Saturday, 14 December 2013

లతీఫ్ మియా శాత్రం (బహుజన) కథ


‘అరె వో పత్రోలీ!’ కూతేసిండు లతీఫ్ మియా.
రోడ్డవతల్కి దాటబోతున్న గొల్లోల్ల సైది ఎనక్కు మల్లిండు.
ఏం సంగతి బావా? సైకిలేదొ బాగు చేస్తున్నవ్ గదా.. పనిల ఉన్నట్లుందిలె అని పోబోతి’ అన్నడు.
లతీఫ్ మియా.
‘ఎప్పుడు ఉండే పనే గదనోయ్. అట్ల జూసెతలికి మా బామ్మర్దేమో పలకరించకుంటనె పోతుండేంద్రో అని కూతేస్తి’ అన్నడు లతీఫ్ మియా.
‘గా పత్రోలి అంటే ఏంది బావా? గడికొక్క తీర్గ పిలుస్తవ్! రోజు రోజుకి నీ పరాష్కం ఎక్కువైతున్నదోయ్ బావా’ అన్నడు సైది ముసిముసిగ.
‘ఏదొ ఒకటి లేవోయ్ బామ్మర్ది! నువ్వు పలికినవా లేదా అన్నది లెక్క!’
‘సరె గని, గ పత్రోలి అంటేంది బావా?’
‘ఇస్తారి అన్నట్టోయ్!’ చెప్పిండు నవ్వుకుంట.
‘యె! కొత్త కొత్త పేర్లు పెట్టకు బావ. మల్లెవడన్న అందుకున్నడనుకో. అదే పేరు పడిపోతది. నువ్వు గిట్ల పిలిషి పిలిషే గా పెర్కోల్ల ఆంజనేయుల్ని ఇంజనాయిలు అనబడ్తిరి. గౌండ్ల సైదుల్ను ముస్తాదు అని, సాకలి ఈరిగాన్ని సౌడు అని, మాలోల్ల రవిని మడేల్ అని అందరు పిలవబట్టిరి. మల్ల నాకు గీ కొత్త పేరు కాయం జేసేవ్.. నీకు దండం పెడత’ అన్నడు సైది, రెండు చేతులు సప్పుడొచ్చేటట్లు జోడించి.


లతీఫ్ మియా నవ్వి- ‘ఏందో లేవోయ్ జర.. మజాక్ ఉండాలె మనుషుల మజ్జె.. మీరంత నన్ను తుర్క జెల్ల అంటలేరారా?’ అన్నడు.
ఇట్ల మస్తు ఖుషాల్‌గ ఉండే మనిషి లతీఫ్ మియా. దండుబాట మీద ఎవలు కన్పించినా సరె, పల్కరించకుంట ఉండడు. యమ జోకులేషి అందర్ని నవ్విస్తడు. అందరితోటి వర్స కలుపుకుంటడు. వరుసైనోళ్లను రకరకాల పేర్లు పెట్టి నూటొక్క తీర్లుగ బనాంచుడు, ఏడ్పిచ్చుడు, నవ్విచ్చుడు చేస్తుంటడు. కని ఎవల కే కష్టమొచ్చినా అందరి కన్న ముందుంటడు. ఊరోల్లందరి తల్లో నాలుక లెక్క మెలుగుతుంటడు. షానామందికి దినాం ఆయన్ని కలవకుంటె, ఆయన పరాష్కానికి ఇరగబడి నవ్వకుంటె పొద్దే గడవదు.
ఇసువంటి లతీఫ్ మియా చేసిన ఒక పని మాత్రం మా వూర్లెనే కాక సుట్టుపక్కల ఊర్లల్ల గూడ లతీఫ్ మియా శాత్రం(శాస్త్రం)గా చెప్పుకుంటుంటరు. ఈ శాత్రం మా ఊర్లె జరిగి 15 ఏండ్లయింది!
సైది లాంటి జిగ్రీ దోస్తులు పదిమంది దాంక ఉండేది లతీఫ్ మియాకు. అందరు పెద్ద మనస్సున్నోల్లేగాని పైస ఉన్నోల్లు గాదు. పైస సాయం జేయలేకున్నా మాట సాయానికి, చేతి సాయానికి ఎనకాడరు.

