- స్కైబాబ కథ
- - - - - - - - -
పెళ్ళైన కొత్తల్ల ఒకటె ఉబలాటంగుంటది పెళ్ళాం మొగుళ్ళకు- ఒకల ముచ్చట్లు ఒకలకు చెప్పుకోవాల్నని. దాంతో తమ అలవాట్లన్ని తమ ప్రత్యేకతలుగా చెప్పుకుంటుంటరు. కొందరేమొ ‘గొప్పలు’ చెప్పుకుంటుంటరు. నేను ఫలాన కూరగాయలు తినను.. నాకు ఫలానా మాంసం యమ ఇష్టం.. ఇట్ల మొదలైతె- నాకు ఫలానా తీర్గ ఉండేటోల్లంటె అస్సలు నచ్చరు. ఫలానా మస్త్ పసంద్- దాంక…
అట్లనె జబీన్-మహబూబ్‌లు గుడ తమ పెళ్ళైనంక తమ గొప్పలు చెప్పుకున్నరు. ఆ చెప్పుకునుడు ఏడిదాంక పోయిందంటె- మహబూబ్ తానొక పిల్లను ప్రేమించి ఉంటినని ఆ పిల్లను అస్సలు మర్షిపోలేనని ఆ కతంత చెప్పుకొచ్చిండు. అంతేగాంక ఆ తరువాత గుడ ఒక పిల్ల తన ఎంట పడేదని గొప్పగ చెప్పిండు. అట్లా పెళ్ళైనప్పటిసంది తన ప్రేమకతలు చెప్పుకుంటనే వస్తున్నడు మహబూబ్. జబీన్‌కు తన ప్రేమకత గూడ ఒకటిరెండుసార్లు నోటిదంక వచ్చింది. గని ఉగ్గబట్టుకుంది. ఒకరోజు మాత్రం మహబూబ్ తన తొలి ప్రేమ గురించి మహా గొప్పగ చెప్పుకుంటుంటె.. ఇగ ఉండలేకపొయ్యింది. మహబూబ్ జర మనసున్నోడే ఉండు, తన ప్రేమ కత చెప్పుకున్నా ఏమనేటట్లులేడులె అనుకున్నది.. ఎనకాముందాడుకుంటనె తన ప్రేమ కత గుడ చెప్పుకున్నది!
తన కత గొప్పగనే చెప్పుకున్న మహబూబ్‌కు పెళ్ళాం ప్రేమ కత చెపుతుంటే మాత్రం మనసుల్నించి ఉక్రోషం తన్నుకొచ్చింది. బైటబడితె ఆయింత చెప్పకుంటనె యాడాపేస్తదోనని ఊకున్నడు. కొద్దిసేపు ఊఁ గొట్టిండు. ఐటెంక ఊఁగొట్టుడు బందైంది. జబీన్‌ను ఒళ్లోకి గట్టిగ పొదువుకొని పండుకున్నోడల్లా పట్టు ఒదిలిండు. ఇదేం సమజ్ చేస్కోకుంటనె తన ప్రేమకతంతా చెప్తున్నది జబీన్-
తను, పక్కింటి అమీర్ ప్రేమించుకున్నమని- అతను షానా మంచోడుండెనని.. తండ్రి సచ్చిపోవడంతోని ఇప్పట్లో షాదీ చేసుకునుడు కుదరదని చెప్పిండని.. తను షానా ఏడ్షిందని.. కొన్నాళ్ళకు వాళ్ళు వేరే పట్నానికి ఎల్లిపోయిన్రనేది ఆ కత. మహబూబ్ మొఖం మాడిపొయి షానాసేపయింది. ఆ చీకట్ల అది గమనించే వీలు లేదు జబీన్‌కు. సప్పుడు చెయ్యకుంట జబీన్‌ను వదిలి అటు మల్లి పండుకుండు మహబూబ్. పరేషానయింది జబీన్. అంతదంక మైమరచి చెప్పుకుంట వచ్చినదల్లా చెప్పి తప్పు చేసిన్నా ఏందని ఒక్కసారిగ మనసుల గుబులు పడ్డది. మహబూబ్ మీద చెయ్యి ఏసి ‘ఏమైంది జీ.. నిద్ర వస్తుందా!’ అనడిగింది. ‘ఊఁ’ కొడితే తన అయిష్టత యాడ బైటపడకుం పోతదనుకున్నడో ఏమో ‘నై’ అని జర ఊటగనె అన్నడు. సమజయింది జబీన్‌కు. వెనుక నుంచి మరింత దగ్గరగా జరిగి ‘కోపమొచ్చిందా?’ అని గోముగ అడుగుకుంట గట్టిగ హత్తుకుంది. ‘అదంతా పాత కత. ఇప్పుడు నువ్వే నా పానం’ అని చెవిలో చెప్పింది. మెదలకుండా జవాబేమి ఇవ్వకుంట పండుకుండు మహబూబ్.
