Wednesday, 28 December 2011

అవతలి గట్టు మీది చీకటి గురించి... - అఫ్సర్

నా కొత్త కథా సంపుటి "అధూరే" కి అఫ్సర్ ముందు మాట ఇది. "ఆంధ్రజ్యోతి" సాహిత్య అనుబంధం "వివిధ"లో కూడా ఇది అచ్చయ్యింది.
There is always the other side, always.
-Jean Rhys


సాధారణ తెలుగు కథ నించి తెలంగాణ కథని విడిగా ఎట్లా నిర్వచించుకోవాలనే సాంప్రదాయ విమర్శకుల సందిగ్థం తేలక ముందే, తెలంగాణ ముస్లిం కథకులు మరో కొత్త సవాలు మన ముందుకు తీసుకువస్తున్నారు. ఇప్పుడు ఇక తెలంగాణ కథని మాత్రమే కాకుండా, తెలంగాణ ముస్లిం కథని కూడా ఎట్లా విడిగా నిర్వచించుకోవాలో తేల్చుకోవాల్సిన అవసరం వస్తోంది. ఇది ఇప్పుడిప్పుడే తేలే సంగతి కాకపోవచ్చు, కానీ, ఈ చర్చ మొదలు కావాల్సిన అవసరం వుందని ఇటీవలి తెలంగాణ ముస్లిం కథలు వొత్తిడి పెడ్తున్నాయన్నది నిజం. అయితే, తెలంగాణ కథని నిర్వచించడం కంటే, తెలంగాణ ముస్లిం కథని నిర్వచించడం కష్ట తరం అన్న విషయాన్ని ముందుగా మనం గుర్తించాలి. తన లెజిటిమసీ కోసం తెలంగాణ కథకుల కంటే, తెలంగాణ ముస్లిం కథకులు ఎక్కువ సవాళ్లని ఎదుర్కోవాల్సి వుంటుందన్న సాహిత్య సామాజిక సాంస్కృతిక చేదు వాస్తవికతని కూడా మనం గుర్తించాలి.

ఈ సంపుటిలోని కథల్ని పునకథనం చేసి, వాటిని చేతులారా ఖననం చెయ్యడం కంటే - ఈ కథల రక్తమాంసాల్లోంచి, స్కై బాబా మౌలికంగా ప్రతిపాదిస్తున్న ముస్లిం సాంస్కృతిక చర్చకి తలుపు తీసే ప్రయత్నం ఈ నాలుగు మాటలు. ముఖ్యంగా, మూడు ప్రధానమయిన అంశాల చుట్టూ ఈ చర్చ జరగాల్సి వుంది. అందులో మొదటిది: మెజారిటీ సాహిత్యం అంటూ వొకటి వున్నప్పుడు అది నిర్మించి పెట్టిన మూసల్లో మైనారిటీ భావన ప్రతిఫలనాలు ఎట్లా సాహిత్యమవుతాయి? వాటి ప్రాతినిధ్యాన్ని ఎట్లా చూడాలి? ; రెండోది: వొక స్థానిక అంశంగా తెలంగాణ, అందులో ముస్లింల పాత్ర,; మూడోది: కథా వస్తువు- శిల్ప పరిధుల్లో ఆ రెండు అంశాలు ఎట్లా కలిసి పనిచేస్తాయి? కథా వస్తువులోనూ, శిల్పంలోనూ స్కైబాబా ఈ కథల్లో చేస్తున్న ప్రయత్నానికి ఈ మూడు అంశాల చుట్టరికం వుంది.

వాస్తవానికి సాహిత్య సంస్కృతిలో మెజారిటీ- మైనారిటీ అన్న భావన ఎలా పనిచేస్తుందో, దాని కదలికలు ఏమిటో ఇంకా మనకి వొక పూర్తి అవగాహన ఏర్పడలేదు. అసలు ఆ సామాజిక భావన సాహిత్యంలో నిజంగా పనిచేస్తుందా అన్న “సత్సంశయాలు” కూడా దురదృష్టవశాత్తూ కొందరిలో వున్నాయి. ఈ సత్సంశయాల మబ్బులు తొలగితే తప్ప, మెజారిటీ-మైనారిటీ అన్న భావన ఆచూకీ దొరకదు. సంవాద రూపంలో (discourse level) తెలుగు ముస్లిం రచయితలు తరవాతి దశలో మైనారిటీ అన్న “అధికారిక” భాషని వదిలించుకునే ప్రయత్నం చేసినా, సాంస్కృతిక రూపంగా మైనారిటీ అనే భావన పని చెయ్యక మానదు. సామాజికంగానే కాదు, సాంస్కృతికంగా కూడా అనేక విధాన నిర్ణయాలు ఈ చట్రంలోనే పని చేస్తాయి కనక. ఈ మైనారిటీ సాంస్కృతికత అనేది ఎట్లా నిర్మించబడుతుందో, ఎట్లా కొనసాగించబడుతుందో స్కైబాబా కథలకి ప్రధాన నేపధ్యం.

మిగిలిన అస్తిత్వాల కంటే ముస్లిం అస్తిత్వానికి కొంత అదనపు చరిత్ర వుంది. అంతర్జాతీయ స్థాయిలోనూ, జాతీయ స్థాయిలోనూ అది ఇస్లామిక్ అస్తిత్వ సమస్య అయితే, ప్రాంతీయ స్థాయిలో అంటే తెలుగు రాజకీయాల పరిధిలో అది తెలంగాణ అస్తిత్వంతో , ఆ పైన తెలంగాణ ముస్లిం రాజకీయ వునికితో, కొంత గత అధికార రాజకీయాలతో ముడిపడిన అస్తిత్వ సమస్య. ఇది మూడంచెల అణచివేత కింద నలుగుతున్న అస్తిత్వం. ముస్లిం లకి సంబంధించిన ఏ చర్చ అయినా, ఇలాంటి మూడంచెల అణచివేత సవాళ్లని ఎదుర్కొక తప్పడం లేదు. సమకాలీన రాజకీయ చర్చల్లో, సాంస్కృతిక సంవాదాల్లో ముస్లింలు ఇప్పటికీ అన్ని విధాలా పరాయీ వాళ్ళే. ముఖ్యంగా, తెలుగు సాహిత్య సాంస్కృతికతలో ఇంకా వాళ్ళ వాటా వాళ్ళకి దక్కనిచ్చే స్థితి లేనే లేదు. తెలంగాణ ముస్లిం కథకులు – ఈ పుస్తకం విషయానికి వస్తే స్కైబాబా లాంటి వొక తెలంగాణా ముస్లిం రచయిత - సంప్రదాయ తెలుగు కథావిమర్శ ప్రమాణాల బెంచ్ మార్కు దృష్ట్యా చూస్తే, తనని తాను వొక మంచి వచన రచయితగానో, కథకుడిగానో నిలబెట్టుకోవడానికీ ఇప్పుడున్న పరిస్తితుల్లో నరక యాతన పడాల్సిందే- దీనికి బలమయిన కారణం మొత్తంగా తెలంగాణా కథా సాహిత్యమే అనుభవిస్తున్న రెండు రకాల పీడన: సాహిత్య సాంస్కృతిక చరిత్ర, కథా శిల్పం పేరిట కనిపించని సంకెలల అధిక బరువు. ఈ రెండు రకాల బరువుల కింద నలిగిపోతూ తెలంగాణ ముస్లిం కథ ఇంకా తన సాహిత్య ఉనికికి తగ్గట్టుగా విమర్శ సాధనాలు సమకూర్చుకోవాల్సి వుంది. ఈ రెండు రకాల పీడనల్ని శక్తి మేరా వుపయోగించే ప్రధాన స్రవంతి – అలాంటిది వొకటి వుందని భ్రమింపజేసే- తెలుగు కథా సాంస్కృతికత స్కైబాబా కథలకి అంత తేలికగా రాజముద్ర వెయ్యదన్నది నిజం. బహుశా, ఇది స్కై బాబా వొక్కడి సమస్య కాదు, ఎక్కువగా తెలంగాణ కథకులకు, అంత కంటే మరీ ఎక్కువగా తెలంగాణా ముస్లిం కథకులకు వర్తించే విషయం.

ఈ నేపధ్యంలో స్కై బాబా కథా సంకలనం “అధూరే” వొక సాంస్కృతిక అస్తిత్వ ఘోష. సొంత గొంతు కోసం గొంతు చించుకునే ప్రయత్నం. ప్రధాన స్రవంతి రాజకీయ శిబిరాల పద్మవ్యూహంలోంచి సజీవంగా/ సశరీరంగా బయట పడాలన్న తీవ్ర వాంఛతో పెగలివస్తున్న కేక. ఆ కేక చరిత్రని వెతుక్కుంటూ, స్కైబాబా కథల్ని దగ్గిర పెట్టుకున్నప్పుడు, తెలంగాణా ముస్లిం కథ గురించి- కొంత దూరంగా -భవిష్యత్తులోకి ఆలోచించే ప్రయత్నం కూడా అవసరమే.
*
దృక్పథం వున్న ప్రతి రచయితా తన రచనలో కాలాన్ని పునర్నిర్మించుకుంటాడు. గతంలోకి వెళ్ళే ముందు ఆ గతం తన వర్తమానంలో, తన భవిష్యత్తులో ఎట్లా రూపాంతరం చెందుతుందో తరచి చూసుకుంటాడు. ఈ ధోరణి మైనారిటీ సాహిత్యంలో బలంగా కనిపిస్తుంది. మైనారిటీ సాహిత్యం అంటే కేవలం ముస్లిం సాహిత్యమే కాదు, ప్రధాన స్రవంతి-కేంద్రిత సాహిత్యంలో వోదగని ప్రతి ధోరణీ – ముఖ్యంగా స్త్రీ, దళిత, స్థానిక – సాహిత్యం కూడా. ఈ ధోరణి రచయితలు కాలాన్ని దర్శించే తీరు వాళ్ళు ఆధునికతని ఎట్లా నిర్వచించుకుంటారన్న పునాది మీద ఆధారపడి వుంటుంది. ఆధునికత చర్చలో కాలం పాత్రని తిరిగి నిర్వచిస్తూ, రచయితకి అది చరిత్రని సొంతం చేసుకునే (historical reclamation) ప్రక్రి య అంటాడు వాల్టర్ బెంజమిన్ “Thesis on the Philosophy of History” అనే ప్రసిద్ధ వ్యాసంలో(1968).

వర్తమానంలో నిలబడి గతాన్ని, అది సృష్టించే మిధ్యావాస్తవికతని గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తాడు ఈ చారిత్రక స్పృహ వున్న రచయిత. తన కాలంలో వున్న అన్ని గత వ్యక్తీకరణల్ని/ వాటి వర్తమాన వక్రీకరణల్ని విమర్శించడం ద్వారా మైనారిటీ రచయిత ఇంకో వర్తమానం నిర్మిస్తాడు. స్థానిక అస్తిత్వ పునర్నిర్మాణంలో ఇది చాలా అవసరమయిన సైద్ధాంతిక సాధనం. స్థానికతని సాహిత్యంలో బలమయిన భావనగా నిలబెడ్తున్న ఇప్పటి తెలంగాణ రచయితలు ముఖ్యంగా చేస్తున్న పని కూడా ఇదే. అయితే చరిత్ర మీద వున్నంత దృష్టి మనకి ఆ చరిత్రలో అంతర్భాగంగా పని చేసే ఈ కొత్త వాస్తవికత మీద కూడా వుంటే తెలంగాణ సాహిత్యం తొవ్వలే మారిపోతాయి.

చాలా మంది తెలంగాణ కథకుల మాదిరిగానే, స్కైబాబా కథా గతం , వర్తమానం కేవలం గత, వర్తమాన సమస్య కాదు, కేవలం సాహిత్య సమస్యా కాదు. ఈ సమస్య లోతుల్లోకి వెళ్లడానికి కొంత గతంలోకి వెళ్ళక తప్పదు. కొన్ని అసాహిత్య/ సాహిత్యేతర విషయాలూ చర్చించక తప్పదు. ఆ గతంలో తెలంగాణ కథ ఏమిటో, అందులో తెలంగాణ ముస్లిం ఎవరో కొంత వెతుక్కోవాలి.

పుట్టిన వెంటనే వలస వాద ఆధునికత చేత అపహరించబడిన శిశువు తెలుగు కథ. తెలుగు కథ పుట్టుకా పెరుగుదలా అంతా ఆ తరవాత వలస వాద పెంపుడు వారసత్వాల నించి మాత్రమే చూస్తూ వచ్చాం. ఆధునిక కథకి జన్మస్థలం కోస్తా తీరం వెంట చూపిస్తూ, ఆ స్థానికతలోని వలసవాద, లేదా ఆంగ్ల –కేంద్రిత మూలాల్లో తెలుగు కథని చరిత్రీకరించడంలోనే ఈ వారసత్వం దారి మళ్ళింది. తెల్ల వాళ్ళ పాద ధూళితో పావనం అయితే కానీ, మనకి సాంస్కృతిక చరిత్రా లేదు, సాహిత్య చరిత్రా లేకపోయింది. తెలుగు కథ ఇంగ్లీషు మూలాల్లోంచి పుట్టలేదనీ, దాని అసలు మూలం మన ఆదిమ సాహిత్య చరిత్రలో వుందని ఇప్పటికీ గుర్తించలేని స్థితిలోనే వున్నాం. దానికి ప్రధాన కారణం: బ్రిటిష్ ఆంధ్రా కథ వలసవాద ఆలోచనల్లోంచి, శిల్పంలోంచి నేరుగా దిగుమతి అయిన సరుకు.

