Thursday 23 February, 2012

చరిత్ర ఒక భారం, వర్తమానం ఒక గాయం - కె. శ్రీనివాస్


ఇప్పటి రచయితల్లో స్కైబాబా అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. అతని వ్యక్తిత్వంలోని కొన్ని అంశాలు అందుకు కారణం.  ముస్లిమ్‌ వాదమయినా, తెలంగాణ వాదమయినా అతను దాన్ని లోపలికి తీసుకుని సంచలిస్తాడు. రచయితగా కూడా అతను కార్యకర్తగా, కార్యకర్తగా కూడా అతను రచయితలా అనిపిస్తాడు. తన విశ్వాసాలతో అతనికి సంబంధం జ్ఞానం మీద కాక, కేవలం అనుభవం,ఉద్వేగాల మీదనే ఆధారపడడం నాకు అసంతృప్తి కలిగిస్తుంది. ఆ మాటకొస్తే, ఆ ఫిర్యాదు నాకు చాలా మంది ఐడెండిటీ సాహిత్యకారుల మీద ఉన్నది. అనుభవాన్ని ఆవేశాల్ని పరమ ప్రామాణికంగా తీసుకునే వైఖరి వల్ల అనేక పరపాట్లు జరుగుతాయి. స్కైబాబా కూడా పొరపాట్లు చేశాడు. కాకపోతే, స్కై పనులు కూడా చేస్తాడు.  అభిప్రాయాల తీవ్రత వల్ల,  అవి వ్యక్తమయ్యే తీరు వల్ల అతను అపార్థాలను, ఒక్కోసారి వ్యతిరేకతలను మూటగట్టుకుంటాడు. కానీ, ఆ తీవ్రత వెనుక ఉన్నది సున్నితత్వమేనని అతన్ని దగ్గరగా ఎరిగినవారికి తెలుసు. ఇప్పుడు ఈ కథలు చదివినవారికీ అది తెలుస్తుంది. అస్తిత్వ సంక్షోభాన్ని మనసులోకి జీవితంలోకి తీసుకున్న స్కై తనను తానొక సమూహ జీవిగా చూసుకుంటాడు. సమష్టి ప్రయోజనమే అతనికి ప్రాధాన్యం. అందుకే అతను, మొదట ఇతరుల పుస్తకాలు వేసి ఆ తరువాత తన సొంత పుస్తకానికి పూనుకున్నాడు. కవిత్వంలో కూడా అంతే.  ఎక్కడన్నా విన్నారా, కవులు తమ సొంత పుస్తకాలు కాక, సంకలనాలు వేయడం? ఇప్పుడీ కథల పుస్తకం కూడా అంతే. ముస్లిం కథల సంకలనం వేసిన తరువాతనే, ఇప్పుడీ సొంత కథల పుస్తకం వేస్తున్నాడు.

ఈ కథల పుస్తకంలో స్కైబాబా రాసిన పదకొండు కథలున్నాయి. ఇంతవరకు రాసి, పత్రికల్లో ప్రచురించినవన్నీ ఈ సంకలనంలో లేవు. కొన్నిటిని ఎంపిక చేసి కూర్చిన పుస్తకం ఇది.  ఈ కథలన్నిటిలో కథకుడి మనో ప్రపంచంలో సుడులు తిరిగే సంవేదనలే ప్రతిఫలించాయి. న్యాయాన్యాయాలో, మంచిచెడులో, పురోగామితిరోగాములో ఏదో ఒక ద్వంద్వం వద్ద  నిలబడి, అతను కథ చెబుతూ పోతాడు. కథకుడిగా అతను నిలబడ్డచోటు, అతను ప్రాతినిధ్యం వహించే విలువలు, అతను వ్యక్తీకరించే అస్తిత్వవేదనా- అన్నీ కలిసి ఈ కథలకు విలువను సంతరింపజేస్తున్నాయి. ఇందులోని పాత్రలు, ముస్లిములు కానీ ఇతరులు కానీ, చారిత్రకపాత్రలే. చరిత్రకు సంబంధించిన భారాన్ని మోస్తున్న పాత్రలే.   ముస్లిమ్‌ కథల్లో ఒక మిశ్రమ భాషను వినియోగంలోకి తేవడంతో స్కైబాబా దోహదం చాలా ఉన్నది. ఆ మిశ్రమత్వంతోనే భాషకు అందం కూడా సమకూరిందనిపిస్తుంది. అయితే, తెలుగు, ఉర్దూపదాల తూకం సరిపోయిందా, అందులో ఏమైనా సర్దుబాట్లు చేసుకోవాలా అన్నది సాధన మీద తేలే విషయం.

