తెలంగాణ ఉద్యమం చాలా ఉధృతంగా నడుస్తున్నది. తెలంగాణ వాళ్ళమంతా అందులో మునిగి ఉన్నాము. మిగతా ఏ విషయాలూ ఆలోచించే స్థితిలో లేము. ఇలాంటి సందర్భం ఇలా మా ముందుకు రావడం, ఇంత పెద్ద ఉద్యమం మేము చూడగలగడం మా అదృష్టమే. ఈ సమయం లో బ్లాగ్స్ అప్డేట్ చేసేందుకు కూడా మనసు పోవడం లేదు. చాలా రోజులయింది.. ఓ ౧౦ తెలంగాణ చాంద్తార లు పంచుకుందామని..
***
పోటీ పడేది బుడుబుంగ పిట్టా నేనూ
ఇప్పుడు నీళ్ళతో పాటు అన్నీ మాయం
***
ఎండిన ఏటి పక్క రైతు
ఎదురుచూపులో చూపు పోయింది
***
గూడు కట్టిద్దామనుకున్నానామెకు
పొడి ఇసుక ఎక్కిరించింది
***
ఒడ్డున నడుస్తున్నం
ఏటి లెక్కనే ఎన్ని అనుమానాలో భవిష్యత్తు మీద
***
ఒక రేక కల్లు పట్టిచ్చిన
సూరీడు తెల్ల మొఖమేసిండు
***
చేపల పులుసు తలపుకొస్తే
ఎండిన చెరువుల నీళ్ళు నోట్లె ఊరబట్టె
***
జాన్పాడ్ దర్గా చుట్టు జానయ్యలు సైదమ్మ లే
బోసి నుదుళ్ళ జాతర
***
పట్న మొచ్చి శానా ఏళ్ళయ్యింది
నెల పొడుపును ఊళ్లె ఒదిలి
***
చాన్నాళ్ళకు కలిసిన దోస్తు కు అలైబలై ఇవ్వబోతి
త్రిశూలం గుచ్చుకుంది
***
చిన్నప్పుడు గీసుకున్న బొమ్మలన్నీ అలాగే
ఒక్క నేను తప్ప
- స్కై బాబ