Monday 23 January, 2012

అసంపూర్తి జీవితాలు ‘ఆధూరె’

సాహిత్య పరామర్శ
adure telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaస్కై బాబ పుస్తకం
అసంపూర్తి జీవితాలు

తెలంగాణ ముస్లింల పరిస్థితి దయనీయం. పేదరికంతో సాంస్కృతికంగా, రాజకీయంగా వెనకబడిన దైనందిన జీవితం వారిది. వారికి ప్రతిరోజూ ఒక సవాల్‌లాంటిదే. అలాంటి వారి జీవితాలను కథలుగా ఆవిష్కరించారు రచయిత స్కైబాబ. వీటిని ‘ఆధూరె’ అనే శీర్షికన పుస్తకంగా తీసుకొచ్చారు. ఇందులో మొత్తం 12 కథలున్నాయి. ‘ఆధూరె’ అంటే పూర్తికానివి అని అర్థం. ముస్లింల జీవితాలు అసంపూర్ణంగా ఉన్నాయనే సంకేతానికి నిదర్శనంగా తన కథల పుస్తకానికి ఆధూరె అని పేరు పెట్టారు. ఈ కథల్లో ముస్లింలు తమ అస్తిత్వానికి ఏవిధంగా దూరమయ్యారనే విషయాలను ఆవిష్కరిస్తారు రచయిత.

‘చోటి బహెన్’ అనే కథలో ఒక గ్రామీణ ముస్లిం యువతి జానీ బేగం బుర్ఖా వేసుకోవడానికి ఇబ్బందిపడే విధానాన్ని వివరించారు. గొప్పవావూ్లైన కొంతమంది బుర్ఖా వేసుకోకపోతే ప్రశ్నించలేని వారు, తనను ఎందుకు ప్రశ్నిస్తున్నారని ఆ యువతి అడిగే తీరు పాఠకులను ఆలోచింపజేస్తుంది. ముస్లింల కడు బీదరికానికి అద్దంప కథ ‘మజ్బూర్’. జీవితం వారికి ఒక పెద్ద సవాల్‌గా ఎలా మారిందో ఈ కథలో చక్కగా ఆవిష్కరించారు రచయిత. ‘కబూతర్’ కథలో ఒక పేద తల్లి తన బిడ్డకు పెళ్లి చేయడానికి పడే ఆరాటాన్ని చక్కగా చెప్పారు రచయిత. 

కథల్లోని స్త్రీ పాత్రలు మనల్ని నిలకడగా ఉండనీయవు. ముస్లిం సమాజంలోని పురుషాధిక్యతపై పలు ప్రశ్నలను విసురుతనే ఉంటాయి. రచయిత చాలా ఆర్ద్రతతో స్త్రీ పాత్రలను పలికించారు. ఈ పాత్రలు మన చుట్టూ ఉన్నట్టే అనిపిస్తాయి. ముస్లింల వెనుకబాటుతనానికి వారి సామాజిక పరిణామాలు ఏ విధంగా కారణమవుతున్నాయో ఈ కథల్లో కన్పిస్తాయి. అక్కడక్కడ రచయిత తన సామాజిక పరిస్థితుల్లోని మూస పద్ధతిని బద్దలు కొట్టడానికీ ప్రయత్నించారు. 
ఇట్లా, ఇందులోని కథలన్నీ చక్కని శైలిలో, తెలుగు ఉర్దూ కలగలిసి సామాన్య పాఠకునికి కూడా చక్కగా అర్థమయ్యేలా ఉన్నాయి. చివరి వరకు ఉద్విగ్నంతో చదివిస్తాయి. అయితే, ఈ కథలన్నీ చివరికి అసంపూర్తిగానే మిగిలిపోతాయి. వాటిని పూర్తిచేయడానికి కావల్సిన కార్యాచరణ చూపిస్తే మరింత బాగుండేది. చూపించవు.
₹. 50. ప్రతులకు: 98854 20027
('నమస్తే తెలంగాణ' పత్రిక ఆదివారం  22 జనవరి సంచిక 'బతుకమ్మ' లోని కామెంట్)

Sunday 22 January, 2012

జిన్నాకు ముందే ద్విజాతి సిద్ధాంతం -జిలుకర శ్రీనివాస్ ('అధూరే' పై ఆంధ్రజ్యోతి లో చర్చ)


జిన్నాకు ముందే ద్విజాతి సిద్ధాంతం

                                         - జిలుకర శ్రీనివాస్

సంస్కృతి నిర్వకల్పమైనది కాదనీ, అది ఆయా సమాజాల్లోని వివిధ సమూహాల ప్రత్యేకమైన, నైరూప్యమైన అంశాలతో పాటు ఆధిపత్య శక్తుల అభీష్టానుసారం నిర్మించబడుతోందనీ, దానికి సమాంతరంగా వ్యక్తీకరించబడే ప్రతివాదం కూడా సంస్కృతిలో అవిభాజ్యమైన అంశమని గుర్తించాలి. సాహిత్యం సాంస్కృతిక నిర్మాణమని భావిస్తే అది తప్పనిసరిగా రాజకీయ స్వభావాన్ని కలిగి ఉంటుంది.

అందువల్ల పీడిత కులాలు, మతాలు చేసే సాహిత్య వ్యక్తీకరణలు నైరూప్యమైనవి కావు. వాటికి నిర్దిష్టమైన చారిత్రక నేపథ్యం, రాజకీయ పునాదీ ఉంటాయి. ముస్లిం కథలను అర్థం చేసుకోవాలంటే ఈ దృష్టిని అలవర్చుకోవాలి. స్కైబాబ అనేక ముస్లిం రాజకీయ కథలు రాశారు. అలాంటి ముస్లిం సంస్కృతిని వ్యక్తీకరించిన రాజకీయ కథల సంకలనమే 'అధూరె'.

