నిద్ర లేషిన. చూస్తె, పక్కన షాహీన్ పండుకొని ఉంది. నా లెక్కనె ఎప్పటికి నిద్ర పట్టిందో ఏమొ అని సప్పుడు కాకుంట మెల్లగ లేషి రెండడుగులేషిన. అడుగులు తేలికగ పడుతున్నట్లు అనిపించింది. ఏదో అనుమానమొచ్చి వెనక్కి తిరిగి చూసిన. చిత్రం.. నేను అక్కణ్నే పండుకొని ఉన్న! ఒక్కసారిగ ఒళ్లు ఝల్లుమనిపించింది.. కాని అనిపించ లేదు.. ఎందుకంటే నాతో ఒళ్లు లేదు. కొద్దిసేపు ఏం సమజ్ కాలె.. మెదడు మొద్దుబారిపొయింది.. కాని పోలేదు.. అది గుడ నాతో లేదు! అయోమయంగ తోచింది. ఏంది.. నేను.. నేను.. లేదు.. లేదు.. అలా ఐతానికి వీల్లేదు.. అలా జరగదు. జరగనివ్వద్దు.. దబదబ వెనక్కి వెళ్లి మళ్లీ నా ఒళ్లు ఉన్న చోట పండుకున్న. పండుకున్న సరె.. కాని కాళ్లు చేతులు ఆడిస్తే తేలిగ్గ ఆడుతున్నట్లు తోచింది. చూస్తె నా ఒంటి చేతులు కాళ్లు అసలు కదల్తనె లెవ్వు.. భయంగ అనిపించింది.. నిజంగా భయపడుతున్ననా.. బాధగ అని పించింది.. బాదైతె నిజంగనె కలుగుతున్నది.. అంటె.. నేను.. చచ్చిపొయిన్నా.. యమ బాధేస్తున్నది.. ప్చ్.. నేను చచ్చిపొయ్ న.. చచ్చిపొయినట్లె గదా.. గుండెను మెలితిప్పినట్లు ఫీలింగ్.. అయ్యో.. ఇంకా ఎన్నెన్ని పనులు మిగిలిపొయ్నయ్.. అప్పుడె నేను చచ్చిపొయిన్నా.. నిండా నలభై ఏళ్లు లెవ్వు.. ఇంత జల్ది ఎందుకిట్ల ఐపొయ్న.. ఛత్తెరెకీ!
అనుకుంటనే ఉన్న.. పుసుక్కున ఎక్కడ చచ్చిపోతనో.. చెయ్యాలనుకున్నవి జల్దిజల్ది చేసెయ్యాల్నని. ఛత్, చెయ్యకుంటనే ఎళ్లిపొయిన్నే.. ఇప్పుడెట్లా.. ఏం జెయ్యాలె..లేషి కూసున్న.. చూస్తె, నా ఒళ్లు పండుకునె ఉన్నది. మొఖం ప్రశాంతంగ ఉంది. హాయిగ నిద్రపొయ్ నట్లె ఉంది. యూసుఫ్ ని! చచ్చిపొయ్ న.. నన్ను నేను మొదటిసారి చూసుకున్న.. ఎంత అద్దంలో చూసుకున్నా ఇట్ల ఎప్పుడు గుడ కనిపించలేదు. అయ్యో.. అప్పుడే చనిపోవడమేంది రా.. దుక్ఖం గా అనిపించింది. నా ఒంటిమీదికి వంగి నా మొఖాన్ని రెండు చేతుల్లోకి తీసుకున్న.. ముద్దొచ్చే మొఖం.. అప్పుడే ముడతలు పడిపోయింది.. నలభై ఏళ్లల్లోనే ఎన్ని కష్టాలు, ఎన్ని దుక్ఖాలు.. ఎన్ని సముద్రాలు ఈదిన్నో.. ఎందరిచేత స్నేహించబడ్డనో.. ఎందరిచేత ద్వేషించబడ్డ నో.. కాని మరెందరిచేతనో ప్రేమించబడ్డ.. అదొక్కటే తృప్తి..
వంగి నుదుటిపై ముద్దు పెట్టుకున్న.. రెండు కన్నీటి చుక్కలు రాలుతున్న ఫీలింగ్.. కానీ రాలడానికి నా కళ్లేవి.. అవి ఎదురుగ మూసుకుని ఉన్నయి.. ఎంత కన్నీటినో కార్చిన కళ్లు.. ఎంత కోపాన్నో ప్రదర్శించిన కళ్లు.. ఎన్నేసి ప్రపంచాల్నో చూసిన కళ్లు.. శాశ్వతంగ మూతపడ్డయ్.. ఇప్పుడేం చెయ్యాలె.. నా బేగంని లేపనా.. ఆమెంత పరేశానై పోతదో.. తట్టుకోగలుగుతదా.. అయ్యో.. నా పిల్లలు.. ఎలా అమాయకంగా నిద్ర పోతున్నరో చూడు.. వాళ్లకి నేను చచ్చిపొయిన్నని తెలిస్తే ఎంత ఏడుస్తరో గదా.. నేను లేకుండా వీళ్లు ఉండగలుగుతరా.. అరెరె.. ఎంత పనై పాయె.. అనుకుంటనే ఉన్న.. ఎక్కడ హార్ట్ ఎటాక్ వచ్చి చచ్చిపోతనొ అని.. మొన్ననే అనుమానమొచ్చింది.. ఎడమ చేయి తట్టుకోనంతగా నొప్పి పెట్టింది. టెస్టులు చేయించు కున్నదాకా షాహీన్ ఊరుకోలే. బీపీ పెరిగింది, గుండె కొట్టుకోవడంలో తేడా వచ్చింది.. జాగ్రత్త అని చెప్పనే చెప్పిండు డాక్టర్ . మనం జాగ్రత్త పడితేగా..