అలాంటి దిగుమతిని సరుకుని ధిక్కరించడంతో మొదలయ్యింది తెలంగాణ కథా చరిత్ర . ఇటీవలి కాలంలో ముస్లిం రచయితలు తిరిగి ఆ చరిత్రలోకి ప్రయాణిస్తూ, ఆ సాంస్కృతిక వాస్తవికతని ఆవిష్కరిస్తూ వుండడంతో ఈ ధిక్కారానికి శక్తి తొడయ్యింది. ఉర్దూ అనేది రాజభాష కాదనీ, అది ప్రజల భాష అన్న గుర్తింపు కలిగించడం ద్వారా మాత్రమే ఈ సాంస్కృతిక చరిత్రకి న్యాయం జరుగుతుంది. ఈ చరిత్ర పునర్నిర్మాణం ప్రక్రియలో భాగంగానే స్కైబాబా గాని, ఇతర తెలంగాణ ముస్లిం రచయితలు గాని ఉర్దూ పదాల ద్వారా ఇప్పటి దాకా అస్పృశ్యంగా మిగిలిపోయిన ముస్లిం సాంస్కృతిక భావనలని తిరిగి వెతుక్కుంటున్నారు. తమ జీవితాల్లోని ఈ ముస్లింతనాన్ని ఆవిష్కరించే ముందు దానిని కప్పేస్తున్న/ లేదా ఇతరేతర సాధనాలతో దానిని అవాస్తవీకరిస్తున్న చరిత్రని reclaim చేసుకోవాల్సిన అవసరం ముస్లిం రచయితలకు వుంది. స్కైబాబా కథల్లో ఈ అవసరం భాషతో మొదలై, సామాజిక ఉద్యమాల పునర్ నిర్వచనం దాకా కొనసాగుతుంది. తెలుగు కథల్ని ఉర్దూ పదాల మాలిన్యం నించి కాపాడాలనుకునే వృధా ప్రయత్నంలో సంస్కృత దాస్యానికయినా వెనకాడని నవీన సాంప్రదాయ వాదులకి ఈ కథలు చదివీ చదవక ముందే వొక పెద్ద సవాల్ అవుతాయి; ఈ “తెలుగుర్దూ” భాష లేదంటే తురకం వినినంతనే మన conditioned చెవులకి అపచారమనిపిస్తుంది. అధికారిక భాష అనేది మన ఆలోచనల్ని ఎట్లాంటి చట్రాల్లో బంధించి పెడుతుందో, అట్లాంటి చట్రాల్ని పగలగొట్టే పనితో ఈ కథకుడి యాత్ర మొదలవుతుంది.
*
ఈ కథల సంపుటికి స్కై పెట్టుకున్న పేరు “అధూరే” అంటే “పూర్తి కానివి” అని అర్థం. పేరుకి తగ్గట్టుగానే, ఈ సంపుటిలో చాలా మటుకు కథలు జీవితాన్ని అంటిపెట్టుకుని వుండే వొక పూర్తికాని తనాన్ని చెప్పుకుంటూ వెళ్తాయి. ఈ కథల్లోని కొన్ని జీవితానుభవాలు నిజంగా పూర్తయ్యాయా అన్న సందేహంలో ‘ముగుస్తాయి.’ ఒక ముగింపు రాహిత్యం ప్రతి కథనీ, ఆ కథలోని పాత్రల్నీ, వాటి అనుభవాల్నీ వెంటాడుతుంది. కథలన్నీ చదివాక రచయిత ఈ కథలు చెప్పడానికి వాడిన రెండు భాషలు కూడా ఆ అనుభవాల భాషని విప్పలేకపోయాయన్న క్షోభ మనకి మిగుల్తుంది. కథ మళ్ళీ మొదటికి – అంటే భాషకి- వచ్చినట్టు మనకి అర్థమవుతుంది. ఈ కథలు తెలుగు కథ స్థాయి నించి తెలంగాణ కథకీ, అటు తరవాత తెలంగాణ ముస్లిం కథకీ పరిణతి చెండానికి వెనక ఈ రెండు అంశాలు – సాధారణ భాష, అనుభవ వాహిక- బలమయిన పునాదులు. ఈ పునాదులు రెండూ అసంపూర్ణంగా మిగిలి వున్నాయన్న అస్తిత్వ క్షోభని శీర్షికే చెబ్తుంది.

తెలంగాణ ముస్లిం అనుభవాన్ని తర్జుమా చేయగలిగే శక్తి ఈ సాధారణ భాషకి వుందా? అన్న శంకతో ఈ కథా రచయిత బయలుదేరుతాడు. ఇప్పటికే ఏర్పడి వున్న తెలుగు సాహిత్య భాష ఎంత వరకూ తెలంగాణ భాష అన్న సందేహమూ ఇందులో కలిసి వుంది. ఆ సాహిత్య భాష వైఫల్యాన్ని చెప్పాలన్న తపన శీర్షికలో వుంది, తరవాతి కథల్లో వర్ణనల్లోనూ, పాత్రల సంభాషణల్లోనూ అది కొనసాగి, పఠితని కాసేపు సందిగ్ధంలో పడవేస్తుంది. ఆ సందిగ్ధత అలవాటు పడిన కొద్ది సేపటికి ఇందులోని ముస్లిం జీవితం సందిగ్ధత రెండో దశకి తీసుకు వెళ్తుంది. మొత్తంగా తెలుగు ముస్లిం సాహిత్యం ముందు వున్న పెద్ద సాంస్కృతిక సమస్య – ఈ సందిగ్ధతతో సహా తన పాఠక వర్గాన్ని ఎట్లా సృష్టించుకోవాలా అన్నది. తెలుగు కథలకు ఇప్పటికే ఏర్పడి వున్న పాఠక వర్గం కాక, అదనంగా కొత్త పాఠకులని అందుకోవడానికి ఈ కథలు వుపయోగపడతాయి.

కానీ, స్కై బాబా ఈ కథల్లో కొన్ని సాంస్కృతిక సంక్లిష్టతల్ని ఒక శిల్ప విధానంతో తేలికగానే నెగ్గుకొచ్చాడు. కథల్లోని ఒక వర్ణనా సారళ్యం, ఒక విధమయిన understatement వ్యూహం, సూటిగా అనుభవంలోకి తీసుకు వెళ్ళే నిర్మాణ సౌందర్యం, అన్నిటికీ మించి ఇంతకు ముందు ఎక్కడా చెప్పబడని తాజా తనం.... వుస్మానియా బిస్కట్ తో ఇరానీ చాయి తాగినట్టుగా అనిపిస్తాయి. మొదటి కథ నించి చివరి కథ దాకా వెళ్లడానికి పఠితకి కొంత వ్యవధి పట్టినా సరే, ముస్లిం అనుభవంలోని సాధారణ అంశాలు, వర్తమాన అంశాలుగా నిలిచే వాటిని కథావస్తువుగా తీసుకోవడం ద్వారా, ఆ అంశాలు ఎంతో కొంత ముస్లిమేతర సమూహాలకి కూడా సమస్యలే అయి వుండడం వల్ల ఇందులోని పాత్రలు మనకి పూర్తి అపరిచితంగా మిగిలిపోయే స్థితి నించి తప్పించుకున్నాయి. అందుకే, ఈ కథల్లోని వర్తమానం పఠితకి వొక తక్షణ వాస్తవికత. పైకి, నిర్దిష్ట ముస్లిం సమస్యలుగా కనిపించేవి – ముఖ్యంగా ముహబ్బత్ కథలో సౌందర్య భావన, “చోటి బహెన్” లో బుర్ఖా, ‘మజ్బూర్” కథలోని గరీబీ, కబూతర్ కథలో ఆడపిల్ల తల్లి వేదన - లాంటివి సాధారణ వర్తమాన అంశాలు. వాటితో మమేకం కావడానికి పఠితకి “ముస్లిం” అనుభవం గాని, ఆ భాష గాని ఆటంకం కావు. ఇక, “దస్తర్” “వతన్” లాంటి కథలు నిర్దిష్టంగా ముస్లిం అనుభవాలు. ఈ రెండు రకాల అనుభవాల మధ్య పఠితని నడిపించడంలో స్కైబాబా సఫలమయ్యాడు. ఆ నడకలోనే ఈ కథల్ని తెలంగాణ ముస్లిం కథగా మలిచిన నేర్పు కూడా వుంది. ఇక ‘జీవం” లాంటి కథలు కొంత ప్రయోగాత్మకత కూడా తోడయి, రచయితలోని అస్తిత్వ వేదనకి సంబంధించిన స్పష్టతని చెప్తాయి.

ఈ కథల్లోని పాత్రలు మన మధ్యనే వుండి, మనకి తెలియకుండా మిగిలిపోతున్న వాళ్ళు. అనేక కారణాల వల్ల మన స్మృతిలోంచి జారిపోతున్న వాళ్ళు. “ముస్లిం’ అనే వర్గీకరణ కింద నలిగిపోతున్న వాళ్ళు. మతపరమయిన ఉనికీ, గుర్తింపూ ముస్లింలకి మాత్రమే పరిమితం కాకపోయినా, మన పక్కన ముస్లిం వున్నాడంటే “అమ్మో” కాస్త భయపడాలనో, జాగ్రత్తగా వుండాలనో అన్నట్టుగా అధికార రాజకీయ వ్యవస్థ వొక అసహజమయిన భయాన్ని నిర్మించింది. మిగిలిన ఈ కుల, మత అస్తిత్వాల్లోనూ లేని సమస్య ముస్లిం అనే వర్గీకరణ కింద సృష్టించబడింది. “దావా’ కథలో స్కైబాబా రాజ్యం సాధారణ స్థాయిలో ఎట్లా ప్రవర్తిస్తుందో చెప్పాడు కానీ, అది ముస్లిం పట్ల ఎట్లా ప్రవర్తిస్తుందో అన్న దాకా వెళ్ళలేదు. ఈ కథలో అట్లాంటి రాజకీయ కోణాలు అస్పృశ్యంగా వుండి పోయాయి. తనకి తెలియకుండానే, స్కైబాబా ఈ కథల్లో ముస్లిం సాంస్కృతికత మీద ఎక్కువ దృష్టి పెట్టినట్టుగా కనిపిస్తోంది. రోజు వారీ ముస్లిం బతుకు, అందులోని ‘దలిందరాగి’, ముస్లిం తల్లులూ, కొడుకులూ, కూతుళ్లూ, కొడళ్ళూ, మాయామయిపోతున్న ముస్లిం బహిరంగ సంస్కృతి, అనివార్యమవుతున్న వలసలూ వీటన్నిటి వెనకా వొక ముస్లిం అనుదిన సాంస్కృతిక వేదన వుంది. వొక విధంగా ముస్లిం ఫెమినిస్టు కోణాన్ని స్కై బాగా ప్రతిబింబించాడు. ఈ కథల్లో మిగతా వేరే కోణాలు వున్నప్పటికీ ఆ స్త్రీ స్వరంలోని తీవ్రతలో అవి కప్పడిపోయాయి. వొక పురుష రచయిత స్త్రీస్వరంతో అంత బలంగా మాట్లాడ్డం విశేషమే!

కానీ, మొత్తంగా ఈ కొత్త తరం ముస్లిం వేదనల పునాది ఇటీవలి మత రాజకీయాలలో వుందన్నది నా అభిప్రాయం. ఆ కోణం లోపించడం వల్ల ఈ కథలు ముస్లిం అనుభవపు అర్థ వలయాన్ని మాత్రమే చూపించినట్టయింది, ఆ రకంగా చూస్తే ఇందులో వున్న ముస్లిం అనుభవం ‘అధూరా”గా మిగిలిపోయిందనీ అనిపిస్తుంది. ఆ కోణం వైపు కూడా దృష్టి పెట్టి, ముస్లిం రాజకీయ కథలు కూడా రాసి, ఆ వలయాన్ని పూర్తి చెయ్యాల్సిన బాధ్యత స్కైబాబా వొక్కడి మీదే కాదు, తెలుగు-తెలంగాణ ముస్లిం రచయితలందరి మీదా వుంది.

Wednesday, 14 December 2011

మట్టి దుప్పటి



నా మరణవార్త వ్యాపించి అంతా మూగారు
వారి ఊసుల్లో నా గురించిన నిజాలు వింటున్నాను 
    ***
మిత్రులూ.. చుట్టాలూ చూసి పోతున్నారు
చివరి చూపు ఎంత బరువైనదో..!
    ***
ఒళ్లు తోమి తోమి స్నానం చేయించారు
చిన్నప్పుడు అమ్మొక్కత్తే అలా చేయించేది
    ***
వెల్లకిలా పడుకోబెట్టారు
పక్కకి ఒత్తిగిల్లడం ఇష్టమని చెబితే బాగుండు
    ***
అత్తరు బాగా పూస్తున్నారు
ఒంటి వాసనే ఇష్టపడేవాడినని ఎలా చెప్పను
    ***
గోడు గోడున ఏడుస్తున్నారు
ఏడిస్తే తట్టుకునేవాణ్ణి కానని అంతా మర్చిపోయారు
    ***
తెల్లని కఫన్‌ చుట్టారు
జీవితమంతా ఎన్ని రంగుల వెంట పరుగులెత్తానో..!
    ***
జనాజాకు భుజం పట్టడానికి పోటీపడుతున్నారు
తెలిసినవారో.. తెలియనివారో.. తేడా లేదు
    ***
నాకోసం ఇంట్లో శుభ్రమైన దుప్పటి ఉంచేవారు
ఇప్పుడు మట్టి దుప్పటి
    ***
ఈ మట్టిని ఎంతగా హింసించానో..
చివరికీ మట్టిలోకే ఇంకిపోయే మహద్భాగ్యం
    ***
పూలదుప్పటి కప్పారు
ఇహమో! పరమో! తెలీకుండా ఉన్నాను               

Thursday, 8 December 2011

ముస్లింవాద కవిత్వం పై ఒక సమావేశం


వరంగల్ జిల్లా జనగామ లో డిసెంబర్ 6 న ముస్లింవాద కవిత్వం పై ఒక సమావేశం ఏర్పాటు చేశారు. వక్తగా పాల్గొని 120 మినిట్స్ మాట్లాడాను.. వచ్చిన వాళ్ళు ముస్లిం పాలిటిక్స్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నట్లు ఫీలయ్యారు.. కొందరు ముస్లిం సామజిక ఉద్యమం అవసరమన్న నాతో ఏకీభవించారు.. వేదిక మీది సాదిక్ (ఎడమ) తను ఆ దిశగా ఉద్యమిస్తానని ముందుకొచ్చారు.. అనంతరం కవి సమ్మేళనం జరిగింది..

