Saturday 7 June, 2014

ఏక్ నయీ ఖిడికీ (నా కథ, నమస్తే తెలంగాణ సండేలో)

Bathukammam
window 
 
దినామొక గంటే ఫేస్‌బుక్ సూషే అలవాటు సాహిర్‌కు. షానా టైమ్ తినేస్తుందని ఆ నిర్ణయం తీసుకుండు.
అయాల కొద్దిగ తీరిక దొరికి (ఇంటర్)నెట్‌ల గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ 2 సినిమ సూద్దామనుకుండు. ఆ సినిమ దెవులాడి డౌన్‌లోడ్‌కు పెట్టిండు. ఈ లోపల జరసేపు ఫేస్‌బుక్ సూద్దామని లాగిన్ అయ్యిండు. తన వాల్‌లో అంతకు ముందరి తన పోస్ట్‌లకు వొచ్చిన కామెంట్స్‌ని ఒకసారి సదువుకుంట నచ్చిన వాటిని లైక్ (Like) చేసుకుంట వరుసగా పది పోస్టులదాంక చెక్ చేసి షేర్ (Share) చేసిన లిస్ట్‌లు గూడా చెక్ చేసి అక్కడ గూడా లైక్ చేసిండు. అటెంక తన కొచ్చిన మెసేజ్‌లు సదువుకున్నడు. కొన్నిటికి ఆన్సర్ చేసిండు. నోటిఫికేషన్స్ చెక్ చేసిండు. తన వాల్‌లో గాకుండ తాను మెంబర్‌గున్న గ్రూప్‌ల్ల తాను పోస్ట్ చేసిన వాటి కొచ్చిన కామెంట్స్ చెక్ చేసి, ఆ తర్వాత ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు చెక్ చేసిండు. అందుల గుడ తనకు నచ్చినోల్లనె కన్‌ఫామ్ (Confirm) చేసుకుంట పోతున్నడు. ఒక ఫొటో లేని అమ్మాయి రిక్వెస్ట్ కాడ ఆగిపొయిండు.

పైంగ ముస్లిం అమ్మాయి.. ఆయేషా! ఫేస్‌బుక్‌లో ముస్లిం అమ్మాయిలే తక్కువ. మల్లందుల తనకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టడం జరంత హుషార్ నిచ్చింది సాహిర్‌కు. మ్యూచువల్ ఫ్రెండ్స్ చూస్తే 4 గురే ఉన్నరు. సూస్తె వాళ్లల్ల ఇద్దరు ముస్లింలే. ఆ అమ్మాయి వాల్‌కి పొయి చెక్ చేసిండు. లివ్స్ ఇన్ హైదరాబాద్ అనుంది. ఒహో అనుకుండు. స్టడీయింగ్ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ! -ఓకె అనుకొని ఫ్రెండ్ రిక్వెస్ట్ కన్‌ఫామ్ చేసిండు. ఆ తర్వాత కనిపించే ఆ అమ్మాయి పోస్టులు కొన్ని తిరిగేసిండు. చార్‌మినార్ సుట్టు బండ్లమీద అమ్మే వస్తువులు కొంటున్న బుర్ఖా స్త్రీలు, టోపీవాలాలు, పిల్లలు.., చమ్కీలు కుడుతున్న బుర్ఖా ఆడవాళ్లు.. వెండిని బాదుతున్న మనుషులు.. పండ్ల బండ్లు- సుట్టు ఎగుర్తున్న పావురాలు... ఓహ్, భలే ఫొటోలు అనుకుండు సాహిర్. అవే గాకుండ పాతబస్తీ గరీబీ ఫొటోస్ ఎక్కువగ ఉన్నై. అవి గూడ మనసును కదిలించే కామెంట్స్‌తోటి ఉన్నై. సదువుతున్నడు.

