Wednesday, 29 December 2010

మెలకువ

పరుపు మెత్తదనం హాయినివ్వడం లేదు
పచ్చికను కోల్పోయిన చింత నాది
           *   
నువ్వు చదివిన కవితా పాదమే అంతిమమనుకోకు
చిత్తులో దాని వెర్షన్స్‌ ఎన్నో ఉన్నాయి


    *
లోకం పల్లమై లాగుతూన్నది
సముద్రంలో కలవడం ఇష్టం లేకే వంకలు పోతున్నాను
    *
ఎవరి లెక్కలు వారికున్నాయి
లెక్కలు లేనివాడే కదా మహా ఋషి
    *
కొండ చివరాఖర్న కూచొని గొంతెత్తాను
గ్రహ శకలాలన్నీ ఊసులు పోతున్నవి
    *
మధువుతో మత్తిల్లి మనసులో గూడుకట్టుకున్న
            గోసలన్నీ పాడుతున్నాను
ఈ రాత్రి ప్రకృతి మౌనంగా దుఃఖిస్తున్నది
    *
జనాజాకు భుజం అందించడానికి పరుగులు పెడుతున్నారు
వీళ్లంతా నన్ను పాతిపెట్టే దాకే..!

Thursday, 23 December 2010

నల్లగొర్రె


తలొంచుకుని ముందు నడుస్తున్న
సహచరుణ్ని అనుసరిస్తున్నాయి గొర్రెలన్నీ
తలొంచుకుని నడవడం గొర్రెల అలవాటు కదా

ఓ మందలో ఒక నల్లగొర్రె
తలెత్తుకోవడం నేర్చుకుంది
తుప్పుపట్టిన రీతిరివాజుల్ని ధిక్కరించింది

గొర్రెలన్నీ బెంబేలెత్తిపోయి
తలదించుకొని బతకడం మనజాతి లక్షణమంటూ
నల్లగొర్రె తలదించుకునేదాకా గోల పెట్టాయి

తలదించుకొని గొర్రెలన్నీ సాగిపోతున్నాయి
ఉన్నట్టుండి ముందు గొర్రె ‘బిస్మిల్లా’ అంటూ
ఓ గెట్టు దూకింది
గొర్రెలన్నీ అలాగే అంటూ దూకేశాయి

ఏదో అనుమానమొచ్చిన నల్లగొర్రె
తలెత్తి ముందుకు చూసింది
సహచరులు కనిపించలేదు
కాస్త ముందుకెళ్లి తొంగి చూసింది
గొర్రెలన్నీ ఓ పురాతన బావిలో పడి
గిలగిలా కొట్టుకుంటున్నాయి

నిస్సహాయంగా చూసిన నల్లగొర్రె
పక్కకు తప్పుకొని
కొత్తదారి వేస్తూపోయింది
భవిష్యత్‌ తరాల కోసం

