కూరగాయలు కోస్తున్నది జుబెదా. కండ్ల ఎంట అతని యాద్‌లు (జ్ఞాపకాలు) పటపట రాలుతున్నయ్! అతను యాదికొచ్చినప్పుడల్లా కండ్ల నిండ నీల్లు నిండడం.. ఇంకిపోవడం మామూలె. కని ఇయాల కన్నీల్లు ఆగుతలెవ్. ఎవరినన్న పట్టుకొని బోరున ఏడ్వాలని ఉన్నది. కని ఎవరికి చెప్పుకోగలదు- తను మది నిండ ప్రేమించిన మునీర్‌ని వొదులుకొని జీవచ్ఛవంలా బతుకుతున్నదని.. అతని యాదుల్లోనే ప్రతి రోజు తెల్లారుతుందని.. ప్రతి దినం అతని ముచ్చట్లె గుర్తొచ్చి రాత్రవుతుందని.. జీవితాన్ని ఒకరి ప్రేమ ఇంత గనం ప్రభావితం చేస్తుందా? ఐదేండ్ల యాదులే జిందగీ అంతా ఇంత గనం ఎంటాడతయా? ఈ ప్రశ్నలు ఎప్పటికీ జవాబ్‌లు దొరకని సవాల్‌లే తనకు...ఆడుకుంటానికి పొయ్‌న పిల్లలు ఇంట్లకొస్తున్న సప్పుడయ్యేసరికి కండ్లు తుడుసుకుంది జుబెదా.
పిల్లలొచ్చి అదొ ఇదొ మాట్లాడిస్తున్నరు. పరద్యానంగ జవాబ్‌లిస్తున్నది జుబెదా. మనసు నిండా మునీర్ రూపమె. అతని హాయైన నవ్వు. అతని గుండెల మీద సేద తీరిన చల్లదనం.. గంటలు.. రోజులు.. యేండ్లు మాట్లాడినా తీరని ముచ్చట్లు... ఒక జన్మకు సరిపోంగ ఎక్కువై పొంగుతున్న యాద్‌లు...
ఎందుకు వదులుకుంది మునీర్‌ని.. తన ప్రాణం కన్న ఎక్కువగ ప్రేమించిన మునీర్‌ని.. అతను లేకుంటె బతుకే లేదనుకున్న తనేనా అతన్ని వొదులుకొని కొన్నేండ్ల తర్వాత మరొకర్ని చేసుకొని ఇద్దరు పిల్లల్ని కని ఇలా బతికేసుకుంట- మాటిమాటికి అతని యాదుల్లోకి ఒరుగుతూ లేస్తూ.. యాంత్రికంగా ఇలా బతికేస్తూ... తమ కలయిక ఎంత అద్భుతంగా ఉండేది. ఎంత తన్మయం పొందేది తను. ఎంతగా మళ్లీ మళ్లీ కావాలనిపించేది. ఆ విషయంలోనూ తాము ఒకరి కోసం ఒకరం పుట్టామేమో అనిపించేది. కాని ఇప్పుడు- దేహాన్ని అలా మొద్దులా వొదిలేసి- ఏ స్పందనలూ పొందకుండా, బైటికి ప్రకటించకుండా, తన దేహం పొందాల్సినది పొందిందా లేదా పట్టించుకోకుండానే పక్కకు వొరిగిపోవడం- అట్లట్లనే పిల్లలిద్దరు పుట్టేస్తిరి. ఇక వాళ్ల కోసమే బతికేస్తుందా? అంతే కదా!
15 ఏళ్ల తర్వాత ఇవాళ అనుకోకుంట మునీర్ ఫోన్! ఆ గొంతు వినేసరికి గుండె కొన్ని క్షణాలు ఆగిపొయ్యింది. గొంతు అస్సలు పెగల్లేదు.. ఫోన్ ఎత్తంగనె హలో అన్నది కాబట్టి అతను "హలో.. నేను మునీర్‌ని. బాగున్నవా జుబెదా?'' అన్నడు. తనకు మాట రాలె.