Sunday, 20 November 2011

గుజరాత్ ముస్లింలకు అండగా నిలుస్తున్న ధీరులకు మద్దతు తెలుపుదాం


సాహసమే సాక్షిగా...

గుజరాత్‌...అన్న మాట చెవిన పడితే చాలు! గోద్రా అనంతర హింసరచన గుర్తుకొస్తుంది!! మతోన్మాద శక్తుల పదఘట్టనలు వినిపిస్తాయి!!! గాంధీ పుట్టిన రాష్ట్రంలో గుంపులకొద్దీ గాడ్సేలు కనిపిస్తారు. అహింస, శాంతి, పరమత సహనం ప్రబోధించిన జాతిపిత జన్మస్థలం హింసకు పర్యాయపదంగా మారిపోవడం అగుపిస్తుంది. మైనార్టీలపై సాగిన నాటి మారణకాండను అడ్డుకుని ఆదుకోవాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్రమోడియే అందుకు వెన్నుదన్నుగా నిలిచారని తెల్సినప్పుడు మనసున్న ప్రతి హృదయం బాధతో మూల్గుతుంది. 'అందుకు బలమైన సాక్ష్యమిదుగో...' అంటూ పోలీసు అధికారి సంజీవ్‌భట్‌ తన బలమైన గొంతుకను వినిపించడం, సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసి ముఖ్యమంత్రికే సవాల్‌ విసరడం చిన్న విషయం కాదు. అందుకు పూనుకున్న సంజీవ్‌భట్‌ గుజరాత్‌ ప్రభుత్వం నుంచి ఎదురౌతున్న కక్ష సాధింపు చర్యలను ధైర్యంగా ఎదుర్కొంటున్నారు. ఆ వివరాలు ఈ వారం అట్టమీద కథలో....
ప్రఖ్యాత బాలీవుడ్‌ సినీ నిర్మాత మహేష్‌భట్‌ మాటల్లో చెప్పాలంటే 'సత్యం కోసం పోరాటం సాగిస్తున్న నిజమైన కథానాయకుడు సంజీవ్‌భట్‌'. ఆయన, ఆయన కుటుంబం సత్యం కోసమే పోరాటం సాగిస్తున్నారు. మోడీకి వ్యతిరేకంగా అఫిడవిట్‌ దాఖలు చేయగానే ఆయనపై కక్ష్యసాధింపులు మొదలయ్యాయి. ఉద్యోగం నుంచి తీసేశారు. జైలుకు పంపారు. మానసికంగా ఎంతో వేదనకు గురిచేశారు. ఎన్ని రకాల ఇబ్బందులు ఎదురైనా ఆయన అదరలేదు. బెదరలేదు. సాహసమే సాక్షిగా న్యాయ పోరాటం సాగిస్తున్నారు. పోలీసు అధికారుల సంఘంతో పాటు అనేక ప్రజాసంఘాలు కూడా ఆయనకు అండగా నిలిచాయి. జైలు నుంచి విడుదలై తన పోరాటాన్ని సాగిస్తున్న సంజీవ్‌భట్‌ 1963 డిసెంబర్‌ 21న ముంబయిలో జన్మించారు. అహ్మదాబాద్‌లోని సెయింట్‌ జేవియర్స్‌ ఉన్నత పాఠశాలలో చదువుకున్నారు. ఆ తర్వాత బొంబాయి ఐఐటిలో చేరారు. అక్కడ పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేశాక 1988లో ఇండియన్‌ పోలీసు సర్వీస్‌లో చేరారు. గుజరాత్‌ కేడర్‌లో నియమితులయ్యారు. సంజీవ్‌ గొప్ప అథ్లెట్‌ కూడా. పలు జిల్లాలు, పోలీసు కమిషనరేట్లు, విభాగాల్లో ఆయన 23 ఏళ్ల పాటు వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వహించారు. 1999-2002 మధ్యకాలంలో రాష్ట్ర ఇంటలిజెన్స్‌ బ్యూరో డిప్యూటీ ఇంటలిజెన్స్‌ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహించారు. డిప్యూటీ కమిషనర్‌గా ఆ సమయంలో గుజరాత్‌ అంతర్గత భద్రత గురించిన అన్ని విషయాలు ఆయన పర్యవేక్షించేవారు. సరిహద్దు భద్రత, తీరప్రాంత రక్షణ, గుజరాత్‌లోని కీలక కార్యాలయాలు, సంస్థల భద్రతను కూడా ఆయనే చూసేవారు. ముఖ్యమంత్రి భద్రతతో సహా అనేకమంది వివిఐపి భద్రతనూ పర్యవేక్షించేవారు. అంతేకాదు కేంద్ర నిఘా సంస్థలు, సైనిక బలగాలతో నిఘా సమాచారాన్ని అందిపుచ్చుకునేందుకు నోడల్‌ ఆఫీసర్‌ హోదాలోనూ పనిచేశారు.
2002 ఫిబ్రవరి 27న గోద్రా పట్టణంలో సబర్మతి ఎక్స్‌ప్రైస్‌ ఎస్‌-6 బోగీ తగలబడింది. 58 మంది విశ్వ హిందూ పరిషత్‌ కరసేవకులు చనిపోయారు. ముస్లింలే ఈ రైలును తగులబెట్టారన్న ఆరోపణలతో కమలదళాలు గుజరాత్‌లో రావణకాష్టం సృష్టించాయి. గోద్రా ఘటనలో 58 మంది మాత్రమే చనిపోగా.. పరివార్‌ శక్తులు సాగించిన మారణకాండలో వేలాది మంది ముస్లింలు హత్యకు గురయ్యారు. వేలాది మంది ఇళ్లు వదిలి వెళ్లిపోయారు. పోలీసు కాల్పుల్లోనే 200 మంది దాకా చనిపోయారు.
ఫిబ్రవరి 27న ఏం జరిగింది?

సంజీవ్‌ భట్‌ సుప్రీంకోర్టుకు దాదాపు 600 పేజీల సాక్ష్యాధార సహిత అఫిడవిట్‌ను దాఖలు చేశారు. సారాంశం ఇలా వుంది.

''గోద్రా ఘటన అనంతరం రాత్రి చాలా పొద్దుపోయాక ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ సీనియర్‌ అధికారులతో అత్యున్నత సమావేశం నిర్వహించారు. 'గోద్రా దుర్ఘటనపై హిందువులు ఆగ్రహంతో ఉన్నారు. వారి ఆగ్రహాన్ని వెళ్లగక్కనీయండి. మీరు పట్టించుకోవద్దు. చూసీచూడనట్టు వదిలేయండి' అని ముఖ్యమంత్రి మాకు ధర్మసందేశం ఇచ్చారు. ఆయన అనుచర అధికారులకు మోడీ ఆకాంక్ష ఏంటో అర్థమైంది. ఆ సమావేశానికి నేనూ వెళ్లాను. గోద్రా ఘటన అనంతర దారుణాలకు ముఖ్యమంత్రి, ఆయన సహచర మంత్రులు, ఇతర ప్రభుత్వాధినేతలు, పోలీసు ఉన్నతాధికారులకు ప్రమేయముంది. మాజీ మంత్రి హరేన్‌పాండ్య హత్యకు సంబంధించి నేను సేకరించిన సాక్ష్యాధారాలను ధ్వంసం చేయాల్సిందిగా మోడీ, హోంశాఖ మాజీ మంత్రి అమిత్‌షా ఒత్తిడి చేశారు. వారి మాట విననందుకు నన్ను వేధించారు. సబర్మతి జైలు అధిపతి స్థానం నుంచి తప్పించి రెండు నెలల పాటు ఏ శాఖకు మార్చకుండా వేధించారు''. (సంజీవ్‌భట్‌ అఫిడవిట్‌)

కుటుంబం కొండంత అండ


న్యాయం కోసం సంజీవ్‌భట్‌ సాగిస్తున్న పోరాటానికి ఆయన కుటుంబం కొండంత అండగా నిలుస్తోంది. ఆయనకు భార్య శ్వేత, కూతురు, కొడుకు ఉన్నారు. కూతురు ఎంబిబిఎస్‌ ఆఖరి సంవత్సరం చదువుతుండగా తనయుడు ఇంటర్‌ చదువుతున్నాడు. మాజీ మంత్రి హరేన్‌పాండ్య హత్య కేసుకు సంబంధించిన ఆధారాలను బయట పెట్టవద్దంటూ మోడీ సర్కార్‌ చేసిన ఒత్తిడిని లెక్కచేయకపోవడంతో 2003 నుంచి గుజరాత్‌ ప్రభుత్వం సంజీవ్‌పై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపణలున్నాయి. అప్పటి నుంచి ఎదురవుతున్న వేధింపులను సంజీవ్‌ కుటుంబం ఎదుర్కొంటోంది. ఈ ఏడాది సెప్టెంబర్‌ 30న సంజీవ్‌ భట్‌ను అరెస్టు చేసి, జైల్లో ఉండగానే ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఆయన భార్య, పిల్లలు ఏమాత్రం జంకలేదు. 'సరైన లక్ష్యంతో వెళ్తున్న అధికారి భార్యగా గర్విస్తున్నాను. ఎన్ని ఇబ్బందులొచ్చినా ఆయనకు మా సహకారం ఉంటుంది' అని సంజీవ్‌ భార్య శ్వేత అంటారు. మోడీ సర్కారు కక్షసాధింపు చర్యలతో తరచూ శాఖలు మార్చడం..బదిలీ చేయడం..లాంటి ఇబ్బందులన్నింటిని సంజీవ్‌ కుటుంబం భరిస్తూనే ఉంది. తమ పిల్లలు తండ్రిలానే చాలా ధైర్యవంతులని తనకు వారే అండగా నిలబడి ధైర్యం చెబుతున్నారని శ్వేత అంటారు. తమకు ఎదురవుతున్న ఇబ్బందులు, వేధింపులపై స్వచ్ఛంద సంస్థలతో కలిసి శ్వేత కూడా న్యాయపోరాటం సాగించారు. సంజీవ్‌ అరెస్టు తర్వాత ఆయనను వెంటనే విడుదల చేయాలంటూ ప్రదర్శనలు నిర్వహించారు. కేంద్ర హోంమంత్రి చిదంబరానికి, డిజిపికి పదేపదే లేఖలు రాసి శాంతియుత పోరాటం సాగించారు. వీరికి తోడుగా పలు స్వచ్ఛంద సంస్థలు, ప్రజాసంఘాలు, ఐపిఎస్‌ అధికారుల సంఘం బాసటగా నిలిచాయి. సంజీవ్‌ను విడుదల చేసేవరకు న్యాయపోరాటం సాగించాయి.

ఈ మారణకాండ జరిగినప్పుడు సంజీవ్‌ భట్‌ నోడల్‌ ఆఫీసర్‌గానే ఉన్నారు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని అత్యున్నత విభాగాలన్నింటితోనూ సంప్రదింపులు జరిపేవారు. ఆయా శాఖలు అంతరంగికంగా చర్చించే ఎంత రహస్య సున్నిత సమాచారమైనా భట్‌కు తెలిసేది. గోద్రా ఘటనకు దారితీసిన అసలు వాస్తవాలేంటి.. ఆ తర్వాత జరిగిన నరమేధం వెనుక దాగిన ప్రభుత్వ కుట్ర, అధికార నిర్లక్షానికి సంబంధించి తనకు తెలిసిన సమాచారమంతటిని పత్ర సహిత ఆధారాలతో సిట్‌కు అందజేశారు సంజీవ్‌. గుజరాత్‌ మత ఘర్షణల్లో ముఖ్యమంత్రి నరేంద్ర మోడి, ఆయన మంత్రులు, ఇతర ప్రభుత్వ పెద్దల పాత్రపై దర్యాప్తు చేపట్టిన జస్టిస్‌ నానావతి, జస్టిస్‌ మెహ్తా కమిషన్‌ ముందు భట్‌ హాజరై వివరించారు. అసలు నేరస్తులను బోనెక్కించాలన్ని తపనతో ఆయన తన పోరాటం సాగిస్తూనే ఉన్నారు. తాజాగా గత ఏప్రిల్‌లో సుప్రీంకోర్టుకు సంజీవ్‌భట్‌ ఓ అఫిడవిట్‌ దాఖలు చేశారు. కక్షసాధింపు చర్యలకు దిగిన మోడీ సర్కార్‌ చిన్న కేసులో ఇరికించి సెప్టెంబర్‌ 30 న అరెస్టు చేయించింది. ఆయన అఫిడవిట్‌కు దన్నుగా తన చేత మరో అఫిడవిట్‌ను బలవంతంగా దాఖలు చేయించారని సంజీవ్‌ డ్రైవర్‌గా వ్యవహరించిన పిసి కెడి పంత్‌ చేసిన ఫిర్యాదుతో సంజీవ్‌ను అరెస్టు చేసినట్లు మోడీ సర్కార్‌ చెబుతోంది. వాస్తవానికి గుజరాత్‌ మాజీ మంత్రి హరేన్‌పాండ్య హత్యకేసుకు సంబంధించి ప్రభుత్వంలోని కొందరు పెద్దల ప్రమేయముందంటూ.. అందుకు బలమైన సాక్ష్యాధారాలను పరిశీలించాల్సిందిగా అరెస్టుకు రెండు రోజుల ముందు అఫిడవిట్‌ దాఖలు చేశారు. అంటే అసలు కారణమేంటో ఇట్టే అర్థమైపోతుంది.
పోలీసు అత్యున్నత అధికారులు, మహేష్‌ భట్‌, అన్నా హజారే వంటి ప్రముఖులు భట్‌ అరెస్టును తీవ్రంగా ఖండించారు. ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సంస్థలు నిరసన ప్రదర్శనలు చేశాయి. తక్షణమే విడుదల చేయాలని సర్వత్రా డిమాండ్‌ వెల్లువెత్తింది. దీంతో ఆయనకు గత అక్టోబర్‌ 17న బెయిల్‌ మంజూరు చేసి విడుదల చేశారు. మోడీని క్రిమినల్‌గానే చూడాలని, సత్యం కోసం తన పోరాటం కొనసాగుతుందని విడుదల అనంతరం సంజీవ్‌ ప్రకటించారు.
నిలదీసేవారందరికీ వేధింపులే..
గోద్రా ఘటన తర్వాత తనను ఎవరు వేలేత్తి చూపినా ..మోడీ కక్ష సాధింపులతోనే సమాధానమిస్తున్నారు. వేధింపులతోనే బదులిస్తున్నారు. భట్‌ ఒక్కరే కాదు..ఎంతో మంది సీనియర్‌ పోలీసు అధికారులు, స్వచ్ఛంద కార్యకర్తలు ఆయన వేధింపులకు బలయ్యారు. పదవులు పోగొట్టుకున్నారు. రావాల్సిన ప్రమోషన్లు తొక్కిపెట్టారు. ఇలా మోడీ సర్కార్‌ వేధింపులు ఎదుర్కొన్న వారిలో పోలీసు అధికారులు రాహుల్‌శర్మ, ఆర్‌బి శ్రీకుమార్‌, స్వచ్ఛంద కార్యకర్తలు తీస్తా సెతల్వాద్‌, షకీల్‌ తర్మీజి ...ఇలా ఎంతోమంది ఉన్నారు.
తేల్చుకుందాం రా!

