ఉరుకురికి ఇమ్లిబన్ బస్‌స్టాండ్ చేరుకుని, నల్గొండకు టికెట్ తీస్కొని బస్కెక్కి కూసున్న. బస్సుతోపాటు నా ఆలోచనలు గుడ కదిల్నయ్. ఇప్పట్కె లేటైంది. మా చెల్లెండ్లు గయ్యిమంటరు. మమ్ముల 8 గంటలకె గుట్ట కాడ ఉండాలని గట్టిగ చెప్పి, నువ్వేమో ఇప్పుడా వచ్చేది అని కస్సుమంటరు.?
నల్గొండ పోతున్నమన్నా, నల్గొండ మదిల మెదిలినా ముందుగాల ఆ రెండు గుట్టలె యాది కొస్తయ్. టౌనంత ఆ గుట్టల ముందల, మద్యల్నె ఉండటం గమ్మత్తు. అందుల ఒక గుట్ట - లతీఫ్ షా వలి పహాడ్ - లతీఫ్ సాబు గుట్ట. ఆ గుట్ట మీద లతీఫ్ షా వలి దర్గా ఉండబట్టి ఆ పేరొచ్చింది. ఎత్తైన గుట్ట. ప్రతి ఏడాది అక్కడ ఉర్సు సాగుతది. గుట్ట ముందంతా తిరునాల.. జాతర.. సందడే సందడి. పిల్లలకు పండగ. పెద్దలకు ఉర్సుకు రావడం.. గుట్ట ఎక్కడం ఒక రివాజు.. ఒక రిలీఫ్.
ఉర్సు అనంగనె అందమైన రుక్సానా యాదికొస్తది. కండ్లల్ల ఆ రూపం నిండి కన్నీళ్లతో పాటు ఒలికిపోతది. ఏదో తప్పు చేసిన ఫీలింగ్ చంపేస్తది. బస్సు దిల్‌సుఖ్‌నగర్ బస్టాండ్‌ల ఆగి మల్ల కదిలింది.
చిన్నప్పుడు ఉర్సు కోసం ఎంత ఎదురుచూసేదో.. ఉర్సు వస్తుందంటె మనసు ఉరకలేసేది. రెండు మూడు రోజుల ముందే పొద్దుటి పూట మా ఊర్లెకు గుట్ట మీద సున్నం వేసిన మెట్లు మబ్బుల్లకు దారేసినట్లు కనిపించేవి. రాత్రి పూట మెట్లెంట వేసిన లైట్లు పూల జడ మాదిరి కన్పించేవి. ఎప్పుడెప్పుడు శుక్రారం వస్తదా.. జనంల పడి రంగుల నవ్వుల్ల పడి గుట్ట మీదికి పతంగి లెక్క ఎగరాల్నా అని మనసు ఉరకలేసేది. బేస్తవారం నాడు పొద్దుగూకేసరికి అందరం తయారై గుట్టకాడికి చేరుకునేది. అయాల సందల్. లతీఫు సాబుకు సందల్ (గంధం), చాదర్ (పూల దుప్పటి) వగైరా ఎక్కిస్తరు. గుట్ట ముందంత జనం కిటకిటలాడేది. పెద్దోల్లల్ల ఆడోళ్లంతా గుట్ట దామన్‌ల (దాపున) కూసునేది.
మగోళ్లు పిల్లలకు తిర్నాలల ఏమన్న కొనిస్తానికి పొయ్యేది. కొద్దిగ పెద్దగున్న పిల్లలు సావాసగాళ్లతోని తిర్నాల గల్లీలన్నీ తిరుగుతుండేది. ఎన్నిరకాల బొమ్మలో.. ఎన్నెన్ని మెరుపులో! బొమ్మల్ని దాటి కొద్దిగ వయసు పెరిగితె.. కళ్లద్దాలు.. బెల్టులు.. టోపీలు.. తీరు తీర్ల సోకులబడే సామాను. ఆడపిల్లలకైతె ఎక్కడ్లేని వింతలు. చిన్నపిల్లల తర్వాత ఆడపిల్లల సామానె ఎక్కువుండేది. వో..! ఝుంకాలు, ముక్కుపుల్లలు.. తీరొక్క గొలుసులు.. ఉంగరాలు.. అరష్ - కాజల్ - సుర్మా డబ్బాలు.. గాజులు.. చెప్పులు.. బర్ఖాలు.. బట్టలు..! అసలు అదొక రంగుల లోకం.. ఆ రంగుల్లో తీరొక్క బుగ్గలమై తేలిపొయ్యేది.
జామ్ మజీద్ నుంచి సందల్ ఊరేగింపుగా వచ్చేది. ఆ సమయం దగ్గర పడుతుంటె గుట్ట ముందంతా జనం కిటకిటలాడిపొయ్యేది. గుట్ట మీదికి పొయ్యే దారికి అటూ ఇటూ తాళ్లు పట్టుకుని పోలీసోళ్లు నిలబడ్డా దారి మీదికి తోసుకొస్తుండేది. ముందంత మగవాళ్లు ఎక్కువగా తెల్లని బట్టల్లో, ఆ తరువాతి వరుసలంతా ఆడవాళ్లు నల్లని బుర్ఖాలు.. పిల్లలంతా తల్లిదండ్రుల చేతుల్లో.. సందల్ ఊరేగింపు తొలి కమాన్ కాడికొచ్చేసరికి జనం సముద్రపు అలల్లెక్క కదిలేది. తొలిమెట్టు కాన్నుంచి సందల్ ముందుకెళ్లడమే కష్టం గుండేది. ప్రతి ఒక్కరు సందల్ ముట్టుకొని కళ్ల కద్దుకోవాలని ఆరాటం. పిల్లల నుదుటికి అద్దాలని తోపులాట.. ఓఫ్.. ఆ దృశ్యమంతా చూస్తేనె మజా.
