హైదరాబాద్ తెలంగాణదే
రాష్ట్ర మంత్రి శైలజానాథ్ సాకే ఆంధ్రజ్యోతిలో రెండు వ్యాసాలు రాసిండ్రు. అవి- ఆగస్టు 31న 'హైదరాబాద్ ఎవరిది?', సెప్టెంబర్ 3న 'కులీ భాగ్యంలో కిరణ్‌కూ హక్కు'. హైదరాబాద్ మీద సీమాం«ద్రులకూ హక్కు ఉన్నదని చెబుతూ దానికి సమర్థకంగా అనేక చారిత్రకాంశాలను ప్రస్తావించిండ్రు. అయితే చరిత్రను వస్తుగతంగా కాకుండా, సీమాంధ్రకు అనుకూలంగా వ్యాఖ్యానించడం అసమంజసం. ఆ అసమంజసతలను బయటపెట్టి హైదరాబాద్ మీద హక్కు ఎవరిదో తేల్చడం ఈ వ్యాస ఉద్దేశం. '..కాకతీయాంధ్ర సామ్రాజ్య విచ్ఛిన్నం తరువాత విడిపోయిన తెలుగు ప్రాంతాలన్నీ గోల్కొండ నవాబుల కృషితో తిరిగి ఏకమయ్యాయి' అన్నాడాయన. కానీ చరిత్ర దీనికి భిన్నంగా ఉంది. కుతుబ్‌షాహీల (గోల్కొండ నవాబుల) పాలనలో మొదటినుంచి చివరివరకూ స్థిరంగా ఉన్నది తెలంగాణ మాత్రమే. తెలంగాణేతర తెలుగు ప్రాంతాలు కొన్ని కొంతకాలమే వారి పాలనలో ఉన్నవి. ఈ వంశస్థాపకుడు సుల్తాన్ కులీ క్రీ.శ. 1496 నుంచి క్రీ.శ.1534 దాకా తెలంగాణకు పరిమితమయ్యిం డు. చివరి దశలోనే కృష్ణా గోదావరి నదుల మధ్యగల తీరాంధ్రను జయించిండు.
క్రీ.శ.1572లో రాజమండ్రి, కశింకోట వీరఘట్టం; క్రీ.శ.1575-1579ల మధ్య కొండవీడు, వినుకొండ, కంభం, కొచ్చర్లకోట, మాచర్ల, అద్దంకి, అమ్మనబ్రోలు, కందుకూరు, పొదిలి, దర్శి, గురజాల, కారెంపూడి, తంగెడ, దూపాడు, కాకర్ల, కేతవరం ఇబ్రహీం కుతుబ్‌షా పాలనలోకి వచ్చినవి. క్రీ.శ. 1580 తర్వాత కర్నూలు, గుత్తి, ఉదయగిరి, గండికోట, పెనుగొండలు కులీకుతుబ్‌షా పాలనలోకి వచ్చినవి. కానీ కొండవీడు మినహా మిగిలిన దక్షిణాంధ్రను వెంటనే వెంకటపతి రాయలు వశం చేసుకున్నాడు. ఆ తర్వాత, శ్రీకాకుళం దాకా కులీ పాలనలోకి వచ్చింది. అయితే ఈ ప్రాంతాల్లో నిరంతరం తిరుగుబాట్లు జరిగి ఎప్పుడు ఎవరి పాలనలో ఉన్నది తేల్చడం కష్టం. క్రీ.శ.1653లో తీరాంధ్ర మొత్తం గోల్కొండ సామ్రాజ్యంలో విలీనమైంది. ఈ చరిత్రను బట్టి తెలిసేదేమిటంటే సీమాంధ్ర మొత్తంగా ఒకేసారి కుతుబ్‌షాహీల పాలనలోకి రాలేదని, విడతలు, విడతలుగా వచ్చిందని, అదీగాక మొత్తం సీమాంధ్ర కుతుబ్‌షాహీల పాలనలో ఎన్నడూ లేదని. దీనినిబట్టి కుతుబ్‌షాహీల కాలంలో జరిగిన హైదరాబాద్ నగరాభివృద్ధిలో సీమాంధ్ర భాగస్వామ్యం స్వల్పమని తెలుస్తుంది.
