ్లీ పేర్కొన్నారు. వెళ్లినవారిలో మగ్దూం మొహియుద్దీన్‌ కొడుకు నుస్రత్‌ మొహియుద్దీన్‌ ఉండడం విశేషం. ఉర్దూ కవి అయిన నుస్రత్‌ ఈ ముషాయిరాలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన్ను చూస్తుంటే మగ్దూంను చూస్తున్నట్లే ఉందని ఫీలయ్యారు నిర్వాహకులు, సభికులు. అలాగే హైదరాబాదీ ఫేమస్‌ పెయింటర్‌ సయ్యద్‌ బిన్‌ మొహమ్మద్‌ కుమార్తె జమీలా నిషాత్‌ పాల్గొనడం మరొక విశేషం. ఆమె జాతీయంగా, అంతర్జాతీయంగా ఉర్దూలో ప్రముఖ కవయిత్రి. వీరిద్దరితోపాటు స్కైబాబ, నిసార్‌, అలీ, మాజీద్‌, అహ్మద్‌ పాషా, సిరిసిల్ల గఫూర్‌ శిక్షక్‌ తదితర ఉర్దూ-తెలుగు ముస్లిం కవులు పాల్గొన్నారు. అట్లే నాళేశ్వరం శంకరం, సిహెచ్‌ మధుతోపాటు దేవకీదేవి, కందుకూరి శ్రీరాములు, సిహెచ్‌ ప్రకాశ్‌, సూరారం శంకర్‌, జనజ్వాల తదితర తెలుగు కవులు పాల్గొన్నారు. ఇంకా చాలామంది తీవ్రమైన ఎండ కారణంగా రాలేదు. బగార అన్నం, యాట కూరతో మధ్యాహ్నం దావత్‌ అదిరింది. ముషాయిరా ముగిసాక అందరం పెద్దగుట్ట ఎక్కడానికి వెళ్లాం. కొందరు కింద ఆగిపోగా ఎక్కువమందిమి ఆడుతూ పాడుతూ గుట్ట ఎక్కాం. పైన చెప్పుకున్న విషయాలన్నీ తెలిశాయి. చీకటి పడుతుంటే గుట్ట దిగుతుంటే నిద్ర చేయడానికి ఎంతోమంది గుట్ట ఎక్కుతూ కనిపించారు. ఒక పది, పదిహేను మంది సెల్వార్‌ ఖమీజ్‌లు ధరించిన ముస్లిం అమ్మాయిల గుంపు ఒకటి టార్చ్‌లైట్లు పట్టుకొని పైకి ఎక్కుతుండడం కనుల విందు చేసింది...
విషాదం ఏమంటే- గుట్ట పైకి మెట్ల దారిలో అటువైపు ఇటువైపు చిన్నచిన్న గుడిసెలు.. అందులో ఉన్న మనుషులు.. ఎక్కువ గుడిసెల్లో ఒక్కొక్కరే ఉండడం ఆశ్చర్యం వేసింది. పరిస్థితిని అర్థం చేసుకుంటే ఎక్కడలేని బాధేసింది. చాలా గుడిసెల్లో ఏ ఆధారమూ లేని ముసలివాళ్లు, తమ బిడ్డలు పోషించలేక వదిలేస్తే అక్కడ పడి ఉన్నవాళ్లు, ఏదో ఒక రోగంతో బతుకీడుస్తున్నవాళ్లు గుడిసెల బయట కూర్చుని అడుక్కుంటున్నారు. కొందరు అలా పడుకోబెట్టి ఉన్నారు. దిక్కులేని వారికి దేవుడే దిక్కు అంటే ఇదే కావచ్చు.. వారి దీనమైన ముఖాలు.. వారి ఒంటరితనం.. లోకుల బాధ్యతారాహిత్యం.. ఆ కొద్ది సమయంలో ఏం చేయాలో తెలియని.. గుండెల్ని పిండేసే బాధ మనసుల్లోకి ప్రవేశించి అలాగే మస్తిష్కాలపై గూడు కట్టుకొని నిలిచిపోయింది!
                                                                                                                            - స్కైబాబ

No comments:

Post a Comment

మీ అభిప్రాయం తెలియజెయ్యండి