బస్సు హయత్‌నగర్ బస్టాండ్‌ల నిలబడ్డది. డ్రైవర్‌కు చెప్పి కొద్దిగ రోడ్డుమీదికి పొయ్యి ఒక చాయ్ తాగిన. మల్ల వచ్చి కూసున్న. బస్సు కదిలింది.
నాకు ఉర్సు అనంగనె నల్లని బుర్ఖాలె మదిల మెదుల్తయ్. బహుశా వయసొచ్చిన తొలినాళ్లలో ఆ బుర్ఖాల వెంటపడ్డందుకె కాబోలు. డిగ్రీ రెండో సంవత్సరంల వచ్చిన ఉర్సులనె ఎదురుపడ్డవి ఆ కళ్లు. చంద్రగోళాల్లాంటి ఆ కళ్లు. చుట్టూ నల్లటి మబ్బుల మధ్య అందమైన కళ్లు. తెల్లని ఒంటి రంగు నడుమ, నల్లని కాటుక మధ్య, తెల్లని కళ్లు. మధ్యలో నల్లని కనుపాపలు. నన్నెంత ఆకర్షించాయో.. వాటి వెంట నేను పడ్డనో అవి నా వెంట పడ్డ్డాయో తెలియదు. కాని ఒకరికి తెలియకుంట ఒకరం మళ్ల మళ్ల ఎదురుపడ్డం. పడ్డప్పుడల్లా పరిచయస్తుల్లెక్కనె ప్రేమగ చూసుకున్నయ్ మా రెండు జతల కళ్లు.
ఇగ అది మొదలు - ఆ ఉర్సు సాగిన వారం పది రోజులు.. రోజు టంచనుగ గుట్ట కాడికెళ్లడం,సైకిల్ పక్కన పెట్టి ఆ తిరునాల దుక్నాల మద్యన తిరుగడం. కొనేదేమీ లేకున్నా ఏదో కొనేటోడి లెక్కనె వెతుకుతూ తిరిగేది. కొనే వస్తువు కోసం కాదు, ఆ కమ్మని రుచినిచ్చే కళ్ల చూపుల్ని తాగడానికి. ఆ కళ్ల నవ్వుల్లో తేలిపోవడానికి. చివర్లో షాపులొక్కొక్కటి ఎత్తేస్తుంటే ఆ రోజు కష్టపడి అడగనే అడిగిన - "ఏం పేరు?'' అని. "రుక్సానా'' అని చెప్పింది. ఏం చదువుతున్నవంటె ఇంటర్ సెకండియర్ అని చెప్పింది. నా పేరు 'యూసుఫ్' అని చెప్పిన. పక్కన సహేలీలు జోకులేస్తు కిల్లున నవ్వు తున్నరు. ఏ కాలేజి, మిగతా వివరాలడిగిన. ఆఖరికి 'కొద్దిగ ఆ నఖాబ్ తొలగించరాదూ.. మొఖమన్న చూస్త' అని బతిలాడిన. 'కల్ మిలేంగే' అని వెళ్లిపోయింది.
నా గుండెలే అంత ఊటగ కొట్టుకుంటున్నయంటె ఆ పిల్ల గుండెలు మరెంత కొట్టుకున్నయో అనుకొన్న. అయాల రాత్రి నిద్దర పట్టలె. ఎప్పుడు తెల్లార్తదా.. ఎప్పుడు పొద్దు గూకుతదా.. అని ఒకటె ఆరాటం.
అయాల నా బలవంతం మీద ఒక సహేలీని బతిలాడుకొని దుకాణాలను దాటి కొద్దిగ గుట్ట పైకి మెట్ల పక్కకు.. వచ్చి బండరాళ్ల సాటున కూసున్నది. వాళ్ల వెనక నడుచుకుంట వెళ్లి పక్కన కూసున్న.
"ఇప్పుడన్నా నఖాబ్ తీయరాదూ!'' అన్న.
ముడి విప్పి నఖాబ్ తొలగించింది రుక్సాన. పండువెన్నెల జాబిల్లి లెక్క మెరిసింది ఆ మోము. 'వాహ్!' అనుకోకుండ ఉండలేకపోయ్‌న. "కైసీ హూఁ?'' అన్నది నవ్వుకుంట.
"ఆకాశంలో చాంద్ మాయమై ఇక్కడ తేలినట్లుంది'' అన్న. నవ్వు వెన్నెల మళ్లీ కురిసింది. అట్లా అర్ధగంటసేపు గుండెల లయల వేగాల్ని, సప్పుడుల్ని కొలుచుకుంట మాట్లాడుకున్నం.
అది మొదలు.. రోజు ఎక్కడో ఒక తాన కలుసుకునేది. తను కనబడని రోజు నాకు గాని, తనకు గాని మనశ్శాంతి ఉండకపొయ్యేది. ఇంటర్ తర్వాత తనను చదువు మాన్పించేస్తారట అని ఒకసారి కలిసినపుడు వెక్కివెక్కి ఏడ్చింది రుక్సానా. ఏం చెయ్యాల్నొ తోచలేదు. ధైర్యం చెప్పడానికి నా కాడ ఏ తొవ్వా కనిపించలె. నాకు ముగ్గురు చెల్లెళ్లు. ఒక చెల్లె షాదీ అయిపొయ్‌నా ఇంకా ఇద్దరు చెల్లెళ్లు పెండ్లి కున్నరు. చదువు మధ్యల ఉంది. ఏం చెయ్యగలను? "నన్ను పెండ్లి చేసుకోవా?'' నోరు తెరిచి అడిగింది రుక్సానా. గుండెలు పిండేసినట్లు బాదపడ్డ. ఎట్ల చేసుకోను? ఏం చేస్తున్ననని చేసుకోను. ఇంటి పరిస్థితేం బాగలేదు. తను అప్పుడు పెళ్లి చేసుకుంటె ఇల్లు ఆగమైపోతది. ఎట్ల ... ఎట్ల..
