Saturday, 7 March 2015

ఖబర్ (katha)


http://namasthetelangaana.com/sunday/%E0%B0%96%E0%B0%AC%E0%B0%B0%E0%B1%8D-10-9-470734.aspx#.VPrerHyUdOI
విమానమెక్కి కూసున్నడు సలీమ్. ఐదేండ్లయింది ఇంటికి పోక. ఇన్నాళ్లకు పోతున్నందుకు ఒకటె ఆత్రంగా ఉంది, ఎప్పుడు పోయి ఇండియల నల్గొండల వాలతనా.. ఎప్పుడు తన పిల్లలను ఎత్తుకుంటనా.. ఎప్పుడు కరీమాను హత్తుకుపోయి మైమరచిపోతనా.. అని ఒకటె తొందర. జల్ది.
విమానం కదిలే టైంకె కదులుతది గని.. తను ముందుగాల్నె వొచ్చి కూసున్నట్టనిపించబట్టింది. ఎయిర్ హోస్టెస్ ఏం కావాల్నని అడుగుతున్నది. ఆమె మాటలు ఏమీ ఎక్కడం లేదు. మనసంత తమ ఇల్లే నిండిపొయింది. తను పుట్టి పెరిగిన ఇల్లు.. అమ్మీ అబ్బాల (అమ్మా నాన్న)ల యాదిగ మిగిలిన ఒకే ఒక్క ఆస్తి. గుర్తొచ్చినప్పటి నుంచి ఎప్పుడు గుడ ఆ ఇల్లు వదిలి ఇన్నాళ్లుండ లేదు. ఆ యింటిని సూడక ఒకటి కాదు, రెండు కాదు ఐదేండ్లు!

ఇయాల తన కండ్ల ముందే అమ్మీ అబ్బాలు ఎల్లిపొయిన్రు.. వాళ్ల జిందగీ అంతా కష్టాలే.. ఏ సుఖం అందించలేక పోయిండు తను. కనీసం వాళ్ల సమాధులనన్నా బాగు చెయ్యలేక పోయిండు..!
తన భార్య కరీమా ఎదురు చూస్తుంటుంది.. ఈ రాత్రి ఎప్పుడు గడుస్తుందా? తనను ఎప్పుడు చూస్తానా? అని. ఎన్నిసార్లు ఏడ్చిందో ఫోన్‌లో.. చూడాలని ఉందని..!
జీ! ఛోటూ చల్తా హై! సోఫియా స్కూల్ జాతీ హై! (అండీ! ఛోటూ నడుస్తున్నడు! సోఫియా స్కూల్‌కు పోతున్నది!) అంటే అప్పట్లో వాళ్లను ఊహించుకోలేక ఎంతగా తల్లడిల్లి పోయేటోడో తను..
తను వచ్చేటప్పుడు సోఫియాకు ఏడాదిన్నర. ఛోటూ కడుపుల పడ్డడు. వాన్నయితె తనింత దాంక సూడనే లేదు. సూడలేదని ఎవరికన్న చెప్పుకోవాలంటె నామోషి గుంటది. ఫోన్‌ల వాడి గొంతు వినడం ఒక్కటె తెలుసు. వాళ్లమ్మ ఫోన్ వాని చెవి కాడ పెడితె, తను పలకరిస్తుంటె వాడు చెవులు రిక్కించి వింటున్నట్లు అనిపిస్తుంది. ఒక్కసారన్నా సూడనోడు తననెట్ల ఊహించుకొని ఊఁ కొట్టగలడు? తామిద్దరి ఆరాటం కాకపోతె..!?

