Tuesday 7 September, 2010

మజ్బూర్ (ఓ పేద ప్రేమికుడి కథ)

అయాల రంజాన్!జల్ది జల్ది ఈద్గా దిక్కు నడుస్తుండు జాని. అమ్మీకి పాలు, పండుగ సామాను తెచ్చిచ్చి తయారై బయల్దేరేసరికి జర లేటయింది. అందుకనె ఆ జల్ది.

 అందమైన సల్మా మొఖం.. మనసుకు శాంతినిచ్చే సల్మా మొఖం.. కళ్లల్లో మెరిసేసరికి జాని మనసు ఉరకలెత్తింది. పండుగ నమాజ్ ఐపోంగనె ముందుగాల సల్మవాళ్లింటికే పోవాలనుకుండు, మరింత జల్ది నడవబట్టిండు.


ఊరికి పడమరన ఉంది ఈద్గా (రంజాన్, బక్రీద్‌లకు నమాజ్ చేసే ప్రాంగణం). ఊరి పొలిమేర దాటి సగం మైలు నడవాలె. ఊరంటె పల్లెటూరు కాదు చిన్న పట్నం. తాలూకా లెవలు.
సైకిల్ మోటర్లు, సైకిళ్లు దబ్బదబ్బ పోతుంటె బాటెంట ఒకటె దుమ్ము లేస్తున్నది. జానితొపాటు ఎనకాముందు శానామంది నడుస్తున్రు. అంతా కొత్త బట్టల్తోని, తీరుతీర్ల టోపీల్తోని, అత్తరు గుమగుమల్తోని ఒక పూలవనం కదిలిపోతున్నట్లుంది. శానామంది తమ బుడ్డబుడ్డ పిల్లల్ని గుడ ఎంట తీసుకొస్తున్రు.

ఇమాం సాబ్ మైకు సరిచేస్తున్నట్లు గరగర ఇన్పించింది. ఇంకింత జల్ది నడవబట్టిండు జాని. చేతిల ప్లాస్టిక్ కవరుంది. అందుల పాత చద్దరొకటుంది. అమ్మీ పెట్టెల్నించి తీసిచ్చిన మఖ్మల్ టోపీ కూడా ఉంది. రాత్రి ఇస్త్రీ చేయించి పెట్టుకున్న బట్టలు తొడుక్కుండు. కాళ్లకు సగం అరిగిన హవాయి చప్పల్ (స్లిప్పర్స్). ఈద్గా దగ్గర పడ్డది. బాటకు రెండు దిక్కులా ఫకీర్లు కూసొని ఖైరాత్ చెయ్యమని దీనంగ అడుగుతున్నరు. ఒకరిద్దరు మర్ఫా, కంజిర కొట్టుకుంట ఖవాలీలు పాడుతున్రు.

కొత్తగ కట్టిన కాంపౌండు బైట అటుదిక్కు ఇటుదిక్కు చిన్నా పెద్దా శానామందే చెప్పులు తమకాడ ఇడవమంటె తమకాడ ఇడవమని పిలుస్తున్రు. తన చప్పల్ యాడ ఇడవాల్నో తేల్చుకోలేక జరసేపు నిలబడ్డడు జాని. తన ఎదురుంగ ఉన్న తాత జర భోళాగ కనిపించిండు. చప్పల్ ఇడిసి ఒకదాన్ల ఒకటి జొనిపి తాతకిచ్చిండు. తాత ఆటిని తన దగ్గరగ ఉన్న కుప్పల పెట్టుకుండు. మరింత మంది అక్కడికొచ్చేసరికి జాని జరిగి ఈద్గా గేటు దిక్కు కదిలిండు.

'అవుజ్ బిల్లాహి మినష్షయితాన్ నిర్రహీమ్. బిస్మిల్లా హిర్రహ్మాన్ నిర్రహీమ్' (షైతాన్ బారినుండి దేవుని శరణు వేడుతున్నాను.
కరుణామయుడైన దేవుని పేరుతో ప్రారంభిస్తున్నాను) అని మొదలుపెట్టిండు ఇమాంసాబ్.
గేటు దగ్గర అంతా తోసుకుంట లోపల్కి పోబట్టిన్రు. జానిగూడ తోసుకుని లోపలబడ్డడు. గేటు ఇంకింత పెద్దగ కట్టాల్సుండెనని ఒకరిద్దరు గునుగుతున్రు. అల్లంత దూరంగ ఈద్గా మజీదు. దాని ముంగల పెద్ద యాపచెట్టు. జల్దిజల్దిన అటుదిక్కు నడిషిండు జాని. అప్పట్కె చెట్టు నీడన సోటు లేకుంట కూసున్రు జనం. ఇటు అటు చూసి ఇగ తప్పదన్నట్లు ఒక పక్కగ కవరుల్నుంచి చద్దర్ తీసి పరిషి ఒక చివర కూసుండు. టోపి పెట్టుకుండు. చద్దర్ పెద్దగనె ఉండేసరికి ఇంకో ముగ్గురు వచ్చి కూసున్నరు.