Tuesday, 21 December 2010

‘హిందూత్వ’ దాష్టీకాన్ని ప్రశ్నించిన ముస్లింవాద కవిత్వం

తెలుగు సాహిత్యంలో అస్తిత్వ ఉద్యమాలు ఊపందుకున్న కాలం ఇది. స్త్రీవాదం, దళితవాదం వరుసలో ముస్లింవాద సాహిత్యం తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని నిలబెట్టుకున్నది. అందుకు ఆ వాదం నుంచి వచ్చిన బలమైన సంకలనాలే సాక్ష్యం. 1991లో ఖాదర్‌ మొహియుద్దీన్‌ ‘పుట్టుమచ్చ’ దీర్ఘ కవిత, 1997లో విరసం ప్రచురణగా ‘జీహాద్‌’ ముస్లిం మైనారిటీ వుల కవితా సంకలనం, 1998లో స్కైబాబ సంపాదకత్వంలో నీలగిరి సాహితి ప్రచురణగా ‘జల్‌జలా’ ముస్లింవాద కవితా సంకలనం, 2002లో అన్వర్‌, స్కైబాబ సంపాదకత్వంలో ‘అజాఁ’ గుజరాత్‌ – ముస్లిం కవిత్వం, 2004లో స్కైబాబ సంపాదకత్వంలో నసల్‌ కితాబ్‌ ఘర్‌ ప్రచురణగా ‘వతన్‌’ ముస్లిం కథల సంకలనం, 2005లో వేముల ఎల్లయ్య, స్కైబాబ సంపాదకత్వంలో హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ ప్రచురణగా ‘ముల్కి’ ముస్లిం సాహిత్య ప్రత్యేక సంచిక, 2006లో షాజహానా, స్కైబాబ సంపాదకత్వంలో నసల్‌ కితాబ్‌ఘర్‌ ప్రచురణగా ‘అలావా’ ముస్లిం సంస్కృతి కవితా సంకలనం వెలువడ్డాయి. ఈ సంకలనాలన్నింటిలో కలుపుకుని ముస్లింవాద కవులు, రచయితలు దాదాపు తొంభైమంది దాకా ఉన్నారు. వ్యక్తిగత ముస్లిం సాహిత్య పుస్తకాలుగా 1998లో ఖాజా ‘ఫత్వా’ కవిత్వం, 2002లో హనీఫ్‌ ‘ముఖౌటా’ గుజరాత్‌పై కవిత్వం, 2005లో షాజహానా ‘నఖాభ్‌’ ముస్లిం స్త్రీ కవిత్వం, స్కైబాబ ‘జగునే కీ రాత్‌’ కవిత్వం, అలీ ‘పాన్‌ మరక’ కవిత్వం – ‘హరేక్‌మాల్‌’ కథలు వెలువడ్డాయి. ‘ముస్లింవాద తాత్వికత’ పేరుతో ముస్లింవాద కవిత్వంపై ఖాజా పుస్తకం, ‘మైనారిటీ కవిత్వం – పరిశీలన’ పేరుతో డా. ఎస్‌. షమీ ఉల్లా పి.ఎచ్‌.డి. పరిశోధనా గ్రంథం వెలువడ్డాయి. అఫ్సర్‌ ‘వలస’ కవితా సంపుటిలోనూ, యాకూబ్‌ ‘సరిహద్దు రేఖ’ కవితా సంపుటిలోనూ, ఇక్బాల్‌ చంద్‌ ‘ఆరోవర్ణం’ కవితాసంపుటిలోనూ, హనీఫ్‌ ‘ఇక ఊరు నిద్రపోదు’ కవితా సంపుటిలోనూ, దిలావర్‌ ‘కర్బలా’, రేష్మా ఓ రేష్మా’ కవితా సంపుటుల్లోనూ ముస్లింవాద కవితలున్నాయి. ముస్లింల పేదరికం, అభద్రతాభావం, వివక్ష, అణచివేత, హిందూత్వ దాష్టీకం, బాబ్రీ విధ్వంసం, గుజరాత్‌ ముస్లిం జాతిమేధం, ముస్లిం సంస్కృతి, ముస్లిం స్త్రీలు, దూదేకులు – ఇతర సమూహాల ముస్లింలు, ముస్లిం ఛాందసత్వం తదితర అంశాలపై విస్తృతంగా కవిత్వం, కథలు ఈ రచయితల నుంచి వచ్చాయి. అందులో మెజారిటీ మత భావజాలం వల్ల ముస్లింలు ఎదుర్కొంటున్న వివక్ష, అణచివేతల గురించి వచ్చిన కవిత్వాన్ని ఇక్కడ పరిచయం చేసుకుందాం.
‘హిందీ హిందూ హిందుస్తాన్‌
ముస్లిం జావో పాకిస్తాన్‌
ముసల్మాన్‌ కే దో హీ స్తాన్‌
పాకిస్తాన్‌ యా ఖబ్రస్తాన్‌’ – ఖాదర్‌ మొహియ్యుద్దీన్‌
ఇలాంటి ఒక నినాదం రూపొందించి ముస్లింలను శత్రువులుగా, రకరకాలుగా ప్రచారం చేసి, వారిని పాకిస్తాన్‌కు పారద్రోలడమో లేదా చంపివేయడమో చేయాలని ముస్లిమేతరులనందరినీ రెచ్చగొట్టిన హిందూత్వవాదుల చర్యను ఖాదర్‌ మొహియుద్దీన్‌ తన దీర్ఘ కవిత ‘పుట్టుమచ్చ’లో ప్రశ్నించారు.
పై భావజాలంలో నుంచి వచ్చిన మరొక నినాదం –
‘భారతదేశంలో ఉండాలంటే వందేమాతరం పాడాల్సిందే!’
స్వతంత్ర ఇండియాలో మత స్వాతంత్య్రపు హక్కు ఉంది. వాళ్లకు కొన్ని ఇష్టాయిష్టాలు ఉండొచ్చు. వందేమాతరం చారిత్రక ప్రాముఖ్యత కలిగిన గీతమే అయినా ‘పాడాల్సిందే’ అనే నియంతృత్వం సరైంది కాదు కదా. ఈ గీతం వెనుక కూడా మళ్లీ అదే భావజలాం…. ‘ఆనంద్‌మఠ్‌’ నవలలో ముస్లింలను పారద్రోలాలని, లేదంటే చంపివేయాలని ఓ పాత్ర ద్వారా చెప్పిస్తాడు బంకించంద్ర. మరి అటువంటి నవలలోని వందేమాతరం గీతాన్ని పాడాల్సిందేనని ఇప్పుడు బలవంతం చేయడం సరైంది కాదు. అట్లే ఆ గీతంలో ఇండియాను దుర్గామాతతో పోల్చడం, తలవంచి నమస్కరించడం ఉంటుంది. ముస్లింలు తాము అల్లా ముందు తప్ప ఇంకెవరి ముందూ తల వంచం అంటున్నారు. అలాంటప్పుడు బలవంతంపెట్టడం తగదు.
ఇక మరో నినాదం – ‘భారతదేశం అంటే ధర్మసత్రం కాదురా’ అనేది. ఇలాంటి దారుణమైన నినాదాలు తయారుచేసి ముస్లింలపై విషం చిమ్ముతూ వస్తున్నది హిందూత్వవాదం. ఇలాంటి నినాదాలు చూసినప్పుడు, విన్నప్పుడు సామాన్య ముస్లింల మనోభావాలు ఎంతగా దెబ్బతిని ఉంటాయో, ఎంతగా వాళ్లు మానసిక హింసకు గురై ఉంటారో ఒక్కసారి ఆలోచించాలి…
వాళ్లూ వాళ్లూ కలిసి పంచుకున్న ఊళ్ల మధ్య
నా రక్తం ఏరులై పారింది
అంటాడు ఖాదర్‌ మొహియుద్దీన్‌. నిజం కాదా. దేశ విభజనతో ఇక్కడి సామాన్య ముస్లింలకు ఏం సంబంధం. పెద్దలమనుకున్న వాళ్ల మధ్య తేడాలొచ్చి తీసుకున్న నిర్ణయం ఎంతటి రక్తపాతాన్ని సృష్టించిందో తెలిసిందే. దేశ విభజన నాటి రక్తపాతం ప్రపంచంలోనే మహా విషాదం. పక్కవారు అనుమానంగా చూస్తున్నా, తరిమివేయాలని చూస్తున్నా, ఉన్న ఊరు – కన్నతల్లిని వదిలి వెళ్లలేక, తమ మూలాల్ని, వేర్లను తెంచుకుని వెళ్లలేక పుట్టిన గడ్డనే హత్తుకుని ఉండిపోయిన ఈ దేశపు ముస్లింలకు ఎంతటి దుర్గతి పట్టించారు ఇక్కడి పాలకులు, హిందూత్వావాదులు. అనుదినం అవమానపరుస్తూ మాతృదేశంలోనే ముస్లింల మనసుల్ని ఛిద్రం చేశారు. చివరికి రోడ్డుసైడు చిల్లర వ్యాపారాలకు మాత్రమే ముస్లింలు పరిమితం అయ్యేలా చేశారు.
పట్టెడన్నం కోసం
పేవ్‌మెంట్‌ల మీద పూలమ్ముకుంటాను
పళ్లమ్ముకుంటాను, పల్లీలమ్ముకుంటాను
గొడుగులు బాగుచేస్తుంటాను గడియారాలు బాగు చేస్తుంటాను
వీథరుగుల మీద దర్జీ పని చేస్తుంటాను
దూదేకుతుంటాను దినం గడుపుకుంటాను
ఏ గొడవల్లేకుండా
బతుకును వెళ్లమార్చాలనుకుంటాను
ఉన్నట్టుండి ఎందుకో మరి
నగరాల నడి వీథిల్లో నా నెత్తురు
తీర్థ స్నానఘట్టమవుతుంది
ఎన్నికలకు ముందు
ఎన్నెన్నో సంఘటనలకు ముందు
దేశ చరిత్ర దిశానిర్దేశానికి
నా నెత్తురు గూడుపట్టవుతుంది
పార్లమెంటు భవనంలో వాలేందుకు
నా నెత్తురు పాదలేపనమవుతుంది.
నా రక్త పదవీసోపానానికి
అభయ ‘హస్త’మవుతుంది
నా రక్తం ‘భరతమాత’ నుదుటి
తిలకమవుతుంది. పూజా ‘కమల’ మవుతుంది.
అంటూ సాగే పుట్టుమచ్చ కవితలో మతోన్మాదులు, రాజకీయ పార్టీలు ముస్లింలను ఎలా వాడుకుంటున్నదీ కవిత్వీకరిస్తారు ఖాదర్‌ మొహియుద్దీన్‌.
క్రికెట్‌మేచ్‌ నా దేశభక్తికి
తూనికా, కొలమానమవుతుంది
నేను నా మాతృదేశాన్ని
ఎంతగా ప్రేమిస్తున్నానన్నది కాదు
ఏయే పరాయి దేశాల్ని
ఎంతెంతగా ద్వేషిస్తున్నానన్నదే
నా దేశభక్తికి ఎంతో కొంత ఆధారమవుతుంది
