నా మరణవార్త వ్యాపించి అంతా మూగారు
వారి ఊసుల్లో నా గురించిన నిజాలు వింటున్నాను
***
మిత్రులూ.. చుట్టాలూ చూసి పోతున్నారు
చివరి చూపు ఎంత బరువైనదో..!
***
ఒళ్లు తోమి తోమి స్నానం చేయించారు
చిన్నప్పుడు అమ్మొక్కత్తే అలా చేయించేది
***
వెల్లకిలా పడుకోబెట్టారు
పక్కకి ఒత్తిగిల్లడం ఇష్టమని చెబితే బాగుండు
***
అత్తరు బాగా పూస్తున్నారు
ఒంటి వాసనే ఇష్టపడేవాడినని ఎలా చెప్పను
***
గోడు గోడున ఏడుస్తున్నారు
ఏడిస్తే తట్టుకునేవాణ్ణి కానని అంతా మర్చిపోయారు
***
తెల్లని కఫన్ చుట్టారు
జీవితమంతా ఎన్ని రంగుల వెంట పరుగులెత్తానో..!
***
జనాజాకు భుజం పట్టడానికి పోటీపడుతున్నారు
తెలిసినవారో.. తెలియనివారో.. తేడా లేదు
***
నాకోసం ఇంట్లో శుభ్రమైన దుప్పటి ఉంచేవారు
ఇప్పుడు మట్టి దుప్పటి
***
ఈ మట్టిని ఎంతగా హింసించానో..
చివరికీ మట్టిలోకే ఇంకిపోయే మహద్భాగ్యం
***
పూలదుప్పటి కప్పారు
ఇహమో! పరమో! తెలీకుండా ఉన్నాను
chaala baaga raasarandi!!
ReplyDeleteచిన్న కవిత లో జీవితం చదివించేసారు.
ReplyDeleteskybaba గారు ...మీ కవిత అద్భుతం.....ఎన్ని కోరుకున్నా చివరికి మిగిలేది మట్టి దుప్పటే .....
deep images. heart touching and hard hitting
ReplyDelete