Monday 20 June, 2011

కబూతర్!



‘ఈ షాదీ చేసుడు తనతోని అయితదా?!’
తనలో తనే అప్పట్కె వందసార్లు అనుకుంది ఫాతిమ.

నల్లని బుర్ఖాలో ఎర్రని ఎండకు ఎదురు నడుస్తున్నది ఫాతిమ. పిల్లబాటన పడి దబదబ
నడుస్తున్నది. పావుగంట ఐంది ఆమె నడవబట్టి. ఎండకు బుర్ఖా లోపట ఒళ్లంత చెమట
పడుతున్నది. తన తమ్ముడు జమీర్ ఇంటికి పోతున్నదామె. రోడ్డు ఎంట పోవాలంటె
రెండు ఆటోలు మారాలె. సక్కగ రెండు కిలోమీటర్లంత దూరం ఒక ఆటోల, మల్ల
ఎడమ దిక్కు ఒక కిలోమీటరు ఇంకో ఆటోల ఎల్లాలె. ఇటు ఐదు, అటు ఐదు పది
రూపాయలైతయ్. అడ్డంగ నడిచిపోతె రెండు కిలోమీటర్లంత ఉంటది. అంటె అర్ధగంట
నడక అనుకున్న ఫాతిమ బయల్దేరింది.

ఎండ సూస్తె ఎన్నడు లేంది ఇయాల సుర్రుమంటున్నది. చీర, రైక కొంచెం మందంగ
ఉన్నై. పైంగ బుర్ఖా ఉంటంతోని లోపల చెమటకు బట్టలు తడుస్తున్నై.

ఇంతకు జమీర్ ఇంట్ల ఉంటడో ఉండడో... ఆదివారం గదా... ఇంట్ల దొరుకుతడులె
అని పోతున్నది. జమీర్ మీదనె ఆశ. వాడె తనను అర్దం చేసుకొని సాయపడేటోడు.
వాడు కొంచెం ధైర్యమిస్తె మిగతా వాళ్లందర్ని ఎంతో కొంత అడగొచ్చు.
పెద్ద తమ్ముడు ఏమంటడొ... ఈ ఒక్క కార్యం చెయ్యగలిగితే కొన్నాళ్లు
కంటి నిండ నిద్రపోవచ్చు...
రాక రాక వచ్చిన రిష్తా (సంబంధం)... అది గూడ తన హాలతు (పరిస్థితి) తెలిసిన
అమీనా ఖాల పిలగానోల్లతోని మాట్లాడి ఒప్పిచ్చింది. ఇగ ఇంతకన్న మంచి రిష్తా,
ఇంత తక్వ లేన్‌దేన్ (కట్నం) అడిగేటోల్లు దొరకరని మల్లమల్ల చెప్పింది. ఏమన్న గాని,
ఎంతన్న కష్టం గాని ఈ రిష్తా వొదులుకోవద్దు.

నడక పెంచింది ఫాతిమ. సగం దూరమొచ్చేసింది. అడ్డంగ కొద్ది దూరం మట్టి రోడ్డు.
వాహనాలు పొయినప్పుడల్ల దుమ్ము లేస్తున్నది.

గౌసియాకి అప్పుడె 20 ఏళ్లు. నాలుగేళ్ల కింద వాళ్ల అబ్బా సచ్చిపోక ముందు అప్పుడె
దాని షాదీ గురించి ఆలోచించబట్టిండు. షాదీ సూడకుంటనె ఎల్లిపాయె. మాయదారి
గుండెనొప్పి, అనుకోకుంట వచ్చె.

‘ఏం నొప్పో, దవాఖానకు పోదామయ్య’ అంటె, ‘ఎహె, ఏంగాదు లేవె, మల్ల దవాఖానకు
పోతే ఆడు అదో ఇదో అని బయపెట్టిచ్చి పైసలన్నీ ఖర్చు పెట్టిస్తడు’ అనుకుంట అస్సలు
ఇన్లె. సూస్తుండంగనె నొప్పి ఊటగై దవాఖానకు తీస్కెళ్లెలోపట్నె పానం పాయె.
ఇగ అప్పట్నుంచె తనకు ఇన్ని కష్టాలు... నాలుగేండ్ల సంది... కంటి నిండ కునుకు లేదు...
కడుపు నిండ తిండి లేదు... మనసుకు శాంతి లేదు... ముగ్గురు ఆడపిల్లలతోని
ఇల్లు నెట్టుకు రావడంతోనె తన తలపానం తోక కొస్తున్నది.

