Wednesday 25 May, 2011

మానవీయ ముస్లిం కవిత్వం

ఇటీవల ఒక పుస్తక పరిచయం రాస్తూ వాదానికి, ధోరణికి, ఉద్యమానికి తేడా చెరిపేస్తూ నేనో వాక్యం రాస్తే ప్రముఖ కవి పి.ఎస్. నాగరాజు నా ఆలోచన సరిదిద్దుతూ కొన్ని విలువైన మాటలు చెప్పారు. కలగాపులగంగా వున్న నా ఆలోచనలను ఒకదారిలో పెట్టడానికి ఆయన ప్రయత్నించారు. కవులూ రచయితలతోపాటు పాఠకులు కూడా పదాలను ఎంత ప్రమత్తంగా వాడాలో హితబోధ చేశారు. నాగరాజుగారికి కృతజ్ఞత. ఈ ఆలోచనలకు భిన్నదిశలో  పొడిగింపుగా మరో సంఘటన కూడా జరిగింది. ”ఆంధ్రజ్యోతి” దినపత్రికలో ప్రతి సోమవారం ‘వివిధ’ సాహిత్యవేదిక వెలువడుతున్న సంగతి మీకు తెలిసిందే. 2004లో ముస్లింవాదం, ఇస్లాంవాదంలపై జరిగిన చర్చను మరోసారి ఈ వారం చదువుతున్నా. దానికి అనుబంధంగానే “గవాయి” (స్కైబాబ “జగనే కీ రాత్”పై చర్చ)ను కూడా చదివాను. ఈ వ్యాసంలో ఆ చిన్న పొత్తాన్ని పరిచయం చేస్తూనే ఇస్లాంవాదం, ముస్లింవాదాలపై నా ఆలోచనలను పంచుకునే ప్రయత్నం చేస్తున్నాను.
ఆత్మగౌరవ వ్యక్తీకరణలో భాగంగా వెలువడిన స్త్రీవాదం, దళితవాదాలు ఉద్యమ రూపం ధరిస్తున్నపుడు సన్నాయినొక్కులు నొక్కిన అందరి నోళ్లూ మూయిస్తూ ఆయా రచయితలూ కవులూ రకరకాల రూపాల్లో జరుగుతోన్న దోపిడీ విశ్వరూపాన్ని బట్టబయలు చేశారు. దాంతో ఒక్కసారిగా తెలుగు సాహిత్య ప్రపంచం ఒక్క కుదుపునకు లోనయ్యిందని చెప్పడం అతిశయోక్తి కాదు. అయితే దురదృష్టవశాత్తూ ముస్లిం తెలుగు సాహిత్యం మాత్రం తెలుగు సాహిత్య సమాజంలో ఆదినుంచీ నిరాదరణకే లోనయ్యింది. ఎందుకిట్లా ముస్లింవాద కవిత్వం విషయంలో తెలుగు సమాజం నిర్లక్ష్య ధోరణి కపరుస్తోందని స్కైబాబ తనకు దొరికిన వేదికపైనల్లా నిలబడి ప్రశ్నించడమే కాకుండా ఆ సాహిత్య ప్రచురణతో మరో ముందడుగు వేశారు.
నిజానికి విరసం తొలి ముస్లిం తెలుగు కవితా సంకలనం “జిహాద్” వెలువరించినా దానిపై జరగవలసినంత లోతుగా, విశాలంగా తెలుగు పత్రికలలో చర్చ జరగలేదు. తరువాత స్కైబాబతో సహా మరికొంతమంది ముస్లిం బుద్ధిజీవులు పూనుకొని “జల్ జలా” కవితా సంకలనం తీసుకొచ్చారు. కథ షరామామూలే. మనమెన్ని చిలకపలుకులు పలికినా, ఎంత చదువుకున్నా, హృదయమెంత విశాలమని మన జబ్బలు మనమే చరుచుకున్నా మన “హిందూ మతాధిపత్య” సమాజం అత్యంత హేయమైన కొంత భావజాలాన్ని, మన రక్తంలోకీ, మెదళ్లలోకీ ఎక్కించింది కదా, దానివల్ల ఎక్కడ ఏ విధమైన మతపరమైన విధ్వంసం జరిగినా యావత్ భారతదేశంలోని ముస్లిములందరినీ అనుమానంగా చూడడం మనకలవాటైంది. దాన్నే మన మతం, మెయిన్ స్ట్రీమ్ మీడియా, స్వార్థ రాజకీయ శక్తులూ మనకలవడేలా చేసాయి. దాంతో ముస్లిం తెలుసు సాహిత్యం అంటబడనిదైపోయింది. ఇంతలో గోరుచుట్టు మీద రోకటిపోటులాగా బాబ్రీ మసీదు విధ్వంసం, ఆ గాయాల తడి ఆరకముందే గుజరాత్ ఘోరకలికూడా మన మనసులను మార్చలేకపోయాయి. విషం చిమ్మేవాళ్లకు కొత్త భాష దొరికింది.