అసలు ఇప్పుడు హార్ట్ ఎటాక్‌తోనేనా నేను చచ్చి పొయింది.. ఏమో.. అట్ల ఏం అనిపించలేదే.. అసలు చనిపొయిన్నా.. లేక భ్రమనా.. కదిపిచూస్తే...
మెల్లగా కదిపి చూసిన.. నా ఒళ్లు కదులుత లేదు. గట్టిగ కదిపిన.. ఊ–హూ–.. లాభం లేదు.. అసలు నేను కదపలేకపోతున్ననేమో..
ఈ సంగతి తెలిస్తె ఊర్లో మా అమ్మా నాన్నా తట్టుకోగలుగుతరా? నా చెల్లెళ్లు గుండె బగలరూ.. నా తమ్ముడు.. వాడైతే అస్సలు తట్టుకోలేడు.. అసలు షాహీన్ ఎంత పరేశానైతది.. ఎట్ల తట్టుకుంటదో ఏమో.. అసలే ఈ మధ్య నన్ను జాగ్రత్తగా చూసుకుంటున్నది.. అనుమాన మొచ్చిందేమో..! రాత్రిళ్లు జల్ది ఇంటికొచ్చేటట్లు చూసు కుంటున్నది. ఎప్పటికప్పుడు నేనేమాత్రం అలసటగా ఉన్నా ఏమైందని మళ్ల మళ్ల అడుగుతున్నది. అయినా ఇట్లయి పాయె.. ఇప్పుడు చేసేదేముంది.. ఏం చేయలేం.. చచ్చి పొయిన. అంతే! మా అమ్మ ఫోన్ చేసినప్పుడల్లా చెప్తనే ఉన్నది, 'జాగ్రత్తరా .. జత్తన్ రే' అని. పట్టించుకోకపోతి..
షాహీన్‌కు మెలకువ ఒచ్చినట్లుంది. కళ్లు తెరిచింది. నాకై చూసింది. అదే నా ఒంటికై. ఆమెకేం తెలుసు, నేను చచ్చిపొయిన్నని.. అరెరె.. ఆమె పిలిస్తెనో.. కదిపితెనో నేను లేషి కూసుంటె ఎంత బాగుండు.. ఏమో అట్ల జరుగుతదేమో.. ఎందుకైన మంచిది. నా ఒంటిలోనే పండుకుంట.. అనుకుని నా ఒంటిలోకి పడుకుండి పొయ్ న. మెల్లగ తల తిప్పి చూసిన. షాహీన్ పక్కమీది నుంచి లేషింది.
షాహీన్! నన్ను పిలువు! నన్ను పిలువు! అనుకున్న మనసులో. ‘ాహీన్ సప్పుడు కాకుంట లేషి నన్ను పిల వకుంటనే, లేపకుంటనే బయటికి పోతున్నది. షాహీన్! నేను చచ్చిపొయ్ నట్టున్న షాహీన్.. నన్ను నిద్ర లేపు షాహీన్..
'షాహీన్! షాహీన్!' గట్టిగ పిలిషిన. ఊ–హుం–.. షాహీన్ అర్ర బయటికి ఎల్లిపొయింది.. నా నిస్సహాయతకు కోపం ఒచ్చింది.. గని ఏం జేసేది..
విసురుగ లేషి నేను గుడ బయటికి నడిషిన. చూస్తె షాహీన్ బాత్రూమ్‌లకు పొయింది. అర్రలకు చూసిన. కదలకుంట పండుకునె ఉన్నది నా ఒళ్లు. మరి ఇక్కడ నేను ఎట్ల నిలబడిఉన్న..? నిలబడి ఉన్న నన్ను నేను చూసుకున్న. ఏం కనిపిస్త లేదు. గుండెల్ల రాయి పడ్డ ఫీలింగ్.. నా ఒంటికి, నాకు ఇగ ఏం సంబందం లేదు. ఈ లోకంతోటి గుడ ఇగ ఏం సంబందం ఉండదు.. దీనికే ఇన్ని ఆరాటాలు..! ఆస్తులనీ.. సొమ్ములనీ.. సొంత ఇండ్లనీ.. సొంత మనుషులనీ.. ఛత్తెరికి!