రంజాన్‌కె పోవాల్నని షానా కోషిష్ చేసిండు. అస్సలు కాలె. బక్రీద్ కన్నా పోవాల్నని ఎంతగనమో ట్రై చేస్తే ఆఖరికి బక్రీద్ రెండ్రోజుల ముందనంగ దొరికింది ఛుట్టీ. అంటె ఇంటికి చేరుకున్న దినం కాక తర్వాతి రోజు బడోంకి ఈద్ (పెద్దల పండుగ). ఆ తర్వాతి రోజు ఈద్ ఉల్ జుహా (బక్రీద్). ఈపాలి మంచి మేకపోతును ఖుర్బానీ ఇవ్వాలనుకుండు. పైస పైస జమ చేసి పెట్టుకుండు. ఇగ పొయ్యేదే కద అని ఇంటికి పైసలు పంపలె. దాంతోటి షాపింగ్ చెయ్యమనో.. ఖుర్బానీ ఇవ్వాల్సి ఉంటదనో చెప్తానికి కుదరలె. ఇప్పుడయన్ని ఎట్ల కుదుర్తయ్? నాలుగైదు రోజులన్న ముందుగాల పోతె ఏదో ఒక అంగడికి పొయ్ మేకపోతును తెస్తానికి కుదిరేది. ఇప్పుడు కష్టం. ఎవర్తోనన్న పెద్దదాన్లనె పొత్తు కలిస్తే పాలె అనుకుండు.
వారం రోజుల ముందుగాల పోతె కొన్ని జరూరు పనులు చేయాలనుకుండు తను. ముఖ్యంగ అమ్మీ అబ్బాల సమాధులు బాగు చేయించాలనుకుండు. దుబాయ్ పోకముందు చేతిల పైసలెక్కడియి. ఇంకో రెండు రోజులకు పోతడనంగ ఖబ్రస్తాన్ పోయిండు. అయాల జుమ్మా. నమాజ్‌కు పొయ్యి, యాదుంచుకొని ఖబ్రస్తాన్ పోయి అమ్మీ అబ్బాల సమాధుల్ని చూసుకుండు. 

పోతుపోతూ తీస్కపొయిన పూలు చల్లి దువా చదివిండు. ఆ సమాధుల్ని చూస్తే షానా బాధేసింది. మట్టి సమాధులు. కనీసం చుట్టు రాళ్ల కడీలన్న కట్టించలేకపొయిండు తను. సమాధుల మీద మొలిచిన గడ్డిపోసల్ని ఒకటి రెండు పిచ్చి చెట్లని పీకేసి వర్షానికి తేలిన రాళ్లని చేత్తో ఊకినట్లుగ పక్కలకు జరిపి అక్కడక్కడ ఏ పశువులో తొక్కితే ఏర్పడిన గుంటల్లాంటి వాటిని మట్టితోని సరిచేసిండు. ఇయన్నీ చేస్తుంటె ఎందుకనో గుండె బరువెక్కింది. కండ్లల్ల నీల్లు ఉబికినయ్. గరీబీ మనసునెంత కష్టపెడుతుంటదో.. ఆ నిస్సహాయత నిలువనీయనిది.. అట్లని ఏం చెయ్యలేం.. ఎవరిని నిందించాలో తెలియదు.. అది తెలియకనె తమని తాము నిందించుకుంటూ శాపనార్థాలు పెట్టుకుంటూ దునియాఁ విడిచిపోయిన్రు అమ్మీ అబ్బా.. అమ్మీ ఉంటే ఇప్పటికైనా తనను దుబాయ్‌కి పోనిచ్చేదా.. ఉఁహుఁ..! తనే ఈ చితికిన బతుకును ఎన్నాళ్లు లాగుతామని.. ధైర్యం చేసిండు. అబ్బాకు ఆపాటి ధైర్యం గుడ లేకుండె. ఈపాటి అవకాశం గుడ రాకపొయ్యేది.. అనుకుంట మోకాళ్ల మీద కూసొని ఇద్దరి సమాధుల మీద సిజ్దా చేసిండు (మోకరిల్లిండు). కండ్లు మూసుకొని తల ఆన్చిన ఆ మట్టి వాసనని గుండెల నిండా పీల్చుకున్నడు.. మిమ్మల్ని ఇడిషి షానా దూరం ఎల్తున్ననని దువా ఇవ్వమని అమ్మీ అబ్బాల్ని కోరుకుండు. అక్కడ్నుంచి వచ్చినంక చుట్టు రాళ్ల కడీలు కట్టించి, శిలా ఫలకాలు కూడా చేయిస్తనని చెప్పుకుండు.. లేషి సమాధుల్ని కంటి నిండా చూసుకుని.. వెనక్కి తిరిగి మల్ల మల్ల చూసుకుంట ఇంటికి బయల్దేరిండు..
విమానం టేకాఫ్ అయింది. 

