తెలంగాణ దస్తూర్
0-0-0-0-0-0-0
రజ్మియా అంటే ఉద్యమ గీతం. తెలుగు (36 మంది), ఉర్దూ (31 మంది) ముస్లిం కవుల ఉద్యమ గీతం ఇది. గంగ జమున తెహజీబ్‌కు అంతరాత్మ. నిజానికి తెలంగాణ అంటె తెలుగు, ఉర్దూ; ఉర్దూ మిళిత తెలుగు; తెలుగు కలగలిన ఉర్దూ వెరి గంగా జమున తెహజీబ్. తెలుగు వారి, ఉర్దూవారి కలగలుపు సంస్కృతి! అలాయి బలాయి సంస్కృతి!!
***
తెలంగాణలో మొదటి నుంచి ముస్లింలకు ఒక ప్రత్యేకత ఉంది. ప్రజల తరఫున నిలబడి పోరాడిన చరిత్ర ఉంది. తెలంగాణ ప్రాంతం ముస్లిం రాజుల పాలనలో ఉండడంతో తెలంగాణ చరిత్రకు, సంస్కృతికి, సాహిత్యానికి, భాషకు ఒక అదనపు సౌందర్యం చేకూరింది.
ఈ గడ్డను ఏలి ఈ మట్టిలోనే కలిసిన ఇబ్రహీం కులీ కుతుబ్ షా (మల్కిభ రాముడి) (ఈయన సమాధి ఖుతుబ్ షాహీ టూంబ్స్‌లో ఒక టూంబ్‌గా ఆంధ్రా పాలకుల నిరాదరణకు గురై పడావు పడుతున్నది) దగ్గరి నుండి ప్రజా నాయకుడు, ఉర్దూ మహాకవి మగ్దూం మొహియుద్దీన్ దాకా.. మఁలకాబాయి చందా నుంచి జిలానీ బానో దాకా.. నేటి తెలంగాణ ముస్లిం కవుల దాకా సాహిత్య వారసత్వం కొనసాగుతూ వచ్చింది. ప్రజా పోరాటాలకు ప్రతీకలుగా బందగీ, షోయబుల్లా ఖాన్ తదితరులు నిలిస్తే, తెలంగాణలో తురుమ్ ఖాన్‌గా ప్రిద్ధి పొందిన తుర్రేబాజ్ ఖాన్ బ్రిటిష్ సైన్యంతో యుద్ధం చేసి ఆఖరికి కాల్చి చంపబడి కోఠీలో వారం పాటు శవంగా వేలాడదీయబడ్డాడు.
***
ముస్లిం కవులు ఎంత ప్రజాస్వామికంగా, ఎంత లౌకికత్వంతో ఉన్నారో తెలుగు ముస్లింవాద సాహిత్యం ఋజువు చేస్తూ వచ్చింది. అలాగే ఎప్పటికప్పుడు తెలంగాణ సాహిత్య – ఉద్యమకారులు లౌకికత్వ భావనలు విస్మరించకుండా స్పృహలో ఉండేలా కూడా ముస్లింవాదులు తమ వంతు కృషి చేస్తూ వస్తున్నారు. తెలంగాణ సాహిత్యంలోనూ తనదైన ముద్ర వేస్తూ వచ్చిన ముస్లింవాదుల నుంచి వస్తున్న ప్రత్యేక సంకలనం ఇది. కొన్ని విలువైన ప్రశ్నలూ, అరుదైన కోణాలూ ఇందులో చూడొచ్చు..
