Thursday, 10 October 2013

ఉర్దూ మన భాష, ఉర్దూ సాహిత్యం మన సాహిత్యం!

http://www.saarangabooks.com/magazine/2013/10/09/%E0%B0%89%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A6%E0%B1%82-%E0%B0%AE%E0%B0%A8-%E0%B0%AD%E0%B0%BE%E0%B0%B7-%E0%B0%89%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A6%E0%B1%82-%E0%B0%B8%E0%B0%BE%E0%B0%B9%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D/
ముస్లిం కవులు ఎంత ప్రజాస్వామికంగా, ఎంత లౌకికత్వంతో ఉన్నారో తెలుగు ముస్లింవాద సాహిత్యం ఋజువు చేస్తూ వచ్చింది. అలాగే ఎప్పటికప్పుడు తెలంగాణ సాహిత్య- ఉద్యమకారులు లౌకికత్వ భావనలు విస్మరించకుండా స్పృహలో ఉండేలా  కూడా ముస్లింవాదులు తమ వంతు కృషి చేస్తూ వస్తున్నారు. తెలంగాణ సాహిత్యంలోనూ తనదైన ముద్ర వేస్తూ వచ్చిన ముస్లింవాదుల నుంచి వస్తున్న ప్రత్యేక సంకలనం ఇది. కొన్ని విలువైన ప్రశ్నలూ, అరుదైన కోణాలూ ఇందులో చూడొచ్చు..
తెలంగాణ సాహిత్యం అంటే కేవలం తెలుగు సాహిత్యమే అనుకునే సంకుచిత జ్ఞానంలో మనం ఉన్నాం. కానీ దేశంలోనే ఎంతో ప్రఖ్యాతి పొందిన ఉర్దూ కవులు, రచయితలు, విమర్శకులు తెలంగాణ ప్రాంతంలో ఉన్నారు. ప్రస్తుత తెలంగాణ ఉద్యమకారులు, సాహిత్యకారులు సైతం ఈ విషయాన్ని, ఉర్దూ ప్రజల ఒక అతిపెద్ద సమూహం తెలంగాణలో భాగమనే స్పృహను విస్మరించడం విచారకరం (ఒకరిద్దరు తప్ప). ఏ ఒక్క తెలంగాణ సాహిత్య సభలోనూ ఉర్దూ సాహిత్యకారులను భాగం చేయకపోవడమే ఇందుకు నిదర్శనం. ఈ కారణం చేతనూ, ఆంధ్రావారి ఆధిపత్యం వల్లనూ ఉర్దూ రచయితలు వేరొక లోకంగా బతుకుతున్నారు. దేశంలోనే ప్రసిద్ధి పొందిన తెలంగాణ ఉర్దూ రచయితలకు ఆంధ్రా వలస పాలకులు ఏ మాత్రం గౌరవమిచ్చింది లేదు. నిజాంల కాలంలో భారత ఉపఖండంలోనే ఉర్దూ కవులు, రచయితలకు హైదరాబాద్‌ రాజ్యం ప్రసిద్ధి పొందింది. వారిని ఎంతో ఆదరించింది.
తెలంగాణలో దాదాపు 20 శాతం మంది ముస్లింలు ఉంటారు. అందులో తెలుగు చదువుకున్న ముస్లింలతో పాటు, ఉర్దూ చదువుకున్న ముస్లింలు సగానికి సగం ఉండొచ్చు. ఇప్పటి తెలంగాణ ఉద్యమంలో తెలుగు ముస్లిం కవుల గొంతుక బలంగా వినిపిస్తున్నది. కానీ ఉర్దూ ముస్లిం కవులు ఏమంటున్నారో తెలియదు. వాళ్ల గొంతుకు నిదర్శనమే ఈ సంకలనం. తెలుగులో కవిత్వం రాస్తున్న తెలుగు ముస్లిం కవులు, ఉర్దూలో కవిత్వం రాస్తున్న ఉర్దూ ముస్లిం కవులు కలిసిన తెలంగాణ నినాదం ఈ సంకలనం. తెలంగాణ అంటే తెలుగుతో పాటు ఉర్దూ కూడా అని జ్ఞానపరిచే ఒక నిదర్శనమిది. తెలుగువారి, ఉర్దూవారి కలగలుపు తనానికి ప్రతీక – ఇదే గంగా జమున తెహజీబ్‌!
