Sunday 22 January, 2012

జిన్నాకు ముందే ద్విజాతి సిద్ధాంతం -జిలుకర శ్రీనివాస్ ('అధూరే' పై ఆంధ్రజ్యోతి లో చర్చ)


జిన్నాకు ముందే ద్విజాతి సిద్ధాంతం

                                         - జిలుకర శ్రీనివాస్

సంస్కృతి నిర్వకల్పమైనది కాదనీ, అది ఆయా సమాజాల్లోని వివిధ సమూహాల ప్రత్యేకమైన, నైరూప్యమైన అంశాలతో పాటు ఆధిపత్య శక్తుల అభీష్టానుసారం నిర్మించబడుతోందనీ, దానికి సమాంతరంగా వ్యక్తీకరించబడే ప్రతివాదం కూడా సంస్కృతిలో అవిభాజ్యమైన అంశమని గుర్తించాలి. సాహిత్యం సాంస్కృతిక నిర్మాణమని భావిస్తే అది తప్పనిసరిగా రాజకీయ స్వభావాన్ని కలిగి ఉంటుంది.

అందువల్ల పీడిత కులాలు, మతాలు చేసే సాహిత్య వ్యక్తీకరణలు నైరూప్యమైనవి కావు. వాటికి నిర్దిష్టమైన చారిత్రక నేపథ్యం, రాజకీయ పునాదీ ఉంటాయి. ముస్లిం కథలను అర్థం చేసుకోవాలంటే ఈ దృష్టిని అలవర్చుకోవాలి. స్కైబాబ అనేక ముస్లిం రాజకీయ కథలు రాశారు. అలాంటి ముస్లిం సంస్కృతిని వ్యక్తీకరించిన రాజకీయ కథల సంకలనమే 'అధూరె'.

కనీజ్ ఫాతిమా ముందుమాటలో పేర్కొన్నట్టు ముస్లిం జీవితాలను అర్థం చేసుకోవటం ముస్లిమేతరులకు సులువేమీ కాదు. కాని, ఆ జీవితాలను నియంత్రిస్తున్న, నిర్దేశిస్తున్న పాలక కులాల రాజకీయాలు అర్థం చేసుకోలేని అమూర్త పదార్థమేమీ కాదు. ముస్లింలను పునరావాస శిబిరాల్లోకి నెట్టేసిన సమకాలీన దుస్థితికి గత రాజకీయ కారణాలను చారిత్రక దృష్టితో విశ్లేషించుకుంటేనే వాస్తవికత బోధపడుతుంది. సాహిత్యంలో వాస్తవికత పీడిత కులాలు రచనలు చేసే వరకు రూపొందలేదనేది విమర్శకులు అంగీకరిస్తున్నదే.

అందువల్ల వాస్తవికత అనేది దానికదే ఆకృతి దాల్చేది కాదు. అది ఒక నిర్మాణం. రచయిత అనుభవంతోనూ గ్రహించిన జ్ఞానంతోనూ కొన్ని సామాజిక ప్రతిఫలనాలను వ్యక్తీకరిస్తాడు. అవి ఆ రచయిత కుల, మత, ప్రాంత, లింగ, జాతి వంటి నిర్దిష్టతల మీద ఆధారపడి ప్రతిఫలిస్తాయి. అందుకే బ్రాహ్మణ కథకులు రాసిన అనేక కథలు ఆ కులంలోని పరిస్థితులను, ఆ కులస్తుల మానసిక వర్తనను ప్రతిబింబించాయి. కాని, విశాలమైన బ్రాహ్మణేతర సమాజాన్ని అవి ప్రదర్శించలేకపోయాయి. శూద్రులు, అతిశూద్రులు, ముస్లింలు రచనలు చేయటం ప్రారంభించగానే అప్పటిదాకా వాస్తవికత అని భ్రమించినది కాస్తా కాల్పనికమైనదని రుజువైంది.

అందుకే సమాజ వాస్తవికతను అర్థం చేసుకునేందుకు సాహిత్యేతర అంశాలను పరిగ్రహించాలి. 'అధూరె' సంకలనంలోని ముందుమాటలు స్కైబాబ కథలను అర్థం చేసుకొనేందుకు అవసరమైన సాహిత్య, చారిత్రక, రాజకీయ నేపథ్యాన్ని విభిన్న రూపాల్లో ఆవిష్కరించాయి. అఫ్సర్, కె.శ్రీనివాస్, కనీజ్ ఫాతిమా రాసిన ముందుమాటలు పాఠకులలో ఆసక్తి రేకెత్తిస్తాయి. వాచకానికి ముందుమాటలు అవసరం లేదనీ, ఆ రెండింటి మధ్య వున్న పితృపౌత్ర సంబంధాన్ని తెంచి పితృ హత్యకు పాల్పడాలని డెరిడా ఘీంకరించాడు. కానీ, పీడిత సమాజాల వ్యక్తీకరణలను వివేచించేందుకు డెరిడా సూత్రీకరణ సరిపోదు.

కాలాన్ని పునర్నిర్మించుకొనేందుకు రచయిత ఆధునికత మీద ఆధారపడతాడనీ, ఆ క్రమంలో వర్తమానంలో నిలబడి గతాన్ని, అది సృష్టించిన మిధ్యా వాస్తవికతను గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తాడు ఈ చారిత్రక స్పృహ వున్న రచయిత అంటారు, అఫ్సర్. స్థానిక అస్తిత్వ పునర్నిర్మాణంలో ఇది చాలా అవసరమైన సైద్ధాంతిక సాధనం అని కూడా ఆయన అంటారు. వాస్తవానికి ఆధునికత పేరుతో మన సమాజంలో చలామణిలో ఉన్నదంతా కులాధునికతే. బ్రాహ్మణ్యం ఆధునికత ముసుగు ధరించి వేసిన ఎత్తుగడలు, రాసిన రాతలు కాలాన్ని, దానికి సంబంధించిన అవగాహనను సెక్టేరియన్ పరిమితులలో బంధించింది.