***
తెలంగాణ సాహిత్యం అంటే కేవలం తెలుగు సాహిత్యమే అనుకునే సంకుచిత జ్ఞానంలో మనం ఉన్నాం. కానీ దేశంలోనే ఎంతో ప్రఖ్యాతి పొందిన ఉర్దూ కవులు, రచయితలు, విమర్శకులు తెలంగాణ ప్రాంతంలో ఉన్నారు. ప్రస్తుత తెలంగాణ ఉద్యమకారులు, సాహిత్యకారులు సైతం ఈ విషయాన్ని, ఉర్దూ ప్రజల ఒక అతిపెద్ద సమూహం తెలంగాణలో భాగమనే స్పృహను విస్మరించడం విచారకరం (ఒకరిద్దరు తప్ప). ఏ ఒక్క తెలంగాణ సాహిత్య సభలోనూ ఉర్దూ సాహిత్యకారులను భాగం చేయకపోవడమే ఇందుకు నిదర్శనం. ఈ కారణం చేతనూ, ఆంధ్రావారి ఆధిపత్యం వల్లనూ ఉర్దూ రచయితలు వేరొక లోకంగా బతుకుతున్నారు. దేశంలోనే ప్రసిద్ధి పొందిన తెలంగాణ ఉర్దూ రచయితలకు ఆంధ్రా వలస పాలకులు ఏ మాత్రం గౌరవమిచ్చింది లేదు. నిజాంల కాలంలో భారత ఉపఖండంలోనే ఉర్దూ కవులు, రచయితలకు హైదరాబాద్ రాజ్యం ప్రిద్ధి పొందింది. వారిని ఎంతో ఆదరించింది.
తెలంగాణలో దాదాపు 20 శాతం మంది ముస్లింలు ఉంటారు. అందులో తెలుగు చదువుకున్న ముస్లింలతో పాటు, ఉర్దూ చదువుకున్న ముస్లింలు సగానికి సగం ఉండొచ్చు. ఇప్పటి తెలంగాణ ఉద్యమంలో తెలుగు ముస్లిం కవుల గొంతుక బలంగా వినిపిస్తున్నది. కానీ ఉర్దూ ముస్లిం కవులు ఏమంటున్నారో తెలియదు. వాళ్ల గొంతుకు నిదర్శనమే ఈ సంకలనం. తెలుగులో కవిత్వం రాస్తున్న తెలుగు ముస్లిం కవులు, ఉర్దూలో కవిత్వం రాస్తున్న ఉర్దూ ముస్లిం కవులు కలిసిన తెలంగాణ నినాదం ఈ సంకలనం. తెలంగాణ అంటే తెలుగుతో పాటు ఉర్దూ కూడా అని జ్ఞానపరిచే ఒక నిదర్శనమిది. తెలుగువారి, ఉర్దూవారి కలగలుపు తనానికి ప్రతీక. ఇదే గంగా జమున తెహజీబ్!
ఎమ్‌ఐఎమ్ లాంటి పార్టీని చూపి ముస్లింలు తెలంగాణకు మద్దతివ్వడం లేదని నమ్మించే ప్రయత్నం చేస్తున్న వారికి చెంప పెట్టు ఈ సంకలనం. తెలుగు ముస్లింలతో పాటు ఉర్దూ ముస్లింలు కూడా బలంగా తెలంగాణను కోరుకుంటున్నారనడానికి నిదర్శనం ఈ పుస్తకం.
తెలంగాణ తనానికి ఒక బండ గుర్తు అయిన ఉర్దూ ప్రజల్ని విస్మరించడం తెలంగాణ ఆత్మను నిర్లక్ష్యం చేయడం లాంటిదే. బిజెపి లాంటి పార్టీల సాంగత్యం వల్ల ముస్లింలతో పాటు ఉర్దూను, ఉర్దూ ప్రజలను, ముస్లిమీయత వల్ల ప్రభావితమైన తెలంగాణ తనాన్ని తెలంగాణ ఉద్యమకారులు నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. ఇది ఎంత మాత్రమూ క్షమించరాని విషయం.
ఉర్దూ భాష కేవలం ముస్లింలది కాదు!