ఎండ చిరచిరలాడుతున్నది. తన పక్కన కూసున్న పెద్దమనిషి చేతికున్న గడియారం దిక్కు సూషిండు జాని. 11 దాటింది. కొంచెం ముందుగాలొస్తే చెట్టుకింద సోటు దొరికేది. ఎనక్కు మళ్లి సుట్టు సూషిండు. వచ్చేటోల్లు ఇంక వస్తెనే ఉన్నరు. చద్దర్లు పరుస్తనె ఉన్రు. చద్దర్లు లేనోళ్లు జరంత సేపాగి ఎవరిదన్న చద్దర్ల సోటు సంపాదిస్తున్రు. లేనోళ్లు కిందనె కూసుంటున్రు. షానామందికి ఎండకు చెమట్లు పడుతున్నై. షానామంది కొత్తబట్టలు ఏసుకున్నా అక్కడక్కడ కొత్తబట్టలు కుట్టించుకోలేకపొయ్‌న వాళ్ల చూపులు అంత హుషారుగ లెవ్వు. మాటిమాటికి అవి వాలిపోతున్నయ్. కొందరి మొఖాలల్ల పరేషాన్లు.. కొందరి మొఖాలు వయసుకు మించిన పెద్దరికంతోని, వయసుకు మించిన ముడుతలతోని.. కొన్ని కళ్లు పీక్కుపోయి.. కొన్ని గుంతలు పడి.. కొన్ని నిర్జీవంగా.. ప్చ్.. అల్లా.. అన్నీ నువ్వు పెట్టే పరీక్షలే అంటరు.. ఎందుకు ఇందర్ని ఇన్ని బాధలు పెడుతున్నవ్...


ఇమాంసాబ్ బయాన్ (ప్రసంగం) చేస్తనే ఉండు. టైం గడుస్తనే ఉంది. జనం రావడం పల్చబడ్డది..
ఇగ ఇమాంసాబ్ మాట్లాడ్డం ముగించి పండుగ నమాజ్ తరీఖ (పద్ధతి) చెప్పబట్టిండు. రెండు నిమిషాల్లో నమాజ్ కోసం అంతా లేషిన్రు. జమాత్ నిలబడ్డది. భుజం భుజం కలిపి వరుసలు కట్టిన్రు. మద్యమద్యల చోటు మిగిలిన కొద్ది ఎనకవాళ్లు ముందు వరుసకొచ్చి ఖాళీ అయిన చోటల్లా నిలబడ్డరు. 'అల్లాహు అక్బర్'(అల్లా గొప్పవాడు) అని చేతులెత్తుతూ నమాజ్ షురూ చేసిండు ఇమాంసాబ్..
నమాజ్ అయినంక దువాకు ముందు తఖ్రీర్ (ఉపదేశం) ఇస్తున్నడు ఇమాంసాబ్. వినడం వదిలేసి సోంచాయించుకుంట కూసుండు జాని. తనకు ఈసారి కొత్తబట్టలు లేవు. అప్పుడప్పుడు దాచిపెట్టిన పైసలు పెట్టి అమ్మీకి ఒక చీర కొనుక్కొచ్చిండు. 'నాకెందుకు తెచ్చినవురా.. నువ్వే రెడిమేట్ల ఒక పాయింటో షర్టో తీసుకోవద్దా' అని బాధపడింది అమ్మీ. 'నాకీసారికి వద్దులే అమ్మీ! కొత్తబట్టలు కుట్టించి ఆర్నెల్లు కూడా కాలే కదా' అన్నడు. చీర వాపస్ చేసి తననేదన్నా కొనుక్కోమని పోరింది అమ్మీ. తనే విన్లే.
ఇమాంసాబ్ దువా (వేడుకోలు) షురూ చేసిండు. అంతా చేతులు సాపిన్రు. జాని కూడా దువాకై చేతులు సాపిండు. ఆయిల్ మరకల చేతులు! ఎంత తోమినా పోని దలిందరాగి లాగే ఈ ఆయిల్ మరకలు.. గోర్లు తీసుకున్నప్పటికీ ఆ మూల ఈ మూల మిగిలే ఉన్న ఆయిల్ నలుపు.. వదలని దుఖ్ఖం లెక్కనే!

