Monday 5 November, 2012

జమ్మి (దసరా బేస్డ్ లవ్ స్టొరీ)


అయాల దసరా!
ముందుగాల అనుకున్నట్లుగనె నేను, మా దోస్తు సైదులు అయాల మద్యాన్నానికే ఊరు చేరుకొని ఉంటిమి. పొద్దుగూకాల జమ్మిచెట్టు కాడికి పోతానికి ఎవరి ఇండ్లల్ల వాళ్లం తయారీల ఉన్నం.
షానా ఏండ్లాయె దసరకు ఊరికి రాక. నేను హైద్రాబాద్‌ల, సైదులు వరంగల్ల ఉండిపోటంల దసరకు ఇద్దరం కలుసుకునేది కుదుర్తలె. ఈపాలి ఎట్లన్న కలుద్దమనుకున్నం. ఇంకో ముక్యమెన ముచ్చ మా సైదులు నూనూగు మీసాల వయసుల ఉన్నప్పుడు తను ప్రేమించిన నిర్మలను సూడాలని షానా ఉందని, కనీసం దసరకన్న సూషే అవకాశముంటదని ముందే చెప్పిండు నాతోని. ‘ఇప్పుడు మల్ల సూషి, కలిసి ఏం జేస్తవ్‌రా.. అనవసరపు తలనొప్పులు’ అని సర్దిచెప్దామనుకున్న. గని ఆడు ఊకోలె. ‘షానా ఏండ్లయిపొయ్యింది సూడక.. ఈ మద్య ఎందుకో ఊకె యాదికొస్తుందిరా.. కలలకొస్తుంది.. ఒక్కసారన్న కలిసి మాట్లాడాల్నని షానా ఉందిర.. నువ్వు ఈసారి జరూర్ రావాలె. ను వస్తనంటె నాగ్గూడ జర హుషారు గుంటది’ అని ఆడు ఒక్కతీర్గ చెప్పిండు...

టైమయితుంటె నేను తానం జేసి తెచ్చుకున్న కొత్త జత బట్టలు ఏసుకొని మా అమ్మికి పొయ్యొస్తనని చెప్పి రోడ్డు మీదికి బయల్దేరిన.
టైం సాయంత్రం నాలుగున్నరైంది. రోడ్డు మీదికి ఒక్కొక్కలె చేరుకుంటున్రు. నేను మా సైదులుకు ఫోన్ చేసిన. ‘బట్టలేసుకుంటున్న, రెండు నిమిషాల్ల రోడ్డుమీదుంట’ అన్నడు. రోడ్డు మీదికి వస్తున్నోల్లంత తీరొక్క కొత్త బట్టలేసుకొని పెద్ద పిల్లలు ఎంట రాంగ, చిన్న పిల్లలకు ఏలు అందిచ్చి వస్తున్నరు. ఆడోల్లేమో అందరు రోడ్డు మీదికి చేరుకునె సమయానికొస్తరు.