——————————————
ఉర్దూ ఒక భారతీయ భాష. అది ఇండియాలోనే పుట్టింది. చిత్రంగా, మెల్లమెల్లగా అది ముస్లింల భాషగా మారిపోయింది. ఆ కారణంగా ఉర్దూ వల్ల ముస్లింలకు, ముస్లింల వల్ల ఉర్దూకు చాలా నష్టం జరిగింది. జరుగుతున్నది. హైదరాబాద్ రాజ్యంలో ఉర్దూ రాజభాష. ఆ రాజ్యాన్ని మూడు ముక్కలు చేసి (మిగతా రెండు ముక్కలూ వెనుకబడేయబడే ఉన్నాయి) తెలంగాణను ఆంధ్రలో కలిపాక ఉర్దూ తీసి పారేసి, ఆంధ్రా ప్రాంతపు తెలుగును తెలంగాణ ప్రజలపై రుద్దడం తెలిసిందే. ఉర్దూ మీడియం పాఠశాలలు, కళాశాలలన్నీ తెలుగు మీడియంగా మార్చివేయబడ్డాయి. మరి అప్పటిదాకా ఉర్దూ మీడియం చదివినవారి సంగతేమిటి? అలా ఎన్ని తరాలు నష్టపోయాయి? ఉర్దూ చదువరుల్లో ముస్లిమేతరులు భారీ సంఖ్యలో ఉన్నారు. అధికార యంత్రాంగంలోనూ తెలుగు లేదా ఇంగ్లీష్ రావాల్సిందే- అనడంతో ఉర్దూ చదువరులంతా ఏమైపోయారు?
నిజానికి ఉర్దూ ప్రభావం వల్ల ఇక్కడి తెలుగు డిఫరెంట్ యాక్సెంట్‌ను తీసుకుంది. వేల ఉర్దూ పదాలు తెలుగైజ్ అయ్యాయి. తెలుగు ఉర్దూ మిక్స్‌డ్ లాంగ్వేజ్‌లో ఇక్కడి వాళ్లు మాట్లాడుకోవడం చూస్తాం. అలా ఆ మిక్స్‌డ్ భాష ఇక్కడి వారి జీవితంలో భాగమైంది. నిజానికి తీయని ఉర్దూ సమ్మిళిత తెలుగు వల్ల ఇక్కడి తెలుగువారికి ముస్లింలపై, ముస్లింలకు తెలుగువారిపై అప్రకటిత ప్రేమ, వాత్సల్యం ఉండేవి. అంటే సమ్మిళిత భాష అనేది తెలుగోల్ల, ముస్లింల మధ్య సహజీవనానికి తోడ్పడింది. 1948 తర్వాత ఆంధ్రావారి ఆధిపత్య భావజాలంతో అది దెబ్బతింటూ వచ్చింది. తెలంగాణ ఏర్పడడం వలన మళ్లీ ఆ వాతావరణం వస్తుందని, రావాలని ఆశిస్తున్నాను. ఆంధ్రావారి ఉర్దూ వ్యతిరేకత, ముస్లిం వ్యతిరేకత నుంచి తెలంగాణ ముస్లింలు తప్పించుకోగలుగుతారు.
కిసీ ఖౌమ్‌కో బర్బాద్ కర్నా హైతో
పహ్‌లే ఉస్ కీ జబాన్ ఖీంచ్లో…
అన్నట్లుగా తెలంగాణ తెలుగు వారితో పాటు ఇక్కడి ముస్లింల భాషను గుంజుకోవడం, ధ్వంసం చేయడం జరిగింది. ఇంకా ఇంకా జరుగుతున్నది.
ఇవాళ నాలాంటి వారు ఇంట్లో మాట్లాడేది ఉర్దూ. చుట్టూ తెలంగాణ తెలుగు. బడిలో, కాలేజీల్లో, ఆఫీసుల్లో, మీడియాలో కోస్తాంధ్రా తెలుగు. అలాంటప్పుడు నేను ఏ భాషలో రాయాలి?
