చిన్నప్పుడు పంద్రాగస్ట్‌కు సంబరంగా ఊరు తిరిగేది. బడి ముందల జెండా ఎగరేసినంక సార్లు, ఊరిపెద్దలు స్వాతంత్య్రం గురించి, పోరాటయోధుల గురించి చెప్తుంటే ఒళ్లంతా ఊగిపోయ్యేది. పెద్దయినంక తెలిసింది, దేశ విభజన పేరుమీద లక్షల మంది బలయ్యన్రని, సరిహద్దుల్లో రక్తం యేరులై పారిందని. ఇట్లనే నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ అవతరణ అని, హైదరాబాద్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో కలిసిన రోజని చెబితే పాల మనసుతోని నిజమే అని నమ్మినం. తీరా చూస్తే - నిజాం పాలనను మించి ఆంధ్ర పాలనను తెచ్చిన్రని తెలిసొచ్చె. ఈడ గుడ నిజాం నిరంకుశ పాలన అని, రజాకార్ల దౌర్జన్యాలు అనే విన్నం గనీ పోలీస్ యాక్షన్ పేరు మీద లక్షలమంది ముస్లింలను కాల్చి చంపేసిన్రని తెలియకపాయె. ఆ విషయం ఇప్పటోల్లకు అస్సలు తెల్వకుండ ఎందుకు దాచిపెట్టిన్రని ఇవాళ మేం అడుగుతున్నం. అంతమందిని పొట్టనుబెట్టుకోవడం వెనుక హిందూత్వ భావజాలమె పని చేసిందనుకోవాల్నా? అంటే అప్పట్నించే ఆ భావజాలం అంత బలంగా ఉందా? ‘హైదరాబాద్ : ఆఫ్టర్ ద ఫాల్’ అనే సంకలనంలో (సంకలన కర్త ఒమర్ ఖాలిదీ) పోలీస్ యాక్షన్‌లో రెండు లక్షల మంది ముస్లింలు చంపబడినట్లు ఒక రిపోర్ట్ (పండిట్ సుందర్‌లాల్, ఖాజీ మొహమ్మద్ అబ్దుల్ గఫార్)ఉంది. కాని ఆ సంఖ్య ఆరు లక్షల వరకు ఉండొచ్చని కొందరు చెబుతున్నారు. అందమైన ముస్లిం ఆడపిల్లల్ని, ఆడోల్లని తెలుగోల్లు మాయం చేసిన్రని, పోలీసులు వారాల తరబడి రేప్ చేసిన్రని, లూటీలు, దహనాలకు లెక్కే లేదని తెలిసినప్పుడు మన ప్రజాస్వామ్యం మీద అనుమానమేస్తుంది. పోలీస్ యాక్షన్ గురించి మాట్లాడడం ఇప్పుడెందుకు అనే తెలంగాణ వాదులున్నారు. వాళ్లను ఎట్ల అర్థం జేసుకోవాలె? లక్షలమందిని చంపడం, ఇండ్లను దోచుకోవడం వల్ల కొన్ని తరాలపాటు ముస్లింలు కోలుకోకుండా చేశారు. ఇవాల్టి తెలంగాణ ముస్లింల వెనుకబాటుకి అది కూడా ఒక కారణం. ఎంతమందిని చంపిన్రనే దగ్గర్నించి ముస్లింల మానసిక హింస దాక అప్పటి ఆ విషయాలన్నీ వెలికి తీయాల్సిన అవసరం ఉంది.
మొత్తం ఇండియాల ఉర్దూ మాట్లాడేవాళ్లు కోట్లమందే ఉంటారు. ఇన్ని భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డయి, మరి ఒక్క ఉర్దూ రాష్ట్రమైనా ఎందుకు లేదని ప్రశ్నించుకోవడం దేశద్రోహం ఏం కాదు కదా. దేశ విభజనాభారాన్ని ఇక్కడి ముస్లింల మీద మోపి ఆ విషయం తప్పించడం సరైందా? ఉర్దూ మాట్లాడేవారు ఒక్కతాన లేకుండా దేశవ్యాప్తంగా పరుచుకొని ఉన్నారు కదా అనే సాకు సరైందా? ఎంఐఎం ఉర్దూ రాష్ట్రం కావాలని 1956లో డిమాండ్ చేసి ఉంటే ఎంత బాగుండు.