ఈ కథల్లో తెలంగాణ ముస్లిమ్‌ జీవితాల వర్ణన, సాంస్క­ృతికమైన పూసకట్టు చిత్రణ ఉన్నాయి.  అభిమానాలు, ఆప్యాయతలు, దారిద్య్రం వాటి మీద పెట్టే ఒత్తిడులు, కలలు కనడానికి కూడా లేని దుర్భరమైన పరిస్థితులు, అడుగడుగునా పడవలసి వచ్చే రాజీలు  అన్నీ ఉన్నాయి. స్నేహాల మధ్య అకస్మాత్తుగా మొలిచే కులాలు, ఎక్కడా అద్దె ఇల్లు దొరకని వెలివేతలు, పోలీస్‌స్టేషన్ల ముందు పడిగాపులు పడినా కొడుకులు దక్కని మాతృమూర్తులు, కాసిన్ని డబ్బు కళ్లపడగానే చూపు మారిపోయే మనుషులు, మనిషికీ ప్రపంచానికీ మధ్య అడ్డుతెరలుగా నిలిచిన పరదాలు- స్కై కథల్లో కథావస్తువులు. కరుణరసమే తప్ప ఎక్కడా ఆగ్రహం ఉండదు. దయనీయత,
హీనత్వం కథలన్నిటా పరచుకుని ఉంటుంది. ఆ జీవితపు భారం కింద కథకుడి కలమే పడి నలిగిపోయినట్టు అనిపిస్తుంది. ఈ కథలన్నిటిలో కథకుడు ఎక్కడా ఆగకుండా వడివడిగా నడుచుకుంటూ వెళ్లిపోతాడు, లేదా కూర్చుని ఏకబిగిన కథచెప్పుకుంటూ పోతాడు. అదొక ప్రత్యేకమైన శైలియే,

స్కైకథలలోని పాత్రలెవరు? వారికి ఆ స్థితి ఎందుకు ప్రాప్తించింది? తమకు తెలియని చారిత్రకభారాన్ని మోస్తున్న ఈ మనుషులకు విముక్తి ఎప్పుడు- కథలన్నీ చదివాక పాఠకులకు ఈ సందేహం రావాలి. వస్తుంది.
***

ప్రతి సమాజమూ తనను తానొక రీతిలో నిర్వచించుకుంటుంది. ఆ నిర్వచనం ఆ సమాజపు యథాతథస్థితిలో ప్రయోజనాలున్నవారికి అనుగుణంగా ఉంటుంది.  ఆ స్థితిని మార్చడంలోనే ప్రయోజనం ఉన్నవారు, సమాజం గురించి భిన్న నిర్వచనాలు చేస్తారు. సమాజపు సారాన్ని వారెట్లా దర్శిస్తారో, దాన్నుంచి సమాజస్వభావాన్ని సూత్రీకరిస్తారు.  ఆ సూత్రీకరణలను, సమాజపు అధికారిక నిర్వచనం వెక్కిరిస్తుంది, విమర్శిస్తుంది. తిరస్కరిస్తుంది. ఈ సమాజం కులసమాజం అని కనుగొన్నవారిని కులవాదులంటుంది. కులభేదాలను వారే ప్రోత్సహిస్తున్నారంటుంది. వర్గసమాజం అని చెప్పినవారిని పట్టుకుని విచ్చిన్నవాదులంటుంది.  వారి కల్పనలో తప్ప వర్గాలనేవి లేవంటుంది.

