Monday, 14 December, 2009

లొంగని వీరుడికి సలాం!

ఒక్కో భూమ్మీద
ఒక్కో పేరుతో పుట్టుకొస్తుంటాడు
లొంగనితనం వీరుడి మాతృక

తన నేలను ఖబ్జా చేస్తూ
తన నాలుకనే తెగ్గోస్తున్న వాడికి
చివరి శ్వాస దాకా లొంగనితనం
వీరుడి పోరాట రూపమే....

నీళ్ళను కొల్లగొట్టి-
ఆకుపచ్చదనాన్ని కొల్లగొట్టి
బీళ్ళు చెయ్యజూస్తుండు శత్రువు
పెట్రోలును కొల్లగొట్టి-
సకల జీవత్వాన్ని కొల్లగొట్టి
ఎడారులే చెయ్యజూస్తున్నడు శత్రువు
వీరుడన్నవాడు సై అంటాడా
వీరుడన్నవాడు ఖామోష్‌గుంటాడా
ఖబర్దార్‌ అంటూ గుండెల్లోంచి కేక వేస్తాడు
భూమి తల్లికోసం బలిదానమవుతాడు
ఇరాకీ పిల్లవాడి తెగిన కలల రెక్కలు చూసి
చలించకుండా ఎవడుండగలడు?
వేల ఒక జాతి జనాన్ని
సమాధి చేయడం చూసి
రగలకుండా ఎవడుండగలడు?
ప్రపంచపటంమీద ఒక జాతి వతన్‌నే
మాయం చేయాలనే కుట్రను చూసి
ఎవడు భరించగలడు?
రేపు మరొక దేశం
ఖబ్రస్తాన్‌ అవబోతుండడం చూసి
ఊకుండగలడా?
చుట్టూరా చేతులు కట్టుకొని చూస్తున్న
దునియా
ఘడియకో మాటమార్చే దునియా
సిగ్గూ శరం లేకుండా
సాష్టాంగపడే దునియా
లొంగని వీరుడిముందు బలాదూర్‌
వీరుడెప్పుడూ నిజం మీదే నిలబడతాడు
వెన్నెముకే ఆయుధంగా కలబడతాడు
శాంతికోసమే ఆయుధం పడతాడు
ఓడిపోవచ్చు
కాని లొంగిపోడు
ఒక్కో భూమ్మీద ఒక్కో పేరుతో పుట్టుకొస్తుంటాడు
లొంగనితనం వీరుడి చిరునామా

వీరుడు బరిసెనో బాణాన్నో పట్టినప్పుడు
తెల్లోడు బందుఖుతో వచ్చాడు
వీరుడు బందూఖు పట్టినప్పుడు
తెల్లోడు బాంబు లేశాడు
వీరుడు బాంబులేద్దామంటే
తెల్లోడు మిసైళ్ళు ప్రయోగిస్తున్నాడు
శత్రువు గెలవొచ్చు
జనంలో వీరుడే నిలుస్తాడు
ఒక్కో భూమ్మీద ఒక్కో పేరుతో పుట్టుకొస్తుంటాడు
లొంగి బతకడం వీరుడి నైజం కాదు

రాళ్ళను పగులగొట్టే వాళ్ళల్లోంచి
ఇనుమును కరగదీసే వాళ్ళల్లోంచి
నీళ్ళను మండించే వాళ్ళల్లోంచి
ఒక్కో వీరుడు పుట్టుకొస్తూనే ఉంటాడు
ఒక్కో చోట ఒక్కో పోరాట రూపం తీసుకుంటాడు
శత్రువు బలవంతుడే కావచ్చు
జిత్తుల మారోడే కావచ్చు
నిజం వీరుడి చేతిలోనే ఆయుధంగా నిలుస్తుంది
నిజం వీరుడి చేతిలోనే ఆయుధమై మెరుస్తుంది
చివరి మాట దాకా
నిజమే వీరుడి నోట పలుకుతుంది
'సామ్రాజ్యవాదం డౌన్‌ డౌన్‌! అమెరికా డౌన్‌ డౌన్‌!'