"ఎట్లన్న చేసి రెండు మూడేళ్లు ఆపలేవా మీ ఇంటోళ్లను?'' అన్న.
"లేదు. ఈ ఎండాకాలమె పెండ్లి చేసేస్తరంట. మా ఫుప్పమ్మ (అత్తమ్మ) కొడుకు తొందరపెడుతుండు'' అన్నది.
"ఏం చేస్తడు మీ ఫుప్పమ్మ కొడుకు?''
"మెకానిక్''
"మెకానికా? మెకానిక్‌కు ఇంటర్ చదివిన పిల్ల ఎందుకంట? మీవాళ్లకన్నా బుద్ది లేదా?''
"మావాళ్ల తాహతు అంతే!''
"మరి ఎందుకు చదివించిన్రు?''
"నేనే చదువుకుంటనని కొట్లాడి కొట్లాడి చదువుకుంట వస్తున్న .''
"మరి ఇప్పుడు కూడ కొట్లాడు, అతన్ని చేసుకోనని.''
"వింటలేరు.''
"మరేం చేస్తవ్?''
"నువ్వే చెప్పాలె.''
"నేనిప్పుడే చేసుకోలేను రుక్సానా! ఇంట్ల ఇద్దరు చెల్లెళ్లున్నరు. ఇంటి పరిస్థితి అంత బాగలేదు..'' అని నచ్చచెప్పబోయిన. "మరెందుకు ప్రేమించినవ్? అంతకుముందే ఎందుకు ఇవన్నీ ఆలోచించలేదు?'' ఉక్రోషంగా అడిగింది రుక్సానా. ఏం చెప్పాల్నో సమజ్ కాలేదు.
అంతే. ఏడ్సుకుంట వెళ్లిపోయింది. ఎంత పిల్చినా ఆగలేదు. వెంట సైకిలేసుకుని పోతనె ఉన్న. తను బుర్ఖా లోపల్నే పెద్దగ ఏడుస్తున్నట్టు తెలుస్తునె ఉంది. నేను బతిలాడుతున్న. వాళ్ల ఇంటి గల్లీ వచ్చేసరికి నా సైకిల్‌కు బ్రేకులు పడినై. తను ముందుకెళ్లిపోయింది. ఇంట్లకు పోతూ ఒక్కసారి వెనక్కి మళ్లి చూసింది. అది ఆఖరి చూపు అవుతుందని నేనస్సలు అనుకోలేదు. కాని అదే ఆఖరి చూపు!
ఇగ ఎన్నిసార్లు ఆ ఇంటి చుట్టూ చక్కర్లు కొట్టిన్నో. ఏనాడూ రుక్సానా కనిపించలేదు. ఆ ఇంటిముందలికి పోంగనె రుక్సానా కోసమే వేయించిన సైకిల్‌బెల్లు 'టింగ్ .. టింగ్'మని మోగించేటోన్ని. ఎన్నిసార్లు మోగించినా రుక్సానా బైటికి రాలేదు. కొన్ని దినాలు పిచ్చోన్నై పోయ్‌నంత పనైంది. అన్నం సయించేది కాదు. నిద్దర పట్టేది కాదు. ఇంటి బైట మంచం ఏసుకొని పండుకుంటే పైన ఆ జాబిలిలో రుక్సానా మొఖమే కన్పించి బోరున ఏడ్చేటోణ్ణి. పట్టక పట్టక నిద్ర పడితె తెల్లార్లూ రుక్సానా కలలే. నా పరధ్యానానికి మా ఇంటోళ్లంతా పరేశానయ్యేది. ఆ ఎండాకాలం చివర్లో రుక్సానా ఇల్లు షాదీ కళతోని కళకళలాడింది. నాకు సమజైపోయి షానా ఏడ్చిన. ఒకరోజు పెళ్లి కూడా అయిపోయింది! ఆ రోజు పిల్లను పోగొట్టుకున్న కాకి తిరిగినట్టు ఆ ఇంటిచుట్టూ తిరిగిన. కాని ఏం లాభం?
***
బస్సు పెద్ద గడియారం సెంటర్ల ఆగంగనె దిగి గుట్ట దిక్కు జల్ది జల్ది నడిచిన. గుట్ట ఉన్న రోడ్డు మొదుగాలనె పెద్ద కమాన్ కట్టిన్రు. దాని మీద పెద్ద పెద్ద అక్షరాలతోటి ఉర్దూల, తెలుగుల, ఇంగ్లీషుల 'లతీఫ్ షా వలీ ఉర్స్' అని ఉంది. కమాన్ దాటి ముందలికి అడుగెయ్యంగనె అటుపక్క ఇటుపక్క నాలుగ్గిల్లల బండ్లు, దుకానాలు మొదలైనయ్. దాటుకుంట గుట్ట ముందుకెళ్లిన. పైకి చూస్తె చిన్నప్పటి సంబరమంత కళ్లముందు కదలాడింది. చెట్లు బాగా పెట్టిన్రు. జనం మస్తుగున్నరు. జల్ది జల్ది కుడి పక్క యాపచెట్ల కిందికి పోయ్‌న. అక్కడ నిలబడి ఉన్నరు మా చెల్లెండ్లు. నన్ను సూడంగనె వాళ్ల మొఖాలు ఎలిగినయ్. అంతల్నె ఇంతసేపా? అన్నట్లు కస్సుమన్నై. వాలేకుమ్ సలామ్‌లు చెప్పుకుంట అందర్నీ తేరిపార జూసుకున్న. పిల్లలు నన్ను అల్లుకుపోయిన్రు. బాగోగులు అడిగి, "చలో చలో'' అన్న. అప్పటికి 8:30 అయింది.