దువాలో- మనుషులంతా మంచిగుండాలని, వానలు కురవాలని, కరువు కాటకాలు రావొద్దని, సకల మంచితనాల్ని కోరుతున్నడు ఇమాంసాబ్. అన్నింటికీ అందరితోపాటు 'ఆమీన్' (అలాగే జరుగుగాక) అంటున్నడు జాని. కని మనసులో మాత్రం అమ్మీ బీద చూపులు.. చిన్న ఆపా భయం చూపులు.. పెద్ద ఆపా పరేషాన్లు.. మెదుల్తున్నయి. కళ్లల్ల నీళ్లు తిరిగినయ్. తను వీళ్లను ఖుషీగ బతికేటట్లు చెయ్యగలడా? అల్లా మమ్మల్ని ఆదుకోడా? యా ఖుదా.. మాక్కూడా కాసిన్ని ఖుషియాఁ (సంతోషాలు) ఇవ్వరాదయ్యా... సల్మా గుర్తొచ్చింది. వచ్చే రంజాన్ కల్లా సల్మాతో తన షాది అయితే ఎంత బాగుండు? అల్లా! ఆ ఒక్కటన్నా అయ్యేటట్లు సూడు, మరేం వద్దు గని...

దువా కాంగనే అంతా లేషి 'ఈద్ ముబారక్' (పండగ శుభాకాంక్షలు) చెప్పుకుంట అలాయ్‌బలాయ్ తీసుకుంటున్రు. జాని కూడా తనకు పరిచయం ఉన్నోళ్లకోసం చూసిండు. కాని ఎవరు కనబడ్లె. ఇంతల తన చద్దర్ మీదనే నమాజ్ చదివిన పండు ముసలి దాదా ఒకాయన 'ఈద్ ముబారక్ బేటా!' అని చేతులు సాచిండు. జాని మనసు ఖుష్షయింది. ఎవరు లేనోళ్లకు దేవుడే దిక్కు అన్నట్లు కనిపించిండు దాదా! 'ఆప్‌కో భి సలామత్ దాదా!' అని గుండెల నిండుగ అలాయ్‌బలాయ్ తీసుకుండు.

చద్దర్ ఎత్తి కవర్లో పెట్టుకుండు. ఒకరిద్దరు దూరపు చుట్టాలు కలిసిన్రు. తమ గల్లీవాసులు ఇద్దరు.. అందరితోని అలాయ్‌బలాయ్ తీసుకొని గేట్ దిక్కు కదిలిండు. తన మామలు, కక్కయ్యలు కలవలేదేందా అని చూస్తున్నడు అందరి దిక్కు. అంతా ఆత్రంగ కదుల్తున్రు. షానాసేపు పట్టింది గేట్ల నుంచి బైట పడతానికి. జల్ది జల్ది తన చప్పల్ ఇడిషిన దిక్కు పొయిండు. ఎగబడ్డట్టుగ ఎవరి చెప్పులు ఆళ్లు తీసుకుంట తాత చేతిల రూపాయో రెండు రూపాలో పెడుతున్నరు. జాని తన చెప్పుల కోసం చూసిండు. ఒక పక్కగ పడి ఉన్నయ్. తీసుకొని కాళ్లకు తొడుక్కుండు. పైసలు ఇయ్యకుంటనె యాడ ఎల్లిపోతరొనని అందరికెల్లి ఆత్రమాత్రంగ చూస్కుంట చేతులు సాస్తుండు తాత.