బయట చప్పుళ్లు.. తెల్లగ తెల్లారింది. షాహీన్ బాత్రూంల నుంచి బయటికొచ్చింది. నా పక్క నుంచే మళ్ల మా బెడ్‌రూంలకు పొయింది. అంటే నేను తనకు గూడా కనిపిస్తలేనన్నమాటేగా. లోపలికి పోయి నన్ను లేపు తుందా..? లేపదు. నేను లేచేదాకా నన్నెప్పుడూ లేపదు. నాకు నిద్ర పట్టడం ఎంత గగనమో తనకు తెలుసు. వెళ్లి చున్నీ వేసుకుని మళ్ల బయటికొస్తున్నది. అయ్యో.. నన్ను లేపు షాహీన్! నేను లేస్తనేమో చూడు -అంటున్న నేను. అనుకుంట ఆమెకు ఎదురుపోయిన. నాలోంచే నన్ను దాటుకుని బయటికి వచ్చేసింది షాహీన్. ప్చ్. ఇక అంతే.. మళ్లీ తన వెంట బయటికి వచ్చిన.
మా పిల్లలు పండుకుని ఉన్న రెండు మంచాల దగ్గరికి వెళ్లి ఆ ఇద్దరినీ పేరు పెట్టి లేపుతున్నది షాహీన్. నస్రీన్ స్కూల్ కు పోవాలె. సులేమాన్ కాలేజ్ కు.. ఇప్పటికే ఎవరో ఒకలు లేచేది. ఇయాలెందుకో ఇద్దరూ లేవలేదు. రాత్రి టీవీ ఎక్కువసేపు చూసినట్లుంది. షాహీన్ పిలిచేసరికి ఇద్దరికీ మెలకువ వచ్చింది. నాకొచ్చిందేమో నని అర్ర లకు నా దిక్కు చూసిన. ఊ–హూ–..!
పిల్లలిద్దరూ లేషి కాలకృత్యాల్ల మునిగిపొయిన్రు. షాహీన్ వంటలో పడిపొయింది. నన్నెవరు పట్టించు కుంటలేరు. రోజూ నన్నెవరూ పట్టించుకోవద్దనే కోరేవాణ్ణి. ఇవాళే నన్నెవరన్నా లేపితే బాగుండనిపిస్తుంది. ఇప్పుడేం చెయ్యాలె. ఎవరో ఒకరు లేపిందాంక ఇంతేనా.. వెళ్లి నాలో పండుకున్న. కొద్దిసేపు ఎన్నో ఆలోచనలు కుదిపేసినయ్.. నేను చనిపొయిన్నంటే ఇయాల ఈ ఇల్లు గోలగోల ఐపోతది. దోస్తులు, ఉద్యమ మిత్రులెంతోమంది వస్తరు. కాని ఇక్కడ నా శవాన్ని మాత్రం ఉంచనీయరు. కిరాయి యిల్లు కదా.. సొంత యింటికి తీస్కపొమ్మంటరు. అంటే నా శవాన్ని వంద కిలోమీటర్ల అవతల మా ఊరికి తీసు కెళ్లాల్సిందే.. కాని ఇప్పుడు నా దోస్తులంతా హైదరాబాద్‌లోనే ఉన్నరు గదా.. ఎట్ల?
ఇంట్ల ఒక్క పైస లేదు. ఎన్నడు గుడ రేపెట్ల అని సోంచాయించెటోన్ని కాదాయె. మరి ఇయాల పుటుక్కు మన్న. ఈ ఇల్లు ఎట్ల నడుస్తది? పిల్లలు, షాహీన్ ఎట్ల బతుకుతరు? పిల్లలు చదువులు ఎట్ల పూర్తి చేస్తరు? షాహీన్ అంటనె ఉండేది, ఎప్పుడూ సమాజం గురించే కాదు, జర మా భవిష్యత్తు గురించి గుడ ఆలోచించమని. ఆమె భయపడినంతా అయ్యింది..
సిగరెట్ తాగాలనిపించింది. తాక్కుంట ఆలోచిద్దాం.. లేషి తలాపున ఉన్న సిగరెట్ డబ్బీ అందుకున్న. ఊ–హూ. డబ్బీ చేతిలకు రాలే. అయ్యో.. యూసుఫూ! సిగరెట్ గూడా తాగలేవా? ఇప్పుడెట్లా చచ్చేదిరా.. చచ్చేపొయిన గదా..
'అబ్బాజాన్!' అంటూ సులేమాన్ పిలుపు వినిపించింది. వోహ్, వీడికేదో అవసరమొచ్చిన.. జల్ది నాలో పండుకోవాలె. లేస్తనేమో.. -జల్దిజల్ది నాలోకి పడుకుండి పొయ్ న.. కండ్లు మూసుకున్న.