మతోన్మాదం రూపు వేరుకావచ్చు కాని, హిందూ-ముస్లిం మతపుటున్మాదం ఒకే రకంగా ప్రమాదకరమైనవి. కాని దాన్నుంచి కాస్త పక్కకు వచ్చి పరిశీలించినపుడు ఈ దేశంలో వెనుకబడిన కులాలు, అంతకంటే దారుణంగా దళితులు, వీరందరికంటే అత్యంత హేయంగా ముస్లిం ప్రజలు ఎన్ని రకాల వివక్ష, దోపిడీ, నిర్లక్ష్యాలకు గురవుతున్నారో పరిశీలించగలుగుతాం. ముచ్చటగా మూడోదిగా వచ్చిన ‘అజా’ కవితా సంకలనం ఎన్నెన్నో ప్రశ్నలకు పరిష్కారాలు, మరెన్నో సందేహాలకు సమాధానాలు అందించింది. తర్వాత వచ్చిన “ముల్కి” ఇంక తెలుగు సాహిత్య లోకంలో ముస్లింవాదం నిలదొక్కుకునేలా చేసింది. ఇక షేక్ కరీముల్లా ముస్లిం వాదానికి మరింత విస్తృతార్థం వచ్చేలా ఎన్నో మార్పుచేర్పులు సూచించి ఇస్లాంవాదం స్థిరీకరణకు ప్రయత్నం చేశారు. ఈ రెండు భావజాలపు వైరుధ్యాల మాటెలావున్నా మనం వీటన్నింటినీ ఓపిగ్గా చదివి హృదయానికి పట్టించుకున్నపుడు పీడితప్రజల పక్షాన సహానుభూతి చెందగలుగుతాం.
దేశంలో ఒక మతస్తులైన ప్రజలందరూ ఎలాంటి ప్రయోజనాలకూ నోచుకోక ఎంత వెనకబడివున్నారో తెలుసుకోవాలంటే కొన్నేళ్లకిందట వెలువడిన స్కైబాబ కవిత్వం “జగనే కీ రాత్” చదవాలి. ఈ పుస్తకం వెలువడిన తర్వాత కూడా, ముందు వెలువడిన కవిత్వం ఎన్నో సందేహాలు నివృత్తి చేసిన తర్వాత కూడా కొందరు హైందవీయ ఆదర్శాలు కలిగిన విమర్శకులు తమ రంగు కళ్లద్దాలలోంచే చూడడం మానలేదు. ఇందుకు ఉదాహరణ ఏప్రిల్ 02, 2006 ‘వార్త’ అనుబంధంలో ప్రచురితమైన ‘ముస్లిం వాదమంటే హిందూ ద్వేషమే?” అన్న డి.చంద్రశేఖరరెడ్డి వ్యాసాన్ని చూపించవచ్చు. ఆ తరువాత ఈ వ్యాసానికి ప్రతిస్పందనగా వచ్చిన అనేక వ్యాసాలను ’వార్త’ ప్రచురించలేదు కూడా.  ఇలా ఒక కవితా సంపుటంపై వచ్చిన అనేక ప్రచురిత, అప్రచురిత వ్యాసాలను జిలుకర శ్రీనివాస్ సంపాదకత్వంలో దళిత్-ముస్లిం పబ్లికేషన్స్ అక్టోబర్ 2006లో “గవాయి” పేరిట ఒక చిన్న పుస్తకంగా ప్రచురించింది.
అసలు సమాజం ఎన్ని వీలైతా అన్ని ముక్కలుముల్లకుగా విడిపోతే అంతగా వికటాట్టహాసం చేసే పాలకవర్గం, సామ్రాజ్యవాదం దళితులూ, ముస్లిములూ ముఖ్యంగా రెండింటా స్త్రీలు సమష్టిగా సాహితీ వ్యవసాయం చేస్తుండడంతో పెడబొబ్బలు పెడుతున్నారు- కొంత సంతోషంతో, కొంత దుఖంతో. ఇది నిజంగా ఎందరికో మింగుడుపడని విషయం. అసలు ఇలా ఎవరికి వారు గొంతెత్తి ఆత్మవిశ్వాసపు గానాలాపన చేయడం ఎవరి మంచికో, ఎవరి చెడుకో తెలియని, అర్థం చేసుకోలేని నాబోటి కొందరు ఈ మొత్తం క్రమాన్నంతా నివ్వెరపోయి చూస్తున్నారు(మ్). అందుకే ఈ ”గవాయి” ఒక విశిష్ట ప్రచురణగా నిలిచింది. ఇక స్కైబాబ కవిత్వంపై, ఆ నెపంతో ముస్లిం తెలుగు కవితపై రకరకాల రూపాలలో బురద చల్లడాన్నితీవ్రంగా వ్యతిరేకించిన ఈ పుస్తకంలో జిలుకర శ్రీనివాస్, చిట్టిబాబులు తమ చివరిముక్తాయింపు వ్యాసంలో ఇలా అంటారు. “…స్కైబాబ రచనలు వివాదాస్పదం కావడం ఇది తొలిసారి కాదు. వివాదం రేకెత్తడం ఆయన కవిత్వం నైజం కాదు. కాని, కవిత్వ వాదనలోని శక్తిని శత్రుశిబిరం ఆయన కవిత్వాన్ని వివాదాస్పదం చేస్తూనే వుంది. వివాదం రగిలేవిధంగా కవిత్వ సృజన చేయడం వేరు. వివాదాస్పదం చేయడం వేరు. ఒకటి సృజనక్రమంలో జరిగేది. రెందోది వాచక పఠనం తర్వాత రాజకీయ, సైద్ధాంతిక పోరు క్రమంలో సంతరించేది…”
92 పేజీల ఈ చర్చావ్యాసాల సంకలనంలో 27 వ్యాసాలున్నాయి. అన్నీ ఎన్నో ఆలోచనలను మనకు పంచుతాయి. పది రూపాయల విలువ పెట్టిన ఈ అపురూపమైన పుస్తకాన్ని శ్రద్ధగా అధ్యయనం చేయడం వెనకబడిన కులాల, వెనకబడిన ప్రాంతాల ప్రజలు తమతమ గొంతులను సవరించుకుంటున్న వేళ ఓ తక్షణావసరం.