అప్పుడనుకుంది జబీన్- మొగుడు ఎన్ని ప్రేమకతలు చెప్పినా ఇనాలె గని, పెళ్ళాం తన ప్రేమకత మాత్రం అస్సలు చెప్పకూడదని! మహబూబ్ చెప్పిన రెండు ప్రేమకతలకు మనసులో ఎక్కణ్నో మంటగ అనిపించింది కని బహుశా తనగ్గూడా ఒక ప్రేమకత ఉండటంతోని అంతగనం కోపం రాలేదు జబీన్‌కు. చెప్పుకున్నందుకు మనసు జర అల్కగయ్యింది.
గని మహబూబ్ అలిగేసరికి మనసుల మల్లో గుబులు మొదలైంది, పుసుక్కున ఇది మనసుల పెట్టుకుని సతాయించడు గదా అని. ఇట్ల సోంచాయించుకుంట మహబూబ్‌ను అట్లనే అల్లుకుని ఉండిపొయింది ఆ రాత్రి. ఇద్దరి మనసుల్ల సుడులు తిరుగబట్టినయ్ ఒకరికొకరు చెప్పుకున్న ప్రేమకథలు…!
***
ఏండ్లు గడిషిపొయినయి. ఇద్దరు పిల్లలు పుట్టిన్రు. మహబూబ్ మంచోడే. జబీన్‌ను మంచిగనే సూసుకుంటున్నడు. కాని అప్పుడప్పుడు ఇద్దరూ కొట్లాడుకున్నప్పుడల్లా ‘నువ్వు సొక్కమా?’ అంటె ‘నువు సొక్కమా?’ అని ఒకరిమీద ఒకరు అర్సుకునేటోల్లు. మంచిగున్నప్పుడు, యాదొచ్చినప్పుడల్లా ఉండబట్టలేక తన తొలి ప్రేయసి గురించి అదొ ఇదొ చెప్తనె ఉండేటోడు మహబూబ్. చెప్పుకుంటున్నప్పుడల్లా ఊఁ కొడుతూనే జబీన్ ఏదో లోకంలోకి ఎల్లిపోతుండటం గమనించేటోడు. తనకు గుడ అమీర్ గుర్తొస్తున్నడేమోనని సోంచాయించేటోడు. జర మనసుల మంటగ ఉండేది. కాని తమాయించుకునేటోడు. ఒక్కోపాలి మెల్లగ అడిగేటోడు, ‘అమీర్ గురించేమన్నా తెలిసిందా! ఎట్లున్నడంట?’ అని.
జబీన్ మాత్రం గత అనుభవాన్ని మతిల తలుసుకుని ఏం చెప్పకపొయ్యేది. ‘ఏమో తెలియదు. నేనెప్పుడో మర్షిపొయిన కతను నువ్వెందుకు మల్ల గుర్తు చేసుడు’ అని ఊటగ అని, అక్కడ్నించి తొలిగి పనుల్ల పడిపొయ్యేది.
అట్ల అననైతె అనేదిగని పుట్టింటికి పొయినపుడు మాత్రం అమీర్ గురించి ఆరా తియ్యకుంట ఉండలేకపొయ్యేది. యాణ్ణో ఒక తాన బతికే ఉన్నడు లెమ్మని నిమ్మలపడేది.
ఒకపాలి ఊర్లె చుట్టాలింట్ల పెండ్లికి పొయ్‌న మహబూబ్‌కు తన తొలి ప్రేయసి తారసపడింది. గుండె గుబగుబలాడింది. ఎన్నాల్ల నుంచో కలవాల్ననుకుంటున్న తను కనిపించేసరికి పానం లేసొచ్చినట్లయింది. కాకపోతె ఆమె తీరే జర తేడా గొట్టింది. ఆమెను చూసి మహబూబ్ ఎంతైతే అలజడికి గురైండో ఆమెలో మాత్రం అలాంటిదేమి కనిపించలేదు మహబూబ్‌కు. పట్టనట్టే తిరగబట్టింది. మనిషి లావయింది. భారీ చీరలో ఒంటినిండ నగలతోని షానా ఫోజు కొట్టబట్టింది. ఉండబట్టలేక జర సందు చూసుకొని మాట్లాడతానికి కోషిష్ చేసిండు మహబూబ్- ‘జర పక్కకు రారాదు, కాసేపు మాట్లాడుకుందాం’ అని అడిగిండు. ‘హమ్మో! మా ఆయన చూస్తే ఏమైనా ఉందా.. నేను రాను’ అన్నది. ఊర్లెనే ఉన్న తమ ‘యింటికన్న ఒకసారి వచ్చిపోరాద’ని అడిగిండు. ‘వామ్మో! మా అత్తగారికి తెలిస్తే ఏమన్నా ఉందా.. కుదరదు’ అన్నది. తిక్క లేషింది మహబూబ్‌కు. ఇన్నాళ్ళ సంది ఒక్కపాలి ఎదురుపడితే బాగుండునని అంతగనం గోస పడ్డది గిట్లాంటి దాని కోసమా అని ఒకటే ఫీలయిండు. కని ఏం జేస్తడు, పానం కొట్టుకుంటుండె.. తమాయించుకుని మల్ల సందుచూసుకుని అడిగిండు, ‘ఎట్లున్నవ్.. అంతా నిమ్మలమేనా?’ అని. ‘నాకేంది, నేను మస్తున్న.. మా ఆయన నన్ను దేవతలెక్క చూసుకుంటడు. నేను లేకుంట ఐదు నిమిషాలు గుడా ఉండలేడు. ఏది కావాలంటె అది కొనిస్తడు…’ అనుకుంట వాళ్ళాయన గురించే గొప్పలు చెప్పబట్టింది. అంతల ఎవడో పోరగాడొచ్చి వాళ్ళ అత్త పిలుస్తున్నదని చెప్పిండు. ‘హమ్మో! నేను పోతున్నా..’ అనుకుంట గబ్బగబ్బ గున్న ఏనుగులెక్క ఎల్లిపొయింది. అట్లనే జరసేపు మొద్దులెక్క నిలబడ్డడు మహబూబ్. అప్పట్నించి ఆ పెండ్లి నుంచి ఎల్లొచ్చిందాంక మల్ల ఎదురుపడనే లేదు ఆమె.