'నాకు నైతికత ఉంది అధికారం లేదు
నీకు అధికారం ఉంది నైతికత లేదు
నీకు నీవెంతో..నాకు నేనంతే
రాజీ పడే ప్రశ్నేలేదు
న్యాయపోరాటం మొదలైంది
తేల్చుకుందాం రా..
నా వద్ద సత్యముంది బలగం లేదు
నీకు బలగముంది సత్యం లేదు
నీకు నీవెంతో ..నాకు నేనంతే
రాజీ ప్రశ్నేలేదు
న్యాయపోరాటం మొదలైంది
తేల్చుకుందాం రా..
నీవు నన్ను చితకబాదొచ్చు
నేను పోరాడతాను
నా ఎముకలు విరగ్గొట్టొచ్చు
నేను పోరాడతాను
/*/*/
సజీవ సమాధి చేయొచ్చు
నేను పోరాడతాను
తుదిశ్వాస విడిచేదాకా
పోరాడతాను
అభాండాలతో నీవు నిర్మించిన అసత్యకోటను కూల్చేదాకా
నీవు కొలుస్తున్న సైతానును
నా సత్యదేవత నేలమట్టం చేసేదాకా
దేవుడు నిన్ను కరుణించుగాక
సత్యమేవ జయతే''
- సంజీవ్‌భట్

(నరేంద్ర మోడీకి సంజీవ్‌భట్‌ రాసిన లేఖాస్త్రం నుంచి)‌

రాహుల్‌ శర్మ : ఈయన డిఐజిగా ఉండేవారు. 2002 నరమేధం సమయంలో కొందమంది రాజకీయ నాయకులు, పోలీసు అధికారుల సంభాషణల రికార్డులను నానావతి కమిషన్‌కు, సిట్‌కు అందజేశారు. దీంతో మోడీ సర్కారుకు కోపం వచ్చింది. అధికార రహస్యాల చట్టం కింద చార్జిషీట్‌ దాఖలు చేసింది.
ఆర్‌బి శ్రీకుమార్‌ : ఈయన కూడా 2002లో ఇంటలిజెన్స్‌ బ్యూరోలో డిఐజిగా ఉండేవారు. గుజరాత్‌ మారణకాండ సమయంలో పోలీసులు బాధ్యతలు నిర్వర్తించకుండా ప్రభుత్వమే అడ్డుకుందని ఆరోపించారు. నానావతి కమిషన్‌ ఎదుట సాక్ష్యం కూడా చెప్పారు. దీంతో మోడీ ఆగ్రహానికి గురయ్యారు. రాష్ట్ర పోలీసు అధిపతిగా ప్రమోషన్‌ రావాల్సిన అతడికి ఆ పదవీ దక్కనీయకుండా చేశారు.
తీస్తా సెతల్వాద్‌ : మతోన్మాదంపై ఎనలేని పోరాటం చేస్తున్న తీస్తా సెతల్వాద్‌ ప్రముఖ పాత్రికేయులు, విద్యావేత్త, భారత తొలి అటార్నీ జర్నల్‌ ఎంసి సెతల్వాద్‌ మనవరాలు. గుజరాత్‌ నరమేధంపై కూడా రాజీలేని పోరాటం సాగిస్తున్నారు. బెస్ట్‌ బేకరీ కేసు, గుల్బర్గ హౌసింగ్‌ సొసైటీ కేసులో సాక్ష్యాధారాలు సేకరించి న్యాయస్థానాల ముందుంచుతున్నారు. సంజీవ్‌ భట్‌కు కూడా అండగా నిలబడ్డారు.
కోటి రూపాయలు కాలదన్నిన కర్కారే

ముంబయి ఉగ్రవాద నిరోధక సంస్థ (ఎటిఎస్‌) అధినేతగా హేమంత్‌ కర్కారే పనిచేశారు. ఉగ్రవాదులంటే కేవలం ముస్లింలే కాదంటూ మాలెగావ్‌ బాంబు పేలుళ్ల కేసులో సమగ్ర దర్యాప్తు సాగించి కాషాయ ఉగ్రవాదాన్ని ప్రపంచానికి చాటారు. ఆర్‌ఎస్‌ఎస్‌, విహెచ్‌పి వంటి కాషాయ సంస్థలతో ప్రత్యక్ష సంబంధాలున్న నేతలను ఈ కేసులో అరెస్టు చేశారు. చివరకు 2008లో నవంబర్‌ 26న ఉగ్రవాదులు ముంబయిలో సృష్టించిన నరమేధంలో వీరోచితంగా పోరాడి అసువులు బాసారు. మాలెగావ్‌ కేసు విచారణ సందర్భంలో కర్కారేపై ... సహచర కాషాయ నేతలతో పాటు ఆరోపణలు గుప్పించిన నరేంద్ర మోడీ కర్కారే మృతి పట్ల సంఘీభావం ప్రకటించి గొప్ప పేరు పొందాలని తహతహలాడారు. కర్కారే కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం అందజేసేందుకు యత్నించగా కర్కారే భార్య కవితా కర్కారే తిరస్కరించారు. 'రాజకీయ పరామర్శలు మాకొద్దు' అంటూ మతోన్మాద మోడీ మోహం మీద కొట్టారు. బిజెపి సీనియర్‌ నేత అద్వానీ సహా రాజకీయ నేతలు తమను పరామర్శించేందుకు ఆమె నిరాకరించారు.

ఇంతటి నరమేధం సృష్టించినా మోడీకి ఎన్నికల్లో విజయానికి ఇది అడ్డురాలేదు. మతవిద్వేష దుష్ప్రభావ ప్రయోజనాలతో అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా గెలుపొందుతున్నారు. అదే మతం మత్తులో దేశ ప్రధానిని కూడా అయిపోవాలని కలలు కంటున్న ఆయనకు పరిస్థితి అంత సానుకూలంగా ఏమీ లేదు. గుల్బర్గ సొసైటీ కేసులో సుప్రీంకోర్టు విచారణ అంశాన్ని దిగువ కోర్టుకే వదిలివేయడంతోనే అగ్నిపునీతుడయ్యాడని కమలనాథులు గొప్పలు చెప్పుకుంటున్నా..అది ఆయన సచ్ఛీలతకు ఇచ్చిన తీర్పు కాదు. దిగువ కోర్టు పరిధిలో ఉందికనుక ఆ కోర్టులోనే విచారణ సాగించమని అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అది. ఆ తీర్పును సానుకూలంగా మలుచుకునేందుకు నరేంద్రమోడీ పడరాని పాట్లు పడ్డాడు. పనిలో పనిగా సద్భావన దీక్షలు చేపట్టాడు. బిజెపి పార్టీ కార్యకర్తలుగా ఉన్న కొందరు ముస్లింలు అభిమానంతో తమ సాంప్రదాయ టోపీలు ధరించాల్సిందిగా మోడీని కోరితే ఆయన వాటిని తిరస్కరించి హిందూ దర్పం ఉట్టిపడేలా తలపాగా చుట్టుకొని కొత్త మత సామరస్యత చాటారు. మరోవైపు వివిధ సందర్భాల్లో ఆయనకు న్యాయస్థానాలు చుక్కలు చూపిస్తున్నాయి. ఒకప్పుడు తన సహచర మం**త్రులుగా ఉన్న మాయా కొద్నానీ అరెస్టయి పదవి పోగొట్టుకున్నారు. గోద్రా అనంతర మత ఘర్షణలకు సంబంధించి ఆమెకు ఈ శాస్తి జరిగింది. అలాగే ఆయన ప్రభుత్వంలో హోంశాఖ సహాయ కార్యదర్శిగా ఉన్న అమిత్‌షా సోహ్రబుద్దీన్‌, ఆయన భార్య కేసర్‌బీని, వారి మిత్రుడు తులసీరాం ప్రజాపతి హత్య కేసులో అరెస్టయి ప్రస్తుతం బెయిల్‌మీద గడుపుతున్నారు. ఇటీవలే 2002 గోద్రా అనంతరం జరిగిన సర్దార్‌పురా దారుణకాండ (33 మందిని సజీవ దహనం చేశారు) లో స్పెషల్‌ కోర్టు 73 మంది నిందితుల్లో 31 మందిని దోషులుగా తేల్చింది. వీరికి జీవిత ఖైదు వేశారు.
గుజరాత్‌ మారణకాండ టైమ్‌లైన్‌

2002 ఫిబ్రవరి 27 : గోద్రాలో సబర్మతి ఎక్స్‌ప్రెస్‌ ఎస్‌-6 బోగీని అల్లరిమూకలు తగులబెట్టడంతో 59 మంది చనిపోయారు. 1500 మందిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది.
ఫిబ్రవరి 28 - మార్చి 31, 2002 : గుజరాత్‌లో నరమేధం కొనసాగింది. ఎక్కడపడితే అక్కడ ముస్లింలు, ఇతర మైనార్టీలపై దాడులు జరిగాయి. 1200 మంది దాకా అమాయక ప్రజలు హత్యకు గురయ్యారు. వందలాది ప్రార్థనా స్థలాలు నేలమట్టమయ్యాయి.
మార్చి3, 2002 : గోద్రా రైలు తగులబెట్టిన ఘటనపై ఉగ్రవాద నిరోధక ఆర్డినెన్స్‌ (పోటో) కింద కేసు నమోదైంది.
మార్చి 6, 2002 : గుజరాత్‌ ప్రభుత్వం గోద్రా రైలు ఘటన, తర్వాత మారణకాండపైన దర్యాప్తు చేసేందుకు కమిషన్‌ ఆఫ్‌ ఎంక్వయిరీ చట్టం కింద దర్యాప్తు కమిషన్‌ను నియమించింది.
మార్చి 9,2002 : నిందితులందరిపైనా ఐపిసి 120 బి నేరపూరిత కుట్ర కేసును పోలీసులు నమోదు చేశారు.
మార్చి 25, 2002 : కేంద్ర ప్రభుత్య జోక్యంతో పోటో కేసును ఎత్తివేశారు.
మే 27, 2002 : 54 మందిపై ఛార్జిషీట్‌ నమోదు చేశారు.
ఫిబ్రవరి 18, 2003 : పార్లమెంటు ఆమోదంతో పోటో పునరుద్ధరించడంతో గోద్రా నిందితులపై మళ్లీ ఈ చట్టం కింద కేసు తిరగతోడారు.
నవంబర్‌ 21, 2003 : గోద్రా రైలు తగులపెట్టిన కేసు సహా అన్ని మత ఘర్షణల కేసుల జ్యుడీషియల్‌ విచారణపైనా సుప్రీం కోర్టు స్టే విధించింది.
సెప్టెంబర్‌ 4, 2004 : ఆర్జేడి నేత లాలూ ప్రసాద్‌యాదవ్‌ రైల్వేమంత్రిగా ఉన్న నాటి ఘటనపై కేంద్ర మంత్రిమండలి కొన్ని సందేహాలు లేవనెత్తడంతో సుప్రీంకోర్టు మాజీ జడ్జి యుసి బెనర్జీ నేతృత్వంలో ఓ కమిటీని నియమించారు.స
సెప్టెంబర్‌ 21 , 2004 : పోటోపై మరోమారు సమీక్షించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
జనవరి 17, 2005 : యుసి బెనర్జీ ప్రాథమిక నివేదిక సమర్పించారు. రైలులోని ఎస్‌-6 బోగీ ప్రమాదం కారణంగానే తగలబడి వుండవచ్చని పేర్కొంది. బయట వ్యక్తులెవరూ దీనిని తగులబెట్టలేదని నివేదించింది.
మే16, 2005 : యుపిఎ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పోటో చట్టాన్ని రద్దు చేసింది.
అక్టోబర్‌13, 2006 : యుసి బెనర్జీ కమిటీ నియామకం చెల్లదని గుజరాత్‌ హైకోర్టు తీర్పు ఇచ్చింది. నానావతి - షా కమిషన్‌ దర్యాప్తు చేస్తుండగా బెనర్జీ ఇచ్చిన దర్యాప్తు నివేదిక చెల్లదని పేర్కొంది.
మార్చి26 , 2008 : గోద్రా ఘటన, అనంతర మారణకాండకు సంబంధించిన కేసులపై దర్యాప్తునకు సుప్రీంకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) నియమించింది.
సెప్టెంబర్‌ 18, 2008 : నానావతి కమిషన్‌ తన నివేదిక అందజేసింది. గోద్రా ఘటన ముందస్తు ప్రణాళిక ప్రకారం జరిగనది, ఓ అల్లరిమూక తగులబెట్టిందని నివేదిక ఇచ్చింది.
ఫిబ్రవరి 12, 2009 : గోద్రా కేసులో పోటో చెల్లదన్న పోటో సమీక్ష కమిటీ నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది.
ఫిబ్రవరి 20, 2009 : గోద్రా, ఇతర మతకలహాల కేసుల విచారణపై విధించిన స్టేను సుప్రీం ఎత్తివేసింది. సిట్‌కు సిబిఐ మాజీ డైరెక్టర్‌ ఆర్‌కె రాఘవన్‌ నేతృత్వం వహించినప్పటి నుంచి విచారణ వేగం పుంజుకుంది.
జూన్‌ 1, 2009 : గోద్రా రైలు ఘటనపై సబర్మతి కేంద్ర కారాగారంలో విచారణ మొదలైంది.
మే 6, 2010 : గోద్రా సహా తొమ్మిది సున్నితమైన కేసుల్లో తీర్పు వెలువరించొద్దంటూ విచారణ కోర్టుకు సుప్రీం నిర్దేశించింది.
సెప్టెంబర్‌ 28, 2010 : విచారణ తుదకు చేరింది. సుప్రీం స్టే విధించినందున తీర్పు వెలువడలేదు.
జనవరి 18, 2011 : తీర్పులు వెలువరించడంపై విధించిన స్టే ను సుప్రీం ఎత్తివేసింది.
ఫిబ్రవరి 22, 2011 : గోద్రా ఘటనలో 63 మంది నిందితుల్లో 31 మందిని కోర్టు దోషులుగా తేల్చింది.
ఏప్రిల్‌ 22, 2011 : గోద్రా అనంతర మారణకాండలో మోడీకి సంబంధముందంటూ సీనియర్‌ పోలీసు అధికారి సంజీవ్‌ భట్‌ సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశారు.
సెప్టెంబర్‌ 27, 2011 : గుజరాత్‌ హైకోర్టులో సంజీవ్‌భట్‌ మరో అఫిడవిట్‌ దాఖలు చేశారు.
సెప్టెంబర్‌ 30 , 2011 : సంజీవ్‌ భట్‌ను ఓ చిన్న కేసులో అరెస్టు చేశారు.