***
ఇట్లంటి కలివిడితనం, ఖుషాల మనస్తత్వం ఎక్కడ్నుంచి వొచ్చింది లతీఫ్ మియాకు? అంటె కొద్దిగ ఎన్క నుంచి అర్సుక రావాలె..
ముందుగాల లతీఫ్ మియా లారీ మీద పన్జేసేటోడు. ఇంట్ల పూట గడవని హాలతుల అమ్మీ అబ్బాలకు ఆసరా కావాల్నని సదువొదిలేషి క్లీనరైండు. అట్ల కొన్నేండ్లు చేసి డ్రైవింగ్ నేర్చుకొని డ్రైవర్ ఐండు. లారీ డ్రైవర్లు ఊరికో బాయి నీళ్లు తాగి, మనిషికో మాట నేరుస్తరు గదా. అందుకె ఆళ్లకు మస్తు మాటలొస్తయ్. ఇప్పుడంటె అన్ని ఊర్ల నీళ్లు ఒక్క తీర్గ మారబట్టె.. అన్ని సోట్ల మాటలు ఒక్క తీర్గ అయ్‌పోబట్టె గనీ.. కొన్నేండ్ల కింద గీ హాలతు లేకుండె గదా. అట్ల లతీఫ్ మియా మస్త్ మాట్లాడుకుంట, జబర్దస్తు పరాష్కాలాడుకుంట ఎప్పుడు సూశినా నవ్వుకుంట, నవ్వించుకుంట బతుకు బండి నడుపుతుండె.

అట్లాంటి లతీఫ్ మియాకు తొలుసూరు, మలుసూరు ఇద్దరు బిడ్డలె పుట్టేతలికి కొడుకు కావాల్నని అందరు పట్టుబట్టిన్రు. నాలుగు ఊర్లు తిరిగి నలుగుట్ల మెసిలినోడు జేబట్టి లోకజ్ఞానం మంచిగనె అబ్బింది లతీఫ్ మియాకు. దాంతోటి కొడుకు లేకుం బిడ్డలె కొడుకులనుకుంటనని బాగనె బైస్ చేసిండు గని ఆఖరికి ఆయన బేగం అన్వరి గుడ ‘జానెదేవ్ లేవ్‌జీ, నేను గద కనేది, ఈ ఒక్కపాలి సూద్దాం’ అని సమ్జాయించింది. ‘సాదాల్సింది నేన్ గదనె’ అని జెర తకరారు జేసినా ఆఖరికి ‘అచ్ఛా, తేరీ మర్జీ’ అని ఊకుండు లతీఫ్ మియా. కని మూడో కాన్పుల గుడ ఆడపిల్లే పుట్టేసరికి నెత్తీ నోరు కొట్టుకున్నడు లతీఫ్ మియా.

లారీ డ్రైవర్ లతీఫ్ మియా సైకిల్ మెకానిక్ ఎట్లయిండంటే మల్ల అదొక ముచ్చట. డ్రైవరన్నంక గఫ్లత్ల యాడ్నొ ఒక్కాడ ఏదొ ఒక యాక్సిడెంట్ మామూలే. అట్లనె లోడ్ మీద శానా దూరం పొయ్ వస్తున్న లతీఫ్ మియాకు రెండు రాత్రులు నిద్దర్లేక తెల్లారగట్ల కన్ను మలిగింది, తెరిషి సూషేతలికి బండి రోడ్డు దిగింది. సంభాలించుకుని పడిపోకుంట చూసుకునే కోషిష్‌ల బండి పొయ్ చెట్టుకు గుద్దింది. దాంతోటి ఒక కాలు, ఒక చెయ్యి ఇరిగినయి. ఇంక నయం పానం పోలేదనుకుండు లతీఫ్ మియా. కాలిలో స్టీల్ రాడ్ ఏసి, ఇగ లారీ నడపొద్దన్నరు డాక్టర్లు. ఇంకో పని రాదు. దాంతోటి ఊర్లె ఒక అరడజను కిరాయి సైకిళ్లు పెట్టుకుని ఊరి సైకిళ్లు బాగు చేసుకుంట బతుకు ఎల్లదీస్తుండు.