అంటూ చివరికి క్రికెటం ఆట కూడా ముస్లింలకు అనుమానించడానికి ఒక సాకు కావడాన్ని ఖాదర్‌ ప్రశ్నించారు.
నేను పుట్టకముందే
దేశద్రోహుల జాబితాలో
నమోదై ఉంది నాపేరు
అన్న పుట్టుమచ్చలోని వాక్యాలతో తెలుగు సాహిత్యం ఉలిక్కిపడింది.
కన్నబిడ్డని సవతి కొడుకుగా
చిత్రించింది చరిత్ర
అన్నదమ్ముల్నించి చీల్చి
నన్ను ఒంటరివాణ్ని చేసింది చరిత్ర
అంటూ సాగే పుట్టుమచ్చ దీర్ఘ కవితలో తెలుగు సాహిత్యంలో ముస్లింల అభివ్యక్తి మొదలైంది. అంతకు ముందు ఇస్మాయిల్‌, వజీర్‌ రహమాన్‌, స్మైల్‌, కౌముది, దిలావర్‌, దేవిప్రియ, గౌస్‌, అఫ్సర్‌, యాకూబ్‌ లాంటి కవులున్నప్పటికీ పుట్టుమచ్చకు ముందువాళ్లు తాము ముస్లిం కవులుగా రాసింది లేదు.
బాబ్రీ వివాదాన్ని రెచ్చగొడుతూ హిందూత్వ భావజాలాన్ని పెంచిపోషిస్తూ ముస్లింలపైకి ముస్లిమేతర సమాజాన్ని మొత్తంగా ఉసిగొల్పాలని ఆరెస్సెస్‌ ఫాసిస్టు శక్తులు పనిగా పెట్టుకున్నాయి. రాజకీయంగా బలపడడానికి రామమందిర నిర్మాణాన్ని ఎత్తుకున్న ఈ శక్తులు అద్వానీ రథయాత్రతో మరింత పెచ్చరిల్లాయి. ఈ సందర్భంలోనే ఒక ముస్లిం కవి హృదయంలోనే ‘పుట్టుమచ్చ’ కవిత రూపుదిద్దుకుంది. 1991లోనే ఈ కవిత అచ్చయింది.
1992లో బాబ్రీ మసీదు కూల్చబడింది. దాంతో దేశం మొత్తంలోని లౌకికవాదులైన ముస్లింలంతా కూడా హతాశులయ్యారు. తాము ముస్లింమన్న స్పృహలోకి రావలసివచ్చింది. దాంతో అన్నాళ్లు ముస్లింలుగా మాట్లాడని ముస్లిం మేధావులు, కవులు, రచయితలు, ఆలోచనాపరులంతా ముస్లింగా మాట్లాడాల్సిన అవసరాన్ని గుర్తించారు.
తెలుగులోనూ, అఫ్సర్‌, యాకూబ్‌, ఇక్బాల్‌చంద్‌, హనీఫ్‌ లాంటివారంతా ముస్లింలుగా తమ ఫీలింగ్సు కవిత్వీకరించారు. అదే సందర్భంలో ‘కంజిర’ బులెటిన్‌ బాబ్రీ కూల్చివేతను పురస్కరించుకుని ఒక సంచిక వేసింది. అందులో పై కవులున్నారు.
ఈ క్రమంలో తెలుగు సాహిత్యంలో దళిత సాహిత్యం ఊపందుకున్నది. వారి సాన్నిహిత్యంలో, దళితవాదం అందించిన స్ఫూర్తితో ఖాజా షరతు, ఫత్వా అనే కవితలు రాశాడు. నల్గొం దళిత బహుజన కవులు, ముఖ్యంగా సుంకిరెడ్డి నారాయణరెడ్డి ప్రోత్సాహంతో స్కైబాబ హిజాబ్‌, రెహాల్‌, సాంచా లాంటి కవితలు రాశారు.
1995 జనవరిలో వచ్చిన ‘చిక్కనవుతున్నపాట’ సంకలనంలో అచ్చయిన ఖాజా, అబ్బాస్‌, అఫ్సర్‌, యాకూబ్‌, ఇక్బాల్‌చంద్‌ల ముస్లిం కవితలున్నాయి.
దేశభక్తి గురించి తెలుగు సాహిత్యంలో ఎంతో కవిత్వం వచ్చింది. ముస్లిం కవి తనను అవమానిస్తున్న, అనుమానిస్తున్న మెజారిటీ మత భావజాలమున్న సమాజాన్ని ధైర్యంగా ప్రశ్నించడం 1998లో వచ్చిన ముస్లింవాద కవితా సంకలనం ‘జల్‌జలా’ లో చూస్తాం.
‘ఈ దేశపటాన్ని చుట్టచుట్టి నీ తలకింద పెట్టుకోవడానికి
అది నీ అయ్య జాగీరు కాదు
అంగట్లో దొరికే కుంకుమ బట్టు కాదు దేశభక్తి’
అంటూ నిలదీస్తాడు సయ్యద్‌ గఫార్‌.
ఇలా ఎంతోమంది ముస్లిం కవులు మెజారిటీ మత భావజాలాన్ని, మతోన్మాదాన్ని ప్రశ్నించారు. ఈ లోగా 2002 సంవత్సరంలో భారత దేశ చరిత్రలో మొదటిసారిగా జెనోసైడ్‌ ఒకటి చోటు చేసుకుంది. గోద్రాలో ఓ రైలు డబ్బాను తగులబెట్టారనే నెపంతో వేలమంది ముస్లింల ఊచకోత సాగింది. దానికి బిజెపి, ఆరెస్సెస్‌, శివసేన్‌, భజరంగుదళ్‌ తదితర సంఘపరివార్‌ శక్తులు నాయకత్వం వహించాయని ఎన్నో పత్రికలు, ఎలక్ట్రానిక్‌ మీడియా, మేధావులు, ప్రజా స్వామికవాదులు, లౌకికవాదులు తమ వార్తాకథనాలద్వారా, రిపోర్టుల ద్వారా, పుస్తకాల ద్వారా రికార్డు చేశారు. ఈ నేపథ్యంలో దేశమంతా ఎన్నోరకాల నిరసన వ్యక్తమయ్యింది. తెలుగు సాహిత్యంలోనూ వందలకొలది కవితలు, కథలు, వ్యాసాలు అచ్చయ్యాయి. ‘గుజరాత్‌ గాయం’ పేరుతో 200 మందికి పైగా కవుల సంకలనం ఒకటి ప్రచురింపబడింది. అన్వర్‌, స్కైబాబ సంపాదకత్వంలో ‘అజాఁ’ పేరుతో ముస్లిం వుల సంకలనం ఒకటి గుజరాత్‌ నరమేధంపై వెలువడింది.
ఆ సంకలనానికి ముందుమాట రాస్తూ ప్రముఖ కవి స్మైల్‌ ఇలా అన్నారు – ‘ఈ సంకలనం… గుండె ఉంటే చదవాలి. దిటవు చేసుకు చదవాలి. లేకుండా చదివిన వారికి ఓ గుండె ఏర్పడి స్పందిస్తుంది. వీరి విషాద కవిత్వ నేపథ్యంలో ఒక ఆలోచన ప్రత్యామ్నాయాల, ఐడెంటిటిల దిశగా అంకురిస్తుంది. ఆ అంకురం కోసమే… ఈ సంకలనం’.
అన్వర్‌ ఈ సంపాదకీయంలో ‘దేశపతాకంలోని కాషాయం తెలుపును ఆక్రమించేస్తోంది’ అన్నారు.
36 మంది కవుల కవితలున్న ఈ సంకలనం ఒక జాతి మేధాన్ని ప్రశ్నించిన సంకలనంగా సమీక్షకుల చేత రికార్డు చేయబడింది.
కవిత్వంలోకి వెళితే -
గర్భంతో ఉన్న స్త్రీ కడుపుని చీల్చి పిండాన్ని బైటికి తీసి త్రిశూలంతో ఆడించి మంటల్లో వైసిన సంఘటన యావత్‌ భారతదేశాన్ని కదిలించివేయడం తెలిసిందే. ఆ విషయాన్ని ముస్లిం కవులు హృదయవిదారకంగా కవిత్వీకరించడం చూస్తాం -
మధ్యయుగాల అంధాయుధం అంచున
శాంతి ఆశ్రయం సాక్షిగా కలి ఘనీభవించిన
ఆ … రక్త కణాన్ని నేనే… నే… అమ్మా! – సయ్యద్‌ గఫార్‌
ఇప్పుడు మాతృగర్భంలోంచే
పెకలించబడ్తున్న మా ఉనికి – వలీహుసేన్‌
భారతదేశం సెక్యులర్‌ దేశం అని ప్రపంచమంతా కొనియాడుతుంటే గుజరాత్‌ నరమేధం మాత్రం ఇక్కడ హిందుత్వ ఫాసిజం రాజ్యమేలుతున్నట్లు స్పష్టం చేసింది. దాంతో మనస్తాపం చెందిన ఒక ముస్లిం కవి ఇలా అంటున్నాడు -
మితృలారా !
‘కఫన్‌’ కప్పబడిన సెక్యులరిజం జనాజాకు
మీ భుజం ఖాలీ వుంటే పట్టండి – మహమూద్‌
అయినప్పటికీ ముస్లిం కవులు గుండె నిబ్బరం కోల్పోకుండా ధైర్యంగా మాట్లాడడం కూడా చూస్తాం -
నాదొక సామూహిక ఆత్మకథ…
నన్ను బంధించకండి, మనిషి నవుతాను
నన్ను కాస్త తలెత్తనివ్వండి
రేపటికి సమాధానాన్నవుతాను – డా. ఎస్‌. షమీ ఉల్లా
కాలం కలకాలం సంఘపరివారం చేతిలో కలవాలం కాదు – ఖాదర్‌ మొహియుద్దీన్‌
రామబాణంతో వాళ్లు
విష్ణుచక్రంతో
కృష్ణచక్రంతో వాళ్లు
శివుని త్రిశూలంతో వాళ్లు
హనుమంతుని గదతో వాళ్లు…
ఆయ్‌ అల్లాహా!
ఈ చేతులు ఉట్టి దువాకేనా?! – స్కైబాబ
ఒక అందమైన తోట
ఆ తోటలో రకరకాల పూలు
రంగురంగుల పూలు గులాబీలు మందారాలు చమేలీలు
మొగలిపూలు బంతిపూలు గుల్‌మొహర్‌లు
అన్ని రకాల పూలతో చాలా అందంగా కనబడుతుందా తోట
అయితే
ఆ పులన్నింటినీ నలిపేసి, తొక్కేసి, నరికేసి
ఒక్క కమలమే విస్తరించాలంటే
ఆ తోట అందమంతా ఏమైపోతుంది?!
అన్నాడు జల్‌జలా కవి ఆఫ్రీన్‌. ఇప్పుడు దేశంలో అదే జరుగుతుంది. భిన్న కులాల భిన్న భాషల, భిన్న సంస్కృతుల, భిన్న మతాల వారిని సంహరించి ఒక్క ‘హిందూత్వ’ మతోన్మాదులే ఈ దేశంలో మిగలాలని కలలు కంటున్నారు. అందుకు నిదర్శనం గుజరాత్‌ ముస్లిం జాతి హత్యాకాండ.