తను "జుబెదా! జుబెదా!'' అని మల్ల మల్ల్ల పిలుస్తున్నడు, "మాట్లాడు జుబెదా! నా మీద కోపమా!'' అంటున్నడు.
కష్టంగ కొంచెం దగ్గింది.
"ఏమన్న ప్రాబ్లమా?! మళ్లీ మాట్లాడనా?'' అన్నడు.
ఎక్కడ పెట్టేస్తడోనని గాభర పడిపోయి 'లేదు లేదు.. మాట్లాడు' అనగలిగింది. గొంతు పూడుకుపొయ్యి దుఖ్కం పొంగుకొస్తున్నది. అతను మాట్లాడుతున్నడు. ఆ గొంతు వింటుంటే గుండె నరాల నెవరో ఒక్కొక్కదాన్నె తెంపేస్తున్న బాధ. వింటోంది. వింటోంది. ఇంకా వినాలనిపిస్తోంది ఆ గొంతు.. ఎక్కడో పోగొట్టుకున్న తన మరో గొంతుక అది..!
"నువ్వేం మాట్లాడవేంది జుబెదా!? ఏమన్న మాట్లాడు..'' అంటున్నడు.
గొంతు పెగలడం లేదు. ఏడుపొచ్చేస్తున్నది అందామనుకుంది. కని తనకే ఎందుకింతగ ఏడుపొస్తున్నది.. అతనెందుకు దుఖ్కపడకుంటనె మాట్లాడేస్తున్నడు? అనే బింకం పొడుచుకొచ్చింది.
"చెప్పు మునీర్! వింటున్న... ఇన్నాళ్లకు గుర్తొచ్చిన్నా??'' అన్నది కొంచెం కూడదీసుకొని. అప్పటికీ చివరి మాటల్లోంచి దుఖ్కం తొంగి చూసింది.
"ఎక్కడ! నువ్వే నాకు అందకుంట, నేను మాట్లాడ్తానికి ఏ ఆధారం ఇవ్వకుంట గడుపుతున్నవు కదా- మళ్లీ నన్నంటున్నవా?'' అతని నిలతీత.
తను ఎప్పటికప్పుడు ఏదో ఒక రకంగ అతని గురించి తెలుసుకుంటనె ఉంది.
షాదీ చేసుకుని ఎల్లిపొయ్‌నంక తన గురించి తెలుసుకుంటానికి అతనె ఏ ప్రయత్నం చేసినట్లు కనిపించలె..
"జుబెదా! మాట్లాడవేంది? ఎట్ల ఉన్నవు?'' అడుగుతున్నడు.
"నేను బాగనె ఉన్నా..'' జుబెదా గొంతు వణికింది. "నా నెంబర్ ఎవరిచ్చిన్రు?!'' అన్నది మెల్లగ.
"సునంద ఇచ్చింది. నిన్న బస్టాండ్‌ల కలిసింది. నీ గురించి అడిగితె నువ్వు ఇక్కడె ఉంటున్నవన్నది. నెంబర్ ఇమ్మంటె కొంచెం ఎనకాముందాడింది. 'వాళ్లాయన ఆఫీస్ టైమింగ్స్‌లో చెయ్యండి. జాగ్రత్త!' అన్నది. అందుకె నిన్నట్నుంచి ఉగ్గబట్టుకొని ఇయాల చేస్తున్న. అవునూ.. జాబ్ ఎందుకు వొదిలేసినవ్ జుబెదా?'' అన్నడు మునీర్. "ఆయన కిష్టం లేదు''
"అదేంటి? ఇష్టం లేదని ఒదిలేస్తవా? సమ్జాయించకపొయ్‌నవా?''
"కొందరు వినరు..! సరెగని.. ఎక్కడ ఉంటున్నవ్?''
"హైద్రాబాద్‌ల...''
