Sunday, 25 October, 2015

లవ్‌ యూ షాహిదా (katha)


షానా రోజుల నుండి షాహిదా ఫోన్‌ ఎత్తుత లేను. అయాల షానాసార్లు తన నుంచి ఫోన్‌ వచ్చింది. ఎప్పట్లెక్కనె ఎత్తలేదు.. గని ఏదో డౌట్ వచ్చింది. అయినా ఒక్కసారి ఎత్తి మాట్లాడితే మల్ల మల్ల మాట్లాడమంటది.. రోజు మాట్లాడమంటది, ఎందుకొచ్చిన బాధ అని ఊకున్న.
ఆఫీసుకు బైల్దేరిన. అన్నిసార్లు ఫోన్‌ కారణంగ షాహిదా యాది సుట్టుముట్టింది.
నా ‘మిస్‌ వహీదా’ కథ వచ్చినప్పటినుండి కాల్స్‌ చెయ్యడం మొదలు పెట్టింది షాహిదా. మొదట్ల మర్యాదగా మాట్లాడింది. నా వివరాలు అడిగింది. ఏజ్‌ అడిగింది. చెప్పిన. దాంతో ‘నువ్వు నాకన్నా చాలా చిన్నోడివి రా!’ అన్నది. అప్పట్నుంచి ‘రా’ అనడం మొదలుపెట్టింది. పోనీలే అనుకున్న. రోజు కాల్‌ చెయ్యడం, ఎత్తకపోతె మల్ల మల్ల చేసి ఎత్తిందాంక సంపడం చెయ్యబట్టింది. మేమిద్దరం ఉర్దూల్నె మాట్లాడుకునేది..
అసలు నేనెక్కడ తప్పు చేసిన్నంటే- ఆమె ఆ కథ గురించి డిస్కస్‌ చేస్తుంటె ఆమె గొంతుల పలుకుతున్న మనసులోని బాధ సమజై ‘మీరు మీ జీవితం గురించి హాప్పీనేనా?’ అన్న. ‘ఏంటి అలా అడిగావ్‌?’ అంది. ‘ఊరికే అడిగాను’ అన్న. ‘లేదు లేదు.. చెప్పాల్సిందే..’ అని వెంటపడ్డది. ‘ఏం లేదు షాహిదా! నువ్వు మాట్లాడుతుంటే నీ జీవితం గురించి నీలోనూ ఏదో అసంతృప్తి ఉందనిపించింది’ అన్న.
కాసేపు మౌనమైపొయ్యింది. ‘ఏమైందీ?’ అన్న. ‘ఏం లేదు రా..’ అన్నది. ‘ఏంటి కళ్లల్లో నీళ్లు తిరిగాయా?’ అన్న. ‘హేయ్‌.. చంపకురా..!’ అని ‘నేను మల్లి మాట్లాడుత’ అని పెట్టేసింది.
కాసేపట్కి మల్ల ఫోన్‌ చేసి ‘అలా ఎందుకు అనిపించింది నీకు?’ అని నిలతీత. ‘నిజమా కాదా?’ అంటే ‘అదేమి నేను చెప్పలేను.. కాని ఎందుకనిపించిందో చెప్పు..’ అని ఒకటే గొడవ.
అదిగో అక్కడ్నుంచి మరింతగా నాతో మాట్లాడ్డం మొదలుపెట్టింది షాహిదా. నేనేదైనా పనిలో ఉండి ఫోన్‌ ఎత్తకపోతే ఎత్తిందాకా ఇరవై ముప్ఫై సార్లయినా
చేసేది. విసిగిపోయి నేనే పోనీలే అని ఎత్తి మాట్లాడేటోన్ని.