‘గుజరాత్‌’ అంటే ఒక ముస్లిం స్త్రీ గర్భంలో త్రిశూలం గుచ్చి కడుపులో ఉన్న శిశువుని బైటికి లాగి త్రిశూలం మొనపై ఆడించి మంటల్లోకి విసిరిన పైశాచికత్వం!
గుజరాత్‌ అంటే ఐదారేళ్ల పసివాడికి పెట్రోల్‌ తాగించి ఆ లేత పెదాలపై అగ్గిపుల్ల అంటిస్తే ఆ చిన్నారి దేహం ఫట్‌మని పేలిపోయిన అమానవీయ దృశ్యం !
తల్లుల ముందే పిల్లల్ని పిల్లల ముందే తల్లుల్ని సామూహికంగా చెరిచి ముక్కలుగా నరికి తగలబెట్టిన వైనం !
పాడుబడిన బావిలోకి మనుషుల్ని విసిరేసి పై నుంచి రాళ్లెత్తేయడం…
ప్రాణ భయంతో పారిపోతున్న 70 మందిని టెంపోలోనే సజీవ దహనం చేయడం…
తన తల్లిని తగలబెడుతున్న దృశ్యం కళ్లల్లోకి ప్రసరించిన ప్రతిసారీ ఏడేళ్ల ఇమ్రాన్‌ పెడుతున్న కేక…
పూడ్చుకోవడానికి కూడా మిగలని వందలూ వేల బూడిద కుప్పలు !
‘భార్యల కనురెప్ప మీదే భర్తల దహనం… భర్తల పిచ్చి చూపుల ముందే బరిసెలు దిగబడిన యోనుల రక్తం కేకలు… యోనుల రక్తస్రావంలో మునిగిపోతున్న నా దేశం…’
నా పేరులోంచి చావు వాసన
పుట్టబోయే బిడ్డకు నేను పెట్టబోయే పేరులోంచి చావు వాసన – ఖాదర్‌ మొహియుద్దీన్‌
ఆ చమేలీ పువ్వు / నా చమన్‌లో పూసినందుకే / రెమ్మా రెమ్మా విరచబడింది – గౌస్‌ మొహియుద్దీన్‌
నేనేం చేశాను… / నా శరీరంలో కోర్కెల్ని తీర్చే / ఒక మర్మాంగం కూడా ఉందని తెలియనిదాన్ని – యాకూబ్‌
దేశ విభజన నాటి దురాగతాలను తలపించే ఈ నరమేధంలో బలైపోయిన సామాన్యుల చిట్లా ఎంతని విప్పేది – ఎన్నెస్‌ ఖలందర్‌
ఇట్లా ఎంత చెప్పినా తరగని కవిత్వం రాశారు ముస్లిం కవులు. గుజరాత్‌ వాళ్ల నమ్మకాన్ని భగ్నం చేసింది. వాళ్ల కవిత్వంలో ఎక్కడలేని ప్రశ్నలు…
జమా మసీదుల నిండా / ఏం ఆశించి పావురాల గుంపులు వాల్లాయో / క్షణం క్షణం చావుని గుండెల కత్తుకుంటున్నాం / ఆప్తుల గుర్తుగా / ఎన్ని తాజ్‌మహళ్లు ఒంటి నిండా చెక్కుకోను?
నువ్వు లక్ష ఆరోపణలు చేయి / నా నెత్తిన టోపీని తీసి ఎందుకు దాచుకోవాలి? – హనీఫ్‌
భూకంపానికి సొంతగూటి రాళ్లే / చంపినప్పుడు భూమిని శపించాం
తుఫాను ఉన్నదంతా దోచుకెళ్తుంటే / సముద్రాన్ని శపించాం
మరి ఈ కొత్త వేటలో / ఎవర్ని శపిస్తే ఎవరూరుకుంటారు? – ఇక్బాల్‌ చంద్‌
పావురానికి రాబందుకు జరిగేది ఘర్షణ కాదు / ఘర్షణకై రెండు రాబందులు కావాలి / ఏదీ… నీ దేహ పటంపై ఒక్క జఖమైనా చూపించు? – గౌస్‌ మొహియుద్దీన్‌
రామబాణంతో వాళ్లు… శివుని త్రిశూలంతో వాళ్లు… – స్కైబాబ
ఐదు నుంచి పదివేల మంది దాకా గుంపుగా కత్తులు, త్రిశూలాలు, పిస్తోల్లు, యాసిడ్‌ పట్టుకొని ఒక్కొక్క ఊరిలో ఉన్న ముస్లిం బస్తీల మీద పడి చంపుతుంటే పారిపోయిన ముస్లింలు చెట్లనకా, పుట్టలనకా, గుట్టలనకా, పగలనకా, రాత్రనకా కిలోమీటర్ల కొద్దీ పరుగులు పెట్టారు.
పసి దాహాలకు గుక్కెడు నీళ్లు నిరాకరించబడిన సంఘంలో ఒకరి మూత్రాన్ని మరొకరికి తాపించుకున్న నిస్సహాయత… పసి ఆకలికి నాలుగు మెతుకులు దొరక్కుండా చేసిన రాజ్యంలో పుట్టమన్నులో నీళ్లు కలిపి తినిపించుకున్న నిస్సహాయత…
అంతేకాక ఆకులు అలములు తిని బతికీ చెడీ తిరిగి ఊర్లలోకి వద్దామంటే ఆరెస్సెస్‌ గుండాలు రకరకాల షరతులు విధిస్తే బిత్తరపోయిన ముస్లింలు ఊరిబైటే ఉండిపోయారు. ఆ షరతుల్లో ఒకటి ‘అజాఁ’ వినిపించకూడదని! ఆంధ్రప్రదేశ్‌ తెలుగు ముస్లిం కవుల గుజరాత్‌ కవిత్వాన్ని అందుకే ‘అజాఁ’ పేరుతో సంకలనం చేశాం. దీనిని అన్వర్‌, నేను సంపాదకులుగా ఎంతో శ్రమకోర్చి తీసుకొచ్చాం.
దళితవాడలు ఊర్లలో కలుస్తున్న ఆనందం
ఒళ్లంతా పారకమందే / ఇప్పుడక్కడ ఊరి బైట ముస్లిం వాడలు వెలిశాయి.
ముప్ఫై వేల మంది ముస్లింలు హత్యలు చేయబడితే ఆ సంఖ్య కేవలం పదకొండు వందలుగా చూపెట్టడం… ఇంతలోనే ఆ సంఖ్యను అందరం ఒప్పేసుకోవడం ఆశ్చర్యంగా ఉంది. ఇప్పటికైనా ఎప్పటికైనా గుజరాత్‌లో అసలు ఎంతమందిని చంపేశారో ఎన్ని లక్షల ఇండ్లను నేలమట్టం చేశారో ఎందరు స్త్రీలను రేప్‌ చేశారో, ఎందురు అమ్మాయిల్ని ఎత్తుకుపోయారో… ఎంతమంది పసిపిల్లల్ని అనాధల్ని చేశారో తేల్చాల్సి ఉంటుంది.
ఇప్పుడీ దేశాన్ని ఏ జీవజలంతో కడిగినా పోని రక్తపు వాసన
కాళ్ల కింది నేలే కాదు / కరిగిన ఆకాశం కూడా మురికైపోయింది
అంటాడు ఖాదర్‌ షరీఫ్‌.
దేశ విభజనలో లక్షల మందిని బలిచ్చుకున్నా… అదో పెను విషాదమైనా… మనసులకి సర్ది చెప్పుకున్నాం. కాని ఇప్పుడు ఈ గుజరాత్‌ రక్తపు తడి ఎన్నటికీ మా మనస్సుల్లోంచి ఆరిపోదు… ఈ గుజరాత్‌లో లేచిన నల్లటి పొగ ఎన్నటికీ మా కళ్లలోంచి మాయమవదు… చూస్తూ ఉండిపోయిన, అప్పుడే మరిచిపోయిన ఎందరి మీదో అసహ్యంగా ఉంది.
ఇక్కడే / నా ఘర్‌ ఒకటి ఉండాలి
కిలకిలా నవ్వుతూ స్వాగతం పలికే / దహ్‌లీజ్‌ ఒకటి ఉండాలి
ఆ కాలి గజ్జెల సవ్వళ్లు… / ఆ నవ్వులింకా వినిపిస్తున్నాయి
ఎవరన్నా పట్టుకొని
నా కందిస్తారేమో / వెతుక్కుంటాన్నాను
ఎవరైనా వచ్చి ఈ దృశ్యాలను
శిలువ మోసిన క్రీస్తులా
భుజాల కెత్తుకుంటారేమోనని వెతుక్కుంటున్నాను
పక్కనుంచి మనిషి నడిచి వెళితే
అతనిపై పడి ఏడవాలని ఉంది - మహమూద్‌
అంటూ సాగే మహమూద్‌ కవిత కన్నీళ్లు పెట్టిస్తుంది.
ఒంటరి కఫన్‌ అనే కవితలో షాజహానా -
నా అల్లా / నా పురుషుడు / నా మతమూ పెట్టే హింసే అనుకుంటే
నీ దేముడు / నీ పురుషుడు / నీ మతమూ…
గుడ్డల్ని చీరి పీలికలు చేసినట్టు
మా దేహాల్ని చీల్చేస్తుంటే…
ఎక్కడికని పరిగెత్తను ?
ఏ రాతి గుహల్లో దాక్కోను?
అంటూ రాతి యుగంనాటి అనాగరికతకు ఆనవాళ్లుగా హిందుత్వవాదులను పోలుస్తుంది.
‘కాలీ దునియాఁ’ అనే మరో కవితలో స్త్రీగా తాను గుజరాత్‌ మారణహోమాన్ని, ముఖ్యంగా స్త్రీలపై జరిగిన అత్యాచారాల్ని ప్రశ్నిస్తూ షాజహానా ఇలా అంటుంది -
బుర్ఖాలను చీల్చేసి… / శరీరాల్తో సహా తగలబెడ్తున్నప్పుడు
ఈ దునియాఁ మొత్తం / నల్లగా… ఎండిన రక్తం ముద్దలా
ఇప్పుడు బుర్ఖా వేసినా వేయకున్నా
ప్రపంచమంటే – / కాషాయశిల…!
కత్తి మొన… / పొడుచుకొచ్చిన పురుషాంగం…!
ప్రపంచం ‘మాయిపొర’లో ఇరుక్కుని
ఉమ్మనీరు తాగి / ఇవ్వాళ కాషాయం కక్కుతోంది…!
మా కాళ్ల సందుల్లోంచొచ్చి
మమ్మల్ని బరిబత్తల పరిగెత్తించారే…
నీ ఇంట్లో ఆడది కూడా
రహస్యంగా మా కోసం కన్నీళ్లు కార్చి ఉంటుంది!
మగ నా కొడుకులు ఊపిరి / బయటికి రాకుండా నొక్కేస్తే
పీడా పోతుందని ఒక్కసారైనా / మీ అమ్మ అనుకునే ఉండాలి
సృష్టికి ఒక్కరే తల్లీ తండ్రీ అని నమ్ముతున్న దాన్ని