మా ముగ్గురు చెల్లెళ్లు, వాళ్ల పిల్లలు, మా తమ్ముడు - వాని భార్య అందరం కదిలినం. నేను ఊరి ముచ్చట్లు అడుగుతున్న. తమ్ముడు, చెల్లెండ్లు చెప్తున్నరు. అమ్మ గుట్ట ఎక్కలేనని రానన్న విషయం అంతకు ముందే ఫోన్ల చెప్పిన్రు. మా ఆమె జొరమొచ్చి వస్తలేదని నేను గుడ చెప్పి ఉంటి.
అయాల ఉర్సు తొలి రోజు కాబట్టి గుట్ట మెట్లెంట జనం యమున్నరు. పది, పదకొండు గంటలకు ఇంకా పెరుగుతరు. ఎనిమిదిన్నరకే - అప్పుడే ఎక్కి దిగేటోల్లు దిగుతనె ఉన్నరు.
తొలి కమాన్‌కాడి తొలిమెట్టు మొక్కి కదిలినం. అక్కడున్న ఫకీర్ కష్కోల్ ఘల్ మనిపించుకుంట.. మోర్చా కట్టతోని మా తలకాయల మీద దీవిస్తున్నట్టుగ మెల్లగ కొడుతున్నడు. నేను జేబుల్నుంచి చిల్లర తీసి ఫకీర్ చేతిలున్న కష్కోల్‌ల ఏసి కదిలిన. ఫకీర్ అందరి కణతలకు ఊది రాస్తున్నడు. మెట్లకు రెండు పక్కల ఫకీర్లు కూసొని "అమ్మా! అమ్మా! బాబా! బాబా!'' అని ఖైరాత్ అడుగుతున్రు. గుడ్డోల్లు.. కుంటోల్లు.. కుష్టోల్లు.. వాళ్లను చూస్తె షానా బాదనిపిస్తుంటది. అందరం.. ముఖ్యంగ చిన్నపిల్లలు తమ తల్లిదండ్రులు ప్రత్యేకంగా ఫకీర్లకు వెయ్యడానికనే ఇచ్చే చిల్లరను వేస్కుంట గుట్టెక్కుతుంటరు.
నేను మా చిన్న చెల్లె బిడ్డను ఎత్తుకొని మెల్లగ మెట్లు ఎక్కుతున్న. చిన్నప్పుడు లెక్కపెట్టిన గుర్తు లెక్కన 14 వందల మెట్లేమో ఉంటయ్. అప్పుడు ఒక్కరోజె రెండ్రెండుసార్లు ఎక్కి దిగేది అని యాజ్జేసుకుంట దిగేటోళ్లను, ఎక్కేటోళ్లను పరికించుకుంట ఎక్కుతున్న.
"ఏమేం తెచ్చిన్ర''ని అడిగిన పెద్ద చెల్లెను.
"ఏముంది, రోటీ - దాల్!'' అన్నది చెల్లె.
"అంతేనా?'' అన్న నిరుత్సాహంగ.
మా రెండో చెల్లె ఉండబట్లేక "నీ పసంద్ గూడ తెచ్చినం లే భాయ్'' అన్నది.
"తలాయించి తెచ్చిన్రా?'' అడిగిన నోరూరంగ.
"ఆ! కిలోన్నర తెచ్చి సగం తలాయించినం, సగం కూర వండి తెచ్చినం'' అన్నది.
మా చుట్టాలు, పరిచయస్తులు, ఆళ్లీల్లు కలుస్తుంటె పలకరించుకుంటనె ఎక్కుతున్నం.
"అమ్మహ్! నా కాళ్లు నొస్తున్నయ్. కొద్దిసేపు ఆగుదాం'' అన్నది పెద్ద చెల్లె.
మెట్లకు కొంచెం పక్కకు జరిగి బండల మీద కూసున్నం. ఎండ ఊటగైతున్నది. దూపయినోళ్లు బాటిల్లల్ల తెచ్చిన నీళ్లు కొద్దికొద్దిగ తాగిన్రు. పిల్లలకు తాపిచ్చిన్రు.
కిందికి చూస్తె గుట్టకు ముందలి నల్గొండ అంత కనిపించబట్టింది. ఎడం పక్క కొద్దిగ కనిపిస్తున్నది కాని కుడిపక్క గుట్ట ఎత్తుగ ఉండడంతోని అవతలి దిక్కు కనిపిస్తలేదు.
మల్ల షురూ ఐనమ్. పైకెక్కుతున్న కొద్దీ కింద ఇండ్లు బొమ్మరిళ్ల లెక్క, రోడ్లు గీతల్లెక్క కనిపిస్తున్నయ్. ఒకింత దూరం ఎక్కినంక మల్లొకచోట ఆగినం. మా తమ్ముడు వాని బార్యకు మా ఊరి రోడ్డు, దూరంగ కనిపిస్తున్న చెట్లను చూపించుకుంట అదే మా ఊరు అని చెప్తున్నడు. నేను గూడ ఆ రోడ్డెంట చూపు పోనిచ్చి మా ఊరు- కేశరాజుపల్లిని ఎతుకుతున్న.
మల్ల ఎక్కేటోల్లను చూసిన. ముస్లింలెంత మంది ఉన్నరో, ముస్లిమేతరులు అంతకన్న ఎక్కువే ఉన్నరు. ఇదీ అసలు బహుజన సంస్కృతి అంటే.. అనిపించింది. దర్గా ముస్లింది కాబట్టే ఎక్కేటోళ్లెవరి నుదుళ్లమీద బొట్లు లెవ్వు. వాళ్ల బట్టలను బట్టి, భాషను బట్టి తెలుస్తుంటది. నిజానికి కొన్ని జమాత్‌లు చేస్తున్న ప్రచారంతోని ముస్లింలు ఒకవైపు, హిందూత్వ సంస్థలు, పార్టీలు చేస్తున్న ప్రచారంతోని ముస్లిమేతరులు మరోవైపు దర్గా సంస్కృతికి దూరమవుతున్నరు. కాకపోతె జనాభా పెరుగుతున్నది కాబట్టి ఎప్పటిలెక్కనె దర్గాలు కళకళలాడుతునె ఉన్నయ్. కాని మజీదులల్ల మౌలానాలు దర్గాల కాడికి పోవద్దని, అక్కడ సిజ్దా చెయ్యొద్దని చెప్తున్నరట. అది తెలిసి షాన బాదైంది తనకు.. ఈ ఉర్సుల భవిష్యత్తు చివరికి ఏమైతదో ఏమో..!
