Thursday 13 June, 2013

వెంటాడే కథలు 'అధూరె' -'నెమలికన్ను' మురళి

ఆదివారం, జూన్ 02, 2013

* 'నెమలికన్ను' మురళి

http://nemalikannu.blogspot.in/2013/06/blog-post.htm
మహమ్మదీయులు అనగానే గుర్తొచ్చేవాళ్ళు ఎవరు? మనం చదువుకున్న చరిత్ర బాబర్ శౌర్యాన్నీ, అక్బర్ రాజనీతిజ్ఞతనీ, ముంతాజ్ కోసం తాజ్ మహల్ నిర్మించిన షాజహాన్, భాగమతి కోసం భాగ్యనగరాన్ని నిర్మించిన కులీ కుతుబ్షా నీ గుర్తు చేస్తుంది. ముసల్మానులంటే వీళ్ళు మాత్రమేనా? తోపుడు బళ్ళ మీద అరటిపళ్ళు అమ్ముతూనూ, ఓ చిన్న బడ్డీలో గడియారాలు మరమ్మతు చేస్తూనూ కనిపించే వారి కథలు ఏమిటి? తెలుగు కథా సాహిత్యంలో అస్థిత్వ వాదం బలంగా వినిపిస్తున్న తరుణంలో, ఇన్నాళ్ళూ ప్రపంచానికి పెద్దగా తెలియని అనేక వర్గాల కథలతో పాటు, సామాన్య ముస్లిం జీవితాలు నేపధ్యంగా వచ్చిన కథలూ కొంచం తరచుగానే పాఠకులని పలకరిస్తున్నాయి.. అలాంటి ఒకానొక కథల సంకలనమే 'అధూరె' ..ముస్లిం కథలు అన్నది ఉపశీర్షిక.

వృత్తి రీత్యా జర్నలిస్ట్, తెలంగాణా, మైనారిటీ ఉద్యమాలలో చురుకైన కార్యకర్తా అయిన స్కైబాబ రాసిన పన్నెండు కథల సంకలనం ఈ 'అధూరె.' ఈ ఉరుదూ మాటకి అర్ధం అసంపూర్ణం అని.. చాలా కారణాలకి ఈ శీర్షిక ఈ కథలకి అతికినట్టు సరిపోయింది అనిపించింది పుస్తకం చదవడం పూర్తిచేయగానే. ఎందుకంటే ఈ కథలు ఏవీ కూడా పూర్తయినవి కాదు, జరుగుతూ ఉన్నవి.. ఎన్నాళ్ళుగానో జరుగుతున్నాయి.. ఇకమీదట కూడా జరుగుతాయి. ఒక్కమాటలో చెప్పాలంటే, ఇవి కథలు కావు, మన చుట్టూ ఉన్న పేద ముస్లిముల జీవితాలు. మన పక్కనే వాళ్ళూ ఉంటున్నా, ఇన్నాళ్ళూ మనం కనీసం ఆలోచించని ఎన్నో విషయాలని ఈ కథల ద్వారా చెప్పారు స్కైబాబ.

బుర్ఖా సంప్రదాయం మీద ఎక్కుపెట్టిన బాణం 'చోటీ బహెన్' ఈ సంకలనం లో మొదటి కథ. ఒక్క పేజీ తిరిగేసరికే "మా ఇండ్లల్ల ఆడపిల్లలకు తండ్రులే మొదటి విలన్లు. తర్వాత స్థానం అన్నలు-తమ్ముళ్ళదే" అన్న వాక్యం దగ్గర చాలాసేపే ఆగిపోయాను. సంప్రదాయాలు కేవలం ముస్లిం కుటుంబాల్లో తండ్రులు, అన్నలు, తమ్ముళ్ళని మాత్రమే ఆడపిల్లల పాలిట విలన్లుగా చేస్తున్నాయా? అన్న ప్రశ్న చుట్టూ ఎన్నో ఆలోచనలు. ఈ ఒక్క వాక్యం మాత్రమే కాదు, మొత్తం కథే ఆలోచనల్లో ఉంచేసింది. మొత్తం పుస్తకం పూర్తయ్యాక కూడా ఆలోచనలు మొదటి కథ చుట్టూనే తిరుగుతున్నాయనడంలో అతిశయోక్తి లేదు. రెండో కథ 'మొహబ్బత్ 1421 హిజ్రి.' ఈ సంకనలం లో ఈ కథకి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఇది పూర్తిగా ప్రేమకథ... బుర్ఖా సంప్రదాయాన్ని మరోకోణంలో చూపించిన కథ.
పేద ముస్లిం కుర్రాడి ప్రేమకథ 'మజ్బూర్' కాగా, ఒక పురుషుడి చర్యల కారణంగా అతని తల్లి, భార్యల జీవితాల్లో జరిగిన మార్పులని చిత్రించిన కథ 'భడక్తా చిరాగ్.' ఐదో కథ 'కబూతర్' కి రచయిత ఆశావహమైన ముగింపు ఇచ్చినా, కథని గురించి ఆలోచించడం మాత్రం మానుకోలేం. ఆడపిల్లకి పెళ్లి చేయడానికి ఓ పేద తల్లి పడే తాపత్రయం ఈ కథ. అద్దె ఇల్లు వెతుక్కునే ఓ యువ జంటకి ఎదురైన ఇబ్బందులని 'వెజిటేరియన్స్ ఓన్లీ' పేరుతో కథగా మలిచారు స్కైబాబ. కులమతాలకి అతీతంగా స్నేహంగా మసలిన ముగ్గురు యువకుల కథ 'దస్తర్,' ముగింపు ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. కారణం చెప్పకుండా పోలీసులు తీసుకెళ్ళి పోయిన ఓ కుర్రాడి కోసం అతని తల్లి పడే తపన 'దావా' కథ. కాకిపిల్లని ప్రతీకాత్మకంగా వాడుకోవడం బాగుంది.