ఊటగ తన ఊరి దిక్కు పక్షి లెక్క ఎగిరిపోతున్న ఫీలింగ్.. జల్ది ఎగిరిపొయ్యి కరీమా కాడ.. పిల్లల కాడ వాలాల్నని ఎంత ఆత్రంగ ఉందో..! పక్కన తెల్లని గడ్డపాయన తస్బీ (జపమాల) చదువుకుంట, పెదవులు మాత్రమె కదిలించుకుంట అల్లా స్మరణ చేస్తున్నడు. పలకరిద్దామన్నా పలికేటట్లు లేడు. ఆయన్ని చూస్తే తన తాత గుర్తొస్తున్నడు.. తాత లెక్కనె ఉంటది తన చెల్లె రిజ్వానా. రిజ్వానాకు తనంటె ఎంత పానమో.. ఫోన్లో బోరున ఏడ్చే తన గొంతే యాదికొస్తుంటది.. తామిద్దరు చెల్లెండ్ల షాదీలు చెయ్యడానికేగా భయ్యా ఇన్నేండ్లు బీవీ బచ్చేలకు దూరంగ ఉండాల్సొచ్చిందని తనకు ఒకటె దుఃఖం.. రిజ్వానా షాదీ చేసే పొవాల్నని తయారై వస్తున్నడిప్పుడు తను. కష్టంగ నెల రోజుల ఛుట్టీ దొరికింది. బక్రీద్ అయిపోంగనె పిలగాని కోసం దెవులాడాలె.. ఎట్లన్న రిజ్వానాను జర మంచిగ చూసుకునేటోన్ని సూడాలె. ఎట్లనో ఏమో..

మొత్తానికి శంషాబాద్ ఎయిర్‌పోర్టుల దిగి బయటికొచ్చి తక్వల ఒక కారు మాట్లాడుకుండు సలీమ్. ఇంటికి ఫోన్ చేద్దామా అని ఎనకా ముందాడిండు. బూత్‌కు పొయి చెయ్యాలె.. లగేజీతోటి కొద్దిగ కష్టమె అనిపించి ఊకున్నడు. పెద్ద బ్యాగులు కారు పైన కట్టించి కార్ల కూసొని జరంత రిలీఫ్‌గ ఫీలయ్యిండు. 
నల్గొండకు 2 గంటల సఫర్. ఇంకా 2 గంటల దాంక కరీమాను, పిల్లల్ని, చెల్లెండ్లను సూడకుంట ఉండడం మనసుకు షానా కష్టంగ ఉంది. అసలు వాళ్లను ఎయిర్‌పోర్టుకు రమ్మంటె పొయ్యేదనిపించింది. మల్ల సంభాళించుకుని కండ్లు మూసుకుండు. పైస పైస ఎంతో విలువైంది ఇప్పుడు. రిజ్వానా షాదీ అయ్యేదాంక షానా జాగ్రత్త చెయ్యాలె. అందుకె వాళ్లు వొస్తమన్నా వొద్దన్నడు తను. అంతకైతే మల్ల పొయ్యేటప్పుడు అందర్తోటి కలిసి ఎయిర్‌పోర్టుకి రావొచ్చు. షాన్నాళ్లకు తన వాళ్లను సూడబోతున్నానన్న ఆత్రం కన్ను మలగనిస్తలేదు.. ఒకటె జల్ది.. ఒకటె ఆలోచనలు..