నేను రోడ్డు మీద యాపచెట్టు కింద దోస్తులతోటి ‘ఖబర్లు’ చెప్పుకుంట నిలబడ్డ. షాన్నాళ్ల సంది కలువని దోస్తులంత కలుస్తుంటె యమ కుషాలుగుంది. నా సుట్టు గుంపైంది. ఒక్కొక్కడు- ‘ఈడు నా కొడుకు’, ‘ఈళ్లు నా పిల్లలు’ అని ములాఖత్ చేస్తుంటె ఆళ్లను పలకరించుకుంట కొత్తగ ఒచ్చి చేరుతున్నోళ్లను నిమ్మలం అడుక్కుంట ఉన్న. షానామంది, ‘పిల్లల్ని గుడ తీస్కరావొద్దా?’ అని అడగబట్టిరి. నాగ్గూడ ‘తీస్కరావల్సుండె’ అనిపించింది. అంతల్నె మా సైదులు రానె ఒచ్చిండు. ‘ఒహో.. దోస్తులిద్దరు షాన్నాల్లకు కల్సిన్రె..’ ‘పదురుకొని ఒచ్చినట్టుందె’, ‘షాన్నాల్లకు ఊరికి కళొచ్చింది’ అని పరాష్కమాడబట్టిన్రు కొందరు. మా సైదులు మంచి కలుపుగోలు మనిషి. ఏ విషయాన్నైన జోకుగా మల్చేసి, ఎసొంటి సందర్భాన్నైన ఉల్లాసంగ మార్చేసి అందర్ని నవ్వించేస్తుంటడు. ఆళ్ల మాటల్ని అందుకొని సైదులు నవ్వులు పూయించబట్టిండు.సరె, మా పలకరింపులు, నవ్వులాటలు, ఖుషీలు అట్ల నడుస్తుండంగనె రోడ్డు నిండ జనాలొచ్చేసిన్రు. ఆళ్లెన్క ఆడోళ్లు గుడ పిల్లప్నూంట బెట్టుకొని కొందరు, సంకనేసుకొని కొందరు, స్నేయితురాండ్లతోని పడచు పొల్లలు... ఓహ్.. మా ఊరి మజ్జెల్నుంచి పోతున్న ఆ రోడ్డంత రంగుల్ రంగుల బట్టలేసుకున్న మనుషులతోని పూల జాతర పొంగుతున్నట్లు కనిపించబట్టింది.

ఊరి ఆ చివరకు అందరు మెల్లగ కదల బట్టిన్రు. అక్కడ డప్పు సప్పుళ్లు మొదలైనయ్. సూస్తె ఇంక జెండా ఎత్తలేదు..జెండా గురించి అనుకోంగనె ఇంకో ముచ్చట యాదికొచ్చింది నాకు. కొన్నేండ్ల కింద ఒకపాలి ఇట్లనె దసరకు ఒచ్చిన. అందరం ఇట్లనె రోడ్డుమీద కల్సినం. ఇటు ఊరందరి జెండా ఎత్తనె లేదు. అంతల్నె అటు చివర గల్లీల్నుంచి కాషాయం జెండా తీసుకొని ‘భారత్ మాతాకీ జై’ అనుకుంట ఒక గుంపు రోడ్డుమీది కొచ్చింది. నా మనసు వికలమై పొయ్యింది. ఆళ్లు ఈ మద్యల్నె ఊర్లె శాఖ పెట్టి బిజెపి జెండా పాతి హల్చల్ చేస్తున్న పోరగాల్లని తెల్సింది. ఈల్లిట్ల తయారుకావటానికి ఈ మద్యల్నె ఊర్లె మకాం పెట్టిన ఒక ఫుల్‌టైమర్ కారణమని చెప్పిన్రు దోస్తులు. నాకు ఇగ జమ్మిచెట్టు కాడికి పోబుద్ది కాలే. మా దోస్తులు పిలుస్తున్న గుడ ఇనకుంట ఇంటికెల్లిపొయ్‌న. నాతోపాటు అయాల మా ఊర్లోని ముస్లింపూవరు గుడ జమ్మికి పోలేదని అటెంక తెల్సింది. గని ఇచివూతమేందంటె తర్వాత ఏడాది ఆ పోరగాల్లు ఆ జెండా తేలేదంట. ఊర్లె అన్ని కులాలోల్లతోపాటు ముస్లింలు, క్రెస్తవులు గుడ జమ్మి కాడికి వస్తుంటరు.. గిట్లాంటి పనులు చెయ్యొద్దని ఆ పోరగాల్లకు కొందరు గట్టిగనె చెప్పివూనని తెల్సింది..!
సరె, జెండా లేషినట్టుంది, డప్పు సప్పుళ్లు ఎక్కువైనయ్. అటు కదిలినమ్. జనం మద్యల్నె లక్ష్మి బాంబులు, పురుకోస బాంబులు పేలుస్తున్రు పోరగాల్లు. చెవులు గిల్లుమంటున్నయ్. పొగలేస్తున్నది. ప్రతిసారి ఒకలిద్దరియన్న బట్టలు నిప్పు మిరుగులు పడి కాలడం మామూలె.

