Monday 25 November, 2013

రియలిజం నుంచి వర్చువల్ రియలిజంకి…!

మీ చేతుల్లో ఉన్న మూడు కథలకీ ఒక ప్రత్యేకత ఉంది. ఇవి ఫోను కథలు. అది కూడా మొబైలు ఫోను. ఒక విధంగా చెప్పాలంటే ఇవి సాహిత్యాన్ని రియలిజం నుంచి వర్చువల్ రియలిజంకి తీసుకువెళ్తున్నాయని కూడా చెప్పవచ్చు. అంతేనా? అంత మాత్రమే అయితే వీటి గురించి మాట్లాడడానికి నాకేమంత ఉత్సాహముండేది కాదు. పైకి పూర్తిగా ఇప్పటి కథల్లా కనిపిస్తున్నప్పటికీ, వీటిలో కాలానికి అతీతమైన కొన్ని మూల్యాల ప్రతిపాదన వుందనిపించింది. అదేమిటో నాకు నేను అర్థం చేసుకునే ప్రయత్నంలోంచే ఈ నాలుగు మాటలూ.

2
స్కైబాబ గురించి నాకట్టే తెలియదు. ఆయన రచనలు కూడా నేనేమంత పెద్దగా చదవలేదు. ఈ కథలు చదవమని ఇచ్చినప్పుడు ఆయన తక్కిన రచనలు కూడా ఇమ్మని అడిగాను. ‘జగనే కీ రాత్: ముస్లిం కవిత్వం’ (2005), ‘అధూరె: ముస్లిం కథలు’ (2011)తో పాటు అతడు సంకలనం చేసిన ‘వతన్ : ముస్లిం కథలు’ (2004) పుస్తకాలు ఇచ్చాడు. అతడి కవిత్వం, కథలతో పాటు వాటిమీద నేటికాలపు తెలుగు కవులూ, రచయితలూ, విమర్శకులూ రాసిన అభిప్రాయాలన్నీ చదివాను. ముఖ్యంగా వతన్ సంకలనానికి రాసిన విపులమైన సంపాదకీయం కూడా చదివాను. ఇవన్నీ ఆయన ఆవేదననూ, అభిప్రాయాల్నీ చాలా సూటిగా వివరిస్తున్నవే. అయితే ఈ సంకలనంలో ఉన్న మూడు కథల్నీ అర్థం చేసుకోవడానికి ఇవేవీ నాకు చాలవనిపించింది.
నాకు స్కైబాబ గురించి మరింత తెలుసుకోవాలనిపించింది. జగనే కీ రాత్ సంపుటిలో ఖదీర్‌బాబు రాసిన ఒక వ్యాసముంది. అందులో ఖదీర్ ఇలా రాసాడు:
”స్కైబాబది నల్గొండ. అక్కడికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే కేశరాజుపల్లి. దారుణమైన పేదరికం. ఏదైనా పని చేసి ఇంటికి సాయపడదామనుకుని స్నేహితుడితో కలిసి బట్టల వ్యాపారం చేసాడు. కిరాయి సైకిళ్లు తిప్పాడు. సోడాలు కొట్టాడు. పీర్‌లెస్ ఏజెంట్ అయ్యాడు. అద్దె పుస్తకాల షాపు నడిపాడు. పాన్‌లు కట్టాడు… ఎక్కడా ఆదాయం రాలేదు. పైగా ఎదురు నష్టం, అప్పులోళ్ళకు మొఖం చూపించలేక దాక్కుని తిరగడం, ఇంటికెళ్ళడానికి మొఖం చెల్లకపోవడం.
ఈ పేదరికం కంటే కూడా స్కైబాబను ఎక్కువ బేచైనీకి గురి చేసింది తమ ఇళ్ళల్లో ఉండే ఆడబిడ్డలు. వీళ్ళందరూ చదువుల్లేక జ్ఞానం లేక తినడానికి తిండి లేక చేయడానికి కుదురైన పనిలేక పెళ్ళిళ్ళు లేక ఈసురోమంటూ ఉండేవాళ్ళు. వాళ్ళను చూసే కొద్దీ స్కైబాబలో దుఃఖం సుడి తిరిగేది. దానిని బలంగా వ్యక్త పరచాలని అనిపించేది..”
ఈ నేపథ్యం స్కైబాబమీద నాకెంతో గౌరవాన్ని కలగచేసింది. ఇటువంటి నేపథ్యాలు ఎంతోమందికి ఉన్నా అందరూ రచయితలు కాలేరు. కొద్దిమంది మాత్రమే గోర్కీలూ, భరద్వాజలూ, స్కైబాబలూ కాగలుగుతారు.
ఇటువంటి నేపథ్యం ఉన్న రచయిత రాసిన కథలు కావడంతో ఈ మూడు కథలూ నాకెంతో విలువైన కథలనిపించాయి. ఆ విలువ కేవలం సాహిత్య విలువ కాదు, లేదా అతడి కథలమీదా, కవిత్వం మీదా అభిప్రాయాలు రాసిన రచయితలు భావిస్తున్నట్టుగా సమకాలీన ముస్లిం జీవిత సందర్భాన్ని చిత్రించడంలోని వాస్తవికత వల్ల మాత్రమే కాదు.