'గోల్కొండ సామ్రాజ్యానికి కొండపల్లి సర్కార్ నుంచి సంవత్సరానికి 40,000 హొన్నులు, మచిలీపట్టణం సర్కారు నుంచి 18,000 హొన్నులు, నిజాంపట్టణం నుంచి 60,600 హొన్నులు ఆదాయం వచ్చేదని రికార్డులు తెలియజేస్తున్నాయి' అని, వజ్రాల గనుల నుంచి మూడు లక్షల హొన్నులు వచ్చేయని ఆయన కొన్ని లెక్కలు ఇచ్చిండు. ఇవి వాస్తవమే. ఎందుకో ఆయన భూమి శిస్తును లెక్కవేయలేదు. కోస్తాంధ్ర నుంచి భూమి శిస్తు 41,03, 253 హొన్నులు వచ్చేవి. ఈ అన్నింటి మొత్తం 45,21,853 హొన్నులు. అయితే తెలంగాణ నుంచి వచ్చిన ఆదాయ వివరాలు ఇవ్వకుండా ఆయన జాగ్రత్త పడిండు. వర్తక వాణిజ్యాల ద్వారా వచ్చే ఆదాయం కాకుండా కేవలం భూమి శిస్తు ద్వారానే తెలంగాణ నుంచి 1,17,69,473 హొన్నులు ఆదాయంగా వచ్చేది. ఇదంతా పక్కన పెట్టి 'సర్కారు ప్రాంతం నుంచి గోల్కొండ సామ్రాజ్యానికి సుమారు రెండు కోట్ల హొన్నులు ఆదాయంగా వచ్చేది. అందులో కోటి హొన్నులు హైదరాబాదు నగరాభివృద్ధికి...' ఖర్చుపెట్టారని, అందువల్ల హైద్రాబాద్‌లో మాకూ వాటా ఉందని ఆయన అంటాడు. ఈ రెండుకోట్లు ఎక్కడివో? (పై లెక్కల కోసం ఆయన రిఫర్ చేసిన పుస్తకంలో ఈ రెండు కోట్లు లేవు).
ఈ సందిగ్ధతకు మించి ఈ లెక్కల్లో ఒక వక్రీకరణ దాగి ఉంది. హైదరాబాద్ నిర్మాణం క్రీ.శ. 1592లో జరిగితే ఈ లెక్కలేమో అబుల్ హసన్ (క్రీ.శ.1672-1687) కాలానికి చెందినవి. డచ్చివారితో సహా ఐరోపా వారి వాణిజ్య సంస్థలు, ఫ్యాక్టరీలు ప్రారంభమయ్యిందే క్రీ.శ. 1602 తర్వాత. అంటే హైద్రాబాద్ నిర్మాణం పూర్తయిన తర్వాత మాత్రమే. 1592 తర్వాత హైద్రాబాద్ మిగతా అభివృద్ధి అసఫ్‌జాహీ (నిజాములు)ల కాలం (క్రీ.శ.1724-1948)లో జరిగింది. అసఫ్‌జాహీల చరిత్రనంతా ఏకరువు పెట్టి శైలజానాథ్, 'బ్రిటిష్ వారి మైత్రి కోసం కోస్తాంధ్ర జిల్లాలను రాయల సీమాం«ద్ర ప్రాంతాల్ని వారికి తెగనమ్మాడు నిజాం. అక్కడి ప్రజల రక్త మాంసాలను పీల్చి పిప్పిచేసి వసూలు చేసిన కప్పాలను తెచ్చి హైద్రాబాద్ సంస్థానంలో పరిపాలనకు, హైద్రాబాద్ నగర అభివృద్ధికి... ఉపయోగించారనేది చారిత్రక వాస్తవం' అంటారు.