జడ పదార్ధాలకు
రాజుకునే గుణాన్నిచ్చే ఉత్ప్రేరకం
నిశ్చల నరాల్లోకి
వెచ్చని ఊపిర్లూదే ప్రాణవాయువు
లోకమంతా పాకుతున్న
లొంగిపొయ్యే వైరస్‌ను నిలువరించే రెసిస్టెన్స్‌
ఒక్కో భూమ్మీద
ఒక్కో పేరుతో పుట్టుకొస్తుంటాడు
ఉరకలెత్తే ఉడుకురక్తాల ఆత్మల్లోకి ప్రవేశిస్తుంటాడు

ఇజ్రాయెల్‌ యుద్ధట్యాంకుపై రాయి విసిరే బాలుడో
తెల్ల రక్కసి మూక మధ్య పేలే మానవబాంబో
స్వేచ్చను కోరే కశ్మీరీ గొంతుకో
నిజమైన పౌరసత్వం కోసం నినదించే భారత ముస్లిమో
ఒక్కో భూమ్మీద ఒక్కో పేరుతో పుట్టుకొస్తుంటాడు
ఒక్కో చోట ఒక్కో రూపంలో ప్రతిఘటన
ఒక్కో స్థాయిలో పోరాటం
పోరాటం ఎక్కడైనా పోరాటమే కదా
దురాక్రమణ ఎవడు చేసినా దుర్మార్గమే కదా
వీరుడు పోరాడుతున్న భూమి
ఎకరమో...రాష్ట్రమో... దేశమో...
నాటి బందగీకి సలాం
నేటి తెలంగాణ పోరుబిడ్డకి సలాం
ఆజాదీ వీరుడికి సలాం
పాలస్తీనా చిరునవ్వు అరాఫత్‌కి సలాం
ఇరాకీ గర్జన సద్దాంకి సలాం
భూమికోసం పోరాడుతున్న వీరుడికి సలాం!
మాతృభూమి కోసం పోరాడుతున్న వీరుడికి సలాం!
                                                                          -స్కైబాబ
(నేటి తెలంగాణ ఉద్యమానికి.. ఉద్యమంలో అసువులు బాసిన తెలంగాణ బిడ్డలకు..)

Tuesday, 1 December, 2009

చాంద్ తార

'చాంద్ తార' పేరు తో ఈ మధ్య నేను, షాజహానా రాసిన రెండు వాక్యాల కవితలు పాకెట్ సైజ్ పుస్తకం గా వేశాం. ఒక వాక్యం చాంద్, ఒక వాక్యం తార అనుకున్నాం. ఈ పుస్తకానికి పెన్నా శివరామకృష్ణ ముందుమాట రాశారు. నేను రాసిన కొన్ని చాంద్ తార లు ఇవి. మరికొన్ని మరోసారీ..


***
విహరిస్తూ చంద్ర భ్రమరం 
అడవి ఒక ఆకుపచ్చని పుష్పం

***
చీకటంటే భయమనిపించదు
చిన్నప్పుడు అమ్మీ బుర్ఖాలో తలదాచుకున్నట్లుంటుంది
***
వర్షం మొదలయ్యింది 
గొడుగు పువ్వుకు నన్ను కాడను చేస్తూ 
***
ఉర్సులో రోల్డుగోల్డు హారం కొన్నది అమ్మీ 
అబ్బా మొఖం చిన్నబోయింది 
***
మా నానిమా 
పండిపోయింది పాన్ నమిలి నమిలి
***
అటు కాకికి ఇటు నాకు నోరూరిస్తున్నది 
కవాబుల దండెం
***
కాలువ, నేను పక్కపక్క నడుస్తున్నం
అది పొలంల కలిసింది, మరి నేను?
***
బస్సు కదిలింది 
దిగులుగా చేతులూపుతూ ఓ ఒంటరి చెట్టు 
***
చేపల పులుసు తలపుకొస్తే
ఎండిన చెరువుల నీళ్ళు నోట్లె ఊరబట్టె
***
పూలను తన్మయంతో చూస్తుంటావు 
ప్రపంచమూ నిన్నలా చూడొద్దూ
                                               - స్కై బాబ 

Monday, 23 November, 2009

రెహాల్

కన్నీటి దారాల్తో జీవన వస్త్రానికి మాసికలేస్తూ
తరాల చీకటి కమ్మేసిన గోషా లో
పాలిపోయిన చంద్రశిలా దేహంతో
అనుక్షణం
'బిస్మిల్లా ఇర్రహ్మాన్ నిర్రహీమ్' అనే కదులుతుంది అమ్మీజాన్

మొహంపై వేలాడుతున్న నైరాశ్యాన్ని
'వజూ' నీళ్ళతో పుక్కిలించి
తలనిండా చిరుగుల 'దుపట్టా' కప్పుకొని
నమాజ్ చదువుతున్నపుడు...