ఎమ్‌ఐఎమ్‌ లాంటి పార్టీని చూపి ముస్లింలు తెలంగాణకు మద్దతివ్వడం లేదని నమ్మించే ప్రయత్నం చేస్తున్న వారికి చెంప పెట్టు ఈ సంకలనం. తెలుగు ముస్లింలతో పాటు ఉర్దూ ముస్లింలు కూడా బలంగా తెలంగాణను కోరుకుంటున్నారనడానికి నిదర్శనం ఈ పుస్తకం.
తెలంగాణ తనానికి ఒక బండ గుర్తు అయిన ఉర్దూ ప్రజల్ని విస్మరించడం తెలంగాణ  ఆత్మను నిర్లక్ష్యం చేయడం లాంటిదే. బిజెపి లాంటి పార్టీల సాంగత్యం వల్ల ముస్లింలతో పాటు ఉర్దూను, ఉర్దూ ప్రజలను, ముస్లిమీయత వల్ల ప్రభావితమైన  తెలంగాణ తనాన్ని తెలంగాణ ఉద్యమకారులు నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. ఇది ఎంత మాత్రమూ క్షమించరాని విషయం.
* * *
కిసీ ఖౌమ్‌కో బర్బాద్‌ కర్నా హైతో
పహ్‌లే ఉస్‌ కీ జబాన్‌ ఖీంచ్‌లో… -అన్నట్లుగా తెలంగాణ తెలుగు వారితో పాటు ఇక్కడి ముస్లింల భాషను గుంజుకోవడం, ధ్వంసం చేయడం జరిగింది. ఇంకా ఇంకా జరుగుతున్నది.
ఇవాళ నాలాంటి వారు ఇంట్లో మాట్లాడేది ఉర్దూ. చుట్టూ తెలంగాణ తెలుగు. బడిలో, కాలేజీల్లో, ఆఫీసుల్లో, మీడియాలో కోస్తాంధ్రా తెలుగు. అలాంటప్పుడు నేను ఏ భాషలో రాయాలి?
అరవై ఏళ్ళ తరువాత చూస్తే మొత్తంగా ఆంధ్రా ప్రాంతపు తెలుగే మనల్ని ఆక్రమించుకున్నది. ఈ క్రమంలో తెలుగు సాహిత్యానికి సమాంతరంగా తెలంగాణలో ఉర్దూ సాహిత్యమూ కొనసాగుతున్నదనే స్పృహలోనే ఎవరూ లేరు. అతి కొద్దిమంది తెలంగాణ తెలుగువారికి మాత్రమే ఆ విషయం తెలుసు. తెలంగాణలోని ఉర్దూ తనం   గురించి ఎస్‌.సదాశివ, తెలంగాణ జాతిపిత జయశంకర్‌ ఎంతో చెప్పారు. వారితోపాటు బూర్గుల నరసింగరావు, ఎమ్‌.టి.ఖాన్‌, కేశవరావు జాదవ్‌ లాంటి ఎందరో చెప్పే వాస్తవాలు పట్టించుకుంటే ఈ విషయాలు మనకు మరింత బాగా అర్థమవుతాయి.
golconda