అక్టోబర్‌ 17, 2011 : సంజీవ్‌ భట్‌ విడుదలయ్యారు.

న్యాయవ్యవస్థ మీద ప్రజల విశ్వాసాన్ని ఈ తీర్పు పెంపొందిస్తుందంటూ తీస్తా సెతల్వాద్‌ ఈ తీర్పును కొనియాడారు. 2002లో ఫిబ్రవరి 27న సమావేశం నిర్వహించినట్లు సంజీవ్‌ ఆరోపిస్తున్నారు. ఆ సమావేశం తర్వాత వివిధ పోలీసు స్టేషన్ల రోజ్‌నాంఛా (జనరల్‌ డైరీ) లోని వివరాలను బయటపెడితే విషయం తేలిపోతుంది. కానీ ఆ విషయాలను మోడీ సర్కారు బయటపెట్టడం లేదు. ఆవిధంగా సంజీవ్‌ భట్‌ సవాలును స్వీకరించి మోడీ తన మీద ఉన్న మచ్చను తొలగించుకునే అవకాశమున్నా వినియోగించుకోవడంలేదు. మానవ హక్కులను ఖననం చేసి తాను సాధిస్తున్న శాసన విజయాలనబడే మేలి ముసుగుతో అతని మతోన్మాద ముఖాన్ని ఏమాత్రమూ కప్పివుంచలేదు. మతోన్మాద విజయానందంలో బీరాలు పోతున్న నరేంద్ర మోడీపై ఏదో ఒక రోజు సత్యం విజయం సాగిస్తుందని సంజీవ్‌ భట్‌ నమ్మకం. సత్యం కోసం పోరాడుతున్న సంజీవ్‌భట్‌ విజయం సాధిస్తారనే ఆకాంక్షిద్దాం.
(ఈ ఆర్టికల్ ప్రజాశక్తి లో వచ్చింది)

Thursday, 3 November 2011

'వతన్' ముస్లిం కథల సంకలనం కోసం

'వతన్' ముస్లిం కథల సంకలనం కోసం 5 ఏళ్ళు ఎన్నో రకాలుగా కష్టపడవలసి వచ్చింది. మొదలు అలాంటి సంకలనం వేయాలనుకున్నప్పుడు రాస్తున్న ముస్లిం కథకులు ముగ్గురు నలుగురే.. ముస్లిం కవులందరికీ, రచయితలందరికీ ఉత్తరాలు రాసి కలిసి ముసిం కథలు రాయమని అడిగాను. ఒక 10 రోజులు రాష్ట్రం లోని ముస్లిం రచయిత లందరి దగ్గరికి తిరిగి వాళ్ళతో గడిపి వారి అనుభవాలు పంచుకొని వాటిల్లోంచి ముస్లిం కథలకు పనికొచ్చే సబ్జెక్టు ను discuss   చేయడం కూడా జరిగింది.. ఆ పైన ఉత్తరాలు, ఫోన్స్లలో వారి వెంటపడి రాయించడం జరిగింది.. ఒక్కో కథ వస్తుంటే చదివి మార్పులు చేర్పులు వారితో చర్చించడం.. ఎత్తి రాయించడం.. కొన్ని నేనే వారి అనుమతితో నేనే ఎడిట్ చేయడం.. ఇంకా కొత్త రచయితలను కనుగొనడం.. వారితో రాయించడం....


ఈ దశ లోనే 'మర్ఫా' ముస్లిం రిజర్వేషన్ మూవ్మెంట్ చేయవలసి వచ్చి అలా రాష్ట్ర మంతా తిరుగుతూ అక్కడ పరిచయమైన ముస్లిం ఆలోచనాపరులతోనూ రాయించాను.. వాటిని ఎడిట్ చేసి వేశాను..
మధ్యలో 2002 లో గుజరాత్ genoside జరగడం తో disturb   అయ్యి గుజరాత్ వెళ్లి వచ్చాను.. అన్వర్ తో కలిసి 'అజాన్' పేరుతో poetry సంకలనం చేశాను. ఈ దశలో 'వతన్' ఆగిపోయింది.. DTP చేసిన అతడు ఫైల్ అంత ఎగిరిపోయింది అని చేతులెత్తేశాడు.. అది ఒకింత నిరుత్సాహాన్ని కలిగించింది.. అయితే ఈ గ్యాప్ మరికొందరు ఈ సంకలనం లో చేర్చే అవకాశం కలిగించింది.. మొత్తంగా చూస్తే సంకలనం 400 pages వచ్చేలా ఉంది.. డబ్బులు చాలా అవుతున్నాయి.. దాంతో ఫాంట్ తగ్గించి 300  pages  వచ్చేలా చూశాను... ఆవిష్కరణ అనౌన్సు చేశాను.. సంకలనం తయారు కాలేదు.. ప్రూఫులు చూడడానికి కొందరు మిత్రులకు కొన్ని కథలు పంచాల్సి వచ్చింది.. చివరలో కొన్ని కథలు DTP చేయించడానికి ఒకరిని అర్జెంట్ గా ఏర్పాటు చేసుకోవాలి వచ్చింది.. రాత్రిం బవల్లు కష్టపడి మొత్తానికి సంకలనం ప్రింట్ కి ఇచ్చాను.. కాని పైసలు సరిపోను లేవు.. సభకు వచ్చిన smyle  లాంటి వారు కొన్ని డబ్బులు ఇస్తే 8  వేలు తీసుకొని ఆర్టిస్ట్ akber ను వెంట తీసుకొని ప్రెస్ కి వెళ్లి మిగతా డబ్బులు మిగతా పుస్తకాలు తీసుకొనే తప్పుడు ఇస్తానని చెప్పి 100  పుస్తకాలు తీసుకొన్నాం. ఆ పుస్తకాన్ని చేతిలోకి తీసుకోగానే నా కళ్ళల్లో గిర్రున కన్నీళ్లు తిరిగాయి.. ఎంత కష్టపడితే ఈ సంకలనం ఇలా బయటికి వచ్చింది కదా అనిపించింది.. 
వేసింది 800 కాపీలే. 38000 అయ్యాయి.. మిగతా 30000 వేలకోసం ఆవిష్కరణ తరువాత కూడా ౧౦ రోజులు ఎందరి దగ్గరికో తిరిగి పుస్తకాలు అమ్మి.. కొందరి ఆర్ధిక సాయం తో  డబ్బులు పూడ్చ గలిగాను.. అప్పటికీ ఒక మూడు వేలు ప్రెస్ వాళ్లకి ఇవ్వలేకపోయాను.. పుస్తకాలు ప్రెస్ లోంచి తీసుకోడం లేట్ అయ్యేసరికి ఆ బుక్ విలువ తెలిసి ప్రెస్ కి వచ్చిన వాళ్ళు ఎన్నో బుక్స్ పట్టుకెళ్లారు .. 
సరే.. ఈ పుస్తకం రావడం తో ఒక్కసారిగా తెలుగు సాహిత్యం లో ముస్లింవాదం స్థితే మారిపోయింది... ముస్లింవాదం స్థిరపడిందనీ చెప్పొచ్చు.. మంచి reviews వచ్చాయి.. కే.శ్రీనివాస్, సింగమనేని నారాయణ, ముదిగంటి సుజాతారెడ్డి లాంటివారు పెద్ద reviews   చేశారు.. ఇప్పుడు విశ్వవిద్యాలయాల్లో ముస్లిం కథలపై M.Phil., Ph.D. లు జరుగుతున్నాయి. బుక్ మార్కెట్ లో ఉండాలని ముఖ్యులంత కోరుతున్నారు.. కాని మళ్ళి అంత కష్టం ఎంత కష్టం..! 
ఈ సంకలనం వచ్చాక ముస్లిం కథల వ్యక్తీకరణ మారింది. స్పష్టత వచ్చింది.. మన మధ్యే ఉన్న మరో లోకాన్ని చూపిన సంకలనం గా దీనికి పేరొచ్చింది.. ముస్లిం కథకులు పెరిగారు.. 
ఇందులో రహమతుల్ల, ఖాజా, సలీం, అఫ్సర్, ఇక్బాల్, ఖదీర్బాబు, నేను, షాజహానా, దాదాహయత్, షేక్ హుసేన్ సత్యాగ్ని, శశిశ్రీ లాంటి ప్రముఖులతో పాటు షరీఫ్ లాంటి నేటితరం రచయితల దాక మొత్తం 40 మంది ముస్లిం కథకుల 52 కథలు ఉన్నాయి..  
(మళ్ళి ఒకసారి మరికొంత చెబుతాను)

Sunday, 23 October 2011

ముస్లింవాద స్పష్టరూపం స్కైబాబ ‘రెహల్‌’

(ఇవాళ 'సూర్య' దినపత్రిక లో వచ్చిన వ్యాసం)
శీర్షిక చూడగానే ఇస్లాం విశిష్ఠతో, ఖురాన్‌ ప్రాశస్త్యమో వస్తువు కావచ్చునని అనుకునే అవకాశముంది. వస్తువును సూటిగా చెప్పని శీర్షికను ఎన్నుకోవటం, వస్తువుకు సుదూరమైన అంశాన్ని శీర్షికగా నిలపటం, శీర్షికకు అసంబద్ధమైన వాక్యాలతో కవితను ఆరంభించటం మొదలైనవి పాఠకుడిలో ఆసక్తిని ఇనుమడింపజేసే వ్యూహాలు.ఈ కవితా శీర్షిక ఎత్తుగడ కూడా అలాంటి ఒక వ్యూహమే.

skybaa-articlముస్లిం మైనారిటీ వాదం ఒక స్పష్ట రూపం సంతరించుకోవడంలో ఇతరులతో పాటు కవిగా, సంపాదకుడిగా, కార్యకర్తగా  స్కైబాబ కృషి అవిస్మరణీయం. ఈ వాదం తొలి దశలో స్కైబాబ రాసిన కవితలలో దాని రూపాంతరం ‘రెహాల్‌’ ఒకటి. నిజానికిది ‘రెహల్‌’. దీని రూపాంతరం ‘రిహల్‌’. పవిత్ర గ్రంథాన్ని ఉంచే పీఠం (వ్యాస పీఠం) అని అర్థం. శీర్షిక చూడగానే ఇస్లాం విశిష్ఠతో, ఖురాన్‌ ప్రాశస్త్యమో వస్తువు కావచ్చునని అనుకునే అవకాశముంది. వస్తువును సూటిగా చెప్పని శీర్షికను ఎన్నుకోవటం, వస్తువుకు సుదూరమైన అంశాన్ని శీర్షికగా నిలపటం, శీర్షికకు అసంబద్ధమైన వాక్యాలతో కవితను ఆరంభించటం మొదలైనవి పాఠకుడిలో ఆసక్తిని ఇనుమడింపజేసే వ్యూహాలు. ఈ కవితా శీర్షిక ఎత్తుగడ కూడా అలాంటి ఒక వ్యూహమే.