కనీజ్ ఫాతిమా ముందుమాటలో పేర్కొన్నట్టు ముస్లిం జీవితాలను అర్థం చేసుకోవటం ముస్లిమేతరులకు సులువేమీ కాదు. కాని, ఆ జీవితాలను నియంత్రిస్తున్న, నిర్దేశిస్తున్న పాలక కులాల రాజకీయాలు అర్థం చేసుకోలేని అమూర్త పదార్థమేమీ కాదు. ముస్లింలను పునరావాస శిబిరాల్లోకి నెట్టేసిన సమకాలీన దుస్థితికి గత రాజకీయ కారణాలను చారిత్రక దృష్టితో విశ్లేషించుకుంటేనే వాస్తవికత బోధపడుతుంది. సాహిత్యంలో వాస్తవికత పీడిత కులాలు రచనలు చేసే వరకు రూపొందలేదనేది విమర్శకులు అంగీకరిస్తున్నదే.

అందువల్ల వాస్తవికత అనేది దానికదే ఆకృతి దాల్చేది కాదు. అది ఒక నిర్మాణం. రచయిత అనుభవంతోనూ గ్రహించిన జ్ఞానంతోనూ కొన్ని సామాజిక ప్రతిఫలనాలను వ్యక్తీకరిస్తాడు. అవి ఆ రచయిత కుల, మత, ప్రాంత, లింగ, జాతి వంటి నిర్దిష్టతల మీద ఆధారపడి ప్రతిఫలిస్తాయి. అందుకే బ్రాహ్మణ కథకులు రాసిన అనేక కథలు ఆ కులంలోని పరిస్థితులను, ఆ కులస్తుల మానసిక వర్తనను ప్రతిబింబించాయి. కాని, విశాలమైన బ్రాహ్మణేతర సమాజాన్ని అవి ప్రదర్శించలేకపోయాయి. శూద్రులు, అతిశూద్రులు, ముస్లింలు రచనలు చేయటం ప్రారంభించగానే అప్పటిదాకా వాస్తవికత అని భ్రమించినది కాస్తా కాల్పనికమైనదని రుజువైంది.

అందుకే సమాజ వాస్తవికతను అర్థం చేసుకునేందుకు సాహిత్యేతర అంశాలను పరిగ్రహించాలి. 'అధూరె' సంకలనంలోని ముందుమాటలు స్కైబాబ కథలను అర్థం చేసుకొనేందుకు అవసరమైన సాహిత్య, చారిత్రక, రాజకీయ నేపథ్యాన్ని విభిన్న రూపాల్లో ఆవిష్కరించాయి. అఫ్సర్, కె.శ్రీనివాస్, కనీజ్ ఫాతిమా రాసిన ముందుమాటలు పాఠకులలో ఆసక్తి రేకెత్తిస్తాయి. వాచకానికి ముందుమాటలు అవసరం లేదనీ, ఆ రెండింటి మధ్య వున్న పితృపౌత్ర సంబంధాన్ని తెంచి పితృ హత్యకు పాల్పడాలని డెరిడా ఘీంకరించాడు. కానీ, పీడిత సమాజాల వ్యక్తీకరణలను వివేచించేందుకు డెరిడా సూత్రీకరణ సరిపోదు.

కాలాన్ని పునర్నిర్మించుకొనేందుకు రచయిత ఆధునికత మీద ఆధారపడతాడనీ, ఆ క్రమంలో వర్తమానంలో నిలబడి గతాన్ని, అది సృష్టించిన మిధ్యా వాస్తవికతను గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తాడు ఈ చారిత్రక స్పృహ వున్న రచయిత అంటారు, అఫ్సర్. స్థానిక అస్తిత్వ పునర్నిర్మాణంలో ఇది చాలా అవసరమైన సైద్ధాంతిక సాధనం అని కూడా ఆయన అంటారు. వాస్తవానికి ఆధునికత పేరుతో మన సమాజంలో చలామణిలో ఉన్నదంతా కులాధునికతే. బ్రాహ్మణ్యం ఆధునికత ముసుగు ధరించి వేసిన ఎత్తుగడలు, రాసిన రాతలు కాలాన్ని, దానికి సంబంధించిన అవగాహనను సెక్టేరియన్ పరిమితులలో బంధించింది.

ఆధునికత గురజాడతో మొదలైనా గిడుగుతో వర్ధిల్లినా అంతా బ్రాహ్మణ్యమే. వలస పాలనలో ఆధునిక చరిత్ర రచన పేరుతో జరిగిన పుక్కిటి పురాణాల అల్లిక ముస్లిం వ్యతిరేకతనూ బ్రాహ్మణ కాల్పనిక స్వర్ణ యుగాలనూ సృష్టిస్తే, ఆ సృష్టికి మనువాదులే బాధ్యత వహించాలి. కాని, ప్రపంచంలో ఏ మానవ సమూహానికీ లేని సౌలభ్యం బ్రాహ్మణులకే ఉంది.

అన్ని పొరపాట్లకూ చారిత్రక ఉత్థాన పతనాలకు తెల్లదొరలను బాధ్యులను చేసి చేతులు దులుపుకొనే ఆచారాన్ని నేటికీ కొనసాగిస్తున్నారు. కె.శ్రీనివాస్ కూడా హిందూ ముస్లింల మధ్య విభజనకూ ముస్లింల పట్ల వ్యతిరేకతకూ తెల్లదొరలనే బాధ్యుల్ని చేస్తున్నారు. కాని, కనీజ్ ఫాతిమా మాత్రం కుల వ్యవస్థలోని విభజన సూత్రమే మతపరమైన విభజనకూ రాజకీయ విభజనకూ పాదులు వేసిందనీ, ఆ విభజన సూత్రాన్ని తెల్లదొరలు తెలివిగా ఉపయోగించుకున్నారని చెప్తున్నారు.