నీకు నాకు మధ్యా రక్త సంబంధం లేదంటావా?
గుండెల్ని పెకిలించి / పొట్టలు చీల్చి
యోనుల్లో ఆయుధాలు పొడిచి
ఇవ్వాళ నువ్వు చావుల విందు చేసుకొనుండొచ్చు
కానీ ‘నన్ను’ హత్య చేయలేవు
అనంతంగా సాగే జీవనదిని
నేను బతకడమే కాదు / నిన్ను పుట్టించి బతికించేది నేనే…!
అయినా / స్త్రీ తప్ప మగాణ్ని క్షమించేదెవరు?
ఎప్పటికీ ప్రపంచం
నా రొమ్ము తాగుతున్న పసిబిడ్డే…!
షాజహానా ఈ కవిత మనసున్న, మానవత్వమున్న ఎవరినైనా కదిలిస్తుంది. కర్తవ్యాన్ని గుర్తు చేస్తుంది.
దేనికైనా ఓ ముఖమంటూ ఉండాలి కదా
త్రిశూలానికి ముఖమే లేదు
చీలిన నాలుక తప్ప - డా. దిలావర్‌
అంటూ ఎన్నో కవితలలో ఈ కవులు హిందూత్వవాదుల దాష్టీకం గురించి, దానికి బలైన ముస్లింలను గురించి రాశారు.
హమ్‌ మర్కే భి జగాతే హై
సోయీ హుయీ దునియాకో
అంటాడు అలీ…
నిజమే! ముప్ఫై వేలమంది ముస్లింలను హత్య చేయబడితే గాని భారతదేశం ఉలిక్కిపడలేదు. ఆ ఏమవుతుందిలే, ఏం చేస్తారులే అని హాయిగా కునుకుదీస్తున్న మన లౌకికవాదులూ, ప్రగతిశీలురూ, ప్రజాస్వామ్యవాదులూ, మార్క్సిస్టులూ, మావోయిస్టులూ అంతా దిగ్గున లేచి కూర్చున్నారు. ముప్ఫై వేలమంది ముస్లింల బలిదానం జరిగితేగాని ఈ దేశంలో ఆరెస్సెస్‌ ఏం చేయబోతోందో అర్థం కాలేదు. అట్టా తాము చచ్చిపోయి కూడా అందరినీ మేల్కొల్పుతున్నాం అంటున్నాడు అలీ. అందరూ మేల్కొన్నట్లు అనపిచింది. కాని ఆరెస్సెస్‌ను నిలువరించే, కనీసం అదే చేసే దుష్ట చర్యల్ని నిలువరించే కార్యక్రమాన్ని కూడా ఎవరూ చేపట్టలేదు. ఊరికే ఉపన్యాసాల్లో హిందూ మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడుతాం అంటే సరిపోతుందా? కొన్ని సభలు చేస్తే, పుస్తకాలేస్తే మన బాధ్యత నెరవేరినట్టేనా? ఇక్కడ ఒక అనకూడని మాట కూడా అనాలనిపిస్తోంది – జర్మనీ తత్వవేత్త ఫాస్టర్‌ నీమెల్లర్‌ అన్నట్లు … వాళ్లు క్యాథలిక్కుల కోసం వచ్చారు / నేను క్యాథలిక్కును కాదు గనుక మాట్లాడలేదు… అన్న చందంగా ఆరెస్సెస్‌ వాళ్లు వచ్చింది, వస్తున్నది ముస్లింల కోసం కాబట్టి ఎవరూ అంతగా పట్టించుకోవడం లేదా?
కొన్ని పదుల సంవత్సరాలుగా ఆరెస్సెస్‌ గట్టి పథకంతో దేశంలోని జనాన్నంతా హిందువైజ్‌ చేస్తూ వస్తున్నది. ముందుగా బీసీల్ని చాలా వరకు హిందువైజ్‌ చేసేశాక (?) ప్రస్తుతం దళితులు, ఆదివాసుల మీద దృష్టి నిలిపింది. అందులో భాగంగానే ఆదివాసీ ప్రాంతాలలో యోగేశ్వర పరివార్‌, గాయత్రి పరివార్‌, సద్విచార్‌ పరివార్‌, స్వామీ నారాయణ సాంప్రదాయి,… లాంటి పేర్లతో పని చేస్తూ ఉంది. ఇలాంటి సంస్థలే గుజరాత్‌లో ఆదివాసీల్ని ముస్లింలపైకి ఉసిగొల్పాయి. రాజస్థాన్‌లోనూ, ఒరిస్సాలోనూ పని చేస్తున్నాయి. ఒరిస్సాలో ప్రతి గిరిజనుడి ఇంట్లో ఒక త్రిశూలం ఉంది. రాజస్థాన్‌లో, ఢిల్లీలో, ఉత్తర ప్రదేశ్‌లోనూ లక్షల త్రిశూలాలు పంచారు. అవన్నీ ఎవర్ని గురి చూసేందుకు? తెలిసి కూడా మనం మౌనంగానే ఉందామా? ఈ విషయాలన్నీ ‘ముల్కి’ ముస్లిం సాహిత్య ప్రత్యేక సంచికలో రికార్డు చేయబడ్డాయి.
పాఠశాలలు లేని అటవీ గ్రామాల్లో సైతం ఏకోపాధ్యాయ పాఠశాలల పేరుతో ఆరెస్సెస్‌ పాఠశాలలు నడుపోతందని తెలుస్తున్నది. సరస్వతీ శిశుమందిర్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పాలా? ఇంకా శారదా విద్యామందిర్‌, గాయత్రీ వగైరా ఎన్నో పేర్లతో నడుస్తున్నవీ కూడా హిందుత్వనే బోధిస్తూన్నాయి. ఇప్పటికే అన్ని ప్రభుత్వ సంస్థల్లో, పోలీసుల్లో, ఆర్మీలో ఆరెస్సెస్‌ బలం ఉన్నవాళ్లు నిండిపోతున్నారు. (గుజరాత్‌లోనైతే పోలీసుల శాఖంతా దాదాపుగా ఆరెస్సెస్‌తో నిండిపోయిందని తెలిసిందే)
ఎంతో కొంత చైతన్యంవతులైన వాళ్లు బతుకుదెరువు కోసం ఊళ్లొదలి పట్టణాలకు వలస వెళ్తుంటే ఆరెస్సెస్‌ అదే పనిగా జీతమిచ్చి ఒక ఫూల్‌టైమర్‌ను ఊర్లలోకి పంపుతున్నది. వాళ్లు మెల్లగా ఊర్లలో చేరి పొద్దున్నే వ్యాయామం పేరు చెప్పి ఊరిబైటి ఏదేని గుడి దగ్గరికి తీసుకెళ్లి కాసేపు ఎక్సర్‌సైజులు చేయించి తర్వాత హిందుత్వ బోధన చేస్తున్నారు. ‘హిందువునని గర్వించు – హిందువుగా జీవించు’ అనే వాక్యం కొన్ని రోజులకే ఊరి గోడలపై రాయించబడుతుంది. దాంతోపాటు ఆరెస్సెస్‌ పత్రికలు జాగృతి లాంటివి, ఇంకా ఇతర హిందుత్వ భావజాలం ఉన్న పుస్తకాలు చదివిస్తున్నారు. దాంతో ఆ యువకులంతా ముస్లింలు ఈ దేశస్తులు కారని, దేశద్రోహులని, ఐ.ఎస్‌.ఐ. ఏజెంట్లనీ నమ్మడం మొదలవుతుంది.
ఇంకా ఊర్లలో కూడ వినాయకులను నిలబెట్టడం, ‘హిందూ దేవాలయాలకు మాత్రమే ప్రాధాన్యతనివ్వడం జరుగుతున్నది. వినాయకుల విషయంలో సక్సెస్‌ అయిన హిందుత్వవాదులు ప్రస్తుతం దసరాకు దుర్గను కూడ నిలపడం పట్టణాల్లో షురూ చేశారు.
ఇంకా ఎన్నో మార్గాల ద్వారా హిందుత్వను పెంచుతూ చివరికి దళితులను, ఆదివాసులను సైతం హిందువైజ్‌ చేయడంలో సక్సెస్‌ అవుతున్న ఆరెస్సెస్‌ శక్తులు ప్రతి ఎన్నికల్ని, ప్రతి అంశాన్ని ప్రయోగంగా చూస్తూ ముందుకు పోతున్నాయి. ఇవాళ దేశంలోనూ, మహారాష్ట్రలోనూ బిజెపి ఓడిపోయిందని సంతోషించి సంబరపడితే లాభంలేదు. వాళ్లు వీటిని కూడా రేపటి తమ విజయానికి సోపానంగా మల్చుకుంటూనే ఉంటారు. వాళ్ల గ్రౌండ్‌వర్క్‌ నడుస్తూనే ఉంది కాబట్టి ఎప్పటికైనా వాళ్లు గెలిచే అవకాశం ఉంది.
ఆరెస్సెస్‌ను నిలువరించే మార్గం ఒక్కటే కనిపిస్తున్నది. ఎవరినైతే హిందువైజ్‌ చేస్తూ మెజారిటీలమని బుకాయిస్తూ వస్తున్నారో వాళ్లను హిందువైజ్‌ కాకుండా ఆపడం, ఆదివాసులు, దళితులు, బీసీల వారిని హిందువులం కామన్న ఎరుకలోకి తీసుకురావడం.
రాముడు, కృష్ణుడు, వినాయకుడు తదితర మగ దేవుళ్లంతా తమ దేవుళ్లు కాదనీ, తమది మాతృస్వామ్య వ్యవస్థ అనీ, తమది అమ్మ దేవతల సంస్కృతి అనీ గుర్తు చేయడం. ఎల్లమ్మ, మైసమ్మ, పోలేరమ్మ తదితర అమ్మ దేవతల్ని కొలవడం ఆత్మన్యూనతలో పడిపోయి, అంతా మగదేవుళ్లను కొలిచే మాయలో పడిపోయిన విషయాల్ని విప్పడం. తమ సంస్కృతుల్ని, తమ పండుగల్ని, తమ ఆచారాల్ని, వ్యవహారాల్ని, గొప్పగా తడుముకునేలా చేయడం… బతుకమ్మలు, బోనాలు మొదలైన పండుగల్ని హైలెట్‌ చేయడం… రాక్షసులని చెబుతున్న వాళ్లంతా తమ దళిత నాయకులనీ, తిరుగుబాటుదారులనీ విడమర్చి చెప్పడం…
ఇవన్నీ కాక, ఈ కులవ్యవస్థలో ఉండడం ఇష్టంలేని వాళ్లను స్వేచ్ఛగా బౌద్ధం, క్రైస్తవం, ఇస్లాం తీసుకునే స్వేచ్ఛ ఉందనే జ్ఞానాన్నివ్వడం… ముఖ్యంగా అన్ని రకాల సామాజిక చైతన్యాన్ని అందించడం…