చేతిల పట్టుకొని లచ్చింబాంబుకు నిప్పంటించి సుర్మనంగనె గాల్లకు ఇసిరేయడం.. అది గాల్లో పేలడం.. ఒక్కోసారి జనం మద్యల పడి పేలడం పోరగాల్లకు సరదా.. తిట్టేటోల్లు తిడుతనె ఉంటరు. నవ్వేటోల్లు నౌతనె ఉంటరు. కాల్చెటోల్లు కాలుస్తనె ఉంటరు..యమ ఇంట్రస్టింగ్ సంగతేందంటె- పడుచు ఆడపిల్లలు అప్పుడే ఏసిన లంగాఓనీల్ల, పండగ కాబట్టి కట్టే చీరల్ల బలె దోరదోరగ ఊరిస్తరు. కాకపోతె ఈ మజ్జె సెల్వార్ కమీజ్లొచ్చి జరంత ఉత్సాహం తగ్గించినయ్‌గని.. లేకుంటె మస్తు మజా ఉండేది..అత్తగారిండ్ల నుంచి పండుగకని తల్లిగారిండ్ల కొచ్చిన ఆడపిల్లలు మరీ ముద్దొస్తుంటరు. పెళ్లయ్యి ఏడాది కానోళ్లు అందుల స్పెషల్. ఒక పిల్లనో పిలగాన్నో ఎత్తుకున్నోల్లు మరింత అట్రాక్షన్. ఇంకా ఇంట్రస్టింగ్ థింగేందంటె- పాత ప్రియురాళ్లను కలుసుకుంటానికి, ఆళ్ల ముందు స్టైల్ కొడ్తానికి పోరగాళ్లు పడే తిప్పలు. ఇరవైల్లో ఉన్నోల్లు ఇటు పెళ్లాల కన్ను గప్పి ప్రియురాళ్ల కళ్లల్లో మెరుపులవడం, కలుసుకొని ముద్దు ముచ్చట్లాడడం మరీ సాహస వీరుల కృత్యాలను పోలి ఉంటయ్. ఈ తీరుదే మా సైదులు కత..! 
మొత్తానికి మా సైదులు మస్తు తయారై ఒచ్చిండు. కటింగ్ కొట్టిచ్చి, కలర్ పట్టిచ్చి, పౌడర్ దట్టిచ్చి, కొత్త బట్టలు టక్ చేసుకొని, షూస్ ఏసుకొని ఒచ్చిన సైదులును చూస్తె జరంత పరాష్కమాడాలనిపిచ్చింది. గనీ ఎక్కువగ తయారైన్నా ఏందని ఆడు ఎక్కడ ఫీలైతడోనని ఊకున్న.సరె, జెండా ముందు నడుస్తుండంగ, జెండా ఎంట మా ఊరి సర్పంచు, పెద్ద మనుషులు నడుస్తుండంగ మేమందరం కదిలినం.. పావు కిలోమీటరంత దూరం రోడ్డు మీద పోవాలె. అటెంక ఎడంపక్క మట్టిరోడ్డు మీదికి మల్లాలె. అటు ముప్పావు కిలోమీటరు నడిస్తె మా ఊరి మరో సగం పల్లె వస్తది. మా సైదులుకు అక్కడికి ఎప్పుడు చేరుకుంటమా అని యమ ఆత్రంగ ఉంది గనీ.. అందరు నడవాలె గదా.. డప్పులు.. డ్యాన్సులు.. ఒక్కొక్కడు ఒక్కో తీర్గ డ్యాన్సు చెయ్యబట్టె. మల్ల అందుల మందు కొట్టినోల్ల గోల మరొకటి.. ఆళ్లు ఎగరరు.. ఎగిరేటోల్లను ఎగరనివ్వరు. అదో గమ్మత్తు.. కని బలె మజా వొస్తదిలె.. అంతల్నె నన్నొకడు డ్యాన్సు చెయ్యనీకి గుంజనె గుంజె. నాకు జర సిగ్గేసి పక్కకొచ్చేసిన..