ఇంటికొచ్చేసినంక ఆ రాత్రి తన మనసులో సుడి తిరుగుతున్న బాధనంత జబీన్‌కు చెప్పుకుంట చిన్నపిల్లగాని లెక్క బోరున ఏడ్వబట్టిండు మహబూబ్. ఒళ్ళోకి తీసుకొని ఓదార్చింది జబీన్. జబీన్ గుడ మహబూబ్ ఏడ్పుల ఏడ్పు కలిపి తనివితీర ఏడ్చింది, అమీర్ గుర్తొచ్చి! జబీన్ ఒళ్ళోకి ముడుచుకుని అట్లనే నిద్రపొయిండు మహబూబ్. ‘అమీర్ గుడా తనను మర్చిపోయి ఉండొచ్చా…’ అని సోంచాయిస్తూ సోంచాయిస్తూ ఎప్పటికో నిద్రపొయింది జబీన్.
***
అప్పటిసంది జబీన్ మీద మరింత ప్రేమ పెరిగింది మహబూబ్‌కు. ఇంకింత మంచిగ చూసుకోబట్టిండు. ఆమె మంచితనం.. ఆమె అందం మస్తు గొప్పగా కనిపించబట్టినయి.. దాంతో ఆమెను అపురూపంగ చూసుకోవటం.. ఏదున్నా తనకు చెప్పి చెయ్యడం చెయ్యబట్టిండు. ఒకపాలి మాటల్ల అమీర్ గురించి ప్రస్తావనొచ్చింది-
‘…యాడున్నడో తెల్సుకో జబీనా… ఒకసారి ఇద్దరం కలిసివద్దాం’ అన్నడు మహబూబ్.
కలవరపడ్డది జబీన్. నమ్మబుద్ది కాక మహబూబ్ దిక్కు సూషింది.
‘నిజంగంటున్న జబీనా! తెల్సుకో.. తప్పేముంది.. పలకరింపుగ కలిసివద్దాం! నాగ్గూడా అతన్నొకపాలి సూడాల్నని ఉంది’ అన్నడు.
కండ్లల్ల నీల్లు చిమ్ముతుండేసరికి ఝట్‌న వంటింట్లకు తప్పుకుంది జబీన్.
‘నిజంగనే అంటున్న జబీనా.. తెలుసుకో!’ అన్నడు ఊటగ మహబూబ్.
‘సూద్దాంలే జీ!’ అన్నది వంటిట్ల నుంచి, లెక్కచెయ్యనట్లు.
ఎప్పుళ్ళేంది ఇట్లంటున్నడేంది అని జర అనుమానమేసింది జబీన్‌కు. కాని తనకు గూడ మనసుల సూడాల్ననే ఉన్నది. ఆ విషయం ఏ మాత్రం బయటపడనీయలేదు.
నిజానికి- తను అంతగనం చెప్పుకున్న తన ప్రేయసి తనంటే ఏమాత్రం పట్టించుకోకపోవడం ఎంతకూ అజం కాలేదు మహబూబ్‌కు. దాంతో జబీన్ విషయంలో అమీర్ ఎట్ల ఫీలయితడో సూడాల్ననే ఉబలాటం ఎక్కువైంది. అందుకనే అమీర్‌ను కలుద్దామని అనబట్టిండు..
మహబూబ్ డ్యూటీకి పోంగనే తమ ఊర్లె ఉన్న చెల్లె ముబీన్‌కు ఫోన్ చేసింది జబీన్. జరసేపు పలకరింపు లయినంక ‘అమీర్ వాళ్ళు ఇప్పుడెక్కడ ఉంటున్నరంటరా?’ అనడిగింది.
‘అయ్యో.. నీకు తెలవదా ఆపా! వాళ్ళిప్పుడు గోల్కొండల్నె ఉంటున్నరంట. అమీర్ కారు నడుపుతున్నడంట. గోల్కొండ ఇప్పుడు మీకు దగ్గర్నే కదా!’ అన్నది.