Friday, 3 December 2010

తెలంగాణ చరిత్రలోనైనా ముస్లింలకు న్యాయం జరగాలి

చిన్నప్పుడు పంద్రాగస్ట్‌కు సంబరంగా ఊరు తిరిగేది. బడి ముందల జెండా ఎగరేసినంక సార్లు, ఊరిపెద్దలు స్వాతంత్య్రం గురించి, పోరాటయోధుల గురించి చెప్తుంటే ఒళ్లంతా ఊగిపోయ్యేది. పెద్దయినంక తెలిసింది, దేశ విభజన పేరుమీద లక్షల మంది బలయ్యన్రని, సరిహద్దుల్లో రక్తం యేరులై పారిందని. ఇట్లనే నవంబర్‌ 1న ఆంధ్రప్రదేశ్‌ అవతరణ అని, హైదరాబాద్‌ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో కలిసిన రోజని చెబితే పాల మనసుతోని నిజమే అని నమ్మినం. తీరా చూస్తే - నిజాం పాలనను మించి ఆంధ్ర పాలనను తెచ్చిన్రని తెలిసొచ్చె. ఈడ గుడ నిజాం నిరంకుశ పాలన అని, రజాకార్ల దౌర్జన్యాలు అనే విన్నం గనీ పోలీస్‌ యాక్షన్‌ పేరు మీద లక్షలమంది ముస్లింలను కాల్చి చంపేసిన్రని తెలియకపాయె. ఆ విషయం ఇప్పటోల్లకు అస్సలు తెల్వకుండ ఎందుకు దాచిపెట్టిన్రని ఇవాళ మేం అడుగుతున్నం. అంతమందిని పొట్టనుబెట్టుకోవడం వెనుక హిందూత్వ భావజాలమె పని చేసిందనుకోవాల్నా? అంటే అప్పట్నించే ఆ భావజాలం అంత బలంగా ఉందా? ‘హైదరాబాద్‌ : ఆఫ్టర్‌ ద ఫాల్‌’ అనే సంకలనంలో (సంకలన కర్త ఒమర్‌ ఖాలిదీ) పోలీస్‌ యాక్షన్‌లో రెండు లక్షల మంది ముస్లింలు చంపబడినట్లు ఒక రిపోర్ట్‌ (పండిట్‌ సుందర్‌లాల్‌, ఖాజీ మొహమ్మద్‌ అబ్దుల్‌ గఫార్‌)ఉంది. కాని ఆ సంఖ్య ఆరు లక్షల వరకు ఉండొచ్చని కొందరు చెబుతున్నారు. అందమైన ముస్లిం ఆడపిల్లల్ని, ఆడోల్లని తెలుగోల్లు మాయం చేసిన్రని, పోలీసులు వారాల తరబడి రేప్‌ చేసిన్రని, లూటీలు, దహనాలకు లెక్కే లేదని తెలిసినప్పుడు మన ప్రజాస్వామ్యం మీద అనుమానమేస్తుంది. పోలీస్‌ యాక్షన్‌ గురించి మాట్లాడడం ఇప్పుడెందుకు అనే తెలంగాణ వాదులున్నారు. వాళ్లను ఎట్ల అర్థం జేసుకోవాలె? లక్షలమందిని చంపడం, ఇండ్లను దోచుకోవడం వల్ల కొన్ని తరాలపాటు ముస్లింలు కోలుకోకుండా చేశారు. ఇవాల్టి తెలంగాణ ముస్లింల వెనుకబాటుకి అది కూడా ఒక కారణం. ఎంతమందిని చంపిన్రనే దగ్గర్నించి ముస్లింల మానసిక హింస దాక అప్పటి ఆ విషయాలన్నీ వెలికి తీయాల్సిన అవసరం ఉంది.

