Wednesday 24 February, 2016

ఖామోషీ

చుట్టూరా ఆవహించిన మానసిక కాలుష్యం
నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తూ
నాపై మౌనముద్ర వేస్తుంది

ఖండఖండాలై
బాహ్య సంఘటనా సంఘర్షణల మధ్య
మనసుకు పట్టిన మసితెరల్ని చీలుస్తూ
ఊపిరి తీస్తుంటాను

నిద్ర ఎరుగని రాత్రిళ్ళు
జాము గడవని పగళ్ళు
నా గుండె పగుళ్ళలోకి ఇంకిపోతుంటాయ్‌

సందేహాల వలను తెంపుకొంటూ
యాతనామయ జీవనరాగాల్ని కూడదీసుకొంటూ
మౌనం మెల్లగా రగులుకుంటుంది

నా మౌనం వెనక సప్తసముద్రాల ఘోష
పడగలెత్తి నాలుకలు చాస్తుంది
సహస్ర సన్నివేశాల్ని సమీక్షిస్తుంటాను

నా మౌనం లక్ష గవాక్షాలుగా
లోకంపైకి తెరుచుకుంటుంది
రాలిన వెతల కథల్ని కౌగిలించుకుంటాను

నా అంతర్ముఖంలోకి
తొంగిచూసే వెన్నెన్ని వింత ముఖాలో...
ఆ ఒక్కో వెక్కిరింతను
ఒక్కో ఆయుధంగా చెక్కుకుంటుంటాను

నా అవసరాన్ని కొనాలనుకునే
నీ కాసుల కుసంస్కారానికి
నా మౌనం అర్ధాంగీకారం కాదు
నీ దిష్టి బొమ్మను తగులబెట్టే 'నిరసన'

వాదించిన ఎన్నోసార్లు
నిన్నే గెలవనివ్వడమంటే
నీ రుగ్మతనీ, నీ 'ఈగో'ని
గుర్తు చెయ్యడమే-
నువ్వెన్ని కవచాలు తొడుక్కున్నా
నీ మార్మికత లోలోపలి అంచుల్ని
పరిశీలిస్తుంటాను

నా మౌనాన్ని చూసి
ఆధిపత్యం నీదనుకుంటావు
నువ్వు అలసిపోయాక
నా దాడి మొదలవుతుంది