అట్లాంటిది ఒక్కో పిల్ల షాదీ ఎట్ల చేసుడు? ఎంత కష్టం? పెద్దదాని పెండ్లి చేయాలని
రెండేండ్ల సంది కోషిష్ చేస్తనె ఉంది. ఉంటా ఉంటె సమజైంది, ఈ రోజుల్ల పెండ్లి చేసుడు
ఎంత కష్టమొ... ఒక్కొక్కల్లు లక్షలు అడుగుతున్నరాయె. రిక్షా తొక్కేటోడు గుడ
70, 80 వేలు అడుగుతుండె. నిద్ర పట్టదు, ముగ్గురు బిడ్డల షాదీలు చేసుడు
తనవల్ల అయితదా అన్న పరేశాని నిలువనియ్యదు. ఒక్కోసారి అనిపిస్తది,
పిల్లలకు ఏదన్న విషమిచ్చి తను గుడ తాగి పండుకుంటె సరిపోద్దని.

చెమట కండ్ల మీదికి కారుతుండేసరికి దారెంట ఎవరు లేంది సూషి మొహం మీది
నఖాబ్ గుడ్డ ఇప్పి మొఖం తుడుచుకున్నది ఫాతిమ. మల్ల నఖాబ్ కట్టుకున్నది.
మట్టి రోడ్డు మీది నుంచి డాంబరు రోడ్డు మీదికి వచ్చింది. ఇంకొద్ది సేపు నడిస్తే సరిపోద్ది.
పిల్లలు సదువుకున్నా ఎవరొ ఒకలు, ముద్దుగున్నరు గదా అని చేసుకొని పోయేటోల్లు.
సదువు సంద్య లేదాయె. పెద్దదానికి అక్షరం ముక్క రాదు. రెండోది 8ల ఉండంగ, చిన్నది
6ల ఉండంగ ఈన సచ్చిపాయె. ఇగ ఆ ఏడాది నుంచే బడి బంద్ చెయ్యాల్సొచ్చె.
బైటికెల్లి ఏం చేస్తానికి ఉండదాయె. ఇంట్లనె - పెద్దది మిషిన్ కుట్టుకుంట, చిన్నోలిద్దరు
చేతికుట్టు కుట్టుకుంట ఇల్లు నడుపుతున్నరు. ఎంత వచ్చినా బట్టకు, నొప్పులు రోగాలకే
సరిపోవాయె... ఇంతదాక ఐదు వందలు, వెయ్యి రూపాల నోటు ముట్టుకున్నది గుడ లేదు...
ఇగ షాదీలు ఎట్ల జేసుడు...

జమీర్ ఇంటి ముంగల నిలబడి బెల్లు మోగించింది. రెహానా తలుపు తీసింది.
‘‘సలామలైకుమ్ ఆపా! ఆవో ఆపా’’ అనుకుంట దారిచ్చింది రెహానా. లోపలికొచ్చి
నఖాబ్ గుడ్డ ఇప్పి మొఖం తుడుచుకుంట ‘‘జమీర్ లేడా?’’ అనడిగింది ఆత్రంగ ఫాతిమ.
‘‘ఉన్నడు ఆపా! పిలుస్త. మీరు కూర్చోండి’’ అనుకుంట బెడ్‌రూంలకు పోయింది రెహానా.
రెండు నిమిషాల్ల బైటికొచ్చిండు జమీర్.
‘‘సలామలైకుమ్ ఆపా’’ అన్నాడు.
‘‘వాలెకుమ్ సలాం’’ అనుకుంట జమీర్‌ను చూసి కొద్దిగ నిమ్మలపడి కుర్సీల
కూసున్నది ఫాతిమ.
‘‘పిల్లలు మంచిగున్నరా ఆపా?’’ అడిగిండు జమీర్.
‘‘ఆఁ... మంచిగనె ఉన్నరు...’’
రెహానా మంచినీల్లు తెచ్చిచ్చింది.
‘‘బుర్ఖా ఇప్పి కాల్లు చేతులు కడుక్కో ఆపా, అన్నం తిందువు’’ అన్నడు జమీర్.
‘‘లేదు జమీర్ ఎల్త, కలీమ్ కాడిగ్గూడ పోవాలె. షాన తిరుగేదుంది’’ ఫాతిమ.
‘‘ఏందాపా! ఏమన్న అవసరం పడిందా? పరేషాన్ కనబడుతున్నవ్?!’’ జమీర్.

‘‘అవును జమీర్! గౌసియాకి అమీనా ఖాల ఒక రిష్తా తెచ్చింది. పిలగాడు సెల్‌ఫోన్ల
షాపుల పనిచేస్తుండంట. హుషారు పిలగాడట. వాళ్లు గుడ లేనోల్లేనంట. కట్నంల
ఒక యాభై వేలన్న వస్తె 20 వేలు షాది ఖర్చులకు పొయినా, 30 వేలతోని ఒక
చిన్న షాపు పెట్టుకుంటనంటున్నడట. ఫస్టు 70, 80 వేలన్నరట! మన గౌసియ
గురించి, మన హాలతు గురించి చెప్పి అమీన ఖాల 50 వేలకు ఒప్పిచ్చిందట.
50 వేలు ఇవ్వగలిగితె మన గౌసియా షాది ఐతది జమీర్! ఇగ ఈ చాన్సు గుడ పోతె
ఆ పిల్ల షాది చేసుడు ముష్కిల్ ఐతది. ఎంత కష్టపడైన చెయ్యాలె జమీర్.
మన చుట్టాలందర్ని కాల్లా ఏల్లా పడైన తలా ఇంత సాయం చెయ్యమని అడగుత.
ఆ పిల్ల షాది చెయ్యంది నాకు నిద్ర పట్టదురా. ఎట్లన్న నువ్వు గుడ ఒక చెయ్యెయ్యాలె.
నీ మీదనె ఎక్కువ ఆశ పెట్టుకున్న... నువ్వు కాదనొద్దు...’’ ఉద్వేగంగా చెప్పుకొచ్చింది
ఫాతిమ. ఏ క్షణమైనా ఆమె ఏడ్చేసేటట్టున్నది.