2 comments:

  1. ఇన్ని రోజులు కనిపించలేదేమిటి స్కై గారు?

    ReplyDelete
  2. ముస్లిం వాద కవులకు పార్శ్వ దృష్టిమాత్రమే ఉన్నట్లుంది. ముస్లిములను అనుమానంగా ఎందుకు చూడడం మొదలెట్టారో తమరు చాలా కన్వీనియంటుగా మరిచిపోయారు. బాబ్రీ మసీదుకు ముందు, కాష్మీరములో హిందువులపై జరిగిన ఘోరాల గురించి ఎంత మంది ముస్లిము వాద కవులు గొంతెత్తి రాసారో ఎప్పుడైనా గమనించారా? బాబ్రీ మసీదు ఉదంతం తరువాత జరిగిన అనేక తీవ్రవాదుల దుశ్చర్యలు తమ కంటికి కనిపించలేదా? ఇప్పటివరకూ జరిగిన తీవ్రవాద దుస్ఛర్యలే ముస్లిముల వైపు హిందువులు అలా అనుమానంగా చూసేలా చేశాయన్న సత్యాన్ని మీలాంటి వాల్లు తొక్కి పెట్టలేరు లెండి.

    అయినా, గురివిందకు తనకింది నలుపు తెలీదని, హిందూ అతివాదభావజాలాలన్ ప్రశ్నించే వారు, ఇస్లామిక్ అతివాడ భావాలను పాపం మరిచిపోయి. ఎన్ని చిలకపలుకులు పలికితే జనాలు నమ్ముతారు.

    ప్రపంచములోని ప్రజలు అన్ని కోర్టుల కంటే నిష్పక్షపాతమైన వారు, వారికి తెలుసు ఎవరు ఎలాంటి వారో.

    ‘ముస్లిం వాదమంటే హిందూ ద్వేషమే?” అన్న డి.చంద్రశేఖరరెడ్డి వ్యాసాన్ని చూపించవచ్చు. ఆ తరువాత ఈ వ్యాసానికి ప్రతిస్పందనగా వచ్చిన అనేక వ్యాసాలను ’వార్త’ ప్రచురించలేదు కూడా.

    సంతోషం చాలమందికి అసలు నిజం తెలుసు. వారేమీ మూర్ఖులు కాదు, ముసుగులో ఉన్నది ఏమిటొ ఇట్టే పట్టేశారు.

    ReplyDelete

మీ అభిప్రాయం తెలియజెయ్యండి