'అబ్బాజాన్! అబ్బాజాన్!' పిలుసుకుంట అర్రలోకి వచ్చిండు సులేమాన్. నేను లేవడం లేదు. అలాగే పండుకుని ఉన్న. నాకు కన్ఫ్యూజన్‌గా ఉంది. నేనే లేవాల్నా? నా బాడీ లేస్తుందా? నేను లేస్తే నాతో పాటు బాడీ లేస్తుందేమో.. ఏమో.. లేవకపోతే..? వాడు కదిపిందాకా చూద్దాం...
వాడొచ్చి మెల్లగా కదుపుతున్నడు.. ఎక్కడ లేని సంతోషమేసింది. కళ్లు తెరిచి 'క్యావ్‌రే!' అనుకుంట లేషి కూసున్న. హమ్మయ్య లేషిన్నా! ఎక్కడ్లేని సస్పెన్‌స్.. ఆత్రంగా వెనక్కి చూస్తే.. నా ఒళ్లు మొద్దు లెక్క కదులుతున్నది కాని లేషి కూసోలేదు. అయ్యో! అంతా అయ్ పోయింది..!
సులేమాన్ ఆశ్చర్యంగా అనుమానంగా ఇంకా గట్టిగా కదుపుతూనే ఉన్నడు.
'అబ్బాజాన్! అబ్బాజాన్!' అని మరింత గట్టిగ ఆదుర్దాగ పిలుస్తనే ఉన్నడు. నా ఒళ్లు ఎంతకూ లేవడం లేదు. నాకిక కన్‌ఫామ్ అయిపొయింది. నేను నిజంగనె చచ్చిపొయ్ న! మనసులోంచి ఎక్కడలేని బాధ లుంగలు చుట్టుకుంట వస్తున్న ఫీలింగ్..
సులేమాన్ గట్టిగ నన్ను కదుపుకుంట- 'అమ్మీ!' అం టూ వాళ్లమ్మను గట్టిగా పిలిషిండు. వాడికి సమజైపొయింది.
'క్యావ్‌రే.. క్యా హువారే!' అనుకుంట ఆత్రంగ ఉరికొచ్చింది షాహీన్.. ఆ వెనకే నా బిడ్డ నస్రీన్...
***
నా పిల్లలూ నా భార్య ఒకర్ని పట్టుకొని ఒకరు బోరుబోరున ఏడుస్తుంటే నేను తట్టుకోలేకపోతున్న. నాగ్గూడా పెద్దగ ఏడుపొస్తున్నది. ఏం చేయాల్నో సమజైత లేదు.. మజ్జెమజ్జెల ఆ ముగ్గుర్నీ ఓదార్చాలని కోషిష్ చేస్తున్న. కాని ఏం లాభం.. వాళ్లకు నేను కనిపిస్తలేను. చచ్చిపడి ఉన్న నా ఒళ్లు మాత్రమే కనిపిస్తున్నది..ఇల్లంతా పక్క పోర్షన్లవాళ్లతోని నిండిపొయింది..
'అయ్యో! గుండె నొప్పితోటి సచ్చిపొయిండంట..'
'రాత్రి బాగనె మాట్లాడిండు.. ఇంతల్నె ఎట్ల సచ్చి పోయిండల్లా?'
'చావు చెప్పి వస్తాది..'
'మంచోడుండె..'
'మంచి మంచోళ్లనే దేవుడు తొందర్గ తీస్కపోతడు..'
'ఆదివారం వచ్చిందంటె యాడ్నో ఒక్కాడ మీటింగని పొయ్యేదమ్మా.. ఇంటి పట్టున ఉండేటోడు కాడు'
'అయ్యో!'
'పాపం..'
మాటలన్నీ వినిపిస్తున్నయ్ నాకు.. నేను నా పిల్లల్నీ నా భార్యనే ఓదార్చాలని చూస్తు వాళ్ల పక్కన కూసుండి పొయ్న. వాళ్లు ఒకర్ని పట్టుకొని ఒకరు ఏడుస్తనె ఉన్నరు. పక్క పోర్షన్ ఆడవాళ్లు వచ్చి గోడుగోడున ఏడుస్తున్న షాహీన్‌ను ఊకుండబెట్టాలని చూస్తున్నరు.
'...ఈ మధ్య ఎందుకో అంత హుషార్గ ఉంటలేడని అనుమానంగనె ఉండెనమ్మా.. ఇంతల ఇట్లైతదనుకో లేదమ్మా.. ఆయన లేకుంట మేం బతకలేమమ్మా.. ఇగ నేను, నా పిల్లలు అనాధలమైపోతిమి గదనమ్మా.. అల్లా..! ఇట్లెందుకు చేసినవ్.. మమ్మల్ని ఇంత అన్యాలం చేస్తవా..? షాహీన్ ఏడుస్తనే ఉంది.. నా కొడుకు ఏడుస్తనే ఉండు.. నా బిడ్డ ఏడుస్తనే ఉంది...***
ఫోన్లమీద అందరికి తెలిžపొయింది.. హైదరాబాద్‌ల ఉన్న దోస్తులు, ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఉద్యమ మిత్రులు అందరు వస్తున్నరు.