***
‘సరె గని, పిల్ల పెండ్లి ఖాయం జేసినవంట, చెప్పనే లేదేంది బావా?’ సైకిల్ ముందలి పయ్యకు అటొక కాలు, ఇటొక కాలేసి కాళ్లు దగ్గరికి బిగించి పట్టుకొని అన్నడు సైది. ఎదురుంగ నిలబడి హ్యాండిల్ ఫిట్ చేసుకుంట లతీఫ్ మియా- ‘అవున్రా సైది. బిడ్డ షాదీ ఖాయమైందోయ్ నిన్ననె. ఇగ అప్పు కోసం తిర్గాలె. కనీసం 80 వేలన్న అప్పు జెయ్యంది అయ్యేతట్లు లేదోయ్. ఏం జెయ్యాల్నో సమజైతలె’ అన్నడు.

సైకిల్ వదిలేసి చిన్న స్టూల్ లతీఫ్ మియాకు దగ్గర్కి జరుపుకొని కూసొని బ్రిస్టల్ సిగట్ డబ్బి జేబుల్నుంచి తీసి ఒకటి లతీఫ్ మియాకు అందించి తనొకటి ముట్టిచ్చుకుండు సైది.
‘ఇప్పుడేడ దొర్కుతయ్ బావా మిత్తికి. అందరు తెలివి నేర్షిన్రు. రెడ్డోల్లయితె మన మొఖం మీదనె లెవ్వంటున్రు. మన సూదరోల్లు సుత మనం కట్టగలుగుతమో లేదోనని ఎనకా ముందాడబడ్తిరి. మనకొచ్చే ఆమ్దాని ఏంది, బూమేమన్న ఉందా లేదా -ఇయన్ని సూస్తున్నరు గద బావా! ఇగ ఇయ్యావూలేపు రెండ్రూపాలకు, మూడ్రూపాలకు మిత్తికిచ్చుడు బందయిపాయె. ఎవన్నన్న అడిగి సూద్దాంలే గని, కష్టమె బావా’ అన్నడు సైది.
‘జెర ఏదన్న ఉపాయం జెప్పుర సైది. రాత్ర నిద్ర పట్టలె. ఎక్కువ మిత్తికి తీస్కుంటె ఇగ బతుకంత మిత్తి కట్టుడె సరిపోతది’ అన్నడు లతీఫ్ మియా.
‘ఆ చెవిటి ముత్తన్ని అడిగిసూద్దాం బావా? ఆడైతె జర ఇంటడు’ అన్నడు సైది.
‘ఆందగ్గర ఉన్నయా?’ అన్నడు ఆశగ లతీఫ్ మియా.
‘ఉన్నై బావా. నిన్ననె ఒకలు ఆనికి అసలు, మిత్తి కలిపి 30 వేలు కట్టివూనంట. మావోణ్ణి పిలిస్తె పొయ్యి లెక్క సూషి వొచ్చిండు.’
‘అవునా. అయితె ఇప్పుడె పోదాం పా బావా!’ అన్నడు లతీఫ్ మియా.

***
సైది, లతీఫ్ మియా కల్సి ముత్తయ్య ఇంటికెల్లి కూసొని 40 వేలన్న మిత్తికి కావాల్నని అడిగిన్రు. ‘ఆ సైకిల్ షాపు మీద తిండికెల్లుడె కష్టమాయె. పైసలిస్తె, ఎట్ల తీరుస్తవ్ పిలగా?’ అని ఒక్కటె మాటడిగిండు ముత్తయ్య. లతీఫ్ మియాకు గొంతు పెగల్లె.
‘ఎట్లన్న జేస్తడు. ఆళ్ళ బావలు, తమ్ముండ్ల కాల్ల ఏల్ల పడతడు. ముందుగాల నువ్వయితె ఇయ్యరాదె’ అన్నడు సైది.
‘గదేదో ఇప్పుడె జేస్తె, ఎవలన్న సాయం జేస్తరు. పెండ్లయినంక ఎవలు జేస్తరు?’ అన్నడు ముత్తయ్య.
‘అయ్యొ నువ్విచ్చె పైసలతోటె పెండ్లయితాదె- మిగతా ఆటికి ఆల్లె దిక్కాయె. నువ్వయితె ఇయ్యరాదు’ అన్నడు సైది.
‘నువ్వు సప్పుడు జెయ్యవేంది పిలగా? అడగక అడగక అడిగితివి. ఎన్నాల్లకు కడ్తవొ చెప్పు’ అన్నడు ముత్తయ్య.