‘అరేయ్‌! నువ్వు నాకన్నా చిన్నోడివైనా ఆ ‘మిస్‌ వహీదా’ కథతో పడేశావ్‌రా.. ఎక్కడో టచ్‌ చేశావ్‌.. అలా అని నేను నీతో భౌతిక ప్రేమనేదో కోరుకుంటున్నానని కాదు. కాని బాగ ఇష్టమైపోయావ్‌ రా..’ అని తన్మయంగ మాట్లాడుకుంట.. నేనిక ఉంటానంటే ‘కాసేపు మాట్లాడరా.. నీ సొమ్మేం పోతుంది మాట్లాడితే.. నువ్వు మాట్లాడ్డం వల్ల ఇక్కడ ఒక జీవి హాప్పీగా ఉంటుంది కదా అని తృప్తి పడొచ్చు కదా..’ అనేది.
‘ఓయ్‌! నీ మనసుకు బాగనె ఉంటది.. ఇక్కడ నా టైం తినేస్తున్నావే తల్లీ!’ అని మొత్తుకునేటోన్ని.
‘నా ఒక్కరి కోసమే కదా.. రోజుకు కాసేపే కదా..’ అని వెంటపడేది. ఏమనాల్నో సమజయ్యేది కాదు.
టీవీలో హిందీ పాటలు, మంచి కార్యక్రమాలు, హిందీ సినిమాలు చూస్తూ ఉండేది షాహిదా. ఏ మంచి పాటొచ్చినా.. సినిమా వొచ్చినా నాకు కాల్‌ చేసి చెప్పాలని ఆరాటపడేది. నన్ను కూడా చూడమని చెప్పేది. ఒకసారి ఇంట్లో ఎవరూ లేక బోర్‌ కొట్టి షాహిదాను అడిగిన. మంచి పాత హిందీ సినిమాల పేర్లు కొన్ని చెప్పు అని. కొన్ని పేర్లు చెప్పింది తన్మయంగ.
‘కట్ పుత్లీ’
‘కారవాన్‌’
‘సీమా’
‘తీస్రీ మంజిల్‌’
………
ఇవి చూడు అంటూ.. సరేనని.. నోట్ చేసుకుని.. తను చెప్పిన ఒక్కో సినిమా చూసిన. చూస్తుంటె డౌట్ వొచ్చింది. అన్నీ సూషినంక ఆలోచిస్తుంటే.. పరేశాననిపించింది. అన్నింట్లోనూ హీరోయిన్‌లు తమకు ఇష్టమొచ్చినట్లు నడుచుకొనే పాత్రలు.. అల్లరి అమ్మాయిలుగా పేరుబడే పాత్రలు, చలాకీగా, యమ హుషారుగా ఉండే పాత్రలు..!
ఓహ్‌..! తన మనసులో అలా ఉండాలని ఉన్నా ఉండలేకపోయిన ఒక అమ్మాయి ఆ పాత్రల్లో తనను తాను చూసుకునే పాత్రలవి. అంటే- షాహిదా లోపల చాలా అల్లరి పిల్ల. కాని
పైకి కుటుంబ సభ్యుల కనుసన్నల పంజరంలో చిక్కుకున్న పక్షి. ప్చ్‌.. అలా ఆలోచిస్తుంటే- ఒక్క షాహిదా నేనా..! ఎంతమంది షాహిదాలు అలా ఉంటారో కదా..
ఒఫ్ఫో..! అనిపించి గుండె బరువెక్కిపొయింది… ఆ విషయం తనతో చర్చించాలా.. వద్దా.. అని సోంచాయించిన. కని బాధ పెట్టినోన్నయితనేమో ననిపించింది. దాంతో ‘చాలా బాగున్నాయ్‌ సిన్మాలు’ అని మాత్రమె చెప్పిన. ‘కదా!’ అని షానా ఖుష్షయింది. నా మనసు మాత్రం బాధతోని ముడుచుకుపొయ్యింది.
సరే, ఆ సింపతి తోనో, ఒక మంచి ఫ్రెండ్‌ అనుకొనో మాట్లాడుతుండేటోన్ని. ఒకసారి ‘నిన్ను చూడాలి షాహిదా!’ అన్న. ‘నేను కనబడను కదా..!’ అన్నది. ‘ఎందుకో..?’
అంటే – ‘నీ జీవితంలో నన్నొక అనామిక గా ఉండిపోనీ రా!’ అన్నది ఒకలాంటి గొంతుతో.