డబల్ రోడ్డు పడడం గమనించిండు సలీమ్. గంటన్నరల్నె నల్గొండలకు ఎంటరయ్యింది కారు. ఆత్రంగ లతీఫ్‌సాబ్ గుట్టను సూసుకుండు. ఆ గుట్టతోటి ఎంతటి దగ్గరితనమో.. అదేదో తమ ఇంట్లో భాగమైనట్లు ఏదో అనుబంధం దానితో.. నల్గొండ టౌను పరిసరాల్ని సూస్కుంట పెద్ద గడియారం సెంటర్‌ని తడుముకుని సూస్కున్నడు. పెద్ద గడియారం చిన్నబోయినట్లు అనిపించింది.. చుట్టంత పెద్ద పెద్ద విగ్రహాలు, తెలంగాణ అమరవీరుల స్థూపం.. వాటి మధ్య దశాబ్దాల నాటి ఒంటి స్తంభపు గడియారం.. అరె, తనిప్పుడు తెలంగాణ రాష్ట్రంల ఉండు కదా అనిపించి తృప్తిగా నవ్వుకున్నడు సలీమ్.
ఎటు పోవాల్నో డ్రైవర్‌కు డైరెక్టు చేస్తున్నడు సలీమ్. పావు గంటల ఇంటి ముందల కారు ఆగింది. కారు సప్పుడుకు ఉరికొచ్చిన్రు తలుపుదాంక కరీమా, చెల్లెండ్లిద్దరు.. సలీమ్ కారు దిగి ఇంట్లకు ఉరికినంత పని చేసిండు. ఒక్కపాలిగ తనను అల్లుకుపొయ్యి పెద్ద పెట్టున బోరుబోరున ఏడుస్తున్నరు ముగ్గురూ.. తనక్కూడా దుఃఖం ఆగలేదు.. తను గూడ బైటికే ఏడ్చేస్తున్నడు.. ఆ ముగ్గురి తలల మీద చేతుల్తో తడుముకుంట, ముద్దు పెట్టుకుంట ఏడుస్తున్నడు.. సుట్టుపక్కల ఇండ్లోల్లు, ముగ్గురు నలుగురు ఆడోళ్లు వొచ్చి ఓదార్చిందాంక ఏడుస్తనె ఉన్రు.. 

పండుకొనున్న కొడుకును కండ్లు ధారలు కడుతుండంగ తడిమి చూసుకుండు సలీమ్.. బిడ్డను స్కూల్‌కు పంపలేదంట, తను వస్తుండని. ఆ పిల్లను ఎత్తుకుని ముద్దు పెట్టుకుండు సలీమ్.. దిగి తల్లి కాడికి ఉరికింది.. మౌనంగ పరేశాన్‌గ సూస్తున్నది. తల్లి పప్పా (నాయ్న) అని చెప్తున్నది గాని, చూసిన యాది వచ్చే అవకాశం లేదు. మల్ల దగ్గర్కి వస్తలేదు. తల్లిని సుట్టుకుపోతున్నది. తన బిడ్డే తనను గుర్తు పట్టకుండ దూరంగ ఉండడం సలీమ్ మనసుకు గోసగ అనిపించింది. ఫోన్‌ల గొంతు వినడమే తప్ప ఏడాదిన్నరప్పుడు సూశిన యాది యాడుంటది..
తర్వాత సంభాళించుకొని బైటికొచ్చిండు సలీమ్. డ్రైవర్ లగేజీ విప్పి అందిస్తుంటె ఇంట్ల పెట్టిండు..
ఉండబట్టలేక కొడుకును లేపింది కరీమా. నిద్ర మత్తు వదలగొడుతు పప్పా.. పప్పా అని సలీమ్‌ని చూపెట్టుకుంట సలీమ్ దగ్గర్కి పొమ్మంటున్నది. వాడు బెదురుగ చూస్కుంట వస్తలేడు.. సలీమ్ తీస్కోబోతె తల్లిని గట్టిగ అల్లుకుపొయిండు.. హే.. ఛోటూ.. మెరే పాస్ ఆవో.. మైఁ పప్పా..! (.. నా కాడికి రా.. నేను నాయ్నని..!) అని చేతులు సాపుకుంట, అవే మాటల్ని మల్ల మల్లా అనుకుంట కొడుకు సుట్టు తిరుగుతున్నడు సలీమ్. వాడు ఎంతకు వచ్చేటట్లు లేడు.. వినేటట్లు లేడు..

