Sunday, 17 June 2012

సూఫీ దేవుడు (A Poem On My 'ABBAAJAAN')



అబ్బాజాన్ నవ్వుతున్నడు
చిన్న పిలగాని లెక్క
చిటికెన వేలందించి
నాతో తప్పటడుగులు వేయించిన అబ్బా
ఇయాల నా చెయ్యి పట్టుకొని
అడుగేస్తానికే తడబడుతుండు

పక్షవాతపు ఒళ్ళు తూలినప్పుడల్లా
నవ్వుతున్నడు అబ్బాజాన్
పసి పిలగాని లెక్క
     *          *
నిండైన గడ్డం - టోపీ పెట్టి
తెల్లని లాల్చీ - లుంగీ కట్టి
కదిలొస్తుంటే
అచ్చం ఆ సూఫీ దేవుడే ... ... !

పీర్ల ముందూ నువ్వే
కందూర్ల ముందూ నువ్వే
పుంజునో పోతునో హలాల్ చెయ్యాలన్నా
ఫాతెహా లియ్యాలన్నా నువ్వే
తేలు కరిసినా పురుగు ముట్టినా
నీ మంత్రమే కావాలె
పసి కందులకు నీ అంత్రమే కట్టాలె
ఏ ఇంట్లో ఏ ఆపదొచ్చినా - నొప్పొచ్చినా
గుర్తొచ్చే మొదటి దేవుడా !
నీ మాట చాలు - నీ ఆభయమే 'మేలు' !

సుక్క పొడవక ముందే
ఎన్ని ఇండ్లల్లో పలికేదో - నీ పేరు
'మదారు సాబు కాడికి తోల్క పోవాలె '
మదారు సాబును పిల్సుక రావాలె '
మాల మాదిగలూ సూదర్ల బారు !
          *
చేతులెత్తి నువ్వు దువా చేస్తే
ఊరందరికీ కొండంత అండనిపించేదే..
మరి మన ఇల్లెందుకు అబ్బాజాన్
పడావు పడ్డది

దువా చదివి నువ్వు జుబా చేస్తే
ఆ ఇంటిల్లాదులకూ కందూరు పండుగయ్యేదే..
మరి మన ఇంటోళ్ళ కెందుకు అబ్బాజాన్
ఉపాసముండని రోజు లేకుంటయ్యింది

మనకు చేలేందుకు లెవ్వో - చెల్క లెందుకు లెవ్వో
పొల మెందుకు లేదో - తల మెందుకు లేదో
చేతిలో ఆరె ఎందుకు లేదో
ఇంటి ముందు సారె ఎందుకు లేదో
ఇంట్లో మగ్గం ఎందుకు లేదో
ఏనాడూ చింత చెయ్యవైతివి అబ్బా
రిజర్వేషన్ మాటెత్తితే
సర్కారు బిచ్చం మనకెందుకురా అంటివి

గొంతెత్తి పాడేటోనివి - నిర్వేదంగా..
'యే దునియా యే మహెఫిల్
మెరే కామ్ కీ నహీ మెరే కామ్ కీ నహీ..'
          *
చేతులెత్తి నువ్వు దువా చేస్తుంటే
భూగోళమే  మెల్లమెల్లగా చిన్నదై
నీ కాళ్ళ కింద చేరి చిన్నబొయ్యేది

ఊరందరి నోట్లో నాలుకైన నువ్వు
ఇంటి పరేశాన్లకు బైటివాడివైతివి

'భద్రత' తెలియని నిరంది
సొంతానికీ.. కుటుంబానికీ..
అంతా బేగం మీద వోదిలేసే బేచింత !

నువ్వే అదృష్టవంతుడివేమో అబ్బా
అందరిలా ఏదో ఇంకేదో సంపాయించాలనే
యావేదీ లేకుండా బేఫికర్ గా బతికినవ్
ఎవరేమనుకుంటే నీకేంది
అది నీ తత్వమో - 'నసల్ ' నైజమో

మాక్కూడా నీలాగే  బతకాలని ఉంది
జర  గా  ఉపాయం చెప్పరాదే !
     *            *
అబ్బాజాన్ నవ్వుతున్నడు
నిర్వేదంగా...

అబ్బాజాన్ నవ్వుతనే ఉన్నడు
మారని మమ్మల్ని చూసో...
మారిన లోకాన్ని చూసో...
                                        (HAPPY FATHER'S DAY to all)

2 comments:

మీ అభిప్రాయం తెలియజెయ్యండి