నా చూపు కింది నుంచి పైకి ఎక్కుతున్న ఒక బుర్ఖా పై పడింది. దూరంగ ఆ మొఖం ఎక్కడ్నో చూసినట్లే అనిపించింది. వెంట ఒక ఆడపిల్లున్నది. ఒక చిన్న పిలగాని చేయి పట్టుకొని మెల్లగ మెట్లు ఎక్కిస్తున్నదామె. అట్లనె చూస్తున్న. ఇంకింత దగ్గరికొచ్చింది. ఒక్కసారిగ గుండె ఆగి మల్ల కొట్టుకున్నట్లనిపించింది. ఆమె... ఆమె- రుక్సానా! అట్లనె స్థాణువు లెక్క నిలబడిపోయ్‌న. మెదడు మొద్దుబారిపోయింది. రుక్సానా దగ్గరికొస్తున్నది.
మా చిన్న చెల్లె "చలేంగే?'' అనడుగుతున్నది.
రుక్సానా మాకు సమానంగా వచ్చేసింది. కాని మా దిక్కు చూడలేదు. దాటి వెళ్లిపోతున్నది.
"రుక్సానా!'' అనే పిలుపు నాకు తెలియకుంటనె బైటపడ్డది.
పరేశాన్‌గ చూసింది రుక్సానా. కొద్దిసేపు ఎవరో ఏమిటో సమజ్ కానట్లుంది. తర్వాత గుర్తు పట్టింది. కాని ఏదో గుబులుగా చూసింది. నా చుట్టూ ఉన్న అందర్నీ కొంచెం బెదురుగ చూసింది. నేను తేరుకొని -
"ఇదర్ ఆవో రుక్సానా!'' అన్న.
"సలామలైకుమ్'' అనుకుంట పిలగాన్ని మెల్లగ నడిపించుకుంట మా దిక్కు వచ్చింది.
"కైసె హై?'' అన్న.
"హై ఐసె!'' అన్నది తలగుడ్డ విప్పుకుంట.
మావోళ్లు పరేశానై చూస్తున్నరు.
రుక్సానకు మావోళ్లను పరిచయం చేసిన. మా చెల్లెండ్లు సలామ్ చేసుకుంట, షేక్‌హ్యాండ్‌లు ఇచ్చుకుంట అసలు తనెవరన్నట్లు నా దిక్కు చూసిన్రు. నేను కాలేజ్ చదివేటప్పుడు ఈ ఉర్సుల్నే పరిచయం అయిందని చెప్పిన. అనుమానంగ చూసిన్రు గని సర్దుకున్నరు. రుక్సానానె చూస్తున్న నేను. తను గూడ నన్నే చూస్తున్నది. నేను చూడంగనె చూపు తిప్పుకుంటున్నది. మంచి నీళ్లు అందిచ్చిన. "హై'' అన్నది. కొంచెం గాభరా పడుతున్నది. పిలగాన్ని ఎత్తుకున్న. ముద్దుగున్నడు. పిల్లలు ఇద్దరు గుడ తెల్లగ ఉన్నరు. ఆడపిల్ల రుక్సానా లెక్కనె ఉన్నది.
నాకు షానా ఖుషీగ ఉన్నది. రుక్సానా కలిసినందుకు. ఒక్కసారిగ మేము కలిసి తిరిగిన జ్ఞాపకాలు, గుట్ట పరిసరాల్లో పెట్టుకున్న ముచ్చట్లు మనసు చుట్టూ ముసిరినయ్. భారంగ నిట్టూర్చిన.
మా రెండో చెల్లె - "ఎక్కడ ఉంటరు?'' అని మాట్లాడించింది రుక్సానను. అందరి అటెన్షన్ అటు మళ్లింది.
"యహీ. హైదర్‌ఖాన్ గుడె మె'' అన్నది రుక్సానా.
"ఒహో, నల్గొండల్నె ఇచ్చిన్రా'' అనుకున్న.
"ఇన్‌కె అబ్బా నై ఆయె?'' అని పిల్లల్ని చూపెట్టుకుంట వాళ్ల నాయ్‌న గురించి అడిగింది పెద్ద చెల్లె.
"నై. ఆయనక్కొంచెం పని ఉండి రాలె'' అన్నది రుక్సానా.
"చలేంగే?'' అన్నడు మా తమ్ముడు.
అందరం కదిలినం.
నేను రుక్సానా కొడుకుని ఎత్తుకొని ఉండేసరికి మా తమ్ముడు మా చిన్నచెల్లె బిడ్డను ఎత్తుకున్నడు.
మా రెండో చెల్లె ఏదో ఒకటి మాట్లాడించుకుంట రుక్సానా ఎంట మెట్లెక్కబట్టింది. నేను రుక్సానా బిడ్డను ఏం చదువుతున్నవని అడుగుతూ మెట్లెక్కుతున్న. ఎనిమిదేళ్ల పిల్ల. తను మాట్లాడుతుంటె సేమ్ అప్పుడు రుక్సానా మాట్లాడుతున్నట్లె అనిపించింది.