ఉర్దూ మీడియం పాఠశాలలన్నీ తెలుగు మీడియం పాఠశాలలుగా మార్చబడినప్పుడు, తెలంగాణ తెలుగువారినే ఆ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా, అధ్యాపకులుగా నియమించి ఉంటే, వారికి ఇక్కడి పరిస్థితుల మీదా మనుషుల మీదా ప్రేమ ఉండి అర్థం చేసుకుని మసిలేవారు. అలా కాకుండా ఆంధ్ర నుంచి వలస తీసుకురాబడిన తెలుగువారిని నియమించారు. వారి వల్ల ఇక్కడి వారు, ముఖ్యంగా ముస్లింలు ఎక్కువగా అవహేళనకు గురయ్యారు. హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఆంధ్రావారు ఉర్దూ పట్ల, ఉర్దూ కలగలిసిన తెలుగు పట్ల ఏమాత్రం మమకారం లేకుండా ప్రతి మాటలోనూ తెలంగాణవారిని, ముస్లింలను తక్కువచేసి మాట్లాడుతూ అవమానించారు. ఆత్మన్యూనతలో పడవేశారు. ఈ కారణాన తెలంగాణ తెలుగు భాషకు, ఉర్దూకు ఎక్కువ నష్టం జరిగింది. ఉర్దూ అంతర్థానమయ్యే ప్రమాదం ఏర్పడింది.
ఎక్కువ కాలం ముస్లిం రాజుల పాలనలో ఉండటం వలన తెలంగాణ వారి సంస్కృతి ప్రాచ్య (ఓరియంటల్‌- ఇరాన్‌, ఇరాక్‌, టర్కీ వగైరా) దేశాల సంస్కృతితో ప్రభావితమైంది. కాబట్టి ఇక్కడి భాష, వేషధారణ, ఆహారపు అలవాట్లు, నిద్ర, కళలు, సాహిత్యం అన్నీ కూడా ప్రాచ్య దేశాలను పోలి ఉంటాయి. ఈ సంస్కృతికి భిన్నంగా చివరి 200 సంవత్సరాలు ఆంగ్లేయుల పాలనలో ఉండిన ఆంధ్రా ప్రాంతంవారు పశ్చిమ దేశాల (బ్రిటన్‌, ఫ్రాన్స్‌, అమెరికా వగైరా) సామ్రాజ్యవాద సంస్కృతికి అలవాటు పడ్డారు. ఇట్లాంటి రెండు ప్రాంతాలను కలిపి ఉర్దూపై ఆంధ్రా తెలుగును ఆధిపత్య స్థానంలో నిలిపి తెలంగాణపై ఆంధ్రా అధికారం చెలాయించేలా చేయడంతో తెలంగాణ గంగా జమున తెహజీబ్‌ దెబ్బతింటూ కేవలం ఆంధ్రా ఆధిపత్యపు సంస్కృతి తెలంగాణ వారిపై రుద్దబడుతూ వచ్చింది. తెలంగాణ వారు, తెలంగాణ ముస్లింలు భూములు కోల్పోయిన వారిగా, ఆంధ్రా వాళ్లు భూములు ఆక్రమించుకున్న వారుగా తెలంగాణలో- ముఖ్యంగా హైదరాబాద్‌లో, హైదరాబాద్‌ చుట్టూరా కనిపించడం ఒక నిదర్శనం.
ఆంధ్రా వారి డామినేషన్‌తో ముస్లిం కల్చర్‌లోని విభిన్న సాంస్కృతిక విషయాలు వివక్షకు గురవుతూ వచ్చాయి. ఆంధ్రావారికి తెలంగాణ ముస్లింలపై ఏ మాత్రం ప్రేమ లేదు. పైగా చిన్న చూపు. వెకిలిచూపూ. తమ ఆంధ్ర సంస్కృతి నుంచి ప్రతిదాన్నీ చూస్తూ ముస్లిం సంస్కృతుల్ని, అది మిళితమైన తెలంగాణ సంస్కృతిని చులకన చేస్తూ వచ్చారు. తెలంగాణ వారికి సంస్కృతీ సాంప్రదాయాలు, భాష రాదని, తాము వచ్చి అన్నీ నేర్పామని, నేర్పుతున్నామని, నిజమైన సంస్కృతి నేర్పుతున్నామనే అహంభావాన్ని  ప్రదర్శిస్తూ వచ్చారు. ముఖ్యంగా ముస్లిం సంస్కృతి అంటే అదేదో పరాయి సంస్కృతి అన్న ఏహ్యభావం చూపుతూ వచ్చారు.
- స్కైబాబా
(రజ్మియా కి రాసిన ముందు మాట నించి)