చరిత్రను కె.శ్రీనివాస్ వ్యాఖ్యానించే తీరు ప్రధాన స్రవంతి వైధానిక పద్ధతిలో ఉంటుంది. ఫూలే గురించి ఆయన అవగాహన దీనికి అద్దం పడుతుంది. 'దేశంలోని భిన్న కులాల అంతస్తుల సంబంధం మీద కాక, సొంత కులాన్ని ఆధునీకరించుకోవడం మీదనే సంస్కర్తల దృష్టి. దొంతరల సామాజిక వ్యవస్థ మీద తక్కిన సమకాలీన సంస్కర్తలందరి కంటె లోతైన అవగాహన, విమర్శ ఉన్నప్పటికీ ఫూలే కూడా ఆచరణ రంగంలో విద్యావకాశాలను అందరికీ అందించటం వంటి సంస్కార చర్యల మీదనే దృష్టి నిలిపారు' అని సూత్రీకరించారు.

సామాజిక విప్లవానికి సైద్ధాంతిక పునాదులు వేసిన ఫూలే దార్శనికత, సైద్ధాంతిక వివేచన పట్ల అనేక వక్రీకరణలు జరిగాయి. ఫూలే కేవలం విద్యారంగంలో కృషి చేసిన ఉద్యమకారుడని పరిమితం చేయటం సంకుచితవాదం. బ్రాహ్మణాధిపత్యం నుండి మూలవాసులను విముక్తి చేసి బలిరాజ్యం స్థాపించాలన్న ఆశయమే ఆయన్ను ప్రజలను విజ్ఞానవంతులను చేయాలని సంకల్పించింది. దీని అర్థం అందరికీ బ్రాహ్మణీయ లేదా వలసవాద విద్యను అందించటం ఆయన ఉద్దేశ్యం కాదు.

కుల వ్యతిరేక, బ్రాహ్మణ భావజాలానికి వ్యతిరేకమైన మూలవాసీ తత్వ చింతనను ప్రచారం చేయటం. ఆ భావజాలంతో ఎదిగిన తరాలను తన పోరాటానికి సంసిద్ధం చేసే రణనీతి ఆయన అనుసరించారు. 1848లో ప్రణాళికాబద్ధంగా ఆయన నడిపిన ఉద్యమం 1873లో వ్యవస్థీకృత నిర్మాణం పొందింది. సత్యశోధక్ సమాజ్ ఆధ్వర్యంలో శూద్ర రైతాంగ ఉద్యమం, కార్మికోద్యమం, వ్యవసాయ కార్మిక పోరాటం, మహిళా ఉద్యమం ఆయన నడిపారు. విధవ స్త్రీలకు శిరోముండనం చేసేందుకు నిరాకరిస్తూ మంగళి కులస్తులతో పుణా పట్టణంలో తొట్టతొలిసారి సార్వజనీన నిరవధిక సమ్మె చేయించిన విప్లవకారుడు ఫూలే.

తన ఉద్యమంలో ముస్లింలు, సిక్కులు, క్రిష్టియన్లను భాగస్వాములను చేసి సామాజిక పరివర్తనకు అంకురార్పణ చేశాడు. అందువల్ల ఫూలే ఆచరణ రంగం బహు విశాలమైంది. అది ఈ దేశ కుల అంతర్వులను, వాటి మధ్య వున్న నిచ్చెన మెట్ల అధికార సంబంధాలను నిర్మూలించేది. కాని, ఫూలేని మరింత కురుచవాదంలో ఇరికించే ప్రయత్నం కె.శ్రీనివాస్ చేయటం విచారకరం. ఫూలేతో జిన్నాను పోల్చటం అహేతుకమైంది.

మహ్మద్ అలీ జిన్నా వాస్తవానికి వైశ్యుడు. ఇస్లాం స్వీకరించిన వైశ్య కుటుంబసభ్యుడు. కాశ్మీరీ బ్రాహ్మణుడైన మోతిలాల్ నెహ్రూ వ్యక్తిగత కార్యదర్శిగా అనేక సంవత్సరాలు పనిచేశాడు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఏ విధంగానూ ఇస్లామీయ జీవనం సాగించనివాడు. ఆయన్ని లౌకికవాది అంటారు. కాని వాస్తవానికి ఆయన బ్రాహ్మణవాది. కులాధిపత్య సామాజిక అంతర్వులున్న ఈ సమాజాన్ని స్వతంత్రం, సమానత్వం, బంధుత్వం, న్యాయం అనే విలువల ఆధారంగా పునర్నిర్మాణం చేయాలనే సంకల్పం ఏ కోశానా లేనివాడు.

అందుకే కాంగ్రెస్ పార్టీ ఆయన్ని ఆల్ ఇండియా ముస్లిం లీగ్‌లో ప్రవేశపెట్టింది. ముస్లిం సమాజానికి నాయకత్వం వహిస్తున్న సర్ సయ్యద్ ఆగాఖాన్ వంటి వారిని దెబ్బతీయడానికీ, కాంగ్రెస్ రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకొనేందుకు అలీ జిన్నాను బ్రాహ్మణులే ప్రమోట్ చేశారు. రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగే వరకు అలీ జిన్నాకు గాంధీ పెద్ద గుర్తింపు ఇవ్వలేదు.

ఆగాఖాన్ వంటి ముస్లిం నేతలు డా.అంబేద్కర్‌ను రౌండ్ టేబుల్ సమావేశాల్లో బలపర్చారు. ముస్లింల సహకారం వల్లే నా జాతి ప్రజలకు ప్రజాస్వామిక హక్కులను సాధించాను అని అంబేద్కర్ అన్నారు. ముస్లిం, అణగారిన వర్గాల మైత్రి బ్రాహ్మణీయ అగ్రకులాల ఆధిపత్యానికి గండి కొడుతుందని గ్రహించిన గాంధీ, నెహ్రూలు అలీ జిన్నాను ముస్లిం లీగ్ నేతగా ఎదిగేలా చేశారు. అలీ జిన్నా ముస్లిం నేతగా ఎదిగిన నాటినుండి అణగారిన వర్గాలకు దూరమై అగ్రకులాలకు చేరువయ్యాడు.

