Tuesday, 6 September 2011

దుఃఖనామా



పిడికిలెత్తీ పిడికిలెత్తీ నరాలు చిట్లిపోతున్నాయ్‌
నినదించీ నినదించీ గొంతులో రక్తస్రావమౌతున్నది
నా నెత్తురు చరిత్ర పేజీల నిండా అలుక్కు పోతున్నది
నా నుంచి మరో నాకు ఉద్యమం రాజుకుంటున్నది
నాన్చివేతలు కూల్చివేతలుగా పరావర్తనమవుతున్నా
ఎవడి బున్యాదులూ కదుల్తలెవ్‌..
నా ఎడతెగని దుఃఖం ఎవడి మనసుల్నీ చెమర్చడం లేదు

ఎక్కడా రక్తం మరకలు కానరావ్‌..
రక్తపాతం జరిగినట్లు దాఖలాలుండవ్‌
కత్తులు కనిపించవ్‌.. పిస్తోళ్లు మోగవ్‌.. బాంబులు పేలవ్‌
కాని.. కనిపించి వందలు
కనిపించక వేలు.. లక్షల నా హత్యలు..
నా పంచనామా నేనే చేసుకుంటున్నాను

ఈ బేచైనీ రక్త నాళాలు తెంచుతుంటే
నాలోకి నేనే ఉరితాడుకు వేలాడుతున్నాను
నిరసనగా నన్ను నేను తగలబెట్టుకుంటున్నాను
నా మరణ వాంగ్మూలాన్ని నేనే చదువుకుంటున్నాను
నా పాడెకు నేనే భుజం మార్చుకుంటున్నాను
నా శవ యాత్రలో నేనే ఉద్యమ పాటలై పొర్లుతున్నాను

ఒక చితి మంట ఆరకముందే
మరో చితిని అంటించుకుంటున్నాను
ఆ మంట వాడి బండ గుండెలో చిన్న పువ్వై పూస్తుందేమోనన్న
నా ఆశ వాడిపోతున్నది..

కాలుతున్న నా ఒంటి పొగ జీవవాయువై
గుక్క మలగని బయాన్‌ చేసుకుంటున్నాను
నా బూడిదను నా రక్తనదిలోకి రాల్చుకుంటున్నాను
నా అస్థికలను నా దుఃఖనదిలోనే కలుపుకుంటున్నాను

నా భూమిలో నన్ను నేను నిక్షిప్తం చేసుకుంటున్నాను
మట్టిలోకి ఇంకుతూ
ఈ నేల నాడీమండలమంతా వ్యాపిస్తున్నాను.....