షాన్నాళ్లకు మా ఊరోళ్లందర్ని ఒక్కతాన సూస్కుంట మస్తు ఖుషీగున్న నేను. అడ్డరోడ్డు దాన్క చేరుకున్నం. ఇగ ఆడోళ్లంత అక్కడికె ఆగిపోతరు. ఒకింత హుషారు తగ్గి మట్టిరోడ్డు దారిపడతం అందరం. ఇయాల గుడ అదే జరిగింది. గనీ మా సైదుల్ల మాత్రం హుషాక్కువైంది. ఎందుకంటె నిర్మలది మేమిప్పుడు పొయ్యే పల్లె..మా కన్న ముందు గుంపుల ఆని చిన్నప్పటి క్లాస్మేట్లతోని మాట్లాడుకుంట నడుస్తుండు సైదులు. నేను నా క్లాస్మేట్లు కలిస్తే ఆళ్లతోని మాట్లాడుకుంట నడుస్తున్న. మాట్లాడుతున్న గనీ.. మా సైదులు సంగతె మదిల మెదుల్తున్నది..సైదులు క్లాస్మేట్ నిర్మల. బలె అందంగ ఉండేది. ఆ పిల్లే సైదులంటె పడి సచ్చేది. సైదులుకు గుడ ఇష్టమె గనీ అంతగ బైటపడక పొయ్యేది. కనీ ఊరంత ఈళ్ల ముచ్చట టామ్‌టామయ్యింది. మా ఊర్లె అంటె రోడ్డు మీద ఓకె. కనీ పక్క పల్లెతోనె పరేశాని. సైదులంటె ఆ ఊరి పోరగాల్లకు గొంతుకాడికి కోపం- ‘మా ఊరి పొల్లను, అందుల అంత అందమెన పోరిని పక్క పల్లె వాడు, మల్లందుల కులం గాని కులపోడు ప్రేమించటమా? ఆని సంగతి సూడాలె!’ అని ఆళ్లకు ఒకటె కచ్చ. దసర ఒచ్చిందంటె ఆ ఊర్లెకు మేం చేరంగనె నిర్మల ఎక్కడో ఒక తాన సైదులు కంట పడేది. తన దోస్తుకత్తెల మధ్య అప్సరస లెక్క వెలిగిపోతుండేది. కొట్టొచ్చే రంగుల లంగా ఓనీలో, పొడవైన జడ నిండా పూలతోటి పెద్ద పెద్ద కళ్లు, ఒకింత పొడ అందమైన ముక్కుతోని.. యమ అందంగ కనిపించేది నిర్మల. సైదులు సూపంత నిర్మల మీదనె. ఆ పిల్ల గుడ సైదుల్నె ఎతుక్కుంటుండేది. ఆ కళ్ల భాష ఆళ్లిద్దరికె ఎరుక. ఆ సూపుల కమ్మదనం ఒదల్లేక, ఒదల్లేక ఒదిలి షనా కష్టంగ సైదులు మాతోటి కలిసి జమ్మిచెట్టు కాడికి ఒచ్చేది. మల్ల తిరిగి ఒచ్చేటప్పుడు ఎట్లన్న నిర్మలను కలిసి జమ్మి ఆకు పెట్టడం సైదులుకు పెద్ద సవాలయ్యేది. ఎందుకంటె ఆ పిల్ల కులపోల్లు, మేనోల్లు- సైదులు ఒంటరిగ దొరికితె తన్నుడే అన్నట్లు కాసుకొని ఉండేది. మేం గుడ ‘సైదులు మీద ఎవడన్న చెయ్యేసిండా, ఆని పని పడతం’ అన్నట్లు గుంపుగ సైదులుకు కాపు కాసేది. నిర్మల సైదులును కలుస్తానికి రెడీగుండేది. మొత్తానికి యాణ్నో ఓ కాడ- ఏ కంపచెట్ల సాటుంగనో, ఏ గోడ సాటుంగనో నిర్మలను కలుసుకొనేది సైదులు. ఇష్టంగ ఇద్దరు ముచ్చట్లాడుకునేది. ఆమె చేతుల్ల జమ్మి ఆకు పెట్టి అవకాశముంటే ముద్దో.. కౌగిలో తీసుకొని ఎనక్కొచ్చేటోడు సైదులు. అప్పుడు అందరం కలిసి మా ఊరిదిక్కు కదిలేది.

