Friday, 26 November 2010

ట్‌రైటర్స్‌

నువ్వూ నేనూ కలిసే
భూమి కోసం పోరాడుతున్న
వీరుల కోసం విప్లవగానం చేశాం -
నువ్వూ నేనూ కలిసే
కశ్మీర్‌, పాలస్తీనా, ఇరాక్‌
పోరాటాలను సమర్థించాం ..
చర్చలు.. సభలు.. ఉపన్యాసాలూ...
ఉద్యమ ఆవేశాల్తో ఊగిపొయ్యేవాళ్లం -
ఒకానొక సమయం ఇలా వచ్చింది
ముక్క దగ్గరా మగువ దగ్గరా
మనిషి మనస్తత్వం తెలుస్తుందంటారు..
నువ్వు ఆక్రమించిన నా నేల
ఉద్యమించేసరికి నీ నైజమూ బైటపడిపోయింది!
    1
ఏకైక రక్తసంబంధాన్ని ఏడేడు సముద్రాలు దాటనిచ్చినవాడా!
అమ్మగల్లాడిన మా మట్టిమీది ప్రేమను అపహాస్యం చేస్తున్నావా?
మెత్తని నీ మాటకు మురిసిపోయేవాణ్ణి
అది చాకూ అని తేలి విస్తుపోతున్నాను
నీ ఆలింగనంలో గుండెలు విచ్చుకునేవి
ఇప్పుడు బ్రహ్మజెముళ్లు గుచ్చుకుంటున్నాయి
    2
ఈ నేలే నిన్ను కవిని చేసిందంటావ్‌
ఇవాళ ఈ నేలే తన విముక్తికోసం పెనుగులాడుతుంటే
ట్రైటర్స్‌లో ఒకడివయ్యావ్‌
కుడి ఎడమల తలలూపేవాళ్ళే
ఎవడి ముందు వాడి పద్యం పాడతావ్‌
తడబడుతున్న నీ పదమే
నీ కలాన్ని నిలదీస్తుంది
    3
ఏ నేల నిన్ను తన జవసత్వాల నిచ్చి
పెంచి పెద్ద చేసిందో
ఆ నేలనే తన్నేసి
పరాయి దేశం ఎగిరిపోగలిగిన గద్దా..
నీకు మా మాతృప్రేమ తండ్లాట
ఎలా సమజైతది?
    4
ఒక అస్తిత్వం గురించి మాట్లాడుతూనే
మరొక అస్తిత్వాన్ని కాదనడం ఏమనిపించుకుంటుంది?!
మైనారిటీ అస్తిత్వ దీర్ఘ కావ్యమైనవాడా..
స్త్రీవాదపు రెమ్మలై రెపరెపలాడినవారలారా..
సోదర అస్తిత్వాని కొచ్చేసరికి
ఇంగితం ఆవిరైపోయిందా.. కపాలం డొల్లగా మారిందా..
                 *
కవి అన్నవారికి కన్నెలా మలుగుతుంది..
ఆమ్‌ ఆద్మీ రోడ్ల మీదికొచ్చి నినదిస్తుంటే
రక్తం ఉరకలెత్తకుండా ఎలా ఉంటుంది..
ఇన్నాళ్లూ విప్లవాల వేషాలేసీ
ఉద్యమాల శిగాలూగీ
ఇవాళ ముడుచుకుపోయారేం..
మిమ్మల్ని ఇన్నాళ్లూ గౌరవించినందుకు
మాకే తలవంపులుగా ఉంది-
సిగ్గూ శరం ఉన్నోళ్ళయితే
ఇన్నాళ్లూ రాసిన ఆ కలంతోనే పొడుచుకోండి
అట్లన్నా కవిత్వం పునీతమవుతుంది!           

                                                                       01 09 2010

6 comments:

  1. skyభయ్యా, కవిత బాగుంది. భద్రంగా దాచిపెట్టుకోండి. రేపు హైదరాబాద్ Vsతెలంగాణా ఐనా, లేక సౌత్ తె.Vsనార్త్ తె. ఐనా కూడా ఈ కవిత సరిగ్గా సరిపోతుంది.. మీరు ఏ ప్రాంతం వారు ఐనప్పటికీ!

    ReplyDelete
  2. ఒక శత్రుపక్షాన్ని ఖతమ్ చేయడం కోసం అన్నదమ్ముల మధ్య చిచ్చుపెడుతున్న ఢిల్లీ రాజకీయాన్ని సరిగా అర్థం చేసుకోలేక అదొక యథార్థమైన ఉద్యమమనీ, దానివల్ల ప్రయోజనం ఉన్నదనీ నమ్మే పిచ్చి పేద-మధ్యతరగతి తెలగాణ్యుల దగ్గర ఈ కవిత బ్రహ్మాండంగా పేలుతుంది. వాస్తవాలు తెల్సినవారికి మాత్రం మీరు వ్యక్తం చేస్తున్న భ్రాతృద్వేషం బాధను కలిగిస్తుంది.

    ReplyDelete
  3. This comment has been removed by the author.

    ReplyDelete
  4. మీరు తెలంగాణ వారైతే ఇలా మాట్లాడరు. నొప్పి మీకు తెలియదు. ముళ్ళు గుచ్చుకున్న పాదానికి తెలుస్తుంది ఆ బాధ ఎలా ఉంటుందో..

    ReplyDelete
  5. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  6. This comment has been removed by a blog administrator.

    ReplyDelete

మీ అభిప్రాయం తెలియజెయ్యండి