ఒక ఫొటోల- ఇద్దరు పిల్లల్నేసుకొని సంకల పిల్లతోని నడుస్తున్న బుర్ఖా తల్లి.. ఒక పిల్ల ఆమె చేయి పట్టుకొని నీరసంగ నడుస్తున్నది.. ఆళ్ల మొఖాల్లున్న దీనత్వం మనసుని కకావికలం చేసేటట్లున్నది. దానిమీద ఒక కామెంట్ ఉంది-
కహాతక్ యే దర్ద్ భరా సఫర్ అమ్మీ!
కహీఁతో ఇస్‌కో ఖతమ్ కర్దే
దునియాఁ భర్ కీ థకావట్ హోగయీ అమ్మీ!
లేట్‌నే కో దో గజ్ జమీన్ దిఖాదే
ఓహ్... అనుకుంటున్నంతల-
ఆ అమ్మాయి చాట్‌లకు వొచ్చింది- Hi SAAHIR Sir అనుకుంట.
అరె, ఈ పిల్ల Online లనే ఉందా? అని ఆశ్చర్యపొయ్ Hi Ayesha! Nice to meet u అని type చేసి send చేసిండు.


thank u 4 accepting my friend request అని ఆన్సర్ వొచ్చింది.
no thanx. wt r u stdng in ou?
M.Tech first year
oh great. wr frm hyd
charminar. U sir
khairthabad
oh. sir, u r frm nalgonda na?
ya
sir I read ur long poem on Old City. very touching sir..
oh. reallee!
also read ur story MUSLIM sir!
(సంభాషణ ఇంగ్లిష్, ఉర్దూల్ల నడిషింది)
oh.. నీకు లిటరేచర్ అంటె ఇంట్రస్టా?
s sr
k. హాస్టల్ల ఉంటున్నవా? ఇంటి నుంచి పోతున్నవా?
హాస్టల్ల ఉంట సర్. పుర్సత్ దొరికినప్పుడల్ల ఇంటికి పోతుంట.

మరి, ఉస్మానియాల జరిగే ఉద్యమాల్ల పాల్గొంటుంటవా?
హాఁ సర్! సెలెక్టెడ్‌గ..
k.
bfn sir (bfn=bye for now)
k bye అని కొట్టి ఫేస్‌బుక్ నుంచి సైన్ అవుట్ అయ్యి సినిమ సూడ్డంల పడిపొయిండు సాహిర్.
అప్పట్నుంచి అప్పుడప్పుడు కనిపించి, పలకరించేది ఆయేషా. ఒక్కోసారి సీరియస్ చర్చలు చేసేది. ఒక్కోపాలి ముస్లిం ఉమెన్ గురించి రాషిన రచనలు కావాల్నని, ఆటి గురించి చర్చ చేసేది.
pdfలో ఉన్నవి forward చేసేటోడు. కొన్ని లింక్స్ ఇచ్చేటోడు. చదువుకొని మళ్లోసారి తన అభిప్రాయాలు పంచుకునేది. ఆ అమ్మాయి ఆసక్తి, చర్చ చేసే తీరు సూషి తన కోసం కొంత టైం కేటాయించేటోడు సాహిర్. సాహిర్ వాల్‌లో పోస్ట్‌లపై జరిగే చర్చల్ల చురుకుగ పాల్గొనేది.
ఈ ప్రాసెస్‌ల సాహిర్ గురించి షానా సంగతులే తెలుసుకుంది ఆయేషా.
మీ మిసెస్ ఏం చేస్తరు సర్? అనడిగిందొకసారి. తాను పెండ్లి చేసుకోలేదని చెప్పిండు సాహిర్. షాక్ తిన్నది. అదేంది సర్? ఎందుకని? అనడిగింది.