ఆధునికత గురజాడతో మొదలైనా గిడుగుతో వర్ధిల్లినా అంతా బ్రాహ్మణ్యమే. వలస పాలనలో ఆధునిక చరిత్ర రచన పేరుతో జరిగిన పుక్కిటి పురాణాల అల్లిక ముస్లిం వ్యతిరేకతనూ బ్రాహ్మణ కాల్పనిక స్వర్ణ యుగాలనూ సృష్టిస్తే, ఆ సృష్టికి మనువాదులే బాధ్యత వహించాలి. కాని, ప్రపంచంలో ఏ మానవ సమూహానికీ లేని సౌలభ్యం బ్రాహ్మణులకే ఉంది.

అన్ని పొరపాట్లకూ చారిత్రక ఉత్థాన పతనాలకు తెల్లదొరలను బాధ్యులను చేసి చేతులు దులుపుకొనే ఆచారాన్ని నేటికీ కొనసాగిస్తున్నారు. కె.శ్రీనివాస్ కూడా హిందూ ముస్లింల మధ్య విభజనకూ ముస్లింల పట్ల వ్యతిరేకతకూ తెల్లదొరలనే బాధ్యుల్ని చేస్తున్నారు. కాని, కనీజ్ ఫాతిమా మాత్రం కుల వ్యవస్థలోని విభజన సూత్రమే మతపరమైన విభజనకూ రాజకీయ విభజనకూ పాదులు వేసిందనీ, ఆ విభజన సూత్రాన్ని తెల్లదొరలు తెలివిగా ఉపయోగించుకున్నారని చెప్తున్నారు.

చరిత్రను కె.శ్రీనివాస్ వ్యాఖ్యానించే తీరు ప్రధాన స్రవంతి వైధానిక పద్ధతిలో ఉంటుంది. ఫూలే గురించి ఆయన అవగాహన దీనికి అద్దం పడుతుంది. 'దేశంలోని భిన్న కులాల అంతస్తుల సంబంధం మీద కాక, సొంత కులాన్ని ఆధునీకరించుకోవడం మీదనే సంస్కర్తల దృష్టి. దొంతరల సామాజిక వ్యవస్థ మీద తక్కిన సమకాలీన సంస్కర్తలందరి కంటె లోతైన అవగాహన, విమర్శ ఉన్నప్పటికీ ఫూలే కూడా ఆచరణ రంగంలో విద్యావకాశాలను అందరికీ అందించటం వంటి సంస్కార చర్యల మీదనే దృష్టి నిలిపారు' అని సూత్రీకరించారు.

సామాజిక విప్లవానికి సైద్ధాంతిక పునాదులు వేసిన ఫూలే దార్శనికత, సైద్ధాంతిక వివేచన పట్ల అనేక వక్రీకరణలు జరిగాయి. ఫూలే కేవలం విద్యారంగంలో కృషి చేసిన ఉద్యమకారుడని పరిమితం చేయటం సంకుచితవాదం. బ్రాహ్మణాధిపత్యం నుండి మూలవాసులను విముక్తి చేసి బలిరాజ్యం స్థాపించాలన్న ఆశయమే ఆయన్ను ప్రజలను విజ్ఞానవంతులను చేయాలని సంకల్పించింది. దీని అర్థం అందరికీ బ్రాహ్మణీయ లేదా వలసవాద విద్యను అందించటం ఆయన ఉద్దేశ్యం కాదు.

కుల వ్యతిరేక, బ్రాహ్మణ భావజాలానికి వ్యతిరేకమైన మూలవాసీ తత్వ చింతనను ప్రచారం చేయటం. ఆ భావజాలంతో ఎదిగిన తరాలను తన పోరాటానికి సంసిద్ధం చేసే రణనీతి ఆయన అనుసరించారు. 1848లో ప్రణాళికాబద్ధంగా ఆయన నడిపిన ఉద్యమం 1873లో వ్యవస్థీకృత నిర్మాణం పొందింది. సత్యశోధక్ సమాజ్ ఆధ్వర్యంలో శూద్ర రైతాంగ ఉద్యమం, కార్మికోద్యమం, వ్యవసాయ కార్మిక పోరాటం, మహిళా ఉద్యమం ఆయన నడిపారు. విధవ స్త్రీలకు శిరోముండనం చేసేందుకు నిరాకరిస్తూ మంగళి కులస్తులతో పుణా పట్టణంలో తొట్టతొలిసారి సార్వజనీన నిరవధిక సమ్మె చేయించిన విప్లవకారుడు ఫూలే.

తన ఉద్యమంలో ముస్లింలు, సిక్కులు, క్రిష్టియన్లను భాగస్వాములను చేసి సామాజిక పరివర్తనకు అంకురార్పణ చేశాడు. అందువల్ల ఫూలే ఆచరణ రంగం బహు విశాలమైంది. అది ఈ దేశ కుల అంతర్వులను, వాటి మధ్య వున్న నిచ్చెన మెట్ల అధికార సంబంధాలను నిర్మూలించేది. కాని, ఫూలేని మరింత కురుచవాదంలో ఇరికించే ప్రయత్నం కె.శ్రీనివాస్ చేయటం విచారకరం. ఫూలేతో జిన్నాను పోల్చటం అహేతుకమైంది.