పక్క పల్లె రానె ఒచ్చింది. మొదటి సంది మా ఊరి నుంచి జెండా తీసుకొని మేం బయపూల్లి పోతం. ఆళ్లు ఎదురుసూస్తుంటరు. మేం చేరంగనె ఆళ్లూ మేం కలిసి ఆ పల్లెకు అటు పక్కనున్న జమ్మి చెట్టు కాడికి పోతం.మా ఊరి జనం కోసం సూషి సూషి మేం పోంగనె ’ఏందే గింతగనం ఆలస్యం జేస్తిరి’ అని అక్కడోల్లు అనబట్టిరి. ‘పారి! పారి! చీకటి పడతది’ అని కొందరు జల్ది జేస్తిరి. మగోల్లు మా అందరిల కలిసి ముందుకెల్తుంటె ఆడోళ్లంత పక్కన నిలబడి మేం దాటినంక మా ఎనక ఊరి పొలిమెర దాంక ఒస్తరు.ఆ ఆడోల్లల్ల నిర్మలను ఎతుక్కుంటుండు సైదులు.. ఆ గుంపుల కనిపించలె. ఒకింత నిరుత్సాహపడ్డట్టుంది.. నేను ఆని పరేశాని కనిపెడతనె ఉన్న. ఆగి ఎవర్ని అడగాల్నో సమజ్గానట్టుంది.. అటు ఇటు ఎత్కులాడిండు జరసేపు. సరె- జమ్మి కాడ్నించి వచ్చేటప్పుడు కలుస్తదిపూమ్మని మనసుకు సర్దిచెప్పుకొన్నట్లున్నది, మాతోపాటు జమ్మిచెట్టు దిక్కు నడిషిండు.డప్పులు.. పటాకులు.. చిన్నపోరల కేరింతలు.. ఓహ్.. అదొక గొప్ప సంబురం..!
‘షమీ షమీయతె’ శ్లోకం సదువుకుంట అందరు జమ్మి చెట్టు సుట్టు తిరుక్కుంట పూజ చేసిన్రు. పూజ అయిపోంగనె ఇగ సూడు- పోటీపడి చెట్టు ఎక్కబట్టిన్రు పోరగాల్లు. నేను సైదులు ఇంకొందరం జర పక్కన నిలబడ్డం. పాలపిట్ట కోసం ఎతుకుతున్రు కొందరు. ఆశ్చర్యంగ ఓ పాలపిట్ట ఒచ్చి జరంత దూరంల ఉన్న సర్కారు కంపచెట్టు మీద వాలనె వాలింది. దసరనాడు పాలపిట్టను సూడ్డం షానా మంచిదని, శుబం కలుగుతదని చెప్తరు. దాంతోని అందరు ఆ పిట్టను సూడబట్టిన్రు. ఒకలికొకలు చెప్పుకొని మరీ సూస్తున్నరు. అంతల ఎవడొ తీట పోరగాడు దాని దిక్కు ఉరికిండు. దాంతోని అది లేషి బుర్రున ఎగిరిపొయింది.జమ్మి చెట్టు నిండ ఎగబాకిన్రు చిన్నాపెద్దా షానామంది. చెట్టు దిగినవాళ్లు జమ్మాకు పెట్టి అలాయి బలాయి తీసుకుంటున్నరు. మా కాడికొచ్చిన సాకలి మారయ్య జమ్మి పెట్టి అలాయి బలాయి తీసుకుంటుంటె అనిపించింది- ముస్లిం సంస్కృతి గొప్పనైన అలాయి బలాయి నేర్పింది వీళ్లందరికి. గుండెకు గుండెను కలిపే అలాయి బలాయి! ఎంత మంచి విషయమిది!

చీకటి పడుతున్నది. పటాకులు కాల్షి ఆ మసకచీకట్ల చెట్టుమీదికి, మనుషుల మీదికి ఇసురుతున్నరు తీట పోరగాల్లు. ఆళ్లను తిట్టిన తిట్టు తిట్టకుండ తిడుతున్నరు బయపడ్డోల్లు. చెట్టు చుట్టు వాతావరణమంత అలాయి బలాయిలతోని నిండిపొయింది.