‘‘కన్నీటి దారాల్తో జీవన వస్త్రానికి మాసికలేస్తూ/ తరాల చీకటి కమ్మేసిన గోషాలో/ పాలిపోయిన చంద్రశిలా దేహంతో/ అనుక్షణం/ ‘బిస్మిల్లా ఇర్రహ్మా నిర్రహీమ్‌’ అనే కదులుతుంది అమ్మీజాన్‌’’.
మొదటి పంక్తి దారిద్య్రాన్ని, రెండో పంక్తి మత సంప్రదాయాలు, కట్టుబాట్ల వల్ల కలుగుతున్న దుఃఖాన్ని సూచిస్తాయి. ఈ రెండింటి ఫలితం ‘పాలిపోవటం’. ‘బిస్మిల్లా ఇర్రహ్మా నిర్రహీమ్‌’ అంటే ‘దయామయుడైన కృపా హృదయుడైన అల్లా పేరుతో ఆరంభిస్తున్నాను’ అని అర్థం (ఈ భావానికి సంఖ్యా రూపమైన సంకేతమే ‘786’). ప్రతి పనిని ఆరంభించే ముందు చేసే దైవనామస్మరణ అన్నమాట. ఒకవైపు లేమివల్ల, మరోవైపు మత నియమాల వల్ల ఎన్ని ఇబ్బందులెదురైనా ఆమె అల్లా పట్ల విశ్వాసంతోనే చరిస్తున్నదని సారాంశం.

మొదటి పంక్తిలోని ‘కన్నీటి దారాలు’ అనే అచ్చ తెలుగు రూపకం ‘జీవన వస్త్రం’ అనే సంస్కృత రూపకం వెంట వెంట ప్రయోగించడంలో ఉన్న ‘భేదకత’ గమనింపదగినది. తెలుగు, సంస్కృత రూపక సమాసాలతో కూడిన రూపకాలంకారమిది. వస్తువులోని వైరుద్ధ్యాలకు దీనిని ఆలంకారికమైన సూచనగా భావింపవచ్చునేమో! ‘చంద్ర శిలా దేహం’ అనే సంస్కృత సమాసం ఆమె శరీర ఛాయను తెలుపడంతో పాటు, దేహాంతరంగాలకు ఒక ఉదాత్తతను ఆపాదింప జేస్తున్నది. ‘గోషా’ అనే ఆమె ఉడుపులోని వర్ణమే చీకటికి పోలిక. అనేక తరాలుగా ముస్లిం స్ర్తీలు గోషా వల్ల అనుభవించిన అంతర్గత వేదనకు తన తల్లి గోషాను ప్రతీకగా చెబుతున్నాడు కవి. అనేక తరాల చీకటి కమ్మినప్పుడు- ఒక్కనాటి (రాత్రి) చంద్రుడు ఎదుర్కొనలేక ‘పాలిపోవటం’ అతిశయోక్తి కాదు. ‘కదులుతుంది’ అనే క్రియ పక్కన చేర్చడం వలన కవితలో ‘అమ్మీ జాన్‌’కు ప్రాధాన్యం వచ్చింది.

skybaabajpjFinal‘... నమాజ్‌ చదువుతున్నప్పుడు.../ మెరుపు వెలిసిన అమ్మీ దోసిలలో/ రాలిన కన్నీటి తడిపై/ ఏ దేవుడూ సాక్షాత్కరించడు/ ఒక అపనమ్మకాల బొమికల గూడు ప్రతిబింబిస్తుంది’. మెరుపు వెలిసిన దోసిలి, పాలిపోయిన దేహాన్ని గుర్తు చేస్తుంది. ఎంత ప్రార్ధించినా దేవుడు కరుణించడం లేదని, క్రమంగా మనస్సులోని ‘విశ్వాసమే’ మసకబారుతున్నదని తాత్పర్యం.‘అస్తమయం వైపుకు మోకరిల్లి ప్రార్ధిస్తూ/ మా జిందగీల్లో సూర్యోదయమౌతుందనుకుంటుంది అమ్మీ’- ఇది అర్థమవంతమైన ‘విరోధాభాస’. ఉదయానికి వ్యతిరేకమైన ‘అస్తమయం’ ఇక్కడ సార్థక ప్రయోగం. ‘పడమరవైపు’, ‘పశ్చిమ దిక్కు’, ‘కాబావైపు’ లాంటి ఏ పదాన్ని వాడినా ఈ చమత్కారం ఉండదు.

‘మా కోసం ‘దువా’ చేసి చేసి/ అమ్మీ గొంతు తడారిపోతుందే తప్ప../ ముందు కూర్చున్న నీడ విస్తరించి/ కటికి  రాత్రై పరచుకుంటుందే తప్ప...’!పశ్చిమాభిముఖులై ప్రార్థిస్తారు కనుక ఫజర్‌, జొహార్‌ అనే ఉదయ, మధ్యాహ్న ప్రార్థనల్లో (కూర్చుని దువా చేసేటప్పుడు) నీడ ముందు కూర్చున్నట్లే ఉంటుంది. ముందున్న ఆమె నీడే సాంద్రతిమిరంగా పరచుకున్నదేమో అన్నట్లున్నదంటూ కారణం కాని దాన్ని కారణంగా ఊహిస్తాడు (ఉత్ప్రేక్ష). కటికి  రాత్రి, కటికి  చీకటి అనాలి. ‘కటికి’ అంటే అధికం, కఠినం, సాంద్రం అని అర్థాలున్నాయి. అది అలా ఉంచితే- ‘తడారిపోతుందే తప్ప...’, ‘పరచుకుంటుందే తప్ప...’ అంటూ అర్థాంతరంగా, అసంపూర్ణంగా వాక్యాలను వదిలేసి, తాను కోరుకుంటున్నది ఏది జరగడం లేదో దానిని పాఠకుల ఊహకే వదిలేశాడు. ఆవేశం, ఉద్వేగం, కోపం, దుఃఖం మొదలైన మానసిక స్థితులలో వాక్యాన్ని పూర్తి చేయలేక హఠాత్తుగా ఆపేయడాన్నిఆంగ్లకవిత్వ పరిభాషలో‘అపోసయ్యొపీసిస్‌’(Aposiopesis ) అంటారు. 'Aposiopesis (bicoming silent) is a figure of speech wherein a sentence is deliberately broken off and left unfinished, the ending to be supplied by the imagination, giving an impression of unwillingness or inability to continue.' (see: wikipedia- Literary terms)

jagne-ki-raat‘తల్లిపాదాల వద్ద స్వర్గం ఉందంటారు/ మా అమ్మీ పాదాలపై వంగిన ప్రతిసారీ/ చెమరిన నా చూపు/ ఆమె పాదాల పగుళ్ళలో చిక్కుకుని గిలగిలలాడుతుంది’. ఆమె పాదాలను చూడడంతోనే చెమ్మగిల్లిన చూపు పాదాల పగుళ్ళు కనిపంచగానే ఇంకెంత తల్లడిల్లుతుందో ఊహించుకోవచ్చు. ‘చూపు’కు ప్రాణి లక్షణారోపణ ద్వారా క్లుప్తంగా, గుప్తంగా దయనీయ హృదయ వేదన వ్యక్త మయింది. తల్లి పాదాల వద్ద స్వర్గం లేకపోగా పాదాలలోనే బీటలు ఉన్నాయన్నది వ్యంగ్యం.‘అబ్బాజాన్‌ అసహాయత చెల్లిని ఎవడికో/ రెండో పెళ్ళాంగా అంటగడితే/ ఆ చిట్టి తల్లి కళ్ళల్లో ఉబికిన కన్నీళ్ళ మీద/ వణికే దృశ్యమై తల్లడిల్లుతుంది అమ్మే’. చెల్లిని ఎవడికో రెండో పెళ్ళాంగా అంటగట్టింది అబ్బాజాన్‌ కాదు, ఆయన ‘అసహాయత’ అని గమనించాలి.
ఈ అసహాయతకు మూలమైన ఆర్థిక, ఆర్థికేతర కారణాలను తెలుసుకోవడం కష్టం కాదు. చెల్లెలి కన్నీళ్ళ మీద వణికే దృశ్యమై అమ్మ తల్లడిల్లే దృశ్యానికి, అమ్మీ దోసిలిలోని కన్నీటి తడిపై ఏ దేవుడూ సాక్షాత్కరించకపోవటం అనే మొదటి దృశ్యానికి అంతర్గత సంబంధమున్నది. ఒకేరకమైన పోలికలతో భిన్న దృశ్యాలను సృష్టించి, భిన్న ప్రయోజనాలను కవి సాధించాడు. తన దోసిలిలోని కన్నీటి తడిలో ఏ దేవుడూ సాక్షాత్కరించకపోగా, తన కూతురి కన్నీళ్ళలో తానే తల్లడిల్లుతూ వణుకుతున్న దృశ్యంగా మిగలడంలో నిస్సహాయత, దైన్యం ధ్వనించాయి.

‘కాన్వెంట్‌కు బదులు కార్ఖానాకెళ్ళే తమ్ముడు/ సాయంత్రానికి కమలిన దేహంతో అల్లుకుపోతే/ పగిలిన లేత స్వప్నం గుచ్చుకొని విలవిల్లాడేది అమ్మే’- కాన్వెంట్‌కు బదులు తమ్ముడు కార్ఖానాకెళ్ళాల్సి రావడం వెనుక ఉన్నది కూడ అబ్బాజాన్‌ ‘అసహాయతే’. కూతురి దీనస్థితికి, కొడుకు బాలకార్మికుడిగా మారవలసిన దుస్థితికి మొదట తల్లడిల్లేది, విలవిల్లాడేది అమ్మే అనేది సారాంశం.‘కడుపులో మా భారాన్ని మోసి/ కష్టాల మా బాధ్యతలు మోసి/ కళ్ళ గుమ్మానికి కట్టిన పరదాల వెనుక పాతివ్రత్యాన్ని మోసి/ తన కనుబొమ్మల నెలవంకల మీద/ చీకటి రాశుల్ని మోస్తున్న అమ్మ/ చివరకు ఖురాన్‌ను మోసే ‘రెహాల్‌’లా మిగిలిపోవలసిందేనా’?- ఒక తూగు కలిగిన వాక్యాంశాల్ని వరుసగా పేర్చి, కవి తన ఆవేశాన్ని వ్యక్తీకరించాడు. ఉద్వేగాన్ని చేకూర్చాడు.

పరుషాలలోని ఆద్యక్షరమైన ‘క’ కారం తొలి నాలుగు పాదాలలో పలుమార్లు ఆవృత్తం కావడం వలన కవి దృష్టికోణానికి తగిన పారుష్యం చేకూరిందనిపిస్తుంది. కనుబొమలను ధనస్సుతో పోల్చడం తెలుగు కావ్య సంప్రదాయం. ‘కనుబొమల నెలవంకల మీద చీకటి రాశుల్ని మోయడం’ అనే మాటలు- ‘తరాల చీకటి కమ్మేసిన గోషా’ అనే ఈ కవితలోని తొలి దృశ్యంతో అనుసంధిస్తాయి. నెలవంక అనే పోలిక ద్వారా భంగ్యంతరంగా ఇస్లాం మత సంకేతాలైన చాంద్‌ తారలు స్ఫురిస్తాయి. కాలానుగుణంగా ఆచార సంప్రదాయాలలో మార్పులను అంగీకరించని ‘ధర్మాల’ను మోస్తూ అనామకంగా అణగారుతున్న అమ్మను ‘రెహల్‌’తో పోల్చాడు.

‘రెహల్‌’ దివ్యత్వానికి, పవిత్రతకు సంకేతమవుతూనే మరోవైపు మరో అంశాన్ని కాపాడుతూ, దానికి మరింత గౌరవాన్ని కలిగిస్తూ తాను అనామకంగా మిగిలిపోవడానికి ప్రతీకగా నిలచింది. ఒక ముస్లిం తల్లి జీవితం ఛిద్రం కావడానికి దారిద్య్రం, కఠినమైన మత ధర్మాలే కారణాలని సై్కబాబా ఈ కవితలో సూచించాడు. కవితలో ఆద్యంతం ఆ రెండింటిని సమాంతరంగా ధ్వనిస్తూ వచ్చాడు.ముస్లిం స్ర్తీ కంఠ స్వరంతోనే 
స్కైబాబ రాసిన మరో కవిత ‘సాంబా’. ఆ కవితలోని ‘నేను నేనుగా కాదు/ ఒక మతానికి చిహ్నమై ఆరిపోతున్నానే...’ అనే మాటలను ప్రస్తుత కవితలోని ముగింపుకు అన్వయించుకుంటే కవి ఉద్దేశం మరింత స్పష్టమవుతుంది. ‘బిస్మిల్లా...’, వజా, మోకరిల్లి ప్రార్ధించడం, దువా అనే అంశాల క్రమపరిణామంలో చివరకు ఖురాన్‌ను ప్రస్తావించి, తద్వారా ‘రెహల్‌’తో పోలిక చెప్పాడు.

pamakrishnaసాకారాలను (concrete) సాకారాలతో పోల్చడం కంటే, సాకారాలను నిరాకారాల (abstract))తో, నిరాకారాలను సాకారాలతో పోల్చడం వల్ల భావసాంద్రత వస్తుంది. జీవన శాస్త్రం, వేలాడుతున్న నైరాశ్యం, అపనమ్మకాల బొమికల గూడు, పగిలిన లేత స్వప్నం, చీకటిరాశులు- మొదలైన అన్ని సమాసాల్లో నిరాకారాలను, సాకారాలతో పోల్చి భావగాఢతను సమకూర్చాడు. ఈ కవితను గూర్చి ‘ముస్లిం జీవితంలోని సున్నితమైన లలితమైన పదాలు- కవిలోని సాత్త్వికావేశం ఇక్కడ దుఃఖంతో నిండిన కవిత్వానికి సౌందర్యాన్నిచ్చాయి అన్నారు ఖాజ  (ముస్లింవాద తాత్వికత; సిద్ధాంతం- సాహిత్యం, పుట.113).సుంకిరెడ్డి నారాయణరెడ్డి అన్నట్టు ‘రెహల్‌’తో పాటు 
స్కైబాబ రాసిన సాంచా (1995), హిజాబ్‌ (1994) కవితలను ముస్లిం స్ర్తీవాదానికి ప్రాతినిధ్యం వహించగలగినవిగా భావించవచ్చు.
                                                        -పెన్నా శివరామకృష్ణ 

Sunday, 16 October 2011

పుట్టుమచ్చ నుంచి పోరు జల్‌జలా


(ఇవాళ ఆంధ్ర జ్యోతి 'వివిధ'లో వచ్చిన వ్యాసం..)