అంతల రెహానా చాయ్ తెచ్చి ఇద్దరికి చెరొక కప్పు అందిచ్చింది.

చాయ్ తీస్కొని సోంచాయించుకుంట తాగబట్టిండు జమీర్. కాసేపట్ల తన పరిస్థితుల్ని
ఒకసారి మననం చేసుకున్నప్పటికీ ఏమాత్రం నెగెటివ్ ఆన్సర్ ఇచ్చినా అక్క
పరేషానైతదనిపించింది. ఎంత కష్టమైన తన వంతుగ వీలైనంత ఎక్కువె మదత్ (సాయం)
చెయ్యాలనుకొని -

‘‘ఆపా! నువ్వేం పరేషాన్ కాకు. మన వంతు కోషిష్ మనం చేయాలె. ఆ పైన
అల్లా ఉన్నడు. నేను ఈ మధ్య కొద్దిగ ఇబ్బందుల్ల ఉన్న. ఐన నీకు అవసర
మొచ్చినప్పుడు నేను ఎనక్కు పోతనా! నా వంతుగ, నా వల్ల ఐతదనిపించింది
ఏం చెయ్యమన్న చేస్తానాపా! క్యా కర్న బోలో ఆపా..!’’ అన్నడు జమీర్ స్థిరంగ.

ఫాతిమ మొఖం కొంచెం స్థిమితపడ్డది. చాయ్ గ్లాస్ కింద పెట్టి - ‘‘ఇబ్బందుల్ల
ఉన్నవంటున్నవ్... నువ్వే చెప్పు జమీర్, నువ్వేం చేసినా ఆలోచించే చేస్తవ్..’’ అన్నది.

‘‘నా తరఫున ఐదారు వేలు సర్దుత ఆపా. ఆఖరికి నీకు పైసలు పూడకపోతె ఇంకొ
రెండు మూడు వేల దాకా అప్పు చేసైనా ఇస్త. ఇగ అంతకన్నా నావల్ల కాదాపా’’
అన్నడు ఆలోచించుకుంటనె.

సంబురపడ్డది ఫాతిమ. ‘‘సాలు తమ్మీ! నువ్వు ఇచ్చిన ఈ దైర్నంతోని చెప్పులరగంగ
ఐనా తిరిగి ఎట్లన్న ఈ షాది చేస్త. సాలు తమ్మి, సాలు... ఆయన ఉంటె నాకీ కష్టాలు
ఉండపొయ్యేటివి...’’ అనుకుంట గుడ్ల నీళ్లు తెచ్చుకున్నది ఫాతిమ.
ఆందోళనగ లేషిండు జమీర్. అక్క దగ్గరికొచ్చి -

‘‘నక్కోరో ఆపా... హమె హైనా! మేమున్నం గదా... పైన అల్లా ఉన్నడు.
ఏం గాదు. నువ్వు పరేషాన్ గాకు’’ అన్నడు. రెహానా గుడ వచ్చి ‘‘నక్కొ రో ఆపా!’’
అని ఫాతిమను ఓదార్చబట్టింది.
కండ్లు తుడుసుకొని లేషింది ఫాతిమ.

‘‘అచ్ఛ... నేన్ బోత. రెండ్రోజుల్ల ఏదో ఒకటి చెప్పమన్నది అమీన ఖాల. పెద్దోని
కాడిగ్గూడ పొయ్యి విషయం చెప్త. అట్లనె ఖాజామియా, గౌస్‌పాషా వాళ్ల దగ్గర్కి
గుడ పొయ్యి అడుగుత, పొయ్యొస్త’’ అని లేషింది.
‘‘ఆగాపా!’’ అనుకుంట బెడ్ రూంలకు పొయ్యిండు జమీర్.
నఖాబ్ గుడ్డ కట్టుకుంది ఫాతిమ.

జమీర్ బైటకొచ్చి ఫాతిమ చేతిల రెండు 50 రూపాల నోట్లు బెట్టిండు - ‘‘ఆటోల్ల తిరుగు
ఆపా. అందరి కాడికి నడిషి తిరగకు’’ అన్నడు.