అయాల ఉర్దూ రాజభాష. ముస్లింలు-తెలుగోల్లు ఉర్దే చదివేదికదా. ఇండియాల కలపంగనె ఒక్కసారిగ ఉర్దూ తీసిపారేసి కోస్తాంధ్ర తెలుగు అందరి మీద రుద్దిన్రు. ప్రజాస్వామ్యం తెచ్చిన్రు గదా, మరి కనీసం ముస్లింల కోసమన్నా ఉర్దూను ఎందుకు కాపాడాలె? అదే హైదరాబాద్‌ రాష్ట్రం వేరుగానే ఉంటే కనీసం తెలంగాణన్న వేరుగ ఉంటే ఉర్దూ ఇయాల రెండో భాషగా ఉండేది కదా (ఏమో?) ఇయాల ఆంధ్రా పాలకులు ఉర్దూను తొక్కి పారేసి ముస్లింలు గుడ కోస్తాంధ్రంలనే జవాబు చెప్పేటట్టు తమ ఆధిపత్యాన్ని రుద్దుతున్రు. ఉర్దూను ఛీత్కరించడంతో తెలంగాణలో తెలుగు చదివినోళ్లు లేక ఉద్యోగాలన్నింటిలో ఆంధ్రావాళ్లను నింపడం మొదలైంది. అప్పట్నించి మొదలైన ఆంధ్రావలస ఇప్పటికీ ఆగలేదు. ఇక్కడ ముస్లింలకు కూడా పెద్దఎత్తున అన్యాయం జరిగింది. కేవలం ఉర్దూ తెలిసిన అప్పటి ఉద్యోగస్తులకు తెలుగు లేక ఇంగ్లీషు నేర్చుకోవాలని అప్పటి ప్రభుత్వం కొన్ని రోజుల గడువు ఇచ్చింది. మరి నేర్చుకోలేని వాళ్లు ఉద్యోగాల నుంచి తీసే వేయబడ్డారా? లేక ఏం జరిగింది అనే విషయం తెలియదు. అప్పటి దాకా ఉర్దూ మీడియంలో చదువుకున్న యువతరం ఏమయ్యారు? అప్పట్నించి తెలుగు మీడియం ప్రవేశ పెడితె మరో 15 నుండి 20 ఏళ్లకు కదా విద్యావంతులయ్యేది, ఈ మధ్య కాలమంతా ముస్లింలు అన్యాయం పాలయినట్లే కదా? ప్రజాస్వామ్యం పేరుమీద ఇంత దోపిడీ, ఇంత అన్యాయానికి పాల్పడడమేమిటి?
మొత్తం ఇండియాల ఉర్దూ మాట్లాడేవాళ్లు కోట్లమందే ఉంటారు. ఇన్ని భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డయి, మరి ఒక్క ఉర్దూ రాష్ట్రమైనా ఎందుకు లేదని ప్రశ్నించుకోవడం దేశద్రోహం ఏం కాదు కదా. దేశ విభజనాభారాన్ని ఇక్కడి ముస్లింల మీద మోపి ఆ విషయం తప్పించడం సరైందా? ఉర్దూ మాట్లాడేవారు ఒక్కతాన లేకుండా దేశవ్యాప్తంగా పరుచుకొని ఉన్నారు కదా అనే సాకు సరైందా? ఎంఐఎం ఉర్దూ రాష్ట్రం కావాలని 1956లో డిమాండ్‌ చేసి ఉంటే ఎంత బాగుండు.
ఇవాళ హైదరాబాద్‌ లోని, తెలంగాణలోని ఉర్దూ మాట్లాడేవారు, సాహిత్యకారులు ఒక వేరే ప్రపంచంగా బతుకుతున్నారు. వాళ్లను మిగతా ప్రపంచంతో కలిపే ప్రయత్నం ఏది జరుగుత లేదు. వాళ్లతోనూ వేరే ప్రపంచం కలవడం లేదు. వాళ్ల సమస్యలు, వాళ్ల బాధలు వేరేగా ఉన్నాయి. ఆ అంతరాన్ని పెరగనివ్వకుండా చూడాల్సి ఉంది.
తెలంగాణ హిస్టరి రికార్డు చేసేప్పుడు విధిగా ఉర్దూ మాట్లాడేవాళ్ల ప్రాతినిధ్యం ఉండేలా చూడాలి. వాళ్ల ఫీలింగ్సుని పరిగణనలోకి తీసుకోవాలి. ఉర్దూను తెలంగాణ ద్వితీయ భాషగా గుర్తించాలి.
తెలంగాణ గురించి కమ్యూనిస్టులు, ఆంధ్రా వలస పాలకులు రాసిన చరిత్రే ఆధారం కావడం (?)తో అసలు విషయాలు ఎన్నో మరుగున పడ్డాయి. వెలుగులోకి రావలసిన విషయాలు చాలా ఉన్నాయి. అందులో కొన్ని ముఖ్యమైన విషయాల్ని ‘ముల్కి’ ముస్లిం ప్రత్యేక సంచికలో సంగిశెట్టి శ్రీనివాస్‌ రాసిండు. ‘నిజాం చరిత్రకు చెదలు’ పేరుతో రాసిన ఈ వ్యాసంలో ముస్లింలు మనసులో అనుకున్నప్పటికీ బయటికి చెప్పలేని కొన్ని విషయాలతో పాటు ఎన్నో కొత్త కోణాల్ని రికార్డు చేసిండు. దానిపట్ల ఎంతో వ్యతిరేకత వ్యక్తం కావడం ఆశ్చర్యం కలిగించింది. రాజరికాన్ని సపోర్టు చేయడంగా కొందరు మాట్లాడిన్రు. నిజాంలది రాజరికమే. (ఆ పేరుమీద రెడ్డి, వెలమ తదితర భూస్వాములు రాజ్యం చేసిన విషయం మరుగున పెడుతున్నారు.) ఇవాల ప్రజాస్వామ్యం పేరుమీద కోస్తాంధ్రులు నియంతృత్వం చెలాయిస్తుంటే, రాజరికం కన్నా ఎక్కువ దౌర్జన్యాలు చెలాయిస్తుంటే ఆ విషయం చెప్పొద్దంటే ఎట్ల? పైగా తమ కులాలకు చెందిన వాళ్లు రాజులుగా ఉన్నా ఆయా కులాల వాళ్లు మీరు రాజులు కదా అనే నిందను మోయడం లేదు. ఇండియాను క్రిస్టియన్లు పరిపాలిస్తే ఇవాళ క్రిస్టియన్లను మీరు పాలకులు కదా అని అడగడం లేదు. కాని ముస్లింల విషయానికొస్తే మాత్రం మీరు 400 ఏండ్లు పాలకులుగా ఉన్నరు కదా అని కొన్ని బీసీ సంఘాలు ముస్లిం రిజర్వేషన్‌ను వ్యతిరేకించాయి. అట్లె ఎంతోమంది అలా వాదిస్తున్నారు. ఆఖరికి తెలంగాణ వాదుల్లో కొందరు గూడ అయ్యే మాటలు మాట్లడడం విన్నప్పుడు చీదరింపు కలిగింది. ఏ కులంగాని, మతంగాని, జాతిగాని ఇట్లా మీరు పాలకులు కదా అనే భారాన్ని మోయడం లేదు. ఒక్క ముస్లింలు తప్ప.
పాలకులు అన్న ఈ భారాన్ని మోస్తున్న ముస్లింలకు సెప్టెంబర్‌ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని బిజెపి నిర్వహిస్తున్న తీరు వల్ల కూడ మరింత నష్టం కలుగుతున్నది. ఇట్లాంటి సందర్భంలో సెప్టెంబర్‌ 17ను ఉత్సవంగా టిఆర్‌ఎస్‌ నిర్వహించకుండా ఉండడం సరైందనిపించింది. కాని కొన్ని తెలంగాణ సంఘాలు ఈ విషయాన్ని విస్మరించడం విస్మయం కలిగించింది. కోస్తాంధ్ర వలసవాద పాలన నుంచి తెలంగాణకు విమోచన కలగనంతవరకు సెప్టెంబర్‌ 17ను ఉత్సవంగా జరపడంలో అర్థం లేదు.
ఇవాళ రాజకీయంగా జరుగుతున్న ఉద్యమంపై ముస్లింలకు అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. రాజకీయ ఉద్యమం సాహిత్యరంగంలోని ఒక వర్గాన్ని ప్రభావితం చేస్తుండడం ఇవాల్టి విషాదం. టిఆర్‌ఎస్‌ మొదలయింతర్వాత బిజెపి నుంచి చీలిపోయి టిఎస్‌ఎస్‌గా ఏర్పడ్డ నరేంద్ర పార్టీ టిఆర్‌ఎస్‌లో కలవడం ముస్లింల పట్ల వివక్ష మొదలు కావడానికి కారణమైంది. (ముస్లింలకు కూడా టిఆర్‌ఎస్‌పై అనుమానం మొదలైంది.) అంతదాకా ముస్లింల జనాభా తెలంగాణలో గణనీయంగా ఉందని భావించి 15 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తామని ప్రకటించిన టిఆర్‌ఎస్‌ ఆ వాయిస్‌ను తగ్గించింది. అట్లే సీట్ల కేటాయింపులోనూ అన్యాయం చేసింది. ఇప్పటికీ ఆరెస్సెస్‌ వాడినే అనే నరేంద్ర రెండవ నాయకుడుగా ఉండడంతో ముస్లింలలో ఒక సందిగ్ధం నెలకొంది. తెలంగాణ వస్తే బిజెపి ప్రాబల్యం పెరుగుతుందని జరిగిన ఒక ప్రచారం కూడా ఇందుకు కారణం. పైగా అసెంబ్లీలో ముస్లింల ప్రతినిధిగా మాట్లాడే ఎం.ఐ.ఎం కూడా తెలంగాణ పట్ల మొదట వ్యతిరేకంగా మాట్లాడడం కూడా మరో కారణం. కాని ఎం.ఐ.ఎం ముస్లింల ప్రతినిధి కాదని ఇక్కడ అందరం గుర్తుంచుకోవాలి. ఒక్క పాతబస్తీలో తప్ప మిగతా తెలంగాణ జిల్లాల్లో ముస్లింలు ఎం.ఐ.ఎం.తో లేరు.
నరేంద్ర తదితర ఆరెస్సెస్‌ వాదుల (రాజకీయ పార్టీలతో సంబంధం లేని ఆరెస్సెస్‌ వాదులు కూడా) వల్ల ఇవాల ముస్లింల పట్ల ఒక వివక్ష, మౌనం చూస్తున్నాం. చివరికి ఇదే భావజాలం సాహిత్యానికి కూడా పాకి మిగతా ఐడెంటిటీ ఉద్యమాలతో పాటు ఒక ఉద్యమంగా నడుస్తున్న తెలంగాణ వాదం ముస్లిం వాదం పట్ల వివక్ష చూపుతూ వస్తున్నది. వేదికల మీద ముస్లింలు లేకుండానే నడిపిస్తున్నది. ఒక్క తెలంగాణ సాంస్కృతిక వేదిక కాస్త ఇందుకు మినహాయింపుగా కనబడుతున్నది.
సాహిత్య ఉద్యమంతోపాటు తెలంగాణ రాజకీయాలు కూడ ముస్లింల పట్ల స్పష్టమైన ప్రకటనలు (చేయాలి) చేసేలా తెలంగాణ ముస్లింల ప్రాముఖ్యతను రికార్డు చేయవలసిన అవసరం ఉంది.
తెలంగాణ హిస్టరీ రికార్డు చేసే క్రమంలో ముస్లింల కోణం నుంచి లెక్కలోకి తీసుకోవల్సిన అంశాలు క్లుప్తంగా :