నిజాం తెగనమ్మడం వల్లకాదు, ఆంగ్లేయుల కుట్రల వల్ల, రాజనీతివల్ల క్రీ.శ.1768 నాటికి కోస్తాంధ్ర, క్రీ.శ.1800ల నాటికి రాయలసీమ ఆంగ్లేయుల వశమయినవి. చరిత్రకారులు రాసిన ఈ కింది మాటలతో అది స్పష్టమవుతుంది. 'ఈ సంధి (క్రీ.శ.1800ల నాటి సైనిక సహకార సంధి)తోనే నైజాం స్వాతంత్య్రాన్ని కోల్పోయి కంపెనీకి సామంతుడయినాడు.' ఇది రాసింది తెలంగాణ చరిత్రకారుడు కాదు. కోస్తాంధ్ర చరిత్రకారుడైన బి.ఎస్.ఎల్.హనుమంతరావు.సామంతుడయినవాడు, కోల్పోయిన ప్రాంతాలనుంచి అక్క డి ప్రజల రక్తమాంసాలను పీల్చిపిప్పిచేసి కప్పం వసూలు చేయ డం, దాన్ని హైద్రాబాద్ నగరాభివృద్ధికి ఉపయోగించడం ఎట్లా సాధ్యమో శైలజానాథ్‌కే తెలియాలి. అదీగాక, కుతుబ్‌షాహీల పతనం (క్రీ.శ.1687) తర్వాత ప్రాభవాన్ని కోల్పోయిన హైదరాబాద్ తిరిగి ప్రాభవాన్ని సంతరించుకుని శరవేగంగా అభివృద్ధి చెందింది క్రీ.శ.1800 తర్వాత, సాలార్జంగ్ సంస్కరణలు మొదలు పెట్టిన (క్రీ.శ.1853) తరువాత మాత్రమే. ఆ అభివృద్ధి క్రమం ఇలా ఉంది- సికిందర్‌జా కాలంలో సికింద్రాబాద్ (1807), మీర్ ఆలం టాంక్ (1808) నిర్మించబడినవి. నాసిరుద్దౌలా (1829- 1857) కాలంలో చాదర్‌ఘాట్ బ్రిడ్జి, కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ హాస్పిటల్ (1854-ఇదే తర్వాత గాంధీ హాస్పిటల్ అయింది) లాంటివి నిర్మించారు. ఇతని మంత్రి సాలార్జంగ్ ఆధ్వర్యంలో హైద్రాబాద్ రాష్ట్రంలో ఆధునికత ప్రారంభమైంది. తత్ఫలితంగానే ఆధునిక నిర్మాణాలూ వచ్చినవి. అఫ్జలుద్దౌలా (1857- 1869) మొదటి రైల్వేలైన్ (1860), సెయింట్ ఆన్స్‌స్కూల్ (1861), అఫ్జల్ గంజ్, అఫ్జల్‌గంజ్ బ్రిడ్జ్ నిర్మించబడినవి.