మహ్మద్ అలీ జిన్నా వాస్తవానికి వైశ్యుడు. ఇస్లాం స్వీకరించిన వైశ్య కుటుంబసభ్యుడు. కాశ్మీరీ బ్రాహ్మణుడైన మోతిలాల్ నెహ్రూ వ్యక్తిగత కార్యదర్శిగా అనేక సంవత్సరాలు పనిచేశాడు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఏ విధంగానూ ఇస్లామీయ జీవనం సాగించనివాడు. ఆయన్ని లౌకికవాది అంటారు. కాని వాస్తవానికి ఆయన బ్రాహ్మణవాది. కులాధిపత్య సామాజిక అంతర్వులున్న ఈ సమాజాన్ని స్వతంత్రం, సమానత్వం, బంధుత్వం, న్యాయం అనే విలువల ఆధారంగా పునర్నిర్మాణం చేయాలనే సంకల్పం ఏ కోశానా లేనివాడు.

అందుకే కాంగ్రెస్ పార్టీ ఆయన్ని ఆల్ ఇండియా ముస్లిం లీగ్‌లో ప్రవేశపెట్టింది. ముస్లిం సమాజానికి నాయకత్వం వహిస్తున్న సర్ సయ్యద్ ఆగాఖాన్ వంటి వారిని దెబ్బతీయడానికీ, కాంగ్రెస్ రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకొనేందుకు అలీ జిన్నాను బ్రాహ్మణులే ప్రమోట్ చేశారు. రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగే వరకు అలీ జిన్నాకు గాంధీ పెద్ద గుర్తింపు ఇవ్వలేదు.

ఆగాఖాన్ వంటి ముస్లిం నేతలు డా.అంబేద్కర్‌ను రౌండ్ టేబుల్ సమావేశాల్లో బలపర్చారు. ముస్లింల సహకారం వల్లే నా జాతి ప్రజలకు ప్రజాస్వామిక హక్కులను సాధించాను అని అంబేద్కర్ అన్నారు. ముస్లిం, అణగారిన వర్గాల మైత్రి బ్రాహ్మణీయ అగ్రకులాల ఆధిపత్యానికి గండి కొడుతుందని గ్రహించిన గాంధీ, నెహ్రూలు అలీ జిన్నాను ముస్లిం లీగ్ నేతగా ఎదిగేలా చేశారు. అలీ జిన్నా ముస్లిం నేతగా ఎదిగిన నాటినుండి అణగారిన వర్గాలకు దూరమై అగ్రకులాలకు చేరువయ్యాడు.

వాస్తవానికి జిన్నా రాజకీయాల్లోకి రావడానికన్న ముందే ద్విజాతి సిద్ధాంతం ఉనికిలో ఉంది. 1857 తిరుగుబాటు కన్న ముందే బ్రాహ్మణులు, బ్రిటీషువాళ్లు జాతిఐక్యత సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టారు. 1875లో ఆవిర్భవించిన ఆర్యసమాజం ఆర్యజాతి సిద్ధాంతంతో రూపొందింది. ముస్లింలను ఒక జాతిగా చిత్రిస్తూ ముస్లిమేతరులను బ్రాహ్మణీకరించే క్రమం అప్పటికే మొదలైంది. బంకించంద్ర చటర్జీ ఆనంద్‌మఠ్ నవలలోనూ వివేకానంద, తిలక్ రచనల్లోనూ ఆర్యజాతి సిద్ధాంతం స్పష్టమవుతోంది.

అది ముస్లిం వ్యతిరేకతను కేంద్రంగా చేసుకొని ప్రచారమైంది. పీడిత కులాలను బ్రాహ్మణీకరించేందుకు తయారు చేసినదే ద్విజాతి సిద్ధాంతం. దీనికి ద్విజులే జన్మప్రదాతలు. అందువల్ల ముస్లిం జాతి అనే భావన అలీ జిన్నాతో ఉనికిలోకి వచ్చింది కాదు. బ్రాహ్మణీకరించే (హిందూవీకరణ) క్రమం స్వతంత్రం తర్వాత మొదలైంది కాదు. కమ్యూనల్ రిప్రజెంటేషన్ అనే ప్రజాస్వామిక సూత్రాన్ని బ్రిటీషు వాళ్లు ప్రవేశ పెట్టడాని కన్న ముందే అది మొదలైంది. ఆ క్రమంలోనే అది చట్టసభల పరిచయంతో తీవ్రమైంది.

సి.రాజగోపాలాచారి కాంగ్రెస్ పార్టీలో ప్రతిపాదించిన దేశ విభజన పథకాన్ని సి.ఆర్ ఫార్ములా అంటారు. దేశ విభజనకు ఎవరు కారకులనే దాని మీద నేటికీ విస్తృత చర్చ జరుగుతోంది. అలీ జిన్నాను బాధ్యున్ని చేసిన వారు సి.ఆర్ ఫార్ములా గురించి గానీ, గాంధీ నేతృత్వంలో బిర్లా హౌజ్‌లో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశంలో దేశ విభజనకు సమ్మతి తెలుపుతూ తీర్మానం చేసిన సంగతిని గానీ అస్సలే ప్రస్తావించరు. కానీ కనీజ్ ఫాతిమా విభజన రాజకీయాలను విపులీకరించిన తీరు ముదావహం.