లతీఫ్ మియా కొద్దిగ గలిబిలై,‘...ఏడాదిల ఎట్లనన్న జేసి కడ్తనె.. యాడికి పోతున్న. పానమున్నదాంక గీ ఊర్లెనె, మీ ముంగలె ఉంట గద’ అన్నడు ఏం చెప్పాల్నొ సమజ్‌గాక.
‘రేపు పొద్దటీలి రాపోరి. ఓ ముప్పయ్ ఏలున్నయ్, ఇస్త’ అన్నడు ఆఖరికి ముత్తయ్య.
‘అమ్మయ్య’ అనుకొని బైటపడ్డరు దోస్తులిద్దరు.
ఒక గణేష్ బీడీ లతీఫ్ మియాకు అందించుకుంట తానొకటి ముట్టించుకొని చిన్న స్టూలు మీద కూసొబోయిండు మాదిగోల్ల లింగయ్య.
‘మావా! జర గౌండ్ల యాది సైకిల్ ఎనక గిల్ల ఇప్పే. ఆడు తాళ్లు గీస్తానికి అర్జంటుగ పోవాల్నంట’ అన్నడు లతీఫ్ మియా, రీమ్‌కి పుల్లలు ఫిట్ చేసుకుంట.
లింగయ్య లివర్లు తీస్కొని యాది సైకిల్ ఎనక గిల్ల కాడ కూసొని ఇప్పుకుంట అడిగిండు.
‘ఏం మావా! ఊర్లున్నోళ్లందరికి దావత్ చెప్తున్నవంట. ఏం కోస్తవేంది!’
‘ఏముంది మావా! ఓ దూడను తెచ్చి లుడ్కాయిస్తె ఊరోళ్లందరికి సరిపోతది’ అన్నడు నవ్వుకుంట లతీఫ్ మియా. లింగయ్య గుడ పెద్దగ నవ్వి, ‘నువ్వంత దైర్నం యాడ జేస్తవ్ గనీ. ఎట్లవుతున్నయే పెండ్లి పనులు?’ అనడిగిండు.
తన కష్టాలన్ని జెప్పి లింగయ్య పాలుకు పదివేలన్నా సూడమని ఒక్క తీర్గ బతిలాడిండు లతీఫ్ మియా. సూద్దాం లెమ్మని లేషిండు లింగయ్య.

***
అయితె అయాల్టి సంది- లతీఫ్ మియా బిడ్డ పెండ్లి ముచ్చెట వొచ్చిన కాడల్లా లతీఫ్ మియా దూడను కోస్తడంట అనే జోక్ పేలేది. నవ్వుకునేది ఊరోళ్లంత.
పెండ్లికింక నాల్గు దినాలె ఉంది..
లతీఫ్ మియాకు నిద్ర పడ్తలె. పరేశాన్లు ఈగప్లూక్క ముసురుకుంటున్నయ్..
ఈ గండం ఎట్ల గట్టెక్కాల్నొ సమజైతలె. ‘పెద్ద బిడ్డ పెండ్లికె ఇంత కష్టమైతున్నదంటె ఇంకిద్దరు బిడ్డల షాదీలు చేసేసరికి తన పనైపోతది’ అనిపించబట్టింది.
పైసల్ దొర్కుతానికి ఇంత కష్టమైతదని అనుకోలె..