వాస్తవానికి జిన్నా రాజకీయాల్లోకి రావడానికన్న ముందే ద్విజాతి సిద్ధాంతం ఉనికిలో ఉంది. 1857 తిరుగుబాటు కన్న ముందే బ్రాహ్మణులు, బ్రిటీషువాళ్లు జాతిఐక్యత సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టారు. 1875లో ఆవిర్భవించిన ఆర్యసమాజం ఆర్యజాతి సిద్ధాంతంతో రూపొందింది. ముస్లింలను ఒక జాతిగా చిత్రిస్తూ ముస్లిమేతరులను బ్రాహ్మణీకరించే క్రమం అప్పటికే మొదలైంది. బంకించంద్ర చటర్జీ ఆనంద్‌మఠ్ నవలలోనూ వివేకానంద, తిలక్ రచనల్లోనూ ఆర్యజాతి సిద్ధాంతం స్పష్టమవుతోంది.

అది ముస్లిం వ్యతిరేకతను కేంద్రంగా చేసుకొని ప్రచారమైంది. పీడిత కులాలను బ్రాహ్మణీకరించేందుకు తయారు చేసినదే ద్విజాతి సిద్ధాంతం. దీనికి ద్విజులే జన్మప్రదాతలు. అందువల్ల ముస్లిం జాతి అనే భావన అలీ జిన్నాతో ఉనికిలోకి వచ్చింది కాదు. బ్రాహ్మణీకరించే (హిందూవీకరణ) క్రమం స్వతంత్రం తర్వాత మొదలైంది కాదు. కమ్యూనల్ రిప్రజెంటేషన్ అనే ప్రజాస్వామిక సూత్రాన్ని బ్రిటీషు వాళ్లు ప్రవేశ పెట్టడాని కన్న ముందే అది మొదలైంది. ఆ క్రమంలోనే అది చట్టసభల పరిచయంతో తీవ్రమైంది.

సి.రాజగోపాలాచారి కాంగ్రెస్ పార్టీలో ప్రతిపాదించిన దేశ విభజన పథకాన్ని సి.ఆర్ ఫార్ములా అంటారు. దేశ విభజనకు ఎవరు కారకులనే దాని మీద నేటికీ విస్తృత చర్చ జరుగుతోంది. అలీ జిన్నాను బాధ్యున్ని చేసిన వారు సి.ఆర్ ఫార్ములా గురించి గానీ, గాంధీ నేతృత్వంలో బిర్లా హౌజ్‌లో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశంలో దేశ విభజనకు సమ్మతి తెలుపుతూ తీర్మానం చేసిన సంగతిని గానీ అస్సలే ప్రస్తావించరు. కానీ కనీజ్ ఫాతిమా విభజన రాజకీయాలను విపులీకరించిన తీరు ముదావహం.

బ్రాహ్మణీయ శక్తులు దేశాన్ని హస్తగతం చేసుకొనేందుకు చేసిన దుర్మార్గమైన రాజకీయమే దేశ విభజన. ముస్లింలు, ఎస్సీ, ఎస్టీ, బిసీలు అధికార వంచితులు కావడానికీ, అధికార బదలాయింపు తర్వాత బానిసలుగా మారడానికి కారణమైంది. తెలంగాణ ముస్లింలు ఆంధ్ర వలసవాదంలో మగ్గిపోవడానికీ, హైదరాబాదీ తెహ్‌జీబ్ నాశనం కావడానికీ దేశ విభజన పేరుతో బ్రాహ్మణవాదులు అధికారం హస్తగతం చేసుకోవటమే కారణం.

అందువల్ల ముస్లింల పతనానికీ, దురవస్థకూ, అణచివేతకూ స్థానిక మూలాలు వెతికితే సమాధానం దొరకదు. జాతీయ రాజకీయ పరిణామాలు, ఆధిపత్య భావజాల పునాదులను పట్టుకుంటేనే తెలంగాణ ముస్లింల దైన్యానికి కారణాలు బోధపడుతాయి. అందుకే కాబోలు కనీజ్ ఫాతిమా హక్కుల కార్యకర్తగా ముస్లిం అణచి వేతను ప్రత్యామ్నాయ దృక్పథం నుండి విశ్లేషించింది. వాస్తవానికి కనీజ్ ఫాతిమా ముందుమాట విషయ అవగాహనకే కాదు, సాహిత్య క్షేత్రంలో విశాలం కావాల్సిన నవీన దృక్పథానికి మార్గం చూపుతుంది. చరిత్రను ముస్లిం దృక్పథం నుండి చూడాలనే స్పృహను కలిగిస్తుంది.

ముస్లిం కథా చరిత్రను నిర్మాణం చేసుకోవాల్సిన తక్షణ కర్తవ్యం మన ముందు ఉంది. సాహిత్య చరిత్ర రచనలో దేశ విభజన కాలం విస్మరించబడింది. స్వతంత్రానికి పూర్వం, స్వాతంత్య్రోత్తర తెలుగు కథ వంటి భావనలే సాహిత్యకారులు నమ్ముతూ వచ్చారు. కానీ దేశ విభజన సందర్భంగా ముస్లిం రచయితలు రాసిన కథలేమిటి? వాటిలో వ్యక్తమైన ప్రతిస్పందనలేమిటీ? వాటిని పాఠకులు ఏ రకంగా స్వీకరించారు? దేశ విభజన సమయంలో ముస్లిమేతర రచయితలేమి రాశారు?

అభ్యుదయ కథకులు, సంప్రదాయ కథకులు ఆ సమస్యను ఏ విధంగా అర్థం చేసుకున్నారు? ఒకవేళ ఆ ముఖ్యమైన సంఘటన పట్ల రచయితలు మౌనం వహిస్తే, దానికి గల కారణాలేమిటి? వంటి అనేక అంశాలను పరిశీలించాలి. దేశ విభజన వల్ల తలెత్తిన సామాజిక అశాంతి, ముస్లింల మీద జరిగిన దమనకాండ ఆనాటి ప్రజల మనసులను వెంటాడుతూనే ఉంటుంది. దేశ విభజన సమయంలో హైదరాబాదు రాజ్యంలో సంభవించిన రాజకీయ మార్పులు ముస్లింలనే కాదు ఇతర కులాలను కూడా తీవ్రంగా ప్రభావితం చేశాయి.