ఆమె కోసం అంత టైం కేటాయించలే ననిపించింది. నా లక్ష్యాలు నెరవేర్చుకోవాల్నంటె పెండ్లిని త్యాగం చెయ్యాల్ననిపించింది. పెండ్లంటె ఆమె ఒక్కత్తే కాదు గదా.. ఆమె తర్వాత పిల్లలు ప్రవేశిస్తరు. వాళ్లకు మరింత టైం కేటాయించాల్సి వస్తది. వాళ్లు మనకు భిన్నంగ తయారైనా భరించాల్సి ఉంటది. అదంత నాకిష్టం లేదు అన్నడు.
ఓహ్! ఇట్ల గుడా సోంచాయిస్తరా సర్? ఇంటుంటెనే ఆశ్చర్యంగ, అబ్బురంగ ఉంది నాకు. నాలాంటోళ్లం గుడా అట్లా ఉండగలమా సర్! అంది జర ఉద్వేగంతోటి.
సాహిర్ నవ్వి, అది షానా కష్టం గూడా ఆయేషా. ఆ ఆలోచన సొంతంగ రావాలె. మన లక్ష్యం- గోల్ ఏమిటో నిర్ణయించుకుని దానికి అడ్డు అనుకుంటెనే అసువంటి నిర్ణయం తీస్కోవాలె. ఊకెనే తీస్కుంటె ఏం లాభం? అన్నడు.

నాకు గుడా ముస్లిం ఆడపిల్లల గురించి, ముస్లిం స్త్రీల గురించి, ముస్లింల మీద అణచివేత, వివక్ష గురించి పనిచేయాలని ఉంది సర్. సీరియస్‌గ సోంచాయిస్తుంటా.. కాని సర్, మీకు ఎప్పుడు గుడ ఒంటరి ఫీలింగ్ రాదా?
ఒస్తుంది. కాని మన లక్ష్యం దానిని డామినేట్ చేస్తుంది.
ఇట్ల నడిచింది ఆ రోజు ఇద్దరి సంభాషణ.
ఒకరోజు- సర్! ఒక విషయం ఎప్పటికప్పుడు మర్షిపోతున్న సర్.. నాకు కతలంటె పాణం! ఒక కత రాయాల్నని అనుకున్న సర్. ముగింపు సమజైత లేదు. అది మీకు చెప్త. ముగింపు మీరు సజెస్ట్ చెయ్యాలె అన్నది.

అట్ల షానామంది చెప్తుంటరు.. వాళ్లు చెప్పేవి అన్నీ కథలుగా రాయడం కష్టం.. కనీ నిరుత్సాహ పర్చడం సరైంది కాదనుకొని చెప్పు అన్నడు సాహిర్.
తెలుగుల యూనికోడ్‌ల కంపోజ్ చేసి మెయిల్ పెట్టనా సర్? అన్నది.
మంచిదే గదా, పెట్టు అన్నడు.
అయితే రేపు చదువురి మీరు అన్నది.
సరే నన్నడు.

రెండో రోజు ఆయేషా పెట్టిన మెయిల్ సదవడం మొదలుపెట్టిండు సాహిర్-
అతియా, షరీఫ్ ఒక జిల్లా కేంద్రంల ఉండేటోళ్లు. పక్క పక్క ఇండ్లు కాబట్టి ఈళ్లిద్దరికి మంచి దోస్తానా కుదిరింది. ఈళ్లిద్దరు రోజు బడికి కలిసి పోయి కలిసి వొచ్చేటోల్లు. ఒక క్లాసు తేడా. ఈళ్లిద్దరి అమ్మానాన్నలు గూడా కలిసిమెలిసి ఉండేటోళ్లు. దాంతో ఈళ్లు మరింత జిగ్రీ దోస్తులు అయ్యిన్రు. షరీఫ్ ఇంట్ల ఏదన్న మంచి కూర వొండితె అమ్మీ! కొంచెం అతియా వాళ్లకు ఇద్దామా? అని అడిగి ఇచ్చిందాంక పానం కొట్టుకునేది షరీఫ్‌కు. ఆ పిల్ల గుడా అంతే. ఇంట్ల ఏ స్పెషల్ చేసినా షరీఫ్ కోసం పట్టుకొచ్చేది. బడిలో వేర్వేరు క్లాసులైనా బయటి కొచ్చిన్రంటె దంట వదలక పొయ్యేది ఇద్దరూ.

