Thursday 28 February, 2013

అనేక ఆధిపత్యాలపై ఒక్కుమ్మడి పోరు 'జగ్‌నే కీ రాత్‌'


కవి స్వాప్నికుడు. నిస్సహాయుడు కూడా. స్కైబాబ ఇందుకు మినహాయింపు కాడు. పైగా సమాజంలో జరుగుతున్న అన్ని దురాగాతాలకు తల్లడిల్లిపోతాడు. గుక్క పడతాడు, నిప్పులు చెరుగుతాడు. అన్ని ఆధిపత్య ధోరణులను తూలనాడే తత్వం స్కైబాబ కవిత్వానికి ఉన్న లక్షణం. స్కైబాబ కవితా సంకలనం 'జగ్‌నే కీ రాత్‌' చదువుతుంటే సిద్ధులగుట్ట కాడ నిప్పుల గుండం తొక్కుతున్నట్లు వుంటుంది. ఈ తీవ్రత కవిత్వానికి రావడానికి కారణం స్కై అంతరంగంలో ఎడతెరిపి లేకుండా భగభగ మండుతున్న ఆలోచనా స్రవంతే కారణమని అనిపిస్తుంది. ఒక దారం పోగు లాగుతున్న కొద్దీ సాగినట్లు ఆ ఆలోచన ధార ముందుకు సాగుతూ పోతుంటుంది. 'జగ్‌నే కీ రాత్‌' సంకలనంలోని చాలా కవితలు ఈ విషయాన్ని పట్టిస్తాయి. అప్పుడప్పుడు స్కై వ్యక్తీకరణలకు హేతుబద్దత లేనట్లు కూడా అనిపిస్తూ వుంటుంది. అది పైకి కనిపించే లక్షణం. కవిత్వాన్నంతా కాకపోయినా ఏ కవితకు ఆ కవిత చదివినా స్కై సమంజసమైన ఆగ్రహం మన మనసులను తాకి లోలోన మంటలు పుడుతూ వుంటాయి. 

కవిగా స్కై ఇప్పటి వరకు చేసిన ప్రయాణాన్ని 'జగ్‌నే కీ రాత్‌' తెలియజేస్తుంది. ఇందులో మూడు దశలు కనిపిస్తాయి. మొదటి కవితలు తాను స్త్రీగా, ఒక తల్లికి కొడుకుగా ముస్లిం సమాజంలోని స్త్రీని మతం పేర, ఆచారాల పేర అణచివేస్తున్న తీరును ప్రశ్నిస్తాడు. ఇస్లాం మతం పేర పురుషాధిక్యత ఎంత దుర్భరంగా వుందో, స్త్రీల పట్ల ఎంత దాష్టీకంగా వ్యవహరిస్తుందో స్కై చెబుతాడు. ఈ కవితలు మెజారిటీ హిందూ సమాజం ఆమోదించి, హర్షించే భావజాలానికి సంబంధించినవి. ఇది స్కై ముస్లిం సమాజంలోని వ్యక్తిగా చేసిన అంతర్గత పోరాటంలో ఒక భాగం. 

రెండో రకం కవితల విషయానికి వస్తే - దళితులతో స్కై మమేకమవుతూ లేదా వారితో ఐక్యతను చాటుకోవడం కనిపించే కవితలు. 'డప్పు కొట్టడమే న్యాయం', 'మర్ఫా', 'ముస్లింవాడలు', 'జల్‌జలా' ఇందుకు కొన్ని ఉదాహరణలు. ఈ దేశంలోని మెజారిటీ ముస్లింల స్థానీయతను, తమ వారసత్వాన్ని చాటే కవితలు ఇవి. నిజాం పాలనలో దళితులు తమ చెంతకు వచ్చిన అవకాశాన్ని వాడుకుని ఇస్లాంలో చేరి తమ కుల వివక్షను, అణచివేతను అధిగమించే ప్రయత్నం చేశారు. ముస్లింల్లో చాలా మంది విదేశీయులు కారనే ఒక ఎరుకతోనే కాకుండా ఆ విషయాన్ని బలంగా చెప్పడానికి స్కై ఈ కవితలను ఉపయోగించుకున్నాడని అనిపిస్తుంది. 
ఇక, అసలు విషయానికి వస్తే, స్కైని ఒక వివాదాస్పదుడైన కవిగా, కాలకంఠుడిగా చూపించే మూడో రకం కవితలు. ఇక్కడ స్కై ముస్లింగా, తెలంగాణవాడిగా, వర్ధమాన దేశాల ప్రతినిధిగా గొంతు విప్పుతాడు. ఈ మూడు లక్షణాలు చాలా కవితల్లో విడదీయరానంతగా కలగలసిపోయి కనిపిస్తాయి. ఈ మూడు విషయాల్లోనూ స్కై వివక్షకు, అణచివేతకు, దోపిడీకి గురవుతున్నవాడే. తనపై, తన సమాజంపై జరుగుతున్న ముప్పేట దాడిని గ్రహించి, అర్థం చేసుకుని తీవ్ర ఆగ్రహానికి గురై ఏమీ చేయలేక నిస్సహాయతతో అర్థరాత్రి లోకాన్ని నిద్ర లేపి చెప్పే ప్రయత్నం నుంచి వెలువడిన కవితలు ఇవి. దాని వల్ల స్కై కవితలకు ఒక సంకీర్ణ లక్షణం అలవడింది. ఈ సంకీర్ణత వల్ల ఏ పంక్తికి ఆ పంక్తినో, ఒక కవితలోని ఒకటి రెండు పంక్తులనో విడగొట్టి వ్యాఖ్యానించడం కుదరదు. అలా వ్యాఖ్యానించడానికి పూనుకుంటే స్కై అరాచకుడిగా, అనామోదయోగ్యుడిగా కనిపిస్తాడు. 