‘వెన్నెల్లో ఆడపిల్ల లాగానా..? మిస్‌ వహీదా లాగానా?’ అన్న నవ్వుతూ.
‘అవి రెండూ కాకుండా నేను ప్రత్యేకం..!’ అన్నది.
‘నీ ఇష్టం..!’ అని వొదిలేసిన.
ఒకసారి వాళ్ల ఊరికి అనుకోకుంట పొయినప్పుడు సూడాల్నని అడిగిన. ముందు షానా హాప్పీగా కలుద్దామని ప్లేస్‌ గూడా చెప్పింది.. కాని ఆఖరికి కుదరదన్నది.
ఎందుకు అనడిగితే.. ‘ఏమో రా.. వద్దనిపించింది’ అన్నది.
‘ఓకె.. వొదిలెయ్‌’ అన్న.
‘రేయ్‌! నేను పలకరించకుండా ఉంటే నీకు నేను గుర్తొస్తాను కదా.. నిజం చెప్పు’ అన్నదొకసారి.
‘వొస్తావ్‌.. రోజూ పలకరించేవాల్లెవరైనా రెండ్రోజులు మాట్లాడకపోతే గుర్తొస్తరు కదా!’ అన్న.
‘అలా కాదు.. ‘మనసారా’ అలా అనిపిస్తుందని చెప్పరా..’ అని బతిమాలుపు.
‘ఎందుకలా చెప్పాలి?’ అన్నాను. ‘అనిపిస్తే చెప్పు’ అని తను. ‘లేదు.. అలా నువ్వు కోరితే నేనెందుకు చెప్పాలి?’ అని నేను. అలా కొన్నాళ్లు మా మధ్య చిరు గొడవ.
కొన్నాళ్లకు నేను ఉద్యోగం మారడంతో కొద్దిగ బిజీ అయిపొయ్‌న. అదే సంగతి చెప్పిన. ‘కాసేపు మాట్లాడరా.. ఒక్క నిమిషం చాలు!’ అని బతిమిలాడేది. ‘ఏమొస్తుంది షాహిదా నీకు..? వొదిలెయ్‌ నన్ను. నా పనులతోనే నేను చస్తున్నా. మధ్యలో నీదో గొడవైపోయింది నాకు. కాల్‌ ఎత్తకపోతే ఏదైనా పనిలో ఉన్నడేమోనని గుడ చూడవు.. ఒకటే చేసి చంపుతావ్‌.. అసలు ఏమనుకుంటున్నావ్ నన్ను?…’ అని షానాసేపు ఉతికి ఆరేసిన.
‘నేనంతే.. నువ్వు నాతో మాట్లాడాల్సిందే..!’ అన్నది.
‘అరె.. నా మీద నీకేదో ప్రత్యేకమైన హక్కున్నట్లు మాట్లాడ్తవేంది?’ అన్న.
‘హక్కే.. మాట్లాడాల్సిందే..!’
‘అస్సలు మాట్లాడ.. ఏం చేసుకుంటవో చేస్కో..!’ అని ఫోన్‌ కట్ చేసిన.
రెండు మూడుసార్లు ట్రై చేసి మెసేజ్‌ పెట్టింది- ‘సారీ రా.. విసిగించనులే.. కాస్త తగ్గిస్తాలే.. అప్పుడప్పుడైనా మాట్లాడరా..’ అని.
‘సరేలే..’ అన్న.
అప్పట్నుంచి కొద్దిగ తగ్గించి రెండు మూడ్రోజులకు ఒకసారి మాట్లాడ్తానికి ట్రై చేసేది. ఇంకా తగ్గించాల్నని తను కాల్‌ చేసినప్పుడల్లా బిజీ అంటూ మెసేజ్‌ పెడుతూ ఎప్పుడో ఒకసారి మాట్లాడుకుంట కొన్నాళ్లకు మొత్తానికే తన ఫోన్‌ ఎత్తడం మానేసిన. షానాసార్లు ట్రై చేసింది. కాని నేను పట్టించుకోలేదు. అసలే కొత్త ఆఫీస్‌లో నాకు పనెక్కువైపోయింది. పైగా ఇంపార్టెంట్ నవల ఒకటి రాయాలనే పనిలో పడ్డ. అలా మొత్తానికి షాహిదా బెడద తగ్గింది. కాని ఎప్పుడో ఒకసారి కాల్‌ చేసి చూసేది. మెసేజ్‌ పెట్టేది.