‘సరె’నని తలూపి బయల్దేరింది ఫాతిమ.
బైటి దాంక వచ్చి సాగనంపిన్రు జమీర్, రెహానా.

పట్టణానికి దక్షిణం చివర నుంచి పట్టణం దాటి ఉత్తరం చివర ఉన్న తన పెద్ద
తమ్ముడు కలీమ్ ఇంటికి చేరుకున్నది ఫాతిమ. పెద్ద మరదలు ఖతీజ పట్టుబట్టి
ఫాతిమ చేత బుర్ఖా విప్పించి, కాల్లు చేతులు కడుక్కున్న దాక విడిచిపెట్టలె.
అంతల బైటికెళ్లిన కలీమ్ వొచ్చిండు. బట్టలు మార్చుకొని కాల్లు చేతులు కడుక్కొని
తుడుచుకుంట వచ్చి అక్కను ఏం సంగతులని అడిగిండు. ఖతీజ దస్తర్‌ఖాన్ పరిషి
అన్నం తీస్తున్నది. పిల్లలు ముగ్గురు ఆళ్ల మాఁవ ఇంటికి పోయిన్రని చెప్పింది ఖతీజ.
కలీమ్ కూసున్న కుర్సీ పక్కన ఉన్న కుర్సీల కూసుంటు గౌసియా షాది గురించి
చెప్పింది ఫాతిమ. జమీర్‌కు చెప్పినట్లు కాకున్న ఉన్నంతల కొంచెం బాగనె సాయం
చేయాలని అడిగింది. అంతె - ఏ పరేషాన్‌ల ఉన్నడొ, కలీమ్ అరిషినంత పని చేసిండు -
‘‘యాణ్ణుంచి తేవాలె? పిల్లల సదువులకె బోలెడు పైసలైతున్నయ్. అప్పులు గుడ
చేసినం ఈ ఏడాది. మీ ఆయన ముగ్గుర్ని కనె, పాయె. షాదీలు ఎవరు చెయ్యాలె.
మాతోటి కాదు... ఏం జేస్తవో నీ యిష్టం’’ అనేసిండు..

అప్పట్కి ఖతీజ - ‘ఏందట్ల మాట్లాడ్తవ్. అట్లనేన అక్కతోటి మాట్లాడేది?’’ అంటనె ఉంది.

ఫాతిమకు దుఖ్ఖమాగలేదు. లేషి బుర్ఖ అందుకొని దబదబ బైటికొచ్చేసింది.
ఖతీజ ఎంత ఆపినా ఆగలేదు.
         ***
ఐదోనాడు పొద్దున్నె -

బుర్ఖాల జల్ది జల్ది నడుస్తున్నది ఫాతిమ. ఎదురుంగ సైకిల్ మీద వస్తున్న సలీమ్,
‘‘ఆపా! ఎక్కడికి పోతున్నవాపా? ఇంత పొద్దున?’’ అనడిగిండు. ‘‘దేవరకొండకు
పోతున్న సలీమ్. ఆడ మా తాయబా కొడుకు, ఒక అన్న ఉన్నడు. గౌసియ షాది
గురించి చెప్పొద్దామని పోతున్న’’ అన్నది ఫాతిమ.

‘‘ఆగు ఆపా! బస్టాండు దాంక దింపుత’’ అనుకుంట సైకిల్ దిగి సైకిల్ ఎనక్కు
మలిపిండు సలీమ్. ‘‘ఎందుకు లే సలీమ్, నేను పోతలే’’ అంటున్న ఫాతిమను
‘‘ఏం కాదాపా! నువ్వు ఎక్కి కూసో’’ అని తలకున్న టోపీ సర్దుకొని, ఫాతిమను
ఎనక క్యారల్‌మీద కూసొబెట్టుకొని సైకిల్ కొద్దిగ ఉరికిచ్చి పైడిల్ మీద కాలు పెట్టి
ముందు దండ మీది నించి కుడి కాలు అవతలికేసి సీటు మీదికి ఎక్కిండు. సైకిల్
నడుపుకుంట ‘‘ఎక్కడిదాంకొచ్చిన యాపా నీ కోషిష్‌లు?’’ అనడిగిండు.

‘‘ఇంకా 20 వేలు కావాలె సలీమ్. ఏం చెయ్యాల్నో తెలుస్తలేదు. అందుకె దేవరకొండ
పోతున్న. అక్కడ మా భాయ్‌ని అడగాలె. కొద్దిగొప్ప ఏమన్న సాయం చేస్తడేమో చూస్త...’’
అన్నది. ఏం మాట్లాడలేదిక సలీమ్. బస్టాండ్ రాంగనె సైకిల్ ఆపి ‘‘ఇగ పొయ్‌రా ఆపా!
అల్లా నీ పని అయ్యేటట్లు చూస్తడు’’ అని సైకిల్ మలుపుకొని ఎల్లి పొయ్యిండు.
చట్ట చట్ట బస్టాండులకు పొయ్యి దేవరకొండ బస్ కోసం అడిగింది ఫాతిమ. బస్సు
కాడికి పొయ్ ‘‘ఇది దేవరకొండ పొయ్యే బస్సేనా?’’ అని మల్లొకర్ని అడిగి ఎక్కి కూసుంది.