"నల్గొండకు వస్తలేవా?''
"చాలా రోజులాయె రాక.. అమ్మీ అబ్బాలను అక్కడికె తీస్కెళ్లిన.. తమ్ముడొక్కడె ఇక్కడ ఉంటడు. నిన్న ఒక సర్టిఫికెట్ కోసం వచ్చిన. రేపు ఈవినింగ్‌కి ఎల్లిపోవాలె. రేపు నిన్ను కలవాలని ఉంది జుబెదా.. నిన్ను చూడాలి. మీ ఆయన ఆఫీసుకు ఎల్లినంక బైటికి వస్తవా? ఒక్కసారి నిన్ను కలవాలని ఉంది...''
"చూద్దాం...''
"ప్లీజ్ జుబెదా..!''
"చూద్దామన్న కదా...''
"ఒక్కసారి నిన్ను చూడాలి జుబెదా ప్లీజ్''
"ఓ.కె... కలుద్దాం''
"షుక్రియా జుబెదా..!''
"................''
"నేను ఎక్కడ వెయిట్ చెయ్యను? ఆఁ..! రాజీవ్ పార్క్! అది బెటర్.. 11.30కి అక్కడికొచ్చేస్తా. ఓ.కే.నా..?''
"సరె...''
"ఉంట మరి''
"సరె...''
ఫోన్ డిస్కనెక్ట్ అయింది. ఫోన్ అట్లనె పట్టుకొని బోరున ఏడ్చింది జుబెదా.. 'ఎంత ఈజీగా మాట్లాడేస్తున్నడు.. ఇన్నాళ్లకు మాట్లాడుకుంట గుడ.. తనెందుకు అట్లా మాట్లాడలేకపొయ్యింది? మగాళ్లే అంతనా?! ఆడాళ్లే జల్ది మర్చిపోతరంటరు.. తనెందుకు అస్సలు మర్చిపోలేకపొయ్యింది? ఆడోళ్లు బైటికి చెప్పుకోరు.. మగోళ్లు చెప్పుకుంటరు.. అంతే తేడా! ఏదేమైనా.. తను మాత్రం తన బతుకును ఇట్ల గోస పెట్టుకుంది.. అతన్ని మర్చిపోలేకపొయింది.. మర్చిపోలేదు గూడా.. ఆడవాల్లు తమను అర్పించుకున్న వారితోనే జీవితం పంచుకోవాలను కుంటరేమో.. మగవాళ్లు మాత్రం అన్నీ పొందాక మరొక అమ్మాయి కోసం తయారైపోతరు.. మునీర్ కూడా అట్లనే చేసిండా?! ఏమో..'
సరె, రేపు కలవాలె.. ఇన్నేండ్ల తర్వాత మునీర్‌ని చూడబోతున్నది. తన మునీర్.. ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా తను తనవాడే!
అతన్ని కలవాలె. అతని ఒళ్లో పండుకొని తనివితీరా ఏడ్వాలె.. ఎందుకు తన కోసం ఆగకుండా పెండ్లి చేసుకొని ఎల్లిపొయిండో నిలదియ్యాలె. అదే తనయితే చేసుకోకుంట ఉండకపొయ్యేదా?
నిజానికి అదొక చిత్రమైన సమస్య. అతనేమో- తన తమ్ముడు పెళ్లికి తొందరపడుతున్నడు కాబట్టి పెండ్లి చేసుకోవలసిన పరిస్తితి. తనేమో ఏడాది క్రితమే నాయన చనిపోయి, ఒక చెల్లె, తమ్ముడు చదువుకుంటున్నరు కాబట్టి అంత జల్ది చేసుకోలేని పరిస్తితి.
అడిగిండు- "ఇంట్ల వొత్తిడి ఎక్కువైంది జుబెదా! మనం షాదీ చేసుకుందాం'' అని.
"చెల్లెకు తమ్మునికి నేనే ఆదారం. నేనిప్పుడే చేసుకోలేను కదా మునీర్!'' అని తను.