‘అవునా!’ అని ఆశ్చర్యపొయింది జబీన్. ఇంకా కొన్ని వివరాలు చెప్పింది ముబీన్.
ఇగ అప్పటిసంది మల్ల మహబూబ్ ఎప్పుడు అడుగుతడా అని ఎదురుసూడబట్టింది గని తనకు తానైతె ఆ విషయం ఎత్తలే.
కొన్నాల్లకు మల్ల మాటల్ల అడగనే అడిగిండు మహబూబ్, ‘అమీర్ గురించి తెలుసుకోమంటి గదా!’ అని. అప్పుడు గుడ జర ఎనకాముందాడుకుంటనే- ‘మొన్న ముబీన్ చెబుతుండె, వాల్లిప్పుడు గోల్కొండల్నె ఉంటున్నరంట’ అన్నది.
‘అవునా.. మరింకేంది, ఒకరోజు పొయ్యొద్దాం’ అన్నడు మహబూబ్.
‘ఎందుకులే జీ! ఐటెంక మీరు ఎప్పుడన్నా ఎత్తిపొడిసినా పొడుస్తరు. ఎందుకొచ్చిన పరేషాని’ అన్నది.
‘ఎహె! అట్లెందుకు జేస్త జబీనా, ఏమనలే! ఒకసారి పొయివద్దాం’ అన్నడు.
‘సరె తీయ్.. చెల్లెకు చెప్త అడిగిసూడమని. ఏమంటరో సూద్దాం’ అన్నది.
కొన్నాళ్లకు ముబీన్ ఏదొ ఎక్జామ్ రాయడానికి హైదరాబాద్ వొచ్చింది. మహబూబ్ అడగమంటె అమీర్ నెంబర్ సంపాయించి మాట్లాడింది ముబీన్. ఆ ఆదివారం ఎల్లడానికి ఓకే అయింది.
ఆదివారంనాడు పొద్దున అనుకోకుంట హైదరాబాద్‌లనె ఉండే మహబూబ్ తమ్ముడు ఒచ్చిండు.. వీళ్ల ప్రోగ్రాం విని పొద్దుగూకాల తన పిల్లలతో సహా తీసుకొస్తనని వీళ్ల పిల్లల్ని తీస్కెల్లిండు. ఇగ పిల్లల గడ్‌బడ్ గుడ లేకుండేసరికి తమాషిగ తయారై ముగ్గురు పయనమైన్రు అమీర్ వాల్లింటికి.
ముబీన్‌కు ఫోన్‌ల అడ్రస్ చెప్పుకుంట రోడ్డు దంక వచ్చి నిలబడ్డడు అమీర్. ఇంకొద్దిసేపట్ల ఎదురు పడతడనంగనె జబీన్ గుండె ఊటగ కొట్టుకోబట్టింది. ఆటోల నించి అమీర్ కనపడంగనె లోకం మర్షినట్లయింది. సంబాళించుకుంది. మహబూబ్ ఒకపాలి జబీన్ దిక్కు సూషిండు. మహబూబ్ తనను గమనిస్తున్నట్లు సమజై అమీర్ మీంచి చూపు తిప్పుకుంది. కాని మనసు కల్లోలమైపోయింది. ‘అరె, సందమావ లెక్క ఉండెటోడు వట్టిచేప లెక్క తయారైండేంది’ అని నమ్మలేనట్లుగ ఫీలయింది. అంతదాంక మొఖంల ఎంత దాచుకుందామన్న దాగని కళ మాయమైపొయింది. అతడ్ని చూసిన్నన్న ఖుషి మాయమై దాని తలంల విచారం చోటుచేసుకున్నది. ఈలోపల మల్లొకసారి జబీన్ దిక్కు సూషిన మహబూబ్‌కు ఏం సమజ్‌కాలె. రాయిలెక్క కూసున్న జబీన్‌ను ‘జబీనా! ఉత్‌రో’ అంటూ జర కదిలించిండు. చమక్ తిన్నట్టు దునియాలోకొచ్చిపడి ఆటో దిగింది జబీన్. అప్పటికే దగ్గరకొచ్చిన అమీర్ మహబూబ్‌కు సలామ్ చేసి చేయి కలిపిండు. ‘వాలేకుం సలామ్’ అని చేయి కలుపుకుంట బలవంతంగ నవ్వు మొహం పెట్టిండు మహబూబ్. ముందే సలామ్ చేసిన ముబీన్ ‘కైసే హై అమీర్ భాయ్?’ అంటూ పలకరించింది. ‘సబ్ ఠీక్. దువా హై’ అన్నడు.