మీరు వేరు, మేము వేరు - అని మహ్మదాలీ జిన్నా అని మొదటిసారి చెప్పినప్పుడు, భారతీయ సమాజానికి, జాతీయోద్యమానికి నాయకత్వ శ్రేణిలో ఉన్నవారు ఉలిక్కిపడ్డారు. కానీ, ఆ వేర్పాటును జిన్నా సృష్టించలేదని, కనిపిస్తున్న విభజననే ఆయన సూత్రీకరించారని గుర్తించలేపోయారు.  మీరూమేమూ వేరు వేరు అని చెప్పకుండానే, వేరువేరు పరిగణనలు దేశంలో ఆనాటికే స్థిరపడిపోయాయి.  అందుకు ప్రధాన కారణం హిందూ మెజారిటీవాదమని చెప్పలేము. నిజానికి, దేశంలోని మతమైనారిటీయేతర ప్రజలు, తమను తాము హిందువులుగా గుర్తించుకోవడం జాతీయోద్యమం కాలం నాటికి పూర్తి అయిందని చెప్పలేము. ఆ మాటకు వస్తే, ఇప్పటికీ పూర్తి అయిందని చెప్పలేము.

బ్రిటిష్‌ వలసపాలకులు భారతదేశంలో తమను స్థిరపరుచుకునే క్రమంలో, తమ పాలనకు హేతుబద్ధతను నిర్మించే ప్రయత్నమూ చేశారు. భారతీయ శిష్టవర్గాలలో ఆత్మన్యూనతాభావాన్ని కలిగించి, అవి అంతర్ముఖమయ్యేట్టు చేయడం ఒకటి, జాతీయోద్యమ సాంస్కృతిక ప్రాతిపదికలలో పాశ్చాత్యవ్యతిరేకత కాక, ముస్లిం వ్యతిరేకత బలపడేట్టు చేయడం మరొకటి. భారతీయుల అతిశయాన్ని సంతృప్తి పరచడానికి వేదకాలపు ప్రాచీనతను, తొలి సామ్రాజ్యాల కాలపు వైభవాన్ని ప్రచారం చేశారు. ఎంతో గొప్పగా ఉండిన భారతీయ జీవనాన్ని మధ్యయుగాల ముస్లిమ్‌పాలకులు ధ్వంసం చేశారని చరిత్రలు రాశారు. భారతీయ సాంస్కృతిక జాతీయవాదానికి పునాదులు వాటితోనే పడ్డాయి. ముస్లిమ్‌ రాజులను ఎదిరించినవారు, గెలిచినవారు, ఓడినవారు - అందరూ జాతీయప్రతీకలుగా మారిపోయారు. వలసపాలకుల ఆర్థిక, సాంస్కృతిక దోపిడి, అణచివేత నుంచి భారతీయుల జాతిభావన నిర్మితం కావలసి ఉండగా, విస్తృత ప్రజానీకాన్ని ఉద్వేగపూరిత భూమికలపై ఏకం చేయాలన్న ధోరణి మొదలైంది. 1857 ప్రథమ స్వాతంత్య్ర సమరం నుంచి బ్రిటిష్‌వారు తీసుకున్న గుణపాఠం హిందూ ముస్లిములను విడదీసే వ్యూహాన్ని రచించిందన్నది ఒక అవగాహన.  ఆ వ్యూహానికి జాతీయోద్యమకాలం నాటి ముస్లిములు నిస్సహాయంగా బలి అయ్యారా, తమ ఆమోదంతో కూడా సహకరించారా అన్నది చర్చనీయాంశం. ఒకవేళ, ముస్లిముల నాయకత్వం కూడా వేర్పాటు కోసం తొందరపడి ఉండే, దానికి కూడా భారత జాతీయోద్యమం ప్రధానస్రవంతిలో మెజారిటీ మతవాదం అవధులు మీరిపోవడమే కారణమయి ఉండాలి.