కష్టంగ అటు రెండడుగులు ఏసి తాత చేతిల రెండు రూపాలు పెట్టిండు. పెట్టి ఇవతలికి రాబోయిండు. అంతల్నె ఎవరొ తన చెప్పు తొక్కిండు. లేషిన తన కుడి కాలుకి స్లిప్పర్‌కి మద్యల బలమైన కాలు ఎవరిదొ పడింది. అంతె, చెప్పు సగానికి చినిగి తెగిపొయింది! గుండెల డక్కుమన్నది జానికి. తూలి సంబాలించుకొని చెప్పు దిక్కు చూసుకుండు. ఎనక డాలీలు ఉండేకాన్నుంచి తెగిపొయింది. ఇంతకుముందే కొంచెం చీలి ఉండె. అక్కడ్నుంచే తెగింది. కాలు ఎత్తి చూసిండు. సగం చెప్పు ఊగులాడుతున్నది. కాలెత్తి చేతిలకు తీసుకొని చూసిండు. చివర కొంచెం అంటుకొని ఉంది తప్ప దాన్ని ఇగ ఏం చెయ్యలేం.
తాత జాని దిక్కు చెప్పు దిక్కు మల్ల మల్ల చూసి 'అయ్యో.. చెప్పు తెగిందా కొడ్కా!' అన్నడు బాధగ.

మనసంత బాధగ ఐపొయింది జానికి. ఏడుపొచ్చి నట్లనిపించింది. నిబాయించుకొని చెప్పులు ఇడిషి పక్కన పడేసిండు.
అంతసేపు ఎండకు కూసుంటె గుడ పట్టని చెమట ఒళ్లంత తడిపెయ్యబట్టింది.
'స్లిప్పర్లే గదయ్యా! నీ శని వదిలిందనుకో.. కొత్త జత కొనుక్కోయ్యా.. నీకు మంచి జరుగుతది' అంటుండు తాత.
ప్చ్! స్లిప్పర్లే ఐనా మల్ల కొంటానికి తన కాడ పైసలెయ్? అయ్యో! నమాజ్ ఐపోంగనె సల్మాను చూద్దామనుకుంటినె.. ఇప్పుడెట్లా? ఉత్త కాళ్లతోని ఆళ్లింటికెట్ల పోవుడు..?
షానాసేపు అట్లనె నిలబడ్డడు జాని. అంతా ఎల్లిపోతున్నరు. తాత గూడ ఎల్లిపొయిండు. మనసు ఖాళీ అయిపొయింది. మెల్లగ కదిలిండు ఉత్త కాళ్లతోని.
'అయ్యా! అయ్యా! బాబా! బాబా' అంటున్నరు ఫకీర్లంతా. మర్ఫా చప్పుడు.. ఘల్లు ఘల్లున కంజిర.. అంతా ఫకీర్లకు ఖైరాత్ చేసుకుంట పోతున్రు. తన దగ్గర ఆ చిల్లర గూడ లేదు.

కొద్దిదూరం వచ్చిండు. ఎడమ పక్క సమాధులున్నై. షానామంది తమ పెద్దల సమాధుల కాడ పూలు చల్లి దువా చదువుతున్రు. జాని తన అబ్బాజాన్ సమాధి దిక్కు కదిలిండు. ఖబ్రస్తాన్ బైట పూలమ్ముతున్రు. పూలు కొంటానిక్కూడ పైసల్లేవ్. కంపముళ్లను, రాళ్లను సూషి అడుగేసుకుంట, ఒట్టిగనె ఎల్లి అబ్బా సమాధి ముందు నిలబడ్డడు. పక్కన దాదా, దాదీ సమాధులు. పక్క సమాధి తాలూక మనిషి ఆకుల్ల చుట్టిన పూలు విప్పి ఆ సమాధిపై చల్లి పక్క సమాధులపై కూడ చల్లుకుంట జాని దిక్కు పూల డొప్ప సాపిండు. జాని కొన్ని పూలు తీసుకొని అబ్బా సమాధితో పాటు పక్క సమాధుల మీద కూడా ఆ పూలరేకులు చల్లి వచ్చి అబ్బా సమాధి ముందు నిలబడి దువా చేసిండు.