కొద్దిసేపటికి బస్సు కదిలింది. బస్సుతో పాటు ఫాతిమ ఆలోచనలు గుడ కదిలినయ్...
ఈ సలీమ్ మంచి పిల్లగాడె! ఈల్లిల్లు తమకు రెండిండ్లివతల ఉంటది. వీళ్లమ్మ
నొకపాలి కదిలించింది - షాదీ చేసుకుంటడేమోనని. ‘వాడు షాదీ చేసుకోనంటుండు
ఫాతిమ. జిందగీ అంత ఇస్లాంకు సేవ చేసుకుంట ఉండిపోతడంట. ఏం చెయ్యను?’
అని బాద పడ్డది ఆళ్లమ్మ. నిజంగనె ఈ పిలగాడు ఎప్పుడు జూసినా ‘ఇస్తెమా’లని
ఊర్లు తిరుగుతుంటడు. గడ్డం ఇడిషిండు. తలమీది నుంచి టోపీ తీయడు. ఆ తెల్ల
లాల్చీ పైజమా వదలడు. నిష్టగ ఐదు పూటలా నమాజు చదువుతడు.. ఎవరు
కలిషినా నమాజ్, అల్లా, ఇస్లాం అని దీన్ గురించే చెప్తుంటడు. దునియఁ విషయాలు
ఏం పట్టవు. ఏందో... ఒక్కొక్కరు ఒక్కో తీరుగుంటరు.

ఎదురింటి పిలగాడు ఇఖ్బాల్ వాళ్ల అమ్మను గుడ కదిలించింది. ‘మా పిల్లగాన్ని
అప్పులు చేసుకుంట కంప్యూటర్ సైన్సు చదివిస్తున్నాం.. వానికి తప్పకుంట ఉద్యోగ
మొస్తదని అప్పుడె సంబందా లొస్తున్నయ్. ఒక్కొక్కరు ఖరీదైన సామానంత పెట్టి,
లక్షలు ఇస్తమంటున్నరు. నీ పిల్లను యాడ చేసుకుంటడాడు?’ అన్నదామె
మొఖం మీదనె! అది తల్చుకుంటె ఇప్పటిగ్గూడ ఎట్లనొ అన్పిస్తది...

ఈ నాలుగు రోజుల సంది ఇట్ల తిరుగుతనె ఉంది. ఫస్టు రోజు జమీర్ ఇచ్చిన
దైర్నంతోటి హుషారొచ్చి, మల్ల కలీమ్ అట్ల మాట్లాడెసరికి ఎక్కడ్లేని నీరసం
ముంచుకొచ్చె. కలీమ్ ఇంటి నుంచి ఏడ్సుకుంట సక్కగ ఇంటికె పొయింది.
అన్నం గుడ తినకుంట అట్లనె పండుకుండి పొయింది. పిల్లలు ఎంత లేపినా
పానం బాగలేదని అట్లనె ముడుచుకున్నది. పొద్దుగూకెసరికి మరి యాడ
తెచ్చిండొ గని, కలీమ్ - తన పెద్ద కొడుకుతోని ఐదు వేలు పంపిచ్చిండు.

ఇగ తెల్లారి జల్ది లేషి పనులన్ని జేసుకొని తన చెల్లెళ్లిద్దరి కాడికి పోయింది.
పెద్ద చెల్లె బర్త ఖాజామియా షానా మంచోడు. షాది నాటికి మూడు వేలు
ఇస్తనన్నడు. పిల్లకు రెండు జతల బట్టలు తెస్తనన్నడు. ఇగ చిన్న చెల్లె బర్త
గౌస్‌పాషా గుడ రెండు వేలు సర్దుతనన్నడు. ఈ ఊర్లెనె ఉన్న దూరపు
చుట్టాలిద్దరి కాడికి పొయింది. ఆళ్లు తలా వెయ్యి ఇస్తమన్నరు.
ఇంకొకాయన ‘నా హాలతు బాగ లేదమ్మ. మాఫ్‌కర్నా’ అన్నడు.