తెల్లారి తను తోడుండి భార్యా పిల్లలకు, చెల్లెండ్లకు షాపింగ్ చేయించిండు సలీమ్. అందరికి కొత్త బట్టలు తీసుకుండు. తను గుడ ఒక జత బట్టలు తీసుకుండు. గల్లీలున్న ఖాజా భాయ్ వొచ్చి ఖుర్బానీ ఇవ్వడానికి పొత్తు కలుస్తవా అని అడిగిండు సలీమ్‌ను. ఒక పాలుకు సంతోషంగ ఒప్పుకున్నడు సలీమ్. అనుకున్న ఒక్క పని మాత్రం మిగిలిపొయింది అని మనసుల మెసలబట్టింది. అమ్మీ అబ్బాల సమాధుల చుట్టూ రాళ్ల కడీలు వేయించి బాగు చెయ్యడం.. కాని, ఆ పని ఒక్క రోజుల కాదులె అనుకొని ఊకుండు.
పొద్దుగూకితె బడోంకి ఈద్. అమ్మీ ఉండంగ చేసే హడావుడి గుర్తొచ్చింది. ఏం చెయ్యాల్నో తోచలె. కరీమాను, చెల్లెండ్లను కదిలించిండు. వాళ్లు పెద్దల పండుగ చెయ్యాలె కదా అనే అన్నరు. తనే కొద్దిసేపు ఎటూ తేల్చుకోలేక పొయిండు. దుబాయ్‌ల ఇసొంటి పండుగలు చెయ్యకపోడం ఐదేండ్ల నుంచి చూసిండు. కాని ఇక్కడి నమ్మకాలు వేరు. మరెట్ల.. తను అక్కడి తెలివితోటి వద్దంటె ఇక్కడ వీళ్ల మనసులు బాధ పడ్తయేమో ననిపించింది. సుట్టుపక్కల ఈ పండుగను చేస్తున్నరా అని తెల్సుకున్నడు. కొత్త తరం షానామంది చేస్తలేరని, అప్పటి పెద్దోల్లు కొందరు మాత్రం చేస్తున్నరని చెప్పిన్రు వాళ్లు. అమ్మా నాయ్‌న ఉన్నప్పుడు చేసేది కదా.. మనం కూడా చేద్దాం, పైన వాళ్లు సంతోషిస్తరన్నది చెల్లెండ్ల మనసులోని మాట. సరేనని మార్కెట్‌కు పోయి కిలో మేక మటన్, ఆనకాయ, హరా మసాలా వగైరా తెచ్చిచ్చిండు. కరీమా, చెల్లెండ్లు కలిసి బగారా అన్నం, మటన్ వండిన్రు. దాల్చా చేసిన్రు.

అన్నీ అయినంక బగారా అన్నం, మటన్ కూర పేట్లల్ల తీసి ఇంట్ల ఖిబ్లా దిక్కు (మక్కా ఉన్న దిక్కు) పెట్టిన్రు. ఒక గిన్నెలో నిప్పు రాజేసి ఊద్ (సాంబ్రాణీ) పొడి పక్కన పెట్టిన్రు. సలీమ్ స్నానం చేసి లాల్చీ పైజమా వేసుకొని వచ్చి ఫాతెహా ఇవ్వడానికి దువా యాద్ చేసుకున్నడు. తలకు టోపీ పెట్టుకొని ఫాతెహా ఇచ్చిండు. ఇచ్చి అబ్బా పేరు మీద, అమ్మీ పేరు మీద, అబ్బా వైపు అందరి పేరుమీద నిప్పులమీద ఊద్ వేసుకుంట దువా చేసిండు. ఇల్లంత ఊద్ పొగ నిండి పెద్దల మీద తెలియని ఏదో ఆరాధనా భావం నిండినట్లు అనిపించబట్టింది. వరుసగా సలీమ్ చెల్లెండ్లు, కరీమా తలనిండా కొంగులు కప్పుకొని ఊద్ వేసిన్రు. పిల్లల చేత గూడా పెద్దల వరుసలతో పేర్లు పలికించుకుంట వేయించిన్రు.