అబ్బా యాద్‌లన్ని మూగినయ్. అబ్బా బతికుంటె తమకిన్ని పరేశాన్లు రాకపొయ్యేటివి అనుకుంట ఖబ్రస్తాన్ బయటికి నడిషిండు.. సల్మా ఇంటికి పోబుద్ది కాలె. బాధగ ఆ గల్లీ దాటేసిండు. చుట్టాల ఎవరింటికైనా ఉత్త కాళ్లతోని ఎట్ల పోవుడు. మెల్లగ ఇంటిదిక్కు నడవబట్టిండు. పొద్దుటి హుషారంత పొయింది. మనసంత సల్మనే నిండి ఉంది. ఆళ్లింటికి పోలేకపోతున్నందుకు ఎవరిమీదనో యమ కోపం వస్తున్నది. తమ పెంకుటిల్లు వచ్చేసింది. గుమ్మానికి కట్టిన పర్దా జరుపుకుంట ఇంట్లకు అడుగుపెట్టిండు.
బగార అన్నం వండడంలో ఉంది జాని అమ్మీ గోరిమా. 'సలామలైకుమ్ అమ్మీ' అని కాళ్లు మొక్కిండు. వందేళ్లు బతకాలని, వచ్చే రంజాన్‌కల్లా షాది కావాలని దువా ఇచ్చింది గోరీమా. 'ఎవరింటికి పోయి కలవకుంటనే వచ్చినవారా? ఇంత జల్ది వచ్చినవ్' అన్నది మల్ల.
నీరసంగ మంచం మీద కూలబడ్డడు జాని. 'క్యావ్ బేటా! అట్లున్నవేందిరా?' అన్నది గోరిమా. 'క్యాబినై' అన్చెప్పి ఎనక్కి ఒరిగిండు.
'ఒక్కొక్కల్లు చుట్టాలు వస్తుంటరు, జల్ది వొంట ఐపోగొట్టాలె' అనుకుంట మళ్ల వంట పనిల పడిపోయింది గోరీమా.

మంచం మీద ఎల్లకిల్ల ఒరిగివున్న జాని కళ్లనిండ సల్మ అందమైన మొఖమె. సల్మను చూడాల్నని మనసు కొట్టుకుంటున్నది. ఎంత అందంగ నవ్వుతది సల్మ. ఆ ఒక్క నవ్వు చాలు తన బాధలన్ని మర్శిపోతానికి. తన కోసం ఎదురు చూస్తుంటది. ఎట్లనన్న ఎల్లాలె. ఇయాల పండుగ పేరుమీద కలవడానికి పోవచ్చు గాని వేరే రోజులల్ల కారణం లేకుంట పోతాన్కి ఇబ్బంది గుంటది. ఎట్ల? అమ్మీ కాడ ఏమన్న పైసలున్నయేమో అడిగితె...

'అమ్మీ! ఈద్గాల నా చెప్పు తెగిపొయింది అమ్మీ' అన్నడు మెల్లగ.
'అయ్యొ! అట్లెట్ల తెగిందిరా!?'
'ఎవరొ చెప్పు తొక్కేసరికి తెగిపొయిందమ్మీ..'
'దలిందరరాగి పాడుగాను.. పోనీలేర, కొత్తయ్ కొనుక్కుందువులె.. నా కాడ 15 రూపాలున్నైర. ఎన్నాళ్ల నుంచో దాచి పెడుతున్న. కని 15 రూపాలకు చప్పల్ వస్తయా? రావు గదా...'
తలుపు బైట సప్పుడు అవడంతోని లేషి పర్దా జరిపి చూసిండు. చాంద్‌మాము వచ్చిండు. 'సలామలైకుమ్ మాము' అన్నడు. 'వాలెకుమ్ సలామ్! ఈద్గాకు రాలేదా? కనబడలె' అనుకుంట అలాయిబలాయి తీసుకున్రు ఇద్దరు. 'వచ్చిన మాము. నేను గుడ మీరు కనిపిస్తరేమొనని చూసిన మాము' అన్నడు జాని.
'సలామలైకుమ్ ఆపా' అని మాము గోరీమా కాళ్లు మొక్కిండు. ఆమె దువా ఇచ్చింది. కొద్దిసేపు కూసొని షీర్‌ఖుర్మా (సేమ్యా) తాగి ఎళ్లేటప్పుడు గోరీమా చేతిల యాభై రూపాలు పెట్టి పొయిండు చాంద్.

ఆయన పోంగనె ఆ యాభై రూపాలు జానికిచ్చి చెప్పులు కొనుక్కో పొమ్మన్నది గోరిమా. జాని మనసు ఖుష్షయ్యింది. బైటికి పోబోతుంటె చిన్నమామ ఒక దిక్కునుంచి, కక్కయ్య మరొక దిక్కు నుంచి వచ్చిన్రు. వాళ్లను అలాయిబలాయి తీస్కొని పెద్దమామ ఇంటికి బయల్దేరిండు. మధ్యల 30 రూపాలు పెట్టి మామూలు స్లిప్పర్లు కొన్నడు. సల్మాను చూడాలన్న ఆత్రం ఆగనిస్తలె.
సల్మ పెద్దమామ బిడ్డ. పెద్దమామ ఇల్లు ఊరికి అటు చివరన ఉంది. దూరం ఉండడంతోని రాకపోకలు తక్కువ. తనే సల్మకోసం పొయ్యొస్తుంటడు. తనంటె తమ ఇండ్లల్ల అందర్కి మంచి గురి. జాని షానా మంచోడు అంటుంటరు. చిన్నప్పుడె అబ్బాజాన్ చచ్చిపోవడంతోని తమ కష్టాలు మొదలైనయ్. అమ్మీ ఎన్ని కష్టాలో పడి ఇద్దరు అక్కల షాదీ చేసింది.