మా తమ్ముడు మా మర్దలు ముందు, వాళ్ల కన్నా ముందు చెల్లెండ్ల పిల్లలు నలుగురు, మా రెండో చెల్లె - రుక్సానా - పెద్ద చెల్లె ఒకసరిగ, ఆ వెనక నేను, నాతోపాటు రుక్సానా పిల్లలు, మా వెనక మా చిన్న చెల్లె తన ఐదేళ్ల కొడుకు చెయ్యి పట్టుకొని ... నడుస్తున్నం. మా చిన్న చెల్లెకు మద్యలో ఈ రుక్సానా ఏంది షర్బత్‌లో పుల్లలాగా అనిపిస్తున్నట్లుంది. కొంచెం మొఖం మాడ్చుకుంది.
దగ్గరికొచ్చేసినం. ఎనక్కి తిరిగి చూసింది రుక్సానా. తన కొడుకును క్షేమంగానే నేను ఎత్తుకొని ఉన్న. నేను చూడంగనె ఎక్కడ్లేని ఆనందం ఆ కళ్లలో మెరిసింది. మళ్ల ముందుకు మళ్లింది.
ఇక్కడ కొద్దిసేపు ఆగుదాం అన్న నేను. ఒక్కసారి కిందికి చూడొచ్చని. పోరగాన్ని ఎత్తుకొని మెట్లెక్కుతుంటె అలిపిరొస్తున్నది గుడ. మళ్ల అందరం ఆగి గుట్ట చుట్టూ ఉన్న పరిసరాల్ని చూడబట్టినం. కుడి వైపున లతీఫు సాబు గుట్టకు సమానమైన ఎత్తున ఉన్నది కాపురాల గుట్ట. దానిమీద కోట గోడలు కనిపిస్తున్నయ్. రెండు గుట్టల నడుమ జామ్ మజీదు దగ్గరి ఇండ్లు ఇరుకిరుగ్గా కనిపిస్తున్నయ్. గుట్ట పైకి చూసినం. దర్గా కనిపిస్తున్నది. దాని పక్కన చెట్టు. దానికి పెద్ద పెద్ద ఆకుపచ్చ జెండాలు ఎగురుతున్నై.
మళ్ల కదిలినం. దర్గా దగ్గరపడ్డది. మెట్లకు రెండు దిక్కులా ఫకీర్లు గుడ్డలు పర్సుకొని "బాబా!బాబా!'' అని అరుస్తున్నరు. జేబులున్న చిల్లరంత వేసుకుంట ముందుకు కదిలినం. మెట్లు అయిపోంగనె, రుక్సానా దగ్గరగ నడిచి మాతోనే ఉండమని చెప్పిన. అందరం దర్గాకు ఎడమ దిక్కు ఉన్న పెద్ద బండరాయి దిక్కు నడిచినం. బండరాయిని ఆనుకొని ఉన్న చెట్టు మా ఊర్లెకు హిప్పి కటింగోని లెక్క కనబడుతుంటది. బండరాయి వెనక చెట్ల కింద సోటు సూసుకొని కూసున్నం.
కొద్దిసేపు సేద తీరినంక మా తమ్ముణ్ని, మరదల్ని మేమొచ్చినంక పోదురు, అక్కడ్నె కూసొమ్మని చెప్పి నేను, మా చెల్లెండ్లు, రుక్సానా కలిసి దర్గా కాడికి పోయ్‌నం. నేను తలకు దస్తీ కట్టుకున్న. మా చెల్లెండ్లు, రుక్సానా కొంగులు తలనిండా కప్పుకున్నరు. దర్గా కాడికి పోంగనె ఊద్, ఊద్‌బత్తీల వాసన, మల్లెపూలు, గులాబీల వాసన కలగలిసి అదో లోకంలోకి తీసుకెళ్తున్నది. అందరం దర్గా చుట్టు మూడుసార్లు తిరిగినం. తర్వాత మా చెల్లెండ్లు ఒక తలుపు బయటే నిలబడి కొబ్బరికాయలు కొట్టించి, తెచ్చిన మిఠాయి ఫాతెహా ఇప్పిస్తున్నరు. వాళ్లు లోపలికి వచ్చేదానికి లేదు. నేను మగవాళ్లు లోపలికి వెళ్తున్న తలుపుల్నుంచి లోపలికి వెళ్లిన.
దర్గా మ«ధ్యలో లతీఫ్ సాబ్ మజార్ (సమాధి) ఉంది. దాని నిండా పూల చాదర్‌లు నిండి అంత ఎత్తుగ కనిపిస్తున్నది. కొద్దిసేపు ఆ లోపలి అద్భుతమైన దృశ్యాన్ని చూస్తూ నిలబడిపోయిన. లోపల ఫాతెహా లిస్తున్న ముజావర్లు పెద్ద పెద్ద గడ్డాలతోని ఉన్నరు. నేను మజార్ మీది పూల మీద తల ఆన్చిన. మొఖమంతా ఆ పూలలోకి మెత్తగా కూరుకుపోయి కమ్మని హాయి నిచ్చింది. గుండెలనిండా పూల ఘుమ ఘుమ. కొద్దిసేపు అట్లనె ఉండిపొయ్‌న. తర్వాత మెల్లగ లేషి ఎదురుంగ చూస్తె అవతలి గుమ్మంలో నన్నే చూస్తు నిలబడి ఉంది రుక్సానా. రుక్సానాను కొద్దిసేపు కన్నార్పకుండా చూసిన. తను కూడా అట్లనే చూస్తున్నది. ఎన్ని భావాలో ఆ చూపుల్లో.. గుండె బరువెక్కింది. మెల్లగా బైటికి కదిలిన. తను గూడ వెనక్కి మళ్లింది.