"మరెట్ల?'' అన్నడు.
"ఏముంది, మీ తమ్ముణ్ణి చేసుకోనీ. మనం తర్వాత చేసుకుందాం'' అన్నది తను.
"మా ఇంట్ల అట్ల ఒప్పుకోరు'' అన్నడు.
"నీ యిష్టం'' అన్నది తను బింకంగ.
కోపంగ ఎల్లిపొయిండు.
ఎక్కడికి పోతడులే.. అనుకుంది.
రెండో రోజు మల్ల కలిసి చెప్పిండు- "ఇంట్ల పెద్ద గొడవైంది జుబెదా. ఆగడం కుదరదు'' అన్నడు. "మా అమ్మీ, అబ్బా చాలా సెన్సిటివ్. వాళ్లను ఇంతకన్నా ఎక్కువ బాధ పెట్టలేను'' అన్నడు.
"నేను మాత్రం మా అమ్మీని బాధ పెట్టాలంటవా?'' అన్నది తను.
మళ్లా కోపంగ ఎల్లిపొయిండు.
మూడో రోజు తెగేసి చెప్పిండు- "ఆగడం నాతోని కాదు. నువ్వు కాదంటే మనం ఇక ఇంతే'' అన్నడు.
తన కళ్లల్ల నీళ్లు చిమ్మినయ్. దగ్గరికొచ్చి ఓదార్చబొయిండు. ఇసిరి కొట్టింది. కోపంతో ఎల్లిపొయిండు.
అంతే.. ఇక కలవలేదు..!
ఐదేళ్లు మునీర్‌ని పోగొట్టుకున్న మనాదిల్నే కాలం గడిపేసింది. బక్కగై పొయింది. కాని చెల్లెను, తమ్మున్ని మాత్రం ఒక ఆదరువుకు తెచ్చింది. చెల్లె జాబ్‌ల చేరింది. ఆ వెంటనె అనుకోకుంట తనకో సంబంధం కుదిరింది. మౌనంగ చేసేసు కుంది. తన తర్వాత చెల్లె పెండ్లి గూడ కావాల్సి ఉందన్నదొక్కటె కారణం..!
"పప్పా ఆగయ్ మమ్మీ!'' అని పిలగాడు అరిచేసరికి దుఖ్కపు ధార తెగింది జుబెదాకు.
***
రెండో రోజు 11 గంటలకె రాజీవ్ పార్క్ చేరుకుండు మునీర్. జుబెదాను చూడాలన్న ఆత్రం అతన్ని నిలవనీయడం లేదు. రాత్రంత నిద్రెక్కడిది! పార్క్‌లకు పొయ్యి ఒక పక్కగ కొద్దిసేపు నిలబడ్డడు. మనసంత జుబెదా రూపమె..