మెరుపు వెలిసిన అమ్మీ దోసిలిలో
రాలిన కన్నీటి తడిపై
ఏ దేవుడూ సాక్షాత్కరించడు
ఒక అపనమ్మకాల బొమికల గూడు ప్రతిబింబిస్తుంది

అస్తమయం వైపుకు మోకరిల్లి ప్రార్ధిస్తూ
మా జిందగీల్లో సుర్యోదయమౌతున్దనుకుంటుంది అమ్మీ

మాకోసం 'దువా' చేసి చేసి
అమ్మీ గొంతు తడారిపోతుందే తప్ప...
ముందు కూర్చున్న నీడ విస్తరించి
కటిక రాత్రై పరచుకుంటుందే తప్ప...
....... ......... ......... ......... .......!

'తల్లి పాదాల వద్ద స్వర్గం ఉందంటారు'
మా అమ్మీ పాదాలకై వంగిన ప్రతిసారీ
చెమరిన నా చూపు
ఆమె పాదాల పగుళ్ళలో చిక్కుకుని గిలగిలలాడుతుంది

అబ్బాజాన్ అసహాయత చెల్లిని ఎవడికో
రెండో పెళ్ళాంగా అంటగడితే
ఆ చిట్టితల్లి కళ్ళల్లో ఉబికిన కన్నీళ్ళ మీద
వణికే దృశ్యమై తల్లడిల్లుతుంది అమ్మే

కాన్వెంట్ కు బదులు కార్ఖానా కెళ్ళే తమ్ముడు
సాయంత్రానికి కమిలిన దేహంతో అల్లుకుపోతే
పగిలిన లేత స్వప్నం గుచ్చుకొని విలవిల్లాడేదీ అమ్మే

కడుపులో మా భారాన్ని మోసి
కష్టాల మా బాధ్యతలు మోసి
కళ్ళ గుమ్మానికి కట్టిన పరదాల వెనక ప్రాతివత్యాన్ని మోసి
తన కనుబొమ్మల నెలవంకల మీద
చీకటి రాశుల్ని మోస్తున్న అమ్మ
చివరకు
ఖురాన్ ను మోసే 'రెహాల్' మిగిలిపోవలసిందేనా ?
                                                                             - స్కై బాబ 
రెహాల్ : వ్యాస పీఠం

Friday, 13 November, 2009

సూఫీ దేవుడు

అబ్బాజాన్ నవ్వుతున్నడు
చిన్న పిలగాని లెక్క
చిటికెన వేలందించి
నాతో తప్పటడుగులు వేయించిన అబ్బా
ఇయాల నా చెయ్యి పట్టుకొని
అడుగేస్తానికే తడబడుతుండు


పక్షవాతపు ఒళ్ళు తూలినప్పుడల్లా
నవ్వుతున్నడు అబ్బాజాన్
పసి పిలగాని లెక్క
     *          *
నిండైన గడ్డం - టోపీ పెట్టి
తెల్లని లాల్చీ - లుంగీ కట్టి 
కదిలొస్తుంటే 
అచ్చం ఆ సూఫీ దేవుడే ... ... !


పీర్ల ముందూ నువ్వే 
కందూర్ల ముందూ నువ్వే 
పుంజునో పోతునో హలాల్ చెయ్యాలన్నా
ఫాతెహా లియ్యాలన్నా నువ్వే
తేలు కరిసినా పురుగు ముట్టినా 
నీ మంత్రమే కావాలె
పసి కందులకు నీ అంత్రమే కట్టాలె
ఏ ఇంట్లో ఏ ఆపదొచ్చినా - నొప్పొచ్చినా
గుర్తొచ్చే మొదటి దేవుడా !
నీ మాట చాలు - నీ ఆభయమే 'మేలు' !


