Friday 9 July, 2010

జగ్‌నే కీ రాత్

ఎదురుచూపుల కాలానికి
కొట్టుకుపోతున్న సుర్మా కళ్ళ
యవ్వనమంతా...

జగ్‌నే కీ రాత్!

పసి చేతులే పనిముట్లై
బాల్యం రుచి ఎరుగని 

బచ్ పన్‌ అంతా...
జగ్‌నే కీ రాత్!

గరీబీని వారసత్వంగా ఇచ్చిన
నెరిసిన టోపీల దుపట్టాల
వ్రుద్దాప్యమంతా...

జగ్‌నే కీ రాత్!
   
భూగోళం పక్కమీద అటు కాసేపు సోంచాయిస్తూ..
అశాంతిగా ఇటుమళ్ళి కాసేపు బేచైనౌతూ..
మనసు పగిలే వొత్తిడి
దిగ్గున లేపి కూర్చోబెడితే
ఇరాకీల మాంస ఖండాలతో
కాగితాలన్నీ తడిసి ముద్దయ్యాయి
తెల్లోడి పెట్రో దాహానికి 

సంవత్సరాల పొడుగూతా
ఇరాకీల జిందగీల్లో
జగ్‌నే కీ రాత్!


మగతలో నడుస్తున్నాను
గుజరాత్
కాలిన కూలిన గోడల మధ్య
విద్యుద్దీపం ఆర్పేయబడింది
అక్కడొక చిమ్నీ ఇక్కడొక చిరాగ్‌
కాలుతున్నది ముసల్మానుల రక్తం
నెలవంక నెత్తురు కాగుతున్నది
మనుషుల్ని సజీవంగా తగులబెట్టిన
బూడిద కుప్పల మధ్య -
గాల్లో కలిసిపోయిన
తల్లులూ చెల్లెళ్లూ పసిపిల్లల
ఆర్తారావాల మధ్య -
 


కాలిన కూలిన గోడలూ మనుషుల మధ్య
ఎవరికైనా ఎలా నిద్ర పడుతుంది
జీవితాల్లో ఇక శాశ్వతంగా
జగ్‌నే కీ
రాత్!
నడుస్తూ నడుస్తూ
న్యాయ దేవత గంతలు విప్పుతున్నాను
ఊర్లల్లో గింజలు చల్లుకుంటానికి
గింత జమీన్‌ లేదు
చేతులాడడానికి వృత్తుల్లేవు
రోడ్లకు రెండు పక్కలా
మొత్తుకుంటున్నారు టోపీవాలాలంతా

చాయ్.. రిక్షా.. మేవా.. హరేక్‌మాల్..
కడుపు కొట్టుకుంటూ అరుస్తున్నారు
ఒక్కసారి జుమే
రాత్ బజార్ కి వస్తారా
ముసల్మానుల జిందగీలన్నీ
అమ్మకానికి పెట్టబడ్డాయి
ఒక్కసారి పాత బస్తీ -లు
'తురక' గల్లీలు తిరిగి చూస్తారా
కనిపించేదంతా జగ్‌నే కీ
రాత్!

ఆకుపచ్చ రక్తంతో కన్నీళ్లతో
ప్రపంచ పటమంతా తడిసి ముద్దయ్యింది
తలుచుకుంటే ఒంట్లో రక్తం
పెట్రోల్ బావిలా మండుతున్నది

ఈ సుదీర్ఘ రాత్రికిక నిద్ర లేదు
ఈ జిందగీ ఇప్పుడొక జగ్‌నే కీ
రాత్!

2 comments:

  1. ఆకాశం అతని ఇంటిపేరు
    పెనుసంచలనం అతని అసలు పేరు
    తనకీ ప్రపంచానికీ మద్య జరిగే సమరంలో కవి ఎప్పటికీ ఓడిపోకుండా పోరాటం చేస్తూనే ఉంటాడు.
    జీవితంతో పోరాడుతూ, పోరాటాన్నే జీవితం చేసుకుంటూ, ఆ పోరాటంలోనే జీవిస్తూవున్న వ్యక్తులకు కవిత్వం కాలక్షేపం కాదు
    కలచివేసే విషయాలను కాగితంపై పరచి కన్నీటి కధలను అక్షరరూపంగాచేసే ఆయుధం
    నిరంతర జీవన స్రవంతిలో మనిషి మరచిపోతున్న మానవత్వాన్ని మేలుకొలిపే దివ్యౌషధం

    ReplyDelete
  2. your poem visualizes the whole concept you wanted to project.awesome and thought provoking to the core.

    ReplyDelete

మీ అభిప్రాయం తెలియజెయ్యండి