అసలు ఏ రచయిత అయినా తనకు తెలిసిందీ, తన అనుభవంలోకి వచ్చిందీ రాసినప్పుడు మాత్రమే విశ్వసనీయంగా ఉంటాడు. అది రచయిత ప్రాథమిక కర్తవ్యం. కాబట్టి అటువంటి వాస్తవికతకి నేనెటువంటి అదనపు విలువనూ ఆపాదించలేను. మన సమాజంలో అల్పసంఖ్యాకులుగా, బీదరికంలో, సామాజికంగా అప్రధానీకరణకు లోనవుతున్న తెలుగు ముస్లిం జీవితాల్ని ఆ సమాజం నుంచే వచ్చిన ఒక రచయిత స్వానుభవంతో చిత్రించడం మనం రెండు చేతుల్తోనూ స్వాగతించదగ్గ విషయమే కానీ, ఆ ఒక్క కారణం వల్లనే ఆ సాహిత్యం ప్రీతిపాత్రం కానేరదు.
రచయిత ఏదైనా చెప్పనివ్వు. ఏదైనా చిత్రించనివ్వు. కాని ఒక కథ వార్తా కథన స్థాయిని దాటి సాహిత్య స్థాయిని అందుకోవడానికి నిలబడవలసిన ప్రమాణాలు వేరే ఉన్నాయి. ఆ ప్రమాణాల్లో అందరూ మాట్లాడేది శిల్పం గురించి. శిల్పమంటే, ఒక కథలో ఉండే వివిధ అంశాలు ఒకదానికొకటి ఎంత సౌష్టవంగా అమరాయన్నది. సాంకేతికంగా ఆ కథ ఎంత శక్తివంతంగా ఉందనేది. నిస్సందేహంగా తక్కిన కథల్నుంచి గొప్ప కథకుల్ని వేరు చేసేది, ఈ శిల్ప సామర్థ్యమే, సందేహం లేదు. కాని గొప్ప కథలన్నీ మనల్ని ముగ్ధుల్ని చేయాలని లేదు. మంచి కథలన్నీ మనని వెంటాడే కథలు కాలేవు. ఒక కథ మనల్ని మరీ మరీ మరీ వెన్నాడుతోందంటే అందులో ఏముందన్నట్టు?
ఒక కథ మనల్ని వెంటాడుతోందంటే, ఆ కథ చదివినప్పుడు మనలో ఏదో జరిగినట్టు. అది మనలో ఏదో సున్నితమైన రసాయనాల్ని విడుదల చేస్తుంది. దాన్నే జాయిస్ ‘ఎపిఫనీ’ అన్నాడు. ఎపిఫనీ యథార్థానికి మతపరమైన, ఆధ్యాత్మికమైన అర్థంలో వాడబడే పదం. దానికి జాయిస్ ఒక లౌకిక, సాహిత్యార్థాన్ని ఇవ్వడానికి ప్రయత్నించాడు. ‘..అది మనిషిలో అకస్మాత్తుగా సంభవించే ఆత్మిక పరివర్తన’ అన్నాడతడు.
మరో విధంగా చెప్పాలంటే దాన్ని సాక్షాత్కారం అనవచ్చు. మానవ సంబంధాల్లోనో, జీవిత గమనంలోనో ఒక సంఘటన లేదా ఒక సంభాషణ మనల్ని అకస్మాత్తుగా జీవిత మూలాలకు చేరువగా తీసుకుపోతుంది. దాన్నే జాయిస్ The whatness of a thing  అన్నాడు. అతడిట్లా రాసాడు:
This is the moment which I call epiphany.. when the relation of the parts (of an art object) is exquisite…its soul, its whatness leaps to us from the vestment of its appearance. The soul of the commonest object, the structure of which is so adjusted, seems to us radiant. The object achieves its epiphany.
ek kahaani ke theen rang
స్కైబాబ మనముందుంచిన మూడు కథల్లోనూ ఇటువంటి ఎపిఫనీనే మనం పొందుతున్నామని అర్థమవుతుంది. ‘మౌసమీ’ లో కథకుడు ఆఫ్రీన్‌ను చూసినప్పుడూ ‘జమీలా’ లో జమీలా కథకుడితో తన జీవితం మళ్ళా చిగురిస్తోందని చెప్పినప్పుడూ, ‘మిస్ వహీదా’లో వహీదా కూతురు ఫొటోలో ఉన్నామె తన తల్లి వహీదా అని చెప్పినప్పుడూ కథకుడు ఏ సాక్షాత్కారానికి లోనయ్యాడో ఆ సాక్షాత్కారానికి మనం కూడా లోనవుతాం.