అరవై ఏళ్ళ తరువాత చూస్తే మొత్తంగా ఆంధ్రా ప్రాంతపు తెలుగే మనల్ని ఆక్రమించుకున్నది. ఈ క్రమంలో తెలుగు సాహిత్యానికి సమాంతరంగా తెలంగాణలో ఉర్దూ సాహిత్యమూ కొనసాగుతున్నదనే స్పృహలోనే ఎవరూ లేరు. అతి కొద్దిమంది తెలంగాణ తెలుగువారికి మాత్రమే ఆ విషయం తెలుసు. తెలంగాణలోని ఉర్దూ తనం గురించి ఎస్.సదాశివ, తెలంగాణ జాతిపిత జయశంకర్ ఎంతో చెప్పారు. వారితోపాటు బూర్గుల నరింగరావు, ఎమ్.టి.ఖాన్, కేశవరావు జాదవ్ లాంటి ఎందరో చెప్పే వాస్తవాలు పట్టించుకుంటే ఈ విషయాలు మనకు మరింత బాగా అర్థమవుతాయి.
ఉర్దూ మీడియం పాఠశాలలన్నీ తెలుగు మీడియం పాఠశాలలుగా మార్చబడినప్పుడు, తెలంగాణ తెలుగువారినే ఆ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా, అధ్యాపకులుగా నియమించి ఉంటే, వారికి ఇక్కడి పరిస్థితుల మీదా మనుషల మీదా ప్రేమ ఉండి అర్థం చేసుకుని మసిలేవారు. అలా కాకుండా ఆంధ్ర నుంచి వలస తీసుకురాబడిన తెలుగువారిని నియమించారు. వారి వల్ల ఇక్కడి వారు, ముఖ్యంగా ముస్లింలు ఎక్కువగా అవహేళనకు గురయ్యారు. హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఆంధ్రావారు ఉర్దూ పట్ల, ఉర్దూ కలగలిసిన తెలుగు పట్ల ఏమాత్రం మమకారం లేకుండా ప్రతి మాటలోనూ తెలంగాణవారిని, ముస్లింలను తక్కువచేసి మాట్లాడుతూ అవమానించారు. ఆత్మన్యూనతలో పడవేశారు. ఈ కారణాన తెలంగాణ తెలుగు భాషకు, ఉర్దూకు ఎక్కువ నష్టం జరిగింది. ఉర్దూ అంతర్థానమయ్యే ప్రమాదం ఏర్పడింది.
తెలంగాణ తెహజీబ్ (సంస్కృతి):
———————————–
ఎక్కువ కాలం ముస్లిం రాజుల పాలనలో ఉండటం వలన తెలంగాణ వారి సంస్కృతి ప్రాచ్య (ఓరియంటల్ ఇరాన్, ఇరాక్, టర్కీ వగైరా) దేశాల సంస్కృతితో ప్రభావితమైంది. కాబట్టి ఇక్కడి భాష, వేషధారణ, ఆహారపు అలవాట్లు, నిద్ర, కళలు, సాహిత్యం అన్నీ కూడా ప్రాచ్య దేశాలను పోలి ఉంటాయి. ఈ సంస్కృతికి భిన్నంగా చివరి 200 సంవత్సరాలు ఆంగ్లేయుల పాలనలో ఉండిన ఆంధ్రా ప్రాంతంవారు పశ్చిమ దేశాల (బిటన్, ఫ్రాన్స్, అమెరికా వగైరా) సామ్రాజ్యవాద సంస్కృతికి అలవాటు పడ్డారు. ఇట్లాంటి రెండు ప్రాంతాలను కలిపి ఉర్దూపై ఆంధ్రా తెలుగును ఆధిపత్య స్థానంలో నిలిపి తెలంగాణపై ఆంధ్రా అధికారం చెలాయించేలా చేయడంతో తెలంగాణ గంగా జమున తెహజీబ్ దెబ్బతింటూ కేవలం ఆంధ్రా ఆధిపత్యపు సంస్కృతి తెలంగాణ వారిపై రుద్దబడుతూ వచ్చింది. తెలంగాణ వారు, తెలంగాణ ముస్లింలు భూములు కోల్పోయిన వారిగా, ఆంధ్రా వాళ్లు భూములు ఆక్రమించుకున్న వారుగా తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో, హైదరాబాద్ చుట్టూరా కనిపించడం ఇందుకు ఒక నిదర్శనం.
