Friday, 1 April 2011

ధ్వంస రచన

ప్రజా సౌధాన్ని కట్టాలనుకునేవాడే
రాజ సౌధాలను కూలుస్తాడు
కోటను కూల్చకుండా
కొత్త రాజ్యాన్ని ఎలా నిర్మిస్తాం?
గడీని మట్టు పెట్టకుండా
వడిగా ఎలా ముందుకెళ్తాం?
కట్టాలంటే ముందు కూల్చాల్సిందే
అది విగ్రహమో.. నిగ్రహమో..
సౌధమో.. ఆయుధమో.. ఆయువో!
కలకు రూపమివ్వాలంటే
అక్కడ ఖాళీ ఏర్పర్చాలి ముందు
శిథిలాల గుట్టలు పేరుకొనేది కొన్నాళ్లే
వినిర్మించేవాడికి
శిథిలాలపై ప్రేమెందుకు
శిథిల మనసుల్ని
మనుషుల్ని ప్రేమించలేడు వాడు
దూసుకెళ్లే స్వభావమది
దూసిన ఖడ్గం వాడు..
దూసుకెళ్లే బాణం..
ఎత్తిన గడ్డపార!
గమ్యం తప్ప
ఏదీ కంటపడని గురి
చేప కన్ను తప్ప
చెత్తా చెదారమేదీ కనిపించదు
నిప్పును రాజెయ్యడమే తప్ప
నివురు గురించి యోచన ఉండదు
నినాదమే.. నిర్మాణమే తప్ప
నాన్చివేతల్ జాన్తానై



వినిర్మాణానికి
ఏదో ఒక మూల నుంచి కూల్చడం మొదలవ్వాల్సిందే
గడ్డపార వెయ్యకుండా
మొక్కెలా నాటగలం?
పునాది తియ్యకుండా భవనమెలా కడతాం?
ఎవరినీ నొప్పించకుండా
సత్యమెలా చెబుతాం?
అవును
ఇవాళ కూల్చింది
రేపటి రూపును ఆవిష్కరించడానికే
జీవాలు కూలుతున్న ఆక్రందనే
విగ్రహాలు కూల్చింది
ఇంకొకటి చెప్పనా!
మా మధ్య
కొన్ని దుష్ట విగ్రహాలు తిరుగుతున్నాయ్
వాటిని కూడా కూల్చేదాకా లాగొద్దు బిడ్డా!

6 comments:

మీ అభిప్రాయం తెలియజెయ్యండి