ఎంత తృప్తి. ఇట్ల ఊరిల ఇంతమంది ఆత్మీయుల మద్య! హాయిగ హుషారుగ మనసుల్ల ఏ కల్మషం లేని ఈ అలాయి బలాయిల మధ్య.. ఓహ్..!కాని ఇదంత కోల్పోయి.. ఆ పట్నం వలస పోయి.. అంతమంది జనంల గుడ ఎవరికీ చెందక, మనకెవరూ చెందక, ఒంటరిగ బతికేయడం ఎంత నరకం! ప్చ్..! రేపు మల్ల ఈళ్లందర్ని ఒదిలేసి ఎల్లిపోవాలె. దసరను ఎంతగనం ప్రేమించేటోల్లం. బతుకుదెరువు కోసం దసరకు ఎంత దూరమెపొయ్‌నం?! ఎంత అనుకున్నా ప్రతి ఏడాది రావడం కుదరదు. కొన్నేళ్లు పోతె అసలే రాలేకపోవచ్చు. అంటె దసర ఒక అసంపూర్తి ప్రేమగా మిగిలిపోనుందా ఈ జిందగీల? మనసంత చేదైపోతున్నట్టు తోచింది..
ఇగ ఎనక్కు మల్లిన్రు అందరు. అప్పటికె కొంతమంది ఊరి దారిపట్టిన్రు. నేను మా సైదులు గుడ ఆత్మీయంగ అలాయి బలాయి తీసుకున్నం. దోస్తులకు, పెద్దమనుషులకు, సర్పంచ్‌కు గుడ ఆకు పెట్టి అలాయిబలాయిచ్చి ఇగ పల్లె దిక్కు నడిషినం. పల్లెలకు ఒచ్చెసరికి చీకటి పడింది. ఎవరికి తెలిసినవారి ఇండ్లల్లకు వాళ్లు పోయి కలిసి వస్తున్నరు. నేను ఆ పల్లె ఆఖర్న పొడుగుపూల చెట్టున్న ఇంటి కాడ చెట్టు అరుగుమీద ఓ ఇద్దరు దోస్తులతోని కలిసి కూసున్న. మా సైదులు నిర్మలను ఎతుక్కుంట ఎనకనె ఉండిపొయ్యిండు. ఆని కోసమె ఎదురుచూస్తున్నం. 
షానా సేపటికి ఆడు ఏలాడుకుంట ఒచ్చిండు.‘ఏమైందిరా?’ అన్న ఆత్రంగ.‘ఏముంది, కలవనట్టుంది’ అని అననె అన్నడు నా ఎంటున్న ఒగ దోస్తు.‘పోదాం’ అన్నడు నీరసంగ సైదులు.కదిలినం. నేను ఆడు జర ముందు నడవబట్టినం. మిగిలిన ఇద్దరు ఎనక రాబట్టిన్రు. తలా నలుగురైదుగురు, ఇద్దరిద్దరు కలిసి మా ఊరి దిక్కు నడుస్తున్నరు మా ఊరోల్లంత. షానామంది అప్పటికే ఊరు చేరుకున్నరు. సప్పుడు లేకుంట నడుస్తున్న సైదులుతోటి ’ఏమైందిరా?!’ అన్న అనునయంగ.

‘నిర్మల ఈసారి రాలేదంటరా..!’ వాడి గొంతులో జీర.నేనేం మాట్లాడలేదు. మల్ల ఆడే- ’వరుసగ మూడేళ్లు ఒచ్చిందంట. నేను రాలేదు గదా.. అదే చెప్పిందట ఆమె దోస్తు జానమ్మతోటి- ‘మల్ల నేను ఒస్తె.. సైదులు రాకపొయ్యేసరికి ఆయన యాదిలతోని సచ్చిపోతున్న. దానికన్న, రాకుంట ఉంటమె మంచిగనిపిస్తుంది జానమ్మా.. అందుకనె ఈసారి రాబుద్ది కాక వస్తలేను’ అన్నదంట.ఈపాలి ఆని గొంతు మొత్తమె పూడుకుపొయింది. నాకేం మాట్లాడాల్నో సమజ్ కాలె..