‘ఎలా ఉన్నావ్‌ రా..! ఒకసారి మాట్లాడొచ్చుగా!’ అని.. ‘నేను మీ ఊర్లోనే ఉన్నా’ అని.. ‘మా ఊరివైపు వస్తే చెప్పు’ అని.. ‘నీతో మాట్లాడక ఇన్ని నెలలైంద’ని.. ‘నీ గొంతు వినాలని ఉంద’ని.. పట్టించుకోడం మానేసిన.
సింపతికి పోతే నా టైం కిల్లవుతుందని నా బాధ. అలా మాట్లాడకుండా వదిలేసిన షాహిదా నుంచి అవాళెందుకో ఒకటే ఫోన్లు. వేరే ఏదో నెంబర్‌ నుంచి కూడా వస్తున్నయ్‌ కాల్స్‌. అది తనదే అయివుంటదని ఎత్తలేదు. ఏమై ఉంటుందా..? ఎందుకు అన్నిసార్లు చేస్తుందా? అని ఆలోచనలొచ్చినా పట్టించుకోకుండా ఆఫీస్‌లో పని చేసు కుంటున్న.
కాసేపటికి చూస్తె షాహిదా నుంచి ఒక మెసేజ్‌. ఓపెన్‌ చేసి సూషిన.
”సర్‌! షాహిదా మా మమ్మీ. తనకు హార్ట్‌ స్ట్రోక్‌ వచ్చింది. కండిషన్‌ ఏమంత బాలేదు. హైదరాబాద్‌లోనే మలక్‌పేట్ యశోదా హాస్పిటల్‌లో ఉంది. పొద్దున కష్టంగ మాట్లాడింది. మీ పేరు చెప్పి ఒకసారి మిమ్మల్ని చూడాలని ఉందని చెప్పింది. ఒకసారి వచ్చి వెళ్తారా సర్‌! ప్లీజ్‌!”
షాక్‌ తిన్న. బాధనిపించింది. ‘అరె, అంతగనం బాగలేకున్నా తనను చూడాల్నని అన్నదా..! అయ్యో..!’ అనిపించి మనసంతా పిండినట్లయింది.
ఆఫీస్‌లో పర్మిషన్‌ తీస్కొని 4 గంటలకే బయల్దేరిన మలక్‌పేటకు. గుండె బరువెక్కి పొయింది. బండి నడుపుతున్న గని షాహిదా ఆలోచనలే ముసురుకున్నయ్‌
మది నిండా.. తనని చూడాలని షానా ఉండేది తనకు. పరిపరి విధాలా సోంచాయించేటోన్ని. తను ‘రా’ అంటుందని తను కూడా ‘వే..’ అనేటోడు. చికాకు పెట్టినప్పుడు తిడితే
నవ్వేది. పాట పాడమని చంపేది.. ‘చూడాలని ఉందే నిన్ను’ అంటే ‘ఆ ఒక్కటి అడక్కు’ అని నవ్వేది. ‘చూస్తే నీ సొమ్మేం పోతుందే!?’ అంటే.. ‘వద్దురా..
నా స్నేహం ఇలాగే మిగలనీ నీ జీవితంలో..!’ అనేది.
వయసులో అంత పెద్దదయినా షానా హుషారు గుండేది. ఆమె చలాకీ మాటలు.. ఊహలు.. అవన్నీ చూసి ఆశ్చర్యమనిపించేది. ‘ఒక నవల రాయి షాహిదా.. నువ్వు రాయగలవు..