బ్రిటిష్‌వారి పాలన భారత దేశంలో స్థిరపడుతున్న దశలో, వలసవాద అభివృద్ధిలో తమ సొంత భవితవ్యాన్ని వెదుక్కోవాలనుకునేవారికి, తమ తమ సాంస్కృతిక సమాజాలలో అనేక  దురాచారాలు కనిపించాయి. ఆయా కులాలలో ఉన్న ఆచారాలను కొత్త వాతావరణంలో మదింపు వేసి, వాటిని తొలగించడానికి కొందరు ప్రయత్నించారు. దేశంలోని భిన్న కులాల  అంతస్థుల సంబంధం మీద కాక, సొంత కులాన్ని ఆధునీకరించుకోవడం మీదనే సంస్కర్తల దృష్టి.  దొంతరల సామాజిక వ్యవస్థ మీద తక్కిన సమకాలీన సంస్కర్తలందరి కంటె లోతైన అవగాహన, విమర్శ ఉన్నప్పటికీ, ఫూలే కూడా ఆచరణరంగంలో విద్యావకాశాలను అందరికీ అందరికీ అందించడం వంటి సంస్కార చర్యల మీదనే దృష్టి నిలిపారు. ముస్లిములలో కూడా ఆధునిక తరం 19-20 శతాబ్దాల సంధికాలంలో ప్రారంభమైంది. ఆ తరానికి చెందిన గొప్ప ఆధునికుడు, మేధావి జిన్నా. అనేక సామాజిక వర్గాలలో సంస్కరణలు తీసుకువచ్చిన మార్పులు, ఆధునికీకరణ ముస్లిం సమాజంలో కొనసాగకపోవడానికి- వారిలో చాలా తొందరలోనే భవిష్యత్తు గురించిన ఆందోళన మొదలు కావడమే. జాతీయోద్యమకాలంలోనే మెజారిటీ మతవర్గీయులకు లభిస్తున్న ప్రాధాన్యం, అవకాశాలు ముస్లిమ్‌ నాయకత్వానికి అర్థమయ్యాయి. ఉమ్మడి భారతదేశంలో, ప్రజాస్వామిక భారతంలో ముస్లిములు మైనారిటీ కావడం మార్చలేని వాస్తవం. అందుకని, ముస్లిములు మెజారిటీగా ఉండే భూభాగాన్ని సృష్టించుకోవడం మార్గం. ద్విజాతి సిద్ధాంతం- పాకిస్థాన్‌ భావన  ఆ ఆలోచన నుంచి వచ్చాయి.   పాకిస్థాన్‌ అవతరణ అయితే జరిగింది కానీ, గణనీయమైన సంఖ్యలో ముస్లిములు భారతదేశంలో ఉండిపోయారు, మైనారిటీలుగా.

అంటే జాతీయోద్యమంలో అంతర్భాగంగా జరగవలసిన సంఘసంస్కారం అసంపూర్తిగా మిగిలిపోగా, స్వాతంత్య్రానంతరం సరికొత్త బాధితఅస్తిత్వంలోకి ముస్లిములు వెళ్ళిపోయారు. మైనారిటీయేతర భారతీయులను హిందువీకరించే ప్రయత్నాలు స్వాతంత్య్రానంతరం ఉధృతమయ్యాయి. ముస్లిముల భాష పరాయిదైపోయింది. వారి మతవ్యక్తీకరణలు శాంతిభద్రతల సమస్య లయ్యాయి. వెనుకబాటుతనం జాలిపడవలసిన దుస్థితిగా కాక, ప్రమాదకరమైన ఛాందసం అయింది. 