ఒక అందమైన తోట/ఆ తోటలో రకరకాల పూలు
రంగురంగుల పూలు/గులాబీలు మందారాలు చమేలీలు
మొగలిపూలు బంతిపూలు గుల్‌మొహర్‌లు...
అన్ని రకాల పూలతో చాలా అందంగా కనబడుతుందా తోట!
అయితే/ ఆ పూలన్నింటినీ నలిపేసి, తొక్కేసి, కోసేసి
ఒక్క కమలమే విస్తరించాలంటే
ఆ తోట అందమంతా ఏమైపోతుంది?!
                                    అంటున్నాడు ముస్లిం కవి ఆఫ్రీన్.
ఏ సమాజంలోనైనా మెజారిటీ మత భావజాలం ఆవరించి ఉంటుంది. ఆ భావజాలంలోంచే మెజారిటీ ప్రజల చర్యలుంటాయి. దానివల్ల మైనారిటీల మనోభావాలు దెబ్బతింటుండడాన్ని కూడా ఎవరూ పట్టించుకోరు. మైనారిటీల దృష్టికోణం నుంచి చూసే దృక్పథాన్ని ముస్లింవాద సాహిత్యం అందించింది. ఆ కోణం నుంచే ఈ కవిత్వం... 

ముఖ్యంగా ముస్లింవాదం రెండు రకాల పోరాటం చేసింది- బాహిర్ పోరాటం. అంతర్ పోరాటం. బాహిర్ పోరాటంలో భాగంగా ఖాదర్ మొహియుద్దీన్ 'పుట్టుమచ్చ'ను చూడొ చ్చు. ముస్లింల అభద్రత, వివక్ష, అణచివేత, తద్వారా పేదరికం మొదలైనవి. ముస్లింలు మన దేశంలో అతిపెద్ద సమూహం. ఈ సమూహాన్ని విస్మరించి పురోగతి సాధించడం సాధ్యం కాదు. అన్ని రంగాల్లోనూ ముస్లింల విలువైన, ప్రత్యేకమైన ప్రాతినిధ్యం ఉంది. దేశ ప్రగతిలో ముస్లింల శ్రమ, కృషి ఎంతో ఉంది. ఆ విషయాన్ని విస్మరింపేజేసి ముస్లింలను అట్టడుక్కి తొక్కేసే ప్రయత్నం జరిగింది.. జరుగుతున్నది. 

అంతర్గత సంస్కరణలు కోరడం ముస్లింవాదం ప్రత్యేకత. ఆ కోణం నుంచి బలమైన కవిత్వం వచ్చింది. అయితే ఈ ముస్లింల అంతర్గత సమస్యల పైన వచ్చిన కవిత్వానికి 'ఆహా! ఓహో!' అన్నంత స్థాయిలో హిందూత్వ దాష్టీకం, వివక్ష, అభద్రతలపై వచ్చిన కవిత్వం పట్ల మౌనం వహించడం మేము గమనించాం. అంటే చైతన్యవంతులైన వారిలోనూ హిందూత్వ అంశ ఉన్నట్లు దీనివల్ల రుజువైంది.

'ముస్లింవాద' సంఘర్షణ: 
ఇవాళ ముస్లింవాద సాహిత్యంపై ఎంఫిల్‌లు, పిహెచ్‌డీలు, చర్చోపచర్చలు జరుగుతున్నాయి. సాహితీ పెద్దలు ముస్లింవాదాన్ని లెక్కలోకి తీసుకుంటున్నారు. కాని ఈ పరిస్థితికి ముందు, ముస్లింవాదం ఒక వాదంగా నిలబడడానికి ముస్లింవాదులుగా ఎన్నో సంఘర్షణలు ఎదుర్కోవలసి వచ్చింది.. 

నల్గొండ కేంద్రంగా ఒక ముస్లిం కవితా సంకలనాన్ని తీసుకువచ్చే పనిలో ఏడాదిన్నరపాటు శ్రమించాల్సివచ్చింది. అది 'జల్‌జలా' ముస్లింవాద కవితాసంకలనంగా వచ్చింది. ఆ సమయంలో ఎన్నో చర్చలు, సంఘర్షణ, వాదోపవాదాలు జరిగాయి. అంతలో విరసం 'జిహాద్' వేసింది. పత్రికల్లో చర్చ జరిగింది. అందులోని కవిత్వాన్ని మినహాయిస్తూనే సంకలనం తేవాలనుకున్నాం. 

దీనిని ఏ కవిత్వం అందాం అన్న దగ్గర ఎంతో సంఘర్షణ జరిగింది. విరసం 'ముస్లిం మైనారిటీ కవుల కవిత్వం' అన్నది. మైనారిటీ పదం వాడడంలో న్యూనతాభావం కొట్టిచ్చినట్లు కనిపిస్తుంది. ఎవరు మైనారిటీ? ఎవరు మెజారిటీ? అనేది మరో చర్చ. స్త్రీవాదం, దళితవాదం లాగా ముస్లింవాదం అనడంపై ఎన్నో రకాలుగా ఆలోచించాం. కాని ముస్లింవాదం అంటే ఎక్కడ మతముద్ర వేస్తారో అనేది సంశయం. కాని ఇస్లాంవాదం అంటే మతం పరిధిలోకి వెళ్తుంది, 

ముస్లిం అంటే ఒక సమూహ నామం అనే దృష్టితో చివరికి దాన్నే ఖాయం చేశాం. చర్చల్లో కొన్ని విషయాలు ఎంతకూ తెగేవి కావు. చివరికి అంతర్ పోరాట కవిత్వం రాసిన మా కవితలకు మేమే బాధ్యత వహిస్తాం, వేరెవరికి సంబంధం లేదు కాబట్టి వారు భయపడవలసిన అవసరం లేదంటూ గట్టిగా నిలబడ్డాం. ఈ విషయంలోనే ముస్లింవాదులు ఏ అస్తిత్వవాదులూ ఎదుర్కోని సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ కవులు ఏ సమూహానికైతే ప్రతినిధులుగా రాస్తున్నారో ఆ సమూహంలోని మెజారిటీ ప్రజలే సంస్కరణవాద కవిత్వం పట్ల అయిష్టంగా ఉండడం విషాదం. 

ముందుమాటలు ఎవరితో రాయించాలనేది కూడా సంఘర్షణే. ముస్లింవాదానికి ఆదికవి ఖాదర్‌తోనే రాయించొచ్చు. కాని ఆయన అంతర్ పోరాట కవిత్వాన్ని ఆహ్వానించడంలేదు. ఆ విషయంలో రాజీ పడకుండా అఫ్సర్‌తో రాయించాం. ఈ సంకలనం విషయం లో ఆదినుంచీ మాకు భావజాలపరంగా, అన్ని రకాలుగా అండగా నిలిచిన సుంకిరెడ్డి నారాయణరెడ్డి విలువైన ముందుమాట రాశా రు. 

ముస్లింలది పౌరహక్కుల సమస్య కూడా అనే కోణం నుంచి ఎమ్‌టి ఖాన్‌తో రాయించినా, దాన్ని తెలుగు చేసి ఇస్తూ బాలగోపాల్, ఐడెంటిటీ ఉద్యమాల విషయంలో నా అభిప్రాయం వేరు, మీకు ఇష్టమైతే నేను రాసి ఇస్తాను అన్నారు. సంతోషం సార్, రాసివ్వండి అన్నాను. దాంతో ఆయన జల్‌జలాకు ముందుమాట రాశా రు. అస్తిత్వ సాహిత్య ఉద్యమాలపై బాలగోపాల్ మొదటగా రాసిన వ్యాసం ఇది. 1997లోనే ఆయన దళిత, స్త్రీ, గిరిజన, ముస్లిం, బహుజన అస్తిత్వ ఉద్యమాలపై ఎంతో వివరంగా రాశారు. 

నిజంగానే పెన్నా శివరామకృష్ణ ఒక సమీక్షలో అన్నట్టు 'జల్‌జలా' భూకంపమే పుట్టించింది. కాకపోతే- ఒకవైపు, ముస్లిం చాదస్తులు, మరోవైపు హిందూత్వవాదులు ఎక్కడ గొడవ చేస్తారోననే భయంతో ఆ సంకలనం పుట్టినచోటే ఆవిష్కరణ జరుపుకోలేదు. అందులోని కవితల బలం అంత తీవ్రమైనది. 

మరి ముస్లింలు ఎవరు?
మనదేశంలో 15 కోట్లకు పైగా ముస్లింలున్నారు. పాకిస్తాన్‌లోనూ దాదాపు అంతే. బంగ్లాదేశ్‌లో 8 కోట్లు. మరి ఇంత జనాభాకు కారణమైన ఈ ఉపఖండంలో మొదట్లో ముస్లింలుగా మారినవాళ్లు ఎవరు? ఏయే కారణాల వల్ల మారారు? ఈ ప్రశ్నలకు హిందూత్వవాదుల ప్రచారమే ఎక్కు వ ప్రాచుర్యం పొందింది. 2004లో ముస్లింలు రకరకాల సంఘాల ద్వారా ముస్లిం రిజర్వేషన్‌కోసం పోరాడుతుండడంతో వారికి 4 శాతం రిజర్వేషన్ కల్పించబడింది. ఆ సందర్భంలో ముస్లింలను బీసీ ల్లో కలపడాన్ని కొన్ని బీసీ సంఘాలు వ్యతిరేకించాయి. అప్పటికి 'మర్ఫా' పేరుతో రిజర్వేషన్ కోసం పోరాడు తున్న మేము షాకయ్యాం. బీసీ లు మమ్మల్ని బీసీల్లో కలపడాన్ని వ్యతిరేకిస్తున్నారు, హిందూత్వవాదులు మేము ఈ దేశస్థులమే కాదని ప్రచారం చేస్తున్నారు.. దీంతో '..మరి ముస్లింలు ఎవరు?' అనే పరిశోధనాత్మక కరపత్రం వెలువరించాం. 

మన ఉపఖండంలో ఇంతగా ముస్లిం జనాభా పెరగడానికి ముస్లిం రాజుల పాలనలో రకరకాల అవసరా లు, అవకాశాల కోసమే కాకుండా మరో బలమైన కారణమూ ఉందని ప్రకటించాం. 
గుడి అంటని
ఇక్కడి మట్టి బిడ్డల కాడికే
నడిచొచ్చిన దేవుళ్లు సూఫీలు...

'అసుంట! అసుంట!' నిలిపిన మూలాన్ని
అలాయిబలాయి తీసుకున్న దిల్! - స్కైబాబ, 'అలావా' ముస్లిం సంస్కృతి కవితా సంకలనం 

బడికీ, గుడికీ ఆఖరికి ఊరికీ అంటరానివాళ్లుగా చేయబడిన ఈ దేశ మూలవాసుల వాడల్లోకి నడుచుకుంటూ వచ్చారు సూఫీ 'దేవు ళ్లు'! వచ్చి వాళ్లని అక్కున చేర్చుకున్నారు. బ్రాహ్మణ సంస్కృతి అసుంట అసుంట అంటే సూఫీలు వాళ్లకు గుండెకు గుండెను కలిపే అలాయిబలాయి ఇచ్చారు. వాళ్లు తాగిన గిలాసుల్లో నీళ్లు తాగారు. వాళ్లతోపాటు కూచొని బువ్వ తిన్నారు. అగ్రహారాల వీధుల నుంచి వాళ్ల శవాల్ని కూడా తీసుకెళ్లనివ్వని దుష్ట సంస్కృతిని బద్దలుచేస్తూ వాళ్ల శవానికి భుజం పట్టారు. 

మజీదుకు వెళ్తే భుజం భుజం కలిపి నమాజు చదివించా రు. ఆ గరీబుల గుండెలు చెరువులయ్యాయి.. వాళ్లు తమ దేహాల తో కాదు, గుండెలతోనే సూఫీలను అలాయిబలాయి తీసుకున్నారు. వాళ్లలో ఒకరైనారు. తమకు కష్టమొస్తే నష్టమొస్తే మంచి మాటల్తో తమని ఓదార్చే, ఆదరించే ప్రవక్తలయ్యారు సూఫీలు. తమకు రోగమొస్తే, రొష్టొస్తే అభయమిచ్చే దేవుళ్లయ్యారు. దాంతో వాళ్లంతా ముసల్మానులయ్యారు. వాళ్లు ఈ దేశ మూలవాసులు. ద్రావిడులు. మాదిగలు, మాలలు. ఆదివాసీలు. బీసీలు. ఇతర కులాలవారు. 

కేవలం 2 నుంచి 3 శాతం ముస్లింలు మాత్రమే బైటి దేశాల నుంచి వచ్చినవారు. మిగతా 97 శాతం ఈ దేశవాసులే. అందులో అధికభాగం 'అంటబడనివ్వని' కులాలనుంచి, 'వెనకబడేయబడ్డ' కులాలనుంచీ ఇస్లాం స్వీకరించినవారే. ఈ దేశమూలవాసులే. ఈ విషయాన్ని తొక్కిపెట్టి హిందూత్వవాదులు ముస్లింలను బైటి దేశస్తులుగా దుష్ప్రచారం చేశారు. 

నీగ్రోలను, తెల్లవాళ్లను చూడగానే గుర్తుపట్టవచ్చు. ఇరానియన్లను, అఫ్ఘానిస్తానీలను గుర్తుపట్టవచ్చు. మన ఉపఖండంలోనే ఉన్న నేపాలీలను చూడగానే గుర్తుపడతాం. అలాగే బైటి దేశస్తులు ఇక్కడి ముస్లింలను చూడగానే ఇండియన్లుగానే గుర్తుపడతారు! తరువాతే పేరు చెబితే ఇండియన్ ముస్లింలుగా గుర్తు పడతారు. ఎందుకంటే ఆంత్రొపాలజీ ప్రకారం- భూగోళం మీది ఉష్ణోగ్రతలను బట్టి ఒక్కో ప్రాంతంలోని మనుషులు ఒక్కో తీరుగా ఉంటా రు. వారి కపాలం, ముక్కుదూలం, వెన్నెముక ఒక్క తీరుగా ఉంటా యి. 

