Sunday, 22 September, 2013

హైవానియత్ (ఎ పోయం ఆన్ గుజరాత్ జెనోసైడ్)

హైవానియత్ (ఎ పోయం ఆన్ గుజరాత్ జెనోసైడ్)


'పహ్‌లీబార్ సబ్ కుచ్ బచా
దూస్రీబార్ బచీ జాన్‌
తీస్రీబార్ నామో నిషాన్ మిట్ జాయేగా'
                               - గుజరాత్ గోడ మీది వాక్యాలు 

జన్మకు ఆరని అలజడి వెన్నంటి వచ్చింది
లయ తప్పిన వేలగుండెల ధ్వని నా గుండెలో
వేల ముఖాల వేలవేల చీకట్ల తర్జుమా నా మొఖం

కన్ను మలుగుత లేదు
కనుపాపలమీద పరుగులు పెడుతున్న పాదాలు
దూసుకొస్తూ త్రిశూలాలు కరవాలాలు బరిసెలు
పొడుచుకొచ్చిన కన్ను తెగిన కాలూ చెయ్యి తల
నెత్తురు కారుతున్న మర్మాంగాలు
అంతా రక్తం
ఆకు పచ్చని రక్తం

ధ్యాసెక్కడిది
ముండ్లా పురుగూ పుట్రలా
రాళ్ళా కొండలా చీకటా
అడ్డం పడి ఉరుకుతూ
అడవినో ఎడారినో కాళ్ళకింద పరుగెత్తిస్తూ
వెలుగు కావాలి
నమ్మకం కావాలి
నెలవంకల వెలుగు కావాలి

కుడికన్ను చూస్తుండగానే 
ఎడమకన్ను పెరికివేత
భార్యల కనురెప్పల మీదే భర్తల దహనం
భర్తల పిచ్చి చూపుల ముందే
బరిసెలు దిగబడిన యోనుల రక్తం కేకలు
యోనుల రక్తస్రావంలో మునిగిపోతున్న నా దేశం

ఎడమకాలు వెంట కుడికాలు ఉరికొస్తుందన్న నమ్మకమేది?
ముసలి తల్లిదండ్రులు పసిబిడ్డలు
నిండు చూలాల్లు పచ్చి బాలింతలు
ఎవరున్నారో ఎవరు లేరో
చెల్కల్లో తగలబడి ఉన్న బూడిద కుప్పల్లో 
ఎన్నెన్ని ముఖాలు వెతుక్కోవాలి

పండు ముడతల అమీనా బీబీ 
ప్రతి ముడతా సాపిస్తున్నది

కవాబులా ఉడికిన ఈ పసిదేహం పేరెవరు చెప్తారు
చేపలా చీల్చిన ఆ యువతి శవం కథ ఎవరు చెప్తారు
పతా తెలీకుండా మాడిన ప్రతి దేహమూ సాపిస్తున్నది
'తరాల మా నమ్మకాల్ని తగలబెట్టేసిన పాపం ఊరికేపోదు'

'అల్లా హమే లేలియాతో యే జహన్నుమ్‌సే భీ అచ్ఛా హోతా'
సరీఫా బాను ఏడుస్తున్నది
భూమితల్లి ఏడుస్తున్నది
తన గుండెల మీదే ఆడిన తన బిడ్డల్ని 
తన ఒంటిమీదే నగ్నంగా ఉరికిస్తూ ఆడుకున్న 
రామ సంతతి అకృత్యాలు చూసి-
నగ్నంగా పడేసి
సామూహిక బలాత్కారాలు చేసిన అకృత్యాలు చూసి-
భూమి తల్లి ఏడుస్తున్నది
అవాళ సీత కష్టాలు చూసి ఏడ్చి ఏడ్చి పగిలిన భూమితల్లి 
ఆమెను అక్కున చేర్చుకున్నట్లే
ఇవాళ రామ సంతతి అకృత్యాలకు బలైన తన బిడ్డల్ని 
అక్కున జేర్చుకుంది
కన్ను మలుగుత లేదు
కన్ను మలిగితే చీకటి
చీకట్లో చెల్లా చెదురైన ఊరు
తుంపలు తుంపలుగా
కన్ను మలిగితే 
ఏడేళ్ల ఇమ్రాన్‌ కెవ్వున అరుస్తూ...