  • పోలీస్‌ యాక్షన్‌లో ఎన్ని లక్షలమంది ముస్లింలను హత్యచేశారో, ఎంతమంది ముస్లిం స్త్రీలను, అమ్మాయిల్ని రేప్‌ చేశారో, మాయం చేశారో, ఎన్ని ఇండ్లను దోచుకున్నారో, ధ్వంసం చేశారో విస్తృత అధ్యయనం జరగాలి. అందుకు ప్రతిగా ముస్లింలను ఆదుకోవాలి.



  • తెలంగాణకు సంబంధించి హిస్టరి దగ్గర్నుంచి అన్ని రంగాల్లో ఉర్దూ మాట్లాడేవాళ్ల ప్రాతినిధ్యం ఉండాలి. ముస్లింల ప్రాతినిధ్యం ఉండాలి.



  • ఉర్దూను తెలంగాణ ద్వితీయ భాషగా గుర్తించాలి.



  • తెలంగాణ గురించి కమ్యూనిస్టులు, ఆంధ్రా వలసపాలకులు రాసిన చరిత్ర ఆధారంగా ముస్లింలను చూడొద్దు. తెలంగాణలో ముస్లింలు ఒక భాగం అని నమ్మేవాళ్లు కొత్తగా రాసే చరిత్ర ఆధారంగా చూడాలి.



  • శ్యాంసుందర్‌ అనే దళిత నాయకుడు హైదరాబాద్‌ ప్రత్యేక దేశంగా ఉండాలని యుఎన్‌ఓ తో మాట్లాడిండని, ఇంకో మూడు రోజులు గనుక పోలీస్‌ యాక్షన్‌ జరగకపోయి ఉంటే హైదరాబాద్‌ను ప్రత్యేక దేశంగా యుఎన్‌ఓ ప్రకటించేదని చెప్తున్నరు. అట్లా జరిగి ఉంటే ఇండియా అనే ఒక దేశం మరో దేశమైన హైదరాబాద్‌ మీద దాడి చేసినట్లు అయ్యేది. ఇదిలా ఉంటే హైదరాబాద్‌ సంస్థానాన్ని ఇండియన్‌ యూనియన్‌లో కలపడం వల్ల దళితులకు అన్యాయం జరుగుతుందని ఫీలయిన శ్యాంసుందర్‌ చెప్పిన కారణాలేమిటి? అవి నిజ మయ్యాయా?



  • నిజాం రాజుల పాలనను ముస్లింల పాలన అనడాన్ని వ్యతిరేకించాలి. ముస్లింలు 400 ఏండ్ల పాలకులు అనే ప్రచారాన్ని ఖండించాలి.



  • నిజాం రాజ్యంలో ‘నిరంకుశత్వం’ నడిపిన రెడ్లు, వెలమలు తదితర భూస్వాముల గురించిన విషయాలు కూడ చర్చకు రావాలి. ఎవరి నిరంకుశత్వం ఎంత అనేది తెలియాలి.



  • ఉర్దూలో, పార్సీలో ఉండే సోర్సెస్‌ (ఆధారాలు) వెలికి తీయడం ద్వారా అనేక అబద్ధపు ప్రచారాలు, అసలు నిజాలు వెలుగులోకి వస్తాయి, కనుక ఆ ప్రయత్నం జరగాలి.



  • ఖాసీం రజ్వీ ఆటోబయోగ్రఫీ పాకిస్తాన్‌లో ముద్రణ పొందింది. దాన్ని రిఫర్‌ చేయడం జరిగితే అతను రజాకార్‌ ఉద్యమం చేయడానికి అసలు కారణాలు తెలిసే అవకాశం ఉంది. ఆ ప్రయత్నం జరగాలి.



  • నిజాం కాలంపై విదేశాలలో సైతం రిసెర్చ్‌లు జరుగుతుంటే ఇక్కడ ఇంతటి వివక్ష, దుష్ప్రచారం జరుగుతుండడాన్ని చర్చకు పెట్టాలి.



  • కోస్తాంధ్రలో దళిత క్రైస్తవులు ఎక్కువగా ఉన్నట్లుగా ఇక్కడ ముస్లింలు ఎక్కువగా ఉన్నారు. మరి దళితుల నుంచే ఎక్కువగా ముస్లింలుగా మారిన్రా అనే విషయంలో అధ్యయనం జరగాలి. దీన్ని లెక్కలోకి తీసుకోవాలి.



  • ఆంధ్రుల వలస వల్ల చిల్లర వ్యాపారాల దగ్గర్నుంచి ఉద్యోగాల దాకా ముస్లింలు అన్యాయానికి గురయిన, గురవుతున్న విషయం రికార్డు కావాలి.



  • హైదరాబాద్‌ లాంటి చోట్ల పోలీసు శాఖలో ముస్లింల శాతం మరీ తక్కువగా ఉన్నది. దీనివల్ల ఎంతో వివక్ష కొనసాగుతున్నది. ఇది ఏ భావజాలం వల్ల జరుగుతున్నది? దీని వెనుక రాజకీయాలేమిటి? పోలీసుల భర్తీలో ముస్లింల పట్ల వివక్ష గురించి చర్చ జరగాలి.



  • ముస్లింలకు, తెలుగోల్లకు మధ్య ఏయే కారణాల వల్ల అంతరం పెరుగుతున్నదో చూడాలి.



  •                                                                                  - స్కైబాబ

                                      మే 19th, 2007 by డిస్కవర్ తెలంగాణ