బ్రిటిష్‌ పాలనలో లేదా నిజామ్‌ పాలనలో ఉన్న కాలంలో  ఉన్నపాటి ఆదరువు, మనుగడ 1947/48 తరువాత అంతరిస్తూ వచ్చాయి. తన నిరంకుశత్వంలోనే అయినప్పటికీ, హైదరాబాద్‌ను ఆధునికరాజ్యం చేద్దామనుకున్నాడు, ఏదో నిజాం. అతని తొలిసంవత్సరాలలో జరిగిన ప్రయత్నాలు హైదరాబాద్‌నే కాదు, హైదరాబాద్‌ రాజ్య  ముస్లింలను కూడా ఆధునికత బాటలోకి తెచ్చేవి. కానీ, 1930 దశకం మధ్య నుంచి బ్రిటిష్‌ ఇండియా రాజకీయాలు, ముస్లింలీగ్‌ ప్రభావం హైదరాబాద్‌పై పెరిగింది. నిజం చూస్తుండగానే మతవాదులు అధికారయంత్రాంగాన్ని కైవసం చేసుకున్నారు. రజాకార్ల ఘట్టం హైదరాబాదీ ముస్లిములను ఆధునికత నుంచి వెనుకడుగు వేయించగా, సైనికచర్య వారిని పూర్తిగా ఆరోవర్ణాన్ని చేసింది.

సాధారణంగా యుద్ధాలలో  గెలిచినవారు ఓడినవారిమీద, వారి ప్రజల మీద ప్రతీకారం తీర్చుకుంటారు. అదొక రాచయుగాల దుర్మార్గమే అయినా, అది ఇప్పటికీ, మారు రూపాలలో కొనసాగుతున్నది. 1857 తిరుగుబాటుకు ప్రతీకారాన్ని బ్రిటిషర్లు భారతదేశంలో ముస్లిములను ఒక వైరివర్గంగా రూపొందించడం ద్వారా తీర్చుకున్నారు.  1947లో వలసవాదులు ఖాళీ చేసి వెళ్ళిపోతే, ఆ విజయోత్సాహం సైతం ముస్లిములపై విజయంగా భ్రమింపజేసింది. 1948లో హైదరాబాద్‌పై సైనికచర్య అయితే, జనాభాలో ఒక వర్గాన్ని, పాలకుల మతవర్గాన్ని ద్వితీయశ్రేణి పాలితులుగా అణగార్చే కర్తవ్యాన్ని స్వీకరించి పూర్తి చేసింది.  హైదరాబాద్‌స్టేట్‌ ముస్లిముల అస్తిత్వం 1948 తరువాత సమూలంగా మారిపోయింది. నిజాం కాలంలో కూడా నిరుపేద ముస్లిములు లేరా, ప్రభుత్వం అణచివేతకు గురయిన ముస్లిములు లేరా అని ప్రశ్నింవచ్చు. కానీ, అస్తిత్వ సమస్య వేరు.  అది దారిద్య్రానికి సంబంధించిన విషయం కాదు. గౌరవప్రదమైన మనుగడకు సంబంధించిన విషయం.

బాబ్రీమసీదు విధ్వంసానికి ముందూ తరువాతా జరిగిన విషయాలే ముస్లిమ్‌ అస్తిత్వవేదనకు ఒక నిర్దిష్టరూపాన్నిచ్చాయా? స్త్రీ, దళిత, ఆదివాసీ, ప్రాంతీయ అస్తిత్వాల వంటిదేనా ముస్లిమ్‌ అస్తిత్వం కూడా? ఈ ప్రశ్నలకు ఖచ్చితమైన సమాధానాలు చెప్పడం కష్టం.  ముస్లిమ్‌ వాదం మతపరమైనది అయితే, ఇతర అస్తిత్వాల వలె సాంస్క­ృతికంగా, రాజకీయంగా అసెర్షన్‌ (విశ్వాసప్రకటన) చేసుకోగలదా?  స్త్రీలు, దళితులు, బహుజనులు- వీరందరికి చెందిన బాధిత అస్తిత్వం గురించి సాధారణస్థాయిలో ఆమోదం, సానుభూతి సమాజంలో ఉన్నాయి. కులాహంకారి, పురుషాహంకారి- తమ భావాలను బాహాటంగా ప్రకటించగలిగే సాహసం చేయలేరు. కానీ ముస్లిముల విషయంలో అటువంటి స్థితి ఉన్నదా? ముస్లిములు బాధితులు అనే అవగాహనకు సాధారణ ఆమోదం ఉన్నదా? ముస్లిములను నిందించి, విమర్శించడానికి జంకే వాతావరణం మన దగ్గర ఉన్నదా?