ఆంధ్రా వారి డామినేషన్‌తో ముస్లిం కల్చర్‌లోని విభిన్న సాంస్కృతిక విషయాలు వివక్షకు గురవుతూ వచ్చాయి. ఆంధ్రావారికి తెలంగాణ ముస్లింలపై ఏ మాత్రం ప్రేమ లేదు. పైగా చిన్న చూపు. వెకిలిచూపూ. తమ ఆంధ్ర సంస్కృతి నుంచి ప్రతిదాన్నీ చూస్తూ ముస్లిం సంస్కృతుల్ని, అది మిళితమైన తెలంగాణ సంస్కృతిని చులకన చేస్తూ వచ్చారు. తెలంగాణ వారికి సంస్కృతీ సాంప్రదాయాలు తెలియవనీ, భాష రాదని, తాము వచ్చి అన్నీ నేర్పామని, నేర్పుతున్నామని, నిజమైన సంస్కృతి నేర్పుతున్నామనే అహంభావాన్ని ప్రదర్శిస్తూ వచ్చారు. ముఖ్యంగా ముస్లిం సంస్కృతి అంటే అదేదో పరాయి సంస్కృతి అన్న ఏహ్యభావం చూపుతూ వచ్చారు.
***
ఆంధ్రావారు వచ్చాకే మత ఘర్షణలు:
—————————————–
ఆంధ్రావారు వచ్చాకే హైదరాబాద్‌లో మత ఘర్షణలు జరిగాయి. అంతకు ముందు వందల ఏళ్లుగా తెలంగాణలో ‘హిందూ’ – ముస్లింలు కలిసిమెలిసి సహజీవనం కొనసాగిస్తున్నారు. ఆంధ్రా రాజకీయ నాయకులు ముఖ్యమంత్రుల్ని మార్చడానికి హైదరాబాద్‌లో మత ఘర్షణలు సృష్టించిన చరిత్ర అందరికీ తెలిసిందే. ఆంధ్రా వారి కేవల హైందవ సంస్కృతి వల్ల, దానికి తోడైన ఆరెస్సెస్ బ్రాహ్మణీయ భావజాలం వల్ల ఇవాళ మత ఘర్షణల్ని చూస్తున్నాం. హైదరాబాద్‌లోని ఎంఐఎం భావజాలం కూడ కొంతవరకు తోడైంది. కాని తెలంగాణ వ్యాప్తంగా ముస్లిం లందరూ ఎంఐఎంతో లేరన్న వాస్తవం ఇక్కడ గుర్తుంచుకోవాలి.
అయితే, చారిత్రకంగా, సాంస్కృతికంగా భావ సారూప్యత, సాంస్కృతిక సారూప్యత వల్ల తెలంగాణలోని తెలుగువారికీ, ముస్లింలకూ మధ్య సహజీవనం పెంపొందించుకోవడానికి వీలుంది. అందుకు తెలంగాణ ప్రత్యేక రాష్టం ఏర్పడడం అత్యవసరం.
తెలంగాణ ముస్లింల
వెనుకబాటుకు కారణాలేమిటి?