రాస్తే చాలా బాగా వస్తుంది. నీ జీవితాన్నే ఒక మంచి నవలగా మలచవచ్చు.. అసలు నువ్వు ఏంటి ? నీ చుట్టూ ఉన్న నీ వాళ్లు – ముస్లిం సమాజం నిన్న్లెలా
నడిపించింది? నీలో పేరుకుపొయిన ఖాళీలేంటి ? ఇలా నువ్వు ఎన్నో రాయొచ్చు.. రాయి షాహిదా.. నేను ఎడిట్ చేస్తాగా.. నువ్వయితే రాయి..’ అని షానాసార్లు
చెప్పిన. రాస్తాననేది.. కాని.. కుదురుగా ఉండే మనిషి కాదు.. అందుకే రాయలేదేమో ననిపించేది.
తన భర్త చనిపోయి షానా యేళ్లయిందని.. తనకు ఇద్దరు కొడుకులు, ఒక బిడ్డఅని.. చిన్న కొడుక్కి తనంటే షానా ఇష్టమని.. మిగతావాళ్లు వాళ్ల వాళ్ల
జీవితాల్లో బిజీ అయిపోయారని చెప్పింది షాహిదా. హాస్పిటల్‌ చేరుకొని కాల్‌ చేసిన. షాహిదా కొడుకొచ్చి కలిషిండు. తన పేరు జుబేద్‌ అని పరిచయం చేసుకున్నడు. మనిషి బాగున్నడు.
”రండి సర్‌..” అని లోనికి తీస్కెళ్తున్నడు.
”ఎప్పుడు జాయిన్‌ చేశారు?” అడిగిన.
”త్రీ డేస్‌ అయింది సర్‌.. నేను సిట్జర్లాండ్‌లో ఉంటాను. లక్కీగా వారం కింద వొచ్చి ఉంటిని. 3 డేస్‌ కింద మార్నింగ్‌ టైంలో పడిపొయింది మమ్మీ.. లోకల్‌ హాస్పిటల్‌కి తీస్కెళ్లాను. సివియర్‌ స్ట్రోక్‌ అని చెప్పారు.
హైడ్రాబాద్‌ తీస్కెళ్లండంటే వెంటనే తీస్కొచ్చాను..”
”డాక్టర్స్‌ ఏమంటున్నారు? ప్రజెంట్ సిచ్యుయేషన్‌ ఏంటటా?”
”కష్టమ్‌ అంటున్నారు సర్‌! ఆ యేజ్‌లో సర్జరీ కూడా కుదరదని చెప్పారు..” అతని గొంతులో బాధ.
”ఓహ్‌..” నిట్టూర్చిన. ఇంకేమనాలో సమజ్‌ కాలె. ఐసీయూ దగ్గరి కెళ్లినంక మాస్క్‌ డ్రెస్‌ వేసుకొని ముక్కుకు మాస్క్‌ వేసుకొన్న.
”వెళ్లండి సర్‌.. సిక్స్‌త్‌ బెడ్‌” అన్నడు జుబేద్‌.
ఐసీయూ సల్లగా ఉంది.. షాహిదా బెడ్‌ వైపు నడుస్తుంటే మనసు మరింత భారమైంది. దగ్గరికెళ్లి చూసిన. తెల్లని పండు ముసలి మొఖం. ఎంతో కళ ఉంది ఆ మొఖంలో.. పూర్తిగా తెల్లబడ్డ వెంట్రుకలు దిండుకు తలకు మధ్య నలిగి ఉన్నయ్‌.. నిద్రలో ఉన్నట్లుగా కనురెప్పలు.. ఛాతీదాంక బెడ్‌షీట్ కప్పి ఉంది. ఆ అద్భుతమైన మొఖాన్ని కొద్దిసేపు అలా చూస్తు ఉండిపొయ్‌న. ఈమెతోనా నేను ఇన్నాళ్లు మాట్లాడింది అనుకుంటే నమ్మకమే కలగనట్లు అనిపించింది.. నోస్‌పీస్‌ తీసేసి మెల్లగా పిలిచిన..
”షాహిదా..!”
ఆ కండ్లు తత్తరపడ్డయ్‌.. మనిషిలో ఏదో ప్రకంపన. మెల్లగా పిలిషినా గూడా అంతగనం స్పందననను సూషి ఆశ్చర్యమేసింది నాకు.