తను ఎనిమిదో తరగతి దాంకనె చదివిండు. తర్వాత ఇగ ఇల్లు గడవక అక్కల పెళ్లిళ్లకు అమ్మీ చేసిన అప్పులు అట్లనె పెరుగుతుండెసరికి ఏం చెయ్యాల్నో తొయ్యక అమ్మీ తనను టాక్టర్ మెకానిక్ షెడ్‌ల పనికి పెట్టింది. ఇటు పని నేర్చుకోవొచ్చు.. నెలకొచ్చే జీతంతోని ఇల్లు నడుస్తది. పొద్దున్నె 8 గంటలకె పోవాలె. రాత్రి ఎంతయితదో తెలియదు. ఇంట్ల అమ్మొక్కతె. తన షాదీ చేస్తె తనకు కోడలు తోడుంటదని అమ్మీ పోరుతున్నది. తనకేమో సల్మానె చేసుకోవాల్నని ఉంది. ఆ విషయం అమ్మీకి చెప్పిండు.

'నువ్వు ఏం కోరనోనివి! కోరక కోరక కోరిన కోర్కె తీర్చలేనారా? నాగ్గూడ ఆ పిల్ల మీదనె ఉందిరా.. నీగ్గాకపోతె ఎవరికిస్తడు? టైమొచ్చినప్పుడు అడుగుత' అన్నది.
అదయినంక ఒకసారి సల్మా వాళ్లింటికి వెళ్లినప్పుడు 'నేనంటె నీకిష్టమేనా సల్మా?' అని షానా కష్టపడి అడిగిండు.
సిగ్గుతోని కళ్లు దించుకుని ఇష్టమె అన్నట్లు తల ఊపుకుంట పక్క అర్రలకు ఎల్లిపొయింది సల్మా. అప్పట్నుంచి మరింత ఆత్రం ఎక్కువైంది తనకు. ఎట్లనన్న ఈ ఏడాదే సల్మను చేసుకోవాల్నని పడ్డది..
సల్మ ఇంటి తలుపు ముందు ఆగి గొళ్లెం సప్పుడు చేసిండు. సల్మా వచ్చి తలుపు తీస్తె బాగుండు అనుకున్నడు. సల్మ తమ్ముడు హనీఫ్ తలుపు తీసిండు.
'సలామలైకుమ్ భాయ్‌జాన్!' అన్నడు హనీఫ్.
'వాలేకుమ్ సలామ్!' అనుకుంట తనను దగ్గరికి తీసుకుని అలయ్‌బలయ్ ఇచ్చి భుజం మీద చెయ్యేసి లోపలికి నడుచుకుంట ఎల్లిండు.
సాయమాన్ల మామి (మేనత్త) కనిపించింది. సలామ్ చేసిండు. ఆమె వాలెకుమ్ సలామ్ చెప్పుకుంట 'ఆవొ జాని! అమ్మీ ఎట్ల ఉంది?' అనడిగింది.
'బాగుంది మామి. మీకు దువా చెప్పమన్నది' అన్నడు జాని. 'మాము (మామ) ఈద్గా నుంచి రాలేదా?' అని అడిగిండు మల్ల. 'వచ్చి, మల్ల రహమత్‌నగర్‌కు పొయిండు. అక్కడ నాకు వరుసకు అన్న అయితడు, ఆ అన్న వాళ్లింట్ల కలిసి వస్తనన్నడు' అన్నది మామి. వాళ్ల వరుసకు అన్న అయ్యే వాళ్లింట్ల కలిసి వస్తానికి పొయిండా.. తమ ఇంటికి రాకుంటనే..!? అనిపించింది జానికి.
'కూసొ జాని, షీర్‌ఖుర్మా తెస్త' అనుకుంట వంట అర్రలకు పొయింది మామి.