సుక్క పొడవక ముందే
ఎన్ని ఇండ్లల్లో పలికేదో - నీ పేరు
'మదారు సాబు కాడికి తోల్క పోవాలె '
మదారు సాబును పిల్సుక రావాలె '
మాల మాదిగలూ సూదర్ల బారు !
          *
చేతులెత్తి నువ్వు దువా చేస్తే 
ఊరందరికీ కొండంత అండనిపించేదే..
మరి మన ఇల్లెందుకు అబ్బాజాన్ 
పడావు పడ్డది 


దువా చదివి నువ్వు జుబా చేస్తే

ఆ ఇంటిల్లాదులకూ కందూరు పండుగయ్యేదే..
మరి మన ఇంటోళ్ళ కెందుకు అబ్బాజాన్
ఉపాసముండని రోజు లేకుంటయ్యింది 


మనకు చేలేందుకు లెవ్వో - చెల్క లెందుకు లెవ్వో
పొల మెందుకు లేదో - తల మెందుకు లేదో
చేతిలో ఆరె ఎందుకు లేదో
ఇంటి ముందు సారె ఎందుకు లేదో
ఇంట్లో మగ్గం ఎందుకు లేదో
ఏనాడూ చింత చెయ్యవైతివి అబ్బా
రిజర్వేషన్ మాటెత్తితే 
సర్కారు బిచ్చం మనకెందుకురా అంటివి


గొంతెత్తి పాడేటోనివి - నిర్వేదంగా..
'యే దునియా యే మహెఫిల్
మెరే కామ్ కీ నహీ మెరే కామ్ కీ నహీ..'
          *
చేతులెత్తి నువ్వు దువా చేస్తుంటే 
భూగోమే  మెల్లమెల్లగా చిన్నదై
నీ కాళ్ళ కింద చేరి చిన్నబొయ్యేది


ఊరందరి నోట్లో నాలుకైన నువ్వు 
ఇంటి పరేశాన్లకు బైటివాడివైతివి


'భద్రత' తెలియని నిరంది
సొంతానికీ.. కుటుంబానికీ..
అంతా బేగం మీద వోదిలేసే బేచింత !


నువ్వే అదృష్టవంతుడివేమో అబ్బా
అందరిలా ఏదో ఇంకేదో సంపాయించాలనే
యావేదీ లేకుండా బేఫికర్ గా బతికినవ్
ఎవరేమనుకుంటే నీకేంది
అది నీ తత్వమో - 'నసల్ ' నైజమోమాక్కూడా నీలాగే  బతకాలని ఉంది 
జర  గా  ఉపాయం చెప్పరాదే !
     *            *
అబ్బాజాన్ నవ్వుతున్నడు
నిర్వేదంగా...


అబ్బాజాన్ నవ్వుతనే ఉన్నడు
మారని మమ్మల్ని చూసో...
మారిన లోకాన్ని చూసో...
                                         - స్కై బాబ 


Wednesday, 11 November, 2009

ఈద్ కా చాంద్

 చీకటి గుండం లా నువ్వు ఎదురుపడ్డప్పుడల్లా
నీ కనుపాపల్లో నా ప్రతిబింబాల్ని తప్ప ఏం ఏరుకోగలిగాననీ...

అంతా రంజాన్ కోసం ఎందుకు ఎదురుచూస్తారో గాని
నేను మాత్రం నిన్ను చూడొచ్చనే ఆశతోనే...

'అస్సలామలైకుమ్' తో నువ్వు శిర్ ఖుర్మా అందిస్తుంటే
జిగేల్ మన్న తారల మధ్య ఆ చాందే నా దిక్కు వొంగినట్లు...

ఒఫ్ఫో...
సంవత్సరం పొడుగూతా
రంజానే అయితే ఎంత బాగుండో...