బ్రాహ్మణీయ శక్తులు దేశాన్ని హస్తగతం చేసుకొనేందుకు చేసిన దుర్మార్గమైన రాజకీయమే దేశ విభజన. ముస్లింలు, ఎస్సీ, ఎస్టీ, బిసీలు అధికార వంచితులు కావడానికీ, అధికార బదలాయింపు తర్వాత బానిసలుగా మారడానికి కారణమైంది. తెలంగాణ ముస్లింలు ఆంధ్ర వలసవాదంలో మగ్గిపోవడానికీ, హైదరాబాదీ తెహ్‌జీబ్ నాశనం కావడానికీ దేశ విభజన పేరుతో బ్రాహ్మణవాదులు అధికారం హస్తగతం చేసుకోవటమే కారణం.

అందువల్ల ముస్లింల పతనానికీ, దురవస్థకూ, అణచివేతకూ స్థానిక మూలాలు వెతికితే సమాధానం దొరకదు. జాతీయ రాజకీయ పరిణామాలు, ఆధిపత్య భావజాల పునాదులను పట్టుకుంటేనే తెలంగాణ ముస్లింల దైన్యానికి కారణాలు బోధపడుతాయి. అందుకే కాబోలు కనీజ్ ఫాతిమా హక్కుల కార్యకర్తగా ముస్లిం అణచి వేతను ప్రత్యామ్నాయ దృక్పథం నుండి విశ్లేషించింది. వాస్తవానికి కనీజ్ ఫాతిమా ముందుమాట విషయ అవగాహనకే కాదు, సాహిత్య క్షేత్రంలో విశాలం కావాల్సిన నవీన దృక్పథానికి మార్గం చూపుతుంది. చరిత్రను ముస్లిం దృక్పథం నుండి చూడాలనే స్పృహను కలిగిస్తుంది.

ముస్లిం కథా చరిత్రను నిర్మాణం చేసుకోవాల్సిన తక్షణ కర్తవ్యం మన ముందు ఉంది. సాహిత్య చరిత్ర రచనలో దేశ విభజన కాలం విస్మరించబడింది. స్వతంత్రానికి పూర్వం, స్వాతంత్య్రోత్తర తెలుగు కథ వంటి భావనలే సాహిత్యకారులు నమ్ముతూ వచ్చారు. కానీ దేశ విభజన సందర్భంగా ముస్లిం రచయితలు రాసిన కథలేమిటి? వాటిలో వ్యక్తమైన ప్రతిస్పందనలేమిటీ? వాటిని పాఠకులు ఏ రకంగా స్వీకరించారు? దేశ విభజన సమయంలో ముస్లిమేతర రచయితలేమి రాశారు?

అభ్యుదయ కథకులు, సంప్రదాయ కథకులు ఆ సమస్యను ఏ విధంగా అర్థం చేసుకున్నారు? ఒకవేళ ఆ ముఖ్యమైన సంఘటన పట్ల రచయితలు మౌనం వహిస్తే, దానికి గల కారణాలేమిటి? వంటి అనేక అంశాలను పరిశీలించాలి. దేశ విభజన వల్ల తలెత్తిన సామాజిక అశాంతి, ముస్లింల మీద జరిగిన దమనకాండ ఆనాటి ప్రజల మనసులను వెంటాడుతూనే ఉంటుంది. దేశ విభజన సమయంలో హైదరాబాదు రాజ్యంలో సంభవించిన రాజకీయ మార్పులు ముస్లింలనే కాదు ఇతర కులాలను కూడా తీవ్రంగా ప్రభావితం చేశాయి.

ఆ జాతీయ సమస్యకు హైదరాబాదీ రచయితలు ఏ విధంగా స్పందించారో పరిశోధించాల్సి ఉంది. కోస్తాంధ్ర రచయితలే కాదు, మద్రాసు కేంద్రంగా పనిచేసిన రచయితల అవగాహన ఏమిటో కూడా నమోదు కాలేదు. అవి నమోదు అయి ఉంటే, ఆ రచనలు అందుబాటులో ఉండి ఉంటే ముస్లిం సాహిత్య గమనం, గమ్యం మరోవిధంగా ఉండేది. ముస్లిం సాహిత్యం బాబ్రీ మసీదు విధ్వంసం తర్వాత ఆరంభమయ్యేది కాదు. స్కైబాబ కథలు మరో విధంగా ఉండేవి.

29 comments:

  1. CPI supported Pakistan on the "principle of nationalities". In fact Sundarayya linked the demands for Pakistan & Vishalandhra on a conceptual basis.

    ReplyDelete
  2. ఇదంతా వితండవాదంగా ఉంది.దళితులను అణచివేయబడిన వా రంటే అంతా ఒప్పుకొంటారు.ముస్లిములు అణచి వేయబడిన వారంటే ఎలా ఒప్పుకొంటారు.వాళ్ళే మన దేశంలొ అధిక భాగాన్ని కొన్ని వందల యేళ్ళు పరిపాలించారు.హిందువుల్నీ ఇతర మతస్థుల్నీ అణచివేసారు.చివరకు దెశాన్నే చీల్చివేసారు.ఆధునిక కాలంలో వాళ్ళు కొంత వెనుక బడ్డారంటే వాళ్ళే దానికి కారణం.సరే ,జరిగిందేదో జరిగింది.ఇప్పుడైనా భారతీయులంతా ,అన్నిమతాలు,కులాలవాళ్ళు కలిసికట్టు గా కృషి చేస్తే ఇంకా అభివృద్ధి సాధించగలము.

    ReplyDelete
  3. @కమనీయం: Sir, have you been to the old city or other places where Muslims live? If you did, you would not have made this statement.