ఆ జాతీయ సమస్యకు హైదరాబాదీ రచయితలు ఏ విధంగా స్పందించారో పరిశోధించాల్సి ఉంది. కోస్తాంధ్ర రచయితలే కాదు, మద్రాసు కేంద్రంగా పనిచేసిన రచయితల అవగాహన ఏమిటో కూడా నమోదు కాలేదు. అవి నమోదు అయి ఉంటే, ఆ రచనలు అందుబాటులో ఉండి ఉంటే ముస్లిం సాహిత్య గమనం, గమ్యం మరోవిధంగా ఉండేది. ముస్లిం సాహిత్యం బాబ్రీ మసీదు విధ్వంసం తర్వాత ఆరంభమయ్యేది కాదు. స్కైబాబ కథలు మరో విధంగా ఉండేవి.

Saturday 7 January, 2012

అతడు (కథ - 4 జనవరి నవ్య వీక్లీ)


అతడెప్పుడూ అర్థమయ్యేవాడు కాదు!
ఎంతగా అంటే -
చివరికి తనను వదిలేస్తాడని అతడి భార్యే నమ్మలేకపోయింది!
నేను కూడా చాలా ఆశ్చర్యపోయాను!
***
అతడొక ఆలోచనల కర్మాగారం. అతడి వెంటే నీడలా ఉన్నా ఒక్కోసారి అతడు ఎటువైపు దారి తీస్తాడో అర్థం కాక ఆశ్చర్యమనిపించేది. సాధారణంగా నా హెచ్చరికలతో సరైన నిర్ణయాలు తీసుకోవాల్సింది పోయి, అతడే ఎంతో దూరదృష్టితో స్థితప్రజ్ఞతతో ముందుకు దూసుకెళ్తుంటే నేనే అతడిని వెంబడించాల్సి వస్తోంది. అసలు నా ప్రబోధం అవసరమే అతడికి రాకపోవడం అతడి మేధోశక్తికి నిదర్శనం. లోకరీతులకు, ఐహిక... ప్రాపంచిక ప్రలోభాలకు లొంగే మనస్తత్వాన్ని అతడు జయించాడు. అందుకే అతడికి నా అవసరం రావడమే లేదు అనుకొని నా ఇగోకి సర్దిచెప్పుకున్నాను.
అతడా నిర్ణయం తీసుకోవడం నన్నే హతాశుణ్ణి చేసింది...!
***
అతడి ఆలోచనలతో ఒకసారి సంవాదం చేస్తున్నాను. ఎంత డిఫరెంట్‌గా ఆలోచిస్తాడో! అబ్బురమేస్తుంటుంది! కానీ ఎవరితోనూ ఎక్కువగా పంచుకోడు. పంచుకుంటే వెంటనే అతడి ఆలోచనలకు వారు వేయి వంకలు చెప్పి ఆనకట్టలు వేసేస్తుండేవారు. అలా కొన్నిసార్లయాక అతడు ఎవరితోనూ ఎక్కువగా తన ఆలోచనలు పంచుకునేవాడు కాదు. ఒకవేళ మనసు ఆగలేక చెప్పుకున్నా... అవతలి వారి అభ్రిపాయాల్ని వినేవాడు కాదు, 'ఊ' కొడుతూనే! ఒక్కోసారి మాట మార్చేసి వారిని డైవర్ట్‌ చేసి వారేదో మాట్లాడుతుంటే పట్టించుకోకుంట తన ఆలోచనల్లో తను ఉండేవాడు.
అతడంతే! ఎంత ఇమేజరీ అంటే ఆ ఆలోచనల్లో - మాటల్లో చెప్పలేం. అందరూ ఒకలా ఆలోచిస్తుంటే అతడు భిన్నమైన కోణంలో పయనించేవాడు. అతడి ఆలోచన అర్థం కాగానే అప్పటిదాకా ఉన్న అభిప్రాయం పటాపంచలయ్యేది.
కొత్త వంతెన కట్టినట్లు, కొత్త బొమ్మ వేసినట్లు కొంగొత్త తీరు కవిత రాసినట్లు కొత్తరాగం కనుగొన్నట్లు వెరైటీగా ఉండేది అతడి ఆలోచన. నిజంగా ఇలాంటివాడొకడు ఉండాలి అనిపించేది.
అర్థరాత్రి మేల్కొన్నాడంటే ఖతం! ఆ నిశీథి రాత్రి అతడి ఆలోచనలు ఏ బ్రేకర్లు లేని గుర్రాల్లా దౌడు తీసేవి. కొత్త కొత్త మజిలీలు కొనుగొనేవి. తెల్లారాక కొత్త పనేదో తను చేయడమో మరొకరికి పురమాయించడమో జరిగిపోయేది. అసలు అలా కాదేమో.. ఏదో ఒత్తిడి, అసంతృప్తి, అశాంతికి చెందిన సంఘర్షణేదో అతడిలో మెలి తిరుగుతుండేది. అతడిని మేల్కొల్పి లేపి కూర్చోబెట్టేది. ఒకోసారి అదేమిటో అతడికే అర్థం కాక బేచైన్‌ అయ్యేవాడు. చివరికి ఏదో తట్టినట్లయి ఆ మిణుగురు మెల్లమెల్లగా ఒక రూపు సంతరించుకునేది. అది రాసేదయితే అదొక రచనగా రూపుదిద్దుకునేది లేదంటే తెల్లారి ఒక కొత్త కార్యక్రమమై వెలుగు చూసేది.