అమీర్‌కు సలామ్ చెప్పుకుంట అట్ల ఒక్క క్షణం కళ్ళెత్తి అతని దిక్కు సూషి కండ్లు దించుకుంది జబీన్. తన కండ్లల్ల తడి మెరుపు మహబూబ్ కంట్ల పడొద్దని జబీన్ కోషిష్. ‘వాలేకుమ్ సలాం’ చెప్పిండు చేయిలేపుకుంట అమీర్, గని గొంతు బైటికి రానేలేదు. సంబాళించుకుని ‘ఆయియే!’ అనుకుంట తమ ఇంటిదిక్కు దారి తీసిండు. అతని ఎనక మహబూబ్ ఆ వెనక అక్కచెల్లెళ్ళు నడిషిన్రు. సన్నని గల్లీలకు మల్లిండు అమీర్. గొంతు పెగలదేమోనన్న డౌట్‌తోటే ఏం పలకరింపులు లేకుంటనే నడుస్తున్నడు అమీర్.
‘కార్ చలాతె హై కతెనా ఆప్? జాతి? రెంటెండ్? (కార్ నడుపుతున్నరంట గదా మీరు. సొంతమా? వేరేవాళ్లదా?)’ అడిగిండు మహబూబ్.
‘నై.. దూస్‌రోంకి హై! ఓ యహీఁ రహెతే (లేదు.. వేరేవాళ్లది. ఆయన ఇక్కడే ఉంటారు) అన్నడు ఎనక్కి తల తిప్పి అమీర్.
‘అచ్ఛా’ అని ‘పంద్రా హజార్‌తోభి మిల్‌తీ తన్‌ఖా? (పదిహేనువేలన్నా దొరుకుతుందా జీతం?)’
‘నై భయ్! దస్ హజారీచ్ మిల్తీ, ఉప్పర్ భత్తా మిల్తానా.. (లేదన్నా! పది వేలే ఇస్తరు. పైన బత్తా దొరుకుతది కదా)’
‘అచ్ఛా!’
ఇంతల ఇల్లొచ్చింది. వీల్ల మాటలు వినుకుంట నడుస్తున్నది జబీన్. చూపంతా బొక్కలు తేలిన అమీర్ మీదనే ఉంది. అతని గొంతుల గుడ గరీబీ మజ్బూరి వింటున్నది జబీన్. ఎందుకో.. అస్సలు నమ్మశక్యంగ లేదు జబీన్‌కు. మనిషి గట్టిగ, మాట స్థిరంగ ఉండేది. బహుశా అబ్బాజాన్ చనిపోవడంతోటి ఇద్దరు చెల్లెండ్ల షాదీలు.. ఆ అప్పుల భారం కుంగదీసి ఉంటుంది అనుకుంది.
‘ఆయియే!’ అని పర్దా జరిపి లోపలికి పిలుస్తున్నడు అమీర్. చెప్పులు బైట ఇడవాల్న లోపల్నా అని మహబూబ్ ఎనకాముందాడుతుంటే ‘పర్వా నై.. అందర్ ఛోడో’ అంటున్నడు అమీర్. బైట మరీ గల్లీలకు తలుపు ఉండేసరికి లోపల్నే తలుపు పక్కకు చెప్పులు ఇడిషిండ్రు ముగ్గురు. కుర్సీలు రెండు వీల్ల కోసమని జరిపి కూసొమన్నడు అమీర్. అటుపక్కన గోడకు మసేరి మంచం ఉన్నది. తలుపుకటు పక్కన ఒక పాతబడ్డ పోర్టబుల్ టీవీ ఉన్నది. ఇటుదిక్కు ఒక అల్మారి, దాని పక్కన బట్టల దండెం. ఆ దండ్యానికి ముందు కుర్సీల జబీన్, అల్మారీ ముందేసిన కుర్సీల మహబూబ్, మంచం మీద ముబీన్ కూసున్నరు. ఆ చిన్న అర్ర ఔతలి దిక్కున్న తలుపుల్నుంచి లోపలికి పొయిండు అమీర్.
అంతల్నె బయటినుంచి పర్దా తోసుకుంట ఒక ఆరేడేళ్ళ పిల్ల, నాలుగేండ్ల పిలగాడు ఉరుకొచ్చిన్రు. ఝట్‌న ఈ ముగ్గురు కొత్తోల్లను సూషి ఆగిపొయిన్రు. తెల్లగ ముద్దుగున్నరు. కని ఇద్దరు గుడ ఎండు చేపల్లెక్కనే ఉన్నరు బక్కగ. ‘అమీర్ భాయ్ పిల్లలట్టుంది’ అన్నది ముబీన్. ‘ఇదర్ ఆవో. క్యా నామ్ తుమారా?’ అన్నది జబీన్ పిల్లల్ని దగ్గరికి పిలుచుకుంట. పెద్ద పిల్ల కదలి జబీన్ దగ్గరకు వస్తూ ‘సమీనా’ అన్నది. ఒళ్ళో కూసొబెట్టుకున్నది జబీన్. పిలగాడు మాత్రం పర్దా అంచు నోట్లె పెట్టుకుని అటూఇటూ ఊగుకుంట అట్లనే నిలబడ్డడు. అంతల అటునుంచి అమీర్ ఒచ్చి ఎనక ఒచ్చిన తన బేగమ్‌ను ములాఖత్ చేసిండు, ‘రుబీనా’ అనుకుంట. రుబీనా అందర్కి సలాం చేసింది. వీళ్ళు ప్రతిసలామ్ చేస్కుంట వచ్చి కూసొమన్నరు. ‘పర్వా నై’ అనుకుంట రుబీనా గనుమల్నె నిలబడ్డది. అమీర్ ఒచ్చి మంచం మీద అటు చివర కూసున్నడు.