    ReplyDelete
  4. ఆర్యులు అనే ప్రత్యేకజాతి ఒకటున్నదనే వాదం కేవలం అబధ్ధం అని నిర్ద్వందంగా తేలిఫోయాకకూడా దాన్ని ఆధారంచేసుకుని అబధ్ధాలు నమ్ము, స్వయంగా తయారుచేసీ ప్రచారంచేసే వాళ్ళను యేమనాలో తెలియటం లేదు! ఇటువంటి వాళ్ళు వివేకానందుడి రచనల్లోనూ ఆర్యజాతి సిద్ధాంతం స్పష్టంగా కనిపెట్టగల సమర్ధులు - నిస్సందేహంగా.

    ReplyDelete
    Replies
    1. ఆర్యన్ ఇన్వేసన్ థియరీ 100% నిజమే. కానీ కేవలం DNA పరీక్షల ఆధారంగా ఒక వ్యక్తి ఏ కులానికి చెందినవాడో ఖచ్చితంగా చెప్పడం సాధ్యం కాదు అనే ఒక్క పాయింట్‌ని పట్టుకుని ఆర్యన్ ఇన్వేసన్ థియరీ అబద్దం అని వాదిస్తారు హిందూత్వవాదులు. ఒకవేళ హిందూత్వని వ్యతిరేకించేవాడు అలాంటి వాదన చేశాడనుకోండి, హిందూత్వ వ్యతిరేకులు వితండవాదం చేస్తున్నారు అని చెప్పి హిందూత్వవాదులు పండగ చేసుకుంటారు. హిందూత్వవాదుల నిజాయితీ అలాగే ఉంటుంది.

      Delete
    2. DNA tests can only establish proximate relations (e.g. paternity) but can't go back centuries.

      Delete
    3. ఒక కులంలోని డబ్బున్నవాళ్ళు అదే కులానికి చెందిన పేదవాళ్ళని పెళ్ళి చేసుకోరు. కనుక ఒక కులానికి చెందిన డబ్బున్నవాని DNAకీ, అదే కులానికి చెందిన పేదవాని DNAకీ మధ్య తేడా ఉండే అవకాశాలే ఎక్కువ. అటువంటప్పుడు DNA పరీక్షల ఆధారంగా కులం నిర్ణీతంగా ఎలా చెప్పగలరు? కేవలం ఒక్క పాయింట్ ఆధారంగా ఆర్యన్ ఇన్వేసన్ థియరీ తప్పని వాదించడం హాస్యాస్పదం. అక్రమ సంబంధాల విషయంలో ఎవరూ కులం గురించీ, జాతి గురించీ ఆలోచించరు. పల్లెటూర్లలో డబ్బున్న రైతులు తమ పొలంలో కూలీ పనులు చేసే స్త్రీలతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం గురించి వినే ఉంటాం. ఆ illegal contacts వల్ల పుట్టినవాళ్ళు ఎంత మంది అనే విషయం ఎవరికి తెలుసు?

      Delete
    4. >>>>>
      DNA tests can only establish proximate relations (e.g. paternity) but can't go back centuries.
      >>>>>
      నిజమే, శతాబ్దాల క్రితం మన పూర్వికులు ఏ కులంవాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నారు, ఏ కులంవాళ్ళ చేత కడుపులు చెయ్యించుకున్నారు అనేవి మనం చూడలేదు. ఎవరు అవునన్నా, కాదన్నా అక్రమ సంబంధాల విషయంలో ఎవరూ కులం గురించి గానీ, జాతి గురించి గానీ పట్టించుకోరు అనేది నిజం. అక్రమ సంబంధాల వల్ల పుట్టినవాళ్ళ లెక్క అనేది ఎవరికీ తెలియనప్పుడు కొన్ని శతాబ్దాల పూర్వం దాక ఎందుకు, ఈ శతాబ్దానికి చెందిన మన ముత్తాతలు వేరే కులంవాళ్ళని కలవలేదు అని ఖచ్చితంగా చెప్పగలమా?

      Delete
    5. కవలలు తప్ప ఇద్దరి DNA ఒకేలా ఉండదు. DNA పరీక్షల్ని దగ్గర రక్త సంబంధాల్ని నిర్ధారించడానికి మాత్రమే ఉపయోగిస్తారు. అల్లూరి తమ్ముడి మనవడి DNAని బెండపూడి సాధువు DNAతో పోల్చడానికి CCMBవాళ్ళు ఒప్పుకోలేదు. అల్లూరి వంశంలో 30 మంది ఉన్నారు. వాళ్ళలో బతికున్నవాళ్ళలో అల్లూరికి అతి దగ్గరి బంధువు అతని తమ్ముడి మనవడు. సొంత మనవడికి కాకుండా తమ్ముడి మనవడికి DNA పరీక్షలు చెయ్యడానికి CCMBవాళ్ళు ఒప్పుకోలేదు.

      ఆంథ్రొపాలాజికల్ సర్వేలలో మాత్రం DNA నివేదికలని పరిశీలించి ఏ కులంవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో అంచనా వేస్తారు. అంతే కానీ తాను దళితుణ్ణని చెప్పుకుని caste certificate కోసం DNA పరీక్ష చెయ్యమంటే అది చెయ్యరు.

      Delete
  5. sir,I know that many Muslims are poor and uneducated.My point is instead of dwelling on the past ,they should make use of the opportunities provided in our secular India and try to come up.Especially they should emphasize on their women's education and employment.

    ReplyDelete
    Replies
    1. Muslims will find their own destiny in secular India in their own way. Let us not hinder it even if we can't (or don't want to) participate in it.