నిజానికి, సభ్య సమాజం కళ్లు చెదిరే భావతీవ్రత స్కైది. గుండెను మెలి పెట్టి నెత్తురును సుడులు తిప్పే తీవ్రత అతని కవితలది. తీవ్రమైన ప్రభావం చూపడం వల్ల మనలోని స్థిరీకృత భావజాలం దారం తెగిన పతంగిలా కొట్టుకుంటుంది. అందుకే మనకు స్కై మీద తప్పకుండా కోపం వస్తుంది. మనది సభ్య సమాజపు అసహనమని తెలుసుకోవడానికి కొంత సహనంతో ఆలోచించాల్సి వుంటుంది. అలా సహనంతో, సానుభూతితో ఆలోచించినప్పుడు గానీ, ఇక్కడ జరుగుతున్న అనేకానేక హింసారూపాలు, దాష్టీకాలు, అణచివేతలు మనల్ని కలవరపెడుతున్నప్పుడు గానీ స్కై ధర్మాగ్రహం మనకు కొంత అర్థమవుతుంది. ఆ తర్వాత అతని కవితలను ముక్కలు ముక్కలుగా కాకుండా ఒక మొత్తాన్ని చదివినప్పుడు అది మరింతగా అర్థమైపోయి స్కై ప్రస్తుత సమాజానికి అవసరమైన కవిగా కనిపిస్తాడు. 

'సర్బకఫ్‌' కవితలో పదే పదే వచ్చే 'తలకు కఫన్‌ కట్టి కదులుతున్నాం' అనే పంక్తి, ఇదే కవితలోని 'ఇస్‌ దేశ్‌ మే/ జిత్‌నా ఖూన్‌ ముసల్మాన్‌ కా బహాయా గయా/ ఉస్‌కా అంజామ్‌/ బహుత్‌ మహెంగా పడేగా..' అనే చివరి పంక్తులు, 'ఆకుపచ్చతో మొదలవుతున్నా' పంక్తి స్కైని పచ్చి మతవాదిగా చూపించడానికి ఆస్కారం వుంది. అందుకే స్కై కవితలను ఎక్కడికక్కడ పోగులు పెట్టకుండా చదివితే తప్ప స్కై ఆశిస్తున్నదేమిటి, స్కై ఎక్కడ నిలబడి మాట్లాడుతున్నాడు అనేది అర్థం కాదు. 'సర్బకఫ్‌' కవితలోనే 'ఈ మట్టిని తొలుచుకుని మొలకెత్తినవాళ్లం', 'మా మాతృప్రేమను ఎవర్రా శంకించేది' వంటి పంక్తులు వుండడమే కాకుండా వాటికి ముందూ వెనుకా స్కై భావజాలం పరుచుకుని వుంది. దీనికి తోడు మిగతా కవితలు పాలకుల దుష్టనీతిని, అగ్రరాజ్య ఆధిపత్యాన్ని వ్యతిరేకించే బలమైన కవితలున్నాయి. తెలంగాణ అస్తిత్వ ఉద్యమాన్ని సొంతం చేసుకున్న భావజాలమూ వుంది. తన మత ప్రతీకలను వాడుకుంటూ ఈ నేల మీద తనకూ హక్కు వుందని ప్రకటించుకోవడం, స్థానిక దళితులు, తెలంగాణ ప్రజల ముఖాల్లో తన ముఖం వెతుక్కోవడం స్కై కవితల్లో చూస్తాం. హిందూ మత ప్రతీకలను కాకుండా ముస్లిం మత ప్రతీకలను స్కై వాడుకున్నాడు. హిందూ మతఛాందసులను ఎదుర్కోవడానికి స్కై ఇస్లాం మత ప్రతీకలు బాగా ఉపకరించాయి. యుద్ధం చేయడానికి కొత్త పనిముట్లను స్కై తయారు చేసుకున్నాడు. దళిత కవిత్వం ఆధిపత్యాలపై పోరుకు క్రైస్తవ మత ప్రతీకలను బలంగా వాడుకోవడం ఇలాంటిదే. 

