Tuesday, 1 December 2009

చాంద్ తార

'చాంద్ తార' పేరు తో ఈ మధ్య నేను, షాజహానా రాసిన రెండు వాక్యాల కవితలు పాకెట్ సైజ్ పుస్తకం గా వేశాం. ఒక వాక్యం చాంద్, ఒక వాక్యం తార అనుకున్నాం. ఈ పుస్తకానికి పెన్నా శివరామకృష్ణ ముందుమాట రాశారు. నేను రాసిన కొన్ని చాంద్ తార లు ఇవి. మరికొన్ని మరోసారీ..


***
విహరిస్తూ చంద్ర భ్రమరం 
అడవి ఒక ఆకుపచ్చని పుష్పం

***
చీకటంటే భయమనిపించదు
చిన్నప్పుడు అమ్మీ బుర్ఖాలో తలదాచుకున్నట్లుంటుంది
***
వర్షం మొదలయ్యింది 
గొడుగు పువ్వుకు నన్ను కాడను చేస్తూ 
***
ఉర్సులో రోల్డుగోల్డు హారం కొన్నది అమ్మీ 
అబ్బా మొఖం చిన్నబోయింది 
***
మా నానిమా 
పండిపోయింది పాన్ నమిలి నమిలి
***
అటు కాకికి ఇటు నాకు నోరూరిస్తున్నది 
కవాబుల దండెం
***
కాలువ, నేను పక్కపక్క నడుస్తున్నం
అది పొలంల కలిసింది, మరి నేను?
***
బస్సు కదిలింది 
దిగులుగా చేతులూపుతూ ఓ ఒంటరి చెట్టు 
***
చేపల పులుసు తలపుకొస్తే
ఎండిన చెరువుల నీళ్ళు నోట్లె ఊరబట్టె
***
పూలను తన్మయంతో చూస్తుంటావు 
ప్రపంచమూ నిన్నలా చూడొద్దూ
                                               - స్కై బాబ 

8 comments:

  1. చీకటంటే భయమనిపించదు
    చిన్నప్పుడు అమ్మీ బుర్ఖాలో తలదాచుకున్నట్లుంటుంది.

    బాగానచ్చింది.

    ReplyDelete
  2. కాలువ, నేను పక్కపక్క నడుస్తున్నం
    అది పొలంల కలిసింది, మరి నేను?

    --ఈ చాంద్ తార బాగుంది .

    ReplyDelete
  3. thanks to indian minerva, santhosh, nagaraju ravinder
    -sky

    ReplyDelete
  4. స్కై బాబ గారికి

    మీ కవిత్వం చదువుతూంటాను.
    మీ శుద్ద కవిత్వం మధ్య అపుడప్పుడూ వినిపించే వర్గకవిత్వం కూడా ఆస్వాదిస్తూ ఉంటాను. మీ "లొంగని వీరుడు" చాన్నాళ్లు వెంటాడింది.


    మీబోటి వారు బ్లాగుల్లోకి రావటం ఆనందంగా ఉంది.



    మీ చాంద్ తారలు బాగున్నాయి బుజ్జి బుజ్జి పదచిత్రాల్లా.....
    కానీ ఇలాంటి ప్రక్రియలపై నా అభిప్రాయాలు ఒక చోట చాలా తీవ్రంగా ఖండించబడ్డాయి..... అప్పటి నుంచీ అలాంటి విషయాలలో నేను :-/ అన్నమాట. :-)

    అప్పటి చర్చను వీలైతే ఈ క్రింది లింకులో చూడండి

    http://dracharyaphaneendra.wordpress.com/2009/07/11/%e0%b0%8f%e0%b0%95-%e0%b0%b5%e0%b0%be%e0%b0%95%e0%b1%8d%e0%b0%af-%e0%b0%95%e0%b0%b5%e0%b0%bf%e0%b0%a4%e0%b0%b2%e0%b1%81-%e0%b0%ae%e0%b0%b0%e0%b0%bf-%e0%b0%95%e0%b1%8a%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8/

    please donot think that i am criticising your chand taras. these are far away from those found in the above link.


    కలుస్తూ ఉందాం.


    భవదీయుడు

    బొల్లోజు బాబా

    ReplyDelete
  5. చిన్నా చితకా కవులు కవిత్వం పేరిట ప్రచురించే పైత్యాన్ని నేను విమర్శించను. కానీ మీరు అంతో ఇంతో ప్రముఖులై ఉండటంతో అడగాలనిపించింది.

    "ఉర్సులో రోల్డుగోల్డు హారం కొన్నది అమ్మీ
    అబ్బా మొఖం చిన్నబోయింది"

    "మా నానిమా
    పండిపోయింది పాన్ నమిలి నమిలి"

    వీటిలో ఏమి కవిత్వం ఉంది!?! స్టార్‌వార్స్‌లో యోడా మాట్లాడినట్లు ఓ వాక్యాన్ని ముందువెనకలుగా తిరగేసి రెండు పంక్తుల్లో రాసేస్తే అది కవితా?

    పరుషంగా వ్యాఖ్యానించినందుకు ఏమీ అనుకోకండి. బాగా రాయగలిగే సత్తా ఉన్నవారు సైతం ప్రయోగాల పేరుతో ఇలాంటి చెత్త రాస్తుంటే కలిగిన ఆవేదన ఇది.

    ReplyDelete
  6. అబ్రకదబ్ర లాంటి వారి కోసం..

    మీరు ఉదహరించిన రెండు చాంద్ తార లలో కూడా ఉన్న విషయం రెండు కథలు రాయవచ్చు. అందులో poetry లేదనడం సరికాదు. కాకపోతే మీరు ఆశిన్చినట్లున్న పోరాటమో, మరోటో లేకపోవచ్చు.. జీవితం ఉంది.. సరే, వదిలేద్దాం..

    ఇక చాంద్ తారలు రాయడానికి కారణం ఏదో ఒక ప్రయోగం చేయాలని కాదు, అచ్చమైన poetry గా భావించే (కొందరు) కవితలు కూడా రాయగలము అని చూపడం ఒక ఉద్దేశం.

    రెండు: పెద్ద poems రాస్తున్నప్పుడు అందులో ఇమడని కొన్ని భావాలు మిగిలిపోతుంటాయి- శిల్పం చెక్కుతున్నప్పుడు పక్కనపడే చిన్న ముక్కల్లోనూ జీవం ఉంటుంది. వాటిని కూడా చిన్న శిల్పాలుగా మలచవచ్చు. అది కూడా చాంద్ తార లలో చూడవచ్చు. ఈ రెండు అభిప్రాయాలే కాకుండా నేను వ్యక్తీకరించలేని మరెన్నో కోణాలూ ఉండవచ్చు..

    ఏదేమైనా మీ అభిప్రాయాలు నిక్కచ్చిగా రాసినందుకు షుక్రియా..

    -స్కైబాబ

    ReplyDelete
  7. కాలువ, నేను పక్కపక్క నడుస్తున్నం
    అది పొలంల కలిసింది, మరి నేను?
    బస్సు కదిలింది
    దిగులుగా చేతులూపుతూ ఓ ఒంటరి చెట్టు
    loved these lines...
    పూలను తన్మయంతో చూస్తుంటావు
    ప్రపంచమూ నిన్నలా చూడొద్దూ
    these lines are so inspiring and thought provoking...thanks for these lines...

    ReplyDelete

మీ అభిప్రాయం తెలియజెయ్యండి