కొద్దిసేపు నల్గొండల తమ ఇండ్లు పక్కపక్కన ఉన్నప్పటి సంగతులు యాది తెచ్చుకుంట మహబూబ్‌కు చెప్తున్నట్టుగ ముచ్చట పెట్టిన్రు ముబీన్, అమీర్, జబీన్‌లు. మహబూబ్ చూస్తలేడనుకున్న క్షణం జబీన్‌ని ఓ రెండుసార్లు మాత్రమె సూషిండు అమీర్.. ఇద్దరి కండ్లల్ల ఒక దర్ద్.. ఒక ఆరాధనా భావం…
‘గోల్కొండ రావడం ఎట్లయింది?’ అని ముబీన్ అమీర్‌ను అడిగింది.
‘కార్ ఇక్కడిది దొరికింది. ఓనర్ జర మంచోడు. ఇగ నౌకరీకి కొన్నాల్లు ధోకాలేదని గోల్కొండకొచ్చినం’ చెప్పిండు అమీర్. రుబీనా ఊరేదని కాసేపు ఆమెను పలకరించిన్రు.
అమీర్ మాట్లాడుతున్నప్పుడు అందరితో పాటు అతన్ని చూసుకుంట ఉండిపోతున్నది జబీన్. ముఖంపై కళ తప్పింది, బొక్కలు తేలినై, బట్టలు గూడా ఉన్నదాంట్ల మంచియి ఏసుకున్నట్లుంది కని అయిగుడ పాతబడ్డయి. పిల్లల బట్టలు గుడ అంత బాగలెవ్..
వాళ్ళ హాలతు అంతమంచిగ లేదని వీళ్ళు ముగ్గురికి సమజయింది. రుబీనా అందంగా ఉందిగని తను గుడ బక్కచిక్కి ఉంది. ఉన్నదాంట్ల జర మంచి చీర కట్టుకున్నట్లుంది. తల మీద కొంగు కప్పుకుని నిలబడ్డది. ఎంత కూసొమన్న కదల్లేదు. వాళ్ళ కొడుకు పర్దా వదిలి తల్లి కాడికి ఉరికి అల్లుకుపొయి నిలబడ్డడు. వాని చుట్టూ చేతులేసి ‘బేటా!’ అని పరిచయం చేసింది.
‘ఇదరావ్ బాబా!’ అనుకుంట మహబూబ్ మల్ల పిలిషిండు. వాడు రాలె. తల్లి కొంగు నోట్లో పెట్టుకోబోతే వారించి ‘జావ్’ అన్నది రుబీనా. వాడు కదల్లే. ఈలోపు సమీనా బైటికురకడంతోటి జబీన్ చేయిచాపి వాని రెట్ట పట్టుకుని దగ్గరికి తీసుకుని ముద్దుపెట్టుకుంట ఒళ్ళో కూసొబెట్టుకుంది.
‘ఏం చదువుతున్రు పిల్లలు?’ అడిగిండు మహబూబ్.
‘సమీనా రెండో తరగతి, వాడు ఇప్పుడిప్పుడే బడికి పోతున్నడు’ చెప్పిండు అమీర్, మల్ల తనె, ‘మీ పిల్లలు ఏం చదువుతున్నరు?’ అనడిగిండు.
‘బేటా ఫిఫ్త్ క్లాస్.. బేటీ థర్డ్ క్లాస్’ అన్నడు.
టైం రెండు కావడంతోని ‘అన్నం తీస్త’ అని లోపలికి పొయింది రుబీనా. ఎనకనె అమీర్ లేషి కాళ్లు చేతులు కడుక్కుందురు లెమ్మన్నడు. ఆడోళ్లిద్దరు లేషి లోపలికి పొయిన్రు. అమీర్ ఎనక మహబూబ్ కదిలిండు. ఆ అర్ర దాటంగనె చిన్న హమామ్. అందుల్నె లెట్రిన్ ఉన్నది. దాని ముందు నుంచి లోపలి అర్రలకు దారి ఉంది. లోపలిది వంట అర్ర. అవతలికి కిటికి ఉంది. ఆడోళ్లకు ఆ అర్ర సూపెడుతున్నది రుబీనా.