మెల్లగా కండ్లు తెరిషింది షాహిదా.. నన్ను సూడంగనే ఆ కండ్లల్లో ఒక మెరుపు రావడం మొదలైంది. నేను మొఖంలో నవ్వు పులుముకొని చూస్తున్న తన దిక్కే.
మెల్లగ తన మొఖం గూడా విచ్చుకుంది. పెదవులపై నవ్వు. మెల్లగ అన్నది.. చాలా కష్టంగా వొస్తున్నది మాట-
”వచ్చినందుకు షుక్రియా..!” అని.
నేను ఉండలేకపొయ్‌న. ఒక అడుగు ముందుకేసి వంగి కుడిచేత్తో తన తల నిమిరిన. కండ్లు మూసి తన్మయంగ ఫీలయ్యింది.
”యూసుఫ్‌!”
నేను ఇంకాస్త తన దిక్కు వంగిన.
”నిన్ను చాలా విసిగించాను.. నీతో కలవాల్సి ఉండె.. నీతో ఇంకా మనసు విప్పి ఎన్నో విషయాలు చెప్పుకోవాల్సి ఉండె.. ఆత్మాభిమానం అడ్డొచ్చింది రా..
మొండిదాన్ని కదా.. నువ్వన్నట్టు.. ఒక నవల రాయొచ్చు నా జీవితం.. కాని ఎందుకో.. మా నాయన వల్ల.. మా ఆయన వల్ల.. ఏదీ బైటికి చెప్పుకోలేని
అలవాటయింది…” కాసేపు ఊపిరి తీసుకుంది.. కష్టమైతున్నట్లుంది..
”మాట్లాడకు లే షాహిదా” అన్నా..
”…లేదు.. చెప్పాలి.. నాకు జీవితం ప్రతి మలుపులో అర్థమవుతూనే ఉండేది రా.. నాలో అసంతృప్తులు పేరుకు పోతున్న విషయం..! కాకపోతే అవేంటో స్పష్టంగా తెలిసేవి కావు.. పంచుకోడానికి ఎవరూ ఉండేవారు కాదు.. నువ్వు కదిలించాక.. రాక్షసుడివి.. నీతో మాట్లాడాక.. నీతో మాట్లాడుతుంటే.. ఒక్క నెల్లోనే నా 64 ఏండ్ల అసంతృప్తులన్నీ మాయమైనట్లు ఫీలయ్యాన్రా..!
నిజం..!!”
మల్లీ కష్టంగా ఊపిరి తీసుకుంటూ చేతితో ఛాతీ రుద్దుకుంది.. నాకేం చెయ్యాల్నో తోస్తలేదు. ఎడమ చేయి నా వైపు చాపింది.. నా చేతుల్లోకి తీసుకున్నా.. సల్లగా మెత్తగా.. పనులు చేసి చేసి వడలిపొయ్‌న జిందగీలా ఉంది..
”యూసుఫ్‌..!” పిలుస్తోంది.. ఆ కళ్లల్లో నీళ్లు ఉబుకుతున్నయ్‌..
”నా అసంతృప్త ఫీలింగ్స్‌ అన్నీ కనీసం నీతో పంచుకున్నా బాగుండేది.. నువ్వయినా రాసేవాడివి.. నా బ్యాడ్‌లక్‌.. ఇంత త్వరగా.. పోతాననుకోలేదు రా…” ఛాతీ కాస్త ఎగిసిపడింది..
”…మిస్‌ యూ.. రా..!”
నా చేతుల్లోని తన చేయి నిశ్చలమైతునట్లు అనిపించింది.. టెన్షన్‌గా తన దిక్కు చూస్తే ఆ కళ్లల్లోంచి నీళ్లు కారిపోతున్నాయ్‌..
కళ్లు నిశ్చలమై నిలిచిపోయాయ్‌..
నాకు దుఃఖం ఎగతన్నుకు వచ్చింది..
జీవిత కాలమంతా మోసిన బరువేదో తాను దించుకుంటూ నా గుండెకెత్తినట్లు అయిపొయ్‌న.