నిజంగ- ఎంత గనం ప్రేమిం చిండు జుబెదాను. తనను అట్లా వొదిలేయాల్సి లేకుండె. తప్పు చేసిండు తను.. అంత ఈజీగా ఎట్లా వొదులుకోగలిగిండు అసలు? బహుశా అప్పటికె తనను ఐదేళ్లుగా అన్ని రకాలుగ పొంది ఉండడం కారణమా? కావొచ్చేమో..! షాదీ పేరుతో మరొక అమ్మాయిని పొందవచ్చన్న మగ స్వార్థమా?? అది చూచాయగ అర్థమైపోలేదా తనకు? సమజయ్యే నటించిండా?? ఆ సమయంలో వెంటనె జుబెదా పెండ్లి చేసుకోలేదని తెలిసి ఉండి.. అమ్మీ అబ్బాల వంక తోడు తెచ్చుకొని, కోపం నటించి వేరే పెండ్లి చేసేసుకున్నట్లె గదా! అదే నిజం గదా..! ఎంత స్వార్థం తనది. ఎంతగ ఇష్టపడేది జుబెదా తనను. అంత ఇష్టాన్ని ఎలా వొదులుకున్నడు తను? ఛత్... అయినా వొదులుకున్న ఖుషీ ఎన్నాళ్లుండింది లే..! కొన్నాళ్లకే ప్రతి మలుపులో జుబెదా గుర్తుకు రాబట్టింది.. మనసును మెలిపెట్టి చంపెయ్యబట్టింది... కానీ.. జుబెదాను కలవ డానికి మొహం చెల్లలేదు.. అబిమానం ఏదో అడ్డు పడ్డది. అన్ని విషయాల్లోనూ తామిద్దరికి భలే కలిసేది. ఒకే ఇష్టంగ ఉండేది. అవన్నీ వొదులుకున్నడు తను. అన్యాయం చేసిండు జుబెదాకు. తేరుకునేసరికి అంతా ఐపొయింది! అస్సలు ఎవ్వరి మాట వినని భార్యతోని, ఇద్దరు పిల్లలతోని జీవితం బండబారిపొయ్యింది. ఒక సుఖం లేదు.. ఒక సంతృప్తి లేదు!
పార్క్ లోపల ఒక చెట్టు నీడ చూసుకొని గడ్డిలో కూలబడ్డడు మునీర్.
టైం 12 గంటలు కావొస్తుంది.
తనంటే చచ్చేంత ఇష్టం జుబెదాకి. తనలెక్కనె ఎంత ఆత్రపడు తుంటదో తనను చూడాలని..
పొద్దున్నె లేషి గడ్డం చేసుకొని మీసాలల్ల తెల్ల ఎంటుకలు కట్ చేసుకొని పౌడరు ఏసుకొని మంచి జత టక్ చేసుకొని వచ్చిండు తను. తన అందం ఏమంత తగ్గలేదనిపించింది.. జుబెదా ఎట్లా తయారవుతుందో చూడాలె.. తను మొదటి నుంచి కూడ సింపుల్ అండ్ స్మార్ట్.. ఇప్పుడు ఇద్దరు పిల్లలు కదా.. ఎట్ల తయారైందో చూడాలె..
ఒకటె ఆత్రంగ ఉంది మునీర్‌కు. మల్ల మల్ల టైం చూసు కుంటుండు..
ఇప్పట్నుంచి నెలకొక్కసారన్న నల్గొండ వొచ్చి జుబెదాను చూసి ఎల్లాలె. జుబెదా మీది ప్రేమ ఏమాత్రం తగ్గలేదు తనకు. తనకు కూడ అంతే ఉంటుంది. తన కన్నా ఎక్కువే ఉంటుంది. నిన్న ఫోన్‌లో మాట్లాడుతుంటె రెండుసార్లు తన గొంతు పూడుకుపొయ్యింది. ఇప్పట్నుంచైనా తనను కలుస్తు ఉండాలె. అయ్యిందేదో అయ్యింది... మల్ల టైం చూసుకుండు మునీర్- 12.30.
ఫోన్ చేస్తే..!
వస్తుందిలే.. ఏదో కొంచెం లేట్ అయి ఉంటుంది. డిస్టర్బ్ చేస్తే బాగుండదు. అయినా తనైనా ఫోన్ చెయ్యొచ్చు కదా...
ఈ పార్క్‌కి ఎన్నోసార్లు వచ్చినం అప్పుడు. ఎక్కువగ తన రూంకె తీసుకెళ్లేటోడు జుబెదాను. జుబెదా రాంగనె రూంమేట్ మోహన్ బైటికెళ్లిపొయ్యేటోడు. దాంతో తను ఊరుకోలేక జుబెదాను అల్లుకుపొయ్యేటోడు. మొదట్లో ఎంత గనమో వారించేది. కాని తను వినేటోడు కాదు. తర్వాత్తర్వాత వారించడం మానేసింది. అలా ఐదేళ్లల్ల ఎన్నిసార్లు కలిసినమో లెక్కేలేదు. ఓహ్.. తనతో అనుభవం అద్భుతం. అంతటి అద్భుతాన్ని చేజేతులా వొదులుకున్నడు తను. ఛత్! తర్వాత తనను తనే ఎన్నిసార్లో నిందించుకున్నడు. క్యా ఫాయిదా? పెసర చేలో పోగొట్టుకొని కూరటికెలో ఎతుక్కుంటె ఏం లాభం!