ముత్తయ్య 30 వేలు ఇస్తాన్కి ఒప్పుకున్నంక- ఆ పైసలు పై ఖర్చులకె సరిపోతయని..
ఇంకో 50 వేలు యాడ్నన్న పుట్టియ్యాల్నని.. ఇయ్యాల్సిన సామానంత చుట్టాల్ని తలా ఒకటి ఇయ్యమని అడగాల్సిందేనని.. తన దిక్కువాల్లను తను, అన్వరి దిక్కువాల్లను అన్వరి అడగాల్నని.. ఇట్ల ఒక నక్ష గీసుకుండు తను.
వారం రోజులు తొక్కిన గడప తొక్కకుంట ఊరంత దిరిగితె ఇంకో 20 వేలు 4 రూపాల మిత్తికి దొరికినయ్. ఇంకో 30 వేలు ఆడ ఐదు, ఈడ పది తెచ్చి సర్దుకుండు. సుట్టాల గడప గడప తిరిగి మొత్తానికి పెట్టాల్సిన ముఖ్యమైన వస్తువులన్ని ఇల్లు చేర్చిన్రు. మిగతా పెండ్లి ఖర్చులన్ని లెక్కేయంగ చేతిల పైస మిగుల్తలేదు. ఆఖరికి దావత్‌ల ఏం మాంసం పెట్టాల్నా అన్నకాడ చిక్కొచ్చిపడ్డది. ఖర్చు లెక్కేస్తె గుండె గుబిల్లుమన్నది లతీఫ్ మియాకు.
దాంతోటి నిద్ర పట్టని రాత్రుల్ని లెక్కెబెట్టుకుంటున్నడు.

అటు పొర్లి ఇటు పొర్లి ఎంత కోషిష్ జేసినా నిద్దర పడ్తలేదయాల. బలవంతంగ పండుకుందమని ఎటొ ఒక పక్కకు మల్లి పండుకుంటున్నడా. కొద్దిసేపైనంక జూసుకుంటె ఎల్లకిలపడి ఉంటున్నడు, సోంచాయించుకుంట! దావత్ ఎట్ల ఎల్లదీయాల్నో ఎంతకు సమజ్ గాదు. పొర్లంగ పొర్లంగ ఆఖరికి తెల్లారగట్ల ఒక నిశ్చయానికొచ్చిండు- యాట మాంసం పెట్టలేకున్నా ఎట్లనన్నజేసి కోడి మాంసమన్నా పెట్టాల్సిందేనని తీర్మానించుకుండు. అందుకు ఏం జెయ్యాల్నొ పొద్దుగాల దోస్తుల్ని ఒకపాలి అర్సుకోవాలనుకుండు.

***
పెండ్లి రోజు రానె ఒచ్చె. దావత్ టైం కానె అయ్యె. కనీ, ఊరోళ్లంత మన్సులల్ల ఒక్కటె తల్లడమల్లడమైతున్రు.. లతీఫ్‌మియా షానా మంచోడు.. కలుపుగోలు మనిషి.. ఎవరికే కష్టమొచ్చినా తనే ముందుండి సాయపడే మనిషి. కనీ లతీఫ్ మియా గింత పని చేసిండేందని తిట్టుకొబట్టిన్రు, కోపంతోటి కాదు- పావురంతోటె! సూస్తెనేమో లతీఫ్ మియా బిడ్డ పెండ్లి. ఊరోల్లందరి తల్లో నాలుక లెక్క మెలిగే లతీఫ్ మియా బిడ్డ పెండ్లి. పొయ్యేతట్టు లేదు, పోకుంట ఊకునెతట్టు లేదు. ఏం జెయ్యాలె- దావతుకు పోలేకపొయినా.. కట్నమైతె సదివించాలె గదా -అనుకున్నరంత. దాంతో పిల్లలతోటి కట్నం పైసలు పంపిన్రు, తలా వొందో రెండొందలో ఐదొందలో! మొత్తానికి ఊరందరి కట్నాలు పడ్డయి గని దావత్‌కు వొచ్చింది మాత్రం ఊర్లొ ఉన్న 20 ఇండ్ల ముస్లింలు, 40 ఇండ్లకు పైనున్న మాదిగోల్లే!

