తెలంగాణ సాధన పట్ల మరింత పట్టుదల పెరిగింది
సీమాంధ్ర ప్రభుత్వంపై - పోలీసు అధికారులపై అసహ్యం కలిగింది
తెలంగాణ మార్చ్ సందర్భంగా అటు ప్రభుత్వం, పోలీసులు టెన్షన్ 
పడుతుండగా ఇటు తెలంగాణ వాదులము సమరోత్సాహంతో సన్నద్ధం కావడం తెలిసిందే. 
సెప్టెంబర్ 30న 3 గం.ల నుండి అనుమతి దొరికింది అని తెలిసినా 29 రాత్రి 
నుంచే తెలంగాణ జిల్లాల నుంచి ప్రజలు హైదరాబాద్ చేరుకోవడం మొదలైంది. 30 
నాడు ఉదయం నుంచే నెక్లెస్ రోడ్‌కి చేరుకోడానికి ప్రజలు తండోప తండాలుగా 
కదిలి రావడం కనిపించింది. కాని పోలీసులు మాత్రం అతి క్రూరంగా ప్రవర్తించడం 
మొదలైంది. కేవలం టాంక్‌బండ్ ఆ చివర నుండి సంజీవయ్య పార్క్ రోడ్ నుంచి 
మాత్రమే మార్చ్‌కు వెళ్లాలని ఒక హుకుం జారీ చేస్తూ మిగతా దారులన్నీ 
మూసేశారు. ఖైరతాబాద్ వైపునుంచి వచ్చేవారు కేవలం ఆ చౌరస్తాలో ఉన్న 
ఫ్లైఓవర్ దాటనిస్తే నెక్లెస్ రోడ్‌లోకి వెళ్లిపోవచ్చు. కాని అక్కడ ఆ 
ఫ్లైఓవర్‌కు బారికేడ్లు అడ్డం పెట్టి కాపలా ఉన్న పోలీసులు చుట్టు తిరిగి 
సంజీవయ్య పార్క్ వైపు నుంచి వెళ్లమని సలహా లివ్వడం మొదలుపెట్టారు. 
నిజానికి అక్కడి నుంచి చుట్టు తిరిగి రావాలంటే ఆరేడు కిలోమీటర్లు వెళ్లాలి.
 వాహనాలు లోనికి వెళ్లనివ్వరని కాలి నడకన వచ్చేవారిని అన్ని కిలోమీటర్లు 
నడవమని పురమాయించడం హాస్యాస్పదంగా కనిపించింది. అటు సెక్రటేరియట్ 
వద్దనుంచి వెళదామని వచ్చినవారిని సైతం నిలువరించి, లాఠీచార్జ్ చేసి, 
బాష్పవాయువు ప్రయోగించి నానా యాతన పెట్టారు పోలీసులు. ఇటు గల్లీల్లోంచి 
ఐమాక్స్ థియేటర్ ముందుకు చేరుకున్న 100 మందిని నిలువరించిన పోలీసులు 
వెనక్కి వెళ్లి తిరిగిపొమ్మంటున్నారు. కేవలం పోలీసులు దారి ఇచ్చి ఒక 
బారికేడ్ పక్కకు జరిపితే మేము వెళ్లిపోతామని మళ్లీ మూసేసుకొమ్మని అక్కడ 
చేరిన వారు వేడుకున్నారు. అంతా కాలినడకన వచ్చిన వారంతా అన్నేసి 
కిలోమీటర్లు తిరిగి నడిచి
 వెళ్లడం భారమైన విషయం. ఎంత బతిమిలాడినా పోలీసులు వినలేదు. దాంతో 
తెలంగాణవాదులు 'జై తెలంగాణ' నినాదాలు చేయడం మొదలుపెట్టారు. వదిలేస్తాం 
రమ్మని ఒక పోలీసు అధికారి పిలిచాడు. దాంతో అంతా గుంపుగా వచ్చారు. లేదు, 
లేదు వెళ్లనిచ్చేది లేదు అని ఇతర పోలీసు అధికారులన్నారు. దాంతో పోలీసులు 
సీరియస్ అయ్యారు. దాంతో తెలంగాణ వాదులు కొందరు బైఠాయించారు, మిగతావాళ్లు 
కూడా బైఠాయించబోతుండగానే ఒక్కసారిగా లాఠీచార్జ్ మొదలుపెట్టారు. 
విచక్షణారహితంగా కొట్టడం మొదలుపెట్టారు. దాంతో పడుతూ లేస్తూ పరుగులు 
పెట్టిన తెలంగాణవాదులు అనేక దెబ్బలు పడ్డారు. చెప్పులు పోగొట్టుకున్నారు. ఆ
 గుంపులోనే ఉన్న నేను, సంగిశెట్టి శ్రీనివాస్ కూడా రెండ్రెండుసార్లు కింద 
పడ్డాం. నా చెప్పులు పోయాయి. అరచేయి కట్ అయి రక్తం కారసాగింది. తొడమీద 
బలమైన లాఠీ దెబ్బపడింది. విపరీతమైన నొప్పిపెట్టసాగింది. అందరం 
ఖైరతాబాద్ గల్లీల్లో పడి వెనక్కి వచ్చాం. మిత్రులు పసునూరి రవీందర్, 
గోగు శ్యామల, పిల్లలమర్రి రాములు సార్ తదితరులు సెక్రటేరియట్ దగ్గర 
ఎప్పుడు వెళ్లనిస్తారా అని తచ్చాడుతున్నారు. నేను, సంగిశెట్టి శ్రీనివాస్ 
కాళ్లీడ్చుకుంటూ ద్వారకా హోటల్ దాకా వచ్చి ఓ అరుగు మీద కూలబడ్డాం. ఊడుగుల 
వేణు ఒక పెద్ద గుంపులో కలిసి ఖైరతాబాద్ చౌరస్తాకి చేరుకున్నాడు. అక్కడ 
పోలీసులు వెళ్లనివ్వకపోవడంతో ఆ చౌరస్తాలో తెలంగాణవాదులు పెద్ద సంఖ్యలో 
బైఠాయించారు. నినాదాలు హోరెత్తుతున్నాయి. కొందరు ఫుట్‌వే బ్రిడ్జ్ ఎక్కి 
దానికి కట్టి ఉన్న ముఖ్యమంత్రి కిరణ్, దానం నాగేందర్ బ్యానర్లు 
చించివేశారు. హోరెక్కువవుతున్నది.
మరో మిత్రుడు నందకిశోర్ మెహదీపట్నం దారిలో వచ్చి మాసాబ్‌ట్యాంక్‌లోనే
 బస్ దింపేయడంతో అక్కడినుంచి నడిచివస్తూ లక్డీకాపూల్‌లో ఉన్న మమ్మల్ని 
కలవడానికి రానివ్వకపోవడంతో ఖైరతాబాద్ వైపుగా నడుస్తున్న గుంపుతో పాటు 
వెళ్లిపోయాడు. 
చివరికి 3 గంటల ప్రాంతంలో ఖైరతాబాద్‌లో నలువైపుల నుంచి జామ్ 
ఐపోవడంతో అప్పుడు ఫ్లైఓవర్ దారి విడిచారు పోలీసులు. దాంతో ఖైరతాబాద్ 
నుంచి పెద్దఎత్తున నినాదాలు చేస్తూ జనం నెక్లెస్ రోడ్‌వైపు దారితీశారు. 
అక్కడ వదిలేశారని తెలియడంతో మేము, మాతో చేరిన పసునూరి, గాదె వెంకటేష్ 
తదితరులం కలిసి కదిలాం. ఐమాక్స్ వైపు కూడా వెళ్లనిస్తుండడంతో అక్కడి 
నుంచి నెక్లెస్ రోడ్‌లోకి వెళ్లాం. మాపై లాఠీచార్జ్ జరిగిన స్థలం 
దాటుతుంటే అక్కడ ఎన్నో రకాల చెప్పులు చిందరవందరగా పడి ఉండడం కనిపించింది.
నెక్లెస్‌రోడ్‌లోకి వెళ్తుంటే రకరకాల బ్యానర్లతో, జెండాలతో గుంపులు 
గుంపులుగా జనం వస్తూ కనిపించారు. ఐమాక్స్ నుంచి ఎంత నడిచినా, ఎంతసేపు 
నడిచినా మీటింగ్ స్పాట్ రావడం లేదు. అంత దూరం ఉంది ఆ ప్లేస్. నడిచీ 
నడిచీ అలసిపోయాం. దారి పొడవునా పోలీసువాళ్లను జనమంతా బూతులు తిట్టడం 
వినిపించింది.
సాయంత్రమవుతోంది. పోలీసు వాహనాలు జనంలోంచే అటూ ఇటూ 
తిరుగుతున్నాయి. రెండు వాహనాలు తగలబడుతున్నాయి. చిత్రమేమంటే పోలీసులు 
విధించిన గడువు కాకముందే మాటిమాటికి టియర్ గ్యాస్ పేల్చుతుండడం!! దాంతో ఆ
 పొగకు కళ్లు మండడం, ఊపిరాడకపోవడంతో జనమందరం చాలా ఇబ్బంది పడ్డాం. పోలీసులు
 టియర్ గ్యాస్ పేల్చినప్పుడల్లా జనం భయంతో అటూ ఇటూ పరిగెత్తడం 
కనిపించింది. స్టేజి ఎదురుగా ఉన్నవాళ్లు నిలకడగా ఉన్నా అటువైపు, ఇటువైపు 
ఉన్న జనాన్ని భయభ్రాంతులకు గురిచేస్తూ పోయారు పోలీసులు. 7 గంటల దాకా కవాతు 
సమయమున్నా ఆరున్నర గంటలకే వాటర్ కేనన్లు ప్రయోగించడం ఆశ్చర్యం 
కలిగించింది.. మొత్తంగా సభా సమయం కాకముందే ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి 
చెల్లాచెదరు చేసి వెళ్లిపోయేలా చేయాలని పోలీసుల ప్లాన్ కావొచ్చు. 
తొక్కిసలాట జరిగి కవాతుకు చెడ్డ పేరు రావాలని కూడా వాళ్ళు ప్లాన్ చేసినట్టు
 సమజవుతూనే ఉంది.
ఇదిలా ఉంటే కవాతుకు మూడు రోజుల ముందు నుంచే జిల్లాల నుంచి 
హైదరాబాద్‌కు వస్తున్న ప్రయాణీకులను నానా ఇబ్బందుల పాలు చేశారు పోలీసులు. 
కవాతు రోజు మాత్రం హైదరాబాద్ చుట్టూ దాదాపు 25 కిలోమీటర్ల అవతలే వాహనాలు 
నిలిపేశారు. నల్గొండ వైపు నుంచి వచ్చిన వాహనాలను రామోజీ ఫిలిం సిటి కాన్నే 
నిలిపెశారట.. అక్కడ దిగిన జనం 25 కిలోమీటర్లు ఎలా నడిచి వస్తారు? ఆ రకంగా 
కవాతుకు జనం తగ్గడానికి శాయాశక్తుల పోలీసులు ప్రయత్నించారు. అయినప్పటికీ 
అంత జనం కవాతుకు తరలిరావడం విశేషం.
ఇక మేము (నేను, సంగిశెట్టి శ్రీనివాస్, పసునూరి రవీందర్, ఆయన 
తమ్ముడు, గాదె వెంకటేష్, ఊడుగుల వేణు) అలసిపోయి.. టియర్ గ్యాస్ వల్ల 
కళ్లు మండుతుండడంతో, దగ్గు వస్తుండడంతో బేగంపేట ఏరియాలో రైలు పట్టాలు దాటి
 గల్లీల్లోకి వచ్చాం. ఈ లోపు మా గాదె వెంకటేష్ కవితా సంకలనం 'పొలి' ఆ 
జనంలోనే ఆవిష్కరణ చేసుకున్నాం. ఆ తర్వాత నడుస్తూ నడుస్తూ మెయిన్ రోడ్డు 
మీదికొచ్చి చూస్తే బేగంపేట ఫ్లైఓవర్ దగ్గర తేలాము. అక్కడి నుంచి సిటీలోకి 
వెళ్దామని చూస్తే- అక్కడ పంజాగుట్ట వైపుగా రోడ్ బ్లాక్ చేసి అడ్డంగా 
నిలబడ్డ పోలీసులు లాఠీలు చూపుతూ 'మార్చ్‌కి వచ్చారు కదా.. మార్చ్‌వైపే 
వెళ్లండి' అని నిర్దాక్షిణ్యంగా మళ్లీ గల్లీలోకి తరుమడం మొదలుపెట్టారు. 
మాకేం అర్థం కాలేదు. ఇదేమి విచిత్రం. ఇళ్లకు వెళ్లిపోతామన్నా వినడం లేదు. 
దాంతో ఏం చేయాలో అర్థం కాక ఫ్లైఓవర్ మీంచి వస్తున్న సిటీ బస్సులను రోడ్డు 
మధ్యలోనే ఆపి ఎక్కి మైత్రీవనం వైపు ప్రయాణించవలసివచ్చింది. మాతోపాటు 
బస్సులు ఎక్కిన తెలంగాణవాదులు పోలీసులను బూతులు తిట్టడం వినిపించింది. 
బస్సుల్లో తెలంగాణ నినాదాలు చేస్తూ ప్రభుత్వాన్ని, తెలంగాణ మంత్రులను 
నినాదాల్లో తిట్టడం వినిపించింది. మధ్యలో దిగి ఆటోలు మాట్లాడుకొని మేము 
బంజారాహిల్స్ మీంచి చుట్టూ తిరిగి ఇండ్లకు చేరాల్సి వచ్చింది. రాగానే 
టీవీలు పెట్టుకొని వర్షంలో తడుస్తున్న కవాతును నిస్సహాయంగా చూస్తూ 
ఉండిపోయాం.
 
This comment has been removed by a blog administrator.
ReplyDelete