'వతన్' కథ మీద ఇప్పటికే చాలా చర్చ జరిగింది. ముస్లింలు దుబాయి వెళ్ళినా భారతదేశానికి తిరిగి వస్తున్నారు కానీ, అమెరికా వెళ్తున్న హిందువులు అక్కడే స్థిరపడి పోతున్నారన్నది ఇతివృత్తం. మిగిలిన కథలకి భిన్నంగా కొంత ఉపన్యాస ధోరణి కనిపించింది ఈ కథలో. కథకుడిలోని ఆవేశం కథలో ప్రతిఫలించింది అనడం సబబేమో. 'ఉర్సు' కథ విఫల ప్రేమ తాలూకు ఓ జ్ఞాపకం. దుబాయ్ ప్రయాణం ఇతివృత్తంగా సాగిన మరో కథ 'ఖిబ్లా.' సంకలనంలో చివరిదీ నన్ను బాగా ఆకర్షించిందీ 'జీవం' కథ. మృత్యువు నేపధ్యంగా సాగే ఈ కథకీ మెరుపు ముగింపుని ఇచ్చారు రచయిత. చదివించే గుణం పుష్కలంగా ఉన్న ఈ కథల్లో ముందుగా ఆకట్టుకునేది భాష. తెలంగాణా తెలుగు, ఉరుదూలు కలబోసిన వచనం. ముందుమాటలో అఫ్సర్ చెప్పినట్టుగా ఉస్మానియా బిస్కట్-ఇరానీ చాయ్ లని కలిపి ఆస్వాదిస్తున్నట్టుగా ఉంటుంది.

'అధూరె' సంకలనంలో ప్రతికథకీ చదివించే లక్షణం ఉంది. మొత్తం కథ చదవడం పూర్తిచేశాక కనీసం ఒక్క క్షణం ఆగి ఆలోచించకుండా ఉండలేం. రకరకాల స్త్రీ పాత్రలు.. వాళ్ళ బలమైన వ్యక్తిత్వాలు, ఏమీ చేయలేని అసహాయతలు, ఏం చెయ్యాలో తెలియని సందిగ్ధతలు... ఇవన్నీ కేవలం ముస్లిం సమాజానికి సంబంధించినవి మాత్రమే కాదు.. అయితే, ఈ కథల్లో ఆకర్షించేది నిజాయితీ. కథలన్నీ సరళంగా సాగుతాయి. నాటకీయమైన మలుపులు ఉండవు... ముగింపు సాధారణంగా కనిపిస్తూనే, అసాధారణం అనిపిస్తుంది. మాండలీకం ఏమాత్రం ఇబ్బంది పెట్టదు. ఓ వక్తగా ఎంతో ఆవేశంగా కనిపించే స్కైబాబ, రచయితగా ఇంత మృదువైన వాడా అన్న ఆశ్చర్యం చాలా చోట్లే కలిగింది. ముస్లిముల, మరీ ముఖ్యంగా పేద ముస్లిముల జీవితాలని గురించి తెలుసుకోడానికి ఉపయోగించే కరదీపిక ఈ సంకలనం. మొత్తం 166 పేజీల సంకలనం లో కథలు 101 పేజీలు కాగా, మిగిలిన 65 పేజీల్లోనూ ఈ కథల గురించి అనేకమంది వెలిబుచ్చిన అభిప్రాయాలు, లోతైన చర్చా కనిపిస్తాయి. 
(నసల్ కితాబ్ ఘర్, 'హర్యాలి' ముస్లిం రచయితల వేదిక సంయుక్త ప్రచురణ, 
వెల రూ. 75, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు)

2 comments:

  1. అవును నేను కూడా ఈ కథలని ఇటీవలే చదివాను.చాలా ఆర్ధ్రత తో కూడిన కథలు.అద్భుతమైన కథలు.మనసున్న ప్రతీ మనిషికీ కనెక్ట్ అయ్యే కథలు .

    ReplyDelete


  2. ఔను.'అధూరె 'కథలు సామాన్య ముస్లిం కుటుంబాల,వ్యక్తుల జీవితాల్ని వాస్తవికం గా చిత్రించినమంచి కథలు.ఇంక,అమెరికాకి వెళ్ళే వాళ్ళు విద్యావంతులు,ఉన్నతమధ్యతరగతివారు.అక్కడ జీవనవిధానం బాగుండి ,నచ్చడంవల్ల సెటిల్ ఐపోతూఉంటాఆరు.అదీగాక అక్కడి చట్టాలు పౌరసత్వం తీసుకొని సెటిల్ అయేందుకు అనుకూలం.అరబ్ దేశాలవారు ఇతరజాతీయుల సేవల్ని ఉపయోగించుకుంటారు గాని( ఏ మతస్థులైనా) అక్కడ ఆస్తులు కొని పెర్మనెంటుగా సెటిల్ అయేందుకు ఒప్పుకోరు.వార జీవితవిధానం కూడా మనకు సరిపోదనుకొంటాను.అంచేత డబ్బు సంపాదించుకొని తిరిగి వచ్చేస్తుంటారు.

    ReplyDelete

మీ అభిప్రాయం తెలియజెయ్యండి