———————————-
1948 పోలీస్ యాక్షన్‌లో పండిట్ సుందర్‌లాల్, ఖాజీ మొహమ్మద్ అబ్దుల్ గఫార్ అధికారిక రిపోర్టు ప్రకారం హైదరాబాద్ రాజ్యంలో పోలీస్ యాక్షన్‌లో 50 వేల నుండి 2 లక్షల దాకా ముస్లింలు హత్య చేయబడ్డారు (చూడు: ముల్కి- ముస్లిం సాహిత్య ప్రత్యేక సంచిక, 2004, సం: వేముల ఎల్లయ్య, స్కై బాబ). వారి ఆస్తులు దోచుకోబడ్డాయి. ధ్వంసం చేయబడ్డాయి. ఆడవాళ్లు రేప్‌లకు, అపహరణలకు గురయ్యారు. మిల్ట్రీ సైతం ఆడవాళ్లను తమ క్యాంపుల్లో వారాల తరబడి రేప్‌లు చేశారు. మరోవైపు, రజాకార్ల పేరు మీద ఊర్లలో కమ్యూనిస్టుల ప్రోద్బలంతో ముస్లింలు తరమబడ్డారు. దోచుకోబడ్డారు. చంపబడ్డారు. ఒక భయోత్పాత వాతావరణం ఏర్పడింది. ప్రతి ముస్లిం రజాకారే అన్నట్లుగా ముస్లింలు టార్గెట్ చేయబడ్డారు. ఎక్కువమంది ముస్లింలు ఊళ్లలో ఆస్తులు, జీవనాధారాలు వదిలేసుకుని పట్టణాలకు పారిపోయి వచ్చారు. మళ్లీ వారు ఎంతటి కింది స్థాయి జీవితానికి నెట్టబడ్డారు? చంపబడ్డ ముస్లింల విధవరాండ్లు ఎంతటి దుర్భర జీవనంలోకి నెట్టబడ్డారు? అమాయకులైన ముస్లింలు ఎవరైతే చంపబడ్డారో.. వారి ప్రాణాలకు, నష్టపోయిన ముస్లింల జిందగీలకు నష్టపరిహారం ఎవరు కట్టిస్తారు? అసలా ఆలోచనే ఎవరూ ఎందుకు చేయలేదు? ఇలా అడిగినవారిని అనుమానించే వాతావరణం తెలంగాణలో ఎందుకొచ్చింది? ఇవాళ ముస్లిం హక్కుల గురించి పని చేయాలనుకున్న ప్రతిముస్లింపై నిఘా ఉంది. వారికి ఏ సంబంధాలు లేకున్నా అనుమానించి, వెంటపడి, వేటాడి వారిని ఎందుకూ పనికిరానివారిగా, ఏ పనీ చేయకుండా ఈ రాజ్యం చేసి పారేస్తున్నది. హైదరాబాద్ పాతబస్తీలో మక్కా మజీదు పేలుళ్ల విషయంలో దాదాపు 200 మంది ముస్లిం యువకులని అనుమానించి, పట్టుకొని, చావచితకబాది, వారిని మరెందుకూ పనికిరానివారిగా మార్చింది ఈ రాజ్యం. ఆ పేలుళ్లు హిందూ తీవ్రవాదులు స్వామి అసీమానంద్, ప్రజ్ఞా ఠాకూర్, పురోహిత్ శర్మ తదితరులు (అభినవ్ భారత్ హిందూత్వ ఉగ్రవాద సంస్థ) చేశారని తెలిసినాక ముస్లిం యువకుల్ని వొదిలిపెట్టారు. ఈ పేలుళ్లకు కారకులు ముస్లింలే అన్న అభియోగానికి ప్రచారం కల్పించినంతగా, దొరికిపోయిన హిందూ టెర్రరిస్టుల విషయం ప్రముఖంగా ప్రచురించడానికి, వివరంగా రాయడానికి హిందూ మీడియా అంతగా ఆసక్తి చూపకపోవడం గమనార్హం!