      Delete
  6. @శ్యామలీయం: రంగనాయకమ్మ తన ముందు మాటలో "రామాయణం కట్టు కథ కదా, అలాంటప్పుడు ఈ పుస్తకం ఎందుకు?" అనే ప్రశ్న వేసి తానె సమాధానం చెప్పింది. అది ఇక్కడ బాగా సరిపోతుంది.

    The historical factitude of a theory (whether Ramayana or Aryan roots) is less important than its impact.

    పై టపాలో రచయితా ఆర్యులను లేదా బ్రాహ్మలను దుమ్మెత్తి పోయలేదు. వారి ఆచార వ్యవహారాలకు, ఆలోచనా సరళికి వారి కళలు పరిమతం అని మాత్రమె అన్నారు.

    ఎవరి ప్రయోజనాలకు వారు కృషి చేస్తున్నారనే సత్యాన్ని మనం గ్రహించాలి. ఇది తప్పు కాదు, natural human behavior.

    ReplyDelete
  7. ప్రవీణ్ శర్మగారూ, చాలాకాలం క్రిందటే శ్రీకోటవేంకటాచలంగారు 'ఆర్యుల ఉత్తరధృవనివాసఖండనము' అనే పుస్తకం వ్రాసారు. ఆయనగురించి మీరు వినలేదేమో! అదీ గాక DNA పరీక్షలూ అవీ యీ మధ్య వచ్చినవి. ఆర్యన్ ఇన్వేసన్ థియరీ అనేదానిని పరాస్తం చేసినవి చారిత్రక ఆధారాలు. నమ్మే వాళ్ళను యెవరూ ఆపలేరనేది నిజమేననుకోండి.

    గొట్టిముక్కలవారూ, రంగనాయకమ్మగారి దృష్టిలో రామాయణం కథ అయితే ఒకరి కథను ఠాఠ్ యిలాకాదు అలారాయలి అని మార్చటానికి ఆవిడెవరు? రామాయణం కల్పిత కథ కాకపోతే చెప్పిన వాల్మీకిని తప్పు పట్టటానికి యీవిడెవరూ? యెలా చూసినా రంగనాయకమ్మగారిది ధూర్తత్వమే. మీరు రామాయణం యొక్క impact ను ప్రస్తావించారు గాబట్టి ఒక ముచ్చట. ఆవిడ విషవృక్షంరోజుల్లోనే శ్రీM.S రామారావుగారి సుందరకాండకూడా వెలుగుచూసింది - అనూహ్య ఆదరణ పొందింది. ప్రజలు ఆ విషవృక్షాన్ని యక్కువ ఆదరించారా యీ సుందరకాండ పారాయణాన్నా అన్నది బహుశః మీకే తెలుసుననుకుంటున్నాను. ఇకపోతే కళలు అనేవి అప్పటికాలానికి సాంస్కృతిక ప్రతిబింబాలుగానే ఉంటాయి. ఇందులో అసహజం యేమీ లేదుగదా. ఎవరి ప్రయోజనాలకు వారు కృషి చేస్తున్నారు తప్పులేదన్నారు. కాని స్వ (వ్యక్తి, కుటుంబ, పరివారగణ, గ్రామాదుల) ప్రయోజనాలు యెంతోకొంత సంకుచితమైనవే - వాటికంటే ఉన్నతమైన ప్రయోజనాలను ఆలోచించగలగటం ముఖ్యం. మీరన్న natural human behavior అనే సహజాత పరిమిత ప్రవర్తన కన్నా ఉన్నత ప్రవర్తన యెప్పుడా సాధ్యమే - దానికోసం కృషిచేయమే అభిలషణీయం గదా!

    ReplyDelete
    Replies
    1. మీరు ఆర్యన్ ఇన్వేసన్ థియరీని నమ్మకపోతే అది మీ వ్యక్తిగత విషయం. ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు ఎలా ఉన్నా కళ్ళకి కనిపించే నగ్న సత్యాలని ఎవరూ కాదనలేరు. కులం అనేది కేవలం ఐడెంటిటీ కాంక్షకి సంబంధించినది. సమాజం గురించి ఆలోచించనివాడు తన కులం గురించి మాత్రం ఆలోచిస్తాడని అనుకోలేము. అతను కేవలం వ్యక్తిగత ఐడెంటిటీ కోసం కులం పేరు చెప్పుకుని సుపీరియారిటీ కాంప్లెక్స్‌కి పోయి కులగజ్జిని ప్రదర్శించుకుంటాడు. సమాజం గురించి ఆలోచించేవాడు కేవలం కులం అవధులలోంచి ఆలోచించడు. కనుక సమాజం గురించి ఆలోచించేవాళ్ళకి కూడా కులం సెకండరీ విషయమే.

      Delete
    2. Ranganayakamma offered a fresh look at Ram from her own viewpoint. Ram (or any other subject) means different things to different people. Rama can be seen as a god, noble king, misogynist, escapist, Manuvadi representative or a host of other things.

      "కళలు అనేవి అప్పటికాలానికి సాంస్కృతిక ప్రతిబింబాలుగానే ఉంటాయి"

      నిజమే, ఎవరి సంస్కృతికి వారి కళలు ప్రతిబింబాలు. ఎవరు ఆధిపత్యంలో ఉన్నారో వారు తమ కళ మాత్రమె సమకాలీనమని అనుకుంటారు. Art & culture can't be separated from identity. సుందరకాండ లేదా సుప్రభాతం ఎంత గోప్పవయినా అవి అందరికీ చెందవు.