ఓ పదిమంది దాంక సూదరోల్ల, మాలోల్ల పోరగాల్లు ఎనకా ముందాడుకుంట ఒస్తే ఆల్లకు జర సాటుంగ కూసోబెట్టి తృప్తిగ తిని పొయ్యేటట్లు సూశిండు లతీఫ్ మియా. ఇగ ఆఖరికి- ఎక్కడికక్కడ సల్లబడ్డంక లతీఫ్ మియా దోస్తులు ఒచ్చిన్రు. ఆళ్లను ఇంట్ల కూసొబెట్టి తలుపు దగ్గరికేయించి తను గూడ ఆళ్లతోటి కూసున్నడు. కూర కొసరి కొసరి ఒడ్డించేతట్టు తన తమ్ముడు జానిని పురమాయించిండు లతీఫ్ మియా. కూర రుచిని మస్తు మజా చేసుకుంట మల్ల మల్ల ఏయించుకొని తిన్నరంతా. వేరుగ తలాయించి పెట్టిన కార్జం, గుండెకాయ తలా కొంత ఏయించిండు లతీఫ్ మియా. ఆనక్కాయ దాల్చను గుడ మజా చేసినంక ఆఖరికి డబల్‌కా మీఠా అందరి నోళ్లు తీపి చేసింది. ఇగ లేవబోతున్నంతల-
అప్పుడొచ్చిండు గొల్లోల్ల శ్రీను.
‘అరె, గింత లేటేందిరా బై. దా! దా! కూసొ!’ అని లేషి శ్రీనును కూసోబెట్టబోయిండు లతీఫ్ మియా.
‘ఆరీ! నువ్వొస్తనని ముందుగాల ఒగ మాట చెప్తే కూతేస్తుంటి గదనోయ్’ అన్నడు సైది.
శ్రీను కూసోలె. ‘కూసోవేందిరా!’ అని పెర్కోల్ల మల్లయ్య అంటుంటె- ‘నేను తింటానికి రాలేదురా!’ అన్నడు శ్రీను.
ఎవరికీ ఏమర్దం కాలె.
‘ఏమైందిరా!’ అన్నడు లతీఫ్ మియా శ్రీను చెయ్ పట్టుకొని.
‘ఏం లేదుర. నువ్వు మంచోనివి. మా లెక్కనే బీదోనివి. బిడ్డ పెండ్లి కనా కష్టాలు పడి చేస్తున్నవని నా వంతు కట్నం ఏస్తానికి ఒచ్చినరా! నువ్వేమో మేం తినని కూర వొండిచ్చినవ్. నువ్వు ఇంత పని చేస్తవనుకోలేదుర. నాకేం మంచిగనిపించలేదు’ అన్నడాడు జేబుల్నించి రెండు వందల నోట్లు తీసి.

లతీఫ్ మియా మొఖం మాడిపొయింది. కష్టంగ ఏదొ అనబోతుంటె సైది లేషి- ‘నువ్వాగురా!’ అని లతీఫ్ మియాను ఆపి, ‘ఆరి.. శీనుగ! నీకు సంగతంత తెల్వదుర. నాల్గు దినాల కిందె లతీఫ్ గాడు మమ్మల్ని పిలిషిండు. మీ ఇంటిగ్గూడ పోరగాన్ని తోలిండు. నువ్వు రాలె, ఊరికి పొయ్‌నవని చెప్పివూనంట మీ ఇంట్ల. నేను, లింగడు, యాది, సత్తి కలిషినం. లతీఫ్ గాని పరేశానంత ఇన్నం. లెక్క లేషినం. అప్పటికె ఆనికి గంపెడయ్యింది అప్పు. ఇంక ఆన్తోని గాదు. పైంగ ఈడంటె పావురంతోటో, ముస్లింల ఇంట్ల దావతంటె మస్తు రుచిగుంటదనో ఊరంత లేషొస్తది. ఆల్లందరికి ఎంతని పెడతడు మాంసం? యాట మాంసమైతె ఆన్తోని కాదు. కోడి మాంసమన్న పెట్టాల్నని లతీఫ్‌గాని కాయిషు. ఎంతైతదొ లెక్కలేషినం. ఏ మాంసమైనా తక్కువేస్తె ఊర్లోల్లు ఊకుంటరా.. ఎంత లేదన్నా వంద కిలోలు కావాలె.. యాడైతది. అప్పటికె కట్నం పైసలు తక్వబడ్తుంటె మేం తలా కొంత అర్సుకుంటిమి. ఇంక మాతోటి గాలె.. దాంతోని ఆని తాహతుకు దగ్గది పెట్టడం దప్ప ఏరే దారి కన్పించక ఇగ అందరం అటే మొగ్గినం.