భావజాల పరంగా దూరమైన ఉద్యమ మిత్రులు సైతం ఎంతోమంది వచ్చిన్రు. వాళ్లందర్నీ పలకరించాలనిపించిది.. ఆశ్చర్యంగ నా దోస్తు సైదులు గూడ వచ్చిండు. వాడు రాడేమో అనుకున్న. వాడికి తెలుస్తుందో లేదో అనుకున్న. వాడు ఏడాదికిందే మాతోని కట్టయిపొయిండు. వాడు వచ్చీ రావడంతోనే పొగిలి పొగిలి ఏడ్చిండు. వాడు ఏడుస్తుంటే నాకు ఎక్కడ్లేని ఏడుపొచ్చింది. వాణ్ణి అలాయ్ బలాయ్ తీసుకోవాలనిపించింది. వాడు షానాసేపు ఏడ్చి సంభాలించుకొని నా పిల్లల్ని ఓదార్చిండు. వాళ్లు ఏడుస్తుంటే 'నేనున్న కదరా..' అని ఎన్ని ఓదార్పు మాటలో చెప్పుకుంట ఓదార్చిండు... ఐటెంక బైటికొచ్చి ఇగ వాడె అన్నీ తానై నా శవాన్ని నల్గొండకు తీస్కపోతానికి అన్ని ఏర్పాట్లు చేసిండు. బండి మాట్లాడి వెంట ఉండి అందరూ నల్గొండకు బయల్దేరిన్రు.. నా శవంతోపాటు, నేను కూడా..
ఇంకా షానామంది దోస్తులు, ఉద్యమ మిత్రులు వేరే బండి మాట్లాడుకొని వచ్చే కోషిష్‌ల ఉన్నరు..
నా శవం ఉన్న వ్యాన్ పోతున్నది. నా శవాన్ని చద్దర్ కప్పి పడుకోబెట్టిన్రు. అటుపక్క షాహీన్, నా పిల్లలు, ఇటుపక్క సైదులు, నా కొడుకు దోస్తు ఒకడు, నా ఆఫీసు మిత్రుడొకరు, ఉద్యమ మిత్రుడొకరు కూసున్నరు.
సైదులు మొఖానికి దస్తీ అడ్డం పెట్టుకొని ఏడుస్తున్నడు.
వాడు నేను షానా జిగిరి దోస్తులం. చిన్నప్పట్నుంచి ఒకే కంచంల తిని ఒకే మంచంల పండుకున్నోల్లం. వాడు ఏడాది కిందే మాతోని కట్టయిండు. రెండు మూడు వారాలకోసారైన కలిసేటోల్లం. కలిసినప్పుడు దావత్ చేసుకొనేటోల్లం. వాడు ఆ మధ్య అప్పుల పడ్డనని చెప్పి యాభై వేలు పె¦ౖనానుžల తీసుకుండు. జర సంతకం పెట్టుర బై అంటే పెట్టిన. అవి కట్టలేక పొయిండు. దాంతోని అవి నా మెడకు సుట్టుకున్నై. నేనసలే అంతంతమాత్రం. మా షాహీన్ ఉండబట్టలేక గొడవ పెట్టుకుంది. దాంతోని మా ఇద్దరికి మధ్య చెడింది. మాట్లాడుకోవడం కూడ బందైంది. దాంతో కలవక ఏడాదైంది. అదికాక హైదరాబాద్‌ల పెరిగిన ట్రాఫిక్‌తోని వాడా మూలకు, నేనీ మూలకు ఉండడంల గూడ కలవడం అంటే ఆసక్తి పొయింది. మొత్తానికి వాడు నేను సచ్చిపొయినంక కలవాల్సివచ్చింది!
ఇట్ల సైదులు గురించే కాక నా దోస్తులందరి గురించి ఆలోచించుకుంటున్న. నా చిన్ననాటి దోస్తుల కాణ్నుంచి క్లాస్‌మేట్లు, చేసిన ఆఫీసులల్ల దోస్తులు అందరు యాది కొస్తున్నరు. వాళ్లందరికి ఎట్ల తెలుస్తది?
మావోడి సెల్లు మోగుతనే ఉంది. ఆని సెల్లు, నా సెల్లు ఆని దోస్తు కాడ ఉన్నై. మోగినోల్లకల్లా నేను సచ్చిపోయిన్నని చెప్పలేక చెప్పలేక వాడు చెప్తనె ఉండు..
నల్గొండ చేరుకున్నం. మా గల్లీ అంతా ఎదురు చూస్తున్నది. వ్యాన్ ఆగంగనె పెడబొబ్బలు పెట్టిన్రు అందరూ.. నేను మా అమ్మీ కోసం చూస్తున్న. మా అమ్మనెవరో పట్టుకొస్తున్నరు. పడిపడి పోతున్నది అమ్మ. 'వో బేటో..! వో బేటో..!' అని సోయి తప్పిపోయినట్లయి తున్నది. నేను ఉరికిపోయి మా అమ్మను అల్లుకుపోయిన.
