Tuesday, 30 July 2013
Tuesday, 16 July 2013
'నిద్రించిన తావునే మరోమారు నిద్రించకు'
ఇప్పుడొక సాలెగూడు
షెల్ఫుల్లో డైరీల్లా కాగితాల్లా
కంప్యూటర్‌లో ఫైళ్లలా
కుప్పలు పడిపోతుంటాయ్ ఇక్కడ
అప్పుడప్పుడు- ఒక్క దులుపు దులిపి
farmat చేసుకుంటుండాలి
గమనించావో లేదో దోస్త్!
సదిరినప్పుడల్లా ఓ సరికొత్త కెరటం
జూలు విదిలిస్తుంటుంది
ఇక ఇల్లు ఉద్యమ కార్యాచరణల కర్మాగారం..
విప్లవాల అడ్డా!
వస్తుంటారు ఎందరో
ఆ చెట్టుకు కాసిన్ని అనుభవాల నీళ్ళు
పోసిపోతుంటారు
కొత్త ఆలోచనల రెక్కలు పొదిగిపోతుంటారు
మూలాల్ని తోడి
బహుకొత్త పరిష్కారాలు పూయిస్తుంటారు
పువ్వులన్నీ ఒక్కచోట చేరినప్పుడల్లా
ఒక నవోద్యమం నవనవలాడుతుంది
కవిత్వం కొత్త పోకడలు పోతుంటుంది
ఇల్లు అలా-
రాకపోకల రహదారి కావాలి
పాతనీటిని పారద్రోలే ప్రవాహం కావాలి
ఉద్యమ ఉరవడిలో అలసిన వీరుడికి
విడిది కావాలి...
**
భూమి భూమంతా ఒక ఇల్లు కావాలి
ఒక చిన్న ఇల్లు కోసం అంత ఆరాటమెందుకు?
సొంత ఇల్లు కట్టుకోవడం
సొంత ఫ్లాట్ కొనుక్కోడం
సృజనకారుడికి ఆత్మహత్యా సదృశమే!
సొంత ఇంట్లోకి సొంత ఒంట్లోకి సొంత కంట్లోకి
ప్రవేశించడమంటే నిష్క్రమించడమే!
ముడుచుకుంటే కవిత్వమెట్లా పలుకుతుంది!
అనేక దేహాలుగా..
లక్షలాది కళ్ళుగా తెరుచుకో
జీవం ఒళ్ళు విరుచుకుంటుంది
కవిత్వం పరవళ్ళు తొక్కుతుంది
ఉన్న చోటనే ఎప్పటికీ ఉండడం
మనసు కిటికీలు మూసేయడమే
మొహం మొత్తినప్పుడల్లా మరో చోటికి మారు
ఎప్పటికప్పుడు స్థలం మారాలి
సంచారికి తెలిసినంత
సంసారికేం తెలుస్తుందిరా!
మరొక్క మాట...
మారినప్పుడల్లా మరింత చిన్న ఇంట్లోకి మారు
నీ విశ్వం విశాలమవుతుంది..!
*
ఇంకొక్క మాట...
కప్పులేని ఇంటికి
ఎప్పుడైతే మారగలవో
అప్పుడు నువ్వు అవధుల్లేనివాడివి!
* స్కై
http://www.andhrajyothy.com/ContentPage.jsp?story_id=26507&category=vividha
July 15, 2013
Thursday, 11 July 2013
Tuesday, 9 July 2013
Subscribe to:
Posts (Atom)