4 comments:

  1. Asalu mee posts intha varakuu chooda ledu, mee kadhalatho parichayam mathram vundi.
    chalaa vishayaalalo meetho ekeebhavistha.
    abhinandanalu
    e bhaasha ni samskruthinee chinna choopu choosinaa vinasaname.........charithra lo chaala choosamu ilativi.ayina manam nerchukunnadi emiti

    ReplyDelete
  2. మాది కడప, ఇప్పటికి కూడా మా వూరిలో ముస్లిములు ఉర్దూ లాంటి మాండలికం మాత్రమే మట్లాడతారు. అయితే అది మిగతా ముస్లిములతో మాత్రమే కాని మాలాంటి వాల్లకు అది అర్థం కాదు. కాని మేమెప్పుడు వారిని కించపరచలేదు ఆ భాష వల్ల. ఇప్పటికి అక్కడ ప్రజలందరు హయిగానే కలిసి ఉంటున్నాము. ఇప్పటికీ మా వూరిలో పెద్ద పండగ పీర్ల పండగే.

    నేను పాఠశాలల గురించి, ఈ గ్లోబలైజేశన్ కాలంలొ తెలుగు/ఉర్దూ కన్నా పోటీ వాతావరణంలో ఇంగ్లీష్ మీడియంలో చదివితే గాని ఉద్యొగాలు రావట్లేదు ముఖ్యంగా ప్రైవేట్ రంగంలో. దీని వల్ల రెండు భాషలు ప్రభావితమవుతున్నాయి.
    నేను కూడా ఇంజనీరింగ్ తెలుగులో చదివితే విషయ పరిఙ్ఞానం బాగా వచ్చేదని నా అభిప్రాయం.

    ఇక్కడ నేను చెప్పొచ్చేది ఎంటంటే మేమెప్పుడు ఇక్కడ ముస్లిములని బలవంతంగా మీ భాష మానమని చెప్పలేదు, వారు మమ్మల్ని ఉర్దూ నేర్చుకోమని బలవంతపెట్టలేదు (ఇది మీరు గమనించాలి).

    ReplyDelete

  3. రాయలసీమలో చాలామంది తెలుగువారికి అంతో యింతో ఉర్దూ వస్తుంది.కోస్తాలోనే ముస్లిములు తక్కువకాబట్టి అక్కడ తెలుగువారికి ఉర్దూ రాదు.ఉర్దూ రావడం మంచిదే.ఉత్తరాదికి వెళ్ళ్ళినా పనికివస్తుంది.ఊరికే కోస్తాంధ్రవారిని నిందిస్తూ కూర్చోకుండా ,తెలంగాణ ఉర్దూకవులవి కొన్ని మంచి రచనలని,కవిత్వాన్ని మూలంతోసహా తెలుగులోకి అనువాదం చేసి ప్రచురిస్తే చదివి ఆనందిస్తాముకదా!

    ReplyDelete
  4. jvrao, purushotham jinka, కమనీయం garalaku shukriyaa.. Telangana vaaripai Kosthandhra Telugu ruddabadindi.. Telangana Muslims Urdu ki dooram cheyabaddaaru.. పోటీ వాతావరణంలో ఇంగ్లీష్ మీడియంలో చదివితే గాని ఉద్యొగాలు రావట్లేదు annadi najam. pillalaku English Mediam chadivinchadam thappanisari ayindi.. ika కమనీయం garu annatlu, Urdu kavithalanu, kathalanu Telugu loki anuvaadam cheyinche pani cheyaalsi undi..

    ReplyDelete

మీ అభిప్రాయం తెలియజెయ్యండి