మల్ల తెల్లారి పొద్దున్నె తయారై గౌసియ చిచ్చాలిద్దరి కాడికి పొయింది.
వాళ్లిద్దరు తలా మూడు వేలిస్తమన్నరు.
ఒకరోజు పొద్దున్నె, సౌదికి పొయ్యొచ్చిన ఒకాయన గరీబు ఆడపిల్లల షాదీలకు
మదత్ చేస్తడని ఎవరొ చెబితె ఆల్లిల్లు ఎతుక్కుంట పొయింది. ఆయన ఐదు వేలిస్త
నన్నడు. షాదికి ముందు వచ్చి రొఖ్ఖా (పెండ్లి పత్రిక) ఇచ్చి తీస్కెళ్ల మన్నడు.
చిన్న తమ్ముడివి ఎనిమిది వేలేసుకున్నా. పెద్దోడిచ్చిన ఐదు వేలు, మరుదులిద్దరివి
ఐదు వేలు, గౌసియా చిచ్చా లిద్దరివి కలిపి ఆరు వేలు, చుట్టాలిద్దరు ఇచ్చినవి
రెండు వేలు, సౌదీ ఆయన ఐదు వేలు కలిపి మొత్తం ముప్ఫయ్యొక్క వేలయితయి.
ఇంక ఇరవై వేలు కావాలె. ఎట్ల? ఇంకెవరున్నరు ఇస్తానికి? ఇప్పుడీ దేవరకొండల ఉన్న
భాయ్ రెండు లారీలు తీసుకొని నడుపుతున్నడట. ఇగ ఆయన్నె జర ఎక్కువ అడగాలె.

దేవరకొండల దిగి ఒక డజను అరటిపండ్లు కొని, భాయ్ ఇల్లు ఎతుక్కుంట పొయింది
ఫాతిమ. ఆఖరికి దొరికిచ్చుకుంది.
గని పరేషానైంది. తను ఇన్నదానికి ఆ ఇంటికి ఏం సమ్మందం లేదు. చిన్న కిరాయి అర్ర.
అది గుడ పడావుపడ్డ ఇల్లు. తలుపు కొట్టింది. తలుపు తీసింది ఒకామె. తను నల్గొండ
నుంచి వస్తున్ననని, మక్సూద్ భాయ్ తనకు అన్న అయితడని చెప్పింది. లోపలికి
రమ్మన్నదామె. లోపల మక్సూద్ భాయ్ మంచంల పడుకొని ఉన్నడు. మంచానికి
అతుక్కుపొయ్‌న ఒంటితోని షాన్నాళ్ల సంది నవుస్తున్నోని లెక్క ఉన్నడు
మక్సూద్ భాయ్. ఫాతిమ పరేషానైంది. సలామ్ చేసింది.
‘‘భాయ్! నేను ఫాతిమను. మీ చిచ్చా బిడ్డను’’ అన్నది కొంచెం దగ్గరికి పోయి,
కొంచెం గట్టిగ. గుంటలు పడ్డ కండ్లతోని ఫాతిమ మొఖంల ఏవో ఆనవాళ్ల కోసం
ఎతుక్కున్నడు మక్సూద్ భాయ్. మాట గుడ మాట్లాడలేక పోతున్నడు.

నీళ్లు తెచ్చి ఇచ్చింది ఆమె.
‘‘ఏమైంది భాయ్‌కి?’’ అడిగింది ఫాతిమ పరేషాన్‌గ.

‘‘తాగి తాగి అట్లయిండు ఆపా! లారీలు కొన్నప్పటి సందే తాగుడికి అలవాటైండు.
లారీలల్ల లాసొచ్చింది. ఎంత పైకి ఎదిగినమో కొన్నాల్లకె ఇగొ ఇట్లయి పొయ్‌నమ్...’’
అని గుడ్ల నిండ నీళ్లు తెచ్చుకున్నదామె.

కొద్దిసేపు కూసొని ఆమెతో మాట్లాడింది. ఏదొ, నాలుగు మాటలు దైర్నం చెప్పింది...
దానివల్ల ఏం కాదని తెలుసు. కని తను ఏం చెయ్యగలదు... ఆళ్లిద్దర్ని సూస్తుంటే
మస్తు బాదెయ్యబట్టింది. బస్సు కిరాయి మందం పైసలుంచుకొని మిగతా పైసలు,
అరవై రూపాయలు ఆమె చేతిల పెట్టింది. ఎల్లొస్తనని ఇద్దరికి మల్ల మల్ల చెప్పి
బయలుదేరింది ఫాతిమ.

అయాల అమీన ఖాల పిలగాని తల్లి మసూదాను తీస్కొని వచ్చింది. హడాహుడి
పడిపోయింది ఫాతిమ. చాప ఏసి చద్దర్ పరిచి కూసోబెట్టింది. చాయి చేసి ఇచ్చింది.
అన్నం తిని పోవాల్నని చెప్పింది. పిల్లల్ని హడాహుడి పెట్టి మల్లొక
గిలాసు బియ్యం పొయి మీద పెట్టించింది.

మసూదా అమీన ఖాలను తొందరపెట్టింది. దాంతోటి -

‘‘ఏమైంది ఫాతిమ... ఏం చేసినవ్... యాభై వేలు ఇస్తానికి ఐతదా? ఆ విషయం
చెప్తే తతిమా విషయాలు మాట్లాడుకోవచ్చంటున్నది మసూదా’’ అన్నది అమీన ఖాల.