బైటికొచ్చి దర్గాకు ఎడమ పక్కన ఉన్న చెట్టు దిక్కు చూసిన. ఆ చెట్టుకే మా అమ్మ చాలాసార్లు జెండా ఎక్కించేది. పరేషాన్లు తీరాలనో.. మా చెల్లెండ్ల పెండ్లిళ్లు కావాలనో.. మేము పరీక్షల్లో పాస్ కావాలనో.. మాకు ఉద్యోగాలు రావాలనో! ఏవి తీరినయో, ఏవి తీరలేదో మా అమ్మకే తెలుసు. అమ్మ చెప్పినట్లు చిన్నప్పుడు అమ్మ వెంట ఆకుపచ్చని జెండా పట్టుకొని గుట్ట మీదికి పరుగెత్తుతుండేది.. అంతే! అందరం కలిసి మల్ల బండరాయి వెనక్కి వచ్చేసినం. మేం రాంగనె మా తమ్ముడు, మర్దలు బయల్దేరిన్రు దర్గా కాడికి. పిల్లలు అటు ఇటు తిరుగుతున్నరు. ఆ బండరాయికి ఒక పక్కనుంచి ఓ పది మెట్లు కట్టి ఉన్నయ్. అవెక్కితే అక్కడ బండలోకి ఒక చెల్మె ఉంటది. మా చిన్నప్పుడు అందులో ఎప్పుడూ నీళ్లు ఊరి ఉండేవి. తాగడానికి ఎంత తీసుకున్నా మళ్లీ ఎప్పటిలెక్కనె ఉండేవి. తర్వాత కొన్నాళ్లకు అది ఎండిపోయింది. ఆ స్వచ్ఛమైన చెల్మలో ఎవరో అన్నం తిని చెయ్యి కడిగిన్రని, అందుకని అది ఎండి పొయిందని చెప్తరు. ఇంక గుట్టసుట్టు అట్లాంటి వింత కథలెన్నో ఉన్నై.
మా చెల్లెండ్ల పిల్లలు వచ్చి మిఠాయి, కొబ్బెర ముక్కలు తలా కొంచెం తీసుకొని తిని మాయమైన్రు. రుక్సానా బిడ్డ చిన్నోన్ని తీసుకొని ఎటో పొయింది. మా చెల్లెండ్లు గుడ ఎటో తప్పుకున్నరు. దాంతో రుక్సానా, నేను మిగిలినం.
"ఎట్లున్నవ్?'' అనడిగిన.
"బానె ఉన్న. తర్వాత నీకెప్పుడు గుర్తు రాలేదా నేను?''
"అసలు మర్చిపోతేగా'' అన్న.
"నేను ప్రతి ఏడాది ఈ గుట్టెక్కినప్పుడల్లా నీకోసం వెతుక్కునేది. ఒక్కసారన్నా కనిపించలేదు గనీ..'' నారాజ్‌గ అన్నది. "అవునా ... నేను ఎక్కినప్పుడు గుడ చూసేది గానీ మరి ఇద్దరం ఒక్క టైంలో ఎక్కినట్లు లేదు. అయినా ఈ మద్య షానా ఏండ్లయింది ఎక్కక'' అన్న.
వాళ్లాయన గురించి అడగాలని నోటిదాంక వచ్చింది. మధ్యలో ఆయన టాపిక్ ఎందుకులే - అని ఊకున్న.. నేను తనకు అన్యాయం చేసిన్నన్న బాధ నా మనసుల మెలిపెడుతున్నది.
"అప్పుడెందుకు... మళ్ల నాతోని కలవడానికి ఒక్కసారన్న రాలేదు?'' మళ్ల అడిగిన.
"అప్పట్కె నీతో మాట్లాడుతుంటె చిచ్చా చూసి మా ఇంట్ల చెప్పిండు. నువ్వేమో అప్పట్లో పెండ్లి చేసుకునేటట్లు లేదంటివి. ఇంకేం చెయ్యను. మా బావతోని షాదీ పక్కా చేసిన్రు. నేనింకా చదువుకుంటనని ఎంతగనమో చెప్పి చూసిన. ఎవ్వరు వినలె...''
"సరె, ఇప్పుడు అంతా మంచే కదా...''
బదులేం చెప్పకుండ అదోలా చూసింది రుక్సానా.
నాకేం అర్థం కాలె.
"నువ్వు షానా గుర్తొచ్చెటోడివి. ఎందుకో తెలియదు. ఆ ఒక్క ఏడాదిల్నె నిన్ను షానా ఇష్టపడ్డ. మా బావ మెకానిక్ కావడం వల్లనో, నువ్వ చదువుకుంటుండడం వల్లనో కావొచ్చు. నిన్ను చేసుకోలేక పోయ్‌నందుకు మనసు ముడుచుకుపోయింది. బైట పడతానికి షాన్నేళ్లు పట్టింది. నీకేంది, మగవాడివి... నువ్వు బాగనె ఉన్నవ్.''
నేనేదో చెప్పబోయిన. అంతల్నె రుక్సానా పిల్లలు వచ్చిన్రు. ఇక ఒక్కొక్కరు అందరు వచ్చి కూసున్నరు. మా చెల్లెండ్లు, రుక్సానా మంచిగ మాట్లాడుకుంటుంటె సంతోషమేసింది.
నేను రుక్సానానె చూసుకుంట ఉన్న. తను కూడా మ««ధ్యమధ్య నన్ను చూస్తున్నది. ఆ చూపులో ఏదో ఆత్మీయత! దగ్గరితనం! అవునూ.. రుక్సానా భర్త ఎందుకు రాలేదు? అంత బాగా కలిసి ఉండరా? అని నా లోపల ఏవో అనుమానాలు... అందరి టిఫిన్లు ఇప్పి కొసరి కొసరి వడ్డించుకుంట ముచ్చట్లు చెప్పుకుంట తిన్నం.
మా చెల్లె కొడుకు అడిగిండు- "ఈ దర్గా ఇంపార్టెన్స్ ఏంది మామా?'' అని.