కుర్చీల కూసున్నడు జాని. కళ్లు సల్మా కోసం ఎతుకుతున్నై. తాను వచ్చినట్లు సమజ్‌కాంగనె ఉరుకొచ్చే సల్మా.. తనను చూడంగనె కళ్లు, మొఖం ఎలిగిపొయ్యే సల్మా- ఎక్కడుందా అని ఒకటె ఆత్రంగ చూడబట్టిండు. తను కూసున్న సాయమానుకు ఎడమ దిక్కునున్న అర్రల ఉండేది సల్మా. మరి ఆ అర్రకు పర్దా ఏలాడుతున్నది. అది తొలగించుకుని ఎందుకు సల్మా వస్తలేదో సమజ్‌కాలె జానికి. ఎవరన్న సహేలీలను కలవడానికి పోయిందా.. అయ్‌న తను వస్తానని ఎదురుచూస్తుంటది కదా, అట్లా పోదు కదా.. అనుకుంట సోంచాయిస్తున్నడు జాని. హనీఫ్‌ని దగ్గరికి పిలిషిండు. 'సల్మా ఏది?' అని చిన్నగ అడిగిండు. లోపలుంది అని అర్ర దిక్కు సూపిచ్చిండు హనీఫ్. బైటికి రమ్మను పో అని చెబుదామని చూసిండు జాని. అంతల్నె మామి ఒక ఖటోరా ల సేమ్యా తీసుకొని సాయమాన్‌లకు వచ్చి జానికి ఇచ్చింది. సేమ్యా చేతిలకు తీసుకుండు జాని.

కాని ఏ రంజాన్‌కైనా, బక్రీద్‌కైనా తానొస్తే తనకు సేమ్యా సల్మా అందించేది. నిండైన మెరుపులు మెరుపుల కొత్త బట్టలతో పెద్ద వోనీతో తెల్లని గుండ్రని నవ్వు మొఖంతో సేమ్యా అందించడానికి సల్మా తన దగ్గరగా వచ్చేసరికి ఆ దగ్గరితనానికే ఆ సువాసనకే మనసు తేలిపోయేది. తన చేతితో అందించిన సేమ్యా తాగుతుంటే అమృతం తాగుతున్నట్లే తోచేది. కొద్ది దూరంలోనే నిలబడి తన్మయంతో తనను చూస్తూ తన అమ్మీ గురించో, తన ఆపా ల గురించో అడుగుతూ ఉంటే ఎక్కడలేని ఆనందంతో జవాబులిస్తూ ఆ అందమైన కళ్లల్లోకి కళ్లు కలుపుతూ ఉండేవాడు.

పై మాటలకు తెలియని మౌన భాష ఏదో తమ మధ్య నడుస్తూ ఉండేది. అ లాంటి సల్మా కనిపించకుండానే సేమ్యా తీసుకొని తాగాల్సి రావడం ఎట్లనో తో చింది జానికి. మామి అదో ఇదో అడుగుతుంటే కష్టంగా జవాబు లిచ్చుకుంట షానా సేపటికి ఒక చంచా సేమ్యా నోట్లోకి తీసుకుండు. తాగబుద్ధి అయితలె. ఏం చేయాల్నో తోస్తలె. అట్లనే సేమ్యా చేతిల పట్టుకుని మాటిమాటికి సల్మా ఉన్న అర్ర దిక్కు సూడబట్టిండు. ఎందుకు సల్మా బైటికి వస్తలేదో సమజైతలేదు జానికి. ఇంతల ఇంకెవరన్న 'ఈద్ మిల్నే' (పండగ సందర్భంగ కలవడానికి) వచ్చేస్తే ఆయింత రాదు, ఎట్ల? అని పరేషాన్ అవుతున్నడు.

ఈ పిలగాడు షీర్‌ఖుర్మా తాగకుండ అట్లనె కూసున్నడేంది, ఎంతసేపు కూసుంటడు, అవతల తనకు ఇంకా వంటపని కాలేదాయె అనుకుంట నిలబడ్డ మామి, జాని మాటిమాటికి సల్మా ఉన్న అర్ర దిక్కు సూస్తుండడం గమనించింది. సంగతి సమజైంది మామికి. కొంచెం ఇబ్బందిగ అటు ఇటు కదిలింది. ఇగ ఉండలేక అసలు సంగతి చెప్పింది-

మొదలు, 'షిర్‌ఖుర్మా తాగవేంది పిలగా?' అన్నది. జాని తడబడ్డడు. సేమ్యా తాగడం మొదలుపెట్టిండు. మల్ల అన్నది మామి- 'నాకు వరుసకు అన్నయితడన్న కదా.. ఆళ్ల కొడుకు సౌదీల ఉంటడయ్యా! ఈ సంవత్సరం రెండు నెలలు సెలవు పెట్టి వచ్చిండు. వాళ్ల అమ్మానాన్న షాదీ చెయ్యాల్నని అనుకున్నరు. మన సల్మాను ఇవ్వమని అడిగిన్రు. పిల్ల ముద్దుగుంది, కట్నం పెద్దగ ఏమొద్దన్నరు. షాది గ్రాండుగ చెయ్యాలన్నరు. పిలగాడు మంచోడు.