ఇన్నాళ్లు బిజెపి, ఆరెస్సెస్ వాళ్లు ముస్లింలు భారతీయులు కారంటూ ప్రచారం చేస్తూ వచ్చారు.. ముస్లింలకు బీసీ ఇ రిజర్వేషన్ కల్పించినప్పుడు బిసీ నాయకులు కొంతమంది ముస్లింలు బీసీలు ఎట్లవుతారంటూ అసంబద్ధ వాదనలు చేశారు.. దాంతో మా’మర్ఫా’ముస్లిం రిజర్వేషన్ మూవ్‌మెంట్ తరఫున ‘మరి ముస్లింలు ఎవరు?’ (జఖ్మీ ఆవాజ్,స్కైబాబ, 2012) అంటూ ఒక కరపత్రం వేశాం.
కేవలం రెండు నుంచి మూడు శాతం ముస్లింలు మాత్రమే ఈ దేశంలో బైటి దేశాల నుంచి వచ్చినవారు. మిగతా 97 శాతం ఈ దేశవాసులే. అందులో 90 శాతంమంది ‘అంటబడనివ్వని’ కులాల నుంచీ, ‘వెనకబడేయబడ్డ’ కులాల నుంచీ ఇస్లాం స్వీకరించినవారే. ఈ దేశ మూలవాసులే. (ఈ విషయాన్ని తొక్కిపెట్టి హ్రిందూత్వ, బ్రాహ్మణీయ వాదులు కుట్ర చేశారు. ముస్లింలను బైటి దేశస్తులుగా దుష్ర్పచారం చేశారు. దేశద్రోహులుగా, ఉగ్రవాదులుగా ముద్రలు వెయ్యడానికి ప్రయత్నించారు.)
ఆదివాసీ దళిత బహుజనులు 60కి పైగా వృత్తుల్లో ముస్లింలు కొనసాగుతున్నారని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. దీన్నిబట్టి ఆయా కులాలవాళ్లే ముస్లింలుగా మారారని అర్థమవుతుంది. ఇట్లాంటివాళ్లను రిజర్వేషన్లకు ఇన్నాళ్లు దూరంగా ఉంచి, వారి బతుకులు ఛిన్నాభిన్నమయ్యేలా కుట్ర చేశా రు బ్రాహ్మణీయ వాదులు. ఇస్లాం స్వీకరించక ముందు ముస్లింలకు కులవృత్తులుండేవి. అక్కడా ఇక్కడా నవాబుల పాలన ఉన్న సమయంలో తమది ‘నవాబుల మతం’గా భావించి కొంత, ఆయా వృత్తుల్లో కొనసాగుతున్నవాళ్లను ఇతర బ్రాహ్మణ సమా జం ‘నీచం’గా చూస్తుండడంవల్ల మరింత ముస్లింలంతా వృత్తులు వదిలేసుకున్నారు. చిన్నాచితక ఉద్యోగాలు సంపాదించుకున్నారు. కొంత భూముల్ని పట్టా చేయించుకున్నారు. వ్యవసాయం చేయడానికి, చేయించుకోడానికి వీళ్లేమీ రెడ్లూ, కమ్మలూ, వెలమల్లాంటి అగ్రకులస్థులు కాకపోవడంతో తర్వాత్తర్వాత ఆ భూములు రెడ్లు, కమ్మలు, వెలమలే సొంతం చేసుకున్నారు. (కల్లు తాగించి, కోడి కోసం దావత్‌లు ఇచ్చి ఆ అప్పు కిందనో, మాయమాటలు చెప్పో రాయించుకున్నారు!).ఇటు వృత్తులు లేకుం డా పోయాయి, అటు భూముల్లేకుండా పోయా యి. రెంట చెడ్డ రేవడి బతుకులయ్యాయి. అదనంగా రిజర్వేషన్లు లేకుండా చెయ్యడంతో ముస్లింల బతుకులు అన్యాయమైపోయా యి. రోడ్డున పడ్డాయి. ఇటు చదువుకునే అవకాశాల్లేక, అటు ‘ఓసీ’ కావడంతో ఉద్యోగాలు రాక ‘న ఘర్‌కా న ఘాట్‌కా’ బతుకుపూైపోయాయి. ఇవాళ రోడ్ల పక్కన ‘చిల్లర’ బేరగాళ్లంతా ముస్లింలే కావ డం యాదృచ్ఛికం కాదు.. పండ్ల బండ్లవాళ్లు, మెకానిక్‌లు, డ్రైవ ర్లు, క్లీనర్లు, పంక్చర్‌లు గడియారాలు బాగుచేసేవాళ్లు, చాయ్ డబ్బాలవాళ్లు, చిన్నచిన్న చెప్పుల షాపులు, టెంట్‌హౌజ్‌లవాళ్లు, దర్జీలు అంతా ముస్లింలే! వీటన్నింటికి కార ణం వివక్ష. అణచివేత. రాజ్యం ముస్లింలను రెండవ తరగతి పౌరులుగా చూడడం ముస్లింల వెనుకబాటుకి బలమైన కారణం.