మహబూబ్ అలీ (1869- 1911) కాలంలో కాటన్ మిల్లులు, ఇరిగేషన్ ప్రాజెక్టులు, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ (1874), ఆలియా స్కూల్ (1878), చంచల్ గూడ జైలు (1882), ఫలక్‌నుమా ప్యాలెస్ (1884), టెలిఫోన్ వ్యవస్థ (1885), సైన్స్ పరిశోధనకు నిజామియా అబ్జర్వేటరీ (1890), అసఫియా (ఇప్పటి స్టేట్ సెంట్రల్ లైబ్రరీ) లైబ్రరీ (1891), మహబూబియా బాలికల పాఠశాల (1908), విద్యుత్ ఉత్పత్తి (1910), మోండా మార్కెట్, జింఖా నా గ్రౌండ్, పరేడ్ గ్రౌండ్, బొల్లారం గోల్ఫ్ కోర్స్ మొదలగునవి ఏర్పడినవి. ఉస్మానలీ (1911-48) కాలంలో ఉస్మాన్ సాగర్ (1918 గండిపేట), హిమాయత్ సాగర్, హైద్రాబాద్ నగరాభివృద్ధి సంస్థ (1912), ఉస్మానియా హాస్పిటల్, ఉస్మానియా యూనివర్శిటీ (1919), హైకోర్ట్, జూబ్లీహాల్, అసెంబ్లీ, సెక్రటేరియట్, రాజ్‌భవన్, మొజంజాహీ మార్కెట్, హైద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మొదలగునవి నిర్మించబడినవి. ఈ అభివృద్ధి అంతా సీమాంధ్రతో సంబం ధం లేకుండా తెలంగాణ ప్రజల రక్తమాంసాలతో చెమటతో జరిగిందే. ఇక ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత తెలంగాణ నిధుల్నే సీమాంధ్రలో ఖర్చుపెట్టినట్లు, 1969-73 ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సందర ్భంగా అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వమే ఒప్పుకుంది. మరి హైద్రాబాద్ అభివృద్ధిలో సీమాంధ్ర భాగస్వామ్యమెక్కడ? 1970 తర్వాత జరిగిన నగరాభివృద్ధిలో వారి పాత్రయేమిటో ఎవరి 'అభివృద్ధి' జరిగిందో ఎవరి విధ్వంసంజరిగిందో మన 'కళ్ళ ముందరి చరిత్రే'. 420 ఏళ్ల హైద్రాబాద్ నగరాభివృద్ధిలో సీమాంధ్ర దోహదం సముద్రంలో కాకిరెట్టంత ఉంటే ఉండవచ్చు. దానికే ఇంత హంగామా చేస్తే వందల ఏళ్ల అనుబంధమున్న తెలంగాణ ప్రజలు ఎంత బాధపడాలె?
శైలజానాథ్ ప్రస్తావించిన రెండో అంశం: 'ఆంధ్రప్రదేశ్ ఏర్పడే నాటి తెలంగాణాంధ్రకు బహు సంపద ఉన్నదనేది ఒక అపోహ' అంటూ, ఆంధ్ర రాష్ట్రంలో కలవకపోతే తెలంగాణ స్వయం పోషకంగా ఉండజాలదని తెలంగాణ ప్రజలే భావించారని చెబుతూ దానికి నిదర్శనంగా, గజ్వేల్ ఎమ్మెల్యే పెండెం వాసుదేవ్ హైద్రాబాద్ రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడిన మాటల్ని సుదీర్ఘంగా ఉల్లేఖించిండ్రు వారు. పెండెం వాసుదేవ్ విశాలాంధ్రవాది. ఆయన వాదన, చెప్పిన లెక్కలు ఆ వాదానికి అనుకూలంగానే ఉం టవి. ఆనాటి అసలు లెక్కలు వాసుదేవ్ వాదన తప్పని తెలియజేస్తున్నవి. కొన్ని చూద్దాం. (1) పెండెం వాసుదేవ్ తెలంగాణలో ధాన్యం ఉత్పత్తి ఏడున్నర లక్షల టన్నులని చెప్పా రు. కానీ అది 13,08,115 టన్నులని ఆనాటి లెక్కలు చెబుతున్నవి. పప్పు ధాన్యాలను కలుపుకుంటే అది 17,08,185 టన్నులు; (2) 1933 నాటికే హైద్రాబాద్ రాష్ట్రంలో 9,62,807 ఎకరాల్లో వరి పంట పండుతుందని, గోల్కొండ పత్రిక (29.3.1933) రిపోర్ట్ చేసింది. 1948 నాటికి 32,900 చెరువులు, కుంటలు ఉండేవి. వీటి కింద పన్నెండు లక్షల ఎకరాలు సాగయ్యేవి. ఇవికాక 8,43,210 బావులు, పర్రె కాలువల కింద వరి పంట పండించేవారు; (3) 1939 నాటికి తెలంగాణలో 47 వేలమంది కార్మికులుండగా 1941 నాటి సీమాంధ్రలో 41 వేలమంది కార్మికులే ఉన్నారు.