అందుకే ఇక్కడి దళిత బహుజనులూ-ముస్లింలు, ఆదివాసీలూ-ముస్లింలు, ఇతర కులస్తులూ-ముస్లింలు అన్నదమ్ముల్లాగే కనిపిస్తారు. ఎందుకంటే వాళ్లే ముస్లింలైనారు కాబట్టి. అందుకే ముస్లింలు ఈ దేశ మూలవాసులని ముస్లింవాదం స్పష్టం చేసింది. ఆదివాసీ-దళిత-బహుజనుల 60కి పైగా వృత్తుల్లో ముస్లింలు కొనసాగుతున్నారని కొన్ని నివేదికలు చెబుతుండడం మరొక ఆధారం. దళితవర్గాలు, బీసీల నుంచి ఎక్కువమంది ముస్లింలుగా మారడంతో వాళ్లలో వెనుకబాటు, పేదరికం అలాగే కొనసాగుతున్నాయని అస్ఘర్అలీ ఇంజనీర్ చెప్పడం గమనార్హం. 

ముస్లింలపై హత్యాకాండలు చిన్నప్పుడు 15 ఆగస్టుకు హుషారుగా ఊరేగేది. పెద్దయ్యాక తెలిసింది- స్వాతంత్య్రానికి ముందు దేశవిభజన జరిగిందని, లక్షల మంది ఊచకోత జరిగిందని! ఆంధ్రప్రదేశ్ అవతరణరోజూ ఊరేగేవాళ్లం. తర్వాత తెలిసింది- పోలీస్ యాక్షన్‌లో 50 నుంచి 2 లక్షలమంది ముస్లింల ఊచకోత జరిగిందని! (దానికి సంబంధించిన రిపోర్టును 'ముల్కి' ముస్లిం సాహిత్య ప్రత్యేక సంచికలో వేసిన తరువాతే ఆ విషయం కొంద రు మాట్లాడ్డం మొదలుపెట్టారు.) 

కమ్యూనిస్టుల ఊచకోతను చెప్పడానికి వారికి ఎన్నో సంస్థలున్నాయి, కాని ముస్లింలకేవి? పోలీస్ యాక్షన్‌లో చంపబడ్డ వాళ్ల కుటుంబాలు, దోపిడీకి గురైనవారి కుటుంబాలు ఎంతగా చితికిపోయి ఉంటాయి? ముస్లింలందరిపై రజాకార్ల పేరుతో దాడులు చేస్తుంటే అన్నీ వదులుకొని పట్టణాలకు పారిపోయి వచ్చేసిన ముస్లింలు ఎంత పేదలైపోయి ఉంటారు! 

'వాళ్లూ వాళ్లూ కలిసి పంచుకున్న ఊళ్ల మధ్య
నా రక్తం ఏరులై పారింది' 
                            -అంటాడు ఖాదర్. దేశ విభజనతో ఇక్కడి సామాన్య ముస్లింలకు ఏం సంబంధం? వాళ్లూ వాళ్లూ కలిసి తీసుకున్న నిర్ణయం ఎంతటి రక్తపాతాన్ని సృష్టించిందో తెలిసిందే. ఉన్న ఊరు-కన్నతల్లిని వదిలి వెళ్లలేక, తమ మూలాల్ని, వేర్లను తెంచుకుని వెళ్లలేక పుట్టిన గడ్డనే హత్తుకుని ఉండిపోయిన ఈ దేశపు ముస్లింలకు ఎంతటి దుర్గతి పట్టించారు ఇక్కడి పాలకులు, హిందూత్వవాదులు. అనుక్షణం అవమానపరుస్తూ మాతృదేశంలోనే వారి మనసుల్ని ఛిద్రం చేశారు. చివరికి రోడ్డుసైడు చిల్లర వ్యాపారాలకు మాత్రమే ముస్లింలు పరిమతమయ్యేలా చేశారు. 

1992లో బాబ్రీ మజీదు కూల్చబడింది. మరోసారి ముస్లింల ఊచకోత. దేశంలోని లౌకికవాదులైన ముస్లింలంతా హతాశులయ్యారు. దేశవ్యాప్తంగా అన్నాళ్లు ముస్లింలుగా మాట్లాడ ని ముస్లింమేధావులు, రచయితలంతా ముస్లిం లుగా మాట్లాడాల్సిన అవసరాన్ని గుర్తించారు. తెలుగు సాహిత్యంలోనూ అదే జరిగింది. మళ్లీ పదేళ్లకు 2002లో గుజరాత్‌లో జెనోసైడ్ జరిగింది. వేలమంది ముస్లింల ఊచకోత సాగింది. దానికి హిందూత్వ సంస్థలు, పార్టీలు నాయకత్వం వహించాయని మీడియా, మేధావులు, ప్రజాస్వామికవాదులు తమ కథనాలద్వారా, పుస్తకాల ద్వారా రికార్డు చేశారు. 

దేశమంతా నిరసన వ్యక్తమైంది. తెలుగు సాహిత్యంలోనూ వందలకొలది కవితలు, కథలు, వ్యాసాలు అచ్చయ్యాయి. తెలుగు కవులు 30 మంది గుజరాత్ వెళ్లి పరిస్థితిని అధ్యయనం చేసి వచ్చారు. వచ్చి సభలు పెట్టారు. 'గుజరాత్ గాయం' పేరుతో 200మంది కవులతో సంకలనం తెచ్చారు. అలాగే నేను అన్వర్ కలిసి 36 మంది ముస్లిం కవులతో 'అజాఁ' పేరుతో కవిత్వం తీసుకొచ్చాం. 17 రోజులు గుజరాత్‌లో తిరిగి వచ్చిన నా అనుభవం అందుకు తోడ్పడింది. 

ఆ సంకలనానికి ముందుమాట రాస్తూ స్మైల్ ఇలా అన్నారు- 'ఈ సంకలనం.. గుండె వుంటే చదవాలి. దిటవు చేసుకు చదవాలి. లేకుండా చదివిన వారికి ఓ గుండె ఏర్పడి స్పందిస్తుంది. వీరి విషా ద కవిత్వ నేపథ్యంలో ఒక ఆలోచన ప్రత్యామ్నాయాల, ఐడెంటిటీ ల దిశగా అంకురిస్తుంది. ఆ అంకురం కోసమే... ఈ సంకలనం.' అన్వర్ తన సంపాదకీయంలో 'దేశపతాకంలోని కాషాయం తెలుపును ఆక్రమించేస్తోంది' అన్నారు. నా గుజరాత్ అనుభవాలన్నీ నా సంపాదకీయంగా రాశాను. ఈ సంకలనం ఒక జాతి మేధాన్ని ప్రశ్నించిన సంకలనంగా సమీక్షకుల చేత రికార్డు చేయబడింది. 

గర్భంతోనున్న ఒక స్త్రీ కడుపుని చీల్చి పిండాన్ని బైటికి తీసి త్రిశూలంతో ఆడించి మంటల్లో వేసిన సంఘటన యావత్ భారతదేశాన్ని కలచివేసింది. అందుకే- 'ఇప్పుడు మాతృగర్భంలోంచే పెకటించబడ్తున్న మా ఉనికి' -అన్నాడు వలీ హుసేన్. మనది సెక్యులర్ దేశం అని ప్రపంచమంతా కొనియాడుతుంటే గుజరాత్ నరమేధం మాత్రం ఇక్కడ హిందూత్వ ఫాసిజం రాజ్యమేలుతున్న ట్లు స్పష్టం చేసింది. దాంతో మనస్తాపం చెందిన మహమూద్ ఇలా అన్నాడు-'మితృలారా! 'కఫన్' కప్పబడిన సెక్యులరిజం జనాజాకు 
మీ భుజం ఖాళీ వుంటే పట్టండి...' గుజరాత్ అంటే ఐదారేళ్ల పసివాడికి పెట్రో లుతాగించి ఆ లేత పెదాలపై అగ్గిపుల్ల అం టిస్తే ఆ చిన్నారి దేహం ఫట్‌మని పేలిపోయిన అమానవీయ దృశ్యం! తల్లుల ముందే పిల్లల్ని పిల్లల ముందే తల్లుల్ని సామూహికంగా చెరిచి ముక్కలుగా నరికి తగలబెట్టిన వైనం! పాడుబడిన బావిలోకి ముస్లింలను విసిరేసి పైనుంచి రాళ్లెత్తేయడం.. ప్రాణభయంతో పారిపోతున్న 70 మందిని టెంపోలోనే సజీవ దహనం చేయ డం..
మాజీ ఎంపి జాఫ్రితో పాటు ఆయన బిల్డింగ్‌లో తలదాచుకోడానికొచ్చిన 100 నుం డి 150 మందిని చంపి తగలబెట్టడం.. తన తల్లిని తగలబెడుతున్న దృశ్యం కళ్లల్లోకి ప్రసరించిన ప్రతిసారీ ఏడేళ్ల ఇమ్రాన్ పెడుతున్న కేక.. దఫన్ చేసుకోడానికి దేహాలు కూడా మిగలని వందలూ వేల బూడిద కుప్పలు! భార్యల కనురెప్పల మీదే భర్తల దహనం.. భర్తల పిచ్చి చూపుల ముందే బరిసెలు దిగబడిన యోనుల రక్తం కేకలు...

5 నుంచి 10 వేలమంది దాకా గుంపుగా కత్తులు, త్రిశూలాలు, పిస్తోళ్లు, యాసిడ్ పట్టుకొని ఒక్కొక్క ఊరిలో ఉన్న ముస్లిం బస్తీల మీద పడి చంపుతుంటే తప్పించుకున్న ఏ కొందరో పారిపోయి చెట్లనకా, గుట్టలనకా, పగలూ రాత్రనకా కిలోమీటర్ల కొద్దీ పరుగులు తీశారు. ఆ అనుభవంలోంచి- 

'రామబాణంతో వాళ్లు/
విష్ణు చక్రంతో/కృష్ణ చక్రంతో వాళ్లు/ శివుని త్రిశూలంలో వాళ్లు/హనుమంతుని గదతో వాళ్లు.../అయ్ అల్లాహ్!/ఈ చేతులు ఉట్టి దువాకేనా?!' -అజాఁ సంకలనం తిరిగి ఊర్లలోకి వద్దామంటే హిందూత్వవాదులు రకరకాల షరతులు విధిస్తే బిత్తరపోయిన ముస్లింలు ఊరిబైటే ఉండిపోయారు- 'దళిత వాడలు ఊర్లలో కలుస్తున్న ఆనం దం/ఒళ్లంతా పారక ముందే/ఇప్పుడక్కడ ఊరి బైట/ముస్లిం వాడలు వెలిశాయి' అని ఆవేదన పడ్డాడు ముస్లిం కవి. ఇప్పుడీ దేశాన్ని ఏ జీవజలంతో కడిగినా పోని రక్తపు వాసన/కాళ్ల కింది నేలే కాదు/ కరిగిన ఆకాశం కూడా మురికైపోయింది' అం టాడు ఖాదర్ షరీఫ్. 'నీకు నాకు మధ్యా రక్త సంబంధం లేదంటావా?/గుండెల్ని పెకిలించి/పొట్టలు చీల్చి /యోనుల్లో ఆయుధాలు పొడిచి/ఇవ్వాళ నువ్వు చావుల విందు చేసుకొనుండొచ్చు/కానీ 'నన్ను' హత్య చేయలేవు/అనంతంగా సాగే జీవనదిని/నేను బతకడమే కాదు/నిన్ను పుట్టించి బతికించేదీ నేనే..!/అయినా/స్త్రీ తప్ప మగాణ్ణి క్షమించేదెవరు?/ఎన్నటికీ ప్రపంచం/నా రొమ్ము తాగుతున్న పసిబిడ్డే..!' -అన్నది షాజహానా.

'హమ్ మర్కే భి జగాతే హెఁౖ సోయీ హుయీ దునియాఁ కో' -అన్నాడు అలీ. నిజమే! వేలమంది ముస్లింలు హత్య చేయబడితే గాని భారతదేశం ఉలిక్కిపడలేదు! మన లౌకికవాదులూ, ప్రజాస్వామ్యవాదులూ, మార్క్సిస్టులూ, మావోయిస్టులూ అంతా దిగ్గున లేచి కూర్చున్నారు. వేలమంది ముస్లింల బలిదానం జరిగితేగాని ఈ దేశంలో హిందూత్వవాదు లు ఏం చేయబోతున్నారో అర్థం కాలేదు. 
అందరూ మేల్కొన్నట్లే అనిపించింది. కానీ మతోన్మాదుల్ని నిలువరించే, కనీసం అది చేసే దుష్ట చర్యల్ని నిలువరించే కార్యక్రమాన్ని కూడా ఎవరూ చేపట్టలేదు. ఊరకే ఉపన్యాసాల్లో హిందూ మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడుతాం అంటే సరిపోతుందా? కొన్ని సభలు చేస్తే పుస్తకాలేస్తే మన బాధ్యత నెరవేరినట్టేనా? అందుకే ప్రధాని పదవికి మోడీని ముందుకు తెచ్చే ప్రయత్నం జరుగుతోంది. గుజరాత్ ముస్లింల నరమేధం సాక్షిగా మోడీని ఎన్నటికీ ఈ దేశ ప్రజాస్వామిక, లౌకికవాదులు అంగీకరించరని ఆశిద్దాం. లేదంటే ఈ దేశం మరెన్నో గుజరాత్‌లను చూడాల్సి వస్తుంది. 
                                                                                                       - స్కైబాబ
(ఆంధ్ర సారస్వత పరిషత్‌లో 14.9.11న 'ముస్లింవాద కవిత్వం'పై ఆలూరి బైరాగి స్మారకోపన్యాసంలోని కొన్ని భాగాలు-ఒక కోణం)