ఊహ ఊరుకోదు కదా.. తన ఇష్టాలకు తగ్గట్టుగా ఒక బొమ్మ గీసుకుంది. తనలోని అసంతృప్తులకు కారణమైన ఖాళీల నన్నింటినీ పూరించుకుంటూ ఆ బొమ్మను రూపొందించుకుంది. తన కిష్టమొచ్చినన్ని ఒంపులు తిప్పుకుంది. తోచినప్పుడల్లా, ఖాళీ దొరికినప్పుడల్లా ఆ బొమ్మను ఎదుట నిలుపుకొని ఎచ్చోట ఏ కాస్త వంక కనిపించినా దానిని సరిదిద్దుతూ, మెరుగులు పెడుతూ తనకు నచ్చే విధంగా మలుచుకుంది.
కవ్వించే కళ్లను, ఆకర్షణీయమైన మోమును, మనసు కొల్లగొట్టే నవ్వును, స్వేచ్ఛాయుతమైన నడకను, పసందైన భంగిమను బొమ్మలో పోతపోసి దానితో చెట్టాపట్టాలేసుకొని విహరించసాగింది.
అప్పుడప్పుడు ఈ పాడు లోకంతో విసిగినపుడు- ఒంటరితనాన్ని ఆశ్రయించి తన బొమ్మతో మాట్లాడుకునేది ఊహ. బొమ్మ వారించదు కదా.. కాబట్టి తన ఫీలింగ్స్ అన్నీ పూసగుచ్చినట్టు చెప్పుకునేది. లోకం శాడిస్టుదనీ.. ఇది తప్పంటుంది- అది ఒప్పంటుంది- ఫలానా పని చేయనే చేయొద్దంటుందనీ.. చుట్టూ గోడలు కడుతుందనీ.. ఇనుప కంచెలు పాతుతుందనీ.. అవన్నీ తనకు ఇష్టం లేకున్నా రాజీపడిపోవలసివస్తోందనీ బొమ్మతో వాపోయేది..
ఇలా ఎంత కాలమో..! ఏళ్లు గడిచిపోయాయి.
అనుకోకుండా తన బొమ్మలో ఉండాల్సిన జీవం తాలూకు ఆనవాళ్లు తారసపడ్డాయి ఊహకు. అతలాకుతలమైంది ఊహ. అన్వేషణ మొదలుపెట్టింది. ఆ జీవం ఎంతకూ ఎదురుపడలేదు. కాని తన వ్యక్తీకరణల ద్వారా మాత్రం తన ఉనికిని వ్యాపింపజేస్తూ పోతున్నది జీవం. ఆ ఆనవాళ్లను పట్టుకొని ఊహ పరుగులు పెట్టింది. ఎలాగైనా పసిగట్టి జీవాన్ని పట్టుకోవాలనుకుంది. ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఎక్కడెక్కడో వాకబు చేసింది. జీవంతో పరిచయమున్న తోలుబొమ్మలన్నింటినీ అడిగి చూసింది. ఊహూ.. ఊహకు జీవం తాలూకు ఆధారం దొరకనే లేదు. ఏ తోలుబొమ్మా జీవం ఆచూకీ చెప్పనేలేదు. జీవాన్ని ఊహకు పరిచయం చేయడానికి వారికి జెలసీ అడ్డుపడింది కాబోలు. కాని జీవం సాహిత్యం మాత్రం అనుకోకుండా అచ్చులో కనబడి కలవరపెట్టేది. ఆ రాతల్లోని భావాలు అచ్చం తన బొమ్మకు ఉండాలనుకున్న లక్షణాలతోనే తొణికిసలాడుతుండేవి. తనతోనే మాట్లాడుతున్నట్లుండేవి. తన గురించే రాసినట్లుండేవి. ఇక తట్టుకోలేకపోయింది ఊహ.
మరింత పట్టుదలతో లోకమంతా వాకబు చేసి అడగరాని కొమ్మనల్లా అడిగి చివరికి ఆ జీవం తాలూకు ఒక తీగ ఆధారాన్ని సంపాయించగలిగింది. కనిపించని తీగ అది. కాని తను ఆ తీగ ద్వారా జీవంతో సంభాషించవచ్చు. ఇప్పటికిది చాలు అనుకుంది ఊహ. తొలి ప్రయత్నంగా తరంగాల ద్వారా జీవాన్ని మీటింది. మేను ఝల్లుమన్నది. విద్యుదయస్కాంత శక్తేదో అతలాకుతలం చేసిన భావన. నిభాయించుకొని మెల్లగా పలకరించింది.