ఊర్లెకు రానె ఒచ్చినం. ఆల్లు ఈల్లు కలుస్తున్నరు. జమ్మి ఆకు బెట్టి అలాయి బలాయి తీసుకుంటున్నరు. ఈ అలాయి బలాయి మీద ఉంటా ఉంటె నాకు ఇష్టం పెరిగిపోబట్టింది. మా సైదుల్నేమొ షానామంది అంటుకోరు. ఆల్లింటికి గుడ సూదరోప్లూవరు రారు. పెద్ద కులపోల్లయితె మల్లే సూడరనుకో! ఈడు నేను కలిసి అందరిండ్లకు ఎల్తుంటం. నాకు ఫస్టుల సమజ్ గాలె. ఈని పెండ్లిల కట్నం సదివించిన్రు గని సూదరోల్లు సుత దావత్కు రాలె. గిదేంద్రా? అంటె ఆడు నవ్వి ఊకుండు. గింత అన్యాలమా?! అని పర్శానైన. మా ఇంటోల్లు గుడ పొద్దంత ఉన్నరు గని దావత్ టైంకు మాయమైన్రు. సంగతేందని తెల్సుకుంటె, యాటను మైసమ్మకు బలిచ్చివూనంట. నేను సాటుంగ దావత్ల షరీకైన. అది వేరే ఖిస్సా!సైదులింటికి బొయ్‌నం. ఆల్ల అమ్మ నాయ్‌నకు జమ్మి ఆకు బెట్టి కల్సిన. ఆళ్ళమ్మ కాళ్ళు ఆడు మొక్కితె నేను గుడ మొక్కబొయ్‌న. ‘హమ్మో! వద్దు కొడ్కా!’ అని అంతెత్తున్న ఎగిరిపడ్డది. పర్శానైన. ఎందుకట్ల అంటె ‘తప్పయ్యా! మాయి మీరు మొక్కొద్దు!’ అన్నది ఆ తల్లి.

మా యింటికి బొయ్‌నం. మా యింట్ల మా అబ్బాకు, తమ్మునికి జమ్మాకు బెట్టి అలాయి బలాయి తీసుకుండు సైదులు. మా అమ్మీకి, చెల్లెండ్లకు జమ్మాకు బెట్టి ఆళ్ల చేతులను కండ్లకు అద్దుకుండు. అటెంక మా దోస్తులిండ్లకు, ఊర్లె మాకిష్టమెన కొందరిండ్లకు ఎల్లి కల్సి బైటపడ్డం.
అంత బాగనె ఉంది గని సైదుల్ల మునుపటి హుషారు లేదు. మాటిమాటికి పరద్యానంల కెల్లిపోతున్నడు. ఇగ లాబం లేదని ఆన్ని తోల్కొని గౌండ్లోల్ల బిక్షం ఇంటికి పొయ్‌నం. నిజానికైతె పండగ పూట కల్లు దొర్కదు. కని పొద్దున రాంగనె పైసలిచ్చి మా అమ్మీని పంపి చెప్పి పెట్టిన.
బిక్షం- ‘ఎట్లున్నరు దోస్తులిద్దరు?’, ‘ఊర్లె లేకుంట బోతిరి’, ‘మీరున్నప్పటి జమాన వేరు, ఇప్పుడు చీప్‌లిక్కర్ల మీద బడ్డరంత’ అని అదొ ఇదొ మాట్లాడుకుంట ఇంటెన్క యాపచెట్టు కింద రెండు కుర్సీలేసి, రెండు గాజు గిలాసులు అందిచ్చి కల్లు లొట్టి దెచ్చి ఒంపిండు. చెరో గ్లాసు తాగినంక మల్ల గ్లాసులు నింపి లొట్టి పొందిచ్చి పెట్టి, ‘జర మీరే ఒంపుకోరి, పిల్లలొచ్చిన్రు గదా.. నేన్ బోత’ అన్జెప్పి తలుపు దగ్గరికేసుకుంట ఇంట్లకు పొయిండు బిక్షం.
