Wednesday, 19 January 2011

QABZA



ఊటగ ఉర్కుతున్న
గని ఉర్కొస్తలె
లాగు జేబుల్ల పెద్ద పెద్ద తాళాలు
బరువుకు కాళ్లు కదుల్తలెవ్‌
సుట్టు ఎనుగు పాత్తుండు
అరెరె! ఆళ్లు మునిగిపోతున్నరు
ఉర్కిపొయ్యి బచాయించాలె
ఉహుం.. ఊటగ ఉర్కొస్తలె
కాళ్లు బోదకాల్లలెక్క ఇంత లావెక్కిపోతున్నయ్
అడుగు కదుల్తలె
ఎట్ల
యాడికాడ కబ్జా పెడ్తుండు
ఎటు పోతెట్టు లేదు
నా ఓళ్ల చేతుల్ల ప్లకార్డులు
'జాగా ఎవన్ది - జాగీ రెవడు'
అగొ, దండుబాటకు రేగ్గంప కొడ్తుండు
ఉంటాఉంటే ఇంకా కషాయమెక్కుతుండు
ఝట్ న  ఎనుగుకు పామై ఏలాడుకుంట కనబడ్తుండు
బండ్లబాటంత బుర్దబుర్ద
ఎండిపొయ్యి దడుసుకుంటట్టు
మనిషిపట్టేంత పెద్దగ నెర్రెలు ఇచ్చుకుంటున్నది
అగ్గొ కత్తుల్తోటి ఎంటబడ్తుండు
పిల్ల బాటల్నిండ ముండ్ల తీగెలు
చూస్తుండంగనె పెరిగొస్తున్నయ్
ఒక్కోపాలి బొల్లిగడ్డంతోటి కండ్లబడ్తుండు
మల్ల ఆడే ఒల్లంత కాషాయం పూస్కొని-
అంతల్నె విభూతి రాస్కొని ఎగుర్కుంట వస్తుండు
ఇంకోపాలి సుక్కల్ సుక్కల జండాతోని
బూగోళానికంత ధమ్కి ఇచ్చుకుంట
యాడికాడికి ఎనుగు పాత్తుండు
బాటలన్ని మూసేస్తుండు
ఎట్ల
నా వోళ్లు మునిగిపోతున్నాలె
ఎట్లన్న ఉర్కాలె
కాళ్లు కదుల్త లెవ్వు
అయ్ నా  ఉర్కాలె
ఎటోదిక్కు ఎనుగుతొక్కి
కాలిబాటన్న ఎయ్యాలె

Monday, 10 January 2011

నాలో పులులూ సింహాలు



నా ఒంటి మీది
జీవావరణ్యం ఖబ్జా కు గురయ్యింది
నోటి కాడి కూడు
గూడు తోడు దూరమై
నాలో గర్జిస్తున్న పులుల్నీ సింహాల్ని
కట్టి పెట్టాను
బుసలు కొడుతున్న
కోడె నాగుల్నిపట్టి పెట్టాను

పక్షులు ఆక్రోశంతో అరుస్తున్నాయ్
జింకలూ లేళ్ళు సైతం
పోరుకు సిద్ధమైనయ్

ఇక
నా ఒంటి నరాలు ఒపలేకున్నయ్
కట్లు తెంచుకొని
ఈ జీవజాలమంతా మీద పడితే
ఖబ్జాకోరులారా!
ఖతమౌతరు బిడ్డా..
ఖబడ్దార్!

(జై తెలంగాణ!
ఇంత  మోసమా..?  తెలంగాణ ప్రజలను మోసం చేసి, ఉద్యమాన్ని అనిచేద్దామని చూడడం ఎంత అన్యాయం..?  ఒక సమత్సరం ఓపిక పట్టమని ఇవాళ తెలంగాణ ఇవ్వకుండా దగా చేద్దామంటే తెలంగాణ ప్రజలు అంత అమాయకులు కాదు.. ఇది పోరాటాల గడ్డ! పోరాడి సాధించుకుంటాం..
ఎంతదాకా పోయినా సరే..!)