కవిత్వం
పొందిచ్చిన వాక్యాల విచ్ఛిత్తి
పేర్చిన పదాల మధ్య అలజడి
ఎగిసే అక్షరాల ఆందోళన
కవిత్వం-ఉద్యమం పర్యాయపదాలు
కవిత్వం- జొన్నరొట్టెల రుచి
నోట్లో ఊరే పచ్చి చేపల పులుసు
బీద బతుకుల ఆసరా
అంబలి-సంగటి-గట్క
జీవి గుంజే హైదరాబాదీ బిర్యానీ
కవిత్వం- బోనం ఎత్తుకున్నది
బోనం మట్కీల మధ్య శిగమూగుతున్నది
రంగుల్‌రంగుల పూలన్నిట్నీ ఒక్కటిచేసి
బతుకమ్మ ఆడుతున్నది
అస్సోయ్‌దూలా పాడుతూ
నిప్పుల గుండం తొక్కుతున్నది
రోడ్డుమీదే సహపంక్తి భోజనమయ్యింది
కవిత్వం- గోడమీది నిలువెత్తు కచ్చా స్లోగన్
దండుబాట మీద సబ్బండ జాతుల కోలాటం
వాగ్గేయకారుడి నాలుక చివరి వాయువేగం
కణకణ మండే డప్పు సూర్యుడి మీద
చిందేసే చిర్రా చిటికెన పుల్ల
ఉద్యమకారుడి కంటి ఎరుపు- లేచిన పిడికిలి
జవాన్ల కరకట్టల్ని ఛేదించే జనప్రళయం
ఉద్యమ ఉత్ప్రేరకమైన చదువుల బడి
ఎగుస్తున్న విద్యార్థులే జెండాలు
కాలబడుతున్న ఒంటిలోంచి
సానబట్టిన కత్తిలా దూసుకొస్తున్న నినాదం
మనసున్న కన్నులోంచి దూకుతున్న అశ్రుకణం
అవును
కవిత్వం ఇవాళ తెలంగాణ
- స్కైబాబ