మా సులేమాన్ దిగి మా అమ్మను అల్లుకొని బోరున ఏడుస్తున్నడు. నా బిడ్డ నస్రీన్‌ని అల్లుకొని మా చెల్లెల్లు ఏడుస్తున్నరు. బీభత్సంగ ఉంది గల్లీ అంతా.
నా శవాన్ని దింపుతున్నరు. దింపి ఆ మందిని చీల్చు కుంట తెచ్చి మా యింటి ముందల మంచంల పండుకోబె ట్టిన్రు. ఏడుపుల హోరు ఆకాశాన్నంటుతున్నది. నా మొఖం పై నుంచి దుప్పటి తీసిన్రెవరో.. మా చెల్లెళ్లు, మా అమ్మ నా శవం మీద వాలిపోయిన్రు.. మా తమ్ముడు గుండెలు బాదుకుంట ఏడుస్తున్నడు. మా నాయ్న ఏడుస్కుంట వచ్చి నా మొఖాన్ని చేతుల్లకు తీస్కొని 'మేం పోకముందే ఎందుకురా మమ్మల్ని ఇంతబాధ పెట్టినవ్ బేటా..!' అంటుంటే ఏడుపుల హోరు మరింత ఎక్కువయ్యింది..
'మెరె బేటో.. మెరె బేటా..! నువ్వు లెవ్వంటె మేం ఎట్ల తట్టుకుంట మనుకున్నవ్‌రా.. మేమింక ఎట్ల బతకాల్రా.. మమ్మల్నింత అన్యాలం చేస్తవనుకోలే బేటే..!' అని తల కొట్టుకుంటున్నది మా అమ్మ.. మా చెల్లెల్లు భూమ్మీద పొర్లాడుకుంట ఏడుస్తున్నరు.. గల్లీ గల్లీ అంతా ఏడుపుల వాగై ప్రవహిస్తున్నది..
నేను పక్కన ఉండిపొయి- చూస్తున్న. వీళ్లందరికి నేను చేసిందేమీ లేదు. ఒకిన్ని పనికొచ్చే మాటలు చెప్పడం తప్ప. ఇంక కొందరిని వాళ్లకు అర్థంకాని, అర్థమైనా చెయ్యలేని పనులు, మాటలు చెప్పి విసిగించిన్నేమో! మొత్తానికి ఇంతమందికి ఇంతగనం ప్రేమ ఉందా తనంటే! అట్ల అని కొద్దిగ జాగ్రత్తగ ఉండి తనను తను రక్షించుకోవలసుండెనా? ఏమో.. అది సాధ్యమయ్యే స్వభావమా తనది..
నువ్వు నీ సొంత మనుషుల కన్నా పరాయి మనుషుల గురించే ఎక్కువ ఆలోచిస్తవనేది షాహీన్! ఎవరు పరాయి? ఎవరు సొంతం? ఇవాళ్టికి అందరితో తెగిపోయింది. రేపటికి మన్నులో మన్నైపోత!
మధ్యాహ్నమైపొయింది. మగ్‌రిబ˜ నమాజ˜ల కలపాలె అనుకుంటున్నరు. ఖబర్ తవ్వడానికి చెప్తున్నరు. స్నానం చేయించడానికి ఏర్పాట్లు చేస్తున్నరు. నీళ్లు వేడి చేస్తున్నరు, యాప ఆకులేసి..
అన్నింట్ల ముందుండి సైదులు పనులు చూసుకుం టుండు. వొచ్చేవోళ్లు వొస్తనే ఉన్రు.. మొత్తం ఆ వాడకట్టంతా మా చుట్టాలోల్లతోని నిండిపొయింది. మా ఇంటోళ్లంతా ఏడ్చి ఏడ్షి సొమ్మసిల్లిపొయిన్రు.
హైదరాబాద్ నుంచి మినీ బస్‌లో నా దోస్తులు, ఉద్యమ మిత్రులు ఒచ్చిన్రు. వాళ్లంత పరేషాన్ ఉన్నరు..
'చలో చలో లేటయితుంద'నుకుంట స్నానానికి లేపి న్రు. ఇంటి ఆవరణల ఒక చెక్క బల్ల ఏసి నన్ను అక్కడికి చేర్చిన్రు. చుట్టు దుప్పట్లు పట్టుకుని కొందరు నిలబడ్డరు. ఇద్దరు అపరిచితుల్లోంచి ఓ గడ్డపాయన నా పైన తెల్లగుడ్డ ఒకటి కప్పి లోపల చట్టచట్ట నా బట్టలు ఒలిషిండు. మా తమ్మున్ని, నా కొడుకును పిలిషిన్రు. మా తమ్ముణ్ని తల వైపుండమని, సులేమాన్‌ను కాళ్లవైపుండమని చెప్పి, సబ్బు పెట్టి నా ఒళ్లంత బాగా రుద్దమని చెప్తున్నరు. బట్ట లోపలికి బాగ నీళ్లు పోసుకుంట ఒంటిని రెండుసార్లు సబ్బు పెట్టి రుద్దిరుద్ది స్నానం చేయించిన్రు. బహుశా చిన్నప్పుడు మా అమ్మ అట్లా చేయించి ఉంటది. ఇదే ఇగ ఆఖరి స్నానం..!