అవాళ - అతడి ఆలోచనలతో సంవాదం చేస్తున్నానని చెప్పాను కదా.అతడి ఆలోచనల్ని అందుకోవాలని తెగ ఆరాటపడడం ఒక వ్యసనమైపోయింది నాకు. అందుకోలేక బోర్లా పడిపోయేవాణ్ణి. సంవాదంలో ఓడిపోవడమే నాకు నిత్యకృత్యమైపోయింది. ఎప్పుడో ఒకసారి గెలిచేవాడిని. కాని ఆ గెలుపు సంతోషం ఎంతోసేపు ఉండేది కాదు. ఎందుకంటే అతడు దాన్ని తన ఓటమిగా కాకుండా ఆ విషయాన్ని వెంటనే ఒప్పేసుకొని అందులోంచి ఇంకా ముందుకు వెళ్ళే పనిలో ఉండేవాడు. నేను నిరుత్సాహ పడిపోయేవాడిని. వెంటనే తేరుకొని అతనితో పాటు పరుగెత్తడమే సరిపోయేది.
అవాళ అతడి ఆలోచనలతో సంవాదం చేస్తూ చేస్తూ అతడి వేగానికి పరేశానయిపోయి ఎక్కడో స్ట్రక్‌ అయిపోయాను. భయమేసింది అతడి  ఆలోచనకి. తేరుకొని వారించబోయాను. కాని నాలో ఏదో గుంజాటన... అతడు ఆలోచిస్తున్నది ఎంతో సాహసంతో కూడినది. అందులో ఏదో జెన్యూనిటీ ఉందనిపించినా... ఎటూ తేల్చుకోలేకపోయాను. అతడిని వారించడం మాత్రం కష్టం. పైగా అతడి ఆలోచనలో ఈ సిస్టమ్స్‌కి  ఒదగని ఫోర్స్‌ ఉంది. ఓహ్‌... ఆ ఆలోచనకు ఆచరణ రూపమివ్వడం ఎంత కష్టం!
***
ఆ సమయం రానే వచ్చింది. అవాళ ఏదో చిన్న విషయంలో పెద్ద గొడవైంది. ఇద్దరూ మాటా మాటా అనుకున్నారు. అలా కొట్లాడుకుంటారు, ఎప్పటిలాగే తిరిగి మామూలై పోతారనుకున్నాను.
కానీ ఆమె అన్న మాటతో నేను షాక్‌కి గురయ్యాను.
'లాభం లేదు, మనం విడిపోదాం' అన్నదామె.
ఒకటికి నాలుగుసార్లు 'విడిపోదాం' వెనకా ముందు అనేక మాటలు కలిపి అన్నది. నాలుగుసార్లు అన్న తర్వాత అన్నాడు అతడు - 'సరె, అలాగే విడిపోదాం' అని.
'ఈ ఇంట్లో ఉన్నదంతా నా సామానే. ఒక వ్యాన్‌ మాట్లాడి అన్నీ ఎక్కించి పంపించు. నేను వెళ్ళిపోతాను' అన్నదామె కఠినంగా. అతడు కాసేపు తటపటాయించాడు. వెంటనే వెళ్లి మాట్లాడితే - తర్వాత ఇద్దరూ రాజీకొస్తే - అని అతడి ఆలోచన కావొచ్చు. కానీ ఆమె రెట్టించింది.
'ఆగిపోయావేం? వెళ్ళి తీసుకురా!'
'మరి మన బాబు...?' సందిగ్ధంగా ఏదో అనబోయాడు.
'వాణ్ణి నవమాసాలు మోసి - కని - పెంచింది నేను. వాడు నా కొడుకు. నాతోనే వస్తాడు' అన్నది.
అతడు కదిలాడు. నేనతడ్ని వారించబోయాను. అతడు తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. 'తర్వాత ఇబ్బందులు పడతావు. నువ్వు కూడా మొండితనానికి పోకు' అన్నాను. అతడు పట్టించుకోలేదు.
పెద్ద వ్యానొకటి, దాంతోపాటు నలుగురు మనుసుల్ని మాట్లాడుకొచ్చాడు. ఆమె సిరీయస్‌గా అన్నీ సర్దుకోవడం మొదలు పెట్టింది. 'సామాన్లన్నీ కొంచెం వ్యాన్‌లోకి ఎక్కించు. ఇదొక సాయం చెయ్‌' అన్నది.
అంతలో బాబు వచ్చాడు బైటినుంచి. వాడికేమీ అర్థం కాలేదు. 'డాడీ! ఏమైంది?' అనడిగాడు. వెంటనే ఆమె 'ఒరేయ్‌! మనం ఊరెళ్ళిపోతున్నాం, నీ బట్టలు, సామాన్లు సర్దుకో' అన్నది. వాడు అయోమయంగా చూశాడు. 'ఊ! తొందరగా కానీయ్‌' అని మళ్ళీ గద్దించింది ఆమె. వాడు అయిష్టంగా కదిలాడు.
సామాన్లన్నీ అతడు వెంట ఉండి వ్యాన్‌ ఎక్కించాడు.
ఒకటి రెండు వస్తువులను తీసుకెళ్లొద్దని వారించబోయాడు, ఆమె వినలేదు. ఆ వస్తువులు తాను కొన్నవే అని అతడు వాదించలేదు. హాల్లో, బెడ్‌రూమ్‌లోని ఫ్యాన్లతో సహా విప్పించి తీసుకెళ్ళిపోయింది ఆమె.
చివరికి బాబును దగ్గరికి తీసుకుని గుండెలకు హత్తుకున్నాడు. గుండెల్లోంచి ఏడుపు తన్నుకొచ్చింది. తమాయించుకున్నాడు.
'డాడీ! రెండ్రోజులాగి నువ్వు కూడా రా డాడీ... నేను ఫోన్‌ చేస్తాను' అంటూ వాడు ఏడ్వబోయాడు. అతడు వారించాడు.
వ్యాన్‌ కదిలి వెళ్ళిపోతుంటే అతడు ఆమెవైపు చూశాడు. ఆమె కూడా అతడి వైపు చూసి వెంటనే చూపు తిప్పేసుకుంది. అతడు చూస్తూనే ఉండిపోయాడు.
'పన్నెండేళ్ళ బంధం!' అనుకోకుండా ఉండలేకపోయాడు.