అయాల బక్రీద్. రంజాన్ నమాజ్‌కు కొద్దిగ టైముంటది గాని బక్రీద్ నమాజ్ జర జల్ది అయితది. ఖుర్బానీలు ఇచ్చుకోవాల్సి ఉంటది కాబట్టి నమాజ్ తొమ్మిదిన్నరకే ఉంటుందని ఇమామ్ సాబ్ ప్రకటించిండట. పొద్దున్నె లేషి హడావుడిగా అందరూ తయారవుతున్నరు. ఒకరి తర్వాత ఒకరు స్నానాలు చేస్తున్నరు. సలీమ్ పోయి చికెన్ వగైరా తెచ్చి ఇచ్చి, ముందుగాల స్నానం చేసి కొత్త బట్టలు తొడుక్కుని ఇతర్ (అత్తరు) పూసుకొని, చిన్న దూది ఉండలు చేసి ఇతర్‌తోటి కొంచెం తడిపి చెవుల్లో పెట్టుకున్నడు. కండ్లకు సుర్మా పెట్టుకున్నడు. ఈ లోపల కరీమా బిడ్డను తయారు చేసింది. ఒకరోజు గడవడంతోని తండ్రి సుట్టు పప్పా! అదేంటి? పప్పా! ఇదేంటి? అని అడుగుతూ తిరగబట్టింది సోఫియా. పక్కింటి చిన్ననాటి దోస్తు రాజును రాత్రే బైక్ అడిగి పెట్టుకుండు సలీమ్. దానిమీద సోఫియాను కూసొ బెట్టుకొని ఈద్గాకు బయల్దేరిండు. ఆడోల్లు వీళ్లకు టాటా చెప్పి వంట పనులల్ల పడిపోయిన్రు. మగవాల్లు ఈద్గా నుంచి వచ్చే లోపల తాము గూడ ఈద్ నమాజ్ చదువుకొని రెడీగ ఉంటరు ఈద్ కలవడానికి.

ఈద్గాకు పోతుంటె సోఫియా అడుగుతున్నది, నమాజ్ అయినంక మనం ఎక్కడెక్కడికి పోతం పప్పా? అని.
ఇయాల నీకు నీ దాదా, దాదీ (తాత, నాయనమ్మ)ల సమాధులు చూపెడతా.. నమాజ్ అయినంక ముందుగాల మనం అక్కడికే పోతం.. అని చెప్పి, అక్కడ దువా చేసి, తర్వాత దగ్గరి సుట్టాలు ఫలనా ఫలానా వాళ్ల ఇండ్లకు పోతమని, ఆ తరువాత ఇంటికి పోతమని చెప్పిండు సలీమ్. ఇంకా అదో ఇదో అడుగుతనే ఉంది సోఫియా. ఓపిగ్గా జవాబ్‌లు చెప్పుకుంట ఈద్గా చేరుకున్నడు. బండి స్టాండ్‌లో పెట్టి, చెప్పులు విడవమని బతిలాడుతున్న ఒక ఫకీరు కాడ చెప్పులు ఇడిషి ఈద్గా ప్రాంగణంలకు పోయి జానిమాజ్ మీద కూసున్నడు. సోఫియాను పక్కన కూసోబెట్టుకుండు. ఇమామ్ సాబ్ అప్పటికి ఈద్గా బాగోగుల గురించి, సమాజంలోని మార్పుల గురించి చెప్తున్నడు..

గంటలో నమాజ్, తఖ్రీర్, దువా అయిపోయింది. ఈలోపు సోఫియా ఈద్గా గోడ కాడ తనలాంటి కొత్త దోస్తుల్ని వెతుక్కొని ముచ్చట పెడుతున్నది. అందరితో పాటు సలీమ్ లేషి చుట్టు సూషిండు. ఒకలిద్దరు సుట్టాలు, ఇద్దరు ముగ్గురు తమ బస్తీవాల్లు కలిసిన్రు. ఈద్ ముబారక్ చెప్పి అలాయి బలాయి తీసుకున్నడు. సోఫియాను తీస్కొని ఈద్గా బయటికి నడిషిండు. దారిలో బాబా! ఖైరాత్ దో! (అయ్యా! దానం చెయ్యండి) అని అరుస్తున్న ఫకీర్లకు సోఫియాతో పైసలు వేయించుకుంట ఈద్గా బైటికి నడిషిండు. బండి తీసి సోఫియాను కూసొ బెట్టుకొని స్టార్ట్ చేసి పోనిచ్చిండు.
సోఫియా మల్ల అడగబట్టింది, పప్పా! మనం ఇప్పుడు ఎక్కడికి పోతున్నం పప్పా? అని.
దాదా, దాదీల సమాధుల దగ్గరికి రా అంటున్నడు సలీమ్.
మరి, దాదా, దాదీల కాడికి మమ్మీ ఎప్పుడు తీసుకుపోలేదు కదా నన్ను? అని అడిగింది సోఫియా.
ఏం చెప్పాల్నొ కాసేపు సమజ్ కాలే సలీమ్‌కు. ఖబ్రస్తాన్‌కు ఆడవాళ్లు పోకూడదు బేటా అన్నడు.
మరి నేను కూడ ఆడపిల్లనే కదా అన్నది.
నువ్వు చిన్నపిల్లవి కదా.. ఏం కాదు అని సమ్జాయించిండు.
ఊఁ! అన్నది, ఏదో సమజైనట్లు సోఫియా.
మధ్యల ఆపి విడిపూలు కొన్నడు సలీమ్. ఎందుకని అడిగింది సోఫియా. సమాధుల మీద చల్లాల్సి ఉంటుందని, మనకోసం దాదా, దాదీలు ఎదురుచూస్తుంటరని చెప్పిండు. సోఫియా దాదా, దాదీలను, వారి సమాధులను ఊహించుకోబట్టింది. ఆ పిల్లలో ఆత్రం మొదలయింది, జల్ది ఖబ్రస్థాన్ పోవాల్నని. ఆ ముచ్చటే పెడుతున్నది.