ఇవాళ హైదరాబాద్ లోని, తెలంగాణలోని ఉర్దూ మాట్లాడేవారు, సాహిత్యకారులు ఒక వేరే ప్రపంచంగా బతుకుతున్నారు. వాళ్లను మిగతా ప్రపంచంతో కలిపే ప్రయత్నం ఏది జరుగుత లేదు. వాళ్లతోనూ వేరే ప్రపంచం కలవడం లేదు. వాళ్ల సమస్యలు, వాళ్ల బాధలు వేరేగా ఉన్నాయి. ఆ అంతరాన్ని పెరగనివ్వకుండా చూడాల్సి ఉంది.
తెలంగాణ హిస్టరి రికార్డు చేసేప్పుడు విధిగా ఉర్దూ మాట్లాడేవాళ్ల ప్రాతినిధ్యం ఉండేలా చూడాలి. వాళ్ల ఫీలింగ్సుని పరిగణనలోకి తీసుకోవాలి. ఉర్దూను తెలంగాణ ద్వితీయ భాషగా గుర్తించాలి.
తెలంగాణ గురించి కమ్యూనిస్టులు, ఆంధ్రా వలస పాలకులు రాసిన చరిత్రే ఆధారం కావడం (?)తో అసలు విషయాలు ఎన్నో మరుగున పడ్డాయి. వెలుగులోకి రావలసిన విషయాలు చాలా ఉన్నాయి. అందులో కొన్ని ముఖ్యమైన విషయాల్ని ‘ముల్కి’ ముస్లిం ప్రత్యేక సంచికలో సంగిశెట్టి శ్రీనివాస్ రాసిండు. ‘నిజాం చరిత్రకు చెదలు’ పేరుతో రాసిన ఈ వ్యాసంలో ముస్లింలు మనసులో అనుకున్నప్పటికీ బయటికి చెప్పలేని కొన్ని విషయాలతో పాటు ఎన్నో కొత్త కోణాల్ని రికార్డు చేసిండు. దానిపట్ల ఎంతో వ్యతిరేకత వ్యక్తం కావడం ఆశ్చర్యం కలిగించింది. రాజరికాన్ని సపోర్టు చేయడంగా కొందరు మాట్లాడిన్రు. నిజాంలది రాజరికమే. (ఆ పేరుమీద రెడ్డి, వెలమ తదితర భూస్వాములు రాజ్యం చేసిన విషయం మరుగున పెడుతున్నారు.) ఇవాల ప్రజాస్వామ్యం పేరుమీద కోస్తాంధ్రులు నియంతృత్వం చెలాయిస్తుంటే, రాజరికం కన్నా ఎక్కువ దౌర్జన్యాలు చెలాయిస్తుంటే ఆ విషయం చెప్పొద్దంటే ఎట్ల? పైగా తమ కులాలకు చెందిన వాళ్లు రాజులుగా ఉన్నా ఆయా కులాల వాళ్లు మీరు రాజులు కదా అనే నిందను మోయడం లేదు. ఇండియాను క్రిస్టియన్లు పరిపాలిస్తే ఇవాళ క్రిస్టియన్లను మీరు పాలకులు కదా అని అడగడం లేదు. కాని ముస్లింల విషయానికొస్తే మాత్రం మీరు 400 ఏండ్లు పాలకులుగా ఉన్నరు కదా అని కొన్ని బీసీ సంఘాలు ముస్లిం రిజర్వేషన్‌ను వ్యతిరేకించాయి. అట్లె ఎంతోమంది అలా వాదిస్తున్నారు. ఆఖరికి తెలంగాణ వాదుల్లో కొందరు గూడ అయ్యే మాటలు మాట్లడడం విన్నప్పుడు చీదరింపు కలిగింది. ఏ కులంగాని, మతంగాని, జాతిగాని ఇట్లా మీరు పాలకులు కదా అనే భారాన్ని మోయడం లేదు. ఒక్క ముస్లింలు తప్ప.
పాలకులు అన్న ఈ భారాన్ని మోస్తున్న ముస్లింలకు సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని బిజెపి నిర్వహిస్తున్న తీరు వల్ల కూడ మరింత నష్టం కలుగుతున్నది. ఇట్లాంటి సందర్భంలో సెప్టెంబర్ 17ను ఉత్సవంగా టిఆర్‌ఎస్ నిర్వహించకుండా ఉండడం సరైందనిపించింది. కాని కొన్ని తెలంగాణ సంఘాలు ఈ విషయాన్ని విస్మరించడం విస్మయం కలిగించింది. కోస్తాంధ్ర వలసవాద పాలన నుంచి తెలంగాణకు విమోచన కలగనంతవరకు సెప్టెంబర్ 17ను ఉత్సవంగా జరపడంలో అర్థం లేదు.