మళ్లా టైం చూసుకుండు మునీర్. ఒంటి గంట!
ఇక ఉండలేకపొయ్యిండు.
ఫోన్ తీసి కలిపిండు. రింగవు తోంది. ఒకటి.. రెండు.. మూడు రింగ్స్. ఎత్తింది జుబెదా.
"హలో'' అన్నది.
"హలో జుబెదా! ఎక్కడిదాంక వొచ్చినవ్? ఇంత లేటేంది?'' అన్నడు మునీర్.
"లేదు మునీర్! నేను... నేను - వస్త లేను..'' అన్నది జుబెదా!
షాకయ్యిండు మునీర్-
"ఏం.. ఎందుకని?!?''
"...చెప్తాను...''
"వస్తలేనని 11 గంటలకే చెప్పొచ్చు గదా?'' అన్నడు కొద్దిగ చికాగ్గా.
"నిన్నంతా కలుద్దామనే అను కున్న. రాత్రంత ఒకటే ఆలోచన. తెల్లారగట్ల ఒక నిర్ణయం తీసుకున్నంక గని మనసు నెమ్మదించలేదు.. ఆ సంఘర్షణలోంచే రావొద్దని నిర్ణయించు కున్న మునీర్.''
"ఏఁ... ఎందుకు?''
"ఎందుకంటె... అదంతె!''
"చెప్పు జుబెదా! ఎందుకు నన్ను కలవొద్దనుకున్నవ్?''
"ఏం లేదు మునీర్! నేను నిన్ను అమితంగా ప్రేమించిన. అనుదినం నీ యాదుల్లోనే గడుపుతున్న. లెక్కలేనన్నిసార్లు ఏడ్చుకున్న. ఇంత దుఖ్కంలో గూడ- 15 ఏళ్ల క్రితం మన ప్రేమ రోజుల్ని అట్లనె నా జ్ఞాపకాల్లో ఆస్వాదిస్తున్న. ఊహల్లోనైనా అప్పటి హుషారు కొనసాగనీ.. ఇప్పుడు నిన్ను కలిసి వాటినన్నింటినీ... ఆ అద్భుతమైన జ్ఞాపకాల సంపదను పోగొట్టుకోలేను.. ఒకప్పటి నా మునీర్‌ని అలాగే నా జ్ఞాపకాల్లో పొదువుకొని ఉండనీ నన్ను! నిన్నిప్పుడు కలిసి- నా మునీర్ కాని నిన్నిప్పుడు కలిసి- నాకే సొంతమైన మునీర్‌ని చెరిపేసుకోలేను..! పైగా నీ నోటినుంచి గనక 'తెలిసే నిన్ను వదిలేసుకున్న' ననే మాట వస్తే, విని తట్టుకోలేను.. సారీ మునీర్..! ఉంటాను.. బై..'' గొంతు పూడుకుపోతుండంగ ఫోన్ కట్ చేసింది జుబెదా!
ఫోన్ అట్లనె చెవి దగ్గరే ఉండిపొయ్యింది మునీర్‌కు. తానేం విన్నడో కాసేపటిదాకా సమజ్ కాలె. మెల్లగ సమజవుతున్నకొద్దీ కళ్లల్ల నుంచి నీల్లు ఉబికి రావడం మొదలయ్యింది..
ఎంతో సేపటికి తేరుకున్నడు.. అప్పుడు అనిపించింది-
తనకు ఈ శాస్తి జరగాల్సిందే!