అభ్యుదయ కవిత్వానికి జవసత్వాలిచ్చే సందర్భంలో శ్రీశ్రీ గొంతు కూడా ఈ రకంగానే పలికింది. శ్రీశ్రీ హిందూ మత ప్రతీకలనే కొత్త అర్థంలో వాడాడు. పాత పదాలకు కొత్త అర్థాలను నిర్దేశిస్తూ శ్రీశ్రీ అశ్వంలా కవిత్వాన్ని పరుగెత్తించడం చాలా మందికి దిమ్మ తిరిగేలా చేసే వుంటుంది. శ్రీశ్రీ 'అవతారం' కవిత మొత్తం ఈ పద్ధతిలోనే సాగుతుంది. 'హరోం! హరోం హరా!/ హర! హర! హర! హర!/ హరోం హరా అని కదలండి' అని ఆయన పిలుపునిస్తాడు. ఇక 'జగన్నాథుని రథ చక్రాలు' కవితలో శ్రీశ్రీ వాడిన ప్రతీకలు ఎక్కడివో మనందరికీ తెలిసిందే. శ్రీశ్రీ కవిత్వంలోని పంక్తులను ఎక్కడికక్కడ విడగొట్టి హిందూ మత ప్రతీకలను చూపుతూ మాట్లాడితే ఎలా వుంటుంది? శ్రీశ్రీ కవిత్వం మనకు అందిస్తున్న స్ఫూర్తిని అనుభవిస్తున్న మనం ఆ పని చేయగలమా? ఇక్కడ శ్రీశ్రీకి, స్కైకి పోలిక తేవడం, శ్రీశ్రీతో సమానంగా స్కైని చూపడం నా ఉద్దేశం కాదు. స్కై అస్తిత్వ వేదన బలంగా వ్యక్తం కావడానికి ఇస్లాం మత ప్రతీకలను ఎంత బలంగా వాడుకున్నాడనేది విమర్శకులు చూడాల్సి వుంటుంది. ఏ స్ఫూర్తి స్కైబాబ కవిత్వం మనకు అందిస్తున్నదనేది పరిగణనలోకి తీసుకోవాల్సి వుంటుంది. స్కైకి ప్రజాస్వామిక స్ఫూర్తి లేకపోతే, మతఛాందసుడిగానే మాట్లాడితే ఇస్లాం మతాచారాలను అంత నిక్కచ్చిగా ఖండించి వుండేవాడు కాదనే విషయాన్ని మనం ప్రధానంగా పరిగణనలోకి తీసుకోవాల్సి వుంటుంది. స్కైని ఒక మూలవాసిగా, అభివృద్ధి అంచుల్లో లేని పీడితునిగా, తన స్థితిని తాను వ్యక్తీకరించుకుంటూ వివిధ ఆధిపత్యాలపై ఒకేమారు సమరం చేస్తున్న సైనికుడిగా చూడాల్సిన అవసరం ప్రస్తుత పరిస్థితులు కల్పిస్తున్నాయి. 

స్కైబాబ హిందూ, ముస్లిమ్‌ల మధ్య గల సామాజిక సంబంధాలను బాగా ఎరిగినవాడు. భారతీయ ముస్లిమ్‌ల సూఫీ తాత్వికతకు ఆధునిక కాలంలో అతను ప్రతినిధిగా నిలబడతాడు. అతని పలు కవితల్లో కనిపించే తాత్విక ప్రతీకలతో పాటు 'సూఫీ దేవుడు' అనే కవిత ఇందుకు తార్కాణంగా నిలుస్తుంది. పల్లెల్లో తెలుగువాళ్లు, ముస్లిమ్‌లు కలిసి జరుపుకునే పండుగల సంస్కృతి ఇక్కడ విలసిల్లాలని అతను ఆశిస్తాడు. సూఫీ తాత్వికత గురించి ఇక్కడ విడిగా చెప్పాల్సిన అవసరం లేదు. అది ఏమి ఆశిస్తుందో, ఎటువంటి సామాజిక సంబంధాలను, ఎటువంటి సమాజాన్ని కాంక్షిస్తుందో అందరికీ తెలిసిందే. స్కైబాబ కవిత్వంలో ఇది అంతర్లీనంగా సాగుతూ వుంటుంది. 