స్నానం అయినంక బాగ తుడిచి మట్టసంగ తెల్లటి కఫన్‌లో చుట్టి తీసుకొచ్చి ఇంటి ముంగల బల్లెపీట మీద పడుకోబెట్టిన్రు నన్ను. మొఖం వరకు కనిపించేటట్టు విప్పిన్రు. అందరు జల్ది జల్ది చూసి పక్కకు జరగాల్నని చెప్పిన్రు.
ఆఖరికి మా అమ్మ.. మా చెల్లెళ్లు.. నా బిడ్డ.. అందరూ గోలగోలగ ఏడ్సుకుంట వచ్చి నన్ను చూస్తున్నరు.. ఆఖరి సారి.. చూసి పక్కకు జరిగి నిలబడుతున్నరు. నా చుట్టూ పెద్దగుంపై నిలబడ్డరు అందరూ. చివరికి మా అమ్మను పిలిషిన్రు. దూద్ బఖష్‌నా చేయడానికి. సోలిపోయి ఉన్న మా అమ్మను ఆడవాళ్లు పట్టుకొచ్చి బల్లెపీట పక్కన నా శవం దిక్కు మలిపి ఏసి ఉన్న కురీžల కూసొబెట్టిన్రు. 'దూద్ బక్షో!' అన్నరెవరో.. 'దూద్ బఖష్‌తీ హూ–..!' అని ఎంతో కష్టంగ పైకి అనగలిగింది మా అమ్మ.
ఛి.. బతుకు పాడుగాను.. ఏం చెయ్యగలిగినాన్రా జన్మనిచ్చిన తల్లికి.. ఏం పట్టించుకోకపోతి. ఛత్ అనుకున్న.
చిట్టచివరికి షాహీన్‌ను పిలిషిన్రు. ఆడోళ్లు పట్టు కొచ్చిన్రు. నా మీద పడి ఏడుస్తున్నది షాహీన్.. వద్దని వారిస్తున్నరు పెద్దవాళ్లు. 'మెహెర్ బక్షో! మెహెర్ బక్షో!' అని అంటున్నరెవరో..
మెహెర్ ఎంతో ఎవరో చెప్పిన్రు. దో తొల్లే సరాయ్.. ఏక్ తొల్ల సుర్ఖ్.. 25 హజార్ జోడె కీ రఖమ్! షాహీన్ వాటిని ఉచ్ఛరించి- 'మెహెర్ బఖష్‌తిహూ–..!' అన్నది పూడుకుపోయి బైటికి రాని గొంతుతోని..
ఛ.. ఏం బతుకు బతికినవ్‌రా.. కనీసం దో తొల్లే సరాయ్.. ఏక్ తొల్ల సుర్ఖ్.. 25 హజార్ జోడె కీ రఖమ్ ఐనా నా షాహీన్‌కు తీర్చుకోలేకపొయ్ నవ్.. అనిపించింది నాకు.
'ఇగ చలో! చలో!' అనుకుంట తొందరపెట్టిన్రు పెద్దోళ్లు.. దాంతో నా మొఖాన్ని కఫన్‌తో కప్పేసి కట్టేసిన్రు. కట్టేస్తుంటే మావోళ్ల ఏడుపులు మరింత ఎక్కువైనయ్.. శవాన్ని లేపుతుంటె మరింత హోరెత్తింది. నా బిడ్డ బోరుమంటు నా నిర్జీవ దేహాన్ని అల్లుకుపొయింది. ఆమెను ఓదార్చుకుంట పక్కకు జరిపి, నా శవాన్ని బయటికి తీసుకొచ్చి బయట అప్పటికె తెచ్చి పెట్టి ఉన్న డోలా లో పడుకోబెట్టిన్రు. డోలా పైన ఆకుపచ్చని గుడ్డ కప్పేసి చుట్టూ నాలుగు మూలలు కట్టేసి ఇక డోలా లేపిన్రు. లేపుతుంటె ఒక్కసారిగ ఏడుపులు పెడబొబ్బలైనయ్.. నా కొడుకు, నా తమ్ముడు డోలా ఎత్తకుంట అడ్డం పడుతున్నరు ఏడుస్కుంట. వాళ్లను వారిస్తూ డోలా ఎత్తిన్రు.
'లాయిలాహ ఇల్లల్లాహ్.. మహమ్మదుర్ రసూలిల్లాహ్' అనుకుంట, భుజాలు మార్చుకుంట జనాజా ఖబ్రస్తాన్ దిక్కు సాగిపోతున్నది. నేను వెంట పడి పోతున్న! పక్కన పోతున్నవాళ్లు కూడా వాహనాలు ఆపి వచ్చి మరీ జనాజాకు భుజం ఇచ్చి మళ్ల వెళ్లి వాహనాలు తీసుకొని పోతున్నరు.
