Saturday 12 May, 2012

మా తుజే సలామ్!



ఈమె మా అమ్మ!
మేము ఐదుగురం పిల్లలం తనకు.
ఆ మొఖం లోని జీవం అంతా
మెరుపు.. ఆనందం అంతా 
మాకు ధారా పోసి పోసీ 
అలా మిగిలిపోయింది..
ఇప్పటికీ మా పరేషాన్ లే ఆమెకు
ఇప్పటికీ ఒక్కో బిడ్డ కష్టాలను తలచుకుంటూ
నిద్ర పట్టని రాత్రులను గడుపుతుంటుంది..
ఏం చేయగలిగాను నేను,
ఆమె సంతోషానికి ?
ప్చ్.. ఏమీ లేదు...!
కొన్ని కవితా పాదాలు మాత్రం మిగుల్చుకున్నా
కొన్ని కవితల్లో...
''తల్లి పాదాల వద్ద స్వర్గం ఉందంటారు'
మా అమ్మీ పాదాలకై వంగిన ప్రతీసారీ
చెమరిన నా చూపు
ఆమె పాదాల పగుళ్ళలో చిక్కి
గిల గిల లాడుతుంది''
      ౨
ఉర్సు లో రోల్డుగోల్డు హారం కొన్నది అమ్మీ
అబ్బా మొఖం చిన్నబోయింది 
      ౩
అమ్మీ చిరుగుల దుపట్టా
రాత్రి ఆకాశం 
     ౪
పొద్దున్నే అద్దంలో మొఖం చుసుకోవాలనేది అమ్మీ
ఇప్పుడు ఏ ముక్కలో చూసుకోను?
      ౫
కన్నీటి దారాల్తో జీవన వస్త్రానికి మాసికలేస్తూ
తరాల చీకటి కమ్మేసిన గోషా లో 
పాలిపోయిన చంద్రశిలా దేహంతో
అనుక్షణం
'బిస్మిల్లా ఇర్రహ్మాన్ నిర్రహీమ్' అనే కదులుతుంది అమ్మీజాన్

మొహంపై వేలాడుతున్న నైరాశ్యాన్ని
'వజూ' నీళ్ళతో పుక్కిలించి
తలనిండా చిరుగుల 'దుపట్టా' కప్పుకొని
నమాజ్ చదువుతున్నపుడు...

మెరుపు వెలిసిన అమ్మీ దోసిలిలో
రాలిన కన్నీటి తడిపై
ఏ దేవుడూ సాక్షాత్కరించడు
ఒక అపనమ్మకాల బొమికల గూడు ప్రతిబింబిస్తుంది

అస్తమయం వైపుకు మోకరిల్లి ప్రార్ధిస్తూ
మా జిందగీల్లో సుర్యోదయమౌతున్దనుకుంటుంది అమ్మీ

మాకోసం 'దువా' చేసి చేసి
అమ్మీ గొంతు తడారిపోతుందే తప్ప...
ముందు కూర్చున్న నీడ విస్తరించి
కటిక రాత్రై పరచుకుంటుందే తప్ప...
....... ......... ......... ......... .......!

3 comments:

  1. చాలా బావున్నాయి మీ కవితలు...మీ జీవన వైవిధ్యం తెలిసేలా వుంది.."మెరుపు వెలిసిన అమ్మీ దోసిలి" అన్న పదం చాలా బావుంది..

    ReplyDelete
  2. మా ఆప్ కో మేరీ ప్రణాం!
    చాలా బాగారాసారు!!

    ReplyDelete
  3. shukriyaa Voleti garu, Padmarpita garu

    ReplyDelete

మీ అభిప్రాయం తెలియజెయ్యండి