కథల్లో ప్రధానంగా ఉండవలసింది ఇది. తక్కిన ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాల గురించిన చర్చ, ఆవేదన కథకి అదనపు బలాన్నివ్వగలవు తప్ప నేరుగా మనలో అటువంటి హృదయ పరివర్తనను తేలేవు.
3
ఇక అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పవలసిన విషయమొకటి ఉంది. అది ఈ కథల్లో కనవచ్చే ఆదర్శలక్షణం. ఈ కథలు చదవగానే నాకు వెంటనే ప్రేమ్‌చంద్ రాసిన ‘సాల్ట్ ఇన్సపెక్టర్’ (1910) గుర్తొచ్చింది. దుర్భరమైన జీవిత వాస్తవం ఎదట దాన్ని ఉన్నదున్నట్టుగా చిత్రించవలసిన బాధ్యత తెలిసినవాడై కూడా ప్రేమ్‌చంద్ ఆ కథని ఎంతో ఆదర్శవంతంగా ముగించాడు. ఎందుకని? బహుశా అది రచయిత జీవస్వభావం వల్ల అనుకోవలసి ఉంటుంది. మానవుడి పట్ల అపారమైన ప్రేమ, దయ ఉన్నందుకు వాళ్ళు ఆ కథల్ని మరోలా రాయలేదు.
గోర్కీ రాసిన ‘ఇరవయ్యారు మంది పనివాళ్ళూ, ఒక స్త్రీ’ (1899) కథ చూడండి, అది భయంకరమైన జీవిత వాస్తవం మనుషుల్నెట్లా మృగాలుగా మారుస్తుందో చెప్పిన కథ. కాని ప్రేమ్‌చంద్ అట్లా రాయలేకపోయాడు. ఎందుకని? గోర్కీకి మనుషుల పట్ల ప్రేమ, దయ తక్కువేమీ కాదే! నేనేమనుకుంటానంటే, గోర్కీ వ్యక్తుల్ని ద్వేషించకుండా వ్యవస్థని ద్వేషిండమెట్లానో నేర్చుకున్నాడు. ప్రేమ్‌చంద్ వ్యక్తుల్ని ద్వేషించలేక పోతున్నాడు కాబట్టి వ్యవస్థను సంస్కరించడమెట్లా అని ఆలోచిస్తున్నాడు.
ఈ కథల్లో స్కైబాబ చేసింది కూడా ఇదే. ఇప్పటి సమాజంలో మొబైల్ ఫోను మనుషుల్లోని అతృప్త ఆకాంక్షలను చల్లార్చే ఒక కన్స్యూమరిస్టు సాధనం. కాని చాలామందికి అది విముక్తి సాధనం కూడా. అది నువ్వున్నచోటే, నీ పరిమితుల్ని దాటి విశాల ప్రపంచంతో కనెక్ట్ కాగలిగే అవకాశాన్నిస్తుంది. అటువంటి అవకాశాల్లో రిస్క్ కూడా ఉంటుంది. మౌసమీ, జమీలా, వహీదాలతో మాట్లాడే అవకాశం దొరికిన ప్రతి ఒక్కరూ ఈ కథల్లో కథకుడు ప్రవర్తించినట్టే ప్రవర్తిస్తారన్న హామీ ఏమీ లేదు. కాని కథకుడు ఆయా అభాగ్య స్త్రీల పట్ల తన ప్రవర్తనలో అపారమైన ఆదర్శభావాన్ని చూపడమే ఈ కథల్లోని అత్యంత విలువైన అంశం. శతాబ్దం కిందట ప్రేమ్‌చంద్ కనపరచిన ఆదర్శవాదమే ఇప్పటి సమాజంలో ఎదట కూడా కథకుడు కనపర్చడం నన్నెంతో విస్మయపరిచిన మాట నిజమే కాని అంతకన్నా ఎక్కువ సంతోషమే కలిగించిందనాలి.
                                    వాడ్రేవు చినవీరభద్రుడు

Wednesday 13 November, 2013

'ఏక్ కహానీ కె తీన్ రంగ్' -వాడ్రేవు చినవీరభద్రుడు ముందుమాట

http://www.saarangabooks.com/magazine/2013/11/13/%E0%B0%B0%E0%B0%BF%E0%B0%AF%E0%B0%B2%E0%B0%BF%E0%B0%9C%E0%B0%82-%E0%B0%A8%E0%B1%81%E0%B0%82%E0%B0%9A%E0%B0%BF-%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9A%E0%B1%81%E0%B0%B5%E0%B0%B2%E0%B1%8D-%E0%B0%B0/
Like ·  ·  · 9 minutes ago near Hyderabad ·