దీనిని బట్టి పారిశ్రామికంగా సీమాంధ్ర కంటే తెలంగాణ ముందంజలో ఉందని అర్థమవుతుంది; (4) ఆనాటి ఆంధ్ర రాష్ట్ర ఆదాయం 20.77 కోట్లు ఉండి 2.2 కోట్లు లోటుతో ఉండేది. అక్కడ మనిషి సగటు ఆదాయం రూ.9.8 ఉండేది. హైద్రాబాద్ రాష్ట్ర ఆదాయం 27.8 కోట్లు ఉండి, 1.39 కోట్ల మిగులు ఉంది. మనిషి సగటు ఆదాయం రూ.18 ఉండేది. ఇవన్నీ చూసి ఆనాటి విశ్లేషకులు ఈ కింది విధంగా రాసిండ్రు. 'పంట కొరత ఉంటుందనీ ఆహార లోపం ఏర్పడుతుందనీ అనడం సత్యాన్ని కప్పిపుచ్చడమే' 'స్వయం పోషక రాజ్యం, మనుగడ సౌకర్యం తెలంగాణమునకు పరిపూర్తిగా గలదు'. ఇక శైలజానాథ్ ప్రస్తావించిన మూడో అంశం 'మూడు ప్రాంతాల ప్రజల ఆమోదంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సాధించుకున్నారు' అని పాతపాటనే మళ్ళీ పాడారు. విలీనానికి తెలంగాణ ప్రాంత ప్రజలు అంగీకరించలేదనే విషయం కోసం మళ్ళీ ఒకసారి ఫజల్ అలీ కమిషన్ నివేదికను చూడవచ్చు. మీ ప్రాంత నాయకుల లాబీయింగుకు, ప్రలోభాలకు కొంతమంది తెలంగాణ నాయకులు లొంగిపోయారు. కానీ ప్రజలు కాదు. హైద్రాబాద్ స్టేట్ అసెంబ్లీలో 1952లో విలీన తీర్మానం ఓడిపోయింది. పార్లమెంటులో తెలంగాణ ఎంపీ మాధవరెడ్డి విలీనాన్ని తీవ్రంగా వ్యతిరేకించిండు.
నాలుగో అంశం 'దీని (హైద్రాబాద్ డిమాండ్) వెనక ఏ రకమైన కుట్రలు కుతంత్రాలు లేవు వలసవాద దృక్పథం అంతకన్నా లేదు' అని మరీ అమాయకత్వాన్ని నటించారు ఆయన. ఇది అతి పెద్ద అబద్ధం. హైద్రాబాద్‌లో ఆంధ్ర ప్రాంతంవారు ఆక్రమించుకున్న, చవగ్గా కొట్టేసిన భూములు, కొల్లగొట్టిన ఉద్యోగాలు, నీళ్ళు, నిధులు వలసవాద దృక్పథానికి నిదర్శనం కాదా? పైన పేర్కొన్న అనేక కారణాల వల్ల హైద్రాబాద్ మీద మీకు హక్కులేదు. హైద్రాబాద్ ముమ్మాటికీ తెలంగాణదే.
- డాక్టర్ సుంకిరెడ్డి నారాయణరెడ్డి
విశ్రాంత అధ్యాపకులు, తెలంగాణ చరిత్రకారులు
- డాక్టర్ సుంకిరెడ్డి నారాయణరెడ్డి
విశ్రాంత అధ్యాపకులు, తెలంగాణ చరిత్రకారులు
This comment has been removed by the author.