మధ్యలో సుట్టాలు కనిపించి బండి ఆపి అలాయి బలాయి తీసుకున్నడు సలీమ్. వాళ్లు, ఎప్పుడు వచ్చినవంటూ, ఇంకా అదో ఇదో మాట్లాడిస్తుంటె కాసేపు నిలబడ్డడు. సోఫియా, పప్పా! పోదాం.. దాదా, దాదీల కాడికి పోదామన్నవు కదా.. అన్నది.. సుట్టాల వాళ్లు నవ్వి సోఫియాను ముద్దు పెట్టుకొని, తాము గూడా ఖుర్బానీ ఇస్తానికి జల్ది పోవాల్సి ఉందని చెప్పి ఎల్లిపోయిన్రు.
సలీమ్ బండి స్టార్ చేసి పోనిచ్చిండు. ఖబ్రస్థాన్ ముందు బండి ఆపి, సోఫియాను దించి బండి స్టాండ్ ఏసి, పూల కవర్ తీస్కొని సోఫియాకు చిటికెన వేలు అందించి ఖబ్రస్థాన్‌లకు నడిషిండు. లోపల సమాధుల దగ్గరంతా షానామంది వారి వారి పెద్దల సమాధులపై పూలు చల్లుకుంట, దువాలు చదువుకుంట ఉన్నరు. నడిచేదారి అయిపోవడంతోటి సోఫియాను ఎత్తుకొని ఎడమ దిక్కు సమాధుల మధ్యలున్న సన్నని దారుల్లనుంచి తమ అమ్మా నాన్న సమాధులున్న చోటుకు పోతున్నడు సలీమ్.

దాదా, దాదీ సమాధులు ఎక్కడ ఉన్నయ్? అని సోఫియా అడుగుతున్నది. ఇక్కడ్నే.. జర దూరంలో అని చెప్పుకుంట వారి సమాధులున్న చోటు అని గుర్తున్న చోటుకు వచ్చి ఆగిపొయిండు. అక్కడ తాను దుబాయ్ పొయ్యేటప్పుడు చూసిన సమాధులు కనిపించడం లేదు. ఆ చోటంతా చుట్టూ కడీలు కట్టి ఉన్న సమాధులే కనిపిస్తున్నయ్. తాను కన్‌ఫ్యూజ్ అయినట్లు అనిపించి, అటు దిక్కు, ఇటు దిక్కు నడిషి చూసిండు. ఎటు తిరిగినా అవేవీ తమ అమ్మా నాన్నల సమాధుల్లెక్క కనిపించలేదు. అట్లా పావుగంట ఎతుక్కున్నడు. కనిపిస్తలెవ్. చెమటలు పట్టినయ్ సలీమ్‌కు. ఏం చెయ్యాల్నో సమజ్ కాలేదు. చుట్టూ చూసిండు. ఖబ్రస్థాన్ ఒక మూలన ఒక గుడిసె కనిపించింది. సమాధులు తవ్వేవాళ్లు ఎవరైనా అక్కడ ఉన్నరేమోనని అటు బయల్దేరిండు.
క్యా హువా పప్పా? దాదా, దాదీల సమాధులు ఎక్కడున్నయ్? అడుగుతున్నది సోఫియా. జర ఆగు తల్లీ అనుకుంట గుడిసెను చేరుకుండు.
ఎవరున్నరు లోపల?
కౌన్ హై? క్యా హోనా? (ఎవరు? ఏం కావాలె?) అనుకుంట బయటికొచ్చిండు ఒక పెద్దాయన. ఆయన గుడ అప్పుడె ఈద్గా నుంచి వొస్తున్నట్లుంది.. లాల్చీ, లుంగీ మీద ఉన్నడు.
విషయం వివరించిండు సలీమ్. మా అమ్మీ అబ్బాల సమాధులు కనిపిస్తలెవ్ అన్నడు.
సూడు బాబా! అక్కడే ఎక్కడో ఉండి ఉంటయ్ అన్నడు ఆ పెద్దాయన.