ఒకరోజు వీళ్ల దోస్తు సలీం ఇంటోళ్లంతా ఏదో పెండ్లికి పొయిన్రు. ఆ గల్లీలున్న పిల్లలంత కల్సి సలీం ఇంట్ల ఆడుకోబట్టిన్రు. సలీం కాస్త పెద్దోడు. ఏదన్న స్పెషల్ ఆట ఆడుదాం అని ప్రపోజల్ పెట్టిండు. ఏ మాడుదాం? అని జరసేపు పిల్లలందరు తర్జనబర్జన పడ్డరు. ఆఖర్కి అమ్మీ అబ్బా (అమ్మా నాయ్‌న) ఆట ఆడుదాం అనుకున్నరు. నేను-అన్వరి అమ్మా నాయ్‌నగా ఉంటం అన్నడు సలీం. దానికి అన్వరి ఒప్పుకోలె. దాంతోటి షరీఫ్, అతియా అయితే బాగుంటరు అని సలీం అన్నడు. షరీఫ్ అతియా దిక్కు సూషి సరేనా అన్నడు. తలూపింది మురిపెంగ అతియా. సలీం జర పెద్దోడు కాబట్టి షరీఫ్ వాళ్ల నాయ్‌న లెక్క ముసలోడి యాక్టింగ్ చేస్కుంట కుర్సీల కూసొని ఉండిపోయిండు. మిగతా ముగ్గురు పిల్లలు షరీఫ్-అతియా పిల్లల్లెక్క నటించిన్రు. అమ్మా నాయ్‌నలు పొద్దున లేవంగనే ఎట్ల ప్రవర్తిస్తరో, ఏమేం పనులు చేస్తుంటరో అవన్నీ అట్లనె అనుకరించుకుంట చేసిన్రు షరీఫ్, అతియా. జిగ్రీ దోస్తులు అవడంతోటి ఆ ఆటను మస్తు ఎంజాయ్ చేసుకుంట, హ్యాపీగ ఫీలయిన్రు అతియా-షరీఫ్.
ఇగ అప్పట్సంది మరింత అభిమానం పెరిగింది ఆళ్లిద్దర్కీ. ఇంకింత కల్సిమెల్సి తిరిగేటోల్లు. ఇద్దరి అమ్మలు తీరిగ్గ మాట్లాడుకునేటప్పుడల్లా, ఈళ్ల ముచ్చట వొచ్చేది. ఇప్పుడే ఈళ్లిద్దరు మొగుడు పెళ్లాల్లెక్క ఉంటున్నరనుకుంట నవ్వుకునేటోల్లు.