హమామ్‌లకు పోయి మొఖం కాళ్లు చేతులు కడుక్కొని ఒచ్చిండు మహబూబ్. ఆ ఎనక జబీన్, ముబీన్ గుడ కడుక్కొని ఒచ్చిన్రు. రుబీనా కింద సాప ఏసి దస్తర్‌ఖాన్ పరిషింది. చికెన్ బిర్యాని, టమాట శేర్వా, పెరుగు చారు తెచ్చి పెట్టింది. కూసొమన్నరు వీళ్లను. సూస్తె మూడు ప్లేట్లే ఉన్నై. ‘మీరు గుడ కూసోరి’ అన్నరు వీల్లు. ‘మేం తర్వాత తింటం. మీరు తినురి’ అన్నడు అమీర్. ‘అందరం కల్సి తిందం’ అన్నడు మహబూబ్. వాల్లు అస్సలు ఇనలె. సరెనని ఈల్లు ముగ్గురు కూసున్నరు. పిల్లలు ఇటు రాకుంట సూసుకున్నరట్లుంది వాల్లు. పిల్లలు రాలె. ‘మీరు వడ్డించురి’ అని బర్తతో చెప్పి లోపలికి పొయింది రుబీనా. అమీర్ ముందుకు రాబోతె మహబూబ్ వారించిండు. తాము ఏసుకుంటమని చెప్పి బిర్యాని ఏసుకున్నడు. ముక్కలు షానానే ఉన్నయ్. రెండే ఏసుకొని జబీన్ దిక్కు బిర్యాని ముష్కాబ్ జరిపిండు. ‘ఔర్ దాల్లో భాయ్!’ అంటున్నడు అమీర్. ‘బాద్‌మె దాల్లేంగే’ అన్నడు మహబూబ్. జబీన్ గూడ రెండు ముక్కలు ఏసుకొని ముష్కాబ్ చెల్లె దిక్కు జరిపింది. ముబీన్ గుడ అట్లనె చేసింది. అంతల్నె గడపలకు వచ్చిన రుబీనా ‘అరె, వాల్లు సరిగ ఏసుకుంటలేరు, మీరు ఎయ్యిరి’ అన్నది జర ఊటగ. ఇగ వీల్లు వద్దు వద్దంటున్నా అమీర్ వంగి బిర్యానిల నుంచి తలా కొన్ని చికెన్ ముక్కలు మల్ల ఏషిండు.
బిర్యాని మస్తు మజాగ ఉండటంతోని, ఉండలేక ‘బిర్యాని బహుత్ అచ్ఛీ హై.. అచ్ఛా బనాయె’ అన్నడు మహబూబ్. ‘హవ్! బహుత్ మజేదార్ హై! ఇత్నా అచ్ఛా బిర్యాని పకానా కాఁ సికే ఆపా?’ అన్నది రుబీనా దిక్కు సూషి ముబీన్. రుబీనా నవ్వుకుంట ‘హమారె అమ్మీ కె పాస్’ అన్నది.
‘ఇంకా ఏసుకొని తినురి, మీరు షర్మాయిస్తున్నరు’ అని నవ్వుకుంట లేషి లోపలికి పొయిండు అమీర్ రుబీనాను లోపలికి రమ్మని సైగ జేస్కుంట. రుబీనా గుడ లోపలికి పొయింది.
‘ముక్కలన్ని మనకే ఏషిన్రు భాయిజాన్! వీల్లేం తింటరు?’ అన్నది ముబీన్ నవ్వుకుంట.
‘అవును, చేసిన బిర్యాని అంతా మనకే తీసి పెట్టినట్లుంది. పిల్లలు, వీల్లు ఏం తింటరు. మనకు రెండ్రెండు ముక్కలు సాలు కదా.. వాళ్లు రాకముందే ఈ ముక్కలు బిర్యానిల ఏసేద్దామా?’ అన్నడు మహబూబ్.
తల ఊపింది జబీన్. ఎంటనె మంచి ముక్కలు తీసి ముగ్గురు గుడ జల్ది జల్ది బిర్యానిల ఏషిన్రు. ముబీన్ ఎనక్కి ఒకసారి వాల్లు వస్తలేరని సూస్కొని ఆ ముక్కల్ని గంటెతోని కిందికి అని, పైన అన్నం కప్పేసింది.
కాసేపటికి అమీర్ ఒచ్చి కుర్సీల కూసున్నడు. వీల్లు ముందు బిర్యాని, ఐటెంక కొద్దికొద్దిగ టమాట షేర్వాతోని తిని పెరుగు ఖట్టా ఏసుకుంటున్నరు. ‘ఇంకొద్దిగ బిర్యాని ఏసుకోన్రి. బిర్యాని ఒడువనె లేదు’ అంటున్నడు అమీర్.
‘బస్ బస్! బహుత్ ఖాలియే.. అచ్ఛా బనాయె బిర్యాని.. మస్త్ మజా హై’ అనుకుంట లేషిండు మహబూబ్..
‘ఆయియే’ అనుకుంట మల్ల లోపలికి దారి తీషిండు అమీర్. నీల్ల తొట్టిల జగ్గు ముంచి నీల్లు అందిచ్చిండు. కడుక్కొని లోపలికొచ్చిండు మహబూబ్. ఆడోల్లు గుడ కడుక్కొనొచ్చి కూసున్నరు.
రుబీనా ప్లేట్లు తీసుకుంట ‘చాయ్ పీతే?’ అని అడిగింది.
‘లేదు, ఇప్పుడేమొద్దు’ అన్నడు మహబూబ్. ‘ఆప్ భి ఖాలేనా థానా?’ అన్నడు మల్ల.