ReplyDeleteఅయినా అంతో ఇంతో హైదరాబాదుపై మాకు హక్కుంది అని తీరస్థాంధ్రులు అంటే ఆ విషయం కూర్చొని చర్చించవచ్చు. కాని రాయలసీమ ప్రతినిధిగా శైలజానాథ్ కి అసలు హక్కే లేదు. ఎందుకంటే రాయలసీమ 1799 వరకు టిప్పు సుల్తాన్ పాలనలో మైసూర్ రాజ్యంలో ఉంది. టిప్పు సుల్తాన్ ను జయించడంలో బ్రిటిష్ వారికి సహాయపడ్డందుకు వాళ్ళు నిజాంకు రాయలసీమను నజరానాగా 1799లో ఇచ్చారు. మళ్ళీ సైనిక ఒప్పందం మేరకు 1801లో రాయలసీమను వెనుకకు తీసుకొన్నారు. ఆ రకంగా హైదరాబాదుతో రాయలసీమకు ఉన్న అనుబంధం మొత్తం చరిత్రలో రెండేళ్ళు మాత్రమే
ReplyDeleteడా.ఆచార్య ఫణీంద్ర - good that you agreed about Andhras right on hyderabad. at least partially.
ReplyDeleteregarding Rayalaseema right, when tippu lost rayalasema Nizam got lot of money looted from them.
Bhallari is part of Rayalasema which is part of hyd state till 1956, even some part of rayachur.
appudu bhallari vallaku hakku vuntundhi kani ippudunna rayalseema vaalaku ela vuntadhi
ReplyDeleteహైదరాబాద్ తెలంగాణదే!అనే సుంకిరెడ్డి నారాయణ రెడ్డి గారి వ్యాసం చారిత్రిక నేపద్యంతో వాస్తవాలను నిగ్గు తేల్చి నిరూపించింది!భ్రమల్లో ఉన్న సీమాంధ్ర నాయకులకు ఇప్పటికైనా కనువిప్పు కలగాలి!మేము వాకిలి అలికి ముగ్గుపెట్టాం కాబట్టి ఇంటిలో నాకు భాగం ఉంది అనడం హాస్యాస్పదం!ఇల్లు అలుకగానే పండుగ కాదు!ఇసుంట రమ్మంటే ఇల్లంతా నాదే అన్నట్లుంది!మద్రాస్ నుంచి విదివదినప్పుడు కూడా వీళ్ళు మద్రాస్ ను మేమే అభివృద్ధి చేశాం అది మాకే రాజధాని కావాలి అంటే తమిళులు తక్షనం మద్రాస్ నుంచి ఎకాఎకిన కట్టుబట్టలతో తరిమేశారు!వీళ్ళకు పదేళ్ళు తాత్కాలిక రాజధానిని ఇచ్చినా హైదరాబాద్ ను భ్రష్టు పట్టిస్తారు!దశాబ్దం తర్వాత ఇక్కడినుంచి పోవడానికి మళ్ళీ కిరికిరిపెడతారు!అదీకాక వాళ్ళు తాత్కాలిక రాజధానిని కోరుకోవడం లేదు కూడా!కేసీఆర్ గారు తప్పక పునరాలోచించాలి!
ReplyDeleteసాధారణ పౌరుడు -
ReplyDeleteఆ లూటీ చేసిన వాడు నిజాం కాదు. మిమ్మల్ని అందరినీ మద్రాసు రాష్ట్రంలో పెట్టి బానిసలుగా పాలించిన బ్రిటిష్ వాడు. మీ సంపదలను దోచుకొని లండన్ కు తరలించుకొని వెళ్ళాడు. అందుకని ఇప్పుడు మీరు బ్రిటిష్ వాళ్ళతో... "లండన్ మాది" అని పోట్లాడితే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో- తీరస్థాంధ్రులైనా, రాయలసీమ వాళ్ళయినా "హైదరాబాదు మాది" అంటే అంతే హాస్యాస్పదంగా ఉంది. ఈ విషయం సీమాంధ్రులకు తప్ప ప్రపంచంలో అందరికీ అర్థమై నవ్వుకొంటున్నారు.
వ్యాసం సంగతి ఏమో గాని హైదరాబాద్ తెలంగాణ లో భాగం. విడిపోయి కలసి ఉందాం. దూరంగా ఉంటేనే ప్రేమలు పెరుగుతాయి.- అజ్గార్ అలీ
ReplyDeletethanks friends
ReplyDelete