ఇసొంటి టైంల అతియా వాళ్ల నాయ్‌న బతకడానికి హైదరాబాద్‌కు పోవాల్నని నిర్ణయం తీసుకుండు. ఇల్లు ఖాళీ చేసి పోతుంటే వీళ్ల అమ్మలిద్దరు కండ్లనీళ్లు పెట్టుకున్నరు. ఇగ ఈ పిల్లలిద్దరు బోరుబోరున ఏడ్షిన్రు.
సామాను లారీలో ఎక్కించుకొని వొచ్చేస్తుంటే అతియా ఎక్కెక్కి ఏడ్సుకుంట షరీఫ్‌కు టాటా చెప్పింది. కండ్ల నుంచి నీల్లు కారిపోతుంటె చేయి ఊపుకుంట నిలబడిపోయిన షరీఫ్ రూపం అతియా గుండెల్ల గూడుకట్టుకొని పోయింది.
ఈ ముచ్చట జరిగినప్పుడు రాకపోకలు, ఫోను సౌకర్యం వగైరా లేకపోవడంతోని షరీఫ్ ఏమైపొయిండో అతియాకు తెలియలేదు. కాని, షరీఫ్‌ని అతియా ఎంతకు మర్షిపోలేకపోయింది. పెద్దయినంక బచ్‌పనా అంటే షరీఫ్‌తోని ఆడుకున్న ఆటలు, వాళ్ల అమ్మా నాయ్‌న ఆటే గుర్తుకొచ్చేది అతియాకు.
కాని, వాళ్ల నాయ్‌నకు పక్షవాతం వొచ్చింది. రెండేండ్లు నవిషి ఆయన సచ్చిపొయిండు. ఆళ్ల ఇంటి పరిస్థితి చితికిపోయింది. షరీఫ్ కలుస్తడేమోనన్న ఆశ తీరకుంటనే అతియా పెండ్లి ఒక కారు డ్రైవర్‌తోటి జరిగిపొయింది. పెండ్లి రోజు అమ్మను, చెల్లెను, తమ్మున్ని విడ్చిపోతున్ననన్న దానికన్నా ఎక్కువగ షరీఫ్‌కి, అతని యాదికి శాశ్వతంగా దూరమైపోతున్నననే ఫీలింగ్‌తోటే పొగిలి పొగిలి ఏడ్చింది అతియా.
ఇద్దరు బిడ్డలు పుట్టిన్రు. ఒకరోజు పాతబస్తీ హిందూ ముస్లిం గడ్‌బడ్‌లల్ల ఆమె భర్త కత్తిపోట్లకు గురై సచ్చిపోయిండు. ఇరవై ఏండ్లకే విధవరాలైపోయింది అతియా. ఆ తర్వాత రాత్రింబవళ్లు చమ్కీలు కుట్టుకుంట, మిషిన్ తొక్కుకుంట సంసారం ఎల్లదీసుకుంట పిల్లల్ని సాదుకుంట ఒంటరిగ మిగిలిపోయింది. పెండ్లీడు కొచ్చిన పెద్ద బిడ్డ సూడముచ్చటైన అందం సూషి కట్నం లేకుంటనే చేస్కుంటాన్కి ఒక సంబందమొచ్చింది. సాదాసీదాగా చేసినా పెండ్లి ఖర్చులకే కనా కష్టాలు పడింది అతియా.

అయితే, ఆమె యాదిలో మాత్రం ఇప్పటికీ షరీఫ్ సజీవంగనే ఉన్నడు. అతన్ని తిరిగి కలుసుకుంటననే నమ్మకం పోయింది గనీ ఆమెకు ఇద్దరు పిల్లల్ని ఇచ్చిన భర్త కన్నా షరీఫ్ యాదులే ఆమెను వెంటాడుతున్నై. భోలా మనిషి.. పాపం, బజారుకు పొయ్‌నప్పుడల్లా కనిపించే మగవాళ్లల్లో షరీఫ్ ఆనవాళ్లని వెతుక్కుంటు ఉంటది!
సదివేషినంక- సూసుకుంటె సాహిర్ కండ్లల్ల నీల్లు! అతను ఏడ్వక ఏండ్లయ్‌పొయింది. కాని, ఈ కథ అతన్ని అణువణువు కదిలించి పారేసింది. ఆసాంతం దుఃఖబిందువై పోయిండు. ఎన్నో ప్రశ్నలు. ఎన్నో ఉద్వేగాలు అతన్ని సుట్టుముట్టినయ్..
అయాల ఫేస్‌బుక్‌ల్నే ఉండిపోయి ఆయేషా ఆన్‌లైన్‌లకు ఎప్పుడొస్తుందా అని ఎదురు సూడబట్టిండు. ఆయేషా పేరు పక్కన గ్రీన్ మార్క్ ఎలగంగానే మొదటిసారిగ సాహిరే ఆత్రంగ హాయ్ కొట్టిండు.
సదివిన్రా సర్?
సదివిన ఆయేషా..
ఎట్లుంది సర్?
ఈ అతియా నీకు తెలుసా ఆయేషా? అడిగిండు..
మా పక్కిల్లే సర్! ఆమె అంటె నాకు షానా అభిమానం. అప్పుడప్పుడు ఆమె చెప్పిన మాటల్ని బట్టి, నేను గుచ్చి గుచ్చి అడిగిన విషయాల్ని బట్టి ఇదీ ఆమె కత. కని నాకు ఆ తర్వాత ఏం రాయాల్నో సమజైతలేదు సర్. తర్వాతి పార్ట్ మీరు రాయిరి సర్. దీన్ని మొత్తంగ ఒక కతగ రాయిరి. షరీఫ్ వైపు నుంచి మీరు రాస్తె బాగుంటది.
నేను రాయలేను ఆయేషా ఈ కత!
ఎందుకు సర్?
ఈ కత ముగింపు నాకు తెలియదు!
షరీఫ్ గుడా ఆమె యాదులతోనే ఉండే అవకాశముంది గదా సర్?
అవును.. ఉండే అవకాశముంది..
సర్! ఏమనుకోవద్దు.. ఒకటి అడగనా?
అడుగు
ఇది మీ కతే కదా..?!
అవును..! నీకెలా తెలుసు?!
మీ వివరాలన్నీ తెలుసుకున్నప్పుడె చూచాయగ సమజైంది సర్. ఇప్పుడు కన్‌ఫామ్ చేసుకున్నా.
అవునా..!
ఈ కతలో మీ వెర్షన్ ఏంటి సర్?
మాటలు రావడం లేదురా...
సర్! దుఃఖంగా ఉందా ఏమిటి?
అవునమ్మా... ఆ కథ చదివినప్పట్నుంచి షానా దుఃఖంగా ఉన్నా.
అతియా గురించి మీరెందుకు ఎతకలేదు సర్?
హు! వెతక్కుండా ఎట్లుంట ఆయేషా. వెతికిన, కని ఏ ఆధారం దొరకలే.
అవునా..
ఇప్పుడెట్ల ఉందమ్మా అతియా?
ఇంకా మీ యాదిల్నే జీవిస్తున్నది సర్. మిషిన్ కుట్టీ కుట్టీ కళ్ళద్దాలొచ్చేసినయ్. అట్ల అనేకంటే మీ కోసం ఎదురుచూసీ చూసీ వొచ్చి ఉంటాయేమో..!
నాకొకసారి అతియాను సూపెడతవా ఆయేషా?
అయ్యో! అట్లంటరేంది సర్. తప్పకుండా.
తను ఏమంటదో..!
నేను ఈరోజు అడిగి చూస్త సర్.