మా తమ్మునికి ఫోన్ చేస్తె ఆడు టిఫిన్ బాక్సు నిండ తలాయించిన ఆవుకూర ముక్కలు తెచ్చిచ్చి పొయిండు. బుసబుస పొంగుతున్న కల్లు.. దట్టమెన కారంతోని చవులూరిస్తున్న ఆవుకూర ముక్కలు.. యమ రమ్‌జుగుంది మా పార్టీ.
నాలుగ్లాసులు లోపల పడ్డంక మొదలయ్యిండు సైదులు. ఆ సమయం కోసమె ఎదురుచూస్తున్న నేను. ఆడి మనసుల మెలిదిర్గుతున్న బాదనంత ఇప్పబట్టిండు. అన్ని నాకు తెల్షిన సంగతులె. అయ్‌న ఊ కొడుతున్న. ఇంకింత తాగినంక సైదులు గొంతుల జీర మొదలైంది. ఇంక జరసేపటికి ఆడిల పేరుకున్న దుఖ్కం బైటికి ఎగదన్నింది. ఇగ ఏడ్సుకుంటనె ఆడు మాట్లాడుతున్నడు. ఆన్ని తన్వితీర ఏడ్వనిస్తెనె మంచిదనుకున్న. ఆడు చెప్తున్నడు- ‘నిర్మల అంటె నాకు పానంరా. అది గూడ నేనంటె పడి సచ్చేది. ఆల్లింట్ల షాన కొట్లాడిందంట. ఆల్లు ఎంతకు ఒప్పుకోలేదంట. ఆళ్ల నాయ్‌న నాల్గు దెబ్బలేషిండంట. ‘మల్ల అదే మాటంటె నిన్ను సంపి మేం సస్తం’ అన్నడంట.
పెండ్లి ఖాయమైనంక ఒచ్చి కలిసిందిర.. ఎటన్న ఎల్లిపోదమని నా కాల్లు చేతులు పట్టుకున్నదిర’ ఆడు ఎక్కెక్కి ఏడ్వబట్టిండు. మల్ల సంబాలించుకొని- ‘మా అమ్మనాయ్‌నకు నేనొక్కన్నె కొడుకునైతి. ఆల్లు తట్టుకోలేరు. మేమెల్లిపోతె ఆళ్ళోల్లు ఊకుంటర? మా యింటిమీద బడతరు. గోల గోల జేస్తరు.. అయన్ని సోంచాయించి వద్దన్న. నిర్మల బోరుబోరున ఏడ్షిందిర. ఆఖరికి ‘చేతగానోనివి ఎందుకు ప్రేమించినవ్?’ అని నిలదీసింది. ‘ఆడపిల్ల ఒచ్చి లేషి పోదామన్న కదుల్తపూవ్వే.. ను మొగోనివేనా?!’ అని బూతులు గుడ తిట్టిందిర... తిట్టుకుంట- ‘అటెంక నువ్వే బాదపడతవ్ సైదా! ఇగ నేను ఎల్లిపోతున్న.. మల్ల కనబడ! నీ ఇష్టం!’ అనుకుంట ఎల్లిపొయిందిర.. మల్ల ఇంతదంక కన్పించలె..’ చిన్నపిలగాని లెక్క ఏడ్వబట్టిండు సైదులు.ఆఖరికి సంబాలించుకొని ఒక మాటన్నడు- ‘అదికాదుర బయ్! మా రెండు కులాలను అంటరానోల్లనే అంటరు గదరా! మా రెండు కులాలు ఉండేది ఊరి బైటనె కదరా..! మరి అందుల గుడ నిర్మలని చేసుకుంటాన్కి నాది పనికిరాని కులమెందుకైందిరా? మాలోల్ల కన్నా మాదిగోల్లం తక్కు ఈ తేడాలు ఇంకెప్పుడు పోతయ్‌రా..???’ ఆడు నిలదీస్తున్నడు. నన్నొక్కన్నె కాదు, మొత్తం వ్యవస్థనె ఆడు నిలదీస్తున్నట్లనిపించింది నాకు...
- స్కైబాబ

No comments:

Post a Comment

మీ అభిప్రాయం తెలియజెయ్యండి