సౌదీల ఉన్నడు, చదివి కూడ ఉన్నడు అని మీ మాము ఎంటనె ఒప్పుకున్నడు.. ఒక నెల లోపల్నె షాదీ చెయ్యాలయ్యా! ఏమనుకోవద్దు, మీకు చెప్పలేదని.. జల్దిల నిశ్చయమైపొయింది.. మీ మాము మీ అమ్మికి వచ్చి చెప్త నన్నడు.. ఇయాల చెప్తడు కావొచ్చు. మన పిల్ల ఏ పరేషాన్లు లేకుంట బతకాలనె అనుకుంటం గదా.. అదిగాక ఇయాల్రేపు కట్నం ఎక్కువ అడగకుంట ఎవరు చేసుకుంటరు చెప్పు.. మీ మాముకేమొ అంత తాహతు లేదాయె..' చెప్పుకుపోతున్నది మామి, బిడ్డ షాదీ కుదిరిన ఖుషీల...జానికి గుండె ఆగినంత పనైంది. మామి చెప్పేది ఇగ ఏమీ ఎక్కుత లేదు.

అంటె సల్మాకు మరొకరితొ షాదీ ఖరారైపొయిందన్నమాట! అనుకునేసరికి కళ్లల్ల గిర్రున నీళ్లు తిరిగినయ్.. సుడులు సుడులుగా ఇంకా ఊర్తనే ఉన్నయ్. సేమ్యా చేదుగా అనిపించింది..టేబుల్ మీద ఆ సేమ్యా ఖటోరా పెట్టేసి ఝట్‌న లేషి దబదబ బైటికి నడిషిండు.. మామి పరేషానై 'ఏంది పిలగా, చెప్పకుంటనె అట్ల ఎల్లిపోతున్నవ్?' అంటున్నది. తలుపు దాటి బైట అడుగుపెట్టిండు జాని. బోరున ఏడుపు తన్నుకు వచ్చేసింది.. ఏడ్సుకుంటనే దబదబ ఎటు దిక్కు నడుస్తున్నడొ గుడ సూసుకోకుండ నడవబట్టిండు...

3 comments:

  1. మీ "మజ్బూర్" కథ ను ఆసక్తి గా చదివాను.
    కథ లో ఎంత సింప్లిసిటీ వుందో అంత ఆర్ద్రత వుంది.
    హృదయాన్ని హత్తుకునే కథనం.
    ముస్లిం సంస్కృతినీ , వాతావరణాన్నీ చాలా ప్రతిభావంతం గా చిత్రించారు.
    కథ చదువుతున్నంతసేపు స్వయంగా ముస్లింగా మారాను.
    జానీ పాత్రతో తాదాత్మ్యం చెందాను.
    సల్మా కనిపించక పోవడం, ఆమె మనసులో ఏముందో తెలియక పోవడం అశాంతికి గురిచేస్తూనే వుంది.
    "...ఇంతేలే నిరుపేదల బతుకులు ... అవి ఏనాడూ బాగుపడని అతుకులు..." అనే పాట గుర్తుకొచ్చింది.
    " అమీన్ " వంటి కొన్ని పదాలకు అర్ధం ఏమిటో మీ కథ చదివాకే తెలిసింది.
    అదే విధంగా ముస్లిం సంస్కృతి గురించి కూడా మరింత అవగాహన కలిగింది.
    నిరాడంబరమైన చాలా చక్కని చిక్కని కధ.
    మీకు హృదయపూర్వక అభినందనలు.

    ReplyDelete
  2. స్కైబాబ గారూ...,వినాయక చవితి శుభాకంక్షలు

    హారం

    ReplyDelete
  3. స్కైబాబా గారు.... కథా చాలా బాగుంది.సల్మా గురించి చదువుతుంటే మనసు బాధకి గురయ్యింది. చక్కగా రాశారు.

    ReplyDelete

మీ అభిప్రాయం తెలియజెయ్యండి