***
కళ్ళనిండా నీళ్లతో ఇంట్లోకి వచ్చాడు అతడు. చూస్తే ఖాళీ చేసిన ఇల్లులా - చిందరవందర చెత్తా చెదారంతో నిండి ఉంది.
మిగిలిన సామాను - అంటే అతడి సామాను. ఒక చిన్న టేబుల్‌పై కంప్యూటర్‌, గోడకు రెండు జతల బట్టలు, ఒక బ్యాగ్‌, ఒక షెల్ఫ్‌లో ఉతికిన ఒక జత, రెండు లుంగీలు వగైరా! బనీన్‌ వేసుకునే అలవాటు లేదు కాబట్టి అవి లేవు. బైట మూలన చెప్పులు - అంతే వంట గదిలో కెళ్ళాడు. పాత సామానులా నాలుగు గిన్నెలు పడి ఉన్నాయి. ఒక పాత స్టవ్‌! విరక్తిగా ఒక నవ్వు బైటికి వచ్చింది.
మనసు బాగా అలసిపోయినట్లుగా ఫీలయ్యాడు. హాల్లోకి వచ్చి చూశాడు. ఇన్నాళ్ళు ఒక పక్కగా సెకండ్‌ హ్యాండ్‌లో కొన్న సింగిల్‌ కాట్‌ ఉండేది. దానిపై ఒరిగేవాడు, ఇప్పుడు అది కూడా లేదు.
చెత్తతో పాటు బొద్దింకలు కదులుతున్నాయి. కాసేపు ఒరగాలనిపించింది అతడికి. తలుపు వెనక పొరక మాత్రం ఉంది. తీస్కొని ఖాళీగా ఉన్న సింగిల్‌ కాట్‌ స్థలం వరకు పక్కకు ఊడ్చాడు. బెడ్‌రూమ్‌లో పడి ఉన్న ఒక పాత దుప్పటి తెచ్చి కింద పరిచి మెల్లగా ఒరిగాడు. చేతిని తలకింద దిండులాగా పెట్టుకొని వెల్లకిలా పడుకుని ఫ్యాన్‌లేని కప్పుకేసి చూస్తూ ఆలోచిస్తున్నాడు.
ఏ అవకాశం చిక్కినా అతడిని ఓదార్చాలని చూస్తున్నాను నేను.
***
తమ సంసారం మొదలైనప్పటి జ్ఞాపకాలు ఆవరించాయి అతడిని.
మొదటిసారి హైదరాబాద్‌ వచ్చినపుడు ఒక చాప, ఒక ప్లాస్టిక్‌ బిందె, రాగిచెంబు, బకెట్‌,  ఒక గ్లాసు, నాలుగు గిన్నెలు, బట్టలు - ఇంతే సామాను. అవన్నీ పోయాయి. వద్దు వద్దంటున్నా వాషింగ్‌ మెసీన్‌, బీరువా, మంచాలు, నీళ్ళ డ్రమ్‌, ఫ్రిజ్‌ వగైరా...
ఇప్పుడవన్నీ మళ్ళీ ఖాళీ అయ్యాయి.
ఈ పరిస్థితిని ఇలాగే మిగుల్చుకోగలడా అని అతడు ఆలోచిస్తున్నాడు.
ఎక్కడినుంచి ఎక్కడికి వచ్చాడు. బాధితులు - పీడితులు - అణగారిన జాతులైన దళితులు, స్త్రీలు, బహుజనులు, ముస్లింల గురించి... తెలంగాణ గురించే ఆలోచించే తను... ఉద్యమించే తను... మెల్లమెల్లగా సంసారిగా మారిపోసాగాడు. అప్పుడప్పుడు గ్రహించి సర్దుకోబోయినా సంసారం అతడిని తన బోనులోకి లాక్కోసాగింది.
ప్రతిఘటించబోయినప్పుడల్లా పెద్ద గొడవయ్యేది. ఎంత గట్టిగా ప్రతిఘటించబోతే అంత పెద్ద గొడవ...
'నీకు సంసారం చేయడం రాదు' అని, 'నీతోటివాళ్లు ఎలా ఎదిగారో చూడు' అని ఎన్నెన్ని సూటిపోటి మాటలో... అన్నీ భరించేవాడు.
ఈసారి ఒక చిట్టి కట్టాలని ఆమె పోరడంతో గొడవ మొదలైంది. 'ఇప్పటికే డబ్బులు సరిపోవడం లేదు. చిట్టి కడితే మరింత ఇబ్బందులు పడాల్సి వస్తుంద'ని వారించబోయాడు. ఆమె వినలేదు- 'వెనుకా ముందు ఏమీలేదు. మనలో ఎవరికన్నా ఏదైనా అయితే ఎవరు దిక్కు?' అని అరిచింది.
'నిజమే కానీ... చేతకానిదే చిట్టి కట్టి తరువాత ఇబ్బంది పడడమెందుకు?' అన్నాడు
'మరి చేతకానిదానికి పెళ్ళెందుకు చేసుకున్నావు? వదిలెయ్‌!' అంది.
మాటామాటా పెరిగింది. అలా వెళ్ళిపోయింది. ఇలా వెళ్ళిపోవడం దాకా ఇంతకుముందు కూడా కొన్నిసార్లు వచ్చినా అతడే తమాయించుకునేవాడు. ఆమె తిడుతూ ఉంటే అతడే మౌనం దాల్చేవాడు.
ఎప్పుడో ఒకసారి జరిగే గొడవలు, నెలకోసారి జరిగేదాకా వచ్చాయి. ఈమధ్య మరీ ఎక్కువయ్యాయి. ఈ క్రమంలోనే అతడు తీవ్రంగా ఆలోచించడం మొదలుపెట్టాడు. చివరికిలా ఒక అవకాశం వచ్చింది. నిజంగానే దీన్నిలా ఆచరణలో పెడతాడని నేను ఊహించలేకపోయాను...
అతడు ఏదో స్థిరంగా నిర్ణయించుకున్నట్లు లేచాడు.