గుండెల కొద్దిగ నొప్పిగ అనిపించింది ఫాతిమకు. ఆల్ల ముందల కూసుంట చెప్పింది -
‘ఖాలా! నీకు తెలియందేముంది... నువ్వు చెప్పిన కాణ్నుంచి తిరుగుతనె ఉన్న.
ఇప్పటికి ముప్ఫై వేలు ఐనయ్ ఖాలా! నాకు కొద్దిగ టైమిస్తే నువ్వు చెప్పినట్లు
యాబై వేలు ఎట్లన్న చేస్త’ అన్నది.

‘‘నై హోతా అమ్మా! ఆగడం మావల్ల కాదు. ఇప్పట్కె అమీన ఖాల చెప్పిందని
ఈ వారం రోజులు ఆగిన. మీరేమో 30 వేలే తయారైనై అంటున్నరు. అవతల
యాభైవేలు ఇచ్చి షాది మంచిగ చేసిస్తమని ఒక సంబందమోళ్లు ఇప్పటికె
మూడుసార్లు వచ్చిపోయిన్రు. మా పిలగాడు తొందరపెడ్తున్నడు. ఇగ ఆగడం
మా వల్ల కాదమ్మా. ఏమనుకోవద్దు’’ అని లేషింది మసూదా.
గుండెల్ల రాయి పడ్డది ఫాతిమకు. ఆత్రంగ లేషి మసూదా చేతులు పట్టుకున్నది -
‘‘అట్ల అనొద్దు ఆపా! మీ సంబందం మీద ఎంతో ఆశ పెట్టుకున్న. నా ఆశను ఆర్పొద్దు.
జర అర్ధం జేసుకోమ్మా. ఒక్క వారం రోజులు టైమిస్తె ఎట్లన్న జేస్త. లేదంటె ముప్ఫై వేలు
తీస్కొని షాదీ కానిచ్చి తర్వాత కొద్దిగ టైమిస్తే ఎట్లన్న చేసి మీ సొమ్ము అప్పజెప్త.
కాదనొద్దు ఆపా! నువ్వెట్లన్న పెద్ద మనసు జేస్కొవాలె. జర్ర ఓపిక పట్టమ్మా మాకోసం!’’
ఫాతిమ దీనంగా బతిమాలుతున్నది.
‘‘ఇగ ఆగలేమమ్మ... మాఫ్ కర్నా!’’ మసూదా తన చేతులు ఎనక్కి తీసుకున్నది.

‘‘బేటీ! మన గరీబుల పరేషాన్లు గరీబోల్లు గాకపోతె ఎవరు అర్థం చేసుకుంటరు చెప్పు.
మొగుడు సచ్చి, బిడ్డ కనా కష్టాలు పడుతున్నది. జర అర్థం చేసుకోవాలమ్మ...’’
అని ఇంక ఏదో సర్ది చెప్పబోయింది అమీనా ఖాలా.
‘‘నువ్వు గుడ అట్లనె అంటవేంది ఖాలా! వాడెంత తొందరపెడ్తుండొ నీకు తెల్వదా?
ఎవరొ తెలిసినతను సెల్లుల మెకానిక్ డబ్బా ఈనికి 35 వేలల్లనె ఇచ్చేస్త అంటుండంట.
వాడు ఒకటె పోరుతుండు. నేనాగ లేనమ్మ... మీరేమన్న అనుకోరి’’
అనుకుంట సర్రసర్ర ఎల్లిపోయింది మసూద.

‘మసూద! మసూదా! జర్ర ఇను’ ఖాలా పిలుస్తున్నది.

‘ఆపా! ఆపా! కొద్దిగ ఆగు ఆపా’ అని ఫాతిమ బతిలాడుకుంట పిలుస్తున్నా
ఇనకుంట ఎల్లిపోయింది మసూద!
చిన్నబొయ్యి నిలబడిపొయింది ఫాతిమ. చిన్న పిల్లలిద్దరు తల్లి పక్కకొచ్చి
నిలబడ్డరు. గౌసియా వంట అర్రల గుడ్లు నీల్లు కమ్ముకోంగ,
గోడ గిల్లుకుంట నిలబడి ఉంది.

‘‘ఇగ పోనీలె బిడ్డా! ఏం జేస్తం... మన ఖిస్మత్‌ల లేదనుకుందాం. అల్లా యాడ
రాసిపెడ్తె ఆణ్ణె జరుగుతది. అన్నీ అర్థం జేసుకొనేటోడు - ఆడే సూస్కుంటడు.
నువ్వే పరేషాన్ గాకు. నేను మల్ల వస్త బేటీ! ఇందాకనె మా కోడలు,
మనుమలు వచ్చిన్రు. నేనేమో ఈ మసూద వచ్చేసరికి ఇటుబడి వచ్చిన.
మల్ల వస్త బిడ్డా!’’ అనుకుంట తలనిండా కొంగు కప్పుకొని ఎల్లిపొయింది
అమీనా ఖాలా. ఎనక్కు మల్లింది ఫాతిమ.