హేతువాద ఉద్యమాలు ఫలితాలు సాధించని థను మనం అనుభవిస్తున్నాం. దాని ఫలితాలు ఎంత ఘోరంగా ఉన్నాయో కూడా చూస్తున్నాం. మన మెడల మీద కత్తులు వేలాడుతున్నాయి. ఆ కత్తులను ముస్లింల మీదికి ఎక్కుపెట్టే భావజాలం క్రమక్రమంగా ఊపందుకుంటున్నది. గుజరాత్‌ మారణహోమం 'కలియుగ ధర్మాన్ని' రుచి చూపించింది. ఇది హేతువాదుల, మార్క్సిస్టుల వైఫల్యానికి ఒక మచ్చుతునక. ఇటువంటి సందర్భంలో తుప్పు పట్టిన పనిముట్లనే సమర్థమైన ఆయుధాలుగా భావించడంలో అర్థం లేదు. ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కడికీ ఈ నేల మీద స్వేచ్ఛగా బతికే హక్కు వుందని, ఈ దేశ పౌరులందరికీ బుక్కెడు బువ్వ, చిన్నపాటి గూడు ఉండాల్సిన అవసరం వుందని భావించి హిందూ ఆధిపత్య భావజాలాన్ని కొత్త పనిముట్లతో ఎదుర్కోకపోతే ఆత్మవంచన చేసుకున్నవాళ్లం అవుతాం. మతం, ఆచారాలు, సంప్రదాయాలను పూర్తిగా తృణీకరించాలనుకునే మనం వాటి నుంచి ప్రజలను కాస్తయినా దూరం చేయలేకపోయాం. దేశీయతను, ఆచార సంప్రదాయాలను శత్రువులకు ఆయుధాలుగా ఉపయోగపడే విధంగా వదిలేశాం. ఈ స్థితిలోనే దళిత వాదం, ముస్లిం వాదం, తెలంగాణ అస్తిత్వ వాదం కొత్త చూపుతో ముందుకు వచ్చాయి. భిన్నత్వాన్ని కాపాడుకుంటూనే ఏకత్వాన్ని సాధించి, ముందుకు సాగే సమాజం కోసం ఎదురు చూస్తున్నవాళ్లం స్కైబాబ కవిత్వాన్ని ఆహ్వానించక తప్పదు. ఈ దేశం పౌరుడిగా తనకు గల హక్కులను డిమాండ్‌ చేయడం స్కైకి పుట్టుకతోనే సంక్రమించిన అనివార్యతగా గుర్తించడం నేటి అవసరం. 

పాత విశ్వాసాలకు చేర్పులు, మార్పులు ఎంత అవసరమో తెలంగాణ కవి బలంగా గుర్తించాడు. తమ మూలాలను అన్వేషించుకుంటూ, గతాన్ని విశ్లేషించుకుంటూ, వర్తమానాన్ని పరిశీలిస్తూ కొత్త మార్గాన్ని వేశాడు. పైపైన చూస్తే ఆ కొత్త మార్గం పలు వైరుధ్యాలతో, కొన్నిసార్లు అతివాదంగా, మరికొన్ని సార్లు మితవాదంగా కనిపిస్తూ వుంటుంది. అందువల్ల ఈ కవిత్వాన్ని లోతుగా పరిశీలించాల్సి వుంటుంది. ఇదే లక్షణం స్కైబాబ కవిత్వానికి వర్తిస్తుంది. అలా చూసినప్పుడు స్కైబాబ ముస్లిమ్‌ తెలుగు కవిత్వంలోనే కాదు, తెలంగాణ కవిత్వంలో, తెలుగు కవిత్వంలో వేసిన ముందడుగు మనకు తెలిసి వస్తుంది. 

- కాసుల ప్రతాపరెడ్డి 

Read more at: http://telugu.oneindia.in/sahiti/essay/2013/skybaba-poetry-unique-expression-112238.html#cmntForm