      "స్వ (వ్యక్తి, కుటుంబ, పరివారగణ, గ్రామాదుల) ప్రయోజనాలు యెంతోకొంత సంకుచితమైనవే"

      Art is never for art's sake, it always represents a purpose (ప్రయోజనం). అన్ని ఆలోచనలు ఎవరో ఒకరి ప్రయోజనాల కోసం మాత్రమె.

      Delete
  8. ప్రవీణ్ శర్మగారూ, నేను చారిత్రక సత్యాసత్యాల విషయం ప్రస్తావించాను గాని వ్యక్తిగత యిష్టాల గురించి మాట్లాడలేదు. ఈ విషయం గురించి మనం చర్చించటం నిష్ప్రయోజనం అనిపిస్తోంది.


    గొట్టిముక్కలవారికి ఒకముక్క మనవి చేయాలి. మీ శైలిని తప్పుపడుతున్నానుకోకపోతే చిన్న సలహా. మీరు యింగ్లీషు తెలుగు కలగలిపి తిలతండులన్యాయంగా చేయటం దేనికి. శుభ్రంగా తెలుగులోనే వ్రాయవచ్చునుగదా. మీరు కేవలం మీ భావాన్ని నొక్కివక్కాణించటం కోసమే కొన్ని వాక్యాలను యింగ్లీషులో చెప్పినట్లుగా తోస్తున్నది. కాని మీ తెలుగు వాక్యాలూ అంతే చక్కగా సూటిగా ఉన్నాయి. కాబట్టి మీకు ఇంగ్లీషులో చెప్పే శ్రమ అనవసరం అని నా భావన.

    కళలు యేవీ ఆధిపత్యానికి సంబంధించినవి కావు. అలా అనుకోవటం పాక్షిక దృష్టి అని నా ఉద్దేశం. అలగే యే ఆలోచన అయినా దానికి ఒక ప్రయోజనం ఉంటుంది. అయితే ఆ ప్రయోజనం ఆలోచనచేసే వ్యక్తికి సంబంధించిన సందర్భం, సంస్కారం, అవసరం వగైరా అనేక విషయాలపైన ఆధారపడుతుంది. అలాగే అది నెరవేరటం కూడా వర్తమానదేశకాలపరిస్థితుల పైన ఆధారపడి ఉంటుంది. ఉదాత్తమైన ఆలోచనలు చేయగలగటం కోసం అందుకే ఉత్తమ సంస్కారంకోసం సాధన అనేది. సామాజికమైన సంస్కార పరిమితి విస్తృతి వంటివి ఉత్తమ వ్యక్తుల సంఖ్యమీద హెచ్చుగా ఆధారపడి ఉంటుంది - వారు వారసత్వ సంస్కృతిక ఔన్నత్యాన్ని కొనసాగించగలరు మరియు దానిని కొత్త చిగుళ్ళు వేయించగలరు. స్వస్తి.

    ReplyDelete
    Replies
    1. Sir, thanks for your advice and compliment. Unfortunately, typing in Telugu is too difficult for me. Google transliteration is usually a hit and miss. I usually have to backspace a couple of times to get a word right.

      Delete
    2. Try this tool: http://teluguwebmedia.in/hamsalekha/

      Delete
  9. నేను చదివినది ఇంగ్లిష్ మీడియం. నాకు తెలుగు అంతగా రాదు. నేను సుపీరియారిటీ కాంప్లెక్స్‌ని సంస్కృతంలో "ఆధిక్యత ఇక్ష" అని వ్రాసాననుకోండి, అది మీకు అర్థమవుతుందా?

    ReplyDelete
  10. ప్రవీణ్ శర్మగారూ సందర్భాన్ని బట్టి ఇంగ్లీషు వినియోగించటం గురించి నేను చెప్పలేదు. మీ ప్రశ్నకు సమాధానం నేను ముందే వివరించాను. గొట్టిముక్కలవారికి సూటిగా చక్కగా తెలుగు వ్రాయగలిగినప్పుడు ఆయన యింగ్లీషును వాడవలసిన అగత్యం లేదని మనవిచేసానంతే. మీ గురించి నేను ప్రస్తావించలేదు.

    ReplyDelete
    Replies
    1. పేరాగ్రాఫ్ విడగొట్టినా మీరు మనవి చెయ్యడం గురించి subsequenceలో వ్రాసారనుకున్నాను. అందుకే మీరు నా గురించి వ్రాసారనుకున్నాను.

      Delete
    2. Denying well probed and established with innumerable linguistic,cultural, anthropological(even biological)and archaeological evidences of the fact of Aryan influx is a big vicious (but futile) exercise of the right wing Hindutwa people to consolidate and safeguard their secessionist (from who else muslims and christians)philosophy. Though theirs cannot contend reasoning and sanity in any historical debate or congress, they are spreading this stinking material very religiously. Any religion either Hindu or Islam or Christian cannot dictate HISTORY with their terms (of fancies).
      Umamaheswara Rao C

      Delete
  11. Read this link: http://stalin-mao.net.in/96020181

    ReplyDelete
  12. ఆర్యులు అనే వాళ్ళు యెక్కడినుండో - బహుశః ఉత్తర ధృవప్రాంతం నుండి - భారదదేశానికి వలస వచ్చారనే వాదం వెనుక ఉద్దేశం అందరికీ తెలసు. ఈ దేశం ఒక railway platform వంటిదీ యెన్నో జాతుల వాళ్ళు వలస వచ్చారు - ఆక్రమించుకున్నారు - నివసిస్తున్నారు. అలాగే ఇంగ్లీషు వాళ్ళమూ వచ్చి తిష్టవేసాం తప్పేమిటి అనే వాదాన్ని వినపించటమే దాని పరమార్ధం.