***
సింగిల్‌ బెడ్‌ రూం నుంచి సింగిల్‌ రూంలోకి మారాడు, నాకెందుకో అర్థం కాలేదు. జీతం తీసుకోగానే ఉద్యోగం మానేశాడు. మరింత ఆశ్చర్యపోయాను. ముఖ్యంగా సెల్‌నెంబర్‌ మార్చేశాడు. దాదాపు 8 ఏళ్ళనుంచి కాపాడుకుంటూ వస్తున్న ఒకే నంబర్‌ అది. మార్చిపడేశాడు.
పాతమిత్రులు కొందర్ని తనలాగే అంతఃసంఘర్షణ మిగిలి ఉన్నవారిని కలిశాడు. కొందరు - పూర్తి టైమ్‌ కేటాయించకున్నా, సహకారమివ్వడానికి రెడీ - అన్నారు.
ఉద్యమాల్లో చురుగ్గా ఉన్నవాళ్ళను తరచూ కలవడం మొదలుపెట్టాడు. తనకు నచ్చినవాళ్ళతో ఒక అంతర్గత సమావేశం ఏర్పాటు చేశాడు. తాను ఉద్యమించడానికి మిగిలి ఉన్న స్పేస్‌ను ఉపయోగించుకోవడం మొదలుపెట్టాడు. ఇటు తెలంగాణ అటు బహుజన ఉద్యమ అవసరాన్ని గుర్తించాడు. కొందరు యువకుల్ని ఆలోచనాపరుల్ని ఐడెంటిఫై చేశాడు. చలో... తిరిగి అతడి రూమ్‌లో హల్‌చల్‌ మొదలయింది. వచ్చేవాళ్ళు, పొయ్యేవాళ్ళు, చర్చలు, సమావేశాలు, సభలతో బిజీ అయిపోయాడు.
మళ్లీ పెళ్లికాక ముందరి జీవితం, పెళ్ళయినాక కూడా కొన్నేళ్ళు సాగిన జీవితం... తిరిగి అతణ్ణి ఆవరించింది.
మధ్యమధ్యలో ఆమె గుర్తొచ్చేది. బాబు గుర్తొచ్చేవాడు. మనసు బాధతో మెలి తిరిగేది. ఒకోసారి ఏడ్చుకునేవాడు. ఆ సమయంలో ఉద్యమ సాహిత్యం చదువుకునేవాడు. మధ్యలో ఒకటి రెండుసార్లు అతని మానసిక సంఘర్షణ చూళ్ళేక ఆమెకు ఫోన్‌ చేయమని సలహా ఇచ్చాను. అతను నిగ్రహించుకున్నాడు కానీ ఫోన్‌ చేయలేదు.
కొన్నాళ్ళకు ఒక మిత్రుడి ద్వారా తెలిసింది - ఆమె అతని గురించి చాలామందిని వాకబు చేసిందని. దాంతో అతనితో చాలా వాదించాను. అయినా వినలేదు.
***
ఒకరోజు -
అర్థరాత్రి... మూడు గంటలవేళ అతడికి మెలకువ వచ్చింది. కాసేపు అటూ ఇటూ మసిలాడు. నిద్ర పట్టకపోయేసరికి లేచి కూర్చున్నాడు.
మళ్ళీ ఏదో కార్యక్రమమో, ఉద్యమమో, రచనో రూపుదిద్దుకుంటుందని అదేంటో చూడాలని ఆసక్తిగా ఎదురు చూడసాగాను నేను.
ఏదో రాయాలనుకున్నాడట్లుంది. కాని మనసు సహకరించలేదు. మళ్ళీ పక్క మీద ఒరిగాడు. పక్కకి చూస్తే కొన్నేండ్లపాటు తన పక్కనే పడుకొని ఉన్న ఆమె... బాబు గుర్తొచ్చినట్లుంది. కళ్ళల్లో మెల్లగా నీళ్ళు తిరిగాయి.. కాని తమాయించుకుంటున్నట్లనిపించింది.
ఇదే అదను అనుకొని అడిగాన్నేను. ఎన్నాళ్ళ నుంచో అడగాలనుకుంటున్న ప్రశ్న - 'ఆమెను, బాబును దూరం చేసుకొని ఏం చేస్తున్నావు నువ్వు? ఇది తప్పు కాదా' అని.
అతడు కొద్దిసేపు ఆలోచించాడు. ఏం జవాబిస్తాడా అని ఆతృతగా, ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. 'అంతకన్నా పెద్ద ప్రయోజనకరమైన పని చేస్తున్నప్పుడు అర్థం చేసుకోగలిగిన బాధితులైతే తప్పక క్షమిస్తారు.
తను బతకగలదు, సాధ్యమైతే వేరే పెళ్ళి చేసుకోగలదు. ఉద్యోగం చూసుకోగలదు. తనకు కావలసిన రీతిగా ఇంటిని, సంసారాన్ని ఏర్పర్చుకొని నడుపుకోగలదు. ఆమాత్రానికి నేనెందుకు? వేరే ఏ సంసారి అయినా సరిపోతాడు. నేను చేయాల్సిన పని వేరే ఉంది!
ఒక్కరికోసం నేనప్పుడు నలుగురికి దూరమయ్యాను. ఆ ఒక్కరిని దూరం చేసుకొని నేనిప్పుడు నలుగురికి దగ్గరయ్యాను..!' అన్నాడు.
స్థాణువునై చూస్తూండిపోయాను నేను. అతడి అంతరాత్మగా నేనే ముందుండాలి. కాని ఈసారి కూడా అతడే ముందుండడం నాకు అసూయను, ఆశ్చర్యాన్నీ కలిగించింది. అయినా తేరుకొని అతడిని అభినందించకుండా ఉండలేకపోయాను!
('అతడి' దృష్టికోణం నుంచి జరిగిన క థ ఇది. దీన్ని తిరగేస్తే 'ఆమె' దృక్కోణంలోకీ మారుతుంది)