స్త్రీవిముక్తి, దళిత ఉద్యమం, ఆదివాసీహక్కులు వంటి వాటికి  జాతీయోద్యమానికి పూర్వం నుంచి ప్రాథమికమైన వ్యక్తీకరణలు కనిపిస్తుండగా, ముస్లింబాధిత అస్తిత్వానికి సంబంధించి (కనీసం తెలుగులో), రెండు-మూడు దశాబ్దాలుగా మాత్రమే వ్యక్తీకరణలు ఉన్నాయి. గతంలో ముస్లిమేతర రచయితలు ముస్లిముల స్థితిగతుల గురించి సానుభూతితో రాసిన ఉదాహరణలున్నాయి. ముస్లిమ్‌ రచయితలు ప్రధాన స్రవంతి పోకడలతో రాసి రాణించిన సందర్భాలున్నాయి. కానీ అవేవీ, అస్తిత్వ సాహిత్యపు కోవలోకి రావు.


బాబ్రీమసీదు విధ్వంసం ముస్లిముల ప్రత్యేక అస్తిత్వాన్ని దేశీయంగా రూపొందిస్తే, ఆప్ఘనిస్థాన్‌ నుంచి రష్యా ఉపసంహరణ, మొదటి గల్ఫ్‌ యుద్ధం అంతర్జాతీయంగా ముస్లిములను బాధిత, పోరాట అస్తిత్వంగా తీర్చిదిద్దింది. ప్రచ్ఛన్నయుద్ధం ముగియడమూ, ఈ అంతర్జాతీయ పరిణామాలు జరగడమూ దాదాపు ఒకే సమయంలో జరగడం యాదృచ్ఛికమేమీ కాదు. రెండు శిబిరాలుగాఉన్న ప్రపంచం ఏకధృవంగా మారిపోవడంతో, అమెరికన్‌ సామ్రాజ్యవాదులు ఒక భూభాగం అంటూ లేని విశ్వవ్యాప్త తిరుగుబాటుదారులను శత్రువుగా ఎంచుకున్నారు. బ్రిటిష్‌ వలసవాదుల కాలం నుంచీ, భౌగోళిక జాతీయతతో నిమిత్తం లేని పాన్‌-ఇస్లామిజం ముస్లిం సమాజాన్ని ప్రభావితం చేస్తూనే ఉన్నది. వర్తమానంలో ముస్లిమ్‌ పోరాటవాదం కూడా ఎల్లలు లేని లక్ష్యాలను, ఆచరణను పెట్టుకోవడం, ముస్లిములు పెద్దసంఖ్యలో నివసించే దేశాలన్నిటి పైనా ప్రభావం వేస్తున్నది.  ముస్లిములను బూచిగా చూపించి, స్థిరపడిపోయిన కాల్పనిక చరిత్రలను ఆసరాగా చేసుకుని, భారత్‌లోని మైనారిటీయేతర ప్రజానీకాన్ని ఏకం చేయడానికి  మతతత్వవాదులు చేసే ప్రయత్నాలు ఉధృతమయ్యాయి. భారత ప్రధానస్రవంతి సమాజమూ, సామ్రాజ్యవాదుల ప్రభావంలో ఉండే సమాజమూ ముస్లిముల విషయంలో ఒకేరకంగా వ్యవహరించడం- ముస్లిమ్‌ అస్తిత్వాన్ని ప్రమాదకరమైన సంక్లిష్టతలోకి నెట్టింది. తమ ఉనికిని, ప్రత్యేకతలను నిలబెట్టుకోవడానికి, తమ సాంస్క­ృతిక జీవితంలోని కాలంచెల్లిన విధానాలనే మరింత ఆలింగనం చేసుకోవడం అంతర్జాతీయ ముస్లిం సమాజంలో కనిపిస్తుంది. భారత్‌ విషయానికి వస్తే, ముస్లిముల సమాజంలో మరింత ఏకాకితనం బయటినుంచి లోపలినుంచి కూడా ఆవరిస్తోంది. వారితో లోపలినుంచి సంభాషించి, కొత్త తోవలలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు జరగాలి. జాతీయోద్యమకాలంలో ప్రారంభమై, స్వాతంత్య్రంతో నిలిచిపోయిన సంస్కరణ ప్రక్రియను విశ్వసనీయంగా, మిత్రత్వంతో నిర్వహించగలిగే నాయకత్వం కావాలి.