ప్చ్...
నిన్ను అలాయిబలాయి తీసుకునే అవకాశమన్న ఉంటే
నా దిల్ అలజడిని నీ గుండెలకు చేర్చేటోన్ని గదా...!
                                                                   - స్కై బాబ 

Monday, 9 November, 2009

'సర్వేంద్రియానాం ... ... ...!'
అందమైన చిన్నప్పటి కన్ను పాఠం...
కన్ను బొమ్మ ఎంత ముద్దుగా గీసేటోన్నో
ఇప్పటికి కళ్ళల్ల తిరుగుతున్నది
చిన్నతనం పెన్సిల్ మల్లమల్ల దిద్దిన నెమలి కన్ను
కన్ను అంటె సాలు- అందమైన బొమ్మే మెదిలేది
పెద్దయినంక తెలిసొచ్చె-
అందమైన కన్నుకు - మాకు శానా దూరమని..
అరెరే... తేరుకునే లోపల్నే
కాలం కన్ను సొనకారిపాయె

ఇప్పుడు కన్ను అంటె-
ఎంతకు నిద్దర పట్టక
జీవం లేనట్లు కదలాడే గరీబు ఖాజామియా..
పంక్చర్లు బాగుచేసే ఉస్మాన్ భాయ్ డీలాపడ్డ చూపు..
మా అమ్మీ కంటి కింద నల్లగా- పగిలిన రేగడి!
ఊర్లె శానా ముస్లిం ఇండ్లల్ల పెండ్లి కాని చెల్లెల్లా-
అబ్బాజాన్ పక్షవాతపు రెప్పల మధ్య అడ్డంగా..
కళ్ళద్దాలు మసకబారి కుట్టుమిషిన్ సూదిల
దారం ఎక్కని నానీమా తనుకులాట..
ఇయాల కన్ను అంటె-
కొడుకు గూడలు పట్టుకొని లేవాల్సింది పోయి
చీకటిపడితే గోడలు పట్టుకొని నడిచే మాదిగ ఎంకయ్యతాత..
ఎద్దు కొమ్ము విదిలిస్తే
కారిపోయిన నాగయ్య మామ కొడుకు ఒంటరి చూపు..
పగిలిన ఒంటి కన్ను అద్దంతో
కనాకష్టాలు పడే పెరిక లచ్చువమ్మ..
చిన్నతనంలో కొడుకుని తడిమి తడిమి చూసుకున్న యాదిల
వాడు తప్పిపోయిన పట్నం బాటకు అతుక్కొని చితికిపోయిన ఈదయ్య కక్కయ్య..

అయ్యో.. తల్చుకుంటే ఊరంతా పరేశాన్లతోని
కళ్ళన్నీ గుంతలు పడి చూపానకుంటయ్యె
కన్ను ఇప్పుడు అందమైన బొమ్మ కాదురా తమ్మీ
అగాధపు లోతుల్ని చూపే గుంత..
మా ఊరే ఇప్పుడు
కన్ను ఊడబెరికిన ఖాళీ బొయ్యారం !
                                                 - స్కై బాబ

Thursday, 30 July, 2009

దీమక్ : చెద

'నౌకరి సంపాయించుకోలేదా?
ఉద్యోగం పురుష లక్షణం' అన్నారు
కొన్ని ఈకలు రాల్చి ఉద్యోగం సంపాదించుకున్నాను
నాకిష్టమైనవి వదిలి - పగలంతా
మా యజమానికి ఇష్టమైనదే చేయబట్టాను

'ఇంకా షాదీ చేసుకోలేదా
ఎ వయసులో జరగాల్సింది ఆ వయసులో జరగాలి' అన్నారు
కొన్ని రూకలు పుచ్చుకొని పెళ్లి చేసుకున్నాను
మిగిలిన నాకిష్టమైన వాటిల్లో
సగం నా భార్య కోసం వదిలేశాను - రాత్రులతో పాటు

'ఇంకా పెళ్లి చేసుకోలేదా
ముసలోల్లయ్యేనాటికి దాచుకున్న పైసలో
చేతికొచ్చిన ఔలాదొ ఉండాలి' అన్నారు
కొన్ని నూకలు సంపాదించి పిల్లల్ని కన్నాను
నా కిష్టమైనవి ఇంకొన్నింటిని వదులుకున్నాను

'ఇంకా ఇల్లు కట్టుకోలేదా
సొంత మకాన్ లేకుండా ఎన్నాళ్ళు' అన్నారు
కొన్ని అప్పులు చేసి ఇల్లు కట్టాను
దాని చుట్టే తిరుగుతున్నాను
మిగిలిన ఇష్టాలూ వొదులుకొని..
- స్కై బాబ