మజీదుకు చేరింది జనాజా..
***
మజీదుల దువా (జనాజా నమాజ్) ఐనంక మళ్ల పయనం..
ఖబ్రస్తాన్‌లకు ప్రవేశించింది జనాజా.. ఖబర్ తవ్వి ఉన్న చోటికి పోగానే జనాజా దింపి పైన కప్పిన గుడ్డ తీసిన్రు. ఖబర్ లకు ఒకరు దిగి అత్తర్లు, గులాబీ తైలం తదితర సుగంధ ద్రవ్యాలు చల్లిన్రు. చివరిసారి మొఖం చూపెట్టిన్రు. నేను కూడా చివరిసారి నా మొఖం చూసుకున్న. మళ్ల కనిపిస్తదో లేదో..! పరుగు పరుగున ఖబ్రస్తాన్ ఒచ్చిన నా చిన్ననాటి దోస్తు యాదయ్య ఆఖరిసారి మొఖం సూడగలిగిండు. వీడెంత దూరం నుంచి వచ్చిండు నా కోసం అనిపించింది. ఎక్కణ్నో మూడొందల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిండాడు. మొత్తంగ షానా దినాలసంది కనిపించని చుట్టాలు, దోస్తులంత నేను సచ్చిపొయిన్ననంగనె ఆఖరి సూపుకు ఎక్కడెక్కడి నుంచో రావడం సూస్తె వాళ్లంత నాకన్నా ఎంతో ఎదిగి ఉన్నరనిపించింది..!
ఆఖరిసారి కళ్లొత్తుకున్నరు నా తమ్ముడు, నా కొడుకు. నా కక్కయ్యలు, మామయ్యలు, చిన్నాయనలు, చెల్లెళ్ల పిల్లలు అందరూ పట్టి నా శవాన్ని ఖబరŸ లకు దింపిన్రు. లోపల ఉన్నాయనతో పాటు ఇంకొకాయన దిగి శవాన్ని ఎడమ దిక్కుకు జరిపి సోల్పుగ నాపరాళ్లు పెట్టిన్రు. పచ్చి మట్టితోని పూసిన్రు. పైకెక్కిన్రు. ఏం జెయ్యాల్నో నాకు సమజైతలేదు! నా ఒంటితో ఉండాల్నా? బైటే ఉండిపోవాల్నా? ఏం జెయ్యాలే.. ఇక అందరూ మట్టి నా సమాధిలోకి వెయ్యబట్టిన్రు.
***
ఒక్కసారిగ మట్టి వచ్చి నా మొఖం మీద పడుతున్నట్ల నిపించింది.. ధన్‌న లేషి కూసున్న! కొద్దిసేపు ఏం సమజ్ కాలె. చుట్టు చూసిన. చిత్రం! పక్కన షాహీన్ పండుకొనున్నది. హైదరాబాద్‌ల.. మా కిరాయింట్ల.. నా మంచంపై లేషి కూసొనున్న! ఓహ్.. అయితె నేను చచ్చిపోలేదా!? నన్ను నేను తడిమి చూసుకున్న. తాకుతున్న. హమ్మయ్య! బతికిపొయ్న. నిజంగనె చచ్చిపొయిన్ననుకున్నగదా! గుండె ఊటగ కొట్టుకుంటున్నది. సప్పుడు బైటికి వినిపిస్తున్నది..
ఒఫ్ఫో.. నిజంగనె ఈ టైముల నేను చచ్చిపోతె.. నా షాహీన్‌కు- నా బిడ్డలకు- నా తల్లిదండ్రులకు- నా తోబు ట్టువులకు- ఎంత కష్టం కలిగించినోన్నయిత.. ఇగ జల్ది జల్ది నాకు చేతనైనంతగ వాళ్ల కష్టాలు తీర్చాలె. సమాజానికి చెయ్యగలిగింది ఇంక షానా మిగిలే ఉంది.. ఈ లోపల ఆరోగ్యం గురించి జర జాగ్రత్త పడాలె.. ముఖ్యంగ నేనంటె అంత పానం ఇస్తున్న వాళ్లందరినీ ఒక్కసారి ఇవాళ ఫోన్‌లనన్నా పలకరించాలె.. ఈ పరుగుల యుగం ఎంత పనిచేస్తున్నదీ.. మనుషుల్ని ఎంత ఎడం చేస్తున్నదీ! ఎన్నాళ్లయింది అందరికీ ఫోన్లు చేసి.. మొదలు సైదులుకి చేయాలె.. వాడితో మాట్లాడక సంవత్సరం దాటిపొయింది.. ఛ.. ఒక్క యాభై వేలు ఎంత పనిచేసినయ్..
ఫోన్ ఆన్ చేసి మొదలు సైదులుకు కలిపిన.
*