ఓకే. మళ్ల నాకు ఎప్పుడు చెప్తవ్? ఆమె ఒప్పుకుంటె రేపే ఆమెను కలపాలె.
తప్పకుండ సర్. ఆమెను ఈవినింగ్ అడిగి నెట్ సెంటర్‌కు పోయి మీకు మెసేజ్ పెడత.
ఓకే. థ్యాంక్యూ ఆయేషా. నేను ఆన్‌లైన్‌ల్నే ఎదురుచూస్తుంటా...
ఓహ్! ఓకే సర్. బై..
సర్! అతియాని- నీ సాహిర్‌ని సూడాలని ఉందా? అని అడిగిన సర్. ఒళ్లంత ఒక్కసారిగ జలధరించినట్లు నా దిక్కు సూషింది. నమ్మలేదు. నాకు ఫేస్‌బుక్‌ల ములాఖాతయిండు. నీ గురించి చెప్పిన. నిన్ను ఎంటనే కలుస్తనన్నడు. నీకు ఓకేనా? అన్నా. మనిషంతా కంపించి పోయినట్లనిపించింది సర్! నిజమా? నిజమేనా.. నువు చెప్తున్నది? అనుకుంట నా చేతులు పట్టుకొని అడిగింది.
నిజమే! నీ సాహిర్ నిన్ను కలవడానికి రేపు వస్తనన్నడు. అతను పెండ్లి గుడా చేస్కోలేదు. ఎందుకు చేస్కోలేదంటే ఏందేందో చెప్పిండు -అన్నా. ఏడ్చేసింది సర్. ఆమె ఏడుస్తుంటే నాగ్గూడా ఏడుపొచ్చింది. రేపు పొద్దున ఆయన్ను రమ్మంటవా అతియా? అనడిగిన. లోకం ఏమనుకుంటది? అన్నది ఎనాకా ముందాడుకుంట.