అదే చీకటి
చీకట్లో ఒక్కో అమానుష దృశ్యం
శకలాలు శకలాలుగా మీదికి రాల్తూ

పసి దేహాల్ని గాల్లోకి ఎగరేసి చంపిన అమానవీయం
పసి చేతులకు కరెంట్ పట్టిచ్చిన అమానవీయం
పెట్రోలు తాపి పసిపెదాలకు అగ్గిపుల్ల అంటిచ్చిన అమానవీయం
కన్ను తెర్వక ముందే పసిగుడ్డును శూలం గుచ్చి 
మంటల్లో మాడ్చిన అమానవీయం

పసి కళ్ళల్లో బొమ్మకట్టిన 
అమ్మీ అబ్బాలు అవమానించబడ్డ అమానుషం
మానభంగించబడ్డ అమానుషం
ముక్కలుగా నరకబడ్డ అమానుషం
కళ్ళముందే తగలబెట్టబడి
కళ్ళలో మంటలుగా నిలిచిపోయిన అమానుషం

పసి దాహాలకు గుక్కెడు నీళ్ళు నిరాకరించబడిన సంఘంలో
ఒకరి మూత్రాన్ని మరొకరికి తాపించుకున్న నిస్సహాయత
పసి ఆకల్లకు నాలుగు మెతుకులు దొరక్కుండా చేసిన రాజ్యంలో
పుట్ట మన్నులో నీళ్ళు కలిపి తినిపించుకున్న నిస్సహాయత...

చితికిన గుండెకు మనిషితనపు లేపనంతో ఓదార్చుకుంటున్న 
ముసల్మాన్‌లను ముట్టుకొనొచ్చాను
జన్మకు మానని మనసు గాయాన్ని మోసుకొచ్చుకున్నాను

పరిణామ క్రమంలో 
జంతు దశలో ఆగిపోయిన జీవులు కొన్ని
ఇప్పుడు మనషుల్ని చంపుతూ...

'ముసల్మానోంకో మారో - కాటో - జలావో'
'జిస్‌ మొహల్లేమే అల్లా హోగా వో మొహల్లా జలేగా'
'హిందుస్తాన్‌మె రహెనా హోతో హిందూ బన్కే రహో'
'పహ్‌లీబార్ సబ్ కుచ్ బచా
దూస్రీబార్ బచీ జాన్‌
తీస్రీబార్ నామో నిషాన్ మిట్ జాయేగా'
విరిగిన గోడలమీది నినాదాల్ని కూల్చి
రాయాల్సింది కొత్త నినాదం:
'హిందూ హిందీ హిందుస్తాన్‌' నహీ– 
వో హిందూ బనే ఇన్సాన్'!    
 (2002, 'అజా–' సంకలనం నుంచి)

2 comments:

  1. మరి గోద్రా రైల్లో జరిగిన ప్రత్యక్ష నరకాన్ని కూడా రాస్తే బాగుండేది , శాంతియుతంగా మీలాటి వారు చేసే కిరతకాన్ని కూడా సరళమైన కవిత్వ రూపంలో రాస్తే చాలా బాగుండేది.

    ReplyDelete
  2. Godra rail lo chanipoyina vaari meeda aneka kathanaalu unnaayi.. adi planed ga chesina pani.. thadananthara allarla kosame daanni thagulabettaarata.. mari deeniki emantaaru

    ReplyDelete

మీ అభిప్రాయం తెలియజెయ్యండి