కని లతీఫ్ గాడు షానా ఎనకాముందాడిండ్రా. ‘అరేయ్! నేను ఎన్నో దావత్‌లల్ల మీ ఇండ్లల్లకు ఒచ్చి తిన్నరా! నాకోసం హలాల్ చేయించి మరీ నన్ను దావత్‌కు పిలిషేది మీతోబాటు మనూరోల్లంతా. ఆల్లెవరు రాకుంట దావత్ చెయ్యాల్నంటె నాకు పానం దరిస్తలేదుర’ అని ఆడు కళ్లనీళ్లు పెట్టుకున్నడు. మేమే ఆన్ని సమ్జాయించినం. ఎల్లని దానికి మనమేం జేస్తంరా. మల్లసారి సూస్కుందాం లెమ్మని, మనసు గట్టి జేస్కొవాల్నని మందలించినం. మన లింగడు, ‘మా ఇంట్ల పెండ్లికి యాటను మైసమ్మకు బలిస్తె నువ్వు తినకుంటనె పోతివి గదరా. ఐనా నువ్వేమన్న అనుకున్నవా. గట్లనె అందరు అర్దం జేస్కుంటరు’ అని ఒక్క తీర్గ చెప్పిండు.
ఆడు నిమ్మల పడ్డంక అట్ల జేస్తె ఎట్లెట్ల కలిసొస్తదొ లెక్కలేషినం. ఊరంత దావత్‌కు రారు చేబట్టి మాంసం తక్కువ పడ్తది. మల్ల అందుల దావత్‌కు సరిపొయ్యేంత తీసి మిగతా మాంసం, కాళ్లు తలకాయ, తోలు ఖసాబ్‌కు అమ్మేయొచ్చనుకున్నం. అట్ల వొచ్చే పైసలు, కట్నాలు కలిపి ఒకరి అప్పు తీర్చేయొచ్చని కుషాలు పడ్డం.

పిలగానోల్లను ఒప్పిచ్చుకుంటానికి లతీఫ్‌గాడు పడరాని పాట్లు పడ్డడు. అదైనంక లతీఫ్ గానికి తోడు లింగడు కట్టంగూర్ అంగడికి పొయి మోతాదు దూడను బేరం చేసి కొట్టుకొచ్చిన్రు. దాన్ని ఇంటి ముంగల కట్టేస్తె మనోల్లంత లతీఫ్‌గానితోటి పరాష్కాలాడితిరి. జాన్‌డ్డి తాతయితే- ‘ఏంద్రా లతీఫూ! ముస్లింల ఇండ్లల్ల దావత్ అంటె పానం లేషొస్తది గదనోయ్. అసొంటిది, మా రెడ్డోళ్లకు, ఎలమోల్లకు, సూదరోల్లకు తునకలు లేకుంట జేస్తున్నవేంది పిలగా!’ అన్నడంట.
‘ఏం జేస్తం తాతా! నా బతుక్కు గిదే శాతనైంది’ అన్నడంట లతీఫ్ గాడు చిన్నబుచ్చుకొని. ఇగ జెప్పు. వాన్నేం జెయ్యమంటవో!?’ అని ఆగిండు సైది.
కదిలిపొయిండు శ్రీను. లతీఫ్ మియా చేతులు పట్టుకున్నడు, ‘ఏమనుకోకురా.. నీకెల్లింది నువ్ పెట్టినవ్. నేనే ఏందొ అనేషిన గనీ... పోనియ్ రా.. మనసుల పెట్టుకోకు.. ఇగ పటు నా వంతు కట్నం’ అని మల్లొక రెండొందలు తీసి మొత్తం నాలుగు వందలు లతీఫ్ మియా చేతిల పెట్టిండు. 

1 comment:

  1. స్కై బాబా దీనికి బహుజన కథ అని ఎందుకు పేరు పెట్టవు, ఇది అందరి కథ. అందరూ లేని వాళ్ళ కథ.

    ReplyDelete

మీ అభిప్రాయం తెలియజెయ్యండి