లోకం తోటి నీకెందుకు? నీ కష్టాల్ని లోకం ఎన్నడన్న తీర్చిందా? నీ పరేశాన్లని ఎన్నడన్న అడిగి ఓదార్చిందా? అన్నా.
అవును.. సరె, అవన్నీ తర్వాత సోంచాయిస్తగని, రేపే రమ్మను. నిజంగనే ఒస్తడంటవా? అతను సాహిరేనా?!
అతను సాహిరే! తప్పకుంట వస్తడు అతియా! అన్నా.. ఏమంటరు సర్?
ఓహ్! థ్యాంక్యూ ఆయేషా.. థ్యాంక్యూ వెరీమచ్..!
మీ అతియా మీ కోసమే ఎదురుచూస్తూ ఉన్నది సర్!
హహ్హ..!
ఆ నవ్వుల అగాధాలు తొంగి చూస్తున్నట్లు తోచింది ఆయేషాకు.
రేపు 10 గంటలకు చార్మినార్ బస్టాండ్ ఎదురు బస్తీలున్న ఉర్దూఘర్ దగ్గరికి వొచ్చేయ్‌రి సర్. నేను ఎదురు చూస్తుంట. మిమ్మల్ని అతియా ఇంటికి తీస్కుపొయి ఆమెకు అప్పజెప్పి నేను యూనివర్సిటి పోవాలె అన్నది.
ఓకే రా!
ఓకే.. బై సర్.
సైకిల్ మోటర్ మీద చార్మినార్ చేరుకుండు సాహిర్. ఆ రష్‌ని దాటుకొని ఉర్దూ ఘర్ చేరుకున్నడు. ఒక పక్కన బుర్ఖాల నిలబడి ఉన్న అమ్మాయిని గమనించి ఆడికి పోనిచ్చిండు సైకిల్ మోటర్‌ను. సాహిర్‌ను సూడంగనే దగ్గరికొచ్చి- అస్సలామలైకుమ్ సర్ అని సలామ్ చేసింది ఆయేషా. కండ్లొక్కటే కనిపిస్తున్నయ్ ఆమె మొఖంల. హాయ్ అనుకుంట షేక్ హాండ్ ఇచ్చిండు. చేయి కలిపి, మీ బండి ఎనక కూసోనా అని అడిగి కూసొని పోనియ్‌రి అన్నది. మొఘల్‌పురాల రెండు గల్లీలు మారినంక ఒక ఇంటి ముందల ఆపమన్నది. దిగి రారి సర్ అనుకుంట లోపల్కి పోయింది.