    నమ్మే వాళ్ళు నమ్ముతున్నారు. లేదా నమ్ముతున్నట్లు చచ్చినట్లు నటిస్తున్నారు. వాళ్ళకి ఈ వాదం పరాస్తం అయిందా లేదా అన్నదానితో పనిలేదు. వాళ్ళ వాళ్ళ కుహనా సిధ్ధాంతాలన్నీ యీ ఆర్యుల వలస సిధ్ధాంతం ప్రాతిపదికా యేర్పడి ఉంటే వాళ్ళేం చేస్తారు పాపం. ఈ ఆర్యుల వలస సిధ్ధాంతం నిజమేనని బల్లగుద్దుతూ ఉండటం మినహా వారికి దారిలేదు.

    ఒక విషయం స్పష్టం. ఈ ఆర్యుల వలస సిధ్ధాంతం నిజమని ప్రచారం చేసేవాళ్ళతో వాదించి యేమీ లాభంలేదు. వాళ్ళు వినరు. వాళ్ళతో కలబడి త్వ శుంఠః అంటే త్వం శుంఠః అని అరుచుకుని మాటలు పడటం దండగ. స్వస్తి.

    ReplyDelete
  13. It is not belief that unravels the facts in history but only methodical scientific study and probing will; and they are not using history as a tool to support any religious and faulty sectarian nationalism as the saffron brigades are doing.If the faulty theory is not on the propaganda of these right wing hindutwa organisations their very existence will be lost; these designs Indian people know well.
    Umamaheswara Rao C

    ReplyDelete
  14. All commenters are straying from the subject of this post. The blog is about the pre-Jinna assertion of the two nation theory, not aryan invasion.

    Having said this, it is comical to note the votaries of discrimination for thousands of years suddenly rooting for "merit".

    Whether aryans did invade India is not a concern only for historians. Carbon dating, DNA fingerprinting etc. are meaningless beyond a point. The theory is simple to explain and provides a reasonable framework to explain empirical evidence. This is good enough for me:)

    ReplyDelete
    Replies
    1. ఒకవేళ ఆర్యన్ ఇన్వేజన్ థియరీ తప్పనీ, అన్ని కులాలూ సమానమేననీ వీళ్ళు నిజంగా నమ్మితే వీళ్ళు తమ కూతుళ్ళని దళితులకి ఇచ్చి పెళ్ళి చెయ్యాలి. ఆ ధైర్యం లేనప్పుడు కబుర్లు ఎందుకు?

      Delete
  15. నిజమే. శ్యామలీయం గారు ద్విజాతి సిద్ధాంతాన్ని నమ్మే హిందువుల గురించిన టాపిక్‌ని తెలివిగా ఆర్యన్ ఇన్వేజన్ థియరీ వివాదం వైపు మళ్ళించారు. ఈ విషయం నాకు ముందే తెలుసు కానీ ఆయన వాదనలోని లొసుగుని బయటపెట్టడానికే ఆ విషయం మాట్లాడకుండా DNA టెస్ట్‌ల గురించి మాట్లాడాను.

    ReplyDelete
  16. ముస్లింల మీద జరిగిన దమనకాండ ..... అని అన్నారు పైన, దేశ విభజన సమయంలో కేవలం ముస్లింల మీద మాత్రమె దమనకాండ జరిగిందా ...? మిగతా వారందరూ సురక్షితమా ...? ఇది హాస్యాస్పదం. తిరిగి ప్రశ్నించడం తెలియని వాడికి / ప్రశ్నించడానికి ధైర్యం లేనివాడికి ఈ అన్యాయం జరుగుతూనే ఉంటుంది. అది ముస్లిమ్లైనా, ఇంకా వేరే మతస్థులు, కులస్థులు ఎవరైనా....? అంతే కాని ఇంకెవరో పనికట్టుకుని ముస్లిం ప్రజలకు అన్యాయం చేసినట్లు చిత్రించడం విచారకరం. స్కైబాబ గారు ఒక ముస్లింగా వారి పోషకుడైనా కుడా ఇక్కడ జరిగిన చర్చలో గాని ఆయన వ్రాసిన సమీక్ష గాని చదివే తీరుబడి ఒక ముస్లీముకు లేదు మరి, ఒక వేళ చదివినా, ఒక అభిప్రాయం వ్రాసే సమయం లేదు. ఎందుకంటె వారు వాళ్ళ జీవన సమస్యలలో ఎద్దడిగా ఉన్నారు. మనం మాత్రం ఖాళీగా ఉన్నాము,

    చివరగా చెప్పదలచినది ఏంటంటే ఇంత భారి భారి చర్చల వలన ఉపయోగమేమీ లేదని, సదరు వ్యక్తులకు సమయం వృధా తప్ప...! ఇలాంటి వృధా చర్చల వలన ప్రయోజనం సమకూరుతుందంటే నేను ఇంకో పది పేజీలు ఇలాగే వ్రాయగలను, గతం నాస్తి కాబట్టి ఇప్పుడున్న వనరుల ద్వారా మన జీవితాన్ని బాగుపరుసుకునే ప్రయత్నం చేస్తే అది ఉపయోగకరం. అంతే కాని గతాన్ని తవ్వేకోంది అది విచారకరం. అది తెలిసీ ఇదంతా చేయడం పిచ్చితనం. :)

    ReplyDelete

మీ అభిప్రాయం తెలియజెయ్యండి