కనిపిస్తలెవ్.. షానాసేపటి నుంచి వెతుకుతున్న.. రెండు మట్టి సమాధులు.. పక్కపక్కనె ఉండె.. మా అమ్మీ అబ్బాలవి.. అంటుంటె సలీమ్ గొంతు ఒనికింది.
ఎటు దిక్కు ఉండె!? అని అడిగిండు పెద్దాయన. చెయ్యెత్తి వేలితోటి సూపెట్టిండు సలీమ్.
ఎన్నేండ్లాయె మీరు ఖబ్రస్థాన్ వొచ్చి చూసుకోక? అడిగిండు.
ఐదేండ్లయింది.
అవునా.. అని తలవొంచుకొని ఆలోచించుకుంట ఏమో నాయనా.. నాకైతె తెలియదు.. మల్లొకసారి సూడు.. అన్నడు సలీమ్ దిక్కు సూడకుంట.
సలీమ్‌కు అనుమానమొచ్చింది ఈ పెద్దమనిషి అబద్ధం చెప్తున్నడు అని.
సూడు పెద్దాయనా! పండుగ రోజు అబద్దం చెప్పొద్దు.. ఏమయినయో చెప్పు? అడిగిండు దీనంగ.
అయ్యో! అబద్ధ మెందుకు చెప్తనయా.. రోజు రోజు సచ్చేటోల్లు ఎక్కువవుతుంటిరి. ఖబ్రస్థాన్ మాత్రం పెరుగుత లేదాయె.. పైంగ ఖబ్జాలు పెట్టి సుట్టు మూసుకొస్తున్నరాయె.. వందలు వేల గజాలు సంపాయించుకుంటున్నోల్లకు పేదోల్లకు ఆరారు గజాల జాగ వదుల్తానికి పానం దరిస్తలేదు. దేని దేనికోస్రమో కొట్లాడుతుంటరు, కాలం చేసినోల్లను పూడ్చి పెడ్తానికి గింత జాగ కావాల్నని మాత్రం ఎవలూ గడ్‌బడ్ చేస్తలేరైరి.. ఎవరన్న చనిపోంగనె వొచ్చి జర మంచి సోటు సూషి ఖబర్ తవ్వమంటరు గని ఆ మంచి సోటు ఎంతకని ఉంటది.. బేటా! నువ్వు చెప్పు! నువ్వు సూషినకాన్నుంచి ఈ ఖబ్రస్థాన్ ఇంచు పెరిగిందా చెప్పు.. మరి రోజు రోజు సచ్చేటోల్లను యాడ బొంద పెడ్తం?! కొత్త స్థలమేదీ సూపెడతలేరాయె. ఇగ దాంతోటి.. ఎవరు పట్టించుకోకుంట మట్టిల కలుస్తున్న సమాధులున్న సోటుల్నె మల్ల కొత్త సమాధులు తవ్వుతున్నం. మరి అట్లేమన్న మీ వాళ్ల సమాధులు తవ్వేసినమేమో బేటా! మాఫ్‌కర్నా బాబా! అన్నడు ఆ పెద్దాయన జరసేపు ఉక్రోషంగ.. అంతల్నె జరంత దీనంగ.
కండ్లల్ల నీల్లు సుడులు తిరుగుతున్నయ్ సలీమ్‌కు. ఏం చెయ్యాల్నో తోచక స్తబ్దుగ నిలబడిపోయిండు.
ఏమైంది పప్పా! దాదా, దాదీల సమాధులు ఏమయ్‌నయ్?! అడుగుతున్నది సోఫియా.