***

స్కైబాబా కథల్లో ముస్లిమ్‌ సమాజంలోని అంతర్గత, బాహ్య ఏకాకితనం గురించిన చిత్రణ ఉన్నది. తమ సమాజాన్ని అణగార్చుతున్న సామాజిక పరిణామాల గురించిన ఎరుక ఉన్నది. తమ ముందరికాళ్లకు బంధాలు వేస్తున్న అంతర్గత జడత్వం గురించిన స్ప­ృహా ఉన్నది. ముస్లిములు ఈ దేశంలో ఎవరితో కలసి సమీకరణం చెందాలో, ఎవరికి వ్యతిరేకంగా పోరాడాలో స్కైకు అవగాహన ఉన్నది. సమీకరణం చెందవలసివాళ్లలో సమభావనను ప్రేమించేవాళ్లందరూ ఉన్నారు. పోరాడవలసినవారిలో ఇంటా బయటా బంధనాలు విధించేవారందరూ ఉన్నారు.  
                                                                                      - 
(స్కై బాబా కథల సంపుటి 'అధూరే" కు రాసిన ముందుమాట)

2 comments:

  1. చాలా మంది (మీతో సహా) అస్తిత్వ వాదులకి వారి విశ్వాసాలతో సంబంధం, జ్ఞానం మీద కాక అనుభవం,ఉద్వేగాల మీదే ఆధారపడి ఉండడం గురించి కె.శ్రీనివాస్ గారు ప్రస్తావించారు...దానిని యధాతధంగా అంగీకరిస్తున్నారా?ఈ ముందు మాటలోని అనేక అంశాలని నిక్కచ్చిగా ప్రశ్నించిన జిలుకరకి కూడా ఇది అంగీకారమేనా?
    మల్లీశ్వరి.

    ReplyDelete
  2. అంగీకారం కాదు.. అలా వారు statement ఇవ్వడమూ సరి కాదు.. కేవలం జ్ఞానం మీద ఆధారపడి ఇన్నాళ్ళు సాహిత్యాన్ని ఏలిన ఆదిపత్యవాదులు, కాల్పనిక వాదులకు కొత్తగా వేర్ల దగ్గరి నుంచి మార్పు కోరుకుంటూ, వేర్ల దగ్గరి నుంచి నరుక్కుంటూ వస్తున్న అస్తిత్వవాదుల రచనలంటే కొంత తక్కువభావం ఉన్నది.. అలాంటి ధోరణి లోనిదే ఆ వాక్యం.. జ్ఞానం కంటే అనుభవమే గొప్పది అనేదానితో ఎవరికీ విభేదం ఉండదేమో.. కాకపోతే అనుభవానికి జ్ఞానం కూడా తోడైతే మరీ మంచిది. అలా అని జ్ఞానం లేకుండానే అనుభవం లోంచే గొప్ప రచనలు, పనులు చేసేవాళ్ళను ఎలా చూద్దాం?!

    ReplyDelete

మీ అభిప్రాయం తెలియజెయ్యండి