గుండెల మరింత నొప్పిగ అనిపించింది. కళ్లల్ల నీల్లు చిమ్మినయ్. గుండెల్ల నుంచి
దుఃఖం ఎగదన్నుకు వచ్చింది. సాప మీద కూలబడింది. బోరున ఏడ్వబట్టింది.
తల్లి ఏడుస్తుండెసరికి పిల్లలిద్దరు తల్లిని పట్టుకొని ఏడ్వబట్టిన్రు. వంట అర్రల్నుంచి
ఇవతలికి ఏడుస్కుంట వచ్చి తల్లి మీదబడి బోరున ఏడ్వబట్టింది గౌసియ.

ఇగ వాళ్లు ఒకరి మీద పడి ఒకరు ఏడుస్తున్నారు. ఒకరి గడ్డం పట్టుకొని ఒకరు
ఏడుస్తున్నరు. ఆ ఏడుపుల సప్పుడు అంతకంతకు ఎక్కువైంది. ఆ సప్పుడుకు
సుట్టుపక్కల ఇండ్లవాల్లు పరేషానైన్రు. ఇండ్లల్ల ఉన్న మొగవాల్లు బైటికొచ్చి
నిలబడి ఏమైందో నన్నట్లు సూస్తున్నరు. వాళ్ల ఆడవాల్లు దబదబ ఫాతిమ
ఇంటిదిక్కు ఉరుకుతున్నరు. జర్ర సేపట్ల ఫాతిమ ఇల్లంత సుట్టు పక్కలోల్లతోని
నిండిపోయింది. ఆ తల్లిబిడ్డల ఏడ్పు మాత్రం ఆగెటట్లు లేదు. ఆడవాల్లు కొందరు
వాల్లను ఓదారుస్తానికి ఎన్నో తీర్లుగ కోషిష్ చేస్తున్నరు. ‘అసలేం జరిగింది?’
అని మగవాల్లు అడుగుతున్నరు. ఏం జరిగిందొ ఎవరికేం తెలుస్తలేదు.
సలీమ్ గూడ వచ్చి నిలబడ్డడు. పక్కింటి లతీఫ్ భాయ్, ఎదురింటి జానిమియ,
రెండిండ్లవతలి ఖాసిమ్ - అందరు ఏమైందనె అడగుతున్రు.
కండ్లల్ల నీల్లు ఒత్తుకుంట పక్కింటి నానీ చెప్పింది -

‘‘ఏముందయ్య! ఇయ్యాల్రేపు నియ్యతు యాడుంది? గరీబోల్ల పరేషాన్లు
ఎవరు పట్టించుకుంటరు? మొగుడు సచ్చిపొయ్యే - బిడ్డ పుట్టెడు కష్టాల్ల ఉండె...
పెద్ద బిడ్డ షాది చేద్దామంటె ఒక్కొక్కల్లు లక్షలడుగుతుండ్రి. ఇదేమన్న
మన ఇస్లాంల ఉన్నదా? మొన్నొక సంబందపోల్లు యాబై వేలన్న ఇయ్యమన్నరంట.
చెప్పులరగంగ తిరిగింది బిడ్డ. తన వల్ల కాలె... ఆల్లొచ్చి, కాదని పొయ్యేసరికి
తట్టుకోలేక పోతున్నది బిడ్డ... ఎవరు ఆదుకుంటరయ్య గరీబోల్లను?
పాడు దునియాఁ..!’’
ఆ తల్లీబిడ్డల ఏడ్పు చూసి అందరు కదిలిపోతున్నరు. ఎవరెంత
ఓదార్చబొయ్‌న ఆల్ల ఏడ్పు అంతకంతకు ఎక్కువైతున్నది...
జనం ఇంక గుమిగూడుతున్నరు.

అంత మందిల -
తెల్లని పావురమేదో కదిలినట్లు - అడుగు ముందుకేసిండు సలీమ్...
‘‘ఫాతిమ ఆపా! నేను చేసుకుంట గౌసియను. పైస కట్నం లేకుంట
చేసుకుంట. రేపే మజీదుల నిఖా చదివించుకుంట. మీరు ఇగ పరేషాన్ కావొద్దు ఆపా!’’
అన్నడు నిర్మలంగా, స్థిరంగా...
షానాసేపు సలీమ్ అన్నదేందో అక్కడ ఎవరికీ సమజ్ కాలె.
సమజైనంక... ఫాతిమ కళ్ల నుంచి కారుతున్న కన్నీల్లు ఆనంద భాష్పాలుగ
మారినయ్. లేషి సలీమ్ కాడికొచ్చి అతని చేతులందుకొని కళ్లకద్దుకుంది.

1 comment:

  1. ky బాబా గారు ఏది మీ రచనా !!! అద్భుతం గా ఉంది ..ఇంతకూ మునుపే చదివాను ....కాని మీది అనుకో లేదు.....చాల బాగా రాసారు....

    ReplyDelete

మీ అభిప్రాయం తెలియజెయ్యండి