ఇవాళ రాజకీయంగా జరుగుతున్న ఉద్యమంపై ముస్లింలకు అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. రాజకీయ ఉద్యమం సాహిత్యరంగంలోని ఒక వర్గాన్ని ప్రభావితం చేస్తుండడం ఇవాల్టి విషాదం. టిఆర్‌ఎస్ మొదలయింతర్వాత బిజెపి నుంచి చీలిపోయి టిఎస్‌ఎస్‌గా ఏర్పడ్డ నరేంద్ర పార్టీ టిఆర్‌ఎస్‌లో కలవడం ముస్లింల పట్ల వివక్ష మొదలు కావడానికి కారణమైంది. (ముస్లింలకు కూడా టిఆర్‌ఎస్‌పై అనుమానం మొదలైంది.) అంతదాకా ముస్లింల జనాభా తెలంగాణలో గణనీయంగా ఉందని భావించి 15 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ప్రకటించిన టిఆర్‌ఎస్ ఆ వాయిస్‌ను తగ్గించింది. అట్లే సీట్ల కేటాయింపులోనూ అన్యాయం చేసింది. ఇప్పటికీ ఆరెస్సెస్ వాడినే అనే నరేంద్ర రెండవ నాయకుడుగా ఉండడంతో ముస్లింలలో ఒక సందిగ్ధం నెలకొంది. తెలంగాణ వస్తే బిజెపి ప్రాబల్యం పెరుగుతుందని జరిగిన ఒక ప్రచారం కూడా ఇందుకు కారణం. పైగా అసెంబ్లీలో ముస్లింల ప్రతినిధిగా మాట్లాడే ఎం.ఐ.ఎం కూడా తెలంగాణ పట్ల మొదట వ్యతిరేకంగా మాట్లాడడం కూడా మరో కారణం. కాని ఎం.ఐ.ఎం ముస్లింల ప్రతినిధి కాదని ఇక్కడ అందరం గుర్తుంచుకోవాలి. ఒక్క పాతబస్తీలో తప్ప మిగతా తెలంగాణ జిల్లాల్లో ముస్లింలు ఎం.ఐ.ఎం.తో లేరు.
నరేంద్ర తదితర ఆరెస్సెస్ వాదుల (రాజకీయ పార్టీలతో సంబంధం లేని ఆరెస్సెస్ వాదులు కూడా) వల్ల ఇవాల ముస్లింల పట్ల ఒక వివక్ష, మౌనం చూస్తున్నాం. చివరికి ఇదే భావజాలం సాహిత్యానికి కూడా పాకి మిగతా ఐడెంటిటీ ఉద్యమాలతో పాటు ఒక ఉద్యమంగా నడుస్తున్న తెలంగాణ వాదం ముస్లిం వాదం పట్ల వివక్ష చూపుతూ వస్తున్నది. వేదికల మీద ముస్లింలు లేకుండానే నడిపిస్తున్నది. ఒక్క తెలంగాణ సాంస్కృతిక వేదిక కాస్త ఇందుకు మినహాయింపుగా కనబడుతున్నది.
సాహిత్య ఉద్యమంతోపాటు తెలంగాణ రాజకీయాలు కూడ ముస్లింల పట్ల స్పష్టమైన ప్రకటనలు (చేయాలి) చేసేలా తెలంగాణ ముస్లింల ప్రాముఖ్యతను రికార్డు చేయవలసిన అవసరం ఉంది.
తెలంగాణ హిస్టరీ రికార్డు చేసే క్రమంలో ముస్లింల కోణం నుంచి లెక్కలోకి తీసుకోవల్సిన అంశాలు క్లుప్తంగా :
- స్కైబాబ
charitra telusukuni em sadhinchali?? sare meerannattu muslims ki anyayam jarigi unte.. ippudemina cheyyagalama?
ReplyDeleteokasari kaaloji 'naa sodi' chadavandi. it clearly depicts how muslims exploited hindus during entire nizam regime. no one is a saint.
ReplyDeletethe moment you blame someone as a sectarian, u fall under the same trap.
హైదరాబాద్‌లో ముస్లింలు ఎక్కువగా ఉండే బోరబండ, హఫీజ్‌పేట ప్రాంతాలు చూసాను. అక్కడి ముస్లింలలో ఎక్కువ మంది లోయర్ మిడిల్ క్లాస్‌వాళ్లే. హైయర్ మిడిల్ క్లాస్‌వాళ్లు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో ముస్లింలు అంతగా కనిపించలేదు.
ReplyDelete