నేను దర్గాల గురించి కొంచెం వివరంగ చెప్పబట్టిన - "ఈ దర్గాలన్ని సూఫీలవి. వాళ్లు ఇస్లాం వ్యాప్తి కోసం పనిచేసినోళ్లు. వాళ్ల మంచితనం, నిర్మలత్వం, గరీబోళ్లకు, సమాజంల అణచబడ్డ మాల-మాదిగోళ్లకు, సూదరోళ్లకు, పేదోళ్లకు ఆత్మీయులుగా ఉన్న వాళ్ల తీరు... వాళ్లని దేవుళ్లను చేసింది. వాళ్లు చనిపోయిం తర్వాత ఏర్పడ్డ దర్గాలే ఇవి. వీటి దగ్గరికి ముస్లింలతో సమానంగా ముస్లిమేతరులు గూడ వస్తుంటరు. ఇట్ల ముస్లింలు, హిందువులు కలగలిసిపోవడం ఒక మంచి సంస్కృతి..''
"అందుకోసమే మా అన్నయ్య ప్రతి ఏడాది ఉర్సుకు అందరం కలుద్దామని ఈ సారి ఇట్ల మొదలుపెట్టించిండు'' అన్నది మా రెండో చెల్లె. తర్వాత ఎన్నెన్ని ముచ్చట్లో ...
అందరం ఇక వెనక్కు మళ్లినం. ఈసారి మా చెల్లెళ్లు, తమ్ముడోళ్లే ముందు నడుస్తుంటె నేను, రుక్సానా కొంచెం వెనగ్గా మెట్లు దిగుతున్నం. రుక్సానా కొడుకును నేనే ఎత్తుకున్న. నా గురించి, మా బేగం గురించి ఇంట్రస్టుగ అదొ ఇదో అడుగుతున్నది రుక్సానా. నేను ఆ అందమైన మొఖం చూడ్డంలోనే తన్మయత్వం పొందుకుంట మెట్లు దిగుతున్న.
గుట్ట ముప్పావు వంతు దిగంగనె బ్యాగుల్నుంచి సెల్ తీసి ఎవరికో ఫోన్ చేసింది రుక్సానా.
అరె, ఫోన్ నెంబర్ తీసుకోనే లేదు, గుట్ట దిగంగనె తీసుకోవాలనుకున్న.
షానా తొందర్గ గుట్ట దిగేసినట్లు తోచింది. యాప చెట్ల కిందికొచ్చినం. పొద్దు గూకెసరికి జనం పెరిగిన్రు. గోల గోలగుంది. కొద్దిసేపట్ల రుక్సానా ఎల్లిపోతది కదా.. ఎట్ల? అని దిగులుగ అనిపిస్తున్నది. ఫోన్ నెంబర్ అడిగిన. ఏదో మాట్లాడుకుంట నెంబర్ ఇవ్వనే లేదు. మళ్ల అడిగిన. మళ్ల మాట మార్చింది గని నెంబర్ ఇవ్వనె లేదు. కొంచెం బాదేసింది.
"మీ ఆయన మంచిగ సూసుకుంటడా నిన్ను?'' అని అడిగిన.
"మా ఆయన మొదట్లో షానా మొండిగా ఉండేటోడు. కొన్నాళ్లు కష్టాలు పడ్డ. ఇప్పుడు కొంచెం మారిండు. హిందీ విద్వాన్ దాకా పరీక్షలు రాసి మొన్ననే డిఎస్‌సి రాసిన. తప్పక పాసైత. టీచర్ జాబ్ చెయ్యాల్నని ఉంది'' అన్నది నిశ్చయంగ. అంతల్నె రుక్సానా సెల్ మోగింది. దాంతో- "మా ఆయన వచ్చిండు'' అని ఆత్రంగ పిలగాన్ని తీసేసుకుంది. మా చెల్లెండ్ల దిక్కు మళ్లి, "ఆపా! నేను పొయ్యొస్త. మళ్ల ఉర్సుల కలుద్దాం'' అని మా చెల్లెండ్లకు బాయ్ చెప్పి, నాకు చేత్తో పాటు చూపులతో గుడ బాయ్ చెప్పి కదిలింది.
వాళ్లాయన ఎట్లున్నడో అనే ఆత్రంతోటి రుక్సానా పొయ్యే దిక్కే చూస్కుంట నిలబడ్డ. రుక్సానా దగ్గరికి వాళ్లాయన వచ్చి ఆమె సంకల్నుంచి కొడుకును తీస్కొంట ఏందో అడుగుతుండు. రుక్సానా సంతోషంగ ఏందో చెప్తున్నది. వాళ్లాయన చూస్తానికి బాగున్నడు. మొత్తానికి ఆళ్లు షానా హుషారుగా పిల్లలతో పాటు ఉర్సుల కలిసిపోయిన్రు.
ఫోన్ నెంబర్ తీసుకోలేదన్న బాధ నాలో ఎగిరిపోయింది. రుక్సానా తన భర్త, పిల్లలతోని ఖుషీగనే ఉన్నది. అది చాలు అనిపించింది. మా చెల్లెండ్ల దిక్కు మల్లిన. ఆళ్లు ఆళ్ల దోస్తులెవరెవరో కలిస్తే మాట్లాడుతున్నరు. మా చుట్టాలు గుడ ఉన్నరు ఆళ్లల్ల. చుట్టు వాతావరణం ఎంత సందడిగ ఉందో.. ఎన్నెన్ని రకాల చలనాలో.. చెట్ల కింద గుంపులు గుంపులుగా ముచ్చట్లు పెట్టుకుంట ఎంత మందో.. ఈ ఉర్సు ప్రతి ఏడాది ఇట్ల అందర్నీ కలపడానికే ఉన్నదనిపించింది. రుక్సానాను చూడాలన్నా మళ్ల ఉర్సు కోసం ఎదురు చూడాల్సిందే అనుకుంట కదిలిన.