ఈ పరిస్థితిని అధిగమించాలంటే ముస్లింలను తెలంగాణలో అతి పెద్ద సమూహంగా గుర్తించి వారి పురోభివృద్ధికి అందరూ పూనుకోవాలి. అన్ని రంగాల్లో ముస్లింల ప్రాతినిధ్యం, ఉర్దూ మాట్లాడేవాళ్ల ప్రాతినిధ్యం ఉండేలా చూడాలి. ఉర్దూ తెలంగాణ ద్వితీయభాషగా ప్రకటించి అమలు పర్చాలి. తెలంగాణ గురించి కమ్యూనిస్టులు, ఆంధ్రవలస పాలకులు రాసిన చరిత్ర ఆధారంగా ముస్లింలను చూడకుండా, తెలంగాణలో ముస్లింలు ఒక భాగం అని నమ్మేవాళ్ళు కొత్తగా రాసే చరివూతను ఆధారం చేసుకోవాలి. నిజాంరాజుల పాలనను ‘ముస్లిం పాలన’ అనడాన్ని వ్యతిరేకించా లి. ముస్లింలు 400 ఏళ్ళ పాలకులనే ప్రచారాన్ని ఖండించాలి. ముస్లిం రాజులతో ముస్లిం ప్రజలకు సంబంధం లేదన్న విషయా న్ని గుర్తించాలి. ఉర్దూలో, పార్శీలో ఉండే సోర్సెస్ (ఆధారాలు) వెలికి తీయడం ద్వారా అనేక అబద్ధపు ప్రచారాలు, అసలు నిజా లు వెలుగులోకి వస్తాయి. కనుక ఆ ప్రయత్నం చేపట్టాలి. ఆంధ్రు ల వలస వల్ల చిల్లర వ్యాపారాల దగ్గరనుంచి ఉద్యోగాల దాకా ముస్లింలు అన్యాయానికి గురయిన, గురవుతున్న విషయం గుర్తించి, దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. హైద్రాబాద్‌లాంటి చోట్ల పోలీసు శాఖలో ముస్లింల శాతం మరీ తక్కువగా ఉన్నది. దీనివల్ల ఎంతో వివక్ష కొనసాగుతున్నది. ఇది ఏ భావజాలం వల్ల జరుగుతున్నది? దీని వెనుక రాజకీయాలేంటి? లాంటి విషయాలపై దృష్టి పెట్టాలి. పోలీసుల భర్తీలో ముస్లింల ప్రాతినిధ్యం పెంచాలి. ముస్లింలకు, తెలుగోల్లకు మధ్య ఏ ఏ కారణాల వలన అంతరం పెరుగుతున్నదో చూడాలి. నివారణ చర్యలు చేపట్టాలి. సహజీవన వాతావరణాన్ని పెంపొందించాలి. ముస్లింల మూలాల అధ్యయన కేంద్రం ఏర్పాటు చేయాలి. తెలుగు ఉర్దూ ముస్లిం రచయితల కోసం ప్రత్యేక అధ్యయన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. వారి సాహిత్యాన్ని ఇరు భాషల్లోకి అనువాదం చేయించాలి.