బండి స్టాండేసి లోపల్కి అడుగుపెట్టిండు సాహిర్. గరీబ్ ఇల్లు. ఒక చిన్న అర్ర. చిన్న కిచెన్. బాత్రూం గుడ లేదు. నాలుగిండ్లకు కలిపి కామన్ బాత్‌రూం ఉన్నట్లుంది. కూసొండి సర్ అన్నది ఆయేషా ఒక పాత కుర్సీ సూపెట్టి. కూసున్నడు.
సాహిర్ గుండె వేగం పెరిగింది. అతియా వంట అర్రల సాహిర్‌కు కనబడకుండ నిలబడి ఉన్నట్లుంది. పానీ పీతే సర్? అనడిగింది ఆయేషా.
నఖాబ్ (నోస్‌పీస్) తీయవా? నాకు గుడా నీ మొఖం సూపెట్టకపోతె ఎట్ల? అన్నడు సాహిర్ నవ్వుకుంట.
ఓహ్.. సారీ సర్! అని నఖాబ్ విప్పి యే హై ఆయేషా! అంటు నవ్వింది.. చాంద్ కా తుక్డా నవ్వినట్లు.
ఖూబ్ సూరత్ హో! నీకు నఖాబ్‌లన్నింటినీ మూట కట్టించే పని ఉంది భవిష్యత్‌లో.. అన్నడు నవ్వుకుంటనె.
హా సర్. తప్పకుంట. మనం కలిసే ఆ పనులు చేద్దాం అని సర్, నేను యూనివర్సిటీ పోవాలె. ఆమెను పిలుస్త అన్నది.
ఊ.. పిలువు. రాత్రంత నిద్ర పట్టనే లేదు అన్నడు గుండె వేగం మరింత పెరుగుతుంటే.
తనకు గుడా నిద్ర లేనట్లుంది సర్, ఇందాక సూషినప్పుడు అనిపించింది అనుకుంట వంట అర్రలకు పోయింది ఆయేషా.
ఏవో గుసగుసలు వినబడ్డయ్. సాహిర్ ఆత్రం మరింత ఎక్కువైంది. దాదాపు 30 ఏండ్ల కింద చూసిన అతియా ఇప్పుడెట్ల ఉంటది? సూడాలి సూడాలి అని అతని మనసు గింగిరాలు పోతున్నది. వంట అర్ర తలుపు దిక్కే సూస్తున్నడు, యమ ఆత్రంగ. చిన్నప్పటి అతియా రాబోతున్నట్లే అనిపిస్తున్నది మదిలో... కాని-
తలనిండా కొంగు కప్పుకుని తల వంచుకున్న అతియాను పెండ్లికూతుర్ని పట్టుకొని నడిపించుకుంట వొచ్చినట్లు తీసుకొచ్చింది ఆయేషా. సాహిర్ ముందుకు తెచ్చి నిలబెట్టింది.
సర్! మీరు మాట్లాడుకోరి. నేను పోవాలె. బై అనుకుంట నఖాబ్ గుడ్డ, హాండ్ బ్యాగ్ అందుకొని బైటికెళ్లిపోయింది ఆయేషా.
అతియాను కనురెప్పలు కొట్టడం మర్షిపోయి సూస్తు ఉండిపొయిండు సాహిర్- సాదాసీద చీరల, చేతులకు కాళ్లకు మెడల ఏం లేకుంట బోసిపొయ్‌న మొఖంతోటి భోలా మొఖంతోని నిలబడింది అతియా- తన అతియా! 30 ఏండ్లుగ తన తలపుల్ల దాచుకున్న అతియా! అదే మొఖం.. అదే భోలాతనం! కాకపోతె కాసింత పెద్దదై.. ముడతలు పడుతూ...!
సాహిర్ కండ్లల్ల నీల్లు నిండినయ్. తల ఇంక ఎత్తని అతియాను గొంతు పెగల్చుకొని పిలిషిండు-
అతియా..! అంటూ.

మెల్లగ తల ఎత్తింది అతియా. అమాయకపు ఆ మొఖంలో కండ్లు రెండు నిండు కుండల్లెక్క తొణుకుతున్నయ్! నీళ్లల్ల కదులుతున్న చందమామల్లెక్క సాహిర్‌ని తడుముకుంటున్నయ్ కనుపాపలు!
రెండు అడుగులేసి ఆ మొఖాన్ని తన చేతుల్లకు తీసుకున్నడు సాహిర్.
అతియా కండ్లమీద నిండు కుండలు పగిలిపొయ్‌నయ్. నుదుటి మీద ముద్దు పెట్టి దగ్గరకు తీసుకొని గుండెలకు హత్తుకున్నడు. పొగిలి పొగిలి ఏడ్వబట్టింది అతియా. సాహిర్ గుండె లోతుల్నుంచి తోడుకొస్తున్నది దుఃఖం.. ఊటలెక్క.. తను గుడా ఏడుస్తున్నడు..
అట్ల ఎంతసేపో అల్లుకుపోయి నిలబడిపోయిన్రిద్దరూ...
దుఃఖం జరంత తెరపినిచ్చినంక-
మెల్లగ- తామిద్దర్ని ఇట్లా కలిపిన ఆయేషా యాదికొచ్చింది సాహిర్‌కు..
ఏదో చిన్న అనుమానమేసింది-
అతియా! ఈ ఆయేషా ఎవరు? అనడిగిండు.
గొంతు పెగుల్చుకుని అన్నది అతియా-
నా చిన్న బిడ్డ!

నా కవితా పఠనానికి ఆహ్వానం welcome to my poetry reading