‘నై, హమ్ బాద్‌మె ఖాతె, అందర్ బచ్చోంకొ దేతిమ్’ అన్నది రుబీనా.
రాయి లెక్క కూసొని ఏందొ సోంచాయిస్తున్న అమీర్‌ను అదొ ఇదొ మాట్లాడిస్తున్నడు మహబూబ్. తేరుకొని జవాబ్‌లిస్తున్నడు అమీర్. అమీర్‌ను అట్లా చూస్తు ఉండిపొయింది జబీన్. అతన్ని చూస్తుంటె మనసంత డోక్కుపోతున్నది జబీన్‌కు. ముబీన్ లేషి లోపలికి పొయి రుబీనాతో మాట్లాడుతున్నది. కొద్దిసేపట్కి-
‘ఇగ పోతం’ అని లేషిండు మహబూబ్. దాంతొ ఎంటనె లేషింది జబీన్. లోపల్నుంచి ముబీన్ గుడ ఒచ్చింది. తాము జల్ది ఎల్తె వాల్లు గుడ తింటరనిపించింది ముగ్గురికి.
‘అప్పుడేనా! ఇయాల ఉండురి’ అన్నడు అమీర్ లేషి.
‘లేదు, ఎల్లాలె, పని ఉంది’ అన్నడు మహబూబ్, అస్సలు కుదరదన్నట్లు.
రెట్టించలేదు అమీర్, ‘రుబీనాను పిలుస్త’ అని లోపలికి ఎల్లిండు.
మహబూబ్ జల్ది జేబుల్నుంచి పైసలు తీసి ఐదు వందల నోట్లు నాలుగు జబీన్ చేతిల పెట్టి ‘రుబీనా చేతిల పెట్టు.. పాపం, షానా పరేషాన్ కనబడుతున్నరు’ అన్నడు.
ఇబ్బందిగ అనిపించింది జబీన్‌కు..
రుబీనాను పిలిషి మల్ల ఒచ్చిండు అమీర్, ‘ఒస్తున్నది’ అన్నడు.
ఎంటనె లోపల్కి పొయింది జబీన్. పిల్లలిద్దరికి అన్నం పెడుతున్నది రుబీనా. జబీన్‌ను చూసి,
‘అయ్యొ! అప్పుడే పోవడమేంది ఆపా! చాయ్ గిట్ల తాగి పోదురు ఉండురి’ అన్నది.
ఆమె తనను ‘ఆపా’ అనడంతోని ఆమెకు తమ ప్రేమ గురించి తెలుసని సమజైంది జబీన్‌కు.
‘లేదు, ఎల్తం ఆపా! ఇంటికాడ పిల్లల్ని తీస్కొని మా మర్దివాల్లు ఒస్తరు’ అన్నది తను గుడ ‘ఆపా’ అనే పిలుస్తు.
‘పిల్లల్ని గుడ తీసుకొస్తె మంచిగుండు గదా ఆపా!’ అన్నది రుబీనా.
‘ఇగ ఆల్లు లేకుండె కదా.. అందుకె తేలేదాపా..’ అనుకుంట దగ్గర్కిపొయి చేతిల మడిషి ఉన్న నోట్లు రుబీనా చేతిల పెట్టింది, ‘దేనికన్న పనికొస్తయ్, ఉంచురి’ అని ఆత్మీయంగ అనుకుంట.
‘అయ్యొ.. వద్దు.. వద్దాపా! పైసలెందుకు..’ అని తిరిగి ఇచ్చెయ్యబొయింది రుబీనా.
‘ఆపా! రఖియే! పరవానై’ అన్నది రెండు చేతులు పట్టేసి జబీన్.
‘అమ్మో.. వద్దాపా! ఆయన కోప్పడతడు. అస్సలొద్దు.. ఆయనకిట్లాంటివి ఇష్టముండవు..’ రుబీనా మొఖంలో నవ్వు మాయమైంది..
జర ఇబ్బందిగ అనిపించినా జబీన్ మనసు ఖుష్షయింది. సరే ననుకుంట పైసలు తీసేసుకొని ప్రేమగా అలాయ్‌బలాయ్ ఇచ్చింది రుబీనాకు. మల్ల రుబీనా మొఖంల నవ్వు అలుముకుంది.
పైసలు తీసుకోనందుకు జబీన్ ఏమన్నా ఫీలయిందేమోనని, ‘మేం గుడ ఒకసారి మీ ఇంటికొస్తంలే ఆపా! ఇక్కడికి దగ్గర్నే అన్నరు గదా!’ అన్నది.
ఏమనాలో తోయలేదు జబీన్‌కు. క్షణాల్ల సోంచాయించింది-
‘లేదు ఆపా! మేం ఇల్లు మారబోతున్నం. ఎటు ఎల్తమో ఏమొ.. మల్ల చెప్తం లే ఆపా..!’ అన్నది, ఇల్లు మారే ఉద్దేశం లేకున్నా!
http://magazine.saarangabooks.com/…/%E0%B0%85%E0%B0%A8%E0…/…