ఓహ్.. జీవం తొలి పలుకే తనని పూర్తిగా వశపరచుకున్నట్లు తోచింది ఊహకు. సంభాళించుకొని సంభాషణ మొదలుపెట్టింది. జీవం హాయైన నవ్వు, నిశ్చల సముద్రం మధ్యలో ఉవ్వెత్తున లేచిన కెరటంలా అంతెత్తుకు ఎత్తింది ఊహను. ఆ మాటల్లో ఏదో తెలియని ఆకర్షణ. ఆ గొంతు చిరపరిచితమైనదైనట్లు భావన.
కళవళపడిపోయింది ఊహ. ఆ వెన్నెల చల్లదనపు పలుకు, ఆ జలపాతపు సవ్వడి నవ్వు, ఆ ఏ భావానికీ తడుముకోని వాగ్ధాటి, ఆ దేనికీ వెరవని హుందాతనపు కవ్వింపు... అలా ఎన్నెన్ని విశేషణాలతోనో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న జీవం తాలూకు ఆకృతిని ఊహించుకోలేక పరిగెత్తుకు తన బొమ్మను చేరుకుంది ఊహ. అన్ని అసంపూర్తులను పూరించుకొని తయారుచేసుకొన్న బొమ్మను ముందుంచుకొని ఆ బొమ్మకు జీవం పోసుకుంటూ సంభాషించసాగింది.
ఇప్పుడు బొమ్మ మాట్లాడడం మొదలుపెట్టింది! కనిపించని తీగ ఆధారంగా బొమ్మ మాట్లాడసాగింది. తను పోతపోసుకున్న బొమ్మ.. తనకు నచ్చినట్లుగా తీర్చిదిద్దుకున్న బొమ్మ- ఇప్పుడు తనతో సజీవంగా సంభాషించసాగింది. ఓహ్.. ఎంత అద్భుతం. తన బొమ్మకు జీవం వచ్చింది. ఇక చాలు.. తన వెతుకులాటకు ఫలితం దక్కింది. ఇక ఈ జన్మకు ఈ జీవాన్ని పొందడమే పరమావధి అనుకుంది ఊహ.
అలా కొన్నాళ్లు జీవంతో గొంతు కలుపుతూ మనసు పూర్తిగా ఆర్పించుకుంటూ మైమరచిపోయింది ఊహ. కాని ఆ ఆనందం, ఆరాటం, మైమరపు ఎన్నాళ్లు?
బొమ్మ త్వరలోనే ప్రతికూల సంకేతాలివ్వడం మొదలుపెట్టింది.. ఎదురుతిరగడం మొదలుపెట్టింది. మెదలకుండా ఉండడానికి తనేమైనా మైనపు ముద్దనా? అని ప్రశ్నించింది. తనను నీ ఫ్రేములో బంధించడానికి చూడొద్దంది. నీ కిష్టమైన షోకేసులో అలంకరించాలని ఆశ పడొద్దంది. ఏ స్పందనలూ లేకుండా ఉండడానికి నేను కేవలం నీవు తయారుచేసుకొన్న బొమ్మను కాను. సర్వ శక్తులతో ఉరకలెత్తుతున్న జీవాన్ని అంది.
ఊహ హతాశురాలైంది. తను తయారుచేసుకున్న బొమ్మకు జీవం వస్తే అది తను అనుకున్నట్లు నడుచుకుంటుందనుకుంది. కాని జీవం తన ఆధీనంలోకి రాకపోగా తనకు దక్కకపోగా తనను పెద్దగా పట్టించుకోకపోవడాన్ని జీర్ణించుకోలేకపోయింది ఊహ.
తన స్నేహితురాలైన ఓ తోలుబొమ్మతో వాపోయింది ఊహ-
'నా బొమ్మ నా మాట వినట్లేదే!' అని.
తోలుబొమ్మంది- 'నువ్వు రంగులు సరైన పాళ్లలో వేసినట్లు లేదే.'
'అదసలు ఏ రంగులకూ లొంగదు. ఏ ముద్రల్నీ మొయ్యదు.'
'అంతగా నవనీతమా నీ బొమ్మ!'
'ఎంతగా అంటే- ఆ సూర్యమ్మ స్వయం ప్రకాశం, ఆ చంద్రమ్మ మనసు చల్లదనం, ఈ నేలమ్మ అనంతమైన ఓరిమి కలగలసిన నవనీతమే!' అంది ఊహ తన్మయంగా..
'మరెందుకు నీ మాట వినడం లేదో దానినే అడుగు' అంది తోలుబొమ్మ. సమయం సందర్భం చూసి అదే అడిగింది ఊహ.
'నువ్వు సృష్టించుకున్న బొమ్మలో నన్ను జీవంగా ఒంపుకొని మాట్లాడుతున్నా నంటున్నావు. సరె, మరి జీవంతో సమానంగానైనా నువ్వు ఉరకలెత్తాలి కదా.. కాని అది నీ వల్ల కాదు. కనీసం జీవాన్ని అనుసరించు. అంతే తప్ప దాని రెక్కలు కూడా కత్తిరించాలని చూడకు' అంది జీవం.
'లేదు, నాకు నా బొమ్మంటే చాలా ఇష్టం. అందులో జీవమైన నువ్వంటే అనంతమైన ఇష్టం. నాకు నువ్వు కావాలి. నాకు జీవం కావాలి' అంది ఊహ ఉద్వేగంగా.
'ఊహ స్థాయిని దాటి జీవాన్ని పుణికిపుచ్చుకున్నాను నేను. చట్రాల్ని విదుల్చుకొని ముందుకెళ్తున్నాను. నీకు అది చేతకాక అన్నింటికీ ఒదిగి కేవలం ఊహగా మిగిలిపోతున్నావు. మరింత ముడుచుకుపోయి ఓ బొమ్మను సృష్టించుకొని కాలం గడుపుతున్నావు. నువ్వు భయస్తురాలివి. చాదస్తురాలివి కూడా!' అంది జీవం.
కోపం ముంచుకొచ్చింది ఊహకు. అయినా తమాయించుకొని- 'మరేం చేయమంటావు నన్ను? నాకూ నీలాగా అవ్వాలని ఉంది' అంది ఊహ.
'నువ్వూ నాలాగా కావాలంటే నిన్ను నువ్వు దాటాలి. అంటే ఊహను దాటాలి. బొమ్మను చెరిపెయ్యాలి. లోకం గీసిన చట్రాల్ని చిత్తు చేయాలి. నువ్వు నువ్వుగా మనగలగాలి. నిత్య చలనంగా సాగాలి. అప్పుడే నీవు జీవంగా గుబాళించగలుగుతావు' నిశ్చయంగా చెప్పింది జీవం.
'ఆ ప్రయత్నమేదో చేస్తాను. ఈలోగా నువ్వు నా నుంచి దూరమవుతావేమోనని భయంగా ఉంది. నువ్వు నాకు కావాలి. నిన్ను పొందాలంటే ఏం చేయాలో చెప్పు.. ప్లీజ్!' బతిమిలాడింది ఊహ.
'నన్ను పొందాలంటే నువ్వు ముందు జీవానివి కావాల్సిందే. నీ చుట్టూ అలంకరించడానికి అవకాశమిచ్చిన సకల ఊచల్ని తెంచుకొని స్వేచ్ఛా జీవానివి కావాలి. అప్పుడు మాత్రమే నేను నీకు అందుతాను' అంది జీవం స్థిరంగా. ఆ గొంతులోని స్థిత ప్రజ్ఞతకు ముగ్ధురాలైంది ఊహ.
అది తనకు సాధ్యమేనా అంటూ తరచి చూసుకుంది ఊహ. చూస్తే- అంచెలంచెలుగా తన చుట్టూ పోతుకుపోయిన అన్నన్ని ఊచల్ని తెంచుకోవడం తన వల్ల అవుతుందా? అనే సందేహం ఆవరించింది. దాంతో దుఃఖం ముంచుకొచ్చింది.
నిస్సహాయంగా బావురుమన్నది ఊహ.
బావురుమంటూనే ఉన్నది.
లోకం ముసి ముసిగా నవ్వుకుంది.
నవ్వుకుంటూనే ఉంది!
('ఊహ'కు)
('